ఒక అడవిలో చందనం అనే కోతి ఉండేది. ఒకరోజు ఆకోతి అమ్మ కాలుకు గాయమయింది. విపరీతమైన నొప్పితో బాధపడుతోంది. ఆహారం కోసం అడవిలోకి పోలేని పరిస్థితిలో ఉంది. తల్లి పరిస్థితి చూసి చందనం చాలా బాధపడింది. వైద్యంచేసే ఎలుగుబంటి వద్దకెళ్ళింది. ఆకుపసరు తెచ్చింది. గాయానికి రాసింది. అడవిలో తిరిగి ఆహారం తెచ్చి ఇచ్చింది. గాయం నయమయ్యేవరకూ అమ్మను కంటికిరెప్పలా చూసుకుంది.
అడవిలో తిరిగే సమయంలో చందనం అనారోగ్యంతో, ముసలితనంతో ఆహారంకోసం తిరగలేక బాధపడుతున్న జంతువులను, పక్షులను చూసింది. ఒక ముసలికోతి దగ్గరకెళ్ళి "మామా! మామా! నీకు పిల్లలులేరా?" అని అడిగింది. "ఎందుకులేరూ! ఉన్నారు. పెద్దవగానే నన్ను వదిలి వెళ్ళిపోయారు" అంది.
ఒక ముసలి కాకి దగ్గరకెళ్ళి "అవ్వా! అవ్వా! నీకు పిల్లలులేరా ?" అని అడిగింది. "ఎందుకు లేరూ! రెక్కలు రాగానే ఎగిరిపోయారు" అంది. రెక్కకు గాయమై ఎగరలేని పరిస్థితుల్లో ఉన్న పిచుకమ్మను "అమ్మా! అమ్మా! నీకు పిల్లలు లేరా?" అని అడిగింది. "నేను పుల్లాపుడకా ఏరి గూడు ఏర్పాటుచేశాను. దొరికిన ఆహారం నోట కరుచుకుని వచ్చి పిల్లల నోటికందించాను. రెక్కలు రాగానే నా పిల్లలు ఎగిరిపోయాయి" అంది.
అలాంటి జంతువుల, పక్షుల పరిస్థితి చూసి చందనానికి జాలివేసిది. మృగరాజును కలిసి "తినీ తినక ఆహారాన్ని పిల్లలకోసం త్యాగంచేసి, పెంచి పెద్దచేస్తే పిల్లలు పెద్దల మంచిచెడ్డలు పట్టించుకోవడం లేదు." అని కన్నవారి దయనీయ పరిస్థితిని వివరించింది. సింహం చందనం మాటలను ఆలకించింది. కన్నవారిని గాలికి వదిలేసే పిల్లలను గుర్తించడానికి వేగులను ఏర్పాటు చేసింది. వాటికి నాయకుడిగా చందనంను నియమించింది. కన్నవాళ్ళను బాగా చూసుకోవాలని, పట్టించుకోని పిల్లలను కఠినంగా శిక్షిస్తానని ఆజ్ఞ జారీచేసింది. ఆరోజు నుండి పిల్లల ప్రవర్తనలో మార్పు వచ్చింది. చందనం ఎంతో సంతోషించింది.