మనిషి రోడ్డున పడ్డాడు - భాగవతుల భారతి

Manishi rodduna paddadu

"రమాగారూ! బాగున్నారా!"

"ఆ~బాగున్నామ్, ఐనా ఏం బాగులేమ్మా! ఓ మాదిరిగా బాగానే ఉన్నామ్."

"అదేమిటీ? ఓమాదిరీ! అర, పావు, కొలతలూ, ఎప్పుడూ రాని మీ అబ్బాయ్, పిల్లలూ బెంగుళూరు నుండి రాకరాక వస్తున్నారూ కరోనా పుణ్యమా! అని సంబర పడ్డారూ! ఇప్పుడు ఇంత నీరసంగా ఉన్నారూ! "

"వచ్చారు! వచ్చినప్పటినుండీ, ఎవరి డ్యూటీ వాళ్ళదే పెద్దలకి వర్క్ ఫ్రమ్ హోమ్ కదా! పిల్లలకు ఆన్ లైన్ క్లాసులు వాళ్ళంతా, ఇక్కడున్నా ఎవరి బిజిలో వాళ్ళు బెంగుళూరు లోనే ఉన్నట్లున్నారు. పైగా నాకు, ఇంటి చాకిరీ, ఈయనకీ, ఆన్ లైన్ లో సరుకుల బుకింగ్ అవి రాగానే ప్రతీ వస్తువూ కడగటం, రకారకాలుగా వంటావార్పూ ఈవయసులో, అదనపు చాకిరీ, నీరసం కాక లడ్డూలు తిన్నంత ఆయాసం వస్తుందా? " పక్కింటి పద్మగారితో అన్నది రమ.

నెల రోజులుగా ఇంట్లో జరుగుతున్నవన్నీ రమ కళ్ళముందు మెదిలినాయ్. రమ బావగార్లూ తోటికోడళ్ళూ, తెలిసిన వాళ్ళూ, రాకరాక వచ్చిన రమ కొడుకూ, కోడళ్ళను ఆన్ లైన్ పలకరింపులు. "అవునూ! కొడుకూ, కోడలూ, వచ్చారుగా, ఇదివరకైతే, నేరుగా ఇంటి కొచ్చేసి, పళ్ళూ, స్వీట్స్ తో పలకరించేసేదాన్ని, ఇప్పుడేముందీ, ఆన్ లైన్ పలకరింపులేగా! పోనీలెే ! కొడుక్కి ఓసారి ఫోనివ్వూ పలకరిస్తా " కొడుకు పవన్ కి ఫోనిచ్చింది. రమ.

"ఏరా! పవన్ బాగున్నావా? " - మెుదలెట్టింది. తోటి కోడలు కళావతి,

"బాగున్నా! పెద్దమ్మా! " పవన్ సమాధానం. ఎంతకీ వదలదే, దీనికన్నా ఇంటికొచ్చి పలకరింపులే నయం. కాసేపు విరామం ఇస్తూ మాట్లాడుకోవచ్చు. అరగంట ఇకిలించు కుంటూ, క్షేమసమాచారాకు, సమాధాన మిచ్చిన పవన్, ముఖంలో రంగులుమారి, ఏడుపుముఖంగా మారి తల్లిని గుఱ్ఱుగా చూసేదాకా వచ్చింది.

"పవన్ మీ ఆవిడకి ఇవ్వు ఫోనూ !" అంది కళావతి , ఇచ్చాడు పవన్ భార్యకి, చెవి మారింది గానీ, అదే హోరు, మరో అరగంట. కోడలు అత్తని గుఱ్ఱుగా చూడలేక మెుగుణ్ణి వేలితో బెదిరిస్తూ, యా.. యా.. యా.. ఆంటీ "అంటూ మాట్లాడీ, మాట్లాడీ అలసిపోయి, ఫోన్ అత్తగారికిచ్చి పారిపోయింది.

కళావతి ఫోన్ పెట్టేసాక "అమ్మా! ఏంటిదంతా ?" పవన్ అసహనం. "నువ్వు వస్తావనే! నాలుగువేలు పెట్టి, మీ అందరి ఆన్ లైన్ కాంటాక్ట్స్ కోసం వై. ఫై పెట్టించాంకద నాన్నా! అదీ గాక అంతదూరం నుండి మాకోసం వస్తున్నారని సకల సదుపాయాలూ ఏర్పాటు చేసాంగా బోలెడు ఖర్చుపెట్టి. అయినా పిల్లల కంటే డబ్బుఖర్చు పెద్ద లెక్క కాదనుకోండీ! " తండ్రి సముదాయింపుకి.

పవన్ "కదా! మరేంటీ గోల? అరగంటకోసారి తెలిసిన వాళ్ళంతా ఫోన్ చేసి, గంటల గంటల ముచ్చట్లూ, " "రాకరాక వచ్చారు కదానాన్నా! ఇదివరకూ మీఅమ్మా, నేనూ ఇద్దరమూ, ఒకరికొకరు సాయం చేసుకుంటూ పనిముగించి, టి. వి ముందు కూర్చుని ఒంటరి వాళ్ళమై పోయామనే దిగులుతో, మీకు ఫోన్ లు చేయాలంటే మీరెంత బి, జీగా ఉంటారో తెలీక కేవలం మీ గురించిన కబుర్లతోనే కాలక్షేపం చేసేవాళ్ళం, ఇప్పుడు మీరొచ్చారు ఫోన్ ల లో ఆన్ లైన్ పలకరింపులతో ఇల్లు ఎంతకళకళ లాడుతోందో చూడండీ " సంబరపడిపోతూ, రమా, మెుగుడూ అన్నారు.

"ఆ మీ ఆనందం ఏమో గానీ, మాకు డిస్ట్రబెన్స్ ఎక్కువయింది. కరోనా రోజుల్లో ప్రైవేట్ రంగాలన్నీ దివాళాతీసి, ఉన్నవాళ్ళకు అరకొర వసతులు అసలే సగం సగం జీతాలు, అయినా వర్క్ పూర్తి చేసి చూపించక పోతే, ఈ సగం జీతాలూ, ఉండవ్. మీ కోడలూ నేనూ వర్క్ ఫ్రమ్ హోమ్, పూర్తిగా చేయాల్సిఉంది. " పిల్లలూ, ఆన్లైన్ క్లాసెస్ కి ఎటెండ్ అవ్వాల్సిందే. అసలే ఈ సంవత్సరం బోలెడు డబ్బులు పోసి కొన్న సీట్లు ఇప్పటికే చదువులు నాశనం అయినాయ్."

"సారీ నాన్నా! సారీ అమ్మా! నేను ఆ గదిలో వసతి ఏర్పాటు చేసుకుంటా. నేను ప్రాజెక్ట్ మానేజర్ని కదా! ఫోన్ లు వస్తూఉంటాయ్, ఇంటర్వ్యూ లూ. జూమ్ మీటింగులు, ఫాన్ మోత కూడా రావటానికి వీల్లేదు. నిశ్శబ్ధం గా ఉండాలి. సరేనా! " అన్నాడు.

"నానమ్మా! తాతయ్యా! ఆన్ లైన్ క్లాసులు జరుగుతున్నాయ్. టి, వి లు పెట్టకండి మేం ఇక్కడే కూర్చుంటాం సరేనా? అటూ, ఇటూ తిరగటాలూ, కుక్కర్ విజిల్స్ పనికిరావు, పంపులు తిప్పిన నీళ్ళ శబ్దాలకు అవతల లెస్సన్స్ (పాఠాలు) వినబడవు . సరేనా! సహకరించండేం "

"సహకరించక చస్తామా? సహకరించక పోతే చస్తాం! " పిల్లలు వచ్చారనే ఆనందం ఆవిరైపోయి, ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని నిట్టూర్చారు. రమా, ఫణీంద్ర.

************************

వాకిట్లో గోడవారగా కుర్చీలేసుకుని కూర్చున్న రమ, ఫణీంద్ర గార్లను, దారినపోయే దానయ్యలు పలుకరిస్తున్నారు. "ఏమండీ! ఇదివరకు బయటే కనబడే వారుకాదు, ఇదేమిటీ, " "మనిషి రోడ్డున పడ్డాడు... ఏమిటో!? " ఇలా "అబ్బే! ఏం లేదూ! చక్కని వాతావరణం, ఆహ్లాదకరమైన ప్రకృతిమాత దర్శనం" రమా ఫణీంద్ర ల సమాధానానికి ముసిముసి నవ్వులతో వెడుతున్నారు. మూతికి మాస్క్ లున్నాయి కాబట్టి, నొసళ్ళ వెక్కిరింత మాత్రమే కనిపిస్తోంది చూపుల్లో- హాయిగా! కాలిమీద కాలేసుకుని, కూర్చుని, టి. వి చూస్తూ, సెల్ ఫోన్ లలో బంధువులతో, మాట్లాడుకుంటూ, చిలకా గోరింకలల్లే, కళకళలాడుతూ కనబడే రమా, ఫణీంద్ర ల ఆరుబయట ముచ్చట్లు ఆన్ లైన్ అచ్చట్లని మాకుతెలీదేంటీ?! అని. ఆ చూపులకు అర్దాలు మాకూ తెలీదేంటీ?!

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు