చిట్టి చిలక పెళ్ళి సందడి - కందర్ప మూర్తి

chitti chilaka pelli sandadi

హైదరాబాదుకు సుదూర ప్రాంతంలో అదొక గ్రామీణ ప్రాంతం. పచ్చని చెట్టు పొదలో రామచిలక దంపతులు చిట్టి చిలుకతో కాపుర ముంటున్నాయి. చక్కగా విరబూసిన జామచెట్టు కొమ్మ మీద నిగారింపుగా చిన్ని అడుగులేస్తు వయ్యారంగా నడుస్తున్న చిట్టి చిలుకను చూసి తల్లి చిలకమ్మ మురిసిపోతోంది.

"ఇదిగో, నిన్నే ! వయసు కొచ్చిన చంటిదానికి పెళ్ళి సంబంధాలు చూడవా ఏంటి ? ఎప్పుడూ తిండి ధ్యాసే ! " కేక లేస్తోంది తల్లి చిలక.

జామి చెట్టు కొమ్మ మీద కాలితో పెద్ద జాంపండును పట్టుకుని తింటున్న మిట్టుమియ " ఏమిటే నీ సొద, దోర ముగ్గిన జాంపండును తిననీయకుండా" చిరాగ్గా అన్నాడు. " చిన్న దాని పెళ్లికి ఏం తొందరొచ్చిందే, పెళ్లి చేసి పంపేస్తే అది మనకి దూరమై పోతాది. దాని ముద్దు ముచ్చట మనింటి దగ్గరే కదా! అది అత్తారింటి కెల్తే అక్కడ ఆళ్ల చెప్పు చేతల్లోనేగా ఉండాలి. చూద్దాం లే " తాపీగా అన్నాడు జాంపండు తింటూ.

" మన ముద్దు ముచ్చట కోసం ఆడపిల్లని ఎన్నాళ్లని ఉంచుకోగలం. ఎప్పుడో ఒకప్పుడు పంపాల్సిందేగా. ఇప్పటి నుంచే సంబంధాలు చూస్తే అనుకూలమైంది ఏదో ఒకటి కుదరక పోదు " తన మనసులోని మాట బయట పెట్టింది చిలకమ్మ.

శ్రీమతి చిలక పోరు పడలేక చిట్టి చిలకకి పెళ్ళి సంబంధాల ప్రయత్నం మొదలెట్టాడు మిట్టూ మియ. ఆ వివరాలు శ్రీమతికి చెప్పడం మొదలెట్టాడు.

ఆ మద్య హైదరాబాదు సిటీలో కొన్ని పెళ్లి సంబంధా లున్నాయని తెల్సింది. అంత దూరం అమ్మాయిని పంపాలంటే ఆందోళనగా ఉందే. హుస్సేన్ సాగర్ పక్కన ఉన్న యం.టి. ఆర్. గార్డెన్లో ఒక సంబంధం ఉందట. అక్కడ భారీ వృక్షాలైతే ఉన్నాయి కాని నీడ నివ్వడానికే. ఫలవృక్షాలు కానరావు. గూటికి కరువు. ఎప్పుడూ వచ్చే పోయే జనాలు వాహనాల రణగొణ శబ్దాలు హుస్సేన్ సాగర్ మురికి నీటీ వాసనలు మన చిట్టితల్లి అక్కడ ఉండలేదే. మరొక సంబంధం ఇందిరా పార్కులో ఉందట. అక్కడా ఇవే ఇబ్బందులు. ఫలవృక్షాలు లేవు. చెత్తా చెదారం కాల్చిన పొగలు. రాత్రయితే గుడ్ల గూబల గోల.

ఇంకొక పెళ్ళి సంబంధం నగరానికి నడిబొడ్డున కృష్ణకాంత్ పార్కులో ఉందట. అక్కడా వృక్ష సంపద బాగున్నా తిండికి ఫలాలు ఉండవు. మనుషుల సంచారం ఎక్కువే. అక్కడ రాబంధులు, గెద్దల బాధ ఉంటుందట. పాములు కొండచిలువల భయమూ ఉంటుందట.అలాగే బ్రహ్మానందరెడ్డి పార్కు తీరూ అంతే. రణగొణ ధ్వనుల మద్య పబ్లిక్ గార్డెనొకటుందట. అది నిజంగా పబ్లిక్ పార్కే. పక్కనే రైళ్ల రాకపోకలు ఇంజన్ హారన్ల సొద. ఇంకా బంజారా హిల్స్ జలగం పార్కు గచ్చిబౌలి బొటానికల్ గార్డెన్స్ నెహ్రు జూపార్కు దుర్గం చెరువు శిల్ప కళావేదిక హరితవనం వంటి ప్రదేశాల్లో పెళ్లి సంబంధాలున్నా ఉండటానికి ఆవాశం ఉండదు. తిండికి కరవు. భద్రత ఉండదు.

సిటీలో రవాణా ట్రాఫిక్ సమస్యల దృష్ట్యా మెట్రో రైలు ఫ్లై ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం జరిగి రోడ్డు మీద చిరకాలం నుండి ఉన్న భారీ వృక్షాల్ని నరికి వేసారట. ఎన్నో పక్షి జాతులు నిరాశ్రయమయాయి. శిల్పారామం పార్కు పరిసరాలు పచ్చగా కళకళ లాడుతుంటే దుర్గం చెరువు వైపు హేంగింగ్ బ్రిడ్జి నిర్మాణం కోసం పచ్చని చెట్లను నాశనం చేస్తున్నారట. ఇలా రోజు రోజుకీ అభివృద్ధి పర్యాటక ఆకర్షణ పేరుతో దశాబ్దాల కాలం నాటి పచ్చని భారీ వృక్షసంపదను నరికి చెరువుల్ని పూడ్చి నగరాన్ని కాంక్రీట్ అడవిలా మార్చి భూగర్భ జలాలు లేకుండా చేస్తున్నారట. పరిశ్రమల వ్యర్దాలతో ఉన్న నీటి వనరుల్ని కలుషితం చేస్తున్నారట. పక్షి జాతులు ఉండటానికి నెలవు తినడానికి తిండి కరువొచ్చిందట. భారీ పరిశ్రమల వల్ల క్రమేపి వాతావరణంలో వేడి ఎక్కువై పక్షులు ఆకలితో చస్తున్నాయట.

ఇవి కాకుండా సెల్ టవర్ల నుంచి వచ్చే రేడియేషన్ ప్రభావంతో పక్షుల్లో సంతాన ప్రాప్తి నసిస్తోందట. వేసంగిలో అధిక వేడి చలికాలంలో ఎక్కువ చలి ఉంటోందట. పగలే వాహనాల పొగ ధూళికణాలతో పొగమంచు పరిచినట్టుందట. ఈ విషయాలన్నీ నాకు ఎలా తెలిసినాయంటే హైదరాబాదు సిటీలో జీవకారుణ్య సంస్థ వాళ్ళు మనల్ని పంజరాల్లో బంధించి రోడ్ల మీద చిలక జోస్యం చెప్పే మనుషుల నుంచి విడిపించి ఇక్కడి అడవి ప్రాంతంలో వదిలినారట.

వాళ్లు ఈ సంగతులన్నీ నాకు చెప్పినారు. మనం నివశించే ప్రాంతంలా అక్కడ కొండలు వనాలు నీటి వనరులు కనబడవు. స్వచ్ఛమైన గాలి నీళ్లు దొరకవు. పచ్చదనం కనబడదు. ప్రశాంతత కనబడదు. ఎప్పుడూ ప్రాణభయమే. నచ్చిన తిండి తినలేము. ఇక్కడిలా స్వేచ్ఛగా సమూహంగా విహరించలేము. అక్కడి మిలిటరీ ఏరియాలో విశాలంగా వృక్ష సంపద ఉన్నా అవన్నీ నీడ కోసమే తప్ప ఫలసంపద ఉండదట." అని మిట్టూమియ చిలకమ్మతో హైదరాబాదు సిటీ పెళ్ళి సంబంధాల కష్టనష్టాలు మాట్లాడుతూంటే ఆ మాటలు వింటున్న చిట్టి చిలక చెంగున ఎగిరి వచ్చి " నాయనా, నాకు హైదరాబాదు చూపించవా! అక్కడ కొండ మీద గోల్కొండ కోట పెద్ద స్తంభాల చార్ మీనార్ హుస్సేన్ సాగర్లో పెద్ద బుద్ధుడి బొమ్మ గుట్ట మీద బిర్లామందిరం రోడ్డు మధ్యలో పాములా పరుగులు పెట్టే మెట్రో రైలు ఆకాశాన్నంటే ఎత్తైన భవంతులు ఉంటాయటగా! చూపించు అయ్యా "అని గోముగా అడిగింది తండ్రిని.

చంటిది హైదరాబాదంటే ముచ్చట పడుతోందిగా, సిటీలో అనువైన పెళ్ళి సంబంధం చూడొచ్చుగా " బిడ్డ కోరిక తీర్చాలనుకుంది చిలకమ్మ. చిలకమ్మ మాటలు విన్న మిట్టుమియ " వద్దు , వద్దు. తెలిసి చంటి దాన్ని కష్టాల్లోకి నెట్టవద్దు. పోనీ ఎవరి నైన ఇల్లరికం తెచ్చుకుందామంటే సిటీలో మసిలేవారు మన గ్రామీణ ప్రాంతాలకు రావడానికి ఇష్టపడరు. కనక మన ప్రాంతం లోనే సరైన సంబంధం చూసి పెళ్లి చేసి ప్రశాంతంగా బతుకుదాం. పట్నం షోకూలు చూసి సుఖంగా ఉన్న బతుకుల్ని కష్టాల మయం చేసుకో వద్దు" మిట్టుమియ నగరంలోని నరక జీవితం వివరించి చెప్పాడు.

" అలాగేనయ్య , పట్నం బడాయిలు చూసి అమ్మాయిని పస్తులు పెట్టొద్దు. ఈడనే చిన్న దానికి లగ్గం చేద్దాం " అంది చిలకమ్మ.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.
Garudayya bharya
గరుడయ్య భార్య
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Bakkati pellam-laavati mogudu
బక్కటి పెళ్ళాం - లావాటి మొగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు