నాన్నా..నీకు వందనం! - చెన్నూరి సుదర్శన్

Naanna neeku vandanam

శంషాబాద్ విమానశ్రయం నుండి ఎమిరేట్స్ విమానం రన్ వే మీద పరుగుతీస్తూ.. పరుగుతీస్తూ.. జువ్వున పైకి ఎగిరింది. దానితో బాటుగా నా మనసు దానికంటే వేగంగా ఆకాశంలోకి విహంగమై ఎగిసింది. అప్రయత్నంగా నా ఎద ఉద్వేగభరితమై కళ్ళు వర్షించసాగాయి. అవి మానాన్న అకుంఠితశ్రమ బిందువులు నాకళ్ళల్లో నుండి ఆనంద భాష్పాలై రాలుతున్నాయి. నేనిలా అమెరికాయానం చేస్తానని.. ఒక ప్రముఖ కంపెనీలో చేరబోతానని.. కలలో గూడా ఊహించలేదు. ఇది నా అదృష్టం అనే కంటే.. మానాన్న ధృఢసంకల్పమనడం సమంజసం.

విమానపు సోయగపు శబ్ధం.. నాగతాన్ని జ్ఞప్తికి తెప్పించసాగింది. అప్పుడు నేను మూడేండ్ల ప్రాయపు పసివాణ్ణి.. వరంగల్ మండిబజారులో ఉండేవాళ్ళం.. నాన్న పోతన టెలీఫోన్ భవన్ లో టెలీఫోన్ ఆపరేటర్ గా పని చేసేవాడు.

***

ఉదయం ఆరు గంటలు.. మ్యున్సిపల్ పంపులో నీళ్ళు వస్తున్నాయి. నాన్న నీళ్ళు తేవడానికి వెళ్తుంటే.. నేనూ ఒక చిన్న చెంబు తీసుకుని నాన్న వెనుకాలే బయలు దేరాను.

“వద్దు బాబు.. రాత్రి జ్వరం వచ్చింది కదా..!” అంటూ నాన్న బతిమాలాడు.

“నేనూ లాల తెస్తా..” అంటూ నేను బుంగ మూతి పెట్టాను.

“రానివ్వండి” అంటూ అమ్మ నాకు వత్తాసు పలికింది.

నాన్న సరే అన్నట్టుగా పంపు దగ్గరకు దారితీశాడు. నేను గడప దాటబోయి పడిపోయాను. నా చేతిలోని చెంబు కిందపడ్డ శబ్ధానికి నాన్న వెనుతిరిగి పరుగు, పరుగున వచ్చాడు.

“చెబితే విన్నావా!” అంటూ చిరుకోపం ప్రదర్శిస్తూ.. నన్ను లేపాడు. నేను నిల్చోలేక పోతున్నాను. కాళ్ళు నిస్సత్తువగా ఉన్నాయి.. కూలబడి పోయాను. అమ్మ నన్ను ఎత్తుకుని ఇంట్లోకి తీసుకు వెళ్ళిమంచం పైన పడుకో బెట్టింది. నాన్న నీళ్ళు తేవడం పూర్తికాగానే వచ్చి నా ఒళ్లంతా తడుముతూ చూసి, జ్వరమేమీ లేదని సంతృప్తిపడ్డాడు. నా కాళ్ళు నొప్పిగా ఉన్నాయన్నట్టు చెప్పాను. నాన్న నాకాళ్ళను నెమ్మదిగా ఒత్తుతూ..

“రాత్రంతా జ్వరం ఉంది. తెల్లవారు ఝామున తగ్గింది. నీరసం ఉంటుంది భరత్” అంటూ.. అమ్మ బూస్ట్ కలిపి తెచ్చిన పాల గ్లాసు తీసుకుని తాగించాడు.

“నాన్నా..! నాకు తెల్ల మీసాలు వచ్చాయా” అంటూ అడిగాను. పాలు తాగితే పై పెదవుపై ఏర్పడే పాల మరకలు అంటే నాకు ఇష్టం. అద్దం ముందు నిలబడి చూసుకోవడమంటే మరీ ఇష్టం.

“నువ్వే చూసుకోరా” అంటూ నాన్న, నన్ను నిలువుటద్దం ముందునిలబెట్టబోయాడు.

నేను నిల్చోలేక మళ్ళీ కూలబడి పోయాను. నేను తమాషా చేస్తున్నాననుకున్నాడు నాన్న. చిన్నగా నవ్వుతూ.. మళ్ళీ ప్రయత్నించాడు. నా కాళ్ళల్లో బలం లేదు. “ఏమయ్యిందిరా భరత్.. నిలబడు” అంటూ నాన్న కాస్త హెచ్చు స్థాయిలో అన్నాడు.

నేను బిగ్గరగా ఏడ్వడం చూసి అమ్మ వంటగది నుండి పరుగెత్తుకుంటూ వచ్చింది. నేను

“ఆయి.. ఆయి” అంటూ నా కాళ్ళను అమ్మకు చూపిస్తూ.. ఏడుస్తూనే ఉన్నాను. అమ్మ ఎత్తుకుంటే.. నా కాళ్ళు తోటకూర కాడల్లా వాలిపోతున్నాయి.

నాన్నకు చల్లచెమటలు పోశాయి. గబా, గబా బట్టలు వేసుకుంటుంటే..

“మూడు రోజులుగా జ్వరం వస్తుంది కదా! నీరసం అంతే.. గాబరా పడకండి” అంటూ అమ్మ సర్ది చెబుతోంది.

“ఎంత నీరసమైనా.. పూర్తిగా నిలబడలేక పోవడం నాకు భయంగా ఉంది సత్యా.. బాబును హాస్పిటల్ కు తీసుకు వెళ్తాను. భరత్ కు చొక్కా మార్చు” అంటూ వేగిరపెట్టాడు.

ఆటోలో నన్ను మహాత్మాగాంధీ మెమోరియల్ హాస్పిటల్ కు తీసుకు వెళ్ళాడు నాన్న. మా ఇంటి వెనుకాలే క్లినిక్ నడిపే చిల్ద్రెన్స్ స్పెషలిస్ట్ డాక్టర్ నరసింహారెడ్డి డ్యూటీలోనే ఉన్నాడు. అతనే రెండు రోజుల క్రితం నాకు మందులు రాసిచ్చాడు. నన్ను చూడగానే కాళ్ళను క్షుణ్ణంగా పరిశీలించాడు. తనూ నిలబెట్టే ప్రయాణం చేశాడు. నా అశక్తత గమనించి ప్రక్క ల్యాబ్ లోకి తీసుకు వెళ్ళాడు. అక్కడ నా వెన్నుపూస దగ్గర నుండి ప్లూయిడ్ తీయించాడు. ఫలితం రావడానికి సమయం పడుతుంది. ఇక్కడ ల్యాబ్ లో ఆ సౌకర్యం లేదు. నాగపూర్ పంపాల్సి ఉంటుందని.. ఇంతలో నాలుగు రోజుల తరువాత రమ్మన్నాడు.

డాక్టర్ చెప్పిన రోజు మళ్ళీ వెళ్లాం.

“సారీ సుగుణాకర్.. భరత్ కు పోలియో సోకింది” అనగానే నాన్న స్పృహ తప్పినంత పని చేశాడు. నాన్నను చూసి ఏడ్చాను. పోలియో అంటే నాకు అప్పుడు తెలియదు.

డాక్టర్ వెంటనే.. నాన్న భుజం తట్టుతూ.. “భయపడాల్సిందేమీ లేదు సుగుణాకర్. ఇలాంటి కేసులు చాలా వచ్చాయి. బహుశః మ్యున్సిపల్ వాటర్ కలుషితమైన ప్రభావం గూడా ఒక కారణం కావచ్చు. బాబును ఇక్కడే అడ్మిట్ చేసుకుంటాం. రేపు ఉదయమే రండి” అంటూ.. నాన్నకు కొన్ని సూచనలిచ్చాడు.

ఇంటికి వెళ్లి అమ్మకు ఈ విషయం చెప్పేసరికి మొదలు నరికిన మ్రానులా కూలిపోయింది. అమ్మ ఏడ్పును ఆపడం నాన్న వశం గాలేదు. నేనూ అమ్మతో బాటే ఏడువసాగాను.

“సత్యా.. బాబు బెంగ పెట్టుకుంటాడు. మనమే ఇలా అధైర్య పడితే ఎలా?. ఏమీ గాదని నయమవుతుందని డాక్టరు చెప్పాడు” అంటూ అమ్మను ఊరడించాడు నాన్న. కాసేపటికి అమ్మ, నేను కాస్త తెరుకున్నాం.

మరునాడు ఉదయమే హాస్పిటల్ లో అడ్మిట్ చేయించాడు నాన్న. డాక్టరు చెప్పినట్టు నన్ను వెల్లికిలా కదలకుండా పడుకోబెట్టాడు. రెండు చిన్న ఇసుక సంచులు నా కాళ్ళకు ఇరువైపులా కాళ్ళు కదలకుండా అమర్చాడు. బలవర్ధకమైన ఆహారం తినడం.. టానిక్ లు తాగడం.. వ్యాయామమాలు చేయించడం తప్ప మనమేం చెయ్యలేమన్నాడు డాక్టర్. భరత్ కు కుడి కాలు మోకాలి నుండి కింది భాగం, ఎడమకాలు తొడభాగం ఇంకా నడుము గూడా పోలియో బారిన పడ్డాయని వివరించాడు. పది రోజుల తరువాత హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశారు.

మా నానమ్మ ఊరు ములుగులో టెలీఫోన్ ఆఫీసు కొత్తగా ఏర్పడింది. నాన్న ‘రాష్ట్ర ఉత్తమ టెలీఫోన్ ఆపరేటర్’ అవార్డు రావడం.. నాన్న పనితనం చూసి కొత్త ఆఫీసుకు నాన్న సేవలు అవసరమని ములుగుకు బదిలీ చేశారు. మేమంతా నానమ్మ ఇల్లు చేరుకోగానే.. నానమ్మ నన్ను చూసి గుండెలకు హత్తుకుని కన్నీరు బెట్టింది. నాన్న నానమ్మ పాదాల మీద పడి చంటి పిల్లవాడిలా ఏడ్చాడు. నానమ్మ ఊరడించింది. నా కాళ్ళను పరీక్షగా చూస్తూ..

“మా కాలంలో ఇలాంటి రోగాన్ని బాలవాతం అనే వాళ్ళం. దీనికి పసరు వైద్యం బాగా పని చేస్తుంది” అంటూ.. కొన్ని పేర్లు చెప్పింది. దాంతో కాళ్ళు బాగా తీడాలాట. వెంటనే పసరు కోసం పరుగులు తీశాడు నాన్న.

ములుగు జూనియర్ కాలేజీలో చదివే విద్యార్థులు నాన్నను మ్యాథ్స్ ట్యూషన్ చెప్పమని బతిమిలాడారు. నాన్న గణితశాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. లెక్చరర్ ఉద్యోగం కోసం పబ్లిక్ సర్వీసు కమీషన్ లో పరీక్షలుకు హాజరయ్యాడు. తనకూ సబ్జక్ట్ చెప్పడం అవసరమని ఒప్పుకున్నాడు. పదవతరగతి విద్యార్థినీ విద్యార్థులకు గూడా ట్యూషన్ చెప్పడం ప్రారంభించాడు. బీద విద్యార్థుల వద్ద డబ్బులు తీసుకునే వాడు కాదు. దాంతో నాన్న మీద ఊరి వారికి మంచి అభిమానం ఏర్పడింది.

నా విషయం తెలుసుకుని.. రక, రకాల లేపనాలతో కాళ్ళు మర్దన చెయ్యాలని సలహాలిచ్చే వారు. ఎవరే సలహాలిచ్చినా నాన్న వెంటనే అమలు పరిచే వాడు. ఒకతను పెద్దపులి నెయ్యి అంటూ తెచ్చిచ్చాడు. దాంతోనూ నా కాళ్ళు మర్దన చేశాడు నాన్న. ఆఫీసు పని చూసుకోవడం.. నాలుగు బ్యాచ్ లు ట్యూషన్లు చెప్పడం.. నా కాళ్ళు మర్దన చెయ్యడం.. నాన్నకు క్షణం తీరిక ఉండేది కాదు. ట్యూషన్ క్లాసులో అమ్మను గూడా కూర్చోమని చదువు మీద శ్రద్ధ కలిగించాడు. ఇంకా పదవతరగతి పాఠాలు ప్రత్యేకంగా చెప్పేవాడు.

ములుగు హాస్పిటల్ లో పనిచేసే ఒక నర్స్ భర్త మాధవన్ నాన్నకు పరిచయమయ్యాడు. అతను ఫిజియో తెరెపిస్ట్. ఒక రోజు మా ఇంటికి వచ్చి నా కాళ్ళను పరీక్షించాడు. తన వంతు కృషి చేస్తానన్నాడు. నువ్వుల నూనెతో.. నావీపు, కాళ్ళు మాలిష్ చేస్తూ.. నన్ను నిల్చోబెట్టాలని తాపత్రయ పడే వాడు. చిన్న పిల్లలు నడవడానికి ఉపయోగించే మూడు చక్రాల బండిని పట్టుకుని నలబడుమని ప్రోత్సహించే వాడు. ఒక నెల గడిచేసరికి అతని శ్రమ ఫలించింది. నేను నిలబడగలిగాను. ఆరోజు అమ్మా, నాన్న ముఖాలలో ఆనందపు వెలుగులు నేను జన్మలో మర్చిపోను. నాకూ సంతోషమేసింది. నాలో ఉత్సాహం రెట్టింపయ్యింది.

మాధవన్ ఒక రోజు అమ్మా, నాన్నలను కూర్చోబెట్టి.. “హైదరాబాదు నారాయణగూడలో డాక్టర్ కళావతి ఫిజియో తెరెపిస్ట్ మేడం ఉంది. అక్కడ వివిధరకాల పరికరాలతో ఆమె వ్యాయామాలు చేయిస్తుంది. భరత్ తొందరగా నడువగలుగుతాడు” అని ఆశలు రేకెత్తించాడు.

వెంటనే నాన్న ఒక నెల రోజులు లీవు మంజూరు చేయించుకున్నాడు. అమ్మా, నాన్నలు నన్ను తీసుకుని హైదరాబాదుకు బయలు దేరారు. మలక్ పేటలో నాన్న స్నేహితుడు వేణుగోపాల్ గారి ఇంట్లో ఆశ్రయం పొందాం.

కళావతి విశాలమైన ప్రాంగణమంతా సాయంత్రం నాలుగయ్యిందంటే నాలాంటి పోలియో వ్యాధిగ్రస్తులతో నిండి పోయేది. హాల్లో రక, రకాల వ్యాయామ పరికరాలున్నాయి. మొదటి రోజు కళావతి దగ్గరుండి ఎలా వ్యాయామం చేయించాలో నాన్నకు చూపించింది. ముఖ్యంగా స్ప్రింగ్స్, బెల్ట్స్ వానిని ఉపయోగించే పద్ధతులు వివరించింది. కొత్త రకాల వ్యాయామ పద్ధతులు చూసి నాన్నలో నన్నెలగైనా నడిపించాలనే ధృఢ సంకల్పం ఏర్పడింది. నాలో ఉత్సాహం ద్విగుణీకృత మయ్యింది. ప్రతీ రోజు మధ్యాహ్నం భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకున్నాక నాన్న నన్ను ఎత్తుకుని కళావతి వ్యాయామశాలకు తీసుకు వెళ్ళే వాడు.

నెల రోజుల లోపే నేను వాకర్ సాయంతో అడుగులు వేయగలిగాను. కళావతి ఆశ్చర్య పోయింది. “ఇంత వేగవంతంగా కోలుకోవడం అంటే.. మీ నాన్న ఒక నిర్దిష్టమైన పద్ధతిలో వ్యాయామం చేయించడమే.. అంటూ కొనియాడింది. ఇక కాళ్ళకు కాలిపర్స్ అవసరం. అవి కట్టుకుని నడువ వచ్చు” అంటూ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIIMS) లో పనిచేసే కె.డి.శెట్టి గారి చిరునామా ఇచ్చింది.

నాన్న మరో పది రోజులు సెలవులు పొడిగించాడు. మరునాడు సాయంత్రం వెళ్లి శెట్టిగారిని కలిశాం. అతను కాళ్ళకు కట్టుకునే ప్యాడ్స్ తయారు చేసిచ్చాడు. అవి కట్టుకున్నాక నిలబడ్డం సులువయ్యింది. మరో వారంలో వాకర్ లేకున్నా స్వతహాగా నడవడం నాలో ఉత్సాహం ఉరుకలేససింది. అమ్మా, నాన్న సరేసరి..

వ్యాయామానికి సంబంధించిన స్ప్రింగులు, బెల్టులు కొనుక్కొని తిరిగి ములుగు వచ్చాం. పిల్లల వార్షిక పరీక్షలు దగ్గరపడ్డాయి. నాన్న తిరిగి నిర్విరామంగా పాఠాలు చెప్పడంలో మునిగి పోయాడు. అయినా నాతో వ్యాయామం చేయించడంలో అశ్రద్ధ చూపలేదు. ఉదయం సాయంత్రం రెండు పూటలా చేయించే వాడు. నేను నెమ్మది, నెమ్మదిగా నడుచుకుంటూ నా పనులు నేను చేసుకునే స్థాయికి వచ్చాను.

అమ్మ ప్రైవేటుగా పదవ తరగతి, ఇంటర్ మీడియట్ మొదటిశ్రేణిలో ఉత్తీర్ణురాలయ్యింది. నాకు ఒక చెల్లాయి పుట్టింది. నాన్నకు జూనియర్ లెక్చరర్ గా ఉద్యోగం వచ్చింది. శ్రీకాకుళం వెళ్ళాం. అక్కడ నన్ను స్కూల్లో చేర్పించాడు నాన్న. నన్ను స్కూల్లో దింపి కాలేజీకి వెళ్ళే వాడు. అమ్మ నన్ను సాయంత్రం ఇంటికి తీసుకు వచ్చేది. నాన్న కాలేజీ నుండి వచ్చాక స్ప్రింగ్ వ్యాయామాలు చేయించే వాడు. నేను యు.కే.జి.లో ఉండగా నాన్నకు రంగారెడ్డి జిల్లాలోని మర్పల్లికి బదిలీ అయ్యింది.

హైదరాబాదు భరత్ నగర్ లో ఉండే వాళ్ళం. నాన్న రోజూ ట్రైన్ లో మర్పల్లికి వెళ్లి వచ్చే వాడు. నన్ను సెయింట్ రీటా స్కూల్లో చేర్పించాడు నాన్న.

ఒక రోజు శెట్టి గారి దగ్గరికి వెళ్లాం. నేను అప్పుడప్పుడు కుడి మోకాలు మీద చెయ్యి వేసి నడిచే వాణ్ణి. అది విని శెట్టి గారు బాబు సన్నబడితే.. అలా చెయ్యి వెయ్యడం తప్పుతుందని.. సైకిల్ తొక్కడం నేర్పమని సలహాయిచ్చాడు.

ఆ సంవత్సరం వేసవి సెలవుల్లో నా కోసం చిన్న సైకిలు కొని నడపడం నేర్పించాడు నాన్న. పది రోజుల్లో దానిపై పట్టు సాధించాను. సైకిలు మీద కాలనీ సాంతం తిరిగే వాణ్ణి. అలాగే స్నేహితుల ఇంటికీ వెళ్ళే వాణ్ణి. నాన్న కాస్త ఊపిరి తీసుకున్నాడని పించింది. నాకు మరో తమ్ముడు పుట్టాడు. అయినా అమ్మ చదువు ఆపలేదు. ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పరీక్షలు రాయడానికి సన్నద్ధురాలయ్యేది.

ఇక నాన్న నా చదువు వెంట పడ్డాడు. చదువుకుంటేనే మంచి భవిష్యత్తు ఉంటుందని రోజూ నూరి పోసే వాడు. నాకు నా స్నేహితులకు పాఠాలూ చెప్పే వాడు. ఏడవతరగతి కామన్ పరీక్షలలో మంచి మార్కులు సాధించాను. ఆసంవత్సరం వేసవి సెలవుల్లో మళ్ళీ శెట్టిగారిని కలిశాము. నా కాళ్ళను పరీక్షించి.. కుడి మోకాలు వెనుక భాగంలో చిన్న ఆపరేషన్ చేయించాలని సలహా యిచ్చాడు. నాన్న అదే వేసవి సెలవుల్లో నిమ్స్ లో ఆపరేషన్ చేయించాడు. ఆ తరువాత మళ్ళీ వ్యాయామాలు చెయ్యాల్సి వచ్చింది. సెలవులు పూర్తయ్యేసరికి మామూలుగా నడువగలిగాను.

కాలచక్రం గిర్రున తిరుగింది. నేను పడవ తరగతి, ఇంటర్, డిగ్రీ ప్రథమ శ్రేణిలో పాసయ్యాను. మాస్టర్ ఆఫ్ బ్యుజినెస్ మేనేజ్ మెంటు లో కంప్యూటర్ కోర్సు మన ఉస్మానియా యూనివర్సిటీలో లేదు. నేను ఎంట్రాన్స్ పరీక్ష రాసి పూణే యూనివర్సిటీలో సీటు సాధించాను. మంచి ర్యాంకు సాధించి తిరిగి హైదరాబాదు వచ్చాను. పూణే వాతావరణం సరిపడక నేను కాస్త ఒళ్ళు చేశాను. నడవడం కష్టం కాసాగింది.

శెట్టిగారిని కలిశాము. నా ఒళ్ళు తగ్గించుకోవాలని మరీ, మరీ చెప్పాడు. కుడి కాలుకు కాలిపర్స్ చేసిచ్చాడు. దాని మీద ఎక్కువ బరువు పడకుండా చేతి కర్ర వాడాలని చెప్పాడు. అతని సలహా తు.చ.తప్పకుండా పాటిస్తూ వస్తున్నాను.

నాకు ఒక ప్రైవేటు బ్యాంకులో అమ్మకు టీచర్ ఉద్యోగాలు వచ్చాయి. దాదాపు ఒక సంవత్సరంబ్యాంకులో చేశాను. నాకు కంప్యూటర్ లో ఉన్న పరిజ్ఞానం గురించి నాన్న అమెరికాలో ఉన్న తన స్నేహితుడు వేణుగోపాల్ కొడుకు దయాకర్ కు తరుచూ చెప్పే వాడు. అతనికి అమెరికాలో ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ ఉంది. నన్ను ఆన్ లైన్లో ఇంటర్వ్యూ చేసి సంతృప్తి చెందాడు. దాని ఫలితమే.. నేడు నా విమానయానం.. నా కళ్ళు చెమ్మగిల్లాయి. నాన్నా.. నీకు శతకోటి వందనాలు అని మనసులోనే సమర్పించుకోసాగాను..

“సర్ ఏమి తీసుకుంటారు” అంటూ ఎయిర్ హోస్టెస్ పిలుపుతో ఈ లోకానికి వచ్చాను.

ఆరెంజ్ జ్యూస్ తీసుకుని ధన్యవాదాలు తెలిపాను. అదీ మా నాన్న నేర్పిన పాఠమే.. *

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు