రమణమ్మకు నారాయణ ఒక్కడే సంతానం. నారాయణకు శ్రద్ద లేకపోవడం వలన చదువు అబ్బలేదు. పెరిగి పెద్దయ్యాడు. కానీ ఏపనీ చేసేవాడు కాదు. "నేను పనులకెళ్లి నిన్ను పోషిస్తున్నాను. నేను ఎంతోకాలం పనులు చెయ్యలేను. ఏపనీ చేయకుంటే ఎలా బతుకుతావు. సంపాదన లేనివాడికి పెళ్లి ఎలాగవుతుంది" అనేది రమణమ్మ.
"నాకేం దర్జాగా బతుకుతా! నాదగ్గర చాలా ఆలోచనలున్నాయి. నా పెళ్లి అయ్యాక కూరగాయలు పండిస్తాను. ఆవులు, గేదెలు, మేకలు, కోళ్లను పెంచుతాను. ఎద్దులు, వ్యవసాయ పరికరాలు కొని బాడుగకు పొలం పనులకెళ్తాను. భూమిని గుత్తకు తీసుకుని పండిస్తాను. నిత్యవసర సరుకుల వ్యాపారం చేస్తాను. పట్నానికెళ్లి పని సంపాదిస్తాను." అని బీరాలు పలికేవాడు. కానీ ఏదీ చేసేవాడు కాదు.
ఒకసారి నారాయణ మేనమామ మాధవయ్య వచ్చాడు. అన్నతో నారాయణ గురించి చెప్పింది. మాధవయ్య నారాయణను ఏపనీ చేయకుంటే జీవితమెలా గడుస్తుందని ప్రశ్నించాడు. నారాయణ తల్లికి చెప్పిన మాటలే మామకూ చెప్పాడు. మాధవయ్య ఊరికెళ్లేరోజు కొన్ని విత్తనాలను నారాయణకిచ్చాడు. అందులో సగం విత్తనాలను నాటమన్నాడు. సగం విత్తనాలను చిన్నకుండలో దాచమన్నాడు. నాటిన విత్తనాలకు నీరుపోయమన్నాడు. మాధవయ్య ఊరికెళ్లిపోయాడు.
కొన్నిదినాలతర్వాత వచ్చాడు. మాధవయ్య క్షేమసమాచారాల తర్వాత దాచిన విత్తనాలను తీసుకురమ్మన్నాడు. నాటిన విత్తనాలు పూలనిస్తున్నాయి. మాధవయ్య నారాయణతో "మంచి ఆలోచనలు విత్తనాలవంటివి. విత్తనాలను నాటితే పూలు, కూరగాయలు, పండ్లు మొదలగు ఫలితాలనిస్తాయి. దాచి ఉంచితే అలాగేఉండి పోతాయి. అలాగే ఆలోచనలను అమలు పరిస్తే ఫలితముంటుంది. బుర్రలోనే దాచుకుంటే ప్రయోజనం లేకుండా పోతాయి. ఆచరించని ఆలోచనకు అర్థం లేదు. ఆలోచనలను శ్రద్దగా, ప్రణాళికగా అమలుచేస్తే ఫలితముంటుంది." అని వివరించాడు. కుండలోని విత్తనాలను, కుండీలోని పూలమొక్కలనూ చూస్తూ తన ఆలోచనలను ఆచరణలో పెట్టాలనే నిర్ణయానికొచ్చాడు నారాయణ.