పండగ పెంచిన అనుబంధాలు - మీగడ వీరభద్రస్వామి

festival moods

అది ఒక చాలా చిన్న పల్లెటూరు. ఆ ఊరులో మోతుబరి రైతు అప్పలనాయుడు. ప్రతి ఏడాదీ సంక్రాంతి రోజున ఊర్లో పేద సాదాలకు వస్త్రదానం, ధనసాయం చెయ్యడం అతనికి ఆనవాయితీ... అప్పలనాయుడు కొడుకు విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రతి ఏడాదీ సంక్రాంతికి ఇండియా వచ్చి పండగను కుటుంబ సభ్యులతో కలసి చేసుకోవడం అతనికి ఆనవాయితీ…

అయితే కోవిడ్ వైరస్ విస్తృతి, కోవిడ్ రెండో వేవ్ గా స్ట్రెయిన్ వంటి వైరస్ వ్యాపిస్తుందని వార్తలు వస్తుండటంతో ఈ ఏడాది సంక్రాంతికి ఇండియా రాలేనని సమాచారం ఇచ్చాడతడు. "కొడుకు కుటుంబం సంక్రాంతికి రాదని తెలిసి అప్పలనాయుడు దంపతులు నిరాశతో వుంటారు, అప్పలనాయుడు చేస్తున్న దానధర్మాలు ఈ ఏడాది వుండవు" అని అనుకున్నారు ఊరువారు.

ఊరు వారు అనుకున్న దానికి భిన్నంగా ఊర్లో బోగీ సంక్రాంతి కనుమ సంబరాలు ఘనంగా జరపడానికి ఏర్పాట్లు చేసాడు అప్పలనాయుడు. భూమిలేని రైతు కూలీలకు, కుటుంబానికి ఒక ఎకరం చొప్పున పంటభూమిని ఉచితంగా అప్పలనాయుడు కొడుకు తన పేరిట వున్న పది ఎకరాల మెట్టుభూమిలో సొంత ఇల్లు లేని పేదలకు ఇంటి స్థలాలను ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటన ఇచ్చాడు. తాతయ్యకు చెప్పి, ఇల్లు లేనివారికి ఇల్లు కట్టించి ఉచితంగా ఇస్తామని, తమ చదువులు పూర్తి అయిన వెంటనే ఊరు వచ్చేసి ఉచిత వైద్యలయాలు నిర్వహిస్తామని ప్రకటించారు అప్పలనాయుడు మనవులు.

నేను నా సొంత నిధులతో ఊర్లో బడులు, వైద్యాలయాలు, గ్రంథాలయాలు, ఆట స్థలాలు సామాజిక భవనాలు నిర్మిస్తాను, సర్వమత ప్రార్ధనాలయాలను ఆధునీకరించి వాటి సంరక్షణ బాధ్యతను తీసుకుంటానని ప్రకటించింది అప్పలనాయుడు కోడలు.

"అందరూ ఎవరికి తోచిన సాయాన్ని వాళ్ళు చెయ్యడం మంచిదే అందుకే నేను పేదలకు ఉచితంగా బట్టలు, నిత్యవసర సామానులు పంచుతాను" అని ప్రకటించింది అప్పలనాయుడు భార్య. ఆ ఊరువారూ, బంధుమిత్రులు, పరిసర ప్రాంతాల ప్రజలు ఆశ్చర్యపోయారు. "అప్పలనాయుడు కుటుంబం దానధర్మాలు చేయుటలో ముందు వుంటుంది కానీ ఇలా దాదాపుగా మొత్తం ఆస్తిని పేదలకు ధారాదత్తం చెయ్యడానికి పూనుకోవడం వెనుక బలమైన కారణం వుంటుంది" అని గుసగుసలాడుకున్నారు.

బోగీ రోజు ఆ ఊర్లోని ప్రజల్ని సమావేశపర్చాడు అప్పలనాయుడు. "కోవిడ్ ముందు అప్పలనాయుడు వేరు కోవిడ్ తరువాత అప్పలనాయుడు వేరు మీ అందరికీ తెలుసు ఈ మధ్య నాకూ నా భార్యకూ కోవిడ్ వైరస్ సోకింది. ఆసుపత్రికి వెళ్ళడానికి మాకు ఇష్టంలేక ఇంట్లోనే వుంటే ఈ గ్రామస్తులు మమ్మల్ని గ్రామ పెద్దలులా కాకుండా సొంత తలిదండ్రులులా చూసుకొని మేము ఆ మహమ్మారి కోరలనుండి బయట పడేందుకు మనో ధైర్యాన్ని ఇచ్చారు. కోట్లాది రూపాయలు ముట్టజెప్పినా ఎవరూ ముట్టుకోని రోగులమైన మమ్మల్ని పైసా ఆశించకుండా ఊరు కంటికి రెప్పలా కాపాడింది, అదే సమయంలో విదేశాల్లో ఉన్న నా కొడుకు కుటుంబం మొత్తం కోవిడ్ బారిన పడింది. వయసులో ఎనభై సంవత్సరాలకు దగ్గర్లో వున్న మా దంపతులం కరోనాని జయించిన విధానం, అందులో మన ఊరు ప్రజల సహకారం నేను నా కొడుకు కుటుంబానికి చెప్పేవాడిని, వాళ్ళు స్ఫూర్తి పొంది మనోధైర్యాన్ని తెచ్చుకొని కుటుంబంలో ఒకరికొకరు తొడుగా ఉండి కరోనా నుండి బయటపడ్డారు, డబ్బుకన్నా మానవ సంబంధాలు గొప్పవని తెలిసుకున్నారు. నేను నా కొడుకు కుటుంబ సభ్యులతో మాట్లాడాను నా మనవడు నూనూగు మీసాల చిన అప్పలనాయుడు సలహా ప్రకారమే మా ఆస్తిలో ఎక్కువ భాగం పేదలకు పంచి మేము కూడా ఊరులో సన్నకారు రైతులులా బ్రతకాలని నిర్ణయించుకున్నాం, త్వరలో మా అబ్బాయి కుటుంబం కూడా మన ఊరు వచ్చేస్తుంది, కోవిడ్ ముందు విదేశాలు కోవిడ్ తరువాత విదేశాలు వివరాలను నా మనవడు నాకు చెప్పాడు, బెఫోర్ ఆర్ ఆఫ్టర్ కోవిడ్ ఇండియా ఈజ్ ది బెస్ట్ అని ఎంతో నమ్మకంగా పలికాడు వాడు" అని అన్నాడు అప్పలనాయుడు.

ఈ సారి సంక్రాంతి సంబరాలు మున్నెన్నడూ లేనంత ఘనంగా జరిగాయి ఆ ఊరులో, సంబరాలను అంతర్జాలం సదుపాయాలు ద్వారా విదేశాల్లోని అప్పలనాయుడు కొడుకు కుటుంబం చూడటానికి ఏర్పాట్లు చేసింది ఆ ఊరు యువత. ఇక్కడ అప్పలనాయుడు తాత తన బొద్దు మీసాల్ని హుందాగా మెలిపెడుతుంటే అక్కడ మనవడు చిన అప్పలనాయుడు తన నూనూగు మీసాలను హుషారుగా తిప్పి 'ఊరంతా సంక్రాంతి' ఉత్సాహాన్ని నింపారు.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు