పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు వెళ్ళి బేతాళుని బంధించి భుజాన వేసుకుని మౌనంగా నడవ సాగాడు. విక్రమార్కుని భుజం శవాన్ని ఆవహించి ఉన్న బేతాళుడు 'మహీపాల నీశ్రమ, పట్టుదల, సాహసం, అభినందనీయం. గయుడు, అంబరీషుడు, శశిబిందు, అనంగుడు, ఫృధువు, మరుత్, సహోత్రుడు, పరశురాముడు, శ్రీరాముడు, భరతుడు, దిలీపుడు, శిబి, రంతిదేవుడు, యయాతి, మాంధాత, భగీరధుడు వంటి షోడశ మహ రాజుల సరసన నిలువ గలిగిన నీవే, చాలా కాలంగా నాకు ఉన్న సందేహాన్ని తీర్చాలి.అది నీకు 'ఓటమి లొ గెలుపు'అనే కథా రూపంలో చెపుతాను విను.
పూర్వం అమరావతి రాజ్యాన్ని చంద్రసేనుడు అనే రాజు పరి పాలిస్తుండేవాడు.అతని మంత్రి పేరు సుబుధ్ధి. వారి రాజ్యంలో ప్రతి ఏడు దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఆ సంవత్సరం అమరావతి రాజ్య సేనాని వృధాప్యంతొ తన పదవి నుండి తప్పుకోవడంతో ఆపదవికి తగిన వ్యక్తిని ఎంపిక చేసే బాద్యత మంత్రి సుబుద్ధికి అప్పగించాడు రాజు చెంద్రసేనుడు.
దసరా ఉత్సవాలలో జరిగే పోటీలలో కత్తి యుధ్ధంలో విజేతగా వచ్చిన వారినే సర్వ సైన్యాధిపతిగా నియమిస్తామని,కత్తి యుధ్ధంలో పాల్గొన్న ప్రతి వారిని తమ పోరాట పటిమను బట్టి సైన్యం లో సముచిత స్ధానం కలిగిస్తామని మంత్రి సుబుధ్ధి ప్రకటించాడు.
కత్తి యుధ్ధ పోటీలు రెండు రోజులు జరిగాయి. పలువురు యువకులు పాల్గొన్నారు.చివరిగా మొదటి నుండి గెలుస్తూ వస్తున్న విజయుడు అనే యువకుడు,తన పెదనాన్న కుమారుడు తన బాల్య ప్రాణ స్నేహితుడు అన్న వరుస అయిన శివయ్య చేతిలో అనూహ్యంగా ఓడిపోయాడు. సైన్యాధికారి పదవి శివయ్యకు దక్కింది. విజయునికి దళపతి పదవి దక్కగా, కత్తియుధ్ధలో పాల్గోన్న ప్రతివారిని వారి పోరాడే విధానాన్నిబట్టి సైన్యంలోనికి తీసుకున్నారు.
ఓటమి పొందిన విజయుని కలసిన మంత్రి 'నాయనా శివయ్య నువ్వు ఇద్దరు దేశభక్తులే ఆవిషయం నాకు తెలుసు. కత్త పట్టిన నాటి నుండి ఓటమి ఎరుగని నీవు వరుసకు అన్నగారైన శివయ్య చేతిలో అనూహ్యంగా ఓడిపోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది.శివయ్య కూడా మంచి పోరాట యోధుడే, నీ వీరత్వం,పోరాట పటిమ గురించి వేగుల ద్వారా తెలుసుకున్నాను. నువ్వు ఆగర్బ శ్రీమంతుడివి. కావాలని నీ ప్రాణ స్నేహితుడు అయిన నీ అన్న శివయ్య చేతిలో ఓడిపోయావు. అయినా నువ్వు ఓటమి లో విజయం పొందావు.నీచర్య వెనుక ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది వివరంగా చెప్పు' అన్నాడు మంత్రి. తను కావాలని ఓడి పోవడానికి కారణం వివరించాడు విజయుడు.తృప్తిగా తలఊపాడు మంత్రి.
'విక్రమార్కా విజయుడు సహజంగా మహావీరుడు ఓటమి ఎరుగని వాడు.అయినప్పటికి శివయ్య చేతిలో ఓడిపోవడానికి కారణం ఏమిటి?తను ఓడి విజయం సాధించిన విజయుడు మంత్రి అడిగిన ఇదే ప్రశ్నకు ఏ సమాధానం చెప్పాడో ఊహించి చెప్పగలవా? తెలిసి సమాధానం చెప్పక పోయావో తల పగిలి మరణిస్తావు'అన్నాడు బేతాళుడు.
'బేతాళా విజయుడు శివయ్య బాల్యం నుండి కలసి చదువుకుని కత్తియుధ్ధం నేర్చుకున్నారు. విజయుని కుటుంబం నేడు ధనవంతులుగా ఉండటానికి కారణం శివయ్యకుటుంబం అయి ఉండాలి.పేదరికంలో ఉన్న తన అన్న శివయ్యకు ఉన్నతమైన సైన్యాధిపతి పదవి దక్కేలా చేయాలని విజయుడు ఈనిర్ణయం తీసుకున్నాడు. శివయ్య కుటుంబం ఆర్ధకంగా బల పడటంతో పాటు వారి కుటుంబానికి సమాజంలో సముచిత స్ధానం లభిస్తుంది.విజయుడు కూడా సైన్యంలో ఉండి యుధ్ధం అంటూ వస్తే తన అన్న శివయ్య తో కలసి శత్రు సైన్యాలను ఎదుర్కుంటారుకనక అన్నివిధాల ఆలో చించి ఈ నిర్ణం తీసుకున్నాడు అలా విజయుడు ఓటమిలో విజయం సాధించాడు'అన్నాడు విక్రమార్కుడు. విక్రమార్కునికి మౌనభంగం కావడంతో శవంతో సహ మాయమైన బేతాళుడు చెట్టు పైకి చేరాడు. పట్టు వదలని విక్రమార్కుడు బేతాళుని కై వెను తిరిగాడు.