దారి చూపిన దైవమా! - సి హెచ్ వి ఎస్ ఎస్ పుల్లంరాజు

dari chupina daivamaa

భాద్రపద మాసంలో, తెల్లవారు జామున చిన్నగా మొదలైన వాన, జోరు పెంచింది. ఒక చేత్తో గొడుగు పట్టు కొంటూ, సైకిల్ తొక్కుకొంటూ స్కూలుకు బయల్దేరారు సత్యం మాష్టారు. ఉద్యోగ ధర్మంలో ఎక్కడా రాజీ పడని స్వభావం ఆయనిది. ఎర్రని పాము మెలికలు తిరిగి పడుక్కొన్నట్టుగా వుంది వర్షంలో ఆ కంకరరోడ్డు. రోడ్డ్డుకి ఒక వైపు పచ్చని పొలాలు, పొలాల్లో కొన్ని చోట్ల మామిడి చెట్లు, పనస చెట్లు, పొలంగట్ల మీద కొబ్బరి చెట్లు, అరటి చెట్లు. మరోవైపు కాలువ ప్రవహిస్తోంది. వర్షానికి రంగుమారిన కాలువ నీళ్లు. ఎదురుగా కొంచెం దూరంగాకొబ్బరికాయలలోడుతో వస్తున్న ఎద్దులబండి చూసి రోడ్డు వారగా నిలబడ్డారు సైకిల్ దిగి. చిన్న చిన్న లాగులు కట్టుకున్న పిల్లలు పశువులు తోలుతూ, వర్షంనీళ్ళతో నిండిన రోడ్డ్డుమీద గుంతల్లో చిందులు వేస్తున్నారు. రోడ్డు మీద నడుస్తున్న గేదెలు ఒక్కోసారి తమ మురికి తోకల్ని జాడిస్తుంటాయి.ఆ మురికి, బట్టలు మీద పడకుండా వాటిని తప్పించుకొంటూ, జాగ్రత్తగా సైకిల్ తొక్కడం నిజంగా ఒక కళ. సీమచింత చెట్లకు వ్రేలాడుతున్న పిచ్చుకగూళ్లు, వీచే గాలికి వూగుతుంటే, తలలు బయట పెట్టి ప్రకృతి అందాలను పరిశీలిస్తున్న పిల్ల పక్షులు.

మలుపు తిరిగితే ఆ ఊరి చెరువు కనబడుతుంది. ఆ చెరువుగట్టానుకొనివున్న తాటాకుల బడి. దాని ప్రక్కనే పెద్ద చింతచెట్టు. ఆ చెట్లుకి తాటికాయంత అక్షరాలతో మండల ప్రజాపరిషత్ ప్రాధమిక పాఠశాల, కామరాజు చెరువుగట్టు, ఆని తగిలించిన రేకు బోర్డు. సైకిల్ ని చూరుక్రింద గోడకి ఆనించి, లోపలికి నడిచారు.

పిల్లలు గోల చేస్తున్నారు. తాతయ్య మాష్టారు బెత్తెo చేత్తోపట్టుకుని "నిశ్శబ్దంగా. కూర్చోంటారా, తన్నులు కావాలా?" అంటూ అరుస్తున్నారు. ఇంతలో వచ్చిన సత్యం మాష్టర్ని చూసి, అందరూ నెమ్మదిగా పుస్తకాలు తీసి చదవడం ప్రారంభించారు. కాస్త గోల తగ్గింది. సత్యం మాస్టరి దృష్టి , కిటికి దగ్గర నిలబడిన రాముడి మీద నిలిచింది. వంటి మీద వాతలు తేలిన బెత్తందెబ్బలు, స్పష్టంగా కనిపిoచాయి. కానీ వాడికి ఆ స్పృహ లేనేలేదు. కిటికీ లోంచి బయట బాదం చెట్టుకి కట్టివున్న లేగ దూడ, తల్లి పాలు త్రాగుతుంటే తదేకంగా చూస్తున్నాడు. వాడ్ని కొట్టింది ఎవరో ఆయన గ్రహించారు.

తాతయ్య మాష్టారు కొట్టడం, వాడు మళ్ళీ ఏదో వెధవపని చేయడం రివాజుగా మారింది .

ఇప్పుడు కూడా వాడిలో ఏమీ అపరాధనాభావం కనిపించడం లేదు. ఆ శిక్ష వాడిలో ఏమీ పరివర్తన కలిగించడలేదు. సత్యం మాస్టరి మనస్సు చివుక్కుమంది. వాడి దగ్గరకు వెళ్ళి, "రాముడూ! నిన్ను ఎందుకు నిలబెట్టారురా? ఏమి చేసావు?" సౌమ్యంగా అడిగారు. దెబ్బలకి ఎరుపెక్కిన చెంపలని రాసుకొంటూ, " నాకేం తెలవదండి" ఎటో చూస్తూ నిర్లక్ష్యంగా చెప్పాడు. ఆ జవాబుకి ఇంకో రెండు తగిలిస్తారు మరొకరయితే.

"ఇంట్లో డబ్బులు దొబ్బుతాడండి. ఎంతడిగినా, కొట్టినా వాడేమీ చెప్పడండి!' ముక్తకంఠంతో పిల్లలందరూ అరిచారు. "ఇలా నా దగ్గరగా రారా" అంటూ చేత్తో సంజ్ఞ చేశారు. "ఏమీ చెయ్యకుండా, మరి నిన్ను ఎందుకు కొట్టారురా ?" ఆ గొంతులో చెప్పకపోతే నిన్ను ఏమి చేస్తానో చూడన్న గద్దింపు లేక పోవడం వాడికి ఆశ్చర్యం కలిగించింది. అంతేకాకుండా, ఆవేదనతో నిండిన ఆ గొంతులోని జీర, ఆ పసిహృదయాన్ని సున్నితంగా తాకింది. కాలిన గాయాలకు వెన్నపూస పూసిన అనుభూతికి, ఆశ్రువులు నిండిన కళ్ళతో, తలపైకెత్తి చూసాడు. కళ్ళు తుడుచుకొంటూ, "మా బాబు... జేబులోంచి డబ్బులు దొబ్బానండి." అన్నాడు. "నీకు డబ్బులెందుకురా? ఏo చేస్తావ్?" అన్నారు ఆరా తీస్తూ. గొంతులో అదే మార్దవం.

మాస్టారి తీరు వేరనే నమ్మకం కలిగించింది వాడికి. వాతలు తేలిన చేతుల్ని చూసుకొంటూ, " మరి... కేకులు కొనుక్కుని తిందామని" మనసులో దాగివున్న మాటను బయటపెట్టాడు.

బయట వర్షం తగ్గింది. ఆకాశంలో ఇంద్ర ధనస్సు విరిసింది.

"దానికి దొంగతనం ఎందుకురా? మీ బాబుని అడగవచ్చు కదరా?" మందలింపుగా అన్నారు.

"యాంమో.. మా బాబునే... డబ్బులడిగితే..సంపెత్తాడండి" అసలు విషయం చెప్పాడు. పై తాటాకుల కప్పులోంచి జలజల వర్షం చుక్కలు జారి వాడి మొహం మీద పడ్డాయి.ఇంతలో గంట మ్రోగింది. పిల్లలందరితో పరిగెడుతూ, వాడూ బయటకు వెళ్లిపోయాడు ఉత్సాహంగా."ఎందుకు మాష్టారు! రాముడ్ని కొట్టారు?" శాంతంగా అడిగారు తాతయ్య మాస్టార్ని. "వేలుడంత లేడు వెధవ. దొంగతనాలు చేస్తున్నాడట. రేపొద్దున్న గజదొంగవుతాడు. ఎంత కొట్టినా బెల్లం కొట్టిన రాయిలా వులకడు,పలకడు….నాకు పిచ్చి కోపం వచ్చింది" అన్నారు.

"మీరు చెప్పింది నిజమే. అందుకు కారణమేమిటంటారు మాష్టారు?" అడిగారు సత్యం.

ఎదురుగా వున్న స్తంభానికి కాళ్లు తన్నిపెట్టి, కర్రకుర్చీ లో వూగుతూ, "ఆ….ఏముందండి... వెధవ పెంపకాలు..ఆ ఇంట్లో ఒక్కడికి అక్షర జ్ఞానం వుందా చెప్పండి? మట్టి పిసుక్కుంటూ, బురదలో…పందిలా పిల్లల్ని కంటూ.. తాగి తందనాలాడుతూ బ్రతికేస్తారు. ఇక ఆ వాతావరణంలోంచి వచ్చిన ఈ వెధవలేమి బాగుపడతారు?" ఆయన మాటల్లో ఒక విధమైన ఈసడింపు ధ్వనించింది. "కావచ్చు, కానీ మనం తలచుకుంటే వాళ్లని బాగు చేయలేమా? మనసుంటే మార్గముండదా?" అన్నారు సత్యం, గుండెలోగూడు కట్టిన ఆవేదనని వ్యక్తం చేస్తూ. "అబ్బో!ఎందుకు చేయలేం, మీరు నవయుగ వైతాళికులుగా, బాగుచేయండి" అన్నాడు వెటకారంగా చేతులూపుతూ తాతయ్య మాష్టారు.

గంట మ్రోగడంతో,. బిల బిలా పిల్లలందరూ లోపలికి వచ్చారు. తెలుగు పాఠంలో, కొన్ని పదాలను స్పష్టంగా ఎలాఉచ్చరించాలో నేర్పుతూ,వాటిని నల్లబల్ల మీద వ్రాస్తూ రాముడ్ని ఒక కంట కనిపెడుతున్నారు సత్యం మాస్టర్. వాడికి వ్రాయడం రాదు కానీ ఉచ్చారణా దోషం లేకుండా శబ్దాలని చెప్పగలగడం ఆయన గమనించారు. కెఒకొక్కరూ వ్రాయడం పూర్తి చేసి తమ పుస్తకాలని చూపించి తప్పులు దిద్దించుకొంటున్నారు. రాముడు వంతు రానే వచ్చింది. వ్రాయనందుకు తన్నులు తప్పవు కదాని భయపడుతుంటే, "ఒరే రాముడూ! నిలబడి గట్టిగా చదువు. అందరూ వినండి. గట్టిగా చెప్పండి" ఆదేశించారు సత్యం మాష్టారు. మరునాడు పాఠశాలకి వస్తుంటే, దారికడ్డంగా పెద్ద గుంపు. కొంతమంది ఆడవాళ్ళు, మగాళ్ళు,పిల్లలు గుమికుడారు. ఆ గుంపు మధ్యలో, చింతబరికతో రాముడ్ని, వాడి తండ్రి చితక బాదుతూ."ఇలా ఇరగదీస్తే కానీ... మాట ఇనవురా...నా కొడకా…" బూతులు తిడుతున్నాడు. వాడు దెబ్బలకి తాళలేక రోదిస్తుంటే, చుట్టూ మూగిన వాళ్ళందరూ చక్కగా చోద్యం చూస్తున్నారు. "ఆగవయ్యా.. ఆగు.. ఎందుకు వాడ్ని అలా కొడుతున్నావ్? అంటూ గబగబా వచ్చి రాముడ్ని తన వెనుక దాచిపెట్టి కోపంగా అరిచారు సత్యం మాష్టారు. " మీకు తెల్వదండి... ఆడి సంగతి. దొంగతనం బాగా అలవాటయింది… ఇలా ఇరగదీయకపోతే…." అంటూ వాడ్ని లాగబోయాడు. చుట్టూమూగిన వాళ్ళకి ఆసక్తి ఇంకా పెరిగింది. సత్యం మాస్టరు ఇలా మధ్యలో వస్తారని వాళ్లు ఊహించనది. "ఇంట్లో పెద్దలు సరిగ్గా వుంటే, పిల్లలూ బుద్ధిగా వుంటారు." అని ఉక్రోషంతో అరుస్తూ, రాముడి జబ్బ పట్టుకొని విస విసా నడుస్తూ సైకిల్ వెనుక కూర్చోబెట్టారు. నిజంగా ఎవరూ ఎవరి బ్రతుకుల్ని మార్చలేరా? ఎలా మార్చాలి? ముందు సమస్య మూలాలు వెదకాలి. అవును, తీగ పట్టుకొని లాగితే డొంకంతా కదలాలి. ఆయన బుర్రలో శతకోటి ఆలోచనలు.

***************

"ఒరేయ్ రమాకాంత్, సరదాలు, వెటకారాలు నీకు ఈమధ్య ఎక్కువయ్యాయి. వేళాకోళం ఒక్కసారి వికటించే ప్రమాదం కూడా లేకపోలేదు. జాగ్రత్త. ఇంటర్వ్యూ బాగా చేయి.." వీడ్కోలు చెప్పడానికి వచ్చిన స్నేహితుడి మాటల్ని నవ్వుతూనే ఖండిస్తూ, "అబ్బో హితబోధలాపి, సుఖ ప్రయాణమని కోరుకోరా ! నువ్వు టెన్షన్ పడకురా!" అన్నాడు రమాకాంత్. "సరే, విష్ యు అల్ ది బెస్ట్" అన్నాడో లేదో, రైలుబండి కదిలింది రాజమండ్రి స్టేషన్ నుంచి. రిజర్వేషన్ చేయించుకొన్న తన బెర్త్ మీద విశ్రాంతిగా కూర్చొని, మరునాడు సికింద్రాబాద్ లో, కేంద్ర ప్రభుత్వ సంస్థలో అధికారి పోస్టుకి జరిగే తన ఇంటర్వ్యూ గురించి ఆలోచిస్తుంటే కునుకు పట్టేసింది. సాయంత్రం ఏడు గంటలకు విజయవాడ స్టేషన్ లో రైలు ఆగింది. బద్ధకంగా ఒళ్ళు విరుచుకొంటూ, ప్లాట్ ఫారం మీద అటు ఇటు నడిచి అరటిపండ్లు కొంటుంటే, రైలు నెమ్మదిగా కదులుతూ, కొంచెం వేగం అందుకొంటుంటే, పళ్ళని ఒక చేత్తో పట్టుకొని, పరిగెడుతూ రైలెక్కాడు.

తన సాహసానికి గర్వం, సంతోషం కలిగాయి. తీరా బెర్త్ దగ్గరకు వెళ్లేసరికి, ఒక అమ్మాయి కూర్చోని వుంది. చూడటానికి సినిమా హీరోయిన్ లా వుంది. ఆమెనే తదేకంగా చూస్తుంటే, "ఈ బెర్త్ మీదా! సారీ" అంటూ లేచి నిలబడపోయింది. ఆమె తీయని మాటలు, అందమైన కళ్లు, ఆ అమాయక చూపులు అతణ్ణి ఏదో మాయ చేశాయి. "పరవాలేదు కూర్చోండి" అన్నాడు. ఒక అందమైన అమ్మాయి తన ప్రక్కనే కూర్చోవడం పరవశం కలిగించింది. ఇంతలో టిక్కెట్ కలెక్టర్ కేకలు వినిపించాయి. "రిజర్వేషన్ లేకపోతే ఖమ్మంలో దిగిపోవాలి" అంటూ హుకుం జారీ చేస్తున్నాడు టిక్కెట్లు తనిఖీ చేస్తూ. ఆమె గుండెల్లో రాయి పడింది. 'నాకోసం ఏమైనా చేయలేవా' అన్నట్లుగా ఆమె బేలచూపు అతనిలోని హీరోని రెచ్చగొట్టింది. ఇంతలో టిక్కెట్ కలెక్టర్ సునామీలా రానే వచ్చాడు." ఎక్కడ నీ సీటు?"అంటూ ఆమెని గద్దించాడు. ఆ వయ్యారిభామ క్రీగంట రమాకాంత్ ని చూసింది. కర్తవ్యం అతనికి బోధపడింది. జేబులోవున్న పర్స్ ని తీస్తూ," నా కాబోయే భార్య... కొంచెం అర్ధం చేసుకోండి సార్. మా తిప్పలు మేము పడతాం. ప్లీజ్ సార్" అంటూ చాటుగా డబ్బులిచ్చాడు.

విజయ గర్వంతో బెర్త్ మీద కూర్చొంటుంటే, ఆమె అతనికి దగ్గరగా జరిగి "థాంక్యూ, థాంక్యూ" అంది ఆరాధనగా. రైలు లయబద్ధంగా పరిగెడుతోంది. కానీ అతని గుండె లయ తప్పుతోంది. ఏవో గజిబిజి ఆలోచనలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. చూపులతో ఆమెను చుట్టేస్తున్నాడు. ఆమె తన బాగ్ లోంచి బిస్కెట్ పాకెట్ తీసి, కొన్ని అతని చేతిలో పెట్టింది. "నాకు పళ్ళున్నాయి, నువ్వు తిను" అన్నాడు. "ఏదయినా మత్తుమందు కలిపి, మిమ్మల్ని దోచుకుంటానని భయమా?" అంది అమె కొంటెగా నవ్వుతూ.

ఆ ఛలోక్తికి గట్టిగా ఆతను నవ్వుతూ, "సరే, నావి నీకు, నీవి నాకు" అన్నాడు చిలిపిగా చూస్తూ.

మౌనంగా అతన్ని చూసింది.

బయట పడుతున్న వర్షానికి, కిటికీలోంచి జల్లు పడుతోంది. కిటికీ సరిగ్గా పడకపోవడంతో ఆమె ఇంకా దగ్గరగా చేరింది. అప్పటికే లైట్లు ఆర్పేసి ముసుగు తన్నుతున్నారు ప్రయాణీకులు. తెచ్చుకున్న దుప్పటి బయటకు తీసాడతను. ఇద్దరూ వెచ్చగా జంటగా దుప్పటి కప్పుకొన్నారు. "ఎక్కడికి వెళ్లాలి?" అడిగాడు. "ఆల్వాల్, నాన్నకి సీరియస్ గా వుందట. ఆసుపత్రిలో వున్నాడు," అంది. ఆతను ఆమెను ఇంకా దగ్గరకు తీసుకొన్నాడు, తెలియని ఆవేశంలో ఆమెను ముద్దాడాడు. ప్రతిగా అమె కూడా …. దుప్పటిలో ఆమె అతని ఒడిలో గువ్వలా ఒడిగిపోయింది. జీవితంలో ప్రధమంగా స్త్రీ స్పర్శ ఏవో గిలిగింతలు పెడుతోంది. రానని మొరాయిస్తున్న పిల్లాడిని బలవంతంగా లాక్కొచ్చి స్కూలులో కూర్చోబెట్టినట్టు, కీచు కీచు మని చిత్రమైన శబ్దాలు చేస్తూ ప్లాటుఫామ్ మీదకి భారంగా చేరింది రైలుబండి సికింద్రాబాద్ లో.

రాత్రి రెండు గంటలవుతోంది. నెమ్మదిగా నడుచుకుంటూ స్టేషన్ బయటకు వస్తున్నారు. వాళ్లిద్దరూ. ముఖానికి నల్లరంగు చున్నీ చుట్టుకొంది ఆమె. వీచిన శీతలమారుతం గిలిగింతలు, పెట్టగా మురిపెంగా ఆమె చేతిని పట్టుకొని నడుస్తున్నాడు. కానీ రెండు జతల కళ్లు వాళ్లని సునిశితంగా పరిశీలిస్తున్నట్లు అతనికి తెలియదు. తన కోసమెవరైనా వల వేయచ్చని ఆమె అనుమానం.

ఆసుపత్రిలో దిగబెట్టి సికింద్రాబాద్లో, హోటల్లో గది తీసుకొందామని అతని ఆలోచన.

ఆటో ఎక్కుతుంటే, అక్కడ నుoచున్న పోలీసు కానిస్టేబుల్ అనుమానంగా అడిగాడు, "ఆమె ?…." అతని మాటల్ని మధ్యలోనే తుంచుతూ, "ఆవిడే నా భార్య. నేనే ఆమె…" అన్నాడు దృఢంగా.

ఆటో, ఆల్వాల్ వైపు దూసుకుపోతోంది.

చల్లగాలికి అతనిలో ఏవో పిచ్చి కోరికలు రెచ్చిపోతున్నాయి.కానీ ఆమె ఆలోచనలు వేరేగా వున్నాయి. ఏదో ప్రమాదం పొంచి వుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి ఆమెకు. వేటగాడి వేటు నుండి తప్పించుకోవడానికి సిద్ధంగా వున్న ఆడ సింహంలా వుంది. తన బాగ్ ని గట్టిగా పట్టుకొని వేగంగా ఊపిరి తీస్తోంది. అంతలో సర్రున దూసుకువచ్చిన జీపు, ఆటోకి అడ్డంగా ఆగడంతో,ఆమె ఎలర్ట్ అయ్యింది. ఆటోలోంచి, బయటకు దూకడం, మీదకు వేగంగా తనవైపు వచ్చిన పోలీసుల్ని ఎగిరి తన్ని, మిగిలిన సిబ్బంది వైపు బ్యాగ్ లోంచి తీసిన తుపాకీ తో గురి పెట్టింది.

ఈ లోపులో ఎక్కడినుండో రయ్ మంటూ వచ్చి ఆగిన బైక్ మీద ఆమె కూర్చోవడం, తడవుగా అది చీకటిలో కలిసి పోవడం జరిగింది.ఏదో ఇంగ్లీష్ యాక్షన్ సినిమా చూసిన భావన లోంచి, వాస్తవానికి రావడానికి కొంచెం సమయం పట్టింది రమాకాంత్ కి. అర్ధమవుతున్నకొద్దీ అతనికి దిమ్మ తిరిగి పోతోంది. కాళ్ళు చేతులు వణికి పోతున్నాయి. "ఈ కొత్త పెళ్లికొడుకుని అత్తారింటికి తీసుకొని వెళ్ళి బాగా మర్యాదలు చేయండి" అన్నమాటలుకి భయంతో బిగిసి పోయాడు,పోలీసుజీపులో.

తన ఆశలసౌధం పేకమేడలా కూలిపోయిందన్న సత్యం అర్ధమవుతోoది అతనికి. ఇప్పటి దాకా అదృష్టం కలిసి వచ్చిందని మురిసి పోయాడు. కానీ ఇప్పుడే అర్ధమయ్యింది దురదృష్టం ఎలా వెంబడించిందో. స్టేషన్లో ,పోలీసుల ప్రశ్నలకి ఏమీ సమాధానం చెప్పలేకపోతున్నాడతను. "హనీతో ఎలా పరిచయం? ఎప్పట్నుంచి? ఇద్దరూ కలిసి ఏమి చేయాలని ప్లాన్ వేశారు?..'" వంటి ప్రశ్నలకి సమాధానాలే లేవు అతని వద్ద.అప్పుడు తెలిసింది అతనికి ఆ వయ్యారిభామ ఎవ్వరో. హనీ ట్రాప్ తో పెద్ద పెద్ద మిలటరీ అధికారులతో సంబంధాలు సాగిస్తూ, రహస్యాలు సేకరించి విదేశాలకు చేరవేస్తుందని. రైలులో వస్తున్నట్లు పోలీసులకు వర్తమానం వచ్చింది. కానీ, అరెస్టు చేయడంకోసం జరిగిన ప్రయత్నం ఇప్పుడు విఫలమైంది. రైలులో అతన్ని తెలివిగా షెల్టర్ గా వాడుకొంది. అందుకు అతిభారీమూల్యం చెల్లించవలసి వస్తోంది రమాకాంత్ కి.భయపడుతూ స్టేషన్లో ఒక మూల కూర్చోపెట్టారు.. అంతలో ఒక్కసారిగా హడావుడి ప్రారంభమయ్యింది. పోలీసు కమిషనర్ వస్తున్నాడట. జరగబోయేది ఏమిటానని, రమాకాంత్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలయ్యింది. కమీషనర్ ముందు నిలబెట్టారు.

"సార్ ..నేను రాజమండ్రిలో రైలు ఎక్కాను. రేపు సాయంత్రం ఇంటర్వ్యూ వుంది.."నాలుక తడి ఆరిపోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇంకా చెప్పబోతుంటే, అతని చేతిలో ఉన్న ఫైల్ మీద కమీషనర్ దృష్టి నిలిచింది. ఫైల్ తీసుకుని పరిశీలనగా చూస్తున్న కమీషనర్ చూపులు ఒకచోట అగిపోయాయి. ఏదో సమాధానం దొరికిన వాడిలా మౌనంగా స్టేషన్ బయటకునడుస్తూ, రమాకాంత్ కేసి మరోసారి చూశాడు.

*****************

సైకిల్ మధ్యలోనే ఆపి, " క్రిందికి దిగరా రాముడూ!".అంటూ, కిరాణా కొట్టుకి తీసుకెళ్లారు.

బాగ్ నిండా కేకులు, బిస్కెట్లు, చాక్లెట్లు నింపి, స్కూలుకు తీసుకెళ్లారు. రాముడికి అవన్నీ ఎవరి కోసం కొన్నారనే సందేహం కలుగుతోంది. పుస్తకంలో వ్రాసిచ్ఛిన అక్షరాలు నేర్చుకోవాలి. అప్పడే అవన్నీ తినాలి. లేకపోతే అన్నీ తన స్నేహితులకు పెట్టాలి. ఇదీ రాముడికి పెట్టిన షరతు.

నిద్రాణనమైన వాడి శక్తి మేల్కొన్నది. అప్పటి దాకా నిద్రపోతున్న సింహం ఒక్కసారిగా జూలు దులిపింది.

మూడు గంటల్లో తెలుగు అక్షరాలు, గుణి0తాలు నేర్చాడు పట్టుదలతో.

బంగారాన్ని పుటం వేయాలి. అందుకే, వాడి మకాం సత్యం మాస్టరింటికి మారింది. అక్కడ అమ్మ గారు పెట్టే కూరలు, పచ్చళ్ళు, ఉప్మా, పులిహోర, బూర్లు ఒకెత్తయితే, చదువు విలువని నేర్పే పాటలు, పద్యాలు, మహాత్ముల జీవిత చరిత్రలు మరొక ఎత్తు. విశాల ప్రపంచంలో అడుగు పెట్టాలని తహతహ లాడుతున్నాడు వాడు.

రాముడికి నవోదయ పాఠశాలలో సీటు రావడంతో తల్లి తండ్రులుకి నచ్చచెప్పి వాడిని నవోదయలో చేర్పించారు మాష్టారు .అదే సంవత్సరంలో కేంద్రీయ విద్యాలయంలో ఉద్యోగం రావడంతో సత్యం మాస్టర్ మహారాష్ట్రకి వెళ్ళిపోయారు.ఆ తర్వాత రాముడు ఆయన్ని కలవలేకపోయాడు.

****************

ఉద్యోగ రీత్యా విభిన్న రాష్ట్రాల్లోనే పనిచేయడంతో, సత్యం మాస్టారికి పూర్తిగా ఆ పల్లెటూరితో సంబంధ బాంధవ్యాలు క్రమేణా తెగిపోయాయి. కానీ రాముడు మనసులో మెదులుతూనే వున్నాడు. విశ్రాంత ఉపాధ్యాయుడుగా రాజమండ్రిలో, తనవంతుగా వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ జీవితం గడుపుతున్నారు. ఆ రోజు ఆయన తన ఇంటికి ఎదురుగా వున్నగాంధీపురం, మునిసిపల్ పార్కులో ఉదయపు నడక ముగించుకొని ఇంట్లోకి వెళ్లబోతూ, అప్పుడే వచ్చిన వాహనం లోంచి దిగిన వాళ్లు తనవైపు రావడంతో ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు.

"ఇక్కడ సత్యం మాస్టర్…." అడిగాడు ఒకరు.

"నేనే బాబు.... ఏమి కావాలి చెప్పండి" "రమాకాంత్ …" వాళ్ళ మాటలు.పూర్తి కాకుండానే, "ఏమయ్యింది బాబు వాడికి... వాడు నా కొడుకే….. చెప్పండి.. దయచేసి చెప్పండి వాడికేమయ్యింది" ఆందోళనగా అన్నారు ఆయన.

"ఆందోళన పడవలసింది ఏమీ లేదు. మీ అబ్బాయి ఇప్పుడు ఎక్కడున్నాడు?" మాములుగా అడిగాడు.

సికింద్రాబాద్లో ఈ రోజు ఇంటర్వ్యూ వుంటే నిన్న సాయంత్రం రైలుకి వెళ్ళాడు." అన్నారు. తరువాత ఏదో పిచ్చాపాటి నడిచింది వాళ్ళ మధ్య. "ఒకే మంచిది మాష్టారు. వుంటాం. ఈ ఏరియాలో మీరంటే తెలియని వాళ్లుండరు. వెరీ పాపులర్ మీరు" అంటూ వెళ్లిపోయారు. వాళ్లు మఫ్టీలో వున్న పోలీసులని ఆయనకు తెలియదు.

****************

రమాకాంత్ దగ్గరున్న ఫైల్ చూసి, పోలీసు కమిషనర్ ఎంతో భావావేశానికి గురయ్యాడు. నిజానికి ఆ ఫైల్ ని ఎన్నోసార్లు ముట్టుకొన్నాడు కాదు, ముద్దు పెట్టుకున్నాడు అతను."ఒరేయ్ రాముడూ! ఇది చాలా ముఖ్యమైన కాగితం. నీ నవోదయ హాల్ టిక్కెట్ రా. జాగ్రత్తగా మన ఫైల్లో పెట్టు." ఆ మాటలే పదే పదే గుర్తుకు వస్తున్నాయి. గుర్తుకు వచ్చిన ప్రతిసారి అప్రయత్నంగా కళ్లు చెమ్మగిల్లుతున్నాయి.

రమాకాంత్ సర్టిఫికెట్స్ లో, తన మాష్టారి పేరు.ఇంతలో ఫొన్ మ్రోగింది. కమిషనర్ ఆ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాడు."సార్! ఆవును ఆయన సత్యం మాష్టారు గారే.మీ వూరిలో ఆయన పని చేశారట…"పోలీసు అధికారి ఒకరు రాజమండ్రి నుండి ఫొన్లో చెప్పాడు.

***************

పోలీసు కమిషనర్ నుంచి వచ్చిన ఆదేశాలతో, రమాకాంత్ ని పోలీసు అతిథి గృహానికి తీసుకెళ్లారు వాహనంలో. "దొరగారు మిమ్మల్ని సాయంత్రం ఇంటర్వ్యూ కి తీసుకుని వెళ్ళమన్నారు. మీరు గది లో రెస్ట్ తీసుకోండి. క్రింద కాంటీన్లో భోజనం తినండి. నా డ్యూటీ ఇక్కడే. ఇంకా ఏమైనా కావాలంటే చెప్పండి" అన్నాడు ఒకడు.

రమాకాంత్ కి ఇదంతా కలలా వుంది. చిన్నప్పుడు తండ్రి చెప్పిన ' అంతా మన మంచికే ' కధ జ్ఞాపకం వచ్చింది. ఇంటర్వ్యూ బాగా చేయాలనుకొంటూ కారులో ఇంటర్వ్యూ స్థలానికి చేరుకున్నాడు.

ఇంటర్వ్యూ గదిలో అడుగు పెట్టాడు .'కామరాజు చెరువు గట్టు' అని ఎప్పుడైనా విన్నారా? రమాకాంత్ కి ఒక్క క్షణం నోరు పెగల లేదు. ఇంటర్వ్యూ లో ఏవో తెలియని ప్రశ్నలుతో తికమక పెట్టడం సహజమే. కానీ ఇదేమీ ప్రశ్న?

నెమ్మదిగా మొదలు పెట్టాడు. "తెలుసు. తూర్పుగోదావరి జిల్లాలో….. మానాన్న గారు ఆ వూళ్ళో ఉపాధ్యాయుడిగా పని చేశారు.""ఆయన పేరు?" తరువాత ప్రశ్న.

"............" అతని సమాధానం.

"ఇక మీరు వెళ్లచ్చు."

"విష్ యు గుడ్ లక్".

రమాకాంత్ చాలా అసంతృప్తికి, అసహనానికి గురయ్యాడు ఇంటర్వ్యూ జరిగిన విధానానికి.

కారు డ్రైవర్ టీ ఇస్తూ చెప్పాడు. "మిమ్మల్ని రైల్వేస్టేషన్లో దింపమని దొర గారు చెప్పారు."

రైల్వే స్టేషన్లో కారు ఆగింది. డ్రైవర్, రమాకాంత్ చేతి లో సెకండ్ క్లాస్ ఏ. సి టిక్కెట్ పెట్టి ,శాల్యూట్ కొట్టి బయలుదేరాడు. వెళ్ళుతున్న ఆ కారు వైపు చూస్తూ బొమ్మలా నిలబడి పోయాడు రమాకాంత్.

*******************

వన మహోత్సవం సందర్భంగా సత్యం మాస్టారి ఇంటి ఎదురుగా వున్న పార్కులో మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతోంది. ఎంతో ఉత్సాహంగా కార్యక్రమం నిర్వహిస్తున్నారాయన. పచ్చని దబ్బపండు మేని ఛాయ, నుదుటి మీద ఎర్రని కుంకుమ బొట్టు, మెడలో రుద్రాక్షమాల, ఖద్దరు పంచె మీద సిల్క్ లాల్చీ. సన్నని ఫ్రేమ్ కళ్ల జోడు.అందమైన చిరునవ్వు. తెలుగుదనానికే నిలువుటద్దంలా నిలబడి అందర్నీ ఉత్సాహపరుస్తూ, ఆయా మొక్కల ఔషధ గుణాలను వివరిస్తున్నారు.ఇంతలో చకాచకా వచ్చిన వాహనాల లోంచి నగర ప్రముఖులు, అధికారులు, మీడియా వాళ్ళు దిగారు. దాంతో కొద్ధి నిమిషాలలోనే గుమిగూడిన జనాభాతో కోలాహలంగా ఒక మహాసభ వాతావరణం ఏర్పడింది.ఇంతలో మీడియా ప్రతినిధిముందుకు వచ్చి ," మన రాష్ట్రం గర్వించదగ్గ పోలీసు అధికారి, రాముడు ఐ పి యస్ ఇక్కడ మనతోనే వుండడం మన అదృష్టం."అంటూ రాముడు గారు ముందు మైక్ వుంచాడు.

రాముడు మైక్ తీసుకుని, నెమ్మదిగా తన ఎదురుగా నిలబడిన సత్యం మాష్టారు దగ్గరకు వెళ్ళి ఆయన కాళ్ల మీద పడిపోయాడు. ఈ హఠాత్ సంఘటన,అందర్ని ఆశ్చర్య చకితులను చేసింది."నేను మాష్టారు.. మీ..రాముడ్ని…గుర్తుపట్టలేదా... ఒకనాడు..మీరు నాటిన చిన్న మొక్కని… ఈ.. జీవితం, అధికారం..హోదా.. సర్వం..మీరు వేసిన భిక్ష….."అప్పటికే రాముడి గొంతు మూగ బోయింది కళ్లు భాద్రపద మబ్బుల్లా కుండ పోతగా వర్షిస్తున్నాయి. కన్నీటితో కాళ్లు కడుగుతున్న రాముడ్ని లేవదీస్తూ, తన హృదయానికి హత్తుకుని ఎంతో మురిసి పోయారు. గురు శిష్యులు ఒకరినొకరు చూసుకొంటూ మహావృక్షాలు లా పారవశ్యంతో, ధీరగంభీరంగా నిలబడటంతో, ఆ దృశ్యాన్ని అందరూ కేమెరాలో బంధిస్తున్నారు.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు