ట్రెజరీ ఆఫీస్ లో లైఫ్ సర్టిఫికేట్ క్యూ లో నిలబడి ఇచ్చేసరికి మధ్యాహ్నం ఒంటిగంటా నలభై అయిదు నిముషాలైంది. ఉదయం నుంచి లైన్ లో నిలబడడం వల్ల చాలా నిస్త్రాణ అనిపించింది సత్యమూర్తికి. పది నిముషాలలో బస్సు ఉంది గాని హోటల్ లో ప్లేట్ మీల్స్ అయినా తినేసి బస్ ఎక్కడం మంచిదనిపించింది ఆయనకీ. కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించి ట్రెజరీ ఆఫీస్ చెట్టుకింద బెంచి మీద కూలబడ్డాడు. చేతికి ఉన్న సంచీలోంచి మంచినీళ్ళ బాటిల్ తీసుకుని గొంతు తడుపుకున్నాడు.
ఈరోజుల్లో కుర్ర ఉద్యోగస్తులకు అసలు మంచి మర్యాద, పెద్దలంటే గౌరవం అలాంటివేమీ లేకపోవడం చాలా బాధ అనిపించింది అతనికి. లైఫ్ సర్టిఫికేట్ తీసుకనే అతను రావడం టైం కే వచ్చాడు. బయోమెట్రిక్ ద్వారా ఆఫీస్ కు వేళకు వచ్చినట్టు ముద్ర వేసి ఫోన్ వచ్చిందని సీట్లో కూర్చోకుండా వెళ్ళిపోయాడు. అరగంట తర్వాత వచ్చాడు. అప్పటికే లైన్ లో ముసలివాళ్ళు ఎందఱో లైన్ లో నిలబడి కాళ్ళు పీక్కుపోతూ ఉన్నారు.
"పొరుగూరు వెళ్ళాలి నాయనా. మళ్ళీ బస్సు దొరకదు. ఈ ఫారం తీసుకుని మాచేత కూడా వేలిముద్ర వేయించేసుకుంటే మేము భోజనం సమయానికైనా ఇంటికి చేరతాం బాబు." అని బ్రతిమలాడారు ఇద్దరు ముగ్గురు.
"అయితే ఏమచేయమంటారండీ? వచ్చిన పని అయితే మిమ్మల్ని కూర్చోబెట్టుకోవడానికి మాకేమయినా సరదానా? సంవత్సరానికోసారి ఇచ్చేది.. ఇలా వచ్చిన వెంటనే పని అయిపోవాలంటే ఎలా? మా ఇబ్బందులు మాకుంటాయి. " అని విసుక్కున్నాడు అతను.
"పోనీ కూర్చోవడానికి ఏవైన బెంచీలు వేయించండి నాయనా?" అడిగారెవరో.
"ఆఫీసులో ఈ ఇరుకు గదిలో బెంచీలు ఎక్కడ వేయించామంటారండీ? నిలబడ లేనివాళ్ళు బయట చెట్లకింద బెంచీల్లో కూర్చోండి. మీరు పూర్తీ చేసిన ఫారాలు ఇలా ఇస్తే నేను వరుసలో పిలుస్తాను. " అన్నాడు. అంతే. ‘మా ఫారం ఇదిగో.. మాది పైన పెట్టు నాయనా.' అంటూ అందరూ ఒక్కసారిగా మూగేయడంతో ‘ఓయ్ రంగయ్యా... వీళ్ళ ఫారాలన్నీ తీసుకుని వరసలో పెట్టు' అని అటెండర్ కి అప్పగించి మళ్ళీ సెల్ ఫోన్ పుచుకుని బయటకు వెళ్ళిపోయాడు. మళ్ళీ అందరూ తమ తమ కాగితాలు తీసుకుని ఆ అటెండర్ వెనకాల పడిపోయారు.
ఈ జనాలూ అంతే. ఒకడెవడో మొదలు పెడతాడు. వాడి వెనకాల అక్కడేదో జరిగిపోతున్నట్టు గొర్రెల మందలా వెళ్ళిపోతారు. తీరా చూస్తే హడావుడి తప్ప పని జరగదు. చేసే ఉద్యోగం పట్ల బాధ్యత, నిబద్ధత లేని ఇలాంటి వాళ్ళవల్ల ప్రజలు ఇబ్బందులు పడినా వాళ్లకి ఏమీ అనిపించదు. ఎందుకంటే ఆ పడే ఇబ్బంది వాళ్ళకు ఆ వయసులో రాదు కాబట్టి. కొంచం నీరసం తగ్గింది అనిపించడంతో లేవబోతున్న సత్య మూర్తి దగ్గరకు బట్టతల కలిగి ఇన్-షర్టు చేసుకున్న ఒక వ్యక్తీ వచ్చి పక్కన కూర్చున్నాడు.
"ఏం పనిమీద వచ్చారు బాబు?" అడిగాడు సత్యమూర్తిని అతను.
" లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వడానికి వచ్చానండి. నేను డిగ్రీ కాలేజీ లెక్చరర్ గా ఇక్కడే రిటైర్ అయ్యాను. వైజాగ్ మా స్వంతవూరు. అక్కడ ఉంటున్నాను. సంవత్సరానికి ఒకసారి వచ్చి ఈ లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చి వెళ్తుంటాను. ఇంకా పావు గంట టైం ఉంది. ఆయినా లంచ్ బ్రేక్ అని వెళ్ళిపోయాడు ఆ కౌంటర్ లో కుర్రాడు. " అన్నాడతను.
"నేను ఉదయం పది గంటలకు వచ్చాను బాబు. అటూ ఇటూ మాయ చేసి ఒకటీ నలభై అయిదుకు తీసుకున్నాడు నా అప్లికేషను. నా తరువాత వాడితో కౌంటర్ మూసేసాడు. వస్తాను బాబు. పొట్టలో ఏదో ఒకటి పడక పొతే ప్రాణం పోయేలా ఉంది." లేచాడు సత్యమూర్తి.
అతను వెంటనే రియాక్ట్ అయ్యాడు. "మీరు పెద్దవారు. బాగా నీరసంగా కనిపిస్తున్నారు. మీకు అభ్యంతరం లేకపోతె నేను తీసుకొస్తాను. మీల్సా టిఫినా.. ఏం తింటారు సర్?" అడిగాడతను. అక్కడ చెట్టుకింద పదిమందిలోనూ అన్నం తినడం ఇష్టం లేక "టిఫిన్ చాలు బాబు" అన్నాడు సంచిలోంచి డబ్బులున్న మూట తీయబోతూ..
"పర్వాలేదు నాన్నగారు. నేను తెస్తాను. వచ్చాకా డబ్బులు ఇద్దురు గాని" అన్నాడు అతను వెళ్ళబోతూ.
"మీరు చూస్తే ఏభై ఏళ్ళ వాడిలా ఉన్నారు. మీరు రిటైర్ అవడం ఏమిటి బాబూ? మీ పేరు?"
"అదా? " అతను నవ్వేసాడు. " తరువాత చెబుతాలెండి నాన్నగారు. నాపేరు సూర్య కృష్ణ " అనేసి వడివడిగా వెళ్ళిపోయాడు. పదినిముషాల అనంతరం పార్సెల్ చేసిన రవ్వదోసే, వాటర్ బాటిల్ తో వచ్చి సత్యమూర్తి పక్కన కూర్చున్నాడు. సత్యమూర్తి తినేంత వరకు పక్కనే కూర్చున్నాడు. తిన్నాకా సూర్యక్రిష్ణ కు డబ్బులు ఇవ్వబోయాడు సత్యమూర్తి. సూర్య కృష్ణ సున్నితంగా తిరస్కరించాడు. "మీ స్థానం లో మా నాన్నగారు ఆకలితో ఉంటే తెచ్చిపెట్టనా సర్? " అన్నాడు సత్యమూర్తి చేతులు పట్టుకుని. సత్యమూర్తి కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరిగాయి. "బాబూ. ఈ పవిత్ర భారత దేశం ఇంకా మీలాంటి పిల్లలు ఉండబట్టే మాలాంటి తండ్రులు బతుకుతున్నారు. "నిస్తేజంగా ఉన్న ఆయన కళ్ళవెంట జలజలా రాలిపోయిన కన్నీళ్లను తుడిచి అడిగాడు సూర్యక్రిష్ణ. "మీవయసు ఎంత నాన్నగారు?"
"డబ్బై ఆరేళ్ళు బాబూ. "
"ఈవయసులో మీరు ఒక్కరే రాకపోతే మీకు తోడుగా ఇంకొకరిని ఎవరినైనా తెచ్చుకోవచ్చుగా నాన్నగారూ?'" అంతే. ఒక్కసారిగా దోసిలిలో ముఖం దాచుకుని బావురుమన్నాడు సత్యమూర్తి.
సూర్య కృష్ణ కదిలిపోయాడు. "నాన్నగారు. మిమ్మల్ని అనవసరంగా బాధపెట్టానేమో. ఐ యాం రియల్లీ సారీ. కానీ మీరు ఎందుకో.. ఎందుకో బాధ పడుతున్నారు. మీకు అభ్యంతరం లేకపోతె చెప్పవచ్చుగా. " అన్నాడు ఆవేదనగా.
"వద్దులే బాబు. కడుపు చించుకుంటే కాళ్ళమీద పడుతుంది. మీ పని పాడు. ఇప్పటికే మీ డబ్బులు ఖర్చు పెట్టించాను. మీ పని చూసుకోండి. "అని లేవబోయాడు సత్యమూర్తి.
"వాడు భోజనానికి పోయాడు నాన్నగారు. వచ్చేసరికి గంట పడుతుంది. మీకు చెప్పడం ఇష్టం లేకపోతే వద్దులెండి. పదండి. మిమ్మల్ని బస్సు ఎక్కిస్తాను. ఇంతకూ మీరు ఏ వూరు వెళ్ళాలి?"
"రాజానగరం వెళ్ళాలి. ఏం చెప్పమంటావ్ బాబు? నేను జిల్లా పరిషత్ లో అటెండర్ గా చేసి రిటైర్ అయ్యాను. ఇద్దరమ్మాయిల తర్వాత చాలాకాలానికి ఒకే ఒక అబ్బాయి పుట్టాడు. ఇద్దరమ్మాయిలకు సర్వీస్ లో ఉండగానే పెళ్ళిళ్ళు చేసాను. వాడిని గారాబంగా పెంచాను. వాడు కోరిందల్లా ఇచ్చాను. కష్టపడి చదివించాను. వాళ్ళ కాళ్ళు వీళ్ళకాళ్ళు పట్టుకుని ఒక జిల్లా పరిషద్ ఉన్నత పాఠశాలలో గుమాస్తాగా వుద్యోగం వేయించాను. పెళ్ళికి ముందే ఎవత్తినో ప్రేమించి కడుపు చేసి ఇంటికి తీసుకొచ్చాడు. ఒక మనవడు. ఇక్కడే ఇంజనీరింగ్ వెలగ బెడుతున్నాడు. వాడిని సాయం రారా అన్నాను. కుదరదు అన్నాడు. కోడల్ని రమ్మన్నాను. నీకు నీ పెళ్ళానికి వంట ఎవడు చేస్తాడు? అని అడిగింది. నేను మా ఆవిడ వయసు ఉడిగిపోయాకా వాడి దగ్గరే ఉంటున్నాము. పెన్షన్ డబ్బు అంతా ఎ. టి. ఎం. కార్డుతో వాళ్ళే తీసేసుకుంటారు. మందులు తెచ్చిపెట్టమంటే కోపం. ఉక్రోషం పట్టలేక ఏదైనా మాట అంటే ఈమధ్య కొట్టడానికి కూడా చేయి ఎత్తడం నేర్చుకున్నారు. చావలేక బ్రతుకుతున్నాం బాబు. ఇదే మా కధ. "అన్నాడు భుజం మీద తుండు గుడ్డ తో ముఖం తుడుచుకుని.
"ఒక్క మాట అడగనా నాన్నగారు?"
"అడుగు బాబు. "
"మీకు అభ్యంతరం లేకపోతే మీ దంపతులిద్దరిని నేను పెంచుకుంటాను. మావూళ్లో ప్రసాంతమైన వృద్ధాశ్రమంలో చేర్పిస్తాను. మీ జీవితాంతము మీకు తిండి, బట్ట, మందులు... ఏలోటు లేకుండా చూసుకుంటాను. మా నాన్నగారు పోయి మూడు నెలలైంది. అమ్మ పోయి రెండేళ్ళు అయింది. ఇందులో నా స్వార్ధం కూడా ఉంది. వారిద్దరిని మీలో చూసుకోవడం కోసం మిమ్మల్ని మనస్పూర్తిగా కోరుతున్నాను. ఇది నా ఫోన్ నెంబర్. మీరు అమ్మతో ఆలోచించి ఏ సంగతి నాకు మళ్ళీ ఇదేతారీకు లోగా ఫోన్ చెయ్యండి. "తన ఐడెంటిటీ కార్డు ఇచ్చాడు సూర్య కృష్ణ.
"పెన్షన్ డబ్బులు పోతాయని వాళ్ళు వెళ్ళనివ్వకపోతే ?"
"పారిపోయి వచ్చేయండి. మిమ్మల్ని నా కన్న తల్లి తండ్రులుగా చూసుకునే పూచీ నాది. నా పిల్లల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. ఒక వేళ మీకు నచ్చకపోతే నేనే మిమ్మల్ని మీ అబ్బాయి దగ్గర దిగబెడతాను. ఏమంటారు?"
"నాకు అంతా అయోమయం గా ఉంది బాబు. ఇంటికెళ్ళి బాగా ఆలోచించుకుని చెబుతాను బాబు. " అన్నాడు సత్యమూర్తి.
"కంగారేమీ లేదండి. అమ్మతో బాగా ఆలోచించి చెప్పండి. మీకు కుదరకపోతే నేను ఇంకో జంటను వెతుక్కుంటాను. " అన్నాడు సూర్యక్రిష్ణ.
"నీ అంతట నువ్వు పిలిచి ‘అందమైన జీవితం ‘ ఇస్తానంటే అంతకన్నానా బాబు? నేను మీకు ఫోన్ చేసి చెబుతాను." బస్సు దగ్గరుండి ఎక్కించి వెళ్ళిపోతున్న సూర్యక్రిష్ణ ను సీట్లో కూర్చుని చూస్తూ ‘ఈరోజుల్లో ఇల్లాంటి వాళ్ళు కూడా వున్నారా. ఎక్కడున్నా చల్లగా ఉండు బాబు. " అని మనసులో దీవించాడు సత్యమూర్తి.
***************************
"ఒరేయ్ అబ్బాయి. లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చి వచ్చాను రా. మళ్ళీ ఏడాది వరకు పెన్షన్ డబ్బులు హాయిగా తీసుకోవచ్చు నువ్వు. పైగా నేను రిటైర్ అయి పదిహేనేళ్ళు పూర్తయింది. ఇక పూర్తీ పెన్షన్ కూడా వచ్చేస్తుంది. అందుకే ఒక నెల పాటు కాశీ వెళ్దామని నేను మీ అమ్మ మొక్కుకున్నాము రా. మాకు రిజర్వేషన్ చేసిపెట్టు. జీవితం లో నిన్ను ఏదీ కోరలేదు. ఈ ఒక్క పని చేసి పెట్టారా... " ఇంటికి వచ్చాకా సత్యమూర్తి, కొడుకు సూరిబాబు ని అడిగాడు ప్రాదేయపడుతున్నట్టుగా...
‘ఏం చేద్దాం?' అన్నట్టు పెళ్ళాం కేసి చూసాడు సూరిబాబు.
"మంచి వార్త చెప్పారు మామయ్యా. తప్పకుండా వెళ్లి రండి. సెలవులు దొరక్క మిమ్మల్ని ఏ పుణ్య క్షేత్రాలకీ తీసుకెళ్ల లేక పోతున్నాం. మీరైనా వెళ్లి మేము కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి ప్రార్దించండి. కాశీ వెళ్లేందుకు రేపే మీకు టికెట్స్ రిజర్వేషన్ చేయిస్తారు మీ అబ్బాయి." దూరాలోచన చెయ్యకుండా భార్య అలా అనదని తెలిసిన సూరిబాబు అర్దోక్తిగా తల ఊపడం సత్యమూర్తి దృష్టి దాటిపోలేదు.
ఆ రాత్రి కొడుకు కోడలు మాటలు నిద్రపట్టని అ దంపతులకు స్పష్టంగా వినిపించాయి. "అదేమిటే. వాళ్ళు కాశీ వెళ్తానంటే వెంటనే ఒప్పెసుకున్నావ్?" "ఒక్క దెబ్బకి రెండు పిట్టలండీ. మీ నాన్నకి ఫుల్ పెన్షన్ వస్తుంది. ఎ. టి. ఎం. కార్డ్ మన దగ్గరే ఉంది కాబట్టి మనం హాయిగా ఎంజాయ్ చేద్దాం. వాళ్లకు చేసే చాకిరీ తప్పుతుంది నాకు. అందుకే వెంటనే ఒప్పేసుకున్నాను. "
"పాపం కార్డు మనం ఉంచేసుకుంటే వాళ్ళకి ఇబ్బంది కదే. "
" ఏమీ కాదు. పొద్దున్నఅరగదని టిఫిన్ ఎలాగూ చేయరు. కాఫే ఖర్చు ఒకటే. మధ్యాహ్నం అన్నదాన సత్రాలల్లో భోజనం చేసేస్తారు. రాత్రిళ్ళు ఆ సత్రాల వాళ్ళే టిఫిన్ పెట్టేస్తారు. ఉచిత సత్రాలు ఎలాగూ ఉన్నాయి. లేకపోతె ఏ అరుగుమీదో కాలక్షేపం చేసేస్తారు. నెల రోజులేగా. వచ్చాకా నాకు మళ్ళీ వాళ్ళ చాకిరీ, మందుల ఖర్చు ఎలాగు తప్పదు. మీరింకేమీ మాట్లాడకుండా రేపు వెళ్లి రిజర్వేషన్ చేయించండి. అర్ధమైందా. ?"
"సరే. "
తాము ఎంత దురదృష్ట వంతులు? తాము బ్రతకడానికి ప్రభుత్వం ఇచ్చే పించను కూడా వాడుకోలేని దౌర్భాగ్యపు జీవితం అయిపొయింది. ఇలాగే జరుగుతుందని తనకు ముందే తెలుసు. అనుకున్నాక భార్యతో సూర్య కృష్ణ విషయమంతా కొడుకు కోడలు వినకుండా చెప్పాడు సత్యమూర్తి.
"తీరా మనం వెళ్ళాకా అతను మనల్ని కొంతకాలం బాగానే చూసి వెళ్లి పోమ్మంటే?" అనుమానంగా అడిగింది భార్య.
"అతను తన కన్న బిడ్డలమీద ప్రమాణం చేసి విజిటింగ్ కార్డ్ కూడా ఇచ్చాడే. అతన్ని అనుమానిస్తే మనల్ని మనం అనుమానించుకున్నట్టే. ఒకవేళ నిజంగా లాగే జరిగితే... ఎలాగోలా కాశీ చేరి అక్కడే ప్రాణాలు వదిలేద్దాం. ఈ నరకానికి తిరిగి వచ్చేకంటే అదే నయం కదా. సరేనా?" అన్నాడు సత్యమూర్తి. ఆమె మళ్ళీ మాట్లాడలేదు. "సరేనండీ. మీ ఇష్టం. "అని దాని అర్ధమని అతనికి తెలుసు.
******************
నెల రోజుల లోగా వస్తుందనుకున్న సమాచారం ఉత్తరం రూపంలో పదిహేను రోజులకే రావడం సత్యమూర్తికి ఆశ్చర్యమనిపించింది. తమ కొడుకును కాశీ వెళ్లేందుకు టికెట్స్ బుక్ చెయ్యమని చెప్పామని, ప్రయాణం రోజు ఎలాగైనా వైజాగ్ చేరతామని, చేరిన వెంటనే ఫోన్ చేస్తామని, తమరు వచ్చి తీసుకు వెళ్ళవలసిందని రాసాడు సత్యమూర్తి ఉత్తరంలో. అనుకున్నట్టుగానే దువ్వాడ స్టేషన్ రాగానే సత్యమూర్తి సూర్య కృష్ణకు ఫోన్ చేసాడు.
వైజాగ్ రైల్వే స్టేషన్ లో సత్యమూర్తి దంపతులు ప్లాట్ ఫారం మీద అడుగు పెట్టగానే భక్తీ తో ఆ దంపతులకు నమస్కరించి " రండి నాన్నగారూ.. రండమ్మా. " అని స్వాగతించాడు. తమ కారులో ఇంటికి తీసుకువెళ్ళారు. స్నాన పానాదులు, ఫలహారాలు అయ్యాకా అంతా హలో కూర్చున్నారు.
"బాబు. ఏమిటి ఈ ఆప్యాయత? ఏమిటి ఈ అభిమానం? ఎందుకు మీకు ఇంత దయ? కన్న పిల్లలే తమ తల్లిదండ్రులని వృద్ధాప్యంలో హీనంగా ఈడ్చేస్తున్న ఈ రోజుల్లో యధాలాపం గా పరిచయమై మమ్మల్ని ఇలా ఆదరిచడం మేము నమ్మలేక పోతున్నాం బాబు. " అన్నాడు సత్యమూర్తి.
"మీకు ఇపుడు నాగురించి పూర్తిగా చెబుతాను నాన్నగారు. మానాన్నగారి సంతానం లో నేను పెద్దవాడిని. నాన్నగారు తొంబై మూడు సంవత్సరాలు బ్రతికారు. ఆఖరి క్షణం వరకు ఆయన పనులు ఆయన చేసుకునేవారు. సహజంగా జీవితంలో అరవై సంవత్సరాలపాటు మగవాడు తన కుటుంబం కోసం పాటు పడతాడు. పిల్లలు, చదువులు, పెళ్ళిళ్ళు ,పురుళ్ళు అన్ని పూర్తయి వాళ్ళ కాళ్ళమీద వాళ్ళు నిలబడేవరకు రక్తమాంసాలు ధారపోస్తారు. అతనికి తన పూర్తీ సహకారం అందించి భర్తలో సగభాగం అనిపించుకుంటుంది అతని భార్య. నిజానికి భర్త డబ్బు మాత్రమే సంపాదిస్తాడు. దానిని ఒబ్బిడి చేసి, సంసార నావకు చుక్కానిగా భార్య ఎంతో కష్టపడుతుంది. అటువంటి సంప్రదాయం మన భారతీయ సంస్కృతీలో ఉంది. ఆతరువాత వారు మిగిలిన శేష జీవితాన్ని మనః శాంతిగా, ఆరోగ్యం గా ‘ అందమైన జీవితం ‘ గడపాలి అన్నది నా కోరిక.
అలా గడిపేలా చెయ్యాల్సిన బాధ్యత పిల్లలది. కానీ టెక్నాలజీ అభివృద్ధి పేరుతో పుంఖాను పుంఖాలుగా అందుతున్న విజ్ఞానాన్ని కేవలం తమ స్వార్ధం కోసం ఉపయోగించుకుని పాశ్చాత్య దేశాల వారి సంస్కృతీని అనుసరిస్తూ అనుకరిస్తూ తమను ఇంతవాళ్ళుగా చేసిన ఆ తల్లి తండ్రులను, వాళ్ళ భవిష్యత్తును వీధి పాల్జేసి అదేదో ఘన కార్యం చేసినట్టు విపరీత ప్రవృత్తితో ప్రవర్తిస్తున్న పిల్లలు ఎంతోమంది ఈ నాటి సమాజంలో నాకు కనిపించారు.. పెద్దవాళ్ళకు చేసిన ఆ అన్యాయం తమకు చెయ్యరనే నమ్మకంతో పిల్లలమీద అతి ప్రేమ పెంచుకుని పిల్లల చేతుల్లో కీలుబొమ్మలుగా మారుతున్నవారు కూడా ఎంతోమంది. మనుమలతో హాయిగా వృద్దాప్యంలో గడపాలని పిల్లలందరితో సంతోషంగా కలిసిమెలసి ఉండాలని అనుకుంటున్నా వృద్ధ తల్లితండ్రుల ఆశలు అడియాసలౌతున్నాయి.
ఇలా ఎన్నో కుటుంబాలను గమనించిన మీదట నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నా తల్లి తండ్రులను వారి చివరిదశ వరకు నావద్దే ఉంచుకున్నాను. నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు వాళ్ళని తమ ఇంటికి పంపమని చెప్పినా వాళ్ళనే రప్పించాను గానీ నేను నా తల్లి తండ్రులను ఎవరింటికీ పంపలేదు. పిల్లలవల్ల ఇబ్బందులు పడుతున్న ఎంతోమంది తల్లి తండ్రులు ఈవేళ సమాజం లో ఉన్నారు. వాళ్ళందరినీ నేను సాకలేను. కనీసం ఒక జంటను నేను పోషించినా వారు జీవించినంతకాలం హాయిగా, సంతృప్తిగా జీవిస్తారు అన్నదే నా లక్ష్యం. అలా చేయడం నాకు ఎంతో ఇష్టం. నా అదృష్టం కొద్దీ మీరు దొరికారు. మీరు వద్దు అంటే నేను మరొకరిని వెతుక్కుంటాను. అంటే కానీ నా లక్ష్యాన్ని వదులుకోను.
నాకు ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్ల. చదువుకునే రోజులలోనే వాళ్లకి ముందే చెప్పేసాను. 'ఎవరినో ప్రేమించామని నాతొ చెప్పడానికి భయపడి ఇంటి లోనుంచి పారిపోయి కుటుంబ పరువు బజారుకు ఎక్కించడం , లేదా ఇంటికి తీసుకు వచ్చి గొడవలు చేయడం విజ్ఞుల లక్షణం కాదు. కాబట్టి మీరు చేయమంటే నేనే మీ పెళ్ళిళ్ళు చేస్తాను. లేదా ఈ జీవిత భాగస్వామి తో మేము సుఖపదతాం అన్న వ్యక్తుల్ని తెచ్చుకోండి. నేను సంతోషంగా పెళ్లి చేస్తాను. తీరా పెళ్ళిళ్ళు చేసుకున్నాకా ఇలాంటి వ్యక్తినా నేను పెళ్లి చేసుకున్నది అని మీరు బాధపడితే నా పూచీ కాదు. ' అని. నా మగపిల్లలు ఇద్దరు ప్రేమ వివాహాలు చేసుకున్నారు. ఒకడు అమెరికాలో, ఒకడు ఆస్ట్రేలియాలో సుఖంగా వున్నారు పిల్లాపాపలతో. నా కుమార్తే మాత్రం నేను తెచ్చిన సంబంధాన్ని ఒప్పుకుని హైదరాబాద్ లో సుఖంగా కాపురం చేసుకుంటోంది.
నేను రిటైర్ అయ్యాను. నేను నా భార్య ఓపిక ఉన్నంతలో పుణ్య క్షేత్రాలనీ తిరిగాము. ఒక సంవత్సరం లో ఆరునెలలు అమెరికా, రెండో సంవత్సరం లో ఆరునెలలు ఆస్ట్రేలియా వెళ్తాము పిల్లల ఇంటికి. మనవలతో ఆనందంగా గడుపుతాము. ఆయా దేశాలు వెళ్ళినప్పుడు హైదరాబాద్ అమ్మయిగారి ఇంట్లో వెళ్ళేటప్పుడు పది రోజులు వచ్చేటప్పుడు పదిరోజులు ఉండి, తిరిగి మా స్వస్తలం వైజాగ్ లో ఈ ఇంటికి చేరతాం. మేము ఇక్కడే శాశ్వతం గా ఉంటే మిమ్మల్ని మాతోనే ఉంచుకునే వాళ్ళం. కానీ ఓపిక ఉన్నంతకాలం మాకు ఈ తిరుగుడు తప్పదు నాన్నగారు. మిమ్మల్ని ఈ కాలనీలో ఉన్న వృద్ధాశ్రమం లో చేర్పిస్తాను. మహా అయితే మీ ఇద్దరకూ నెలకు పదిహేను వేలు అవుతుంది. మాకు ఒక పదిహేను వేలు అవుతుంది. నా పెన్షన్ అందుకు సరిపోతుంది. పెద్దలిచ్చిన స్తిరాస్తులతో మిగతా ఖర్చులన్నీ మీటవుతాను.
ఇపుడు చెప్పండి నాన్నగారు. మీరు కూడా ఇకమీదట ‘అందమైన జీవితం ‘ గడపాలని నా కోరిక. మీకు ఎపుడు వెళ్లిపోవాలనుకుంటే అపుడు నిర్మొహమాటంగా నాతొ చెప్పండి. మీ ఇంటిదగ్గర మిమ్మల్ని క్షేమంగా అప్పగించే పూచీ మాది. ఏమంటారు?" సూర్యక్రిష్ణ చెబుతున్నంతసేపు గర్భగుడిలో పీఠం మీద కూర్చున్న భగవంతుడిని చూసినంత పవిత్రంగా చూస్తూ విన్న సత్యమూర్తి, వద్దన్నా ఆగని కన్నీళ్లను తుడుచుకుంటూ "బాబూ చిన్నవాడివైపోయావ్. మీ అమ్మ కడుపు చల్లగా..... మానవ సేవే మాధవ సేవగా భావిస్తున్న నీ దగ్గర మా శేష జీవితం సుఖంగా జరిగిపోతుందన్న ధృఢనమ్మకాన్ని ఇచ్చావు. నీలోని ఆ మాధవునికి మా దంపతుల నమస్కారాలు నాన్న.. "అంటూ సూర్యక్రిష్ణ ను కౌగలించుకుని సంతృప్తితో కళ్ళుమూసుకున్నాడు. తన కన్నా తండ్రి పునరుజ్జీవితుడై తిరిగి వచ్చినట్లే అనుభూతి చెందాడు సూర్యక్రిష్ణ.