సుదయ - చెన్నూరి సుదర్శన్

Sudaya

నేను పదవీ విరమణ పొంది దాదాపు పది సంవత్సరాలు కావస్తోంది. విశ్రాంత జీవనాన్ని సాహిత్య సేవలో భాగంగా.. పుస్తకాలు ప్రచురించుకోవడం, పాఠకులకు ఉచితంగా పంచిపెడుతూ.. తృప్తిగా కాలం గడుపుతున్నాను. మన శాయశక్తులా ఒకరికి సాయం చెయ్యడానికి కృషి చెయ్యాలి.. చేతగాకుంటే మిన్నకుండాలి. గాని ద్రోహం మాత్రం చెయ్యగూడదనేది నా సిద్దాంతం. ‘మన మంచితనమే మనల్ని కాపాడుతుంది’ అన్నట్టు మా పిల్లలూ ఉన్నతస్థాయిలో స్థిరడ్డారు. అది నేను రచించుకున్న జీవన ప్రణాళికల ఫలితం. నా శ్రీమతి అందించిన సహకారం.. మా పిల్లల క్రమశిక్షణ. అన్నిటికి మించి ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ ఇది జగమెరిగిన సత్యం.. అదీ మాకు సహకరిస్తోంది.

ఇంతలో ఫోన్ మ్రోగడంతో.. ఆలోచనలనుండి తేరుకున్నాను. అది అమెరికా నుండి మా అమ్మాయి వాట్సాప్ వీడియో కాల్. ఒకప్పుడు ఫోన్లో అమెరికా మాట్లాడాలంటే తల తాకట్టు పెట్టుకోవాల్సిన పరిస్థితి. కాని నేడు ఉచితంగా ఒకరినొకరు చూసుకుంటూ.. మాట్లాడుకుంటున్నాం. పెదవులపై చిరునవ్వు మొలిచింది. ఫోన్ ఆన్ చేశాను.

“తాతయ్యా.. అమ్మ కొట్టింది” ఏడ్చుకుంటూ మనుమరాలు వెన్నెల నా కూతురు మీద ఫిర్యాదు చేస్తోంది.

“ఏమ్మా.. ఎందుకు కొట్టింది. ఏం తప్పు చేశావురా” అంటూ బుజ్జగిస్తున్నట్లుగా అడిగాను.

“నో.. నేనేమీ తప్పు చెయ్య లేదు. నా గదిలో స్టోరీస్ బుక్ చదువుకుంటున్నా.. పిలిస్తే రావడం లేదు వై..” అని గట్టిగా కొట్టింది”

నేను అమెరికా వెళ్ళినప్పుడు తెలుగు నేర్పాను కాబట్టి ఆమాత్రం మాట్లాడగలుగోతోంది. వెన్నెల ముద్దు ముద్దు మాటలను శ్రద్ధగా వినసాగాను. చివరగా..

“ఐ టెల్ టు తాతయ్య అంటే.. టెల్, టెల్.. నో ఫియర్ అంటోంది” కళ్ళు పెదవిగా చేసుకుని.. రెండు చేతులు ఆరిందలా తిప్పుకుంటూ..

“వెన్నెలా! నేను మమ్మికి చెబుతాలేరా. ఇకముందు వెన్నెల చదువుకుంటుంటే డిస్ట్రబ్ చెయ్యొద్దని, కొట్టొద్దని చెబుతాను.

మా అమ్మ గూడా నన్ను బాల్యంలో అకారణంగా కొట్టింది. జ్ఞప్తికి రాగానే నీరసం ఆవహించింది. అలాగే వాలుకుర్చీలో మళ్ళీ వాలి పోయి కళ్ళు మూసుకున్నాను.

ఆనాటి బాల్యస్మృతులు కళ్ళకు కట్టినట్టుగా కదలాడసాగాయి.

*******************

“బాబూ..! సుదయా!.. సుదయా..!!” అంటూ అమ్మ వీధులన్నీ మారుమ్రోగేలా పిలుస్తోంది. ఆమె గొంతులోని ఆవేదన మా కాలనీ వాసుల హృదయాలను కదిలించి వేసింది. పిన్నా, పెద్దా కొందరు పరుగెత్తుకుంటూ వచ్చారు.

అందరి ముఖాలలో ఆందోళన.. నలుదిశలా నాకోసం చూడసాగారు. నా జాడ కానరాక పోయేసరికి..

“ఏమయ్యింది? పోలీసోల్ల అన్న.. ఎక్కడికి పొయిండు?” అంటూ వచ్చీ, రానీ మాటల మూట విప్పింది పక్కింటి చిట్టి చెల్లాయి. వచ్చిన వాళ్ళ ముఖాలలో అదే ప్రశ్న కనబడుతోంది. అమ్మ ఏమీ చెప్ప లేక గుండెలు బాదుకుంటోంది..

నేను రహస్యంగా దాక్కుని, ఏడ్పు ముఖంతో అంతా గమనిస్తూనే ఉన్నాను. ‘అమ్మకు మంచి శాస్తి జరుగుతోందని’ ఉడుక్కుంటున్నాను. లేకుంటే నన్ను అంతగా కొడుతుందా..! అని ఉక్రోషం ఎగిసి, ఎగిసి పడుతోంది. కళ్ళు, ముక్కు వెంట ధారలు.. ధారలు. గొంతు మూగపోయింది. మనసులోని ఆలోచనలు అలజడి చేస్తున్నాయి.

మా కాలనీలో నేను ‘రాముడు-మంచి బాలుడు’ అనే నానుడికి ప్రతీక. అంతా నన్నెంతగానో అభిమానిస్తారు. అప్పుడు నేను ఏడవ తరగతి చదువుతున్నాను. ఆటల్లోగానీ, చదువులోగానీ నా మాదిరిగా రాణించే వారెవరూ లేరంటే అతిశయోక్తిగాదు.

మా నాన్న పోలీసు కానిస్టేబుల్. దాంతో అంతా నన్ను ‘పోలీసోల్ల అన్న’ అని పిలవడం కద్దు. వాస్తవానికి నా పేరు సుధాంశు. అది మా తాతగారు పెట్టిన పేరు. ఆ పేరంటే నాకు ఎంతో ఇష్టం. కాని మా చిన్నమ్మ, మరి కొందరు బంధువులు నన్ను ‘సుదయా’ అని పిలుస్తుంటారు. చివరికి అమ్మ, నాన్న గూడా అలాగే.. నాన్నకు చెప్పడం నాకు చచ్చేంత భయం. కాని అమ్మతో అలా పిలవద్దమ్మా అంటే వినదు.

“నాకు నోరు తిరగదురా..” అని నవ్వుతుంది. “ఎలా పిలుస్తే ఏరా..! మనసులో ప్రేమ ఉండాలి గాని. ఆ దేవుణ్ణి ఎన్ని పేర్లతో పిలవడం లేదు?” అని నన్ను ఉబ్బిస్తుంది. ‘సుదయ’ అంటే మంచి దయగలవాదు కాబోలు అని సరిపెట్టుకుంటాను. మరి అలాంటి దయ గలవాడి మీద అంతగా ప్రేమే ఉంటే.. ఈ రోజు నన్నింతగా కొడుతుందా..! అని ఎదలో నుండి ఏడుపు తన్నుకు వస్తోంది.

“నా చేతులు పడిపోనూ.. ఈ పాడు చేతులతో కొడుకును చీపురుకట్ట తిరగేసి, చితక్కొట్టాను. ఎక్కడికి వెళ్ళాడో! ఏమో!.. సుదయా” అని గట్టిగా పిలుస్తూ.. ఏడువ సాగింది అమ్మ.

మామూలుగా కొట్టానని చెప్పొచ్చు గదా..! చీపురు కట్ట పేరెందుకని పళ్ళు, పిడికిళ్ళు బిగించాను.

“ఏడువకు పోలీసోల్ల పెద్దమ్మా.. ఏడువకు. కాసేపు చూద్దాం” అంటూ మా పక్కింటి ప్రభావతి ఊరడిస్తోంది. ఆమె ఓదార్పులోనూ ఆవేదన మిళితమై ఉంది.

దాదాపు అరగంట గడిచింది. అమ్మ దుఃఖమాగడం లేదు. నాకూ నీరసం వస్తోంది. అయినా బింకం సడల లేదు. నాకు పౌరుషమెక్కువ. నేను ఇంటా, బయటా ఒకరితో మాట పడకుండా ప్రవర్తిస్తాను. దానికి కారణం మా నాన్న.

అప్పుడు నేను మూడవ తరగతి చదువుతున్నాను. వరంగల్ గిర్మాజీపేట బొడ్రాయి వద్ద ఉండే వాళ్ళం. ఆరోజు ఆదివారం. మల్లమ్మ అనే మా అమ్మ స్నేహితురాలు ఉదయమే వచ్చింది. ఆమె ఒక అభాగ్యురాలు.

మల్లమ్మ వివాహం యాదగిరి గుట్ట మీద జరిగిందట. తిరుగు ప్రయాణంలో వారి వాహనం ప్రమాదానికి లోనై తల్లిదండ్రులను, భర్తనూ పోగొట్టుకుంది. ఒంటరిదై పోయింది. ఆమె నష్టజాతకురాలని బంధువులెవరూ చేరదీయ లేదు. తన కాళ్ళ మీద తాను బతకాలని వరంగల్ కూరగాయల మార్కెట్ యార్డులో కూలీగా చేరింది. దానికి దగ్గరలోనే ప్రసూతి ప్రభుత్వ వైద్యశాల ఉంది. వైద్యశాలకు వచ్చే వారి కోసం రోడ్డుకు మరో వైపు అద్దె గదులున్నాయి. అందులో చిన్న గది అద్దెకు తీసుకుని జీవనం కొనసాగిస్తోంది మల్లమ్మ. తీరిక సమయాలలో వైద్యశాలకు వచ్చే వారికి తన వంతు సేవలు అందిస్తూ.. నడి వయసుకు చేరుకుంది. మళ్ళీ పెళ్లి అనే మాట ఆమె దృష్టిలో నీళ్ళ మూట. అయినా ఈ కాలంలో అలాంటి వారిని ఉంపుడుగత్తెగా ఇష్టపడుతారేమో! గానీ.. పెళ్లికెవరు సాహసిస్తారు?

అమ్మకు నా తరువాత సంతానం కలుగ లేదు. డాక్టర్ల సలహా మేరకు అదే హాస్పిటల్లో చిన్న ఆపరేషన్ చేయించుకుంది. అప్పుడు మల్లమ్మ అమ్మకు చేసిన సేవలు వెలకట్టలేనివి. అలా అమ్మకు చేరువయ్యింది. వారి స్నేహ బంధానికి మరో కారణం నేను. నేను అమ్మను చూడ్డానికి వెళ్ళినప్పుడల్లా.. నన్ను విడిచి పెట్టేది కాదు. రక, రకాల పండ్లు కొనిచ్చేది. పేరు అమ్మకు.. తినిపించేది నాకు. నన్ను ‘బాబూ’ అని ఎంతో ఆప్యాయంగా పిలిచేది. ఏమాత్రం సమయం చిక్కినా నన్ను చూడ్డానికి మా ఇంటికి వచ్చేది.

మల్లమ్మ మాతో చనువుగా ఉండడం నాన్నకు నచ్చేది కాదు. ‘ఇటేటు రమ్మంటే ఇల్లంతా నాదే..’ అనే రకాలు. పైగా మన కుటుంబపరువు పోతుందని పోలీసు భాషలో మాట్లాడే వాడు.

ఈ రోజు నాన్న టూర్ వెళ్ళాడని తెలిసినట్టుంది. అందుకే వచ్చిందనుకున్నాను.

“బాబూ.. మనం సినిమాకు వెళ్దాం..” అంటూ లాలనగా నన్ను దగ్గరకు తీసుకుంది. “ ‘మాబాబు’ సినిమా చాలా బాగుందట”

“అమ్మో! నేను రాను. నాన్నకు చెప్పకుండానా!. నాన్నకు సినిమాలంటే పిచ్చి కోపం. నేను రాను..” అంటూ కళ్ళు పెద్దవిగా చేసి తల అడ్డంగా తిప్పాను.

“ఫరవా లేదు వెళ్ళరా.. నాన్నకెలా తెలుస్తుంది. రేపు గాని రాడు నాన్న. మనం చెబితేనే గదా నాన్నకు తెలిసేది. నేను చెప్పను. నువ్వూ చెప్పొద్దు” అంటూ మల్లమ్మకు వత్తాసు పలికింది అమ్మ.

అమ్మ అనుమతి ఇచ్చాక నాకేం భయమని మల్లమ్మతో రామా టాకీసు వెళ్లాను. అక్కినేని నాగేశ్వర రావు, సావిత్రి, రేలంగి, రమణారెడ్డి, గుమ్మడి, కన్నాంబ తదితరులు నటించిన సినిమా అది. చాలా బాగుంది. నేను పూర్తిగా సినిమాలో లీనమై చివరి సీనులో ఏడ్వసాగాను. మల్లమ్మ పరిస్థితీ నాలాగే ఉంది. సినిమా పూర్తి కాగానే ఇద్దరం కళ్ళు తుడ్చుకుంటూ.. హాల్లో నుండి బయట పడ్డాం.

గేటు వద్ద ‘సోడా-లెమన్’ బండి కనబడింది. నాకు ‘లెమన్’ అంటే చాలా ఇష్టమని మల్లమ్మకు తెలుసు.. నేను అడుగక ముందే కొనిచ్చింది. తృప్తిగా తాగాను. నన్ను ఇంటి వద్ద దింపి వెళ్లి పోయింది మల్లమ్మ.

ఒక గంట తరువాత అమ్మా, నేను భోజనం చేద్దామనుకునే సరికి నాన్న వచ్చాడు. ఎందుకో నా గుండె ఝల్లుమంది. అయినా తమాయించుకున్నాను.

“సుదయా.. ఈ రోజు ఆదివారం కదా..! చదువుకున్నావా? లేక ఎటైనా తిరుగ పోయావా?” అంటూ ఎంతో నింపాదిగా అడిగాడు నాన్న.

నాన్న వెనుకాల నిలబడ్డ అమ్మ చదువుకున్నా అని చెప్పు.. అని సైగలు చేస్తోంది.

“ఉదయమే హోమ్ వర్క్ చేసుకున్నాను. మధ్యాహ్నం చదువుకున్నాను. ఇంతకు ముందే అలా కాసేపు బయటికి వెళ్లి గోటికాయలు ఆడుకొని వచ్చాను” అన్నాను. అబద్ధ మాడినా.. గోడ కట్టినట్టు ఉండాలని నా స్నేహితుని సిద్ధాంతాన్ని అనుసరించాను.

నాన్న లాఠీతో నా పిరుదులపై లాగి ఛెళ్ళుమని కొట్టాడు. నేనూహించని పరిణామానికి ఝల్లున వణకి పోయి.. కెవ్వుమని అరిచాను. నిక్కరులో మూత్రం పడింది. అమ్మ నాన్నను తోసేసి నన్ను గబుక్కున తన గుండెలకు హత్తుకుంది.

“కొడుకును ఎంత దెబ్బ కొట్టావు. నీకు చేతులెలా వచ్చాయి?” అంటూ అమ్మ కయ్యిన నాన్న మీదకు లేచింది. అమ్మ కళ్ళుల్లో నీళ్ళు జలపాతాలయ్యాయి.

“తాగిన లెమన్ కిందకు దిగాలనే కొట్టాను. ఇంకోసారి అబద్ధమాడడు” అన్నాడు ఉగ్రనరసింహావతారంలో నాన్న. “మల్లమ్మతో సినిమాకు వెళ్లి, చదువుకున్నానని అబద్ధం చెబుతాడా?” లాఠీ చేతిలో ఇంకా నాట్యమాడుతూనే ఉంది. అమ్మ లాఠీ లాక్కుని దూరంగా విసిరేసింది.

“నువ్వు సినిమాలు చూడవు. మరెవ్వరినీ చూడనివ్వవు. చిన్న పిల్లలు చూడాల్సిన సినిమా అని మల్లమ్మ బతిమాలి సినిమాకు తీసుకెళ్ళింది. సుదయ నాన్నకు చెప్పకుండా రానన్నాడు. నేనే నాన్నకు చెప్పొద్దని, నేనూ చెప్పనని నచ్చజెప్పి పంపాను. అది నాతప్పే.. సుదయ నా మూలాను ఎన్నడు లేనిది ఈ రోజు నీ చేతి దెబ్బ తినాల్సి వచ్చింది” అంటూ నన్ను ఓదార్చుతూ.. బాత్ రూంకు తీసుకు వెళ్ళింది. నా ఏడుపు రాగం ఆగిపోలేదు.

ఆ రాత్రి అమ్మ ఎంత బతిమాలినా అన్నం తినలేదు.

“కొడుక్కు కొవ్వెక్కింది. కడుపు మాడుతేనే కొవ్వు కరుగుతుంది. నువ్వు బతిమాలకు” అంటూ అమ్మ మీదకు లేచాడు నాన్న.

ఆ రాత్రి నేను నిద్దుర పోలేదు. కడుపులో ఎలుకలు పరుగెత్తడంతో బాటు నా ఆలోచనలు నన్ను నిద్దుర పోనివ్వలేదు. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ.. నన్ను ఎవరూ చూడలేదని అనుకుంటుందట. అలాగే నేనూ కళ్ళు మూసుకుని లెమన్ తాగి ఎవరూ చూడలేదనుకున్నాను. కాని నాన్న చూశాడు. నేను నిజం చెబితే నాన్న కోపగించుకునే వాడేమో! గాని కొట్టక పోయే వాడు. నేను అబద్ధమాడ్డం.. నాన్నకు బాగా కోపం వచ్చింది. నన్నెప్పుడూ కొట్ట లేదు.. మొదటి సారిగా బాగా గుర్తుండి పోయేలా కొట్టాడు. నాకీ శాస్తి జరగాల్సిందే.. ఇది నా తప్పే. మంచం కిందకు తొంగి ఇక ముందు ఎప్పుడూ నిజమే చెప్పాలి.. ఎవరితోనూ దెబ్బలు కాదు గదా.. మాట గూడా పడగూడదని మనసులో ప్రతిజ్ఞ చేసుకున్నాను.

మరి ఈ రోజు ఏమిటి? ఇలా జరిగింది. నన్ను నిజం చెప్పనివ్వకుండానే.. అమ్మ కొట్టింది. అని మనసులోకి రాగానే మళ్ళీ దుఃఖం పొర్లుకు వస్తోంది.. ఇంతలో నాన్న వచ్చిన అలికిడి అయ్యింది. నా ఆలోచనలు ఆగి పోయి ప్రాణం బిగపట్టి చూడసాగాను..

నాన్న రాగానే అమ్మ ఏడుపు తారాస్థాయికి చేరింది. నాన్న సైకిలుకు స్టాండు వేసి కంగారుగా అమ్మ వద్దకు వడి, వడిగా వచ్చాడు.

“పోలీసోల్ల అన్నను కొట్టింది.. అన్న ఎక్కడికో పారి పోయాడు” అంటూ ప్రభావతి నాన్నకు విషయం చెప్పింది.

“ఎందుకు కొట్టావు” అంటూ నాన్న తీవ్రస్థాయిలో అడిగాడు.

అమ్మ భయపడి పోయింది. ఏం చెప్పాలో! ఎలా చెప్పాలో! సందిగ్ధంలో పడింది.

“వాడు సాయంత్రమనగా వెళ్లి ఇంతకు ముందే వచ్చాడు. ఇంత రాత్రి దాకా ఏరాచకార్యం వెలుగపెట్టడానికి వెళ్ళాడో! అని కోపంతో కొట్టాను” అంటూ కడకొంగుతో కన్నీరు తుడ్చుకోసాగింది.

“ఎక్కడికి వెళ్ళాడో చెప్పాడా!.. అయినా ఇప్పుడు ఏమంత రాత్రి అయ్యిందని. చలికాలం ఆరు గంటలకే చీకటి పడుతుంది”

“నేను అడుగ లేదు”

“అడక్కుండానే కొడతావా?.. సుదయ అబద్దాలాడడని మనకు తెలుసుకదా.. అడగాల్సింది. అయినా ఎక్కడికి పోడులే.. ఇంట్లోనే ఎక్కడో దాక్కొని ఉంటాడు” అంటూ పోలీసు బుద్ధికి పదును పెట్టాడు.

నాన్న నేరుగా ఇంట్లోకి రావడం చూసి నేను మంచం కింద దాక్కున్నాను. అయినా నాన్నకు దొరికి పోయాను. నాన్న నన్ను చూడగానే మంచం కింద నుండి బయటకు వచ్చాను. అమ్మ గబుక్కున తన గుండెలకు హత్తుకుంది. అమ్మ కళ్ళు వర్షించడమాగ లేదు.

“ఎక్కడికి వెళ్లావు బాబూ” అంటూ నాన్న బుజ్జగిస్తూ.. అడిగాడు.

“నేను లైబ్రెరీకి వెళ్లాను. చందమామ కథల పుస్తకంలో కథలన్నీ చదివే సరికి ఆలస్యమయ్యింది” అంటూంటే దుఃఖం తన్నుకు వచ్చింది. గట్టిగా ఏడ్చేశాను. అమ్మ తన హృదయానికి మరింత గట్టిగా అడుముకుంది.

“సుదయ చూడు చక్కగా చదువుకోడానికి గ్రంథాలయానికి వెళ్ళాడు. నువ్వేమో! అడక్కుండానే కొట్టావు. తప్పుకదా..!” అంటూ సుతి మెత్తగా అమ్మను మందలించాడు. అమ్మ సుతారముగా లెంపలు వేసుకుంది.

నాన్న ఫ్రెషపై వంటిట్లోకి వెళ్తూ.. “ సుదయా.. రా భోంచేద్దాం” అని పిలిచాడు.

“నేను రాను. నాకు ఆకలిగా లేదు” అని విసురుగా సమాధానమిచ్చాను.

అమ్మ వెంటనే.. “సుదయా.. నీకాల్లు మొక్కుతరా..” అంటూ నా కాళ్ళ మీద చెయ్యి వెయ్య బోయింది. నేను చటుక్కున వెనక్కి జరిగి.. “అమ్మా..!” అని గట్టిగ కేక వేస్తూ.. అమ్మ కాళ్ళమీద బోర్లా పడిపోయాను.

అమ్మ నన్ను కొట్టిందంటే.. నా మీద ప్రేమ లేక గాదు. ఆమె లోని భయం.. విచక్షణ రహితం చేసి నన్ను కొట్టించింది. నేను ఒక్కగానొక్క కొడుకును. ఎల్లప్పుడూ ఆమె కనుసన్నల్లో ఉండాలనే కోరిక తప్పు గాదు. నేను అమ్మకు ముందే చెప్పాల్సింది. లైబ్రరీకి వెళ్తున్నాను.. వచ్చేసరికి కాస్త ఆలస్యమవుతుందని. అంతా నాతప్పే.. అని నా మదిలోకి రాగానే కళ్ళు తుడ్చుకుంటూ.. అమ్మను తీసుకొని వంటిట్లోకి దారి తీశాను.

****************

“ఏమండీ.. భోజనం..!” అంటూసైగలు చేసుకుంటూ నా సతీమణి పిలిచే సరికి ఈ లోకానికి వచ్చాను.

ఎవరి తప్పైనా.. అది నాతప్పే అని సర్దుకుపోవడం.. నాకిప్పటికీ ఆ అలవాటు పోలేదు.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు