పుస్తకాల దొంగ - దార్ల బుజ్జిబాబు

pustakala donga

"ఈ రోజు నుండి మన పాఠశాలలో 'చదవటం మా కిష్టం' కార్యక్రమం ప్రారంభమవుతుంది. కాబట్టి మీరంతా సాయంత్రం నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు గంటపాటు నిశబ్ధంగా వరండాలో కూర్చొని కథల పుస్తకాలు చదవాలి" చెప్పారు హెడ్మాష్టారు. పిల్లలంతా "ఓ..." అంటూ పెద్దగా అరిచారు. పాఠశాలలో గ్రంథాలయం ఉంది. చదవటానికి ప్రత్యేక గది లేకపోయిన మూడు బీరువాలకు పిల్లల పుస్తకాలు ఉన్నాయి. ఆ బీరువాలను తెరిచి ఎన్నాళ్ళయిందో గానీ బీరువా బయటంతా దుమ్ముకొట్టుకుని ఉంది. బీరువా తెరిచి కథల పుస్తకాలు ఇస్తారని పిల్లలు తెగ సంబర పడ్డారు. సాయంత్రం అయింది. పిల్లలందరిని బయట వరండాలో దూరం దూరంగా కూర్చోబెట్టారు. బీరువాను తెరిచి పుస్తకాలు తెచ్చి తలా ఒకటి ఇచ్చారు. పిల్లల మధ్యలో హెడ్మాస్టారు చిన్న బెత్తం తీసుకుని నిలబడ్డారు. ఎవరైనా ప్రక్కవాడితో గుసగుసలాడితే వాడి నెత్తిమీద బెత్తంతో సుతిమెత్తగా తడుతూ గొడవ చేయవొద్దని హెచ్చరిస్తున్నారు. రంగురంగుల పుస్తకాలు. చాలా అందంగా ఉన్నాయి. అవి చేతుల్లోకి రాగానే పిల్లలకు కూడా అందం వచ్చింది. అందుకే అంటారు 'పుస్తకం హస్త భూషణం' అని. పిల్లలు చదవటం మొదలుపెట్టారు. కథలు, గేయాలు, గేయ కథలు, వ్యాసాలు, జీవిత చరిత్రలు, పొడుపుకథలు, సైన్సు విషయాలు, చారిత్రక విషయాలు తదితర అంశాలకు సంబంధించిన పుస్తకాలు అవి. యాభై పేజీలు లోపు ఉండి పిల్లల చేతిలో చక్కగా ఇమిడిపోయాయి. వాటిని చూస్తుంటేనే కళ్ళకు విందు భోజనం దొరికినంత ఆనందం కలుగుతుంది. అలా ఉన్నాయి అవి. ఎవరు తీసుకున్న పుస్తకాన్ని వారు గంటపాటు తిరగేసారు. బొమ్మలు చూస్తూ చదవటం పట్ల ఆసక్తి పెంచుకున్నారు. గంట గడిచింది. ఇంటి గంట కొట్టారు. తీసుకున్న పుస్తకాలు ఇచ్చేసి పిల్లలు వెళ్లిపోయారు. హెడ్మాష్టారు పుస్తకాలను లెక్కపెట్టారు. ఒక పుస్తకం తగ్గింది. మళ్లీ లెక్కపెట్టారు. అయిన ఒకటి తగ్గింది. బీరువా నుండి 70 పుస్తకాలు తీసాడు. ఇప్పుడు 69 పుస్తకాలే ఉన్నాయి. ఒక పుస్తకాన్ని ఎవడో పట్టుకు పోయి ఉంటాడు అనుకున్నాడు. పోతే పోనీలే 40 రూపాయలు కంటే ఎక్కువ విలువ వుండదులే అనుకుని మిన్నకున్నాడు. మరో రోజు కూడా ఇలాగే జరిగింది. ఇలా తరచు పోతూనే ఉన్నాయి. ఈ పుస్తకాల దొంగ ఎవడో పట్టుకోవాలనుకున్నాడు. అయినా పట్టుకోలేక పోయాడు. మూడు నెలల్లో పది పుస్తకాలు పోయాయి. ఈ సంగతి హెడ్మాష్టారు ఎవరికి చెప్పకుండా దాచాడు. చెబితే వాడేవాడో గుర్తించి వాడిని పుస్తకాల దొంగగా ముద్ర వేస్తారు. దీనివల్ల వాడికున్న చదివే ఆసక్తి పోయే అవకాశం ఉంది. పుస్తకాల పట్ల ఆసక్తి ఉన్నవాడైతేనే తీసుకు పోతాడు. ఆసక్తి లేనివాడు ఉచితంగా ఇచ్చినా అక్కడే వదిలేసిపోతాడు. తొమ్మిదో తరగతిలోని సుధాకర్ కథలు బాగా రాస్తున్నాడని, వాటిని తోటి పిల్లలు తెగ చదువుతున్నారని హెడ్మాష్టారుకు తెలిసింది. వాడిని పిలిపించాడు. రాసిన కథలు చదివాడు. చాలా బాగున్నాయి..అవన్నీ వాడు సొంతగా రాసినట్టు స్పష్టంగా తెలుస్తుంది. జంతువులు, పక్షుల కథలతో పాటు తరగతి గదిలో జరిగే సంఘటనలను కూడా కథలుగా మలిచాడు. వాడు భవిష్యత్తులో మంచి రచయిత అయ్యే అవకాశాలు ఉన్నట్టు మాష్టారు గమనించాడు. బాగా చదివే వాడు మాత్రమే బాగా రాయగలడు. పుస్తకాలు దొంగ వీడే అనే విషయం మాస్టారు గ్రహించాడు. వాడికి ఆ విషయం చెప్పకుండా, వాడిని బాగా మెచ్చుకున్నాడు. పుస్తకాలు పోతేపోయాయి. రాబోయే తరానికి ఓ మంచి రచయిత దొరికాడు అనుకుని తన సందేహం తీర్చుకోవడం కోసం చిన్న రాయి వేసాడు. "మన పాఠశాల లైబ్రరీ పుస్తకాలు కొన్ని నీ దగ్గరున్నట్టు నీ ఫ్రెండ్ రవి చెప్పాడు. తెచ్చి ఇవ్వరాదు" అడిగాడు మాష్టారు. " అలాగే మాష్టారు" అని తీసుకువెళ్లిన పుస్తకాలన్నీ మరుసటి రోజు స్కూల్ కు తెచ్చిచ్చాడు. మాష్టారు వాడికి దాదాపు వెయ్యి రూపాయలు విలువైన కొత్తకొత్త బాల సాహిత్యపుస్తకాలు కొనిచ్చాడు. ఈ కథంతా తెలుసుకున్న విద్యాశాఖాధికారి ఆ ఏడాది హెడ్మాష్టారును ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డుకు సిఫారసు చేసారు.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.