" ఒరేయ్ కిషోర్ నాకు ఏమీ తోచడం లేదురా. పుస్తకాలు చదివే అలవాటు మొదటినుంచి లేదు. పేపరు చదవడం పూర్తయిన తరువాత సమయం గడపడం చాలా కష్టంగా ఉంది" సరిగ్గా మూడు నెలల క్రితం చలమయ్య కొడుకుకు పెట్టుకున్న మొర యిది. తండ్రి బాధ చూడలేక ఒక స్మార్టుఫోను కొని, పది రోజుల పాటు కష్టపడి మెసేజిలు పంపడం, యుట్యూబు చూడడం, చిన్న చిన్న ఆటలు ఆడడం, ముఖపుస్తకంలో నచ్చిన అంశాలపై విమర్శలు వ్రాయడం నేర్పించాడు. మొదట కొంచెం విముఖత చూపించినా, క్రమేపి ఆసక్తి పెరిగి ఫోనుకు అలవాటు పడిపోయాడు చలమయ్య. మొదట మొదట రోజుకు గంటో, రెండు గంటలో ఫోనుతో గడిపేవాడు. రాను రాను ఫోనే లోకమయిపోయింది చలమయ్యకు. ******* " తాతయ్యా.. నాకు కథలు చెప్పు " అంటూ చలమయ్య దగ్గరికి వచ్చాడు చింటూ. " ఒరేయ్ నన్ను విసిగించకు. వెళ్ళి ఐపాడ్ లో ఆటలాడుకో పో" అని విసుక్కున్నాడు. ఏడుస్తూ వెళ్ళిపోయి వాళ్ళ నాన్నకు చెప్పాడు చింటూ. " ఏంటి నాన్నా ఇది. ఈతరం పిల్లలకంటే ఘోరంగా తయారయ్యారు మీరు. సమయానికి స్నానం చెయ్యరు. తిండి సరిగా తినరు. చింటూతో ఆడుకోరు. ఎప్పుడు చూసినా ఫోనేనా" తండ్రిని అడిగాడు కిషోర్ సమాధానం లేదు చలమయ్య నుంచి. " నాన్నా మాతో మాట్లాడండి ప్లీజ్ " గట్టిగా అరిచాడు కిషోర్. " ఎందుకురా అంత గట్టిగా అరుస్తావు. ఏమయిందిప్పుడు నీకు, నా మానాన నేనుంటే" ఎదురుప్రశ్న వేశాడు చలమయ్య. " మీరు మాతో సరిగా మాట్లాడి ఎన్ని రోజులయింది. బుద్దిలేక నేర్పించాను మీకు ఫోను వాడకాన్ని. కొనిపెట్టకపోయినా బాగుండేది. కనీసం వారానికొకసారయినా మమ్మల్ని పలకరించేవారు" " ఎందుకురా అంత కోపం. ఈ రోజు మీరు బాధపడ్డట్టే ఆరోజు నేనూ బాధపడ్డాను. ఎప్పుడు ఫోనుతోనో, లాప్ టాప్ తోనో గడిపేవారు తప్ప, నాతో రోజులో పదినిమిషాలు కూడ మాట్లాడేవారు కాదు. చింటూను అతి కష్టం మీద పావుగంటసేపు మాత్రమే నావద్ద ఉండనిచ్చేవారు. నేను సిగ్గువిడిచి తోచడం లేదని అడిగితే, సమయం చేసుకుని మాట్లాడుతానని చెప్పడం మానేసి, సెల్ ఫోను తెచ్చి చేతిలో పెట్టి దాంతోనే కాలం గడపమన్నావు. ఇప్పుడు మాట్లాడలేదని నింద నామీద వేస్తున్నావు" " తప్పయిపోయింది నాన్నా. ఇంకెప్పుడూ అలా చెయ్యను. రోజుకొక గంట మీతో గడుపుతాను. చింటూ ఇక మీ దగ్గరే పడుకుంటాడు. మీరు మాట్లాడకపోతే మాకు పిచ్చెక్కినట్లుంది నాన్నా" " ఫోను వాడకం మనుషుల మధ్య బంధాలను దూరం చేస్తుందే కానీ, అనుబంధాలను పెంచదు. మీకు ఈ విషయాన్ని అనుభవంలో తెలియజేయాలనే నేను ఇలా ప్రవర్తించాను. అందరమూ కలిసేవున్నా, ఎవరిగోలవారిదిలా బ్రతికేవాళ్ళం. నేను మాట్లాడడం మానేస్తేనే మీలో చలనం కలుగుతుందనే ఇలా చేశాను. ఏమనుకోకండిరా. ఇకనైనా మారండి మనుషుల మధ్య జరిగే మాటలలో ఉండే ఆప్యాయత సెల్ లో చేసే సందేశాలలో ఉండదు. అది తెలిసి మసలండి. బంధాలను పెంచుకోండి" " సారీ నాన్నా. ఇకనుంచి మీరెలా చెబితే అలా చేస్తాం. అవసరమైతేనే ఫోను వాడతాం. మా తప్పు తెలిసింది" అని చెంపలేసుకున్నాడు కిషోర్. " అయితే ఈరోజు నుంచి నేను తాతయ్య గదిలోనే పడుకుంటా" అని పరిగెత్తుకొచ్చిన చింటూను దగ్గరకు తీసుకుని ఫోనును పక్కకుపెట్టాడు చలమయ్య. **********