ఫలం కొద్దీ ఫలితం - ఆదూరి హైమావతి

phalam koddi phalitham

మదనపల్లెలో మంచి హస్తవాసి ,మంచి మనసు, సేవా భావనా ,వైద్యంలో నేర్పరితనమూ ఉన్న ఒకే ఒక వైద్యుడు వైకుంఠరావు.ఆయన పేదధనిక అనే భేదం లేకుండా అందరికీ ఒకేవిధంగా వైద్యసేవలు అందిస్తుంటాడు.

ఆయన తాతముత్తాతలు జమీందార్లు.వారి ఆస్థి పాస్తుల న్నీ వైకుంఠరావుకు సంక్రమించాయి. అందువల్లే ఆయన ఫీజులు తీసుకోకుండా వైద్య సేవలు అందిస్తు న్నాడనీ అంతా అంటారు. ఆయన వలన తమ సంపాదన తగ్గిపోతున్నదని కొందరు వైద్యులు అనుకోడం కూడా కద్దు.

కానీ నిజానికి వైకుంఠరావు మానవసేవా దృక్పధంతోనే ఉచిత వైద్యం అందిస్తున్నాడు. అన్నీ ఉన్న వైకుంఠ రావు కు ఒకే ఒకలోటు ఇచ్చాడు దేవుడు. ఆయన నిస్సంతు. ఆయన ఆస్థిపాస్తులకు ఆశపడి బంధువర్గ మంతా బెల్లంచుట్టూ ఈగల్లా ముసిరి తమ పిల్లలని దత్తు తీసుకోమనీ వృధ్ధాప్యంలో పువ్వుల్లోపెట్టి చూసు కుంటామనీ వేధించినా ఆయన ససేమిరా అని వారి నంతా దూరంగా పెట్టాడు. ఆయన తన తర్వాత ఇలా ఉచిత వైద్యసేవలు ముఖ్యంగా పేదవారికి అందించే వారికోసం వెతక సాగాడు.

ప్రతిరోజూ తీరికగా ఉన్న ఏదో ఒక సమయంలో నగరంలోని అన్నీ వీధులూ తిరుగుతుంటాడాయన. అన్ని పాఠశాలలకూ, కళాశాలలకూ వెళ్ళి సమాచారం సేకరిస్తుంటాడు, పేదవారైనా మంచి సంస్కారం పుట్టుక తోనే అబ్బినవారికోసం ఆయన వెతులుతూనే ఉన్నాడు.

అలాంటి మాధవ రావు కంట పడ్డాడు ఒకరోజు రాజు. సత్యం తల్లి మునెమ్మ, తండ్రి సుబ్బయ్య మారు బేరానికి, పళ్ళూకూరలూ అమ్ముకునేవారు. వారి రెక్కలే వారికి ఆధారం. ఐతే వారిని కాపాడేది వారి సత్య పాలన, నిజాయితీ మాత్రమే. ఏనాడూ అసత్యం దేనికీ చెప్పిన వారుకారు. తమ బిడ్డకు నిత్యం రాత్రులు నిద్రించేప్పుడు సత్యాన్ని, ధర్మవర్తనాన్నీ, మానవసేవను గురించీ ఉపదేసించేవారు. అవే వారి బెడ్ టైం స్టోరీస్.

వారిద్దరూ కూరలు మారు బేరానికి దొరకనప్పుడు కూలీకి వెళ్ళేవారు, వారు పనికి దిగా రంటే యజమాని తిరిగి చూసుకోవల్సిన అవసరమే ఉండేది కాదు. అందుకే వారికి యడాది పోడవునా ఏదో ఒక పని దొరికేది.

రాజు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతికి వచ్చాడు. క్లాస్ లో ఉపాధ్యాయుడు సైన్సు పాఠంలో చెప్పిన ప్రాధమిక చికిత్స పాఠం విన్నతర్వాత రాజు శలవు రోజుల్లో తలిదండ్రులతోపాటు కూలికి వెళ్ళి వచ్చిన డబ్బుతో ఒక ఫస్ట్ ఎయిడ్ బాక్సు కొని తన సంచీలో ఉంచుకున్నాడు.

బళ్ళోకెళ్ళేప్పుడు, వచ్చేప్పుడూఎవరైనా పిల్లలు, లేదా వృధ్ధులు, ఎవరైనా కానీ పడి గాయమైనట్లు చూస్తే చాలు వెంటనే వారికి ప్రాధమిక చికిత్స చేసేసి పెద్ద గాయమైతే వారిని ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్ళే వాడు. రాజు సేవలు పొందినవారు వాడిని మనసారా దీవించే వారు. రాజుకు ఎలాగైనా తాను వైద్యవిద్య చదవాలనీ, పేదలకూ నిస్సహాయులకూ వైద్య సేవ అందించాలనే కోరిక రోజురోజుకూ పెరగ సాగింది.

రాజు తల్లి దండ్రులు " నాయనా ! ఐదువేళ్ళూ నోట్లోకి వెళ్ళడమే మనకు కష్టంగా ఉంది కదా! లక్ష అంటేనే తెలీని మేము నిన్నెలా లక్షలు పోసి వైద్య విద్య చదివించగలం నాయనా!. ఆ రక్షకుడే నీకు రక్ష. ఆయన్నే నమ్ముకో." అని చెప్పేవారు.

ఒక రోజున రాజు స్కూలు కెళుతుండగా ఒక వృధ్ధ బిక్షువు జారి రోడ్డుమీదపడి, మోకాళ్ళు కొట్టూకుపోయి రక్తం కారుతుండగా దూరం నుంచీ చూసిన రాజు పరుగెత్తుకుంటూ దగ్గరకొచ్చి, వానిని లేపి పక్కకు తీసు కెళ్ళి చెట్టుక్రిందకు చేర్చి, తన సంచీలోని ఫస్ట్ ఎయిడ్ బాక్సులోని మందులతో వైద్యం చేశాడు.

దూరం నుంచీ అంతా చూస్తున్న వైకుంఠరావు, రాజు చర్యకు ఆశ్చర్యపడ్డాడు. చూసిన వారంతా తమకెందుకులే అనివెళుతుండగా పన్నెండేళ్ళ ఆ బాలుడు అలా సేవ చేయడం ఆయనకు ముచ్చటేసింది. పసితనంలోనే ఇంత సేవాభావం ఉన్న ఈ బాలుడు మంచి వ్యక్తిగా రూపొందుతాడని విశ్వసించాడు. మెల్లిగా వానిని అనుసరించి ,పాఠశాలకు వెళ్ళి వివరాలు సేకరించాడు. పెద్ద పంతులును కలిసి మాట్లాడి వాడినే తన వారసునిగా స్వీకరించదలాడు.

పెద్ద పంతులు రాజునూ వాని తలిదండ్రులనూ పిలిచి, వైకుంఠరావుతో పరిచయంచేసి " నాయనా రాజూ! నీ సేవలు, వైద్య విద్యపట్ల నీకున్న మక్కువ చూసి ఆ సరస్వతీ మాత కరుణించి ఈ వైద్య శేఖరుని నీకు అండగా పంపింది నాయనా! నీవూ సత్యమార్గంలో నిల్చి ఈయనలా'వైద్యోనారాయణో హరిః' అని పేరు తెచ్చుకోవాలి. అమ్మా! మీరిరువురూ ఈ రోజునుంచీ ఈ వైకుంఠరావుగారితో కల్సి వీరింటనే మీకు చేతనైనపని చేసుకుంటూ జీవించండి. రత్నం వంటి రాజును కన్న మీ జన్మ సార్ధకమవుతుంది." అంటూ తమ హర్షం వెలిబుచ్చాడు.

చూశారా! పిల్లలూ! సేవా హృదయం, మంచితనం ఉంటే మన కోర్కెలను భగవంతుడే తీరుస్తాడనే విషయం రాజు వల్ల ఋజువైందికదా! మీరూ మీకు తోచిన చిన్న చిన్న సేవలను చేయడం అలవర్చు కుంటారుగా!

నీతి:- సేవ చేసేవారిని దైవమేకాపాడుతాడు. సేవ మనలకు వెతుక్కుంటూరాదు.మనమే సేవను వెతుక్కుంటూ వెళ్ళాలి. అప్పుడే ఫలం దక్కుతుంది.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు