"ఏరా ఫణీ! శేషు నిన్నుగానీ డబ్బులడిగాడా?" నాగేశ్వరరావున్నయ్య ప్రశ్నకు "అడిగాడన్నయ్యా" ఫణి జవాబు.
"నువ్విచ్చావా? "
"ఆలోచిస్తున్నానన్నయ్యా"
" ఏంట్రా ఆలోచించేది. డబ్బులేమన్నా చెట్లకు కాస్తున్నాయా అడిగినప్పుడల్లా ఇవ్వడానికి? మెున్ననేగా వాడికూతురి పెళ్ళయితే నగలూ, నట్రలకనీ ఎంత సొమ్ము ముట్టచెప్పామ్. అవునూ! కొడుకు చదువుకు కూడా నువ్వు వేలకువేలు ఇచ్చావుగా ఫణీ!"
"నాకిక ఓపికలేదని చెప్పేయ్ మనండీ. మీ అన్నయ్య అలాగే చెప్పేసారు ఫణీ" వెనుకనుండి ఒదిన గారు.
"వాడు మాత్రం ఎవరన్నయ్యా? మన తమ్ముడేగా! ఆఖరివాడు. పైగా..." ఫణి మాటలు సాంతం పూర్తి కానీయలా ఒదినగారు.
"అవునయ్యా ఫణీ! నువ్వెన్నయినా చెబుతావు. నీ కొక్కడే కొడుకు. వాడూ అమెరికాలో మంచి జీతంతో సెటిలయ్యాడు, పిల్లాపీచూలేరు. నువ్వా గవర్నమెంట్ పెన్షనర్ వి. నువ్వూ, వాణీ ఇక్కడ టింగురంగామని వుంటారు. మరి మా సంగతి తెలుసుకదా. సునయనకి పెళ్ళి చేసి పదేళ్ళయింది. ఇద్దరు సంతానం. కానీ దాని మెుగుడికి ఇప్పటికీ సరైన ఉద్యోగం లేదు. మేమే అడపాదడపా ఆదుకోవాలి. ఇక మావాడు.. నవీన్ ఎంత ప్రయోజకుడో తెలుసుగా. పైగా వాడి పెళ్ళాం, పిల్లలు మాతోనే. నలుగురు మనవళ్ళతో రెండు సంసారాలు మేమే నెట్టాలి. మీకేం! మీకు మనవలూ, మనవరాళ్లు ఇంకా రాలేదుగా'" ఫణి మనసు చివుక్కుమంది.
ఇంతలో అక్కడికి వచ్చిన వాణికి భర్త ముఖంలో రంగులు మారటం చూడగానే ఫోన్ లో అవతల ఎవరు మాట్లాడుతున్నారో, ఏం మాట్లాడుతున్నారో అర్ధమయి "ఆవిడ అంతేలెండి. బాధపడకండి" అన్నట్లుగా భర్త భుజం మీద చేయివేసింది.
ఫణి తేరుకుని "ఇంతకీ ఏమంటారు వదినా! మీకివ్వడానికి కుదరదంటారు. దానికిన్ని మాటలెందుకు?" అని ఫోన్ పెట్టేసి, వాణితో "నీకుతెలియనిదేేముంది. ఆవిడ నోటికో దండం పెట్టొచ్చు" అన్నాడు ఫణి.
నాగేశ్వరరావు ,ఫణి, భుజంగం, శేషు నలుగురూ అన్నదమ్ములు. నాగదోషం వల్ల వంశంలో అందరికీ నాగేంద్రుడి పేర్లే పెడతారు. చిన్నప్పుడే తండ్రిపోయాడు. అప్పణ్ణించీ తల్లికి మనసు సరిగా వుండేది కాదు. ఆ కారణంచేత ప్రతీపనీ, వీళ్ళే చేసుకుంటూ, ఒకరికొకరు సాయంగా పెరుగుతూ వచ్చారు. అందరిలో చివరివాడు శేషు. అన్నయ్య లందరికీ తలలో నాల్కలా ఉండేవాడు. అందుకే ప్రతీ పనీ అతనికే చెబుతూ ఉండేవారు. ఈ నేపథ్యంలో శేషు పదో తరగతి తప్పాడు. ఎట్లాగూ పరీక్ష తప్పాడుగా, పనిమనిషిగా మారాడు. అందరూ చదువుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయ్ చిన్నప్పుడే.
ఇంతలో నాగేశ్వరరావు పెళ్ళయింది. అందరూకలిసి ఉండటంవలన, అందర్నీ తనే పెంచినట్లుగా భావించేది పెద్ద ఒదిన. ఇక ఇంట్లో పప్పు తేవాలన్నా, ఉప్పు తేవాలన్నా, ఏది కావాలన్నా, "శేషూ తీసుకురావా" ఆదేశాలు. అందరూ మంచి ఉద్యోగాల్లో స్థిరపడితే పదో తరగతి ఎలాగోలా పాసై, ఏదో పచారీ దుకాణంలో పనికి కుదురుకున్నాడు శేషు. అందరికీ మంచి సంబంధాలొస్తే, శేషుకి మాత్రం ఒక పేదింటి సంబంధం కుదిరింది. ఆ అమ్మాయి రజని బుద్దిమంతురాలు కాబట్టి, భర్తకి చేదోడువాదోడుగా ఉంటూ, ప్రైవేటు స్కూల్ లో ఉపాధ్యాయురాలుగా చేస్తూ, ఎలాగోలా తంటాలుపడి, ఇద్దరు పిల్లల్ని పెంచుకుంటూ వచ్చింది.
రోజులు గడిచాయి. ప్రభుత్వం పేదలకు ఉచితంగా పంపిణీ చేసే ఇల్ల స్థలాల్లో రజని పేరున రెండు సెంట్ల స్థలం దొరికింది. ఇల్లు కట్టుకోటానికి మేస్త్రీని పెట్టుకున్నా, ఖర్చులు తగ్గాలని కొన్ని పనులు శేషూ, రజనీ చేసుకున్నారు. గోడలు తడపడానికి దొడ్లో నీళ్ళు లేకపోతే, సందు చివరి కొట్టుడుపంపు నీళ్ళు చేరబోసి, ఇంటినీ, ఇటుకలనూ తడిపారు. "రక్తం చిందించి ఇల్లు కట్టారు రజనీ, శేషు" అంటుంది వాణి.
శేషు కూతురికి ఫణే పెళ్ళి సంబంధం చూసి, పెళ్ళి చేయడానికి ధనసహాయం చేసి, దగ్గరుండి పెళ్ళి జరిపించాడు. " ఫణిబావగారు లేకపోతే పెళ్ళి చేయడం మా తరమా! ఆయన పూనుకోబట్టే మా అమ్మాయి పెళ్ళి జరిగి సుఖంగాఉంది" అంటుంది రజని. ఇక శేషు కొడుకు చదువు బాధ్యతా ఫణే వహించాడు. "తన కొడుకుతోపాటే శేషు కొడుకూను" అనుకున్నాడు. వాడూ బాగా చదివి ప్రభుత్వ కోటాలో సీటు సాధించాడు. కానీ మిగతా ఖర్చు? నెలకు రెండు వేల చొప్పున నాలుగు సంవత్సరాలు ఫణే భరించాడు. ఎంత సోదర ప్రేమ ఉండాలీ! పెద్దన్నయ్య నడిగితే, పెద్దొదిన "శేషూ, భార్యా వచ్చి నా ముందు జోలెపడితే ముష్టి వేస్తానం"ది. పెద్దావిడ అడుగడుగునా, వీళ్ళని చులకనగా, నీచంగా చూసేది.
తమ్ముడు భుజంగం అర్ధాంతరంగా గుండెజబ్బుతో పోతే, వాళ్ళ కుటుంబాన్నీ ఫణీ, వాణీలే ఆదుకున్నారు. ఫణి పదిసార్లు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి, ఉద్యోగం మరదలికిప్పించాడు. పెద్దపిల్ల పెళ్లి కి సగం కట్నం, మిగతా ఏర్పాట్లు చేసి ఫణీ, వాణీలే పెళ్ళి చేసారు. ఇప్పుడు శేషు కొడుకు పెద్ద ఉద్యోగం లో సెటిల్ కాబోతున్నాడు, దానికోసం కొంచెం ఖర్చు అవుతుంది. ఇస్తే ఓ జీవితం నిలబడుతుంది. ఇక ఎవరూ ఎవరికీ భారంకారు. కానీ డబ్బులు? ఇప్పుడు అదీ సమస్య. అందుకే శేషు ఫోన్చేసాడు. అప్పో, సొప్పో చేసి శేషు పిల్లవాణ్ణి ఉద్యోగంలో చేర్చి ఊపిరి పీల్చున్నారు ఫణీ, వాణీ.
రోజులన్నీ ఒకలా ఉండవ్. ఓ ఉదయం స్నానాల గదిలో పెద్దావిడ కాలు జారి పడగా చెయ్యి కాలు విరిగి, వున్న వూరిలో సరికాక పట్టణం తీసుకెళ్ళాల్సొచ్చింది. అన్నయ్యా పెద్దవాడు. ఎవరెళ్ళాలి? "నేవెడతా" అని శేషు, భార్యతో సహా వెళ్ళి పగలూ రాత్రి ఇద్దరూ, చెయ్యకూడని పనులుకూడా, ఎడమ అనక కుడి అనక చేసారు. ఇంటికొచ్చాక కూడా, దగ్గరుండి సపర్యలు చేసిన శేషునీ, రజని నీ, "పాతవిషయాలను మనసులో పెట్టుకోకుండా,మీరు చేసిన సాయం ఏ జన్మకీ మరువనంది" పెద్ద వదిన కళ్ళొత్తుకుంటూ.
శేషు కొడుకు బెంగుళూరు నుండి పెద్దమ్మని చూడ్డానికి వచ్చి, 'పెద్దమ్మా అన్నయ్య పి.జి. చేసాడు. అమాయకత్వం వల్ల ఇక్కడ అగచాట్లు పడుతున్నాడు. మా కంపెనీలో ఓ ఉద్యోగం ఉంది. అన్నయ్యకే వచ్చేలాచూస్తాను" అని రెజ్యూమ్ తీసికెళ్ళాడు. "శేషూ! మీకు తగ్గ కొడుకయ్యా నాగరాజు. ఎంత పెద్దమనసయ్యా మీ ముగ్గురిదీ! చిన్నవాళ్ళయిపోయారు కానీ ,చేతులెత్తి దండం పెట్టొచ్చు" అంది పెద్ద వదిన.