బాగా చీకటి పడింది. ఆ ఊర్లో అక్కడక్కడ వీధి లైట్లు మలుగుతున్నాయి. కర్రెన్న గొర్రెలు తోలుకుంటూ ఇంటి ముఖం పట్టాడు.ఆకాశం మబ్బు పట్టి ఉంది. వానొస్తే ఒక ప్రక్క ఇల్లు కారుతుంది. ఎప్పటికప్పుడు బాగు చేయాలని అనుకుంటాడు కానీ డబ్బు సమయానికి ఉండదు. ఈ సారి ఎలాగైనా బాగు చేయాలి. ఆ భూషయ్య ని డబ్బు అడిగి నెల నెలా జమ కడతా అనుకుని ఇల్లు చేరాడు.
గొర్రెలు అరుచుకుంటూ రావడంతో మల్లమ్మ "అబ్బా" అంటూ మంచంపై నుంచి లేవడానికి ప్రయత్నం చేసింది. "అబ్బా" అంటూ కూర్చొని నడుం పట్టుకుంది. తొమ్మిది నెలల నిండాయి. రేపో మాపో కాన్పు కు సిద్ధంగా ఉంది."ఇదిగో" అంటూ కర్రెన్న పై కేక వేసింది.
"ఏమిటే వస్తున్న" అన్నాడు టవల్ భుజంపై వేసుకుని. కష్టంగా పైకి లేవబోతుంటే " ఏమైంది నొప్పులు వస్తున్నాయా ! ఆ రాజమ్మను పిలుచుకుని వస్తాను" అన్నాడు. మల్లమ్మ "ఆ,ఆ అని మళ్ళీ పడుకుంది. "అబ్బా" అంటోంది. "అయ్యో ఉండు రాజమ్మను పిలుచుకు వస్తాను" అని వెళ్ళాడు.
ఆ ఊరిలో రాజమ్మ ఒక్కటే ఎవరి దగ్గరికి అయిన కాన్పు చేసి వారు ఇచ్చింది తీసుకుని వెళుతుంది. పేద వారి దగ్గర ఏమి పుచ్చుకోదు. కర్రెన్న దబ దబ తలుపు తట్టాడు. అప్పుడే ఆకాశంలో మెరుపు మెరసి ఉరుములు ఉరిమాయి. వాన మొదలైంది. రాజమ్మ తలుపు తీసి "ఇప్పుడు వచ్చవేమిటి? మల్లమ్మ ఏమైనా..." నోటిలో మాట ఉండగానే " అవును మెలికెలు తిరుగుతూ అబ్బా అంటోంది నువ్వు త్వరగా రా" అన్నాడు. వర్షం బాగా ఎక్కువై కరెంట్ పోయింది. ఆకాశంలో భయంకర ఉరుములు.
"అమ్మ..పోలేరమ్మ తల్లీ " అంటున్నాడు కర్రెన్న.
" పద " గంగోలి నెత్తిన కప్పుకుని వడి వడిగా నడిచింది రాజమ్మ.
వెనకాలే కర్రెన్న. వర్షం ఉధృతమైంది. " తల్లి ఇల్లు కారకుండా కాపాడు" అని మనసులో వేడుకుంటున్నాడు కర్రెన్న. ఆకాశంలో ఒక్క ఉరుము ఉరిమేసరికి "అబ్బా" అంది మల్లమ్మ. సరిగ్గా అప్పుడే ఇల్లు చేరుకున్నారు. ఒక ప్రక్క ఇల్లు కారుతోంది. ఆ వాన జల్లు చిన్నగా మల్లమ్మ కు సోకుతోంది. ఇల్లు చిత్తడిగా ఉంది.. " అబ్బా ' అంటూ మూలుగుతోంది మల్లమ్మ. రాజమ్మ వచ్చి మంచంపై కూర్చొని "భయపడవద్దు మల్లమ్మ నేను వచ్చాగా కాసేపు ఓపిక పట్టు" అంది.
"కర్రెన్న!" అంటూ కేక వేసింది. "చెప్పక్క " అన్నాడు. " ఓ రగ్గు తీసి ఈ మంచం చుట్టూ కట్టు " అంది. వాడు వెతికి ఓ పాత రగ్గు... అక్కడక్కడ చిల్లులు పడినది ఉంటే మంచం చుట్టూ కట్టాడు. ఓ చోట ఇల్లు కారుతోంది. వర్షం తగ్గగానే కెవ్వున కేక వినపడింది. "మగ బిడ్డ " అంది రాజమ్మ. మల్లమ్మ, కర్రెన్న సంతోషించారు. " దండాలు రాజమ్మక్క" అంటూ చేతులు జోడించింది మల్లమ్మ. రాజమ్మ నవ్వుతూ " బిడ్డ భలే గున్నాడు కర్రెన్న, నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు విపరీతమైన వర్షం, వీడు పుట్టగానే వర్షం తగ్గింది. మీ కష్టాలన్నీ తగ్గుతాయి " అని పైకి లేచింది. బిడ్డకు పాలు పడుతోంది మల్లమ్మ. " కర్రెన్న నాకు ఇంటి దగ్గర వరకు తోడు రా" అని పైకి లేచింది. "రండక్క " అని ఆమెకు తోడుగా వెళ్ళాడు.
అప్పటికీ రాత్రి తొమ్మిది గంటలు అయింది.రాజమ్మను వదలి ఇంటికి చేరుకున్నాడు కర్రెన్న. మంచంపై ఉన్న బిడ్డ కాళ్ళు చేతులు కొడుతూవుంటే "నువ్వైనా బాగా చదువుకోరా, నాకు ఎలాగూ చదువు లేదు. మన ఆస్తి అంతా ఈ ఇల్లు ,ఆ ఇరవై గొర్రెలు " అన్నాడు కళ్ళు వత్తుకుంటూ.
************************
ఉదయమే కర్ర తీసుకుని బైటకు వెళుతుంటే "ఎక్కడికి,ఈ యాల గొర్రెలు మేపుకోవడానికి వెళ్లలేదా!" అంది.
" లేదు ,ఆ భూషయ్య ఇంటికి వెళ్ళి డబ్బు అడగడానికి వెళుతున్న. మన ఇల్లు కూలి పోయేటట్లు ఉంది. ఇంటి బాగు కోసం డబ్బు అడగడానికి వెళుతున్న" అన్నాడు. ఆమాటకు "అవును నిజంగా మరో వర్షం వస్తే ఇల్లు కూలేలాఉంది. సరే డబ్బు అడుగు. వడ్డీ తక్కువ చేసుకోమను" అంది. "సరే" అంటూ కదిలాడు కర్రెన్న.
కర్రెన్న వెళ్ళేసరికి భూషయ్య ఆరు బయట కాలు మీద కాలు వేసుకుని చుట్ట పీలుస్తూవున్నాడు. భార్య ఈ మధ్యనే కాలం చేసింది. వ్యసన పరుడు. అప్పుడప్పుడు పట్నం వెళ్ళి రెండు, మూడు రోజుల వరకు రాడు. కర్రెన్నను చూడగానే " ఏరా కర్రి కొడుకు పుట్టాడంటా కదా!" అన్నాడు. "అవును అయ్యా గారు" అన్నాడు తల గోక్కుంటూ.
"ఏమిటి విషయం" అన్నాడు పొగ వదులుతూ.
"వర్షానికి ఇల్లు కూలేట్లుగా వుందయ్య, ఎదో కొద్దిగా తట్టుకుని అలాగే ఉంది. ఇల్లు బాగుచేసుకోవాలి డబ్బు ఇత్తా రేమోనని" అని గొణిగాడు.
"ఎంత కావాలిరా" అన్నాడు.
" ఓ యాభై వేలు".
" అబ్బో.. అంతెందుకురా,యాభై వేలుకు ఎన్ని సున్నాలు ఉంటాయో తెలుసా".
కర్రెన్న బుర్ర గోక్కుంటూ " నాకేమి తెలవదు, వడ్డీ తక్కువ చేసుకోండి బాబు" అన్నాడు.
" సరే అన్నం తిని నేనే మీ ఇంటి కాడకు వచ్చి ఎంత ఖర్చు అవుతుందో చూసి చెబుతా వెళ్ళు" అన్నాడు.
" సరేయ్య " అన్నాడు వెను తిరిగి.
దారిలో కనిపించాడు పోలేరమ్మ గుడి పూజారి వెంకన్న. " ఏం కర్రెన్న కొడుకు పుట్టాడు, బావున్నాడా, అవును ఆ భూషయ్య దగ్గరకు నీకు ఏమి పనిరా వాడు వట్టి మోసపు నాయలు ఎందుకు వెళ్ళవు " అడిగాడు. అంతా చెప్పాడు కర్రెన్న.
"వద్దురా! నా మాట విను, వాడు నీ గోర్లు తాకట్టు పెట్టుకొని, నిన్ను మోసం చేసి నీకు ఏమి లేకుండా చేస్తాడు రా" అన్నాడు.
"బీదోన్ని నన్ను మోసం చేస్తే .ఆయనకు ఏమి వస్తది దేవుడున్నాడు " అని వెళ్ళాడు.
వాని అమాయకత్వానికి " నీ కర్మ " అనుకున్నాడు వెంకన్న.
భోజనం చేసి కర్రెన్న ఇంటిముందుకు వచ్చాడు భూషయ్య. ఎండ కాస్తావుంటే గొడుగు పట్టుకుని ఉన్నాడు. ఇల్లు అంతా పరికిస్తున్నాడు. " ముందు భాగం అంతా కూలిపోయింది కదరా! మళ్ళీ వానొస్తే అది కూడా కూలుతుంది. బైట ఓ పాక వేసుకుని ఉండు. నెలలోగా కట్టిస్తా ఓ లక్ష రూపాయలు అవుతుంది. ఇదిగో దీని మీద సంతకం పెట్టు" అని ఓ బాండ్ పేపర్ తీశాడు.
కర్రెన్న లక్ష మాట కన్నా ఇల్లునేను కట్టిస్తా అంటే వాడికి ఎక్కడ లేని ఆనందం కలిగింది. భూషయ్య చెబుతుంటే కన్నార్పకుండా చూస్తున్నాడు."ఎం లేదు ఖర్చంతా పెట్టుకుంటా, నీ గోర్లు తాకట్టు పెట్టి ఇదిగో ఈ బాండ్ పేపర్ పై సంతకం పెట్టు చాలు, నెల తిరిగే లోపు నీవు నీ ఇంటిలో ఉంటావు. తర్వాతే నీ గోర్లు ఇస్తా సరేనా!" అన్నాడు.
సొంత ఇల్లు బాగుంటుంది అనుకుని "సరేనయ్య". అని బాండ్ పేపర్ పై సంతకం చేశాడు.
అనుకున్నట్లుగానే కర్రెన్న ఇల్లు చక్కగా తయారవుతోంది. రేపో,మాపో ఇల్లులో చేరాలి
అనుకుంటుండగా ఓ రోజు గుఱ్ఱపుబండిలో ఓ నలభై ఏళ్ళ ఆవిడ ఆకు నములుతూ దిగి ఆ ఇంటిలోకి అడుగు పెట్టింది. విస్మయంగా చూసింది మల్లమ్మ.
" ఇది మా ఇల్లు మీరు పొరపాటున వచ్చారు " అంది.
ఆవిడ నవ్వి " పొరపాటు కాదు ఈ ఇల్లు నాదే నీ మొగుడు దీన్ని అమ్మేశాడు " అంది.
ఆ మాట వినగానే గుండెల్లో రాయి పడింది మల్లమ్మకు."లేదు ఇల్లు మేము ఎవరికి అమ్మ లేదు.ఇల్లు బాగు చేయిస్తాను అని భూషయ్య చెప్పారు" అంది.
"నీకు అంతవరకే తెలిసింది. ఇంటికి లక్ష రూపాయలు పైగా ఖర్చు అయింది.అది తీరే వరకు ఇదినాదే " అని లోపలికి వెళ్ళింది.
"లేదు ఇందులో ఎదో మోసం ఉంది.వాడ్ని ఎర్రి బాగులోడిని చేసి ఇల్లు ఆక్రమించుకుంటారా"
అంది. ఓ ప్రక్క పిల్లాడు గుక్క పట్టి ఏడుస్తుంటే, కన్నీళ్ళు ఉబికి వస్తున్నాయి. ఏమిచేయలో పాలు పోలేదు మల్లమ్మకి. ఊరంతా ఈవిషయం తెలిసి బాధపడ్డారు. కర్రెన్న కు అన్యాయం జరిగిందని అన్నారే కానీ దైర్యంగా ఎవరూ ముందుకు వచ్చి కర్రెన్న వైపు మాట్లడ లేక పోయారు.కర్రెన్న కు విషయం తెలిసి కుమిలి ,కుమిలి పోతున్నాడు.రాజమ్మ దగ్గరకు వెళ్ళి కన్నీళ్ళు పెట్టుకున్నాడు. "మోసం జరిగిందక్క, ఆ రోజు వెంకన్న చెప్పాడు.నేను వినకుండా మొండిగా ప్రవరించాను " అన్నాడు.
రాజమ్మ కర్రెన్న భుజంపై చేయి వేసి " ఊరుకో కర్రెన్న భయపడకు నీ ఇల్లు నీకు దక్కుతుంది. దైర్యంగా ఉండు.మోసాన్ని మోసం తోనే జయించాలి. ముందు ఆ ఇంటిలో ఉన్న నెరజాణ పని పట్టాలి. అది వాడు అరువు తెచ్చుకున్న చుట్టం ముందు దాని పని పడదాం, సమయానికి భూషయ్య వస్తే వాడి పని కూడా ఈ రాత్రికే " అంటూ వాడి చెవిలో ఎదో చెబుతోంది. " అట్టాగే " అన్నాడు.
***********************
రాత్రి పది గంటల పైన భూషయ్య ఆ ఇంటి తలుపులు తడుతూ ఉంటే, పాకలో ఉన్న మల్లమ్మకు మెలుకువ వచ్చి వెంటనే కాళ్ళ మీద పడి " అయ్యా నా ఇల్లు నాకు ఇవ్వండి. మీ బిడ్డ లాంటి దాన్నియ్య " అంటూ కాళ్ళు పట్టుకుంది. ఆ మాటకు భూషయ్య మీసం తిప్పుతూ "ఈ ఇల్లు నాదే వెళ్లు" అని కాలితో తన్నాడు క్రూరంగా. ఇదంతా దూరంగా ఉండి గమనిస్తున్నాయి మూడు కళ్ళు.
తలుపు తీసి " రండి " అంది ఆవిడ ఆకు నములుతూ. భూషయ్య రాగానే చప్పున తలుపు గడియ పెట్టింది. భూషయ్య మంచం పై కూర్చుంటే తాంబూలం అందించింది. నవ్వుతూ తాంబూలం అందుకుని నములుతున్నాడు. ఆవిడ నవ్వుతూ అతని భుజం పై చేయి వేసి " ఈ ఇల్లు నాదే కదా!" అంది.
భూషయ్య నవ్వుతూ"నీదేనే కర్రెన్న కు ఆ పాకే గతి.వాడి భయం నీకు అక్కరలేదు" అంటూ నడుం చుట్టూ చేతులు వేశాడు.
" అదే ఈ ఇల్లు నా పేర రాయండి " అని చేతులు విదిలించుకుని జాకెట్ లో ఉన్న బాండ్ పేపర్ తీసి అందించింది,సుతిమెత్తగా పెదవి గిల్లి రాయండి " అంది.
" ఇది నీదే కదా! రాయడం ఎందుకు" అన్నాడు.
" నాకు ఓ గూడు ఉంటే మేలు కదా!" అంటూ హొయలు పోతూ మెల్లగా పైట జార్చింది. ఆ స్తన ద్వయం చూసి భూషయ్య గుటకలు మింగుతూ బాండ్ పై గబ గబ రాసి సంతకం పెట్టాడు. అది తీసుకుని గుండెల్లో దోపుకుని అతని ఎదపై వాలిపోయింది. అదే సమయానికి కరెంట్ పోవడంతో వారి సరసానికి అడ్డు లేకుండ పోయింది. " అబ్బా మోటు సరసం ఆగండి " లాంతరు వెలిగిస్తానని మంచంపై నుంచి లేచి అగ్గిపుల్ల గీసింది. అంతే ఒక్కసారి ఆ ఆకారాన్ని చూసి గట్టిగా కేక వేసి భయంతో వణుకుతూ " దే..దెయ్యం " అని భూషయ్యని గట్టిగా కౌగిలించుకుంది.
" ఏదీ " అని భూషయ్య అంటుండగా అక్కడ నుంచి మెల్లగా కదిలింది ఆ ఆకారం. బైట కుక్కలు అరుస్తున్న శబ్దం, ఆ ఇంటిలో ఏవో మూలుగులు వినిపించాయి. భూషయ్య భుజంపై చేయి వేసినట్లుగా కన పడటం తో "ఎవరూ.. ఎవరు " అని గజ గజ వణికి పోయాడు. ఇంతలో ఒక్కదెబ్బె ఆవిడ వీపు మీద చుర్రమని పడగానే " అబ్బా" అంటూ దిమ్మ తిరిగింది. " దెయ్యం...దెయ్యం " అంటుండగానే భూషయ్య వీపు పై మరొదెబ్బ చులుక్కుమనింది. అలా దెబ్బ మీద దెబ్బ పడటం తో ఇరువురు వాకిలి గడియ తీసుకుని పరిగెత్తారు. ఈ లోగా కరెంట్ రావడంతో ఆయాస పడుతూ వస్తున్న వారిని చూసి కర్రెన్న " ఏందయ్య ఈ యాలప్పుడు ఇట్లా వస్తున్నారు, ఎందుకు అలా భయపడుతున్నారు " అన్నాడు.
"నీ ఇంటిలో దెయ్యం ఉందిరా బాబు " అని భూషయ్య అంటే, " ఆ ఇల్లు నా కొద్దు " అంటూ బాండ్ పేపర్ కర్రెన్న చేతిలో పెట్టింది ఆవిడ. అప్పుడే రాజమ్మ ఎవరి ఇంటిలోనో పురుడు పోసి వస్తుంటే గజ గజ వణుకుతున్న భూషయ్య, ఆవిడ కనపడ్డారు ప్రక్కనే కర్రెన్న ఉండటంతో " ఎం కర్రెన్న ఇక్కడ ఉన్నావ్ " అడిగింది రాజమ్మ. అపుడే పోలేరమ్మ గుడి పూజరి వెంకన్న వచ్చాడు. వణుకు ఆగిపోలేదు ఇద్దరికి.
" రాజమ్మ ఆ ఇల్లు నా కొద్దు .ఆడి కర్రెన్నదే " అన్నాడు భూషయ్య.
" ఆ మాట పోలేరమ్మ గుడి ముందు చెప్పు నీకేమి భయం ఉండదు. అన్యాయం చేస్తే ఆ తల్లి క్షమించదు. ఇంకా నిన్ను పీడిస్తూ బాధిస్తుంది.ఆ తల్లి ముందు సాక్ష్యం చెప్పుదువు గాని రావయ్య " అన్నాడు వెంకన్న." సరే" అని అందరూ గుడి ముందు చేరారు.
వీధి లైట్ కాంతితో,గర్భగుడి దీపం కాంతి తో మెరిసిపోతోంది పోలేరమ్మ. భూషయ్య పోలేరమ్మ ను చూసి చేయి ముందుకు చాచి " అమ్మ తల్లి క్షమించు కర్రెన్న ఇరవై గోర్లు, ఇల్లు అన్యాయంగా తీసుకున్న, ఆ ఇల్లు వాడిదే, నన్ను కనికరించు తల్లి ఇకనుంచి ఎవరిని మోసం చేయను నన్ను క్షమించు తల్లి ".అన్నాడు చెంపలువేసుకుంటూ.
అప్పుడే ఎర్ర లైట్లువేసుకుని వచ్చింది జీపు. ఎస్సై జీపు దిగుతూ " ఈవిడ చాలా టక్కరి, మోసం చేయడం, ఆస్తులు రాబట్టు కోవడం ఈమె పని. ఇకనైనా మీరు బుద్ధిగా ఉండండి " అని ఆవిడను జీపు ఎక్కించి భూషయ్య ను హెచ్చరించి వెళ్ళాడు ఎస్సై.
భూషయ్య కర్రెన్న చేతులు పట్టుకొని " నన్ను క్షమించురా! నాకు బుద్ధి వచ్చింది. ఇక పేదలను ఎవరిని దోచుకొను ఆ తల్లి సాక్షిగా " అన్నాడు పోలేరమ్మకు నమస్కరిస్తూ. ఆ దీపపు కాంతి లో పోలేరమ్మ అభయమిస్తున్నట్లుగా కనిపించింది.
ఇదంతా రాజమ్మ, కర్రెన్న, వెంకన్న ఆడిన నాటకమని ఆ ఊరిలో ఎవ్వరికీ తెలియదు. పూజారి వెంకన్న భూషయ్యని అభినందిస్తు " నిజంగా మీలో మార్పు పోలేరమ్మ దయ, మన ఊరికి ఇదో మలుపు ".అన్నాడు.
" కాదు ఆ తల్లి తీర్పు " అని రెండు చేతులు జోడించాడు భూషయ్య.