నక్క స్నేహం - సరికొండ శ్రీనివాసరాజు‌

Friendship with Fox

అనగనగా ఒక అడవిలో ఆవు, జింకలు మంచి స్నేహితులుగా ఉండేవి. రెండూ ఒకదానిని విడిచి మరొకటి ఉండలేకపోయేవి. ఆపదలలో ఒకదానికి మరొకటి తోడుగా ఉండేవి. వాటి స్నేహబంధం అడవిలోని అన్ని జీవులకు ముచ్చటగొలిపేది. ఒకరోజు ఒక నక్క వాటి దగ్గరకు వచ్చి తననూ వాటి స్నేహితునిగా చేసుకోమని బతిమాలింది. ఆలోచించి చెబుతా అని ఆవు అన్నది. జింక మాత్రం వెంటనే ఒప్పుకుంది.

నక్క వెళ్ళిపోయాక ఆవు జింకతో "మిత్రమా! ఎందుకంత తొందర పడుతున్నావు? నక్కలు జిత్తులమారివి. వాటిని నమ్మకూడదు." అన్నది.

"అన్ని నక్కలూ ఒకేలా ఉండవు కదా! చూద్దాం." అన్నది జింక.

నక్క ఆవుతో జింకను మరిపించేంత మంచిగా స్నేహం చేసింది. జింకతో ఆవును మరిపించేంత మంచిగా స్నేహం చేసింది. రెండిటికీ ఏ సాయం కావాలన్నా పగలనక రాత్రనక చేస్తూ ఉంది. వాటితోనే తిరుగుతూ ఆవు, జింకలు పరస్పర స్నేహం కంటే తన స్నేహమే తన స్నేహమే మిన్న అని అవి భావించేలా యథాశక్తి ప్రయత్నించింది. రాను రానూ ఆవుపై జింకకు, జింకపై ఆవుకు చెడుగా చెప్పడం ప్రారంభించింది.

"ఆ జింకను చూశావా? ఈ మధ్య ఓ మాయదారి పులితో స్నేహం చేసింది. ఆ పులి స్వభావం నాకు తెలుసు. ఎంత చెప్పినా వినడంలేదు. నేనే దాని మనసు మార్చాలని ప్రయత్నం చేస్తా. నీకు ఏమీ తెలియనట్లు ఉండు." అని ఆవుతో చెప్పింది నక్క. "ఆ ఆవును చూశావా? ఈ మధ్య ఒక సింహంతో స్నేహం చేసింది. ఆ సింహం మంచిది కాదు. స్నేహం ముసుగులో ఆ ఆవును చెడు దారి పట్టించి, ఆ ఆవు స్నేహితులను తనకు ఆహారంగా రప్పించుకుంటుంది. నీకేమీ తెలియనట్లు ఉండు. నేనే దానిని మార్చడానికి ప్రయత్నం చేస్తా." అని జింకతో అంది నక్క. రాను రాను నక్క ఒకదానిపై మరో దానికి చెడుగా చెప్పడం ఎక్కువైంది‌. ఆవు, జింకలు మాట్లాడుకోవడం మానేశాయి.

నక్క వాటి రెండింటి మధ్య చిచ్చు పెట్టాలని శత విధాల ప్రయత్నిస్తుంది. ఆవుతో "ఆ జింక నీపై కయ్యానికి కాలు దువ్వుతుంది. నీతో ఎలాగైనా పోరాడి నిన్ను చంపి, పులికి ఆహారంగా చేస్తానని సింహంతో చెబుతుంటే నేను విన్నాను. రేపు సాయంత్రం మనం నిత్యం చూసే పెద్ద మర్రిచెట్టు దగ్గర పోరాటానికి సిద్ధంగా ఉంటుందట‌. ఎందుకైనా మంచిది. ఓ నాలుగు రోజులు అస్సలు బయటకు వెళ్ళకు." అన్నది. జింకతోనూ ఆవు కయ్యానికి కాలు దువ్వుతుందని, పోరాటంలో దానిని చంపి, సింహానికి ఆహారంగా చేయాలని చూస్తుందని, పోరాట స్థలం గురించి చెప్పి, 4 రోజులు బయటికి రావద్దని చెప్పింది. అయినా జింక వినలేదు.

నక్క సింహం వద్దకు చేరింది. "మహారాజా! రేపు మనకు పెద్ద పండుగ రోజు. ప్రాణ మిత్రులైన ఆవు, జింకల మధ్య వైరం సృష్టించాను. రేపు సాయంత్రం మర్రిచెట్టు వద్ద అవి భీకరంగా పోరాడి ప్రాణం విడుస్తాయి. అప్పుడు మనం విందు ఆరగించవచ్చు." అన్నది. అప్పుడు సింహం అంత మాంసాన్ని మనం ఇద్దరమే ఏం చేసుకుంటాం. మన మిత్రుడైన పులిని కూడా పిలుద్దాం." అన్నది సింహం. మరునాడు సాయంత్రం మర్రిచెట్టు వద్దకు చేరుకున్నాయి ఆవు, పులి. దూరంగా చెట్టు చాటున సింహం, పులి, మధ్యలో నక్క ఉన్నాయి. చాలా సమయం గడిచింది.

అప్పుడు ఆవు జింకతో "మిత్రమా! మన ప్రాణ స్నేహితుడైన నక్క సింహం మాంసం మనకు రుచి చూపిస్తానని అన్నాడు. సింహాన్ని నమ్మించి ఇటు తీసుకుని వేస్తే మనం అమాంతంగా దానికి తెలియకుండా వెనుక నుంచి దాడి చేసి, దానిని చంపాలని అప్పుడు దానిని మనం ముగ్గురం పంచుకొని తినవచ్చని అన్నాడు. శాకాహారులమైన మనకు చాలా రోజుల నుంచి మాంసాహారపు రుచిని అలవాటు చేశాడు. చాలా ఆకలిగా ఉంది. ఆ సింహం ఎప్పుడు వస్తుంది. మనం నక్క సాయంతో ఎప్పుడు దాడి చేయాలి?" అంది. ఇది విన్న సింహానికి నక్కపై కోపం వచ్చింది. సింహం, పులి మధ్యలో నక్క. తప్పించుకునే అవకాశం లేదు. ఆవు, జింకలు అక్కడ నుంచి వెళ్ళిపోగానే సింహం, పులి కలిసి నక్కపై దాడి చేసి దానిని చంపాయి‌. ఆవు, పులులపై సింహానికి కోపం ఏమీ రాలేదు. పులిని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది.

నక్క నిత్యం ఎన్నో జీవులతో స్నేహం నటిస్తూ వాటిని సింహానికి ఆహారంగా చేస్తుంది. తానూ పంచుకుంటుంది‌‌. ఈ విషయం రామచిలుక ద్వారా ఆవు, జింకలకు తెలిసింది. అందుకే నక్క చెప్పిందల్లా నమ్మినట్లు నటించాయి. తమ మధ్య పోట్లాట పెట్టి, సింహాన్ని అక్కడికి రప్పించి, తమను సింహానికి ఆహారంగా చేసే ఉపాయం కూడా రామచిలుక ద్వారా తెలిసింది. అందుకే ఇలా ఉపాయంతో నక్క నీడను వదిలించుకున్నాయి‌.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు