ఆరోజు జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా నాపదవీ విరమణ..
ఆఫీసు సీనియర్ అసిస్టెంట్ నాముందు ఫైల్ పెట్టాడు. హాజరు పట్టికలో సంతకం తీసుకుని.. నేరుగా గీత గీసి రిమార్క్స్ కాలంలో పదవీ విరమణ అనే పదాన్ని వ్రాస్తుంటే.. అతని కళ్ళు జలపాతాలయ్యాయి. రెండు కన్నీటి చుక్కలు రిజిస్టర్‌పై పడగానే.. కంగారు పడుతూ కర్చీఫ్‌తో కళ్ళు అద్దుకున్నాడు. నా కళ్ళూ చెమ్మగిల్లాయి. నాకు ఎదురుగా చార్జి తీసుకునేందుకు కూర్చున్న సీనియర్ లెక్చరర్ చంద్రశేఖర్ సైతం కన్నీళ్లు తుడ్చుకోవడం గమనించాను.
నిజమే.. తరగని విద్యార్థి సంపదను వదులుకోవడం.. తలుచుకున్న కొద్దీ గుండె చెరువై పోతోంది. నేను కలలుగని సాధించిన అత్యంత శ్రేష్టమైన ఉపాధ్యాయ వృత్తికి దూరం కాబోతున్నాననే బాధ ఒక ప్రక్క ఉన్నా.. మరో ప్రక్క ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా, శ్వాస ఉన్నంత వరకు విద్యాదానం చెయ్యాలనే నా ధృఢ సంకల్పం, కాస్త ఉపశమనం కలిగిస్తోంది.
చంద్రశేఖర్ ఫుల్అడిషనల్ చార్జి తీసుకోగానే లేచి కరచాలనం చేస్తూ..
“సార్.. మీ అభ్యుదయపు అడుగు జాడల్లో నడుస్తానని ప్రమాణం చేస్తున్నాను. మీరు కాలేజీలకు చేసిన సేవలు చరిత్రలో శాశ్వతంగా నిలిచి పోతాయి. మీ పర్సు నుండి డబ్బు ఖర్చుపెట్టి కళాశాల గ్రంధాలయానికి విలువైన పుస్తకాలు తెప్పించారు. ఖాళీ సమయాలలో పిల్లలు బయట తిరుగ కుండా.. మన గ్రంధాలయంలోనే పుస్తక పఠనంపై మక్కువ కలిగేలా పిల్లల మనస్తత్వత్వాన్ని తీర్చి దిద్దిన శాస్త్రవేత్తలు మీరు..” అంటూ పొగడసాగాడు.
ఇంతలో ఆఫీసు సహాయకారి వచ్చి “సార్.. పిల్లలు మీ కోసం చూస్తున్నారు. ముందుగా మీరు ఒక విద్యార్థికి భోజనం వడ్డిస్తే మిగతా పని మేము చూసుకుంటాం” అంటూ దీనంగా అర్థించాడు.
కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాలేవీ లేవు. అధ్యాపకులతో సహా.. అంతా టిఫిన్ బాక్సులు తెచ్చుకోవడం పరిపాటి. ఈరోజు నేను కళాశాల ప్రాంగణంలోనే వంటలు చేయించాను.
చంద్రశేఖర్, నేను కలిసి కళాశాల మైదానంలోకి వెళ్లాం. పిల్లలంతా క్రమశిక్షణగా నిలబడ్డారు. వారి చేతుల్లో విస్తారాకులు.. ముఖాలలో విషాదఛాయలు.
మొదటగా ఒక అమ్మాయికి, మరొక అబ్బాయికి వడ్డించాను. ఇక భోజనం చెయ్యండని అనుమతించి.. చంద్రశేఖర్‌తో కలిసి తిరిగి ఆఫీసుకు బయలుదేరాను.
కాలేజీ గేటు ముందు చిన్న వ్యాను ఆగడం.. అందులో నుండి ఎవరో కొందరు దిగుతూండడం.. చూసి ఆగిపోయాం. అప్పుడే ముఖ్య అతిథులు వచ్చే సమయం కాదని చేతి వాచిలో సమయం చూస్తుండగా..
“నమస్కారం సర్..” అంటూ ముక్తకంఠంగా అన్నారంతా.. నేను అన్యమనస్కంగా నమస్కరిస్తూ.. వారిని పోల్చుకోసాగాను. చేతి కర్ర పట్టుకుని నిలబడ్డ భాస్కర్‌ను చూసి గుర్తు పట్టాను. అతను పటాన్చెరు కాలేజీలో నా విద్యార్థి.
“సర్.. మీరు పదవీ విరమణ చేస్తున్నారని తెలిసి మేమంతా వచ్చాం. మీ విద్యార్థులం..” అంటూ భాస్కర్ వంగి నాపాదాలనంటాడు.
నేను వద్దంటూ.. లేపి ఆనందంగా ఆలింగనం చేసుకున్నాను. భాస్కర్ కళ్ళల్లో ఆనంద భాష్పాలు. నా పూర్వపు విద్యార్థులనందరినీ పరిచయం చేశాడు.
ముందుగా భోజనాలు చెయ్యండని సాదరంగా ఆహ్వానించాను.
దాదాపు రెండు గంటల ప్రాంతంలో చంద్రశేఖర్ అద్యక్షతన నా వీడ్కోలు సమావేశం ఆరంభమయ్యింది.
ముఖ్య అతిథి, అతిధులను, నన్నూ. ఇంకా నా పూర్వ విద్యార్థులలో నుండి భాస్కర్‌ను, సూర్యాన్ని వేదిక పైకి ఆహ్వానించారు. ముందుగా చంద్రశేఖర్ నాటి సభాసమావేశ విశేషంతో బాటు నాగురించి కొంత సభకు పరిచయం చేస్తూ.. “సగటు ఉపాధ్యాయుడు పాఠం చెబుతాడు. మంచి మాస్టారు వివరిస్తాడు. ఉత్తమ ఉపాధ్యాయుడు విశదీకరిస్తాడు. అత్యుత్తమ ఉపాధ్యాయుడు స్ఫూర్తినిస్తాడు. అలా పలువురి హృదయాలలో స్ఫూర్తి మూర్తిగా నిలిచిన మన ప్రకాశం మాస్టారు గురించి మనకు తెలియని స్ఫూర్తిదాయక విషయాలెన్నో చెప్పడానికి వారి పూర్వపు విద్యార్థులు వచ్చారు. ముందుగా సూర్యం గారు మాట్లాడుతారు” అంటూ సూర్యం వంక ఆహ్వాన పూర్వకంగా చూశాడు చంద్రశేఖర్.
సూర్యం మైకు ముందుకు రావడంతోనే.. నా మీద ప్రశంసలు ఝల్లు కురిపించసాగాడు.. అతని మాటలు నన్ను గతస్మృతుల్లోకి లాక్కు వెళ్ళసాగాయి.
***********************
రంగారెడ్డి జిల్లాలో ఒక చిన్న మండలం.. మర్పల్లి జూనియర్ కాలేజీలో జాయినై దాదాపు వారం రోజులవుతోంది.
ఆరోజు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు గణితశాస్త్రంలోని ‘ప్రస్తారాలు సంయోగాలు’ అనే పాఠ్యాంశంలోని కొన్ని సమస్యలు బోధించసాగాను.
ఇంతలో ఒక పెద్దాయన తరగతిలోకి అనుమతి తీసుకోకుండా రావడం చూసి “ఎవరు కావాలి” అని అడిగాను.
“ఎవరెందుకు సార్.. నాది ఇదే క్లాసు” అంటూ నిర్లక్ష్యంగా చూస్తూ వెళ్ళి, వెనుక బెంచీలో కూర్చున్నాడు.
“ఏం పేరు బాబూ” అని వినయాన్ని ప్రదర్శిస్తూ.. “తమరు ఏమీ అనుకోవద్దు. కాస్త వయసు మీరినట్టుగా ఉంటే.. ఎవరో ఒక పేరెంట్ తన పిల్లాడి కోసం వచ్చాడేమోననుకున్నా..”
“నా పేరు సూర్యం సార్. నేను పేరెంట్నే” వెంటనే జవాబిచ్చాడు.
పిల్లలంతా కిసుక్కున నవ్వారు. నేను తీక్షణంగా ఒక చూపు చూసి, చల్లని దృష్టిని సూర్యం వంక తిప్పేను.
నాకు ఆశ్చర్యమేసింది. అలా నిర్భయంగా.. సూటిగా సూర్యం సమాధానమివ్వడం.. నాకు నచ్చింది. వెంటనే.. ఆంగ్లంలో ‘SURYAM’ అనే పదం లోని అక్షరాలను ఉపయోగిస్తూ.. డిక్షనరీ క్రమంలో వ్రాస్తే అది ఎన్నవ పదము అవుతుందో కనుక్కోండని సమస్య ఇచ్చాను. పిల్లలంతా సమస్య సాధనలో మునిగి పోయారు. కాని సూర్యం పక్క వాని నోట్స్ చూస్తున్నాడు.. దగ్గరికి వెళ్లాను. నన్ను చూస్తూనే సూర్యం లేచి నిలబడి బిక్క ముఖం వేశాడు.
“ఈ పాఠం మొదలు పెట్టి నాలుగు రోజులు కావస్తోంది. నీవు ఈ రోజు ప్రత్యక్షమయ్యావు. ఇలా అయితే ఎలా పాసవుతావు” రోజూ రావాలి అన్నట్టుగా హితవు పలికాను.
సూర్యం వెకిలిగా నవ్వుతూ.. “మీరు కొత్తగా వచ్చారు కదా సార్.. మీకింకా తెలియదు. ఇక్కడ ఫుల్ మాస్ కాపీ. లెక్చరర్లే.. నకల్లందిస్తారు” అన్నాడు. పిల్లలంతా మరోమారు కుండలు బ్రద్ధలైనట్టు నవ్వారు. నేనింకా విషయాన్ని పొడిగించకుండా మౌనంగా బోర్డు వైపు కదిలాను.
ఆ మరునాడు ఆదివారం కావడంతో.. నేను సిటీకి ట్రైన్లో బయలు దేరాను. ట్రైన్ లయబద్ధంగా వేగాన్ని పుంజుకుంది. దానికనుగుణంగా.. ఒక పాట వినరావడం.. అది విన్న గొంతులా అనిపించడంతో.. ఆశ్చర్యంగా నాలుగడుగులు వేసి చూసి మరింత విస్మయానికి లోనయ్యాను.
సూర్యం ఎర్ర కర్చీఫ్ ఊపుకుంటూ.. విప్లవగీతం ఆలపిస్తున్నాడు. మరి కొందరు విద్యార్థులు సూర్యానికి వంత పాడుతూ.. ఉద్వేగ పరుస్తున్నారు. సూర్యం ఆలోచనలు అర్థమయ్యాయి.
సోమవారం తిరిగి అదే ట్రైన్లో మర్పల్లికి బయలు దేరాను. గొల్లగూడ స్టేషన్లో సూర్యం నా భోగీలో ఎక్కడం గమనించి పిలిచాను.
“సూర్యం.. మొన్న విప్లవ గీతం చాలా బాగా పాడావు” అన్నాను మెప్పుకోలుగా..
“సార్ మీరు విన్నారా!” అంటూ ఆశ్చర్యంగా అడిగాడు. ఔనన్నట్లుగా తలూపుతూ..
“అలాంటి భావాలు కలిగిన వాడివి మన కాలేజీని బాగుపర్చాలనే ఆలోచన లేదా?” అంటూ ప్రశ్నించాను.
“ఉంది సార్.. కాని ప్రిన్సిపాల్‌తో సహ లెక్చరర్లంతా దొంగలు. మా స్కాలర్షిప్ డబ్బులు, కాలేజీలో అడ్మిషన్స్ లేని వారి స్కాలర్షిప్లు ఆబగా తింటారు. నా సంగతి తెలిసి, నా డబ్బులు తీసుకోరు” అంటుంటే గొంతు పొర మారింది. బ్యాగులో నుండి బాటిల్ తీసుకుని, కొన్ని మంచినీళ్ళు త్రాగి తిరిగి చెప్పసాగాడు. “పరీక్షల్లో కాపీలు అందిస్తామని పిల్లల దగ్గర డబ్బులూ వసూలు చేస్తారు” అంటూ తల దించుకున్నాడు.
నాకు మర్పల్లి కాలేజీ గురించి పూర్తిగా అవగహనమయ్యింది. సూర్యం వాలకం చూస్తూ..
“చూడు సూర్యం.. తప్పుడు పనులు చేసే వారే తల దించుకుంటారు. నీకు గూడా వాటా ఉందని తెలుస్తోంది. మరి నీ విప్లవగీతాలకు అర్థముందా! ఎవరి బాగు కోసం అడవులు పట్టాలి? ఊళ్ళో ఉండుకుంటూ.. ప్రజల్లో మమేకమై వారిలో చైతన్యం తీసుకు రావాలి” అంటూ గత కాలేజీలలో నా అనుభవాలను చెప్పాను. సూర్యం నా మాటలకు ప్రభావితుడయ్యాడు.
“సార్.. మీరు చెప్పినట్టు నడుచుకుంటాను” అంటూ నాకు మద్దతుగా తల మీద అరచేయి పెట్టుకుని దేవుని మీద ప్రమాణం చేశాడు.
సూర్యం ఇంటర్ పూర్తయ్యేలోగా కాలేజీ వ్యవస్థ పూర్తిగా మారిపోయింది..
సభలో చప్పట్లతో.. ఈ లోకానికి వచ్చాను.
*************************
“అరణ్యంలో కలువాలనుకున్న నేను, ప్రకాశం సార్ మూలాన జనారణ్యంలోనే ఉంటూ.. మరో పది మందిని దేశ ప్రగతి వైపు మళ్లించాలని.. నేనూ ఉపాధ్యాయ వృత్తినే చేపట్టాను. వారి అభ్యుదయ భావాలనే అనుసరిస్తున్నాను” అనగానే సభలో మరో మారు కరతాళధ్వనులు మ్రోగాయి.
తరువాత కొందరు పిల్లలు, మా అధ్యాక బృందం, మరి కొందరు అతిథులు మాట్లాడారు.
అనంతరం చంద్రశేఖర్ “మరో పూర్వవిద్యార్థి భాస్కర్ గారు మాట్లాడుతారు” అంటూ ప్రకటిస్తూ.. సాదరంగా ఆహ్వానించాడు.
భాస్కర్ చిన్న చేతికర్ర సాయంతో మైకు ముందుకు వచ్చి నన్ను చూసుకుంటూ.. రెండు చేతులా నమస్కరించాడు.
ఉపన్యాసం సంభోదనతో ప్రారంభించాడు. ముందుగా తనకు తాను పరిచయం చేసుకుంటూ.. ప్రస్తుతం తాను ‘టి-మొబైల్స్’ కంపెనీలో సీనియర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నట్లు చెప్పాడు. నేనెంతగానో పొంగి పోయాను.
“ప్రకాశం సార్ మర్పల్లి నుండి మా కాలేజీ పటాన్ చెరులో జాయినయ్యాడని తెలిసి విద్యార్ధులమంతా ఎంతగానో సంతోషించాం. సార్ కాలేజీలో పాఠాలతో బాటు, వారు విద్యార్థుల జీవన గమనాలను సరి చేస్తారని.. అభ్యుదయ భావాలు గలవారని.. ఎందరికో మార్గదర్శకులని విన్నాం.. కాని అది ప్రత్యక్షంగా చూసి అనుభవించిన వాణ్ణి నేను” అటుంటే భాస్కర్ గొంతు జీర పోయింది.. కళ్ళు చెమ్మగిల్లాయి. కర్చీఫ్‌తో కళ్ళు ఒత్తుకుంటుంటే.. నేను మంచి నీళ్ళ గ్లాసు అందించాను. ఒక గుక్క త్రాగి గొంతు సవరించుకుంటూ.. తిరిగి ఉపన్యసించసాగాడు.
“ఆ సమయంలో నేను స్వతహాగా నడవ లేని పరిస్థితి నాది. మూడు చక్రాల రిక్షాలో చేతి పెడల్ సాయంతో నడిపించుకుంటూ కాలేజీకి వచ్చే వాణ్ణి. నాకు లెక్కలంటే మహా ప్రీతి. ప్రకాశం సార్ మూలాన నేను లెక్కల్లో ఆరితేరాను. ప్రకాశం సార్ పరీక్షల విభాగానికి ఇంచార్జ్. మా కాలేజీకి వచ్చాక మొదటిసారిగా ‘ప్రిఫైనల్ పరీక్షలు’ జరిపించాడు.
ఆరోజు చివరి పరీక్ష వ్రాశాక హాల్లోనే ఉండి పోయాను. ప్రకాశం సార్ గాబరాగా నా వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చి ఆరా తీశాడు.
సార్.. నా రిక్షా చెడిపోయింది. మా అన్నయ్య పొద్దున ఆటోలో తీసుకు వచ్చి హాల్లో దించి వెళ్ళాడు. అన్నయ్య వస్తాడో లేదో తెలియదు. మళ్ళీ ఇంటికి ఆటోలో వెళ్దామంటే డబ్బులు లేవు సార్.. అంటూ ఏడ్చాను.
ప్రకాశం సార్ చొరవ తీసుకుని ఆప్యాయంగా అడుగుతుంటే.. నాకు చనిపోయిన మానాన్న గుర్తుకు వచ్చాడు. మా కుటుంబ వ్యవహారాలూ.. నాకు మా కుటుంబంలో జరిగే అవమానాలు అన్నీ ఏకరువు పెట్టాను.
ఆపూటకు ప్రకాశం సార్ నన్ను ఆటోలో మా ఇంట్లో దించివెళ్ళాడు.
ఆమరుసటి రోజు నుండి సంక్రాంతి సెలవులు. ప్రకాశం సార్ ప్రొద్దున్నే మా ఇంటికి వచ్చి మా అన్నయ్యతో వివరంగా చెప్పి నన్ను నిమ్స్ హాస్పిటల్లో పనిచేసే ఫిజియో తెరెపిస్ట్ శెట్టిగారింటికి తీసుకు వెళ్ళాడు. అతను ఇంట్లోనే స్వంతంగా మరో ఇద్దరు వర్కర్స్ సహాయకారులతో.. కృత్రిమ కాళ్ళు తయారు చేయడం ఒక కుటీర పరిశ్రమలా పెట్టుకున్నాడు. పోలియో వచ్చిన వారికి స్ప్రింగ్‌లతో వ్యాయామాలు చేయించే వాడు.
శెట్టిగారు నన్ను క్షుణ్ణంగా పరీక్షించి నడిపించగలననే భరోసా యిచ్చాడు. ముందుగా నిమ్స్ హాస్పిటల్లో నా మోకాలి వెనుక భాగంలో చిన్న ఆపరేషన్స్ చేయించాడు. మా ఇంటి నుండి ఎవరూ రాలేదు. ప్రకాశం సార్ సకల సపర్యలూ చేశాడు. ఆపరేషన్ గాయాలు మానాక శెట్టిగారు నారెండు కాళ్ళకు కాలిపర్స్ చేసిచ్చాడు. వ్యాయామం అనంతరం అవి కట్టుకుని వాకర్ సాయంతో నిలబడే ప్రయత్నం చేయించే వాడు. ప్రకాశం సార్ మదిలో ఎలాగైనా నన్ను నడిపించాలనే తాపత్రయం నాలో మరింత పట్టుదల పెరిగింది.
ప్రథమ సంవత్సరం పరీక్షలు పూర్తయ్యాయి. వేసవి సెలవులు వచ్చాయి. వానిని వృధా చెయ్యకుండా శ్రమించాలని తిరిగి శెట్టిగారి దగ్గరకు వెళ్ళసాగాం.
కొద్ది రోజుల్లోనే వాకర్ సాయంతో నడవగలిగాను. ప్రకాశం సార్ స్ప్రింగులు, ఒక కొత్త వాకర్ కొనిచ్చాడు. ఇంట్లో స్వయంగా వ్యాయామాలు చెయ్యాలని ప్రోత్సహించాడు.
వేసవి సెలవుల అనంతరం నేను స్వయంగా కాలేజీకి కర్ర సాయంతో నడుచుకుంటూ రావడం.. మా కాలేజీ సాంతం విస్తుపోయింది. ఇది ఎవరూ కలలో గూడా ఉహించని వాస్తవం” అంటూ పక్కకున్న కుర్చీలో కూర్చోని, తన కాళ్ళకున్న కాలిపర్స్ విప్పి సభకు చూపించాడు భాస్కర్.
సభ యావత్తు లిప్తకాలం నిర్ఘాంత పోయింది. వెనువెంటనే నాశ్రమను శ్లాఘిస్తూ చప్పట్లు మిన్నంటాయి.