చిగురు తొడిగిన వసంతం - బి. రాజ్యలక్ష్మి

chiguru todigina vasantham

ఆదివారం సెలవురోజు బద్ధకం వదిలించుకొని ఆఫీసుకు బయలుదేరింది శ్యామల. తొమ్మిదికల్లా బస్ స్టాండుకి వచ్చింది. బాగా రద్దీగా జనం తో కిటకిటలాడుతున్నది. యెవరి రూట్ బస్ రాగానే వాళ్లు యెక్కేస్తున్నారు. ఎండ బాగా మొహం మీద కొడుతున్నది. చెమట తుడుచుకుంటూ బస్ కోసం యెదురు చూస్తూ చిరాగ్గా వున్నది శ్యామల.

అంతలో శ్యామల పక్కన ఒకవ్యక్తి వచ్చి వూహించని విధంగా చెయ్యి పట్టుకుని గట్టిగా లాగాడు. శ్యామల బిత్తరపోయింది, భయపడింది.

"సీతా, సీతా నీకోసం వెతుకుతుంటే యెప్పుడొచ్చావిక్కడికి పద పద " అంటూ చెయ్యిలాగాడు.

శ్యామలకు ఒక్కక్షణం అసలేం జరుగుతున్నది అర్ధం కాలేదు. అతనిని చెయ్యి విదిలించుకుంటూ ఒక్కసారి చూసింది. అతని తీరు చూస్తుంటే ఎన్నాళ్లనించో యెదురుచూస్తున్న అపురూపమైన తనవారి కోసం వెదికి చివరకు దొరికినట్టుగా మొహం కవళికలు కనిపిస్తున్నాయి. గడ్డం బాగా మాసిపోయివుంది. తైలసంస్కారం జుట్టు బాగా రేగివుంది. నలిగి మాసిపోయిన దుస్తులు. శ్యామల అతనిని యెన్నడూ చూసిన గుర్తు కూడా లేదు. మతిస్థిమితం లేనివాడుగా కనిపిస్తున్నాడు. విడిపించుకోవాలని చుస్తే మరింత గట్టిగా చెయ్యి పట్టుకున్నాడు. ఇంతలో బస్ వచ్చేసింది. ఇక లాభం లేదనుకుని అతనిని చాలా అసహ్యం గా చీదరగా తీక్షణం గా ఒకసారి అతని కళ్లలోకి సూటిగా చూసింది. అంతే ఆమెచూపుల్లో అసహ్యతను చూడగానే ఏమనుకున్న్నాడో యేమో వెంటనే టక్కున చెయ్యి వదిలేసాడు.

అదేమీ చూడకుండా శ్యామల వెంటనే బస్ యెక్కేసింది. కానీ గుండె దడదడలాడుతునే వుంది.

మనసంతా అదోలాగా అయ్యింది. ఆఫీసులో పని చేసుకుంటున్నా మనసంతా జరిగిన సంఘటన గుర్తుకు తెస్తున్నది. సాయంకాలం ఆఫీసు అవగానే బస్సు స్టాండ్ కి వచ్చి తన రూట్ బస్ కోసం యెదురు చూస్తున్నది! జనం రద్దీ వుదయం లాగానే! శ్యామల తనలో తాను నవ్వుకుంది! యాంత్రిక జీవనం! కొన్ని గమ్యం లేని పయనాలు మరికొన్ని తెలియని మలుపుల పయనాలు! శ్యామల యింకా పెళ్లి చేసుకోలేదు! మధ్యతరగతి ఒడిదుడుకులలోనించి యిప్పుడిప్పుడే బయట పడుతున్నది. బస్ వచ్చింది యెక్కేసింది. తన స్టేజి లో దిగింది!

పొద్దున్న తను యెక్కినవైపు చూసింది! అక్కడ అతను అలాగే కూచున్నాడు కానీ ఇంకొక అతను " రా అన్నయ్యా ! యెంతసేపు యిలావుంటావు " అంటూ చేయిపట్టుకుని తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడు! శ్యామల ఒక్కక్షణం విస్తుపోయిచూసింది. అనుకోకుండానే అడుగులు అటువైపు వెళ్లాయి ! "నా సీతే. నన్ను కాదాన్నిదిరా!! నన్ను అసహ్యం గా చూసిందిరా" అంటూ అతను వలవలా యేడ్చేస్తున్నాడు! తమ్ముడు శ్యామలను చూసాడు! విస్మయం తో కళ్లు విప్పార్చి మరీ మరీ చూస్తున్నాడు!" అదిగో చూడరా నా సీత వచ్చింది“ అంటూ చటుక్కున లేవబోయాడు ! శ్యామల భయం భయం గా అక్కడినుంచి వెళ్ళబోతున్నది! అతని తమ్ముడు "మేడం ఏమీ అనుకోకండి! ఇప్పుడే వస్తాను కొంచెం సేపు యిక్కడే వుండండి ప్లీజ్" అని శ్యామలను ప్రాధేయపడ్డాడు! తమ్ముడు అన్నయ్యను కారులో తీసుకుని వెళ్లాడు. స్వతహాగా శ్యామల మానవతావాది! మనసు లోతులను చదువుతుంది.

శ్యామల అక్కడవున్న పార్కు లో కూర్చుంది! అతని తమ్ముడు వచ్చాడు. "అతను మా అన్నయ్య సుధాకర్! పోస్ట్ గ్రాడ్యుయేట్! ఆఫీసర్ గా వుద్యోగం వచ్చింది. ఇప్పుడిలా వున్నాడు కానీ చాలా అందగాడు! ఎంతోమంది పిల్లనివ్వడానికి పోటీలు పడీ మరీ వచ్చారు. కానీ అన్నయ్య సీత అనే అమ్మాయిని ప్రేమించాడు, గాఢంగా యిష్టపడ్డాడు. మా నాన్నగారిని అమ్మగారిని ఒప్పించాడు! వాళ్ళింట్లో వాళ్లను కూడా ఒప్పించి పెళ్లిచేసుకున్నాడు. అన్నోన్యదాంపత్యం!. మా వదిన సీత చాలా మంచిది. అందరిలో కలిసిపోయింది. ఆమె అచ్చం గా మీలా వుండేది! అందుకే నేను మిమ్మల్ని చూడగానే విస్తుపోయాను! కవలలు అనేంత దగ్గర పోలికలు వున్నాయి! మీరెవరో నాకు తెలియదు మీ పేరు నాకు తెలియదు! కానీ నాకు మిమ్మల్ని చూడగానే మా వదిన గుర్తుకొచ్చింది! మా అన్నయ్య వదినలు యెంతో అన్నోన్యం గా వుండేవాళ్లు! అన్నయ్య అయితే మరీ ప్రేమించేవాడు! వదిన గర్భవతి అయ్యింది! మా అందరికి పండుగే ఆ విషయం! నెల నెలా ఒక వేడుక లాగా జరుపుకున్నాం! మాకు రోజు నిత్యవసంతం! అన్నయ్య వదినను పుట్టింటికి పంపడం కూడా యిష్టపడలేదు! " అతను వూపిరి పీల్చుకుంటూ శ్యామలకేసి చూసాడు.

శ్యామల మనసులో అతని మాటలకు ఏదోతెలియని తెలియని కదలిక !!!

అతను మళ్లీ చెప్పడం మొదలుపెట్టాడు ," తప్పనిసరిగా తొమ్మిదవనెల పుట్టింటికి పంపడానికి ఒప్పుకున్నాడు. ఆ రోజు ఘనంగా సీమంతం జరిపాము. వదినా వాళ్ల ఆమ్మానాన్నగార్లు వచ్చారు. వేడుకలు ముగిసాక రాత్రి కారు యెక్కేముందు మా వదిన అమ్మకూ ,నాన్నకూ ,అన్నయ్యకూ నమస్కరించింది. న దగ్గరకు వచ్చి ' బాబాయి కోసం యెదురుచూస్తుంటాడు బుజ్జిగాడు వెంటనే రావాలి నువ్వు 'అంటూ నవ్వింది. కారెక్కింది. మర్నాడు వుదయం విషాదవార్త. కారు ఘోరప్రమాదం! అందరూ చనిపోయారు. మా యింటి వెలుగు, అన్నయ్య కంటివెలుగు మా వదిన మరో లోకానికి వెళ్ళిపొయింది. అన్నయ్యను ఓదార్చడం మా వల్ల కాలేదు. మానసికస్థితి దెబ్బ తిన్నది. అన్నయ్య దృష్టిలో వదిన ఇంకారాలేదెందుకు అన్న సందేహమేకానీ కానీ మరో మాట లేదు. అంటే ఒకవిధంగా వదిన రాకకోసం యెదురు చూస్తున్నాడు 'సీతా ' అంటూ వెళ్లడం, తీరా దగ్గరకు వెళ్లి ముఖం చూసి నిరాశగా వచ్చెయ్యడం, యీలా తయారయ్యింది అన్నయ్య పరిస్ధియి. వుద్యోగం పోయింది. అమ్మానాన్నా బెంగ తో శారీరికం మానసికం గా కృంగిపోయారు. అన్నయ్యకు నేనే యిప్పుడు చేరువగా వుండి కాపాడుకుంటున్నాను. మీరు అచ్చుగుద్దినట్టుగా మా వదిన లాగా వున్నారు. అందుకే అన్నయ్య వుదయం మీ చెయ్యి పట్టుకున్నాడు. నేను మిమ్మల్ని కలిసి చెప్పాలనిపించే లోపలె మీరు బస్సెక్కేసారు. వాడి తరపున నేను క్షమాపణలు అడుగుతున్నాను " అంటూ అతను శ్యామలకు నమస్కరించి వడివడిగా వెళ్లిపోయాడు.

శ్యామల అలాగే అయిదునిమిషాలు బొమ్మలాగా స్థాణువయ్యింది. మెల్లిగా యెలా యింటికి చేరిందో తనకే తెలియదు. ఆ రాత్రి శ్యామలకు నిద్రపట్టలేదు. ఒకవ్యక్తి తన స్త్రీని యెంతగా ఆరాధించాడు ! యిప్పుడు సుధాకర్ సంగతి తెలిసిన తరువాత యెందుకో శ్యామలకు తెలియకుండానే అతనిమీద ఒక మమత ఏర్పడింది. తన తెలివి దేశానికి వుపయోగపడకపోయినా కనీసం ఒక జీవితాన్ని నిలబెట్టినా చాలు తృప్తిగా నిద్రపోయింది శ్యామల! మర్నాడు వుదయం శ్యామల బస్సు స్టాండులో నించుంది.

"సీతా వచ్చావా !! నాకు తెలుసు నువ్వు వస్తావని , నిన్న యెందుకలా చూసావు నన్ను ! అంత కోపం యెందుకొచ్చింది? నేనేం తప్పు చేసాను? రా మనింటికి. నీకోసం అమ్మానాన్న యెదురు చూస్తున్నారు" అంటూ ఆప్యాయంగా చెయ్యిపట్టుకుంటూ శ్యామల కళ్ళల్లోకి నవ్వుతూ చూసాడు. శ్యామల కూడా అతని పసిబిడ్డలాంటి పువ్వులాంటి మనసుకి దాసోహం అయ్యింది. ఇప్పుడు శ్యామల చూపులో అసహ్యం లేదు, అనురాగం వుంది. కొద్దీ దూరంలో నించుని యిదంతా చూస్తున్న సుధాకర్ తమ్ముణ్ణి నవ్వుతూ చూసింది.

సుధాకర్ చేయిపట్టుకుని నవ్వుతూ అడుగు ముందుకేసింది. వసంతం కొత్తచిగురు తొడిగింది.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు