అదేమి చిత్రమో గానీ, వెలితిలేని జీవితాలు లేవీ లోకంలో. అది భగవంతునికి ఒక ఆట అనుకుంటాను. అన్నీ ఇస్తే మానవుడు తననెక్కడ మరిచిపోతాడోనని, ఏదో ఒక అసంతృప్తిని వరంగా ఇస్తాడు. సురేంద్రకు చిన్నతనం నుంచి దేనికీ లోటు లేకుండా చేశాడు ఆ దేవుడు. చదువు, అందం, ఆస్తి, అనుకూలవతియైన చక్కని చుక్కలాంటి భార్య జాహ్నవి. మంచి భార్య దొరకడమంటే లక్కీ లాటరీ తగలడమే అంటారు. ఆ రకంగా సురేంద్రకు దొరికింది భాగ్యలక్ష్మి బంపర్ డ్రానే అనవచ్చు. పెళ్ళయిన పది సంవత్సరాలలో ఒక్కసారైనా ముచ్చటకు కూడ వారి మధ్య కీచులాట రాలేదు.
అతని తండ్రిగారు కాలం చేసినప్పటి నుంచి తల్లి పార్వతమ్మ అతని దగ్గరే ఉంటున్నది. జాహ్నవికి పార్వతమ్మ దగ్గరే చనువు ఎక్కువ. ఇంట్లో ఆడపిల్లలు లేకపోవడం వలననో, లేక ఇంటికి పెద్ద కోడలు కావడం వలననో గాని పార్వతమ్మకు జాహ్నవి అంటే ప్రేమ. తనకూ అంతే. ఆమె చుట్టూ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది.
ఇంతటి ఆహ్లాదకర వాతావరణం చూసి ఆ దేవదేవుడికి కన్నుకుట్టిందేమో వారికి సంతానప్రాప్తి లేకుండా చేశాడు. మొదట్లో తాత్సారం చేసినా, గత నాలుగు సంవత్సరాలుగా పిల్లల కోసం వారు చేయని పూజలు లేవు, తిరగని ఫెర్టిలిటీ సెంటర్లు లేవు. చివరి ప్రయత్నంగా IVF కూడా చేయించారు. కానీ ఫలితం శూన్యం. జాహ్నవి శారీరకంగాను, మానసికంగాను పూర్తిగా దెబ్బతిన్నది. ఎవరు ఎదురైనా "అయ్యో పాపం. పెద్దవాడికి పిల్లలు లేరటగా. ఎంత ఉండి ఏం లాభం. తినడానికి ఒక నలుసు లేనప్పుడు" అనే అమ్మలక్కల సూటిపోటి మాటలకు పార్వతమ్మ మనసు గాయపడేది. ఎంత అణచుకోవాలనుకున్నా ఆ మాటల ప్రభావం జాహ్నవి మీద పడేవి. అత్తగారి మాటలకు తనలో తను కుమిలిపోయేదే కాని ఎప్పుడూ ఎదురు చెప్పలేదు. సుధీర్ దాకా వస్తే మాత్రం అమ్మనే మందలించేవాడు.
ఒకరోజు అతను వచ్చేసరికి జాహ్నవి గదిలో కూర్చుని ఏడుస్తున్నది. జరిగిందేమిటో చెప్పమని అడిగినా ఒక్కమాట కూడ చెప్పకుండా కళ్ళు తుడుచుకుని వంటగది లోకి వెళ్ళిపోయింది. ఏదో జరిగింది అని మాత్రం అర్ధమయింది గానీ విషయం అర్థం కాలేదు. రాత్రి భోజనానికి కూర్చున్నప్పుడు అర్థమయింది, ఆ గొడవ పిల్లల విషయంలో అని సురేంద్రకు.
"అమ్మా ఇందులో జాను తప్పేముంది. తను అన్ని ప్రయత్నాలు చేసింది కదా."
"నేను దానికి బిడ్డలు పుట్టలేదని దాన్ని ఎప్పుడూ నిందించలేదు. భగవంతుడు ఇవ్వని దానికి అది మాత్రం ఏం చేస్తుంది. కనీసం ఎవరినైనా దత్తత తీసుకోవచ్చు కదా. ఆ మాటంటేనే అది ముఖం ముడుచుకు కూర్చుంటుంది. నేను పోయిన తరువాత మీకు నా అన్నవాళ్ళు ఎవరుంటారురా అదే నాబాధ" పార్వతమ్మ కన్నులు చెమ్మగిల్లాయి.
"బాధపడకమ్మా. దానికే కాదు, నాకు కూడ ఈ దత్తత మీద పెద్దగా ఆసక్తి లేదు. అందుకే మా మధ్య ఆ చర్చ రాలేదు. ఆ దిశగా ఆలోచించలేదు కూడ. సరేనమ్మా, నీ మనసులో మాట చెప్పావు కదా. ఎక్కడైనా ప్రభుత్వ అధీనంలో వున్న అనాథాశ్రమం ఉందేమో విచారిస్తాను. ఏమంటావు జాను" ప్రక్కనే కూర్చున్న జాహ్నవి నడిగాడు సురేంద్ర
"అలాగే. ఉదయం జరిగిన దానికి సారీ అత్తయ్యా. దత్తత తెచ్చుకోవాలంటే ఏదో కొంత భయం. ఎవరో, ఏమిటో, వారని కన్నవారి మనస్తత్వాలేమిటో అనే బెరుకు అంతే. మనవలన ఒక అనాథకు మంచి జీవితం వస్తుందంటే నాకు కూడ మంచిపనే అనిపిస్తున్నది. అటు 'అమ్మా' అనే పిలుపు నాకు, తల్లిదండ్రుల ప్రేమ తనకు దక్కుతుంది. మీరు చెప్పినట్లే చేస్తాను. మాకు నచ్చిన బిడ్డను తెచ్చుకుంటాము. మరల మీరు అభ్యంతర పెట్టకూడదు. సరేనా" ఒప్పుకుంటున్నట్లు ఒప్పుకుంటూనే ముందరి కాళ్ళకు బంధం వేసింది జాహ్నవి.
"భగవంతుడు ఇస్తే ఎలాటి వారినైనా సర్దుకుపోవాలి తప్పదు. కానీ ఎంచుకునేటప్పుడు మెరుగైనదే తెచ్చుకోవచ్చు కదా అని నా అభిప్రాయం. తరువాత మీ ఇష్టం. ఇంట్లో పసిబిడ్డ పారాడితే చాలు నాకు" పార్వతమ్మ మాటల్లో ఆనందం.
*********************
ప్రభుత్వ ఆధ్వర్యంలో నడపబడుతున్న పిల్లల ఆశ్రమానికి వెళ్ళాడు సురేంద్ర జాహ్నవిని తీసుకుని. ఆశ్రమ నిర్వాహకురాలితో దత్తత విషయం చెప్పాడు. వారేదో ఒక ఆర్డర్ ప్రకారం పిల్లలను ఇవ్వడం జరుగుతుందని ఇప్పుడు ఆ క్రమం ప్రకారం అందుబాటులో ఉన్న పిల్లలను చూపించారు. ఎవరు కావాలో మీరు నిర్ణయించుకోవచ్చని చెప్పి వారి చేతికి ఒక దరఖాస్తు ఫారమిచ్చి నింపమన్నారు.
"మీరిచ్చిన వారు కాక మిగిలిన వారిలో మాకు నచ్చిన వారిని తీసుకోకూడదా" అడిగింది జాహ్నవి ఆమెను.
"తీసుకోవచ్చండి. కానీ వారి వంతు వచ్చే వరకు ఆగాలి. ఎందుకో ఏమో తెలియదు గాని, ప్రభుత్వం మాకు చెప్పిన మాట అది. పురిటిలో బిడ్డలు కాకుండా కొందరు పిల్లలున్నారు. ఇంతకు మునుపు అందరినీ చూపించేవారం. దానివల్ల కొందరు అలాగే నిలబడిపోయారు. ఒక వరుసక్రమం పాటించడం వలన వారందరినీ దత్తత ఇవ్వగలిగాం. దానివలన మీకు ఇప్పుడు నెలల బిడ్డలని దత్తతకు అందివ్వగలుగుతున్నాం" అని చెప్పింది ఆమె.
"నిజమే. ఒక పద్ధతి పాటించకపోతే దేనికైనా ఇబ్బందే" అన్నది జాహ్నవి.
ఇంతలో ఒక రెండెళ్ళ పాప చిట్టి చిట్టి అడుగులేసుకుంటూ ఆమె దగ్గరకు వచ్చి, చేతిలో చాక్లెట్ కాగితం పెట్టి, తిరిగి గున గున నడుస్తూ వెళ్ళిపోయింది. నొక్కుల జుట్టు, మంచి రంగు, చక్కటి కనుముక్కు తీరుతో చూడగానే అందమైన పిల్ల అనిపించేలాగుంది. ముఖంలో ఏదో కళ, గొప్పింటి బిడ్డేమో అనిపించేలా ఉంది. బహుశా నిర్వాహకురాలి మనుమరాలేమో అనుకున్నాడు సురేంద్ర. అదే మాట అడిగాడు ఆమెను.
"లేదు సర్. ఆ పాప కూడ అనాథే. సంవత్సరం క్రితం ఎవరో తనని ఆశ్రమం వాకిట్లో వదిలేసి వెళ్ళారు. తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో పెద్దగా ఏడుపు వినిపిస్తే అదరాబదరా లేచి హాలంతా వెదికాము. ఆ ఏడుపు లోపల నుంచి కాదు బయట నుంచని గ్రహించి తలుపుతీస్తే పాప తలుపు దగ్గర నిలబడి ఏడుస్తూ ఉంది. పాపను ఎత్తుకుని తన ఇలాకా ఎవరైనా ఉన్నారేమోనని చుట్టూ వెదికాము. ఎవరూ కనిపించలేదు. ఎవరో కావాలనే అలా వదిలేసి వెళ్ళారని అర్థమయింది. మా సెక్రటరి గారికి చెప్పాము. పాపను మనదగ్గరే ఉండనివ్వండి అని చెప్పాడు. అందుకని పాపను ఇక్కడే ఉంచాము " చెప్పింది ఆమె.
"మరయితే ఆ పాప పేరు లిస్టులో ఎందుకు చేర్చలేదు. ఎదిగిన పిల్లలను దత్తత ఇవ్వరా" అడిగింది జాహ్నవి.
"అబ్బే అదేం లేదండి. ఆ పాప మూగపిల్ల. మాటలు రావు. అందరూ మీలాగే ఇక్కడే తిరుగుతున్న ఆ పాపను దత్తత తీసుకోవాలనుకున్నారు. కానీ విషయం తెలిసి ఎవరూ ముందుకు రాలేదు" చెబుతున్నపుడు ఆమె కళ్ళల్లో నీరు కదలాడింది.
"అవును. ఆ పాప మూగదని మీకెలా తెలిసింది" అనుమానంగా అడిగాడు సురేంద్ర.
"మా దగ్గర కొచ్చిన రెండు నెలల తరువాత కూడ పాప నోటి నుంచి అమ్మ అన్న పదం కూడ రాకపోయేసరికి మా సెక్రటరీ గారు డాక్టరుకు చూపిస్తే ఆయన అన్ని టెస్టులు చేసి పాపకు మాట రావడం కష్టమన్నారు. మాటలు రాని పాపను ఎవరు తీసుకుంటారనే అనుమానంతో ఆగిపోయాం. పాప పేరు జాబితాలో పెట్టి ఉంచాము. ఎవరైనా మనసున్న మారాజులు రాకపోతారా. ఆ పిల్ల తలరాత మారకపోతుందా అని చూశాము. కానీ ఎవరూ రాలేదు. క్రమేణా మేము కూడ ఒక నిర్ణయానికి వచ్చి పాపను మేమే పెంచాలనుకుంటున్నాము" చెబుతున్నంతసేపు ఆమెలో బాధను గమనించింది జాహ్నవి.
"అయితే మేము ఇష్టపడితే ఆ పాపను మేము తీసుకెళ్ళవచ్చా" అడిగింది జాహ్నవి
"తీసుకెళ్ళవచ్చు. కానీ తెలిసి తెలిసి...." ఆర్దోక్తిలో ఆగింది ఆమె ఉలిక్కిపడ్డాడు సురేంద్ర
"జాను ఏమిటి నువ్వనేది?"
"అవునండి. ఆ పాప నాకు నచ్చింది. ఆ ముఖంలో ఒక హుందాతనముంది. ఎవరో గొప్పింటి వాళ్ళ బిడ్డలాగుంది. తనకు మాటలు రావని తెలిసే వాళ్ళు ఇక్కడ వదిలి వెళ్ళి ఉంటారనిపిస్తుంది. లోపం లేని వాళ్ళు ఈ లోకంలో ఎవరూ ఉండరు. అన్నీ సవ్యంగా ఉన్న పిల్లలను ఎవరైనా తీసుకెళతారు. ఇలాటి వాళ్ళను భారమనుకుంటారు. బిడ్డలను కనలేకపోవడం నాకున్న లోపం. మాటలాడలేకపోవడం తనకున్న లోపం. ప్రతి మనిషికి ఏదో ఒక లోపం ఉంటుంది. ఒకవేళ మనకే ఇలాటి పాప పుట్టివుంటే తనను వదిలేసేవాళ్ళమా? ఆలోచించండి. నా మనసు ఆ పాప మీదే వుంది. తరువాత మీ ఇష్టం." తన అభిప్రాయాన్ని చెప్పింది జాహ్నవి.
"మనకు పుడితే తప్పదు. అది బాధ్యత. కానీ మంచి పిల్లలను ఎంచుకునే అవకాశం ఉండి కూడ నువ్వు ఈ పాపను ఎంచుకుంటున్నావంటే, అది నీ విశాల హృదయమనుకోవాలా, లేక కష్టాన్ని కొని తెచ్చుకుంటున్నావనుకోవాలా" అయోమయంగా అడిగాడు సుధీర్.
"భగవంతుడు పెట్టిన లోపాన్ని చూసి జాలిపడడం కాదు సుధీర్, అటువంటి వారిని ఆదరించి వారిని తీర్చిదిద్ది, వారికొక మంచి దారిని చూపగలిగితే, మనిషిగా పుట్టినందుకు మన జీవితానికొక సార్థకత. నన్ను నమ్ము. అత్తయ్య గారు ఏమంటారోనని ఆలోచించకు. ఆమెకు నేను సర్దిచెబుతాను. మాటలేనంత మాత్రాన ఆ పాప ఎవరి ప్రేమకు నోచుకోకుండా మిగిలిపోవాలా, ఆలోచించు. తన బ్రతుకు మనమెందుకు తీర్చిదిద్దకూడదు. చెప్పు సుధీర్" బంతిని అతని కోర్టులోకి నెట్టింది.
'అవును. లోపం ఉండటం పుట్టిన బిడ్డల తప్పుకాదు. దానిని భూతద్దంలో చూపిస్తూ లోకమే వారిని తక్కువచేసి సమాజంలో చిన్నచూపు చూసేలా చేస్తున్నది. జాహ్నవి చెప్పింది నిజం. అన్నీ ఉన్న వారిని ఎవరైనా తీసుకెళతారు. కానీ ఈ పాపను తీసుకెళ్ళను ఎవరూ ముందుకురారు. ఇలాటి వారు ఎందరో ఈ లోకంలో. ఎవరో చేసిన పాపానికి అనాథలై బ్రతుకుసాగిస్తూ, తాము చేయని తప్పుకు తామే బలయిపోతున్నారు. అందరినీ ఆదుకోలేకపోవచ్చు. కానీ ఒక్కరినైనా ఆ శిక్ష నుంచి కాపాడగలిగితే చాలు. తల్లి కాలేకపోయినా, తల్లిలా ఆలోచించింది జాహ్నవి.' అనుకుని జాహ్నవి వైపే మొగ్గుచూపాడు సుధీర్.
"చాలా సంతోషమమ్మా. ఈ పాప మా దగ్గర ఇలాగే ఉండిపోతుందేమో అనుకున్నాను. నేను ఉన్నంతకాలం దీని ఆలనాపాలనా నేనే చూసుకోవాలనుకున్నాను. కానీ నేను పోయిన తరువాత, ఇది ఏమయిపోతుందోనని భయపడ్డాను. ఆ దేవుడున్నాడమ్మా. అందుకే మీ మనసులో ఈ ఆలోచన పుట్టించాడు. చెప్పకూడదు కానీ అమ్మా బంగారుతల్లి ఈ పిల్ల. అసలు గొడవ చేయనే చేయదు సంవత్సరం నుంచి పెంచుతున్నాను కదమ్మా. అందుకే దాని మీద కాస్త మక్కువ ఎక్కువ. మీ ఋణం తీర్చుకోలేనమ్మా." అంటూ కొంత ఉద్వేగానికి లోనయింది ఆమె.
"ఒక సంవత్సరం పెంపకానికే మీరు పాప మీద పెంచుకున్న మమకారం చూస్తుంటే, మీది ఎంత మంచి మనసో అర్థమవుతుంది. మీరు బాధపడకండి. ఇకనుంచి తను మా బిడ్డ, తన బాధ్యత మాదే. తను మిమ్మల్ని వదలి మాతో వస్తుందా ఇప్పుడు" అనుమానంగా అడిగింది జాహ్నవి.
"తనకు మాటలు రాకున్నా, వినికిడి లోపం లేదు. తనకు రోజూ చెప్తుంటాను. మీ అమ్మ, నాన్న ఊరెళ్ళారు. వాళ్ళు రాగానే వారితో వెళ్ళాలని. పాపం ఎవరైనా మీలా వచ్చి వెళ్ళగానే ఆశగా నావైపు చూస్తుంది. వీళ్ళు కాదులేమ్మా అని సర్ది చెబుతాను. ఇప్పుడు తనకు చెబుతాను, మీరే తన అమ్మా, నాన్నా యని మీరే చూద్దురుగాని దాని సంబరం. ఈ లోపుగా మీరు ఈ కాగితాలపై సంతకాలు చేయండి" అంటూ ఆ పాప కోసం లోపలికి వెళ్ళింది ఆమె.
"మనం చేస్తున్నది మంచిపనేనా సుధీర్"
"నూటికి నూరు శాతం. జాను, నీ అంత మంచి మనసున్న భార్య దొరకడం నా అదృష్టం. అంతేకాదు నీలాంటి దేవత తల్లిగా దొరకడం ఆ పాప చేసుకున్న అదృష్టం. ఒక మూగపిల్లకు జీవితాన్ని అందించాలని నువ్వు తీసుకున్న నిర్ణయం శ్లాఘనీయం జాను"
"నేను ముందుగా ఆడపిల్లను. అందుకే నాకు ఆడపిల్లలంటే ఇష్టం. ఎందుకో ఆ పాప నాకు బాగా నచ్చిందండి. దానిని తీర్చిదిద్దుతాను. మాటలేదు అన్న భావనే దానికి రాకుండా పెంచుతాను" ఆత్మవిశ్వాసం జాహ్నవి మాటల్లో.
పాపను తీసుకువచ్చి వాళ్ళకు అప్పగించింది ఆమె. జాహ్నవి పిలవగానే పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె చేతులలో వాలింది ఆ పాప, ఎటువంటి బెరుకు లేకుండా. పాపను తీసుకుని బయలుదేరారు జాహ్నవి, సుధీర్.
"వస్తామండి. మీరు చెప్పినట్లుగానే పాప మమ్మల్ని అమ్మ, నాన్నగా అంగీకరించింది. చాలా థాంక్సండి. ఇంతకూ మీ పేరు" పైకి లేస్తూ అడిగాడు సుధీర్.
"వనజ" చెప్పిందామె. జాహ్నవి చంక యెక్కి, వనజకు ముద్దుపెట్టి టాటా చెప్పింది ఆ పాప, ఇకనుంచి జాహ్నవి కూతురు. వాళ్ళు కనుమరుగయేంత వరకు అలా చెయ్యి ఊపుతూనే ఉన్నది వనజ. భగవంతుడు ఎక్కడో లేడు, మనసున్న ఆ తల్లి రూపంలో ఉన్నాడు. చల్లగా నూరేళ్ళు ఉండాలమ్మా నీలాంటి వాళ్ళు అనుకుంది వనజ.
****************
రవీంద్రభారతిలో అంతర్జాతీయ లఘుచిత్ర ప్రదర్శన జరుగుతున్నది. దివ్యాంగుల కష్టాలను తెలుపుతూ, వారిని చేరదీసి, వారిలోని సృజనాత్మకతను వెలికియతీసి, వారికి పదిమందిలో గుర్తింపును కలిగిస్తూ నడుపుతున్న ఒక సంస్థను ఇతివృత్తంగా సాగిన " మౌన వసంతం " చిత్రం అందరినీ ఆకట్టుకుని ప్రథమస్థానం పొందింది. అది తీసినది మన తెలుగమ్మాయి కావడం మూదావహం. ఈ రోజు ఆ అమ్మాయికి సన్మానం ఏర్పాటు చేశారు నిర్వాహకులు. వేదిక మీదకు ఆహ్వానించారు ఆ అమ్మాయిని, ఆమె తల్లిని. పట్టుమని పాతిక సంవత్సరాలు కూడ ఉన్నట్టు లేదు ఆమెకు. చూడ చక్కగా ఉంది ఆమె.
"ఈమె పేరు వసంత. మాటలు రాక పోయినా మనసుతో తీసిన చిత్రమిది. దీనికి తెరవెనుక ప్రోత్సాహం ఆమె తల్లి జాహ్నవి గారిది. అదేమిటో ఆమె మాటలలో విందాం" అంటూ వారిని పరిచయం చేసి, మైకును జాహ్నవికి ఇచ్చారు అధ్యక్షుల వారు.
"అందరికీ నమస్కారం. ఇది ఊహించి తీసిన చిత్రం కాదు. వాస్తవంగా జరుగుతున్న మా సంస్థ చరిత్ర.'లోపం దేవుడిచ్చిన శాపంకారాదు, మలుచుకుంటే అది వరం' అన్న నా కూతురి నమ్మకమే ఈ రోజు మేము నడుపుతున్న సంస్థకు ఆధారం. నాలుగు సంవత్సరాల క్రితం నా బిడ్డ తీసుకున్న నిర్ణయమిది. వాళ్ళ నాన్న గారు ఎంతో మంది పేదలను చదివించి, వారికొక దారి చూపారు. ఆయన ఆశయాలకు ఊపిరి పోస్తూ, మాటలు లేక మూగబోయిన తను, తనలాగ వైకల్యాలు కలిగి నిరాశతో కుములుతున్న కొందరికైనా చేయూతనిచ్చి, ఇతరుల జాలి మీద కాక తమ స్వశక్తి మీద ఆధారపడి నలుగురిలో తలెత్తుకు తిరిగేలా తయారుచేయాలనే సంకల్పంతో దీన్ని ప్రారంభించి, వారి నైపుణ్యాన్ని వెలికితీసే ఒక పాఠశాలగా మలచింది. తనలోని మేథస్సుతో ఒక లఘుచిత్రాన్ని నిర్మించి అంగవైకల్యమనేది తెలివితేటలకు అడ్డుగోడ కాదని నిరూపించింది. మా ఆశయానికి మీరిచ్చిన గుర్తింపు మరో మెట్టు కానున్నది. చిత్రాన్ని ఆదరించిన మీకు, జ్యూరి వారికి ధన్యవాదములు. ఇటువంటి చేయూత పాఠశాల ప్రతి గ్రామంలో ఏర్పడాలని, మనిషికి మనిషే చేయందించి, ఉచితాల కోసం ఆశపడక తమ కాళ్ళపై తాము నిలబడేలా ఎదగాలని కోరుతున్నాను" అంటూ ముగించింది జాహ్నవి.
వసంతను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మాటలు రాకపోతేనేమి, మాణిక్యమంటి బిడ్డ అనుకున్నారు. నువ్వు నాకు దేవుడిచ్చిన వరమమ్మా అంటూ వసంతను హత్తుకుంది జాహ్నవి.