ప్రభుత్వ అధీనంలోనికి మరొ హిందూ దేవుడు...? - Pooni Venkataraman

Prabhutwa adheenamloki maro hindu devudu

కౌసల్యా సుప్రజారామా పూర్వాసంధ్యా ప్రవర్తతే...

శ్రీవేంకటేశ్వర సుప్రభాతం భూతపూర్వ తి.తి.దే. వారి వేదపారయణందారు, కీ.శే. అనంతశయనం గాత్రంలో మంద్రంగ వినిపిస్తోంది. తిరుపతివాణ్ణిగా నాకు ఎం.ఎస్. సుబ్బలక్ష్మి చెప్పిన సుప్రభాతానికన్నా, కొన్ని దశాబ్దాలపాటు శ్రీవారికి ప్రత్యక్షంగా మేలుకొలుపు పాడిన వారిగాత్రమే ఇష్టం.

మాయింట్లో సుప్రభాతం వినిపించిందంటే తెల్లవారిఝాము 5-00 గంటలు అయినట్టు . నాశ్రీమతి నిద్రలేవగానే సుప్రభాతం సి.డి. ఆన్ చేసి తన దినచర్యకు ఉపక్రమిస్తుంది..

నేను మంచందిగి, కళ్ళుమూసుకుని సుప్రభాతం వింటున్నాను. ఇది ఉద్యోగవిరమణ చేసిన 17 సం.లు గా నాకు అలవడిన అలవాటు.

ఇంతలో నా సెల్ మోగింది. పరిచయమైన రింగ్ టోన్. నాబాల్య మిత్రుడు, నాసహాధ్యాయి అయిన రామమూర్తిరెడ్డి చేస్తున్నాడు. వాడు మాస్వగ్రామంలోనే వుంటాడు.

"ఏరా, అప్పుడే తెల్లవారిందా", అన్నాను.

"మామా, నువ్వు వెంటనే మనవూరు రావాల. నువ్వు రాకుండా ఎదైనా సాకు చెప్తావని, నేనే 11-30 ఫ్లైట్ కు బుక్ చేశా. చెల్లెమ్మకూడా వస్తుందేమో కనుక్కో, బుక్ చెస్తా. ఇంకా చాలా సీట్లు వున్నాయ్", అన్నాడు.

"వస్తానులేరా, సస్పెన్సుపెట్టకుండా విషయం చెప్పు. మీచెల్లెమ్మ వచ్చేది, రానిది నేను చూసుకుంటాలే".

"మనవూరి గుడి గురించి. నువ్వు వచ్చినాక అన్నీ మాట్లాడుకుందాం. మన మునిరామయ్య కొడుకు, మునికృష్ణ ఏర్పోర్ట్ కు కార్ తీసుకుని వస్తాడు", అని ఫోన్ పెట్టేశాడు.

ఇక తప్పేదేముంది, కుర్చీనుండి లేచి బాత్ రూంలోకి నడిచాను.

స్నానం, సంధ్యావందనం పూర్తి అయేసరికి మాకోడలు రవదోసెల ప్లేట్ అందించింది. నాశ్రీమతి " ఎందుకండీ, రామ్మూర్తన్న అంత తొందరగా రమ్మని ఫోన్ చేశాడు", అడిగింది.

"వాడు ఎప్పుడూ ఇంతే. ఏవిషయమూ పూర్తిగా చెప్పడు, పోక తప్పదు కదా" అన్నాను..

"ఎందుకండీ అంతనటన. మీవూరికి పోవడం మీకిష్టమే కదా" అని చురక తగిలించింది. నిజమే మరి.

మాయింటి నుంచి శంశాబాద్ విమానాశ్రయం అరగంట దూరంలో వున్నా, వయసు పెరిగేకొద్దీ వచ్చే చాదస్తాలవల్ల 9-00 గం.లకే మాడ్రైవర్ను కారు తీయమన్నాను.

ఏర్పోర్ట్ చేరేసరికి సమయం 9-35. చెకిన్ లగ్గేజ్ లేనందువల్ల, కియొస్క్ దగ్గర బోర్డింగ్ పాస్ తీసుకుని సెక్యూరిటీ చెక్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాను. 15 నిమిషాలలో చెకింగ్ కార్యక్రమం పూర్తయింది. డిపార్చర్ లౌంజ్ లో గేట్ దగ్గర ఒక కుర్చీలో కూర్చున్నాను.

కూర్చున్న మరుక్షణమే రామమూర్తి ఎందుకు అంత తొందరగా రమ్మన్నాడు అన్నదానిపైన ఆలోచనలు మళ్ళాయి. గుడి విషయం మాట్లాడాలన్నాడు.. ఏమైవుంటుంది. అసలు మావూరిలో ఒక దేవాలయం వెలవడం ఒక అద్భుతం. ,

బెంగుళూరు నుండి కోస్తా ఆంధ్రకు పోయే జాతీయ రహదారిలో, చిత్తూరు తిరుపతి మధ్య , తిరుపతికి 30 కీలో మీటర్ల దూరంలో వున్న ఒక పల్లెటూరు మాపూర్వీకుల స్వగ్రామం. జాతీయ రహదారి నుండి దక్షిణంగా 2 కిలో మీటర్లు పోవాల. నేను పుట్టకముందే మానాన్నగారికి తిరుపతిలో దేవస్థానం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం రావడంతో మాకుటుంబం తిరుపతిలో స్థిరపడడం జరిగింది. అయినా మాతాతగారి మిత్రులు, మానాన్నగారి సహాధ్యాయులు తిరుపతికి వచ్చినప్పుడు మాయింటికి రావడంకద్దు. ఆక్రమంలో రామమూర్తిరెడ్డి ఉన్నతాభ్యాసానికి తిరుపతిలో మాబళ్ళోనే చేరడం, వాడు, నేను ఒకే బెంచిలో కూర్చోవడం, మా యిద్దరిమధ్య విడదీయరాని బంధం ఏర్పడి, యీనాటివరకు సాగిపోతూవుంది.

కాలక్రమంలో నేను కళాశాల విద్యలో హిస్టరీ వైపు వెళ్ళడం, రామ్మూర్తి వెటర్నరీలో చేరడంతో మాదారులు వేరైనా తిరుపతిలో మాచదువులు కొనసాగడంవల్ల ప్రతిదినం ఒకరినొకరం చూసుకునేవాళ్ళం. నేను శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చరిత్రలో ఏం.ఏ. చేసి, అప్పటి మా ఆచార్యులు కీ.శే. మారేమండ రామారావుగారు పురావస్తు పరిశోధనలపట్ల రగిలించిన ఉత్సాహంవల్ల, భారత పురావస్తు పరిశోధక సంస్థలో పరిశోధకుడిగా చేరడానికి అర్హత సంపాదించి ఉద్యోగంలో చేరిపోయాను. అంచలంచలుగా పదోన్నతి అందుకుంటూ 17 సంవత్సరాలకు ముందు పదవీవిరమణ చేసి ప్రస్తుతం మాపెద్దబ్బాయ్ దగ్గర హైదరాబాద్ లో వుంటున్నా. రామ్మూర్తి బి.వి.ఎస్సీ చేసి వాళ్ళ పాడి, పశువులు, వ్యవసాయం చూసుకుంటూ, స్వస్థలంలోనే స్థిరపడ్డాడు. ఈదూరాభారాలు మామైత్రికి ఏవిధంగానూ అడ్డుకాలేదు.ఎవరింట్లొ పురుడూ,పేరంటం జరిగినా మాకుటుంబాలు కలుసుకోవలసిందే.

ఇంతలో, దాదాపు నావయసున్న వ్యక్తి నాపక్కనున్న కుర్చీలో ఒక బ్రీఫ్ కేస్ పెట్టి,"సార్, బాత్ రూం పోయివస్తాను,5 నిమిషాలు నాబ్రీఫ్ కేస్ చూస్తుండండి" అన్నాడు.. దాంతో నా ఆలోచనలు తెగి పరిసరాలు గమనిస్తూ కూర్చున్నా.బ్రీఫ్ కేస్ ఆసామి తిరిగివచ్చి నాపక్కన కూర్చున్నాడు. అతడే నన్ను "మీరూ తిరుపతి ఫ్లైట్ కేనా సార్" అంటూ మాటల్లోకి దింపాడు. మామధ్య నడచిన సంభాషణ వల్ల అతడుకూడా తిరుపతివాసేనని, మాతండ్రిగారికి శిష్యుడేనని, నాకు 2 సం.లు జూనియర్ అని తెలిసింది. అసిస్టంట్ డైరెక్టర్ ఆఫ్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ గా చేసి రిటైర్ అయ్యాడు. అతడు "మిమ్మల్ని చూడగానే అయ్యవారు గుర్తుకొచ్చారండీ" అన్నాడు. ఇక ఆయనతో అదీ యిదీ మాట్లాడుతుండగా బోర్డింగ్ అనౌన్స్మెంట్ వినిపించింది.క్యూలో నిలబడి విమానంలోకి ప్రవేశించగానే మాయిద్దరివి పక్క,పక్క సీట్లవడంతో తిరుపతిలో ఫ్లైట్ ల్యాండ్ అయ్యేవరకు మా సంభాషణలు కొనసాగించాం. తిరుపతి విమానాశ్రయం బయటకు వస్తూ, అన్నట్టు ఆయన పేరు చెప్పడం మరిచాను, జానకిరాం, "మీరు తిరుపతికి ఎట్లా పోతారు" అని అడిగాను. ఆటోలో వెళతానన్నాడు. నాకుగాను కార్ వస్తుంది మిమ్మల్ని మీయింటిదగ్గర డ్రాప్ చేస్తానన్నాను. బయటపడగానే మునికృష్ణ నాచేతిలోని బ్యాగ్ అందుకున్నాడు.

"మునికృష్ణా, మామిత్రుణ్ణి, అనంతవీధిలో దింపాల. బండి పోనీ" అన్నాను.

జానకిరాంగారిని వారి యింటిదగ్గర దిగబెట్టేసరికి 1-15నిమిషాలు. ఆయన "రండి సార్,ఇంతదూరం వచ్చారు భోంచేసి వెళ్ళండి"అన్నాడు. నేను సున్నితంగా తప్పించుకుని కార్ ను నేరుగా భీమాస్ ఫాస్ట్ ఫుడ్స్ కు మళ్ళీంచాను. భోజనం సమయానికి నెల్లూరులో ఉంటే కోమలవిలాస్ లో, తిరుపతిలో ఉంటే భీమాస్ ఫాస్ట్ ఫుడ్స్ లో తినడం నాకు యిష్టం.

నేను, డ్రైవరు భోజనం పూర్తిచేసుకుని 2-30 గంటలకు బయలుదేరాం.

"మునికృష్ణా, బండిని యూనివర్సిటి రోడ్ లోనుంచీ పోనీ. బైపాస్ రోడ్ వద్దు" అన్నా. నాకు చిన్నప్పటినుండి తిరిగిన ఆ పరిసరాలు చూస్తుంటే ప్రాణం లేచివచ్చినట్లుగా వుంటుంది.

నేను చదువుకున్న, శ్రీవేంకటేశ్వర ఉన్నత పాఠశాల ముందు రాగానే, రోడ్డు వారగా కార్ ఆపమన్నాను . కారుదిగి, ప్రధాన ప్రవేశద్వారం ముందు నిలబడి ఆ భవనంవైపు చూస్తున్నా. లోపలకు పోదామా అనుకుంటుండగా గేటు దగ్గర వున్న ఒక పోలీస్ కానిస్టేబుల్,"ఎవరయ్యా పెద్దాయనా, నీకిక్కడేంపని" అని దబాయింపుగా అడిగాడు. ప్రస్తుతం ఆభవనంలో తిరుపతి అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయం వున్నది.

"ఇది నేను 60ఏండ్లకు ముందు చదువుకున్న స్కూల్ బిల్డింగ్. అందుకే చూస్తున్నా".

" ఈవూర్లో ముసలోళ్ళందరికి ఇదొక పనైపొయింది. గేట్ దగ్గర నిలబడి, ఇది మాస్కూల్ అంటుంటారు", ఇక దయచేయ్ అన్నట్లు చూశాడు.

నిజంచెప్పాల, ప్రాణం కలుక్కుమనింది. 130 సం.లకు ముందు తిరుమల తిరుపతి దేవస్థానముల విచారణకర్త,మహంత్ నారాయణదాస్ జీ హయాంలో పాఠశాల స్థాపించి కట్టిన భవనం. ఆనాడుకూడా కొందరు ప్రబుద్ధులు, ఆలయాల నుండి వచ్చిన ఆదాయాన్ని ఇతర ప్రయోజనాలకు వాడకూడదని అభ్యంతరం లేవనెత్తారు. ఆలయాల నిధులను విద్య విషయంగా వినియోగించడం దుర్వినియోగం క్రింద రాదని మద్రాసు హైకోర్ట్ జడ్జి జస్టిస్ శేషగిరి అయ్యర్ గారి తీర్పు వల్ల పాఠశాల స్థాపన రూపుదిద్దుకుంది. లోక్ సభాధ్యక్షులు, మాడభూషి అనంతశయనం అయంగారుగారు, మహాకవి, శంకరంబాడి సుందరాచారిగారు, ఒక ఫెడరల్ కోర్ట్ జడ్జి, ఒక లోక్ సభ సభ్యుడు, ఒక రాష్ట్ర అడ్వొకేట్ జనరల్, ఒక విశ్వవిద్యాలయ ఉపకులపతి వంటివారు చదువుకున్న పాఠశాల. 15 సం.లకు ముందు కూలిపోయే ప్రమాదం వున్నదని సాకుచూపించి స్కూల్ ఖాళీ చెయించి, అంత గొప్ప భవనాన్ని పోలీస్ వారి పరంచేశారు తి.తి.దే. వారు. ఈదారుణం మా పాఠశాల పూర్వ విద్యార్థి, తి.తి.దే. పాలకమండలి అధ్యక్షుడిగా వున్న సమయంలో జరిగింది.

ఎస్.వి. మ్యూసిక్ కాలేజ్ దాటగానే,"మునికృష్ణా, ఏం మీరెడ్డి యింత తొందరగా నన్ను రమ్మన్నాడు. ఊరిలో ఏమన్నా విశేషమా.".

"నాకు తెలీదు సార్". నా అలోచనలు మరలా మావూరి గుడిమీదికి మళ్ళింది.

అసలు మావూరిలో దేవాలయం వెలిసింది విచిత్రమైన పరిస్థితులలో. నేను ఉద్యోగంలో చేరి 4 సం.లు. అయివుంటుంది. ఒకరోజు ఆదిశేషారెడ్డి మామ దగ్గరనుంచి ఒకట్రంక్ కాల్ వచ్చింది.

"ఒరే అబ్బా, నువ్వు సావకాశం చేసుకుని మనవూరికి రావాల్రా. చాలాముక్యమైన సంగతి. ఈశనాదివారాలలో వచ్చేయ్. ఆలీశం చేయమాక".

" అసలు ఏమైందో చెప్పు మామా" అన్నాను.

"నువ్వు వచ్చినంక మాట్లాడుకుంటాం, నువ్వు బిరీన రా".అన్నాడు.

ఆదిశేషారెడ్డి అంటే రామ్మూర్తి తండ్రి. వారి కుటుంబం మావూరికి అనువంశిక గ్రామమునసబులు. పదవిని రాజకీయాలకు వాడుకోని అతితక్కువమందిలో ఆయన ఒకడు. 1985లో ఎన్.టి. రామారావు ప్రభుత్వం గ్రామాధికార వ్యవస్థను రద్దు చేసినప్పుడు, మారామ్మూర్తి , మనను ఇష్టపడనివాడి కొలువు మనకెందుకు, అనిచాలామంది చేసినట్లు కోర్ట్ ను ఆశ్రయించకుండా, రికార్డులంతా తహసిల్దారు పరం చేసినాడు.

కారు కొంచెంనెమ్మదించింది. శ్రీ అగస్తేశ్వరాలయం ముందు కాస్వే మీద స్వల్పమైన ట్రాఫిక్ జాం. చంద్రగిరి ప్రవేశించి, కోట శిధిలాలను దాటగానే మరలా మావూరి గుడి పైకి నా ఆలోచనలు మళ్ళాయి.

నేను ఆదిశేషారెడ్డిమామ కోరినవిధంగా శని,ఆదివారాలతో కలిసివచ్చేటట్లు 4 రోజులు లీవ్ పెట్టి,మావూరికి చేరుకున్నా. మేము ఎప్పుడు మావూరికి పోయినా వాళ్ళయింట్లోనే మామకాం.

ఇంటిల్లిపాదీ నన్ను అప్యాయంగా అహ్వానించారు. నేను ముఖప్రక్షాళనం చేసుకునిరాగానే, రామ్మూర్తి భార్య రత్నమ్మ నాకు కాఫీ కప్పు ఇస్తూ "వదిన, పిల్లోడు బాగున్నారాన్నా"పలకరించింది.

నేను సమాధానంయిస్తూండగా రామ్ముర్తి, మేఘవర్ణం నాయుడు, కరణం సుబ్రహ్మణ్యంపిళ్ళె,యింకా కొందరు గ్రామపెద్దలు వచ్చినారు. కరణాన్ని పలకరింపుగా చూచి, నాయుడుగారిని

"ఎట్లా వున్నారు మామా" అని అడిగాను. అరోజుల్లో మావూర్లో కులతారతమ్యం లేకుండా వరసలతో పిలుచుకునేవాళ్ళం.

"అందరం బాగుండామబ్బా", అన్నాడు.

ఆదిశేషారెడ్డిమామ "ఒరేఅబ్బా, అందరు వచ్చి వుండారు . ఇప్పుడు నేనుచెప్పేది జాగ్రత్తగా విని మాకు మందల చెప్పు”, అన్నారు.

నాకేమీ అర్థంకావడంలా."విషయం చెప్పు మామా",అన్నాను.

"ఊరికి పడమటగా వున్న 2ఎకరాలలోవున్న గొడ్లసావిడిని కొట్టేసి కొత్తగా కడదామని పదిదినాలకు ముందు కడగాలు ( పునాది) తవ్వతావుంటే ఒక యిచిత్రం బయటపడింది. తొలిదినం తవ్వకాం జరిగింది. మేస్త్రీ కూలీలు తక్కువమందిని పెట్టడంవల్ల, ఒకపక్కతవ్వకం పూర్తికాలే. మర్రోజు, చీకటితోనే కడగాలు దగ్గరకు పోయినా. లోతుగాతవ్విన చోట నల్లగా, జానపొడవుతో మెరుస్తూ కనబడింది. మనసేద్యగాడు, ఎంకణ్ణి గుంటలోకి దిగి, దాని చుట్టూ లోడమన్న. నిగనిగలాడుతున్న చెయ్యి,చేతిలో శంఖుతో బయట పడింది. ఆపాట్నే రామ్మూర్తిని పిలిచి, మేఘవర్ణాన్ని, కరణాన్ని తొడుక్కోనిరమ్మన్నా. వాళ్ళిద్దరూ రాగానే గుంటలోకి చూడమన్నా. మేఘవర్ణం, రామ్మూర్తి గుంటలోకి దిగేసి మట్టిని జాగ్రత్తగా లోడినారు.

మేఘవర్ణం "బావా, ఇదేందో దేవుడి విగ్రహంగా వుంది. కడగాలపని నిలిపేయమని మేస్త్రీ సుబ్బయ్యకు చెప్పు" అన్నాడు.

సుబ్బయ్యను పిలిపించి, "కూలీలని రావద్దని చెప్పి, నువ్వుమాత్రంరా" అన్నాను. సుబ్బయ్య అట్లే అనిపోయి తిరిగివచ్చినంక, వాడు, మేఘవర్ణం, రామ్మూర్తి కలిసి దెబ్బతగలకుండా మట్టిని లోడినారు. విగ్రహం బయటపడింది.

ఆరడుగులు ఎత్తున్న విగ్రహం, చెక్కు చెదరలే. ఊరిపెద్దవాళ్ళను పిలిచి వాళ్ళకు విషయం చెప్పినా. ఇదో యీగురవయ్య,"రెడ్డీ, విషయాన్ని బయటకు పొక్కనీబాకండి. మనవూర్లో దేవుడు వెలిసినట్లున్నాడు. మనమే గుడి కట్టుకుంటాం" అన్నాడు. విగ్రహాన్ని మన షెడ్ లో పెట్టి కాపాడుతున్నాం. ఇంక నువ్వు వచ్చినావ్. ఏంచేయాలో మందల చెప్పు.

అందరం షెడ్ దగ్గరకు పోయినాం. తలుపు తెరవగానే ఒక అద్భుతం కనపడింది. నిలువెత్తు మహావిష్ణు విగ్రహం. పద్మపీఠంతో కూడి వుంది. సాలగ్రామశిల. నా శిక్షణ పొందిన మెదడుతో అన్నివిధాలా పరిశీలించి చూచినాను.ఒక్కచోటకూడా విగ్రహం భిన్నం కాలేదు. ఆలోచనలు నన్ను ముసురుకున్నాయి. దక్షిణభారతంలో కూడా తురుష్కమూకలు దేవాలయాలను ధ్వంసం చేశాయి.మాతాతగారు మాగ్రామప్రాంతంలో ఒక పురాతన దేవాలయం విధ్వంసానికి గురైనట్లు నా చిన్నతనంలో చెప్పేవారు. బహుశా ఆనాటి గ్రామస్థులు విగ్రహాన్ని కాపాడుకుని వుంటారనిపించింది. చాలా ప్రాంతాలలో ఈవిధంగా జరిగిందని చరిత్ర చెప్తోంది.

వెంటనే నా ముఖంమీద చల్లనీళ్ళు కొట్టినట్లనిపించింది. ఇటువంటి శిల్పాలు లభ్యమైనప్పుడు, ప్రభుత్వానికి తెలియబరచవలసుంది. రెడ్డిమామ, గ్రామమునసబుగా ఆబాధ్యత తీసుకొవాల. పైగా నేను ఆశాఖలోనే ఉద్యోగంలో వున్నాను. నామనసు చదివినట్లుగా రెడ్డిమామ

"అబ్బయ్యా, నువ్వేంచెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు. చూస్తూ,చూస్తూ ఇంత దివ్యమైన విగ్రహాన్ని గవర్నమెంట్ పరం చేస్తామా? మనవూర్లో గుడి కట్టమంటే వాళ్ళు కడ్తారా?".

అంతలో కరణం "నాయనా, గవర్నమెంట్ వాళ్ళకి తెలియజేస్తే విగ్రహాన్ని తీసుకునిపోయి మ్యూజియంలో పెడ్తారు.మనవూరివాళ్ళమే గుడి కట్టుకూంటే పొలేదా" అన్నాడు.

చెప్పొద్దూ, నాకుకూడా విగ్రహాన్ని ప్రభుత్వ పరంచేయడం యిష్టంలేకుండాపోయింది. ఊరివాళ్ళందరూ గుడికట్టే విషయంలో ఏకమైనారు. విగ్రహం దొరికిన సంగతినిబయటకు పొక్కకుండా తమలోనే దాచుకున్నారు . విగ్రహాన్ని చూస్తూంటే బేలూరు చెన్నకేశవస్వామి విగ్రహం మాదిరిగానే అనిపించింది.

తిరుమల తిరుపతి దేవస్థానం స్థపతి, నటరాజాచారి, నాసహాధ్యాయి,అర్చకం నరసింహదీక్షితులు తండ్రిగారైన శేషాచలందీక్షితులు మావూరికి వచ్చి శిల్పంలో ఏలోటులేదని చెప్పినాక పనులు ప్రారంభించాము. వాళ్ళిద్దరు విగ్రహం విషయాన్ని రహస్యంగా వుంచేటట్లు మాట యిచ్చారు,వారు జీవించి వున్నంతవరకు ఆమాటకు కట్టుబడ్డారు.

మామ విగ్రహం దొరికిన తన రెండు ఎకరాల నేలలోనే గుడికట్టాలన్నాడు. మేఘవర్ణంనాయుడు "బావా, నీచేనుకు దక్షిణంగా వుండే నాకయ్య ఒక ఎకరంకూడా గుడికి యిచ్చేస్తున్నా",అన్నాడు. ఆయన కొడుకు భక్తవత్సలం దానికి ఒప్పుకున్నాడు.

ఇక అఘమేఘలమీద గుడికట్టడం ఆరంభమైంది. మీవూర్లోని పెద్దరైతులు తలాకొంత భూములునివ్వడంతో ఆలయానికి విశాలమైన జాగా కాకుండా ఒక ఐదు ఎకరాల గుడిమాన్యం ఏర్పడింది. నటరాజాచారి ఆధ్వర్యంలో శ్రీమోహనవల్లి (శ్రీమహాలక్ష్మి) అమ్మవారి శిలావిగ్రహం తయారు చేయించి, స్వామివారి సన్నిధితోబాటు అమ్మవారి సన్నిధి ఏర్పాటుచేయడం జరిగింది. తిరుపతిలో వున్న న్యాయవాద ప్రముఖులు, కీ.శే.అల్లాడి రామకృష్ణగారు పకడ్బందీగా, ఆదిశేషారెడ్డి , మేఘవర్ణం నాయుడు,ఇరివిసెట్టి వెంకటసుబ్బయ్య ట్రస్టీలుగా పత్రం తయారుచేసి యిచ్చారు.

మావూరికి నాలుగుదిక్కుల్లో ఆనుకునివున్న గ్రామస్థులుకూడా విరాళాలు యివ్వడంతో ఆలయనిర్మాణం అనుకున్న సమయానికి ముందే పూర్తయ్యింది.

శేషాచలందీక్షితులుగారి పర్యవేక్షణలో వైఖానస ఆగమం ప్రకారం కుంభాభిషేకం, మహాసంప్రోక్షణ జరిపి , శ్రీమోహనవల్లి సమేత శ్రీచెన్నకేశవస్వామి ఆలయం ప్రారంభించారు. పరాంకుశం సీతారామాచార్యులు ,ఆలయ అర్చకులుగా కుదురుకున్నారు.

ఎటువంటి ఒడుదుడుకులు లేకుండా ఇన్ని సంవత్సరాలు ఆలయం నిర్వహించబడుతోంది. మావూరు, చుట్టుపక్కలనున్నగ్రామాదులవాండ్ల పిల్లలు అమెరికా పోయి మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డవాళ్ళు భారీగా విరాళాలు యివ్వడంతో, గుడి ఆవరణలో ఒక కళ్యాణమండపం కట్టడంకూడా జరిగింది. ఆలయ పరిసర గ్రామాలవాళ్ళకు కళ్యాణమండపం చాలా ప్రయోజనకరమైంది. .

ముందునుండి ఆలయంలో హుండీ పెట్టలేదు. గుడిమాన్యాన్ని మావూరి రైతులే వారానికి(కౌలుకు) తీసుకుని నిజాయతీగా ధాన్యం కొలిచేవారు. అర్చకులు సీతారామాచార్యులు కైంకర్యాలకు ప్రాముఖ్యంయిచ్చి, వారికి ఏర్పాటు చేసిన భుక్తితో సంతృప్తిపడి నిత్య,నైమిత్తిక పూజాలు జరిపేవారు. ఇప్పుడున్న ఆయన కుమారుడు, వేంకటశేషాచార్యులు కూడా తండ్రిమార్గంలోనే కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. ఆలయంలో ప్రాణప్రతిష్ఠ జరిగిన ముహుర్తబలమేమో, ఆలయానికి విశేషంగా భక్తులు రావడం యీనాటివరకు జరుగుతోంది. కొందరు భక్తులు స్వామివారికి ఆభరణాలుకూడా సమర్పించారు. వైకుంఠఏకాదశి,ధనుర్మాసంవంటి ప్రత్యెక ఉత్సవాలలో స్వామివారికి, అమ్మవారికి అలంకరించేవారు.

కళ్యాణమండప నిర్వహణ, ట్రస్ట్ వారే చూసుకుంటూ, మావూరు, చుట్టుపక్కల గ్రామాలవాండ్ల వివాహాది శుభ కార్యాలకు యిస్తుంటారు. బయటివారు ఎవరైనా కళ్యాణమండపం కోరినపక్షంలో, మావూరివాళ్ళకు ఆతేదీలలో అవసరంలేకపోతే యిస్తుంటారు. లాభాపేక్ష లేనందున, కేవలం నిర్వహణకుకాగల రుసుము, విద్యుత్తువాడకం వగైరాలకు మాత్రమే తీసుకునేవారు. ఒక పూజాసామగ్రి అంగడికూడా వెలిసింది. ఏసేవకు రుసుములేదు. వచ్చిన భక్తులు హారతిపళ్ళెంలో వేసిన నగదు అర్చకులే తీసుకునేవారు. పండుగలకు, పబ్బాలకు ప్రత్యేక నైవేద్యాల ఏర్పాటుకు, మావూరివారు పోటీలుపడేవారు.

ట్రస్ట్ వారు ఆలయ జమా,ఖర్చులను పారదర్శకంగా ప్రతి సంవత్సరం ఆడిట్ చేయిస్తుంటారు.

నేను కడసారి మావూరికి పోయినప్పుడు, ఆలయం విషయంగా ఏసమస్యా వున్నట్లు రామ్మూర్తి అనలేదు. ఇంతలో స్వామివారి విగ్రహం పురాతనమైనదని, తవ్వకాల్లో బయటపడ్డ సంగతి ఈనాడు ప్రభుత్వానికి తెలిసిందా అన్న శంక కలిగింది. సరే యింకో పది నిమిషాలలో ఊరు చేరుతానుకదా అన్ని తెలుస్తుంది అనుకొని కళ్ళు మూసుకున్నా.

రామ్మూర్తి, గేట్ దగ్గరే ఎదురొచ్చాడు. నాకుగాను ఎదురుచూస్తున్నట్లున్నాడు.

"రారా, అన్నం తింటావా , లేక భీమాస్ ఫాస్ట్ ఫుడ్స్ లోతినేసివచ్చావా . మునికృష్ణకూడా ఫోన్ చేయలేదు" అని నాబ్యాగ్ అందుకున్నాడు.

హాలులోకి ప్రవేశించగానే, భక్తవత్సలం, ఇరివిసెట్టి వెంకటేశ్వర్లు, యింకా కొందరు కుర్చీల్లో కూర్చునివున్నారు. కుశలప్రశ్నలు కాగానే రామ్మూర్తి ఒక కాయితం నాచేతిలోపెట్టాడు.

"ఏందిది" అని అడుగుతూ చదివాను.రెండు నిమిషాలకు విషయం అర్థమై షాక్ తగిలింది.

"మీవూరిలో, మీరు నిర్వహిస్తున్న, శ్రీమోహనవల్లి సమేత చెన్నకేశవస్వామి ఆలయానికి, హిందూ దేవాదాయ చట్టంలో విధించిన కనీస ఆదాయానికన్న ఎక్కువ వస్తున్నట్లు ప్రభుత్వ దృష్టికి వచ్చినందువలన, సదరు ఆలయమును ప్రభుత్వ నిర్వహణలోనికి తీసుకొనవలెనని ప్రతిపాదన వున్నది. ఈ విషయంగా మీకుగల ఆక్షేపణలు, ఈతాకీదు చేరిన రెండువారాలలో తెలియబరుచగలరు.లేనియెడల అనంతర చర్యలు తీసుకొనడం జరుగును". తిరుపతి దేవాదాయశాఖ జాయింట్ కమీషనర్ నుండి వచ్చిన నోటీస్ లోని సారాంశం.

"ఎప్పుడొచ్చిందిరా ఈనోటీసు", అడిగినాను.

"నిన్న రిజిస్టర్డ్ పోస్ట్ లో వచ్చింది. మాకెవ్వరికి కాళ్ళు, చేతులు ఆడ్డంలేదు, అందుకే నిన్ను అర్జంట్ గా రమ్మనా", అన్నాడు రామ్మూర్తి.

"ఇన్నిదినాలులేంది, ఇప్పుడేమైంది", అడిగాను.

భక్తవత్సలం "బావా,నీకు తెలుసుకదా మనవూరి విషయం. రాజకీయనాయకులెవరూ మనవూరికి ఎన్నికలసమయంలో వోట్లు అడుగుతారే కానీ, తరువాత వూరిపక్కకూడా ఛూడరు.మనవూరువాళ్ళకి రాజకీయాలమీద ఆసక్తిలేదు. పోయిన నవంబరు నెలలో ఒక జడ్.పి.టీ.సి. నంబరు(మెంబర్) వచ్చి కళ్యాణమండపం కావాలన్నాడు.దానికేముంది యిస్తాం అని రిజిస్టర్ చూస్తే అతనడిగిన తేదీలలో, నేండ్రగుంట వాళ్ళకు అలాట్ అయింది. అదే అతనితో చెపితే, ఏదోచూసి నాకివ్వండి అన్నాడు. మేము నిదానంగానే, బుక్ చేసుకున్నవాళ్ళు రద్దుచేసుకుంటే తప్ప కళ్యాణమండపం యివ్వడం వీలుకాదన్నాను. అతడేమో, మీరు అంతనీతిమంతులా అంటూ పోయినాడు", అన్నాడు.

" మొన్న జరగవలసిన పంచాయతీ ఎన్నికల సమయంలో, కొందరు అధికారపక్షానికి చెందిన ఛోటా నాయకులు వచ్చి, ఎన్నికల ప్రచారసభ మన కళ్యాణమండపంలో పెట్టుకుంటామన్నారు.నేను మనవాళ్ళను పిలిపించి మాట్లాడి,యిటువంటి సమావేశాలకు కల్యాణమండపం యివ్వమని సున్నితంగానే చెప్పినాము. వాళ్ళలో ఒకడు మమ్మల్నికాదని మీరు గుడి ఎట్లా నడుపుకుంటారో చూస్తాము అన్నట్టుగా వంకరచూపు చూసినాడు", అన్నాడు రామ్మూర్తి.

నాకు కొంతసేపు ఏమీ తోచలేదు.ఒకరకమైన దిగ్భ్రాంతిలో పడ్డాను. హైకోర్ట్ కు వెళ్ళుదామా అనుకుంటే,వారూ యిది తగిన సమయంకాదు, దేవాదాయశాఖవారు మీఆలయాన్ని వారి పరిధిలోకి తీసుకోవడానికి ఉత్తర్వులు జారీచేస్తే అప్పుడు రండి అంటారు. అది సమంజసమే. కొంతసేపు అక్కడ నిశ్శబ్దం తాండవించింది.

చంద్రగిరి జంక్షన్, రంగంపేట క్రాస్ దగ్గర రెండు పెద్ద బోర్డ్లు వెలిసాయి. శ్రీమోహనవల్లి సమేత చెన్నకేశవస్వామి దేవస్థానం. సంతాన ప్రదాత. పిల్లలు లేనివారికి దర్శనమాత్రముననే సంతానము కలుగును. ఆలయమౌనకు అనుబంధిత కళ్యాణమండపం కలదు. స్వామివారి సమక్షంలో వివాహము చేసుకున్న జంటలకు సంతానం తప్పక కలుగుతుంది. దర్శించండి, తరించండి. ఇట్లు, కార్యనిర్వహణాధికారి.గుడి బయట, గుడిలోపల స్వామివారు, అమ్మవారి సన్నధులలో చెరొక హుండి వచ్చింది. పూజాద్రవ్యాలు అమ్మే షాపులను బహిరంగ వేలంలో పాడుకున్నవాడు, ధరలు పెంచి పూజాసామగ్రి అమ్మడం, ఆలయానికి వాహనాలలో వచ్చేవారి నుండి పార్కింగ్ ఫీజు వసూలు చేయడం ప్రారంభమైంది. ఆలయం బయట, లోపల రెండు బోర్డ్లు, సుప్రభాత సేవకు ఇంత, అష్టోత్తరానికి, సహస్రనామానికి ఇంత, వాహనపూజకు యింతఅని, అన్ని సేవలకు రుసుములు, ప్రసాదాల ధరల పట్టీ ఏర్పడ్డాయి. కళ్యాణమండపానికి రెండు రోజులకు రెండు లక్షలు(ఒకరోజుకు ఇవ్వబడదు).

గుడిమాన్యం మీద అజమాయిషీ దేవాదాయశాఖ ఆధ్వర్యంలోకి వెళ్ళిపోయింది.ముఖ్యంగా ప్రభుత్వంవారు 5 గురు సభ్యులతో ఒక పాలకమండలిని ఏర్పరచి, కొందరికి రాజకీయ పునరావాసం కల్పించింది. 60 సంవత్సరాల క్రితం ఆలయనిర్మాణంలో పాలుపంచుకున్న కుటుంబాలవారికి, అసలు మావూరివారెవ్వరికి కనీస ప్రాధాన్యత లేకుండా పోయింది. అర్చకుడికి ఆదాయం లేకుండా చేసినారు. అంతవరకు జరిగిన సంప్రదాయాలను త్రోసిరాజని, పాలకమండలి, దేవ"ఆదాయశాఖ" వారి నిర్ణయాలు అమలుపరచడం జరిగింది. అర్చకుడిపై అటెండర్ కూడా పెత్తనంచేసే పరిస్థితి నెలకొనింది.

రేపు మావూరి ఆలయం,దేవ"ఆదాయ"శాఖ ఆధ్వర్యంలోకి పోతే జరగబోయేది కన్నులకుకట్టినట్లైంది. అందరి మనసులు భారమైంది.

మావూరి ఆలయప్రాభవాన్ని చూసిన ఒక తమిళనాడు వైష్ణవ మఠాధిపతి కొన్ని సంవత్సరాలపాటు మావూరిలోనే తమ చాతుర్మాస్యాన్ని గడిపేవారు. కొందరు భక్తులు వద్దన్నా విరాళాలిచ్చేవారు. అట్లా సమకూడిన డబ్బును ఆలయ ట్రస్ట్ వారు ఆర్థికంగా వెనుకబడినవారికి విద్య, వైద్యాలకు ఉపయోగించేవారు. ఇటీవలికాలంలో కొందరికి అన్నదానం చేయడంకూడా జరుగుతోంది. అందుకేనేమో మావూరి చుట్టుపక్కల మతమార్పిడీ అన్నమాట వినరాలేదు. గుడిమీద ప్రభుత్వంయొక్క పెత్తనం వస్తే, యిటువంటి ఆర్థిక సహాయాలు వుండవు. మావూరివాళ్ళుగానీ, తదితర గ్రామాలవాళ్ళుగానీ ఆలయనిర్వహణ మీద యింతవరకు వేలెత్తి చూపలేదనడం అతిశయోక్తికాదు.

" మన నియోజకవర్గ శాసన సభ్యుణ్ణి కలుసుకోలేదా" అడిగాను.

"ఆ.. వాడు యీరోజో,రేపో అధికార పార్టీలో చేరేటట్లున్నాడు, అడిగి ప్రయోజనంలేదు" అన్నాడు రామ్మూర్తి.

ఆర్.ఎస్.ఎస్. , బిజెపి , విశ్వ హిందు పరిషత్ వారి దృష్టికి యీసమస్యను తీసుకునిపోలేదా" అని అడిగాను.

అర్చకులు, వేంకటశేషాచార్యులు నిర్లిప్తంగా నవ్వుతూ "వాళ్ళేమి చేస్తారండి.తిరుమల తిరుపతి దేవస్తానాలలో, శ్రిశైలంలో,కొన్నిదేవాలయలో ఉన్న హైందవేతరులను యింతవరకు తొలగించే ప్రయత్నం యేమైంది. సంవత్సరంపాటుగా ఆలయాల ద్వంసం, రథాల దహనం జరుగుతుంటే, వారేమో ఒక ఖండన ప్రకటన చేసి వూరకునివుండిపోతున్నారు. మన ఆలయాల, విగ్రహాల ధ్వంసం నిరాటంకంగా జరుగుతూ వుంటే, ఈకార్యాలన్నీ,మమ్మల్ని అప్రతిష్ఠపాలుచేయాలని ప్రతిపక్షంవారు చేస్తున్నారని అధికారపక్షంవారు, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే క్రమంలో ప్రజల దృష్టి మళ్ళించడానికి యిట్టి దురాగతాలకు అధికారపక్షంవారు పాల్పడుతున్నారని ప్రతిపక్షం పరస్పర ఆరోపణలతో ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటుంటే నష్టపోతున్న హిందువులు తమకు జరిగే నష్టాన్ని చోద్యంచూస్తున్నారే గానీ ఉద్యమబాట పట్టారా ", అన్నారు.

రాష్ట్ర పోలీసు ఉన్నత అధికారే, దురాగతాలుకు పాల్పడ్డవారి గురించి రోజుకొక్క భిన్న ప్రకటనలు చేస్తుంటే హిందువుల గతి ఏమౌతుందో.

సుబ్రహ్మణ్యంస్వామిగారి దృష్టికి యీవిషయాన్ని తీసుకునిపోతే ఆయన సహాయంచేస్తారేమో" అని ఒక యువకుడన్నాడు.

వెంబడే రామ్మూర్తి "మనహిందువులకు వున్న తెగులు యిదే. మనకు అన్యాయం జరుగుతుంటే మనం ఎదిరించకుండా, వేరేవాడు మనపని చేయ్యాల అంటాము. ఆయనమాత్రం ఎన్నని తలకెత్తుకుంటాడు. దేవాదాయ చట్టం రద్దుకానంతవరకు మనం యీకష్టాలు భరించవలసిందే" అన్నాడు.

సరే, ఏంచేస్తాం.ఆచెన్నకేశవుడిపైనే భారంవేసి, న్యాయపరమైన, చట్టఓరమైన చర్యలకుగాను,అందరం మరు రోజు అమరావతి బాట పట్టినాము. ఇంకో దేవుడు ప్రభుత్వ హస్తాలలోకి....కాలమే నిర్ణయించాల.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.