బెట్టింగ్ బాలరాజు - సరికొండ శ్రీనివాసరాజు

Betting Balaraju

బాలరాజు 9వ తరగతి చదువుతున్నాడు. అతనికి ఒక చెడ్డ అలవాటు ఉంది. ప్రతి చిన్న విషయానికి పందెం కాసి, అవతలి వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేసేవాడు. తాను ఖచ్చితంగా గెలిసే అవకాశం ఉంటేనే పందెం కాసేవాడు. అందుకే చాలామంది బాలరాజుకు దూరంగా ఉంటున్నారు. కొంతమంది ఎలాగైనా బాలరాజు మీద గెలిచి, గొప్ప అనిపించుకోవాలని మళ్ళీ మళ్ళీ పందేలు కాసి, ఓడిపోయేవారు. రాను రాను తనకు ఓటమి లేదనే అహంకారంతో ఎక్కువ డబ్బులను పందేనికి పెట్టేవాడు. మరింతగా డబ్బులు సంపాదిస్తున్నాడు.

ఒకరోజు బాలరాజు వాళ్ళ గణిత ఉపాధ్యాయుడు శేఖర్ గారు తాను తదుపరి రోజు రాలేకపోతున్నానని తనకు అత్యవసరమైన పని ఉందని తోటి వ్యాయామ ఉపాధ్యాయునితో అన్నాడు. ఇది బాలరాజు విన్నాడు. అయితే శేఖర్ గారు సెలవు పెట్టడం చాలా అరుదు. సంవత్సరంలో రెండు మూడు రోజులే సెలవు పెడతాడు. బాలరాజు రేపు శేఖర్ గారు పాఠశాలకు రారు అని శ్రీనివాసుతో పందెం కాసినాడు. అనుకోకుండా మరునాడు శేఖర్ గారు పాఠశాలకు వచ్చారు. శ్రీనివాసు ముక్కు పిండి మరీ బాలరాజు దగ్గర డబ్బులు వసూలు చేశాడు.

బాలరాజు చెల్లెలు శ్రీలక్ష్మి. 7వ తరగతి చదువుతుంది. "బాధపడకురా అన్నయ్యా! ఈసారి వచ్చే పరీక్షలలో శ్రీనివాసును మార్కులలో చిత్తుగా ఓడించు. వాడికి తిక్క తిరుగుతుంది." అన్నది శ్రీలక్ష్మి. అలాగేనన్నాడు బాలరాజు. కానీ పందేలతో కాలక్షేపం చేస్తూ తేరగా డబ్బులు సంపాదిస్తున్న బాలరాజుకు ఒక్కసారిగా చదువుపై ఆసక్తి ఎలా వస్తుంది? చదవాలని ఎంత ప్రయత్నించినా ధ్యాస కుదరడం లేదు. తదుపరి పరీక్షలలో శ్రీనివాసుకే ఎక్కువ మార్కులు వచ్చాయి. శ్రీలక్ష్మి అన్నయ్య దగ్గర చేరి, "ఎంత పని చేసావు అన్నయ్యా! నువ్వు ఈసారి మార్కులలో శ్రీనివాసును ఓడిస్తావని శ్రీనివాసు చెల్లెలితో 500 రూపాయల పందెం కాసినాను. మనం కోల్పోయిన పందెం డబ్బులు తిరిగి తీసుకోవాలని ఇలా చేశాను. కానీ నువ్వేం చేశావు?" అని అలిగి వెళ్ళిపోయింది. కోలుకోలేని దెబ్బ తిన్న బాలరాజు పందేలకు స్వస్తి చెప్పి బుద్ధిగా చదువుకున్నాడు.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు