సక్సెస్ - శింగరాజు శ్రీనివాసరావు

Success

సాయంత్రం ఆరు గంటలు కావస్తున్నది. కార్పొరేటు ఆసుపత్రి వరండాలో డాక్టర్ సునంద హడావుడిగా పరుగులు తీస్తున్నది. చివరిక్షణాలలో పేషెంటును తీసుకొచ్చిన వెంకటేశం మీద పీకల దాకా కోపం వచ్చింది.

ఈ మనుషులంతా ఇంతే ఆఖరిక్షణాలలో తప్ప రోగిని ఆసుపత్రికి తీసుకురారు. వెంకటేశం భార్యకు నొప్పులు రావడం మొదలుబెట్టి గంట దాటింది. ఇప్పుడు తీసుకువచ్చాడు తీరికగా. రాగానే కంగారుపడుతూ సునంద కాళ్ళు పట్టుకున్నాడు, తొందరగా చూడమని. చిర్రెత్తుకొచ్చింది సునందకు. కానీ ఇంతలో ఏదో గుర్తుకువచ్చి సర్దుకుని పేషెంటును ఆపరేషన్ థియేటరుకు తరలించింది. లోపల ఆ అమ్మాయికి నొప్పులు ఎక్కువయినాయి.

అందుకే ఆమెకు ఈ టెన్షను. నర్సులను తొందరపెట్టి ఆపరేషనుకు సిద్ధం చేసింది. తనుకూడా సిద్ధమయి ఆపరేషన్ థియేటరు లోనికి పోబోతున్న తరుణంలో " డాక్టర్. నా భార్యకు ఏమీ కాదు కదా. ఆలస్యంగా తీసుకువచ్చానని కోపగించుకోకుండా జాగ్రత్తగా చూడండమ్మా. ఇబ్బందేమీ లేదు కదమ్మా" ప్రాధేయపడ్డాడు వెంకటేశం.

"నువ్వు ఆలస్యం చేయడం వలన బిడ్డ అడ్డం తిరిగింది. ఆపరేషను చేయాలి. ఆలస్యం లేదు. త్వరగా రెండు లక్షలు సిద్ధం చేసుకో" అని చెప్పి థియేటరు లోనికి వెళ్ళిపోయింది. హతాశుడయ్యాడు వెంకటేశం. కాన్పుకు రెండు లక్షలా. మరి మొన్న చూసిన డాక్టరు ఈ అమ్మాయి చాలా ఆరోగ్యంగా వుంది. సాధారణ డెలివరి అవుతుంది అని చెప్పింది. మరి ఈవిడేమిటి ఇలా? ఏమోలే ఆమె చిన్న డాక్టరు కదా తెలిసి ఉండక పోవచ్చు అనుకుంటూ ఇంటికి ఫోను చేశాడు. " నాన్నా అరుణ కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందట. అర్జంటుగా ఆపరేషను చేయాలని చెప్పి థియేటరు లోనికి తీసుకువెళ్ళింది డాక్టరమ్మ. రెండు లక్షలు తీసుకుని మీరు ఆసుపత్రికి రండి" అని చెప్పి పెట్టేశాడు వెంకటేశం.

ఎటువంటి వార్త వినవలసి వస్తుందోనని దిగాలుగా కుర్చీలో కూలబడ్డాడు వెంకటేశం.

*********************

"దీపా త్వరగా ఆమెకు దుస్తులు మార్చు. అరగంటలో ఆపరేషన్ జరిగిపోవాలి" తొందరచేసింది నర్సును సునంద.

"నొప్పులు ఎక్కువవుతున్నాయి మేడమ్. నార్మల్ డెలివరీ కావచ్చేమో చూద్దామా" ఉచిత సలహా పారేసింది దీప.

" డాక్టరు నువ్వా, నేనా. నోరు మూసుకుని చెప్పంది చెయ్. కొద్దిగా ముక్కుకు మత్తు వాసన చూపించు" గదమాయించింది సునంద.

నాకెందుకులే అనుకుని చెప్పినట్లు చేసింది దీప. అరగంటలో ఆపరేషను ముగించి బిడ్డను బయటకు తీసింది. ఆడపిల్ల పుట్టిందని చెప్పి వెంకటేశంకు కబురు పంపించింది. చకచక మిగిలిన పని ముగించుకుని థియేటరు వెలుపలికి రాగానే వెంకటేశం ఆమె కాళ్ళకు మొక్కి తన భార్యను, బిడ్డను రక్షించినందుకు కృతజ్ఞతలు తెలిపాడు. ఆమెను దేవతని పొగిడాడు. చిరునవ్వు నవ్వి డైరెక్టర్ గదివైపుకు దారితీసింది డాక్టర్ సునంద.

**********************

"అభినందనలు సునంద. ఈ నెల టార్గెటును విజయవంతంగా ముగించావు" అని అభినందించాడు డాక్టర్ వినయ్.

" ధన్యవాదములు డాక్టర్. చాలా ఆదుర్దాపడ్డాను నేను. టార్గెట్ పూర్తిచేయడానికి ఈరోజే చివరి రోజు. చీకటిపడబోతున్నది. ఇంక ఒక్క కేసు ఆపరేషన్ చేస్తే ఈ నెలకు నా లక్ష్యం పూర్తవుతుంది. కానీ ఎవరూరాలేదు అనుకుని డీలా పడ్డాను సర్. ఇంతలోకి ఒక కేసు వచ్చింది. నొప్పులు వెంటవెంటనే వస్తున్నాయి ఆమెకు. ఇంకొక్క గంట వేచి చూస్తే నార్మల్ డెలివరి అయే అవకాశం ఉందనిపించింది. వెంటనే నర్సులను అలర్ట్ చేసి, వాళ్ళ వాళ్ళకు బిడ్డ అడ్డం తిరిగిందని చెప్పి ఆపరేషనుకు ఒప్పించి, నా టార్గెట్ చేరుకున్నాను సర్. చివరిక్షణాలలో ఎక్కడ నార్మల్ డెలివరీ అవుతుందోనని తెగ టెన్షను పడ్డాను సర్. భగవంతుడి దయవల్ల అంతా అనుకూలంగా జరిగిపోయింది. టార్గెట్ చేరుకోవడంలో సక్సెస్ అయ్యాను" ఊపిరి పీల్చుకుంది సునంద.

" అందుకే డాక్టర్. నెల ముందు నుంచే మీరు జాగ్రత్త పడాలి. లేకపోతే మీ ఉద్యోగానికే ప్రమాదం. రాబోయే రోజులలో టార్గెట్ పెరగవచ్చు. అందుకే ముందునుంచి జాగ్రత్తపడండి" అని చెబుతూ జీతపు చెక్కు ఆమెకు అందించాడు డైరెక్టర్.

చెక్కు తీసుకుని బయటకు వస్తున్న సునందకు ఎదురుపడ్డాడు వెంకటేశం. అతని కన్నులలో కృతజ్ఞత కనిపించింది. కానీ సునంద తలదించుకుంది. ఆమెలో ఏదో తప్పుచేసిన భావన.

మరిన్ని కథలు

Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.
Garudayya bharya
గరుడయ్య భార్య
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Bakkati pellam-laavati mogudu
బక్కటి పెళ్ళాం - లావాటి మొగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Barlo taagudu intlo vaagudu
బార్లో తాగుడు - ఇంట్లో వాగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు