పతంగి - వెంకట్ దండుగుల

Patangi

ఇంకా ఏల గాలేదురా పోరగా....! ఏ కాలమాయే పొద్దెక్కి... వాకిట్ల సాంపి సల్లుతూ అరుస్తోంది లచ్చవ్వ.

తల్లి కేకలు విని ఇంకా ముడుచుకున్నాడు సిన్నోడు. ఇద్దరు కొడుకులు ఆమెకు. పెద్దోడు ఉదయాన్నే తల్లి తో పాటుగా లేస్తాడు, ఏ పని చెప్పినా చేస్తాడు. పెద్దోనితో పరేషాన్ ఏమిలేదుగానీ చిక్కంతా చిన్నోనితోనే. చెయ్యొద్దన్న పని చేసి చీవాట్లు తింటూ ఉంటాడు.

ఇంత పొద్దుగాల లెవ్వ బుద్ది అయితలేదు సిన్నోనికి, అసలే సలికాలమాయె. పొయ్యి మీద నీళ్లు మసిలిపాయె..లేరా.... ఇంకోసారి కేకేసింది లచ్చవ్వ. ఇగ తప్పదు అన్నట్టు మెల్లగా దుప్పటి తీసిండు సిన్నోడు అయిష్టంగానే. కిటికీల నుంచి ఒస్తున్న ఎండ మొఖం మీద పడింది. ఇయ్యాల ఆదివారం ఇంకా జెరసేపు పండుకుంటే మంచిగుంటుండే అని అనుకుంటూ బయట పొయ్యి కాడ పీట మీద కూసుండు.

మల్లో ఇర్స కూసోవాల్నా ఇంకా, పొద్దుగాలనే లేసినవని.. నోట్లె పల్గారా (బ్రష్ ) ఏస్కో... అన్నది లచ్చవ్వ. సిన్నోడు సిరాగ్గా పండ్లు తోముకుంటనే పతంగులు ఏమైనా ఎగురుతున్నాయా అని పైకి చూసిండు. సంక్రాంత్రి పండుగ ఇంకా పదిరోజులే ఉంది. అందుకే పొద్దుగాలనే షురూ జేసిండ్రు పోరగాండ్లు. రొండు మూడు ఎగురుతనే ఉన్నాయ్. అవ్వి సూడంగానే పాణమంతా పతంగుల మీదనే ఉన్నది. ఆగమాగం తానం జేసి ఇంటెన్క గల్లీలకు ఉరికిండు సిన్నోడు. అప్పటికే సిన్నోడి దోస్తులు ఇద్దరు గుడి మీదికెక్కి పతంగి ఎగరేస్తున్నరు. అది సూసి సిన్నోడి పానం సివుక్కు మన్నది. వాని దగ్గరేమో పతంగి లేకపాయే, అమ్మని పైసలు అడిగితే ఇయ్యదాయే. ఎట్ల ఇప్పుడు అని అనుకుంటుండగానే పెద్దోని పతంగి గుర్తొచ్చింది. ఇంట్లో పెద్దోడు లేడు. అదే అదను సూసుకొని అందుక పోయిండు పోరగాండ్ల సోపతికి. వాని పతంగి దోస్తుల పతంగి కంటే పైకి ఎగరాలని పోటీ పడుతున్నాడు పాపం పోరడు.

ఇగ అంతలోనే ఎనుక నుంచి మెడ మీద పడ్డది పట్టుమని సప్పుడు చేస్తూ ఒక చేతు. మెడ సుర్రు మంటుండగానే సర్రున వెనుకకు తిరిగి సూసిండు. ఎనుక పెద్దోడు, పతంగి దిక్కు వాని దిక్కు చూస్తుండు కోపంగా. పరుగందుకున్నాడు లాగుని పైకి లాగి పట్టుకొని సిన్నోడు. దోస్తుగాండ్లు వాన్ని పెద్దోడు కొట్టినప్పుడు నవ్విన నవ్వు కొట్టడం కంటే ఎక్కువ బాధను కలిగించాయి. దుఃఖం, కోపం, ఆవేశం అన్నీ ఒక్కసారే ఒచ్చినై పాపం. పండుగ దగ్గరికోస్తున్నా ఇంకా పతంగి ఎగరేయ్యలేదు వాడు. రాత్రి పండుకుంటే నిద్రొస్తలేదు, ఆలోచిస్తున్నాడు. అప్పుడే వినిపించింది అయ్య గొంతు.

ఏమేవ్.. ఇంత బువ్వ పెట్టు ఆకలైతుంది. అయ్యవంక చూసాడు చిన్నోడు. అంగి తీసి కొయ్యకు తగిలించి కాళ్ళు కడుక్కుంటున్నాడు అయ్య. ఎదో ఆలోచన వచ్చింది వాడికి.

అర్ధరాత్రి అయ్యింది, అందరూ నిద్రపోతున్నారు. అయ్యేమో గురక పెడుతున్నాడు. సప్పుడు సెయ్యకుండా అయ్య అంగి దగ్గరికి పోయి జేబులో చెయ్యి పెట్టాడు. చేతికి ఎదో తగిలింది. బయటికి తీసి చూసాడు. పర్మాష్ బీడి కట్ట, అగ్గిపెట్టె. మళ్ళీ చేయి పెట్టి చూసాడు, ఊహు దొరకలేవు చిల్లర పైసలు. నిరాశతో పడుకున్నాడు చిన్నోడు.

పొద్దూకింది సోయి లేదా........ ... అమ్మ అరుపు అప్పుడే తెల్లారిందా అనుకుంటూ లేచాడు చిన్నోడు. రాత్రి తాలూకు పైసల నిరాశ ఇంకా పోలేదు. లేచి పక్క బట్టలు సర్దాలని తెల్వదా..? అని అమ్మ అరుస్తున్న అరుపుల్ని పట్టించుకోకుండా బయటికి చూసాడు. అవును, ఇంకేదో సప్పుడు, బయటికి రమ్మంటోంది.

ఒక్క దుంకులో బయటకి వచ్చాడు. సర్రున గాలిని చీల్చుకుంటూ.... బర్ర్ ర్ మని సప్పుడు చేస్తూ గాలిల ఈరంగం ఏస్తోంది తెల్లని చాప పతంగి. దానికి ఎదురుగుండా దూసుకు వచ్చి పోరాడుతోంది జీబ్ దార్ (నామం పతంగి). రెండు పతంగులూ విరోచత పోరాటం చేస్తున్నాయి ఒకదానికొకటి ఏమాత్రం తక్కువ కాకుండా. చూడ ముచ్చటగా ఉంది ఆ దృశ్యం సిన్నోడికి. ప్రపంచాన్ని మైమరచిపోయి చూస్తున్నాడు ఆ పతంగులను.

అంత లోనే 'గయా' అన్న అరుపు.. ఒక్కసారిగా మెరిసింది వాడి కండ్లల్లో మెరుపు. నీళ్ళల్లో ఈదుతున్న చాపలా ఆకాశంలో నుంచి సర్రున జారుతూంది చాప పతంగి. కాళ్లకు చెప్పులు లేవన్న సంగతి కూడా మరిచి పోయి పరుగు అందుకున్నాడు సిన్నోడు జారుతున్న పతంగిని చూస్తూ.

కూడు బుక్కి పోదువు ఆగురా...... ....,. అమ్మ అరుపులు అస్సలు వినిపించడం లేదు వాడికి. గాలిలో పల్టీలు కొడుతూ పక్క గల్లీలో రెండతస్తుల బంగ్లా మీద పడబోతుంది పతంగి. బంగ్లా ఎక్కుతున్నాడు తొందర తొందర గా పతంగి తనకే దొరకాలని, ఆయాసం వస్తున్నా అదేమీ పట్టనట్టు. కానీ అప్పటికే బంగ్లా ఎక్కి పతంగిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు శీను గాడు . సీను గాడు సిన్నోనికి సిన్నప్పటి నుంచి సెడ్డి దోస్తు. పతంగి సీను గాని చేతుల్లోకి రాబోయేంతలో వెనుక నుంచి వాన్ని పక్కకు నూకేసి పతంగిని పట్టుకున్నాడు సిన్నోడు.

సీను అదుపు తప్పి బంగ్లా మీది కెళ్ళి కింద పడిపోయాడు. దోస్తు గాడు పడిపోయిండు అన్న సంగతి పట్టించు కోకుండా పతంగి దొరికిందన్న సంతోషం తో పారిపోయాడు అక్కడినుంచి సిన్నోడు. * * * సిన్నోడి గాలిపటం గాల్లోకి ఎగిరింది. అది గాల్లో ఒయ్యారాలు పోతుంటే సిన్నోడి ఆనందం ఆకాశాన్ని అంటుతుంది. అదే ఆనందం వాడు ఎగరేస్తున్న పతంగిని చూస్తున్న ఇంకో రెండు కళ్ళలో కూడా ఉన్నదని వాడికి తెలియదు.

ప్రపంచాన్ని మరిచి పతంగి ఎగరేస్తున్న చిన్నోడు ఒక్కసారిగా 'అమ్మా' అని అరిచిన అరుపుకు ఈ లోకంలోకి వచ్చాడు. తలకు కట్టుతో చేయి పట్టుకొని బాధతో అరుస్తున్నాడు శీనుగాడు. వాడు అరిచే అరుపుకు పక్కనున్న పొదల్లోకి సర్రున జొర్రింది పాము . తనకు కాటేయాల్సింది స్నేహితుడు చేతు అడ్డం పెట్టడం తో వాన్ని కరిచిందని గ్రహించడానికి ఎక్కవ టైం పట్టలేదు వాడికి. సీను గాడేమో బాధతో మెలికలు తిరిగి పోతున్నాడు. నోట్లో నుంచి నురగలు వస్తున్నాయి. * * *

ఇయ్యాలనే సంక్రాంతి పండుగ. నమాజ్ కాకముందే నిద్ర లేసింది లచ్చవ్వ. అలవాటు ప్రకారంగా వాకిలి ఊడవడానికి ఒచ్చి ఇచ్చన్త్రపోయింది. ఆకిలి సుబ్రన్గా ఊకి,సాంపి నీళ్లు సల్లి, రంగుల ముగ్గు ఏసి ఉంది. అమ్మా నీకోసం వేడి నీళ్లు పెట్టాను. తొందరగా తయారవమ్మా గుడికి పోదాం ఇయ్యాల పండుగ అని అంటున్న సిన్నోన్ని దగ్గరకు తీసుకుంది లచ్చవ్వ ప్రేమగా.

అమ్మ అడగకున్నా ఇచ్చిన పది రూపాయలతో పతంగి కొనుక్కొని పరుగు పరుగున మైదానం లకు ఉరికిండు సిన్నోడు. పండుగ రోజు పతంగులు జోరుగా ఎగురుతున్నాయి. సినిమా పాటలతో సందడి సందడిగా ఉంది సంక్రాంతి. ఆకాశంలో రంగు రంగుల గాలిపఠాలు.

తన ఎదురుగా ఆరోజే ఆసుపత్రి నుంచి వచ్చిన దోస్తు శీనుగాడు. వాడి చేతిలో అమ్మిచ్చిన పదిరోపాలతో కొన్న పతంగి. స్నేహితుని మొహం లో ఆనందం చూసి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి సిన్నోనికి.

అవి మరపురాని మధుర జ్ఞాపకాలనీ, అంతటి ఆనంద క్షణాలను ఆస్వాదించే అవకాశం ఇక జీవితంలో రాదనీ.. తెలియని స్నేహితులు గాల్లో ఎగురుతున్న గాలి పటాన్ని కల్మషం లేని కళ్లతో చూస్తూ ఉండిపోయారు.

మరిన్ని కథలు

Garudayya bharya
గరుడయ్య భార్య
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Bakkati pellam-laavati mogudu
బక్కటి పెళ్ళాం - లావాటి మొగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Barlo taagudu intlo vaagudu
బార్లో తాగుడు - ఇంట్లో వాగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు