అవ్వ నేర్పిన బ్రతుకు బాట - కందర్ప మూర్తి

Avva nerpina bratuku bata

అగ్రహారం ఊరి రచ్చబండ మీద ఒంటరిగా కూర్చున్న వెంకట్రావు ఆలోచనలో పడ్డాడు. ఊళ్లో చదువుకున్న వాళ్లంతా పట్నానికి పోయి డబ్బులు సంపాదిస్తున్నారు. తనకేమో చదువు లేదాయే. తన చిన్నతనంలోనే అయ్య జబ్బుచేసి సచ్ఛిపోతే అమ్మ పెద్దోళ్ల ఇళ్లలో చాకిరీ చేసి బువ్వ పెడుతోంది. కష్టపడి కూలిపని చేసుకుందామంటే అందరూ ట్రాక్టర్లు మిషినులు తెచ్చి కూలి పనులు కరవైనాయి. యం.ఎల్.ఎ గారి మనుషులకు ఆళ్లకి ఇష్టమున్నోళ్లకి కాంటార్టు పనులు ఇచ్చుకుంటారు. అమ్మేమో ముసిల్దయింది. ఎన్ని రోజులని నన్ను పోషిస్తాది.

పనుల కోసం పట్నానికి పోదామంటే అమ్మని సూసుకునే వాళ్లు లేరాయే. ఎట్టాగైనా నా కాళ్లమీద నాను నిలబడాల. అమ్మని ఇంటికాడ కూచో పెట్టాల. గుడిస తీసి మంచి ఇల్లు కట్టుకోవాల. చిన్న టీ.వి. కొని పాటలు సినిమాలు చూడాల. అమ్మని సుఖ పెట్టాలను కుంటున్నాడు.

రచ్చబండ దగ్గర ఎదురుగా ఇంటిగోడ మీద నర్సవ్వ తట్టలో పశువుల పేడ పిసికి అందులో కట్టెల బూడిద కలిపి ఉండలుగా చేసి పిడకలు వేస్తోంది. ముందు రోజు గోడ మీదున్న ఎండిన పిడకల్ని తీసి కుప్పలుగా ఉంచింది. ఇంతలో పక్క ఊరి షావుకారు సైకిలు మీద వచ్చి పది రూపాయల నోటు ఇచ్చి కొన్న పిడకలు గోనె సంచిలో ఉంచి వెళి పోయాడు. కొద్ది సేపు తర్వాత పంతులు గారొచ్చి మరికొన్ని పిడకల్ని పట్టుకు పోయారు. వెంకట్రావు చూస్తూండగానే పిడకల పోగు ఖాళీ అయిపోయింది. నర్సవ్వ డబ్బులు గుడ్డ చిక్కంలో పెట్టి మొలకి దోపుకుంది.

వెంకట్రావు బుర్రలో ఒక ఆలోచప తళుక్కుమంది. తనూ పెట్టుబడి లేని పిడకల వ్యాపారం చెయ్యాలను కున్నాడు. సుబ్బరాజు గారి ధాన్యం మిల్లు ప్రహరి గోడ విశాలంగా ఎండ తగులుతూ రోడ్డు పక్కన ఉంది. గోడ బయట పిడకలకు అనుకూలంగా ఉంటుంది. ఒకరోజు పచ్చి తేగలకట్ట పట్టుకుని సుబ్బరాజు గారింటికి వెళ్లి తన మనసులోని మాట బయట పెట్టాడు. రాజు గారికి వెంకట్రావు వినయం మాట తీరు నచ్చి అలాగే అన్నారు. వెంకట్రావు నర్సవ్వతోను, తల్లి సాయంతో ఊళ్లోని పశువుల పేడంతా కూడగట్టి సుబ్బరాజు గారి ధాన్యం మిల్లు ప్రహరీ గోడ బయట పిడకలు వెయ్యడం మొదలెట్టాడు.

రోజు విడిచి రోజు ఎండిన పిడకల్ని బస్తాల కెత్తి షావుకారు, పురోహితుడికీ, దహన క్రియలకు అమ్ముతున్నాడు. రోజ రోజుకీ పిడకల గిరాకీ పెరిగింది. వెంకట్రావు చేతికి డబ్బులు రావడం మొదలైంది. చెడు అలవాట్లకు పోకుండా నర్సవ్వ , తన తల్లి మిగతా సహాయకులకు ఖర్చులు పోను మిగిలిన డబ్బులతో కోళ్లఫారం నుంచి గుడ్లు కొని పాత సైకిలు మీద పట్నం తీసుకెళ్లి షాపుల్లో వేస్తున్నాడు. వెంకట్రావు నోటి మంచితనం వల్ల కోడిగుడ్ల వ్యాపారం బాగా పుంజుకుంది. పిడకలు, గుడ్ల వ్యాపారం తో వెంకట్రావు బిజీ అయిపోయాడు. సరుకు దుకాణాలకు వెయ్యడానికి తనలాగే పనులు లేక తిరుగుతున్న వారికి పని కల్పించి ఆర్థికంగా ఆదు కుంటున్నాడు.

దాచిన డబ్బును స్కూలు మాస్టారి సహాయం తో బ్యాంకులో జమ చేస్తున్నాడు. మెల్ల మెల్లగా గుడ్ల వ్యాపారం పుంజుకుంది. బ్యాంకులో డబ్బు వేలల్లో జమవుతోంది. అనుకున్నట్టుగా గుడిస తీయించి పునాదులు తవ్వించి కొత్త ఇల్లు మొదలు పెట్టాడు. నెల నెలా వ్యాపారంలో సంపాదించిన డబ్బుతో ఇంటి పనులు పూర్తవు తున్నాయి. ధాన్యం మిల్లు యజమాని సుబ్బరాజు గారు కూడా వెంకట్రావుకి వ్యాపార మెళకువలు చెబుతున్నారు. పట్నంలో పండగలు పర్వ దినాలపుడు ఆవుపేడకు గోమూత్రానికీ డిమాండు పెరిగింది. పురోహితులు హోమాలు యాగాలపుడు వీటి కోసం వెంకట్రావుకు అడ్వాన్సు ఇచ్చి ఆర్డర్లు బుక్ చేస్తున్నారు. ఊళ్లో వెంకట్రావు ఇల్లు పూర్తయింది.

పనీ పాటూ లేక బేవార్సుగా తిరిగే వెంకట్రావు స్వయంకృషితో వ్యాపారం అభివృద్ధి చెంది కొత్త ఇల్లు కట్టుకున్నందుకు జనాలు ఆశ్చర్యంతో ముక్కు మీద వేలేసుకున్నారు. స్కూలు మాస్టారి దగ్గర కొద్దిగా చదువు, వ్యాపార లెక్కలు నేర్చుకున్నాడు. ఊరి పంతులు గారి చేతుల మీదుగా ధాన్యం మిల్లు సుబ్బరాజు గారి పర్యవేక్షణలో కొత్త ఇంటికి గృహ ప్రవేశం కావించాడు. సైకిలు బదులు మోటరు సైకిలు కొన్నాడు. సంవత్సరం సంవత్సరం గుడ్ల వ్యాపారం అభివృద్ది చెంది పట్నంలో హోల్ సేల్ గా షాపుని పెట్టి ఆటోట్రాలీలో చేరవేస్తున్నాడు. క్రమేపి బ్యాంకు బేలన్సు పెంచుకున్నాడు. కావల్సిన వస్తువులు సమకూర్చుకున్నాడు.

ఊళ్లో కోళ్లఫారం యజమాని ఆకస్మిక మరణంతో కోళ్లఫారం అమ్మకాని కొచ్చింది. దాన్ని కొనడానికి బ్యాంకులో దాచిన డబ్బుతో పాటు సుబ్బరాజు గారు ఆర్థికంగా తోడ్పడ్డారు. ఇప్పుడు వెంకట్రావు కోళ్లఫారం యజమాని అయాడు. ఊరి రామాలయం, పాఠశాలకు, ఊరి అభివృద్ధికి ఆర్థికంగా సహాయ పడుతున్నాడు. సుబ్బరాజు గారి పెద్దరికంలో మంచి పెళ్ళి సంబంధం చూసి పెళ్లి జరిపించారు. చుట్టు పక్కల గ్రామాల్లో అభివృద్ధి చెందిన పంచాయతీ గా అగ్రహారం సెలక్టు అయింది.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.