ధవళగిరి రాజ్యంలోని శివపట్నంలో ధర్మేంద్రుడనే యువకుడు ఉండేవాడు. అతను చేతనైన సాయం చేస్తూ ప్రజలకు సాయపడుతుండేవాడు. అతనికి రాజ్యంలోని ఎన్నో సమస్యలు మనస్తాపం కల్గించాయి. ఎంతో కష్టపడి రాజు ప్రభవసేనుడిని కలిసి, రాజ్యంలోని సమస్యలగురించి వినతిపత్రం అందజేశాడు. ఎంతకాలమైనా రాజు ఆ సమస్యలగురించి పట్టించుకోలేదు. మళ్ళీ రాజును కలవాలని తనగ్రామం నుండి రాజధానికి బయలుదేరాడు. రాజధాని చేరడానికి అడవిమార్గాన ప్రయాణించాలి.
అడవిలో వెళ్తున్న ధర్మేంద్రుడికి ఓవృక్షం క్రింద మునీశ్వరుడు కనిపించాడు. ఆయన ముఖంలోని తేజస్సుకు అబ్బురపడి నమస్కరించాడు. మహాతపశ్శక్తిసంపన్నుడైన ముని ధర్మేంద్రుడి నిస్వార్థత, పరోపకారబుద్దిని, అతని ప్రయాణ కారణాన్ని గ్రహించాడు. ధర్మేంద్రుడిని ఆశీర్వదించి "నాయనా! నీకు పరకాయ ప్రవేశవిద్య బోధిస్తాను. ఆ విద్య ద్వారా నీవు కోరుకున్న శరీరంలోకి ప్రవేశించవచ్చు. అనుకున్నది సాధించవచ్చు" అన్నాడు. ధర్మేంద్రుడికి పరకాయప్రవేశమంత్రాన్ని చెప్పాడు. ఆ విద్య పది సంవత్సరాలు పనిచేస్తుందని చెప్పాడు.
ఆయన వద్ద సెలవు తీసుకుని ప్రయాణమైన ధర్మేంద్రుడికి దారిలో చచ్చిపడిఉన్న కుందేలు కనిపించింది. ధర్మేంద్రుడు పరకాయ ప్రవేశవిద్యను పరీక్షించదల్చి ఓ వృక్షం క్రింద చేరి మంత్రాన్ని ఉఛ్చరించాడు. అతని ఆత్మ కుందేలు శరీరంలో ప్రవేశించింది. కుందేలు శరీరంతో కొంతదూరం పరుగులు తీశాడు. అటూఇటూ తిరిగేక తన శరీరాన్ని వదిలిన వృక్షం వద్దకు చేరుకున్నాడు. అక్కడ ధర్మేంద్రుడి శరీరం లేదు. గుర్తులనుబట్టి జంతువు తన శరీరాన్ని లాక్కెల్లిందని గ్రహించాడు. తన శరీరాన్ని సురక్షితమైన ప్రదేశంలో వదలక పొరపాటు చేశానని చింతించాడు. మునీంద్రుని కలుసుకుని జరిగిన విషయం చెప్పాడు. ముని ధర్మేంద్రుడిని ఓదార్చి "నాయనా! కొద్ది రోజుల్లో ఈ దేశపురాజు ప్రభవసేనుడు ప్రమాదవశాత్తు మరణిస్తాడు. నీకిష్టమయితే ఆయన శరీరంలోకి ప్రవేశించి, రాజుస్థానంలో ఉండి ప్రజలకు ఉపకారం చేయవచ్చు" అని చెప్పాడు. ధర్మేంద్రుడు అక్కడనుండి బయలుదేరి రాజధాని చేరుకున్నాడు.
రాజధాని చేరేక వాడికి ఓచోట ఒక యువకుడి శవం కనిపించింది. ఆ యువకుడి పేరు చంద్రుడు. అతను చేనేతకార్మికుడు. రాజ్యంలో చేనేత వస్త్రాలకు, కార్మికులకు సరియైన గుర్తింపులేదు. సరైన ధర లేక వారి జీవితం దుర్భరంగా ఉంది. రాజు ఆవిషయంలో ఏ చర్యా తీసుకోలేదు. బ్రతుకు దినదినగండమై అప్పులబాధ భరించలేక, మరోమార్గం లేక చేనేత కూలీలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అలా మరణించిన వాడే చంద్రుడు. ఆ సమయంలోనే రాజు ప్రభవసేనుడు మరణించాడనే విషయం ధర్మేంద్రుడికి తెలిసింది. అప్పుడు ధర్మేంద్రుడి ఆత్మ పరకాయ ప్రవేశ మంత్రాన్ని పఠించి, చంద్రుడిశరీరంలో ప్రవేశించింది. చంద్రుడు లేచి కూర్చున్నాడు. చంద్రుడి తల్లిదండ్రులు సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యారు.
రాజు ప్రభవసేనుడి అంత్యక్రియలు ముగిశాయి. ఆయన కుమారుడు చక్రసేనుడు రాజయ్యాడు. చంద్రుడి శరీరంలో ఉన్న ధర్మేంద్రుడు చేనేత కార్మికులనందరినీ ఏకం చేశాడు. వారికి న్యాయం కావాలనీ, వారి కోరికలను, కష్టాలనూ రాజు తీర్చాలని నిరాహారదీక్షకు పూనుకున్నాడు. కార్మికులందరూ చంద్రుడి వెనుకల చేరారు. విషయం చక్రసేనుడికి తెలిసేసరికి రాజ్యమంతటా చైతన్యం వచ్చింది. ఎక్కడికక్కడ నిరాహారదీక్షలు మొదలయ్యాయి. ఉద్యమం ఊపందుకుంది. రాజు మంత్రులతో చర్చించాడు. కార్మికుల సమస్యలు తీరడానికి సరైనచర్యలు తీసుకున్నాడు. సహకార పథకాలను రూపొందించి అమలుచేశాడు. చేనేత కార్మికుల జీవితాల్లోకి వెలుగొచ్చింది. కానీ అంతకాలం వారి శ్రమను దోచుకున్న దళారీదోపిడీదారులు చంద్రుడిమీద పగపట్టి, దాడిచేసి శరీరాన్ని ముక్కలుగా నరికారు. ధర్మేంద్రుడి ఆత్మ చంద్రుడి శరీరాన్ని వదిలేసింది.
రాజ్యంలో స్త్రీలను కలవరపరుస్తూ కన్నీటికి కారణమవుతున్న సమస్యల్లో సురాపానం ఒకటి. తాగుబోతయిన భర్తపెట్టే బాధలు భరించలేక నరసమ్మ అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. ధర్మేంద్రుడి ఆత్మ ఆమె శవంలోకి ప్రవేశించింది. తాగివచ్చి శవాన్ని కూడా తిడుతున్న భర్తను ఉన్నట్లుండి నరసమ్మ లేచి చితకతన్నింది. ఆమె దెబ్బలకు వాడు మూల్గుతూ క్రింద పడిపోయాడు. ఇక ముందు తాగితే చంపేస్తానని భర్తను హెచ్చరించింది. ఇదంతా చూస్తున్న జనం ఆశ్చర్యపోయారు. నరసమ్మ స్త్రీలనందరినీ ఏకం చేసింది. సురాపానాన్ని అరికట్టాలని తాగివచ్చిన వారిని ఇంటిలోకి రానివ్వకుండా బుద్దిచెప్పాలని అందరినీ ప్రేరేపించింది. సారానిషేధానికి ఉద్యమం లేవదీసింది. స్త్రీలందరూ సారా అమ్మేవారిపై తిరుగుబాటు చేశారు. సారాపాకలను పీకిపారేశారు. సారాకుండలను పగులగొట్టారు. మొదట మామూలుగా ప్రారంభమైన ఉద్యమం కార్చిచ్చులా రాజ్యమంతటా ప్రాకింది. ప్రభుత్వయంత్రాంగం కదిలింది. చక్రసేసేనుడు సారాను నిషేధిస్తూ చట్టం చేశాడు. ఎక్కడ సారా కనిపించినా అందుకు సంబంధించిన వారిని కఠినంగా శిక్షించవలసిందిగా ఆజ్ఞ జారీచేశాడు. సురాపానం ఆగిపోయింది. భార్యలను తన్ని డబ్బంతా సారాకోసం ఖర్చుచేసే భర్తల్లో మార్పు వచ్చింది. మహిళలజీవితాల్లోకి వెలుగొచ్చింది. కానీ సారా అమ్మకాలతో లక్షలవరహాలు ఆర్జిస్తున్నవారు నరసమ్మపై కన్నెర్రచేశారు. ఓ రోజు నరసమ్మపై దుండగులు దొంగదాడిచేసి ఆమెకు నిప్పు అంటించారు. ధర్మేంద్రుడి ఆత్మ నరసమ్మ శరీరాన్ని వదిలేసింది.
తర్వాత ధర్మేంద్రుడు జయమ్మ అనే పదహారేళ్ళ బాలవితంతువు శవంలోకి ప్రవేశించాడు. జయమ్మకు చిన్నతనంలోనే వివాహం జరిగింది. భర్త యుక్తవయస్కుడయ్యాక పాము కాటుతో మరణించాడు. వాడితో వివాహమయింది కాబట్టి ఇక ఆమెకు మళ్ళీ పెళ్ళి చేసుకునే అర్హతలేదని ఆచారరీత్యా జీవితాంతం వితంతువుగా ఉండాలని పెద్దలు నిర్ణయించారు. అభం శుభం తెలియని ఆపిల్ల ఆత్మహత్య చేసుకుంది. ధర్మేంద్రుడి ఆత్మతో పునర్జన్మ ఎత్తింది. అప్పుడామె బాల్య వివాహాలను నిషేధించాలని ఉద్యమం లేవదీసింది. జనాన్ని ప్రోగుచేసి ఉపన్యాసాలిచ్చింది. ఆమె మాటలకు ప్రభావితులై చాలామంది ఉద్యమంలో చేరారు. మామూలుగా ప్రారంభమైన ఉద్యమం దావాగ్నిలా రాజ్యమంతటా ప్రాకి తీవ్రస్థాయికి చేరుకుంది. చక్రసేనుడు మంత్రులతో చర్చించి బాల్యవివాహాలను నిషేధిస్తూ శాసనం చేశాడు. ఈవిధంగా ధర్మేంద్రుడు తనశరీరాన్ని మార్చుకుంటూ ప్రజలందరినీ ఏకంచేసి నిరాహారదీక్షలద్వారా ప్రతిపల్లెలో వైద్యశాలలను, పాఠశాలలను, నీటివసతులను సాధించాడు. అంగవైకల్యంతో బాధపడేవారికి ప్రత్యేక ఉద్యోగాలు వచ్చేలా చేశాడు. రైతుల సమస్యలు, కూలీల సమస్యలు తీరేలా చేశాడు. ధవళగిరి రాజ్యంలోని ప్రజలకు ఏసమస్యలూ లేకుండా చేశాడు. ఆ రాజ్యం రామరాజ్యంలా మారింది. పొరుగురాజ్యాలకు మార్గదర్శకమయింది.
అలా పదిసంవత్సరాలు పూర్తయి ధర్మేంద్రుడి ఆత్మ పరలోకం చేరుకునే సమయం ఆసన్నమయింది. ఆ సమయంలో ఒక కూలివాడి శరీరంలో ఉన్న ధర్మేంద్రుడికి ముని కనిపించాడు. మునికి నమస్కరించి తాను ధర్మేంద్రుడినని చెప్పి తాను చనిపోయిన రాజు ప్రభవసేనుడి శరీరంలో చేరలేదని చెప్పాడు. పది సంవత్సరాలకాలంలో తానుసాధించిన విజయాలు ఆయనకు వివరించాడు. ముని ధర్మేంద్రుడి పరోపకారగుణాన్ని, బుద్దికుశలతనూ ప్రశంసించాడు. ధర్మేంద్రుడి ఆత్మ సమయం రాగానే పరలోకం చేరుకుంది.
ముని వెంట ఉన్న ఆయన శిష్యుడు వారి మాటలు విన్నాడు. శిష్యుడికి ఓసందేహం కల్గింది. "స్వామీ! ధర్మేంద్రుడిలో పరోపకారబుద్ది ఉన్నది. కానీ బుద్దికుశలత మచ్చుకైనా లేదు. ఏమాత్రం తెలివితేటల్లేవు. రాజ్యంలోని సమస్యలు తీర్చడానికి అతను చాలా కష్టపడ్డాడు. చంద్రుడి శరీరంలోకి కాకుండా చనిపోయిన ప్రభవసేనుడి శరీరంలోకి పరకాయప్రవేశం చేసివుంటే రాజు స్థానంలో ఉండేవాడు. అప్పుడు శాసనాలు చేసి కార్మికుల శ్రమకు తగిన ప్రతిఫలం అందేలా చేయవచ్చు. వికలాంగులకు ఉద్యోగాలివ్వవచ్చు. సారా, బాల్యవివాహాలను నిషేధిస్తూ చట్టాలు చేయవచ్చును. వైద్యశాలలు, విద్యాలయాలు, నీటివసతులను ఏర్పాటు చేయవచ్చు. ప్రజలకోసం ఏ ప్రయోజక కార్యాలయినా రాజుస్థానంలో ఉంటే ఎంతో సులభంగా చేయవచ్చు. అలాంటి అవకాశముండీ అతను ప్రభవసేనుడి శరీరంలో ప్రవేశించలేదు. అలాంటి ధర్మేంద్రుడిని మీరు బుద్దికుశలతకలవాడని ప్రశంసించటానికి కారణమేమిటి?" అని అడిగాడు శిష్యుడు.
ఆ మాటలకు ముని చిరునవ్వు నవ్వి "ధర్మేంద్రుడు చాలా తెలివైనవాడు. రాజు శరీరంలో ప్రవేశించి తన ఆశయాలకు. పరోపకారబుద్దికి అనుగుణంగా శాసనాలు చేయవచ్చు. ప్రజలు అడగకుండానే వారి సమస్యలను తీర్చవచ్చు. కానీ ఒకరాజు చేసిన శాసనం మరోరాజు రాగానే వృధాకావచ్చు. సారా, బాల్యవివాహాలు మళ్ళీ మొదలు కావచ్చు. వైద్యశాలలున్నా వైద్యులు లేకపోవచ్చు. విద్యాలయాలున్నా ఉపాధ్యాయులు లేకపోవచ్చు. అందుకే ఎలాంటి సమస్యలైనా తీర్చుకోవటానికి ప్రజలను చైతన్యవంతులుగా మార్చడం ముఖ్యం. ఊరికే శాసనాలు చేస్తే సరిపోదు. శాసనాలు అమలు జరగాలంటే ప్రజలసహకారం, వారిలో నిరంతరచైతన్యం అవసరం. రాజులు మారవచ్చు. శాసనాలు మారవచ్చు. కానీ ప్రజల్లో రగిలించిన చైతన్యం మారదు. ప్రజలు వారి సమస్యలను పట్టించుకోని విలాసవంతుడయిన రాజునూ, పాలనాయంత్రాంగాన్ని సైతం కదిలించి తమ సమస్యలను తీర్చుకోగల్గాలి. రాజులు మారినా, శాసనాలు మారినా పాతతరం స్ఫూర్తితో భావితరం కూడా తమ కష్టాలు, సమస్యలు ప్రభుత్వానికి తెల్పి వాటిని సాధించుకునే స్థాయికి ఎదిగి పొరుగు రాజ్యాలకు కూడా స్ఫూర్తి కావాలి. సమస్యలకు ఆత్మహత్య పరిష్కారంకాదని గుర్తించాలి. ఈ ఉద్దేశ్యంతోనే ధర్మేంద్రుడు ప్రజలమధ్య ఉండి సమస్యల విషయంలో వారిని చైతన్య వంతులను చేసి, సమస్యలను పరిష్కరించాడు. ఏ సమస్యకైనా ప్రజాచైతన్యమే శాశ్వత పరిష్కారం. ఇందులో ధర్మేంద్రుడి విజ్ఞతే తప్ప తెలివితక్కువతనం ఎంత మాత్రం లేదు" అని వివరించాడు.