గుమ్మానికి మావిడి తోరణాలు, గుమ్మం ముందర రంగు రంగుల ముగ్గులు, చిన్న పిల్లల కేరింతలు, కొత్తబట్టల తళుకులు, పిండి వంటల ఘుమఘుమలు, పెద్దవాళ్ళ హడావుడితో ఇల్లంతా చాలా సందడిగా ఉంది. మాధవయ్య మాష్టారు ఇంట్లో తన ఒక్కగానొక్క కొడుకు, సంక్రాంతికి వచ్చిన అక్క, బావగారు పిల్లలతో పండుగ వాతావరణం నెలకొని ఉంది. ఏవోయ్…పూర్ణ! అవ్వలేదా నీ వంట, బారెడు పొద్దెక్కిందే టిఫిన్ కూడా పెట్టలేదు ఇంకా ఎం వండుతున్నవే నీ పేరుకి తగ్గట్టు వండాలంటే పండగపూటే ఎలా వీలవుతుంది? ఇంకో రోజు కుమ్మరిద్దువుగాని నా మాట విను ఆత్మా రాముడు కేకలుపెడుతున్నాడు. పిల్లలు ఏడవకుండా ఏదొక టిఫిన్ పెట్టు, నేను పిల్లలు కలిసి లాగించేస్తాం అని మాట్లాడుతూ అలా వంటింట్లోనికి వచ్చేసరికి, అన్నపూర్ణగారు చీర చెంగుతో కళ్ళు ఒత్తుకుంటు కనిపించింది. ఏవిటి ఇప్పుడు ఎవయ్యిందని? నిన్ను ఎప్పుడు ఇలా చూడలేదు అదీ పండగ పూట పిల్లలు కనక చూశారంటే కంగారు పడతారు. ఇందాకటినుంచి అందరూ ఫోటోలు తీస్కుంటు నిన్ను పిలుస్తున్నారు నీతో ఫోటోలు తీసుకోవాలి అంటున్నారు. నీ బాధ నాకు అర్ధం అయ్యింది కానీ, సిద్ధూ చూసాడంటే వాడి మనసు పాడు చేసుకుంటాడు. అయినా వాడిని ఇప్పటిదాకా నువ్వే ప్రోత్సహించి తీరా మంచి యూనివర్సిటీలో చదువు కోసమని బయల్దేరుతుంటే బెంగ పెట్టుకుని ఎం లాభం. ముందు నువ్వు బైటకు రా కాస్త అలా అందరిలోనూ కలిస్తే నీకు మనసు తేలిక పడుతుంది అని నచ్చ చెప్పి అన్నపూర్ణగారిని తీస్కెళ్లారు మాష్టారు. హాల్లో పిల్లలంతా చేరి ఫోటోలు తీస్కుంటూ సరదాగా గడుపుతున్నారు. ఆడపడుచు మాణిక్యాంబ గారు ఆవిడ కూతురు ప్రియ అదిగో అత్త వచ్చింది అంటూ మూగిపోయి రా అత్తా నా పక్కన కూర్చో అంటూ ఫోటోలు తీస్తూ చీరలు, నగలు సరి చేసుకుంటూ కాస్త కబుర్లలో పడ్డారు. ఇంతలో పులిహోర కలిపాను రండి అందరూ కాస్త కాస్త తిందురుగాని అని అన్నపూర్ణగారు అందరినీ లేవదీసి టిఫిన్లు పెట్టారు. వాటితోపాటు పండగ స్వీట్లు కూడా కాస్త పంటి కింద వేసుకుని అందరూ మాట్లాడుకుంటూ కాసేపు ఏమైనా ఆడుకుంటామని కెరోమ్ బోర్డ్ తీసి ఆట మొదలు పెట్టారు. ఆడపడుచు, పూర్ణగారు వంటింట్లో మిగిలిన వంట కోసం వెళ్లి ఆ పనిలో పడ్డారు. మరదలి మనసెరిగిన మాణిక్యాంబగారు చూడు పూర్ణ! బెంగ పెట్టుకోకుండా ఉండాలి. ఆయినా నాలుగేళ్ళ క్రితం ప్రియకి పెళ్లి చేసినప్పుడు మా సంపత్ ని పైచదువులకి పంపినప్పుడు నాకు ధైర్యం చెప్పిన నువ్వు ఇప్పుడు ఇలా అధైర్య పడటం ఏమి బాగాలేదు. పిల్లలన్నాక ఎల్లకాలం మన దగ్గర ఉంటారా నువ్వే చెప్పు. మీ ఇద్దరూ వాడికి బలం. చక్కగా ధైర్యంగా ఉండండి. నువ్వు బెంగ పడితే మా తమ్ముడు డీలా పడతాడు. అని నచ్చ చెప్పారు. ప్రియ, సంపత్ కూడా అన్నపూర్ణమ్మగారికి ధైర్యం చెప్పి కాస్త ఆవిడని వదలకుండా తిరిగారు. ఇదంతా చూస్తున్న మాధవయ్య మాస్టారు తల్లి శేషమ్మ గారు భోజనాలు అయ్యాక అందరూ బైట పిచ్చాపాటి మాట్లాడుకోవటానికి కూర్చున్న సమయంలో వంటింట్లో ఉన్న కోడలి దగ్గరకు వచ్చి పూర్ణా..పొద్దుటినుంచి చూస్తున్నాను, నీ పరుగులో ఉన్న చాలకితనం నీ మొహంలో కనిపించటం లేదు. మనవడు దూరం వెళ్తే మాత్రం ఏముంది చక్కగా ఉంటాడు. చదువుకుని మంచి ఉద్యోగం చేస్తాడు. నీకు ఆదే కదా కావలసింది. నీకు బాధలో గుర్తుకురాదని చెప్తున్నాను, మన దేవుడి గదిలో దేవీ భాగవతం ఇంకా రామాయణం ఉన్నాయి కదా వాటిలో ఉన్న రక్షణా శ్లోకాలు రేపు పూజ అయ్యాక చదివి వాడి తలనిమిరి చక్కగా బొట్టుపెట్టి విభూది రేఖతో కౌసల్యమాత పంచ శ్లోక రక్ష చదువు. వాడికి అదే శ్రీరామ రక్ష అని చెప్పారు. అలాగే అత్తయ్యగారు అని కాస్త తేలికగా నవ్వుతూ తల ఆడించారు అన్నపూర్ణగారు. మరునాడు ఉదయం తెల్లవారుతూనే పూజ ముగించుకుని అన్నపూర్ణగారు సిద్ధుని పిలిచి చక్కగా బొట్టుపెట్టి నమస్కారం చేసుకోమని చేతిలో విభూది పట్టుకుని శ్లోకాలు చెప్పటం మొదలు పెట్టారు. దేవి భాగవతం: సర్వదా సర్వదేశేషు పాతుత్వామ్ భువనేశ్వరీ౹ మహమాయా జగద్ధాత్రి సచ్చిదానంద రూపిణీ౹౹ భావం: సర్వకాల సర్వదేశావస్థలలో నిన్ను ఆ జగన్మాత భువనేశ్వరి కాపాడుగాక. రామాయణం: కౌసల్యామాత రామునికి పెట్టిన రక్ష: యన్ మంగళం సహస్రాక్షే సర్వ దేవ నమస్కృతే వృత్ర నాశే సమ భవత్ తత్తే భవతు మంగళం౹౹ భావం: వృత్రాసురుని వధించే సమయాన ఇంద్రునికి లభించిన రక్ష నీకు లభించు గాక. యన్ మంగళం సుపర్ణస్య వినతా కల్పయత్ పురా౹ అమృతం ప్రార్ధయానస్య తత్తే భవతు మంగళం౹౹ భావం: అమృతాన్ని దింపే వేళ ఏ శక్తి అయితే గరుత్మంతునికి రక్షగా లభించిందో ఆ రక్ష నీకు లభించును గాక. అమృతోత్పాదనే దైత్యాన్ ఘ్నతో వజ్ర ధరస్య యత్౹ అదితీర్ మంగళం ప్రాదాత్ తత్తే భవతు మంగళం౹౹ భావం: క్షీర సాగరం మధనం వేళ దేవతలను ఏ శక్తి రక్షించిందో ఆ రక్ష నీకు లభించు గాక. త్రీన్ విక్రమాన్ ప్రక్రమతో విష్ణోర్ అమిత తేజసః యదాసీన్ మంగళం రామ తత్తే భవతు మంగళం౹౹ భావం: మూడు అడుగులతో వామన మూర్తి జగాలను కొలిచిన వేళ లభించిన రక్ష నీకు లభించును గాక. ఋతవస్ సాగరా ద్వీపా వేదాలోకా దిశశ్చతే౹ మంగళాని మహాబాహో దిశంతు తవ సర్వదా౹౹ భావం: నాయనా! ఋతువులు, సాగరాలు, ద్వీపాలు, వేదాలు, దిక్కులు అన్నీ నిన్ను సర్వ వేళలా రక్షించు గాక. శ్లోకాలన్ని చదివి కొడుకుకి విభూది రక్ష పెట్టి మనసారా ఆశీర్వదించారు అన్నపూర్ణగారు. అలాగే ప్రియని సంపత్ ని కూడా పిలిచి నమస్కారం చేయించి ఆడపడుచు చేత రక్ష పెట్టించారు. ఈ లోపున మాధవయ్య మాష్టారు నవ్వుతూ లోపలికి వచ్చి రండర్రా అలా షికారుకి వెళ్లి వద్దాం అని సరదాగా బైటకు తీస్కుని వెళ్లారు. ఇప్పుడు అన్నపూర్ణగారి మనసు ఎంతో తెలికపడింది మొహంలో నవ్వు నిండుగా ఉంది. మనకు లభించిన పురాణ నిధులలో చాలా శక్తివంతమైన విషయాలలో ఇలాంటివి మచ్చుతునకలు. మన సంస్కృతి పట్ల అభిమానం పెంచుకుందాం నలుగురితో పంచుకుందాం.