సహజం గానే నవ్వు మొహం, ఎప్పుడూ అనందం గానే వుండే ఆనంద రావు చిటపట లాడుతున్నాడు. కారు వేగంగా తన ఇంటి ముందు ఆపి విసురు గా కారు తలుపు తీసి , ఇంటిలోకి పరుగు లంకించాడు, జారిపోతున్న పంచకట్టు ని పైకి ఎక్కిపెట్టి.
" ఫ్రిడ్జ్ నుంచి తీసి వంట ఇంట్లొ, గట్టు మీద పెట్టాను సరిగ్గా చూడండి" అన్నది శ్రీమతి కారు లోంచే ' అసలే మీకేం కన బడి చావదు ' గొణిగింది తను వెళ్ళిపొయ్యాడని నిర్దారించుకున్నాక. ఇంతలో సమయాలాపన ఎందుకని, తన వేనిటీ బాగ్ లొ వున్న మేకప్ కిట్ కి పని చెప్పింది సతీమణి, కారు అద్దం లోకి చూసుకుంటూ. ఇంతలో రానే వచ్చాడు కేకు తో ఆనంద రావు. కారు వెనకాల సీటు లొ దాన్ని జాగ్రత్త గా పెట్టి, తను డ్రైవర్ సీటు లో కూచున్నాడు. "వేళా పాళా వుండదే మీ మేకప్పులకి, ఇంటి పై కప్పులు లేచిపోయే పని చేసావ్, అస్సలు... చ చ్చ . అందుకే బయలు దేరే ముందే అన్ని ఒక సారి చూసుకోమనేది"
కారు రై మని ఒక యు టర్న్ తిప్పి, బయలు దేరాడు గమ్యం వైపు గా. కారు సరా సరి సగటు కన్నా కొంచెం వేగం గా , కంగారు గా వెళ్తోంది.
"అయినా చొద్యం కాక పోతే, , స్వచ్చం గా తెలుగు సనాతన పద్దతుల్లో , పంచ కట్టు , పట్టు వస్త్రాలతో సత్యన్నారాయణ వ్రతానికి వెళ్తూ, ఈ కేకు కేకలేమిటో, నా బొంద" మండి పడుతూ ఆనంద రావు.
"మీకు కేకు ఇష్టం వుండదని వొద్దంటారా ఎంటి, అయినా వాళ్ళ ఇంట్లొ ఫంక్షన్, వాళ్ళు ఆర్డర్ ఇచ్చుకున్నారు, వాళ్ళే పే చేసుకున్నారు, మనం కేవలం పిక్ చేసుకుని తీసుకెళ్ళటం, ఇంత చిన్న సాయం చెయ్యలేమా. ఈ రోజు ఆ బేకరి వుండదు, ఇది అసలే స్పెషల్ వ్రతం ఆర్డర్ కేకు. నిన్న రాత్రే తెచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టాను." శ్రిమతి వారించింది
కుడి వైపు బ్లింకర్ ఆన్ చేసి ఎడమ వైపు కి తిప్పాడు కారు ని సర్రుమని, రొడ్ కి అడ్డం గా కంగారులో మన ఆనంద రావు. మరేదో ఇంకేదో దేశం లో అయితే ఇది పెద్ద ఆక్సిడెంటే. మన స్వతంత్ర భారతం లో స్వేచ్చ కొంచెం ఎక్కువ కాబట్టి , ఆనంద రావు కంగారు ని మొత్తం రోడ్ మీద వున్న వసుదైక కుటుంబం అర్దం చేసుకున్నారు. ఆనంద రావు కారు కి వెనకాలే, కారు నీడని కూడా రోడ్ మీద పడనీ కుండా, ఇంచి ఇంచి ముద్దు పెట్టే దూరం లో, వచ్చే స్కూటర్ మీద వున్న కుర్రాడయితే ' హ హ ఇది నే ముందే ఊహించా , నన్నెవరూ ఏమార్చ లేరు ', అన్నట్టు తల అటు ఇటు ఊపి చెయ్యి గాల్లో కి లేఫి ' పోనీ ఇట్స్ వాకే ' అనే అర్ధం వచేట్టు గాలి లొనే చెయ్యి ఊపాడు. సమయానికి ఆ జంక్షన్ లో పోలీసు కానస్టేబల్ లేడు, వుంటే ఆ కుర్రాడు చేసిన పనే చేసేవాడు. కాకపోతే నొట్లో వున్న విజిల్ వూదేవాడు కొపంగా. బయట వాళ్ళకు మన దేశం లో ట్రాఫిక్ , చిందర వందర గా అనిపిస్తుంది, కాని సూక్ష్మం గా చూస్తే సహనం తో కూడుకున్న సహజీవనం. మర్మం గమనిస్తే అది ఒక రకం గా బిన్నత్వం లో ఏకత్వం.
ఆ వికటాట్ట విన్యాసానికి కేకు చెక్కు చెదరలేదు అదృష్టం బాగుండి. ఒక సారి వెనకాలకి తిరిగి చూసి నిర్దారించుకున్నాడు. తన డ్రైవింగ్ కి శ్రీమతి చూసే ఎర్రని చూపులు తట్టుకోలేక , గేర్ పక్కనే వున్న నళ్ళ కళ్ళద్దాలు తగిలించాడు మన ఆనంద రావు, కొంచెం స్వరం లొ మృదుత్వం కొనితెచ్చుకొని గారం గా
"అది కాదే నా వుద్దేస్యం, డబ్బు వాళ్ళదే, కేకు కూడా వాళ్ళదే, నొప్పి కూడా వాళ్ళదే, కానీ వాపు మనకి కదా " హె హె అని వెటకారం గా నవ్వుతూ " అయినా ఈ మధ్య సమయం సందర్భం లేకుండా పోతుంది ఈ కేకు కట్టింగు లకి అని నే వాపోతున్నా అంతే"
"ఇదే అమెరికా లో అయితే, మీకు టిక్కట్ పడేది, అసలు అరెస్ట్ చెయ్యాలి ఇలాంటీ డ్రైవెర్స్ ని" అంది కళ్ళల్లో ఎరుపు ఏమాత్రం తగ్గించకుండా
ఆనంద రావు కేకు బాగోతం చాలా సార్లు విన్నది సతీమణి నందిని. ఈ సదరు కేకు కటింగు ఎదో ఇంగిలీషు వాడు విదిల్చి వదిలేసిన ఎంగిలి సాంప్రదాయమనిన్ని , ఎపుడొ ఒక పుట్టిన రోజు కు అయితే సరే, ఎటు అది పాచ్యాత్య పోకడే కాబట్టి, సరే అని సరిపెట్టు కోవచ్చు. కానీ ఈ మద్య పూజ కీ, పెళ్ళి కీ, కొత్త వత్సరానికి, ఉగాది కీ, ప్రతి పండగ కీ, ప్రమోషన్ కీ, అన్నిటీ కీ కేకు కట్టింగే. తనకి ఈ విషయం లో పెద్ద గా అభిప్రాయము లేదు. అందుకే నందిని నిట్టూర్చటం మొదలెట్టింది, చాలా సేపు ఊర్చింది, తను ఊర్చటం పూర్తయ్యే సరికి కారు పూజా స్థలానికి చేరిపోయింది.
********************
రాము రమణి ల ఇంట్లొ సత్యన్నారాయణ వ్రతం. బంధు మిత్రులు , స్నేహితులు అందరూ సపరివారము గా వచ్చారు. పూజ , హోమము దేదీప్యమానం గా చెయ్యటానికి సన్నాహాలు సాగుతున్నాయి. వాళ్ళ అపార్ట్మంట్ లోనే పూజ. హాలు లోని సామాను అంతా తీసేసి , అక్కడే మధ్యలో హొమానికి ఏర్పాటు చేసారు. అదే హాలు లో ఒక మూల గా పూజ కి మండపము అలంకరణ చేసారు. హోమము పూర్తి అయిన అరగంట కి ఆ మండపము లో పూజ మొదలు పెట్టే ముహూర్తం. దపతులు హోమం దగ్గర కూచున్నారు. పరమ భక్తులు అటు ఇటు సర్దుకొని హాలు లోనే సర్దుకున్నారు. మిగతా అందరికీ ఆ అపార్ట్మంట్ పైన మేడ మీద కూర్చొనే ఏర్పాటు. అపార్ట్మంట్ లొ ఎవరు ఫంక్షన్ చేసుకోవాలన్నా అలా మేడ మీద షామియానా వేసి ఆ రోజు మేడ వాడుకుంటారు. పూజ ముగిసాక అక్కడే మేడ మీదే బోజనాలు కూడా.
కేకు తో లోపల కొచ్చారు అనందరావు దంపతులు. నిష్ట గా హోమం లో వున్న రాము, వాళ్ళ రాక ని గమనించి , 'ఒహ్ ఒకే ' అన్నట్టు కళ్ళూ ఎగరేసి పలకరించాడు. అందులోనే ' కేకు మర్చిపోకుండా తెచ్చారు ' అన్న పరమార్ధం కూడ వుంది. వాళ్ళు వచ్చింది మరీ తొందర కాదు, లేటు కూడా కాదు మద్యస్తం. అప్పటి నుంచి, పూజ ముగిసే వరకు బంధువులు వస్తూనే వున్నారు.
తన లో సగమయిన నందిని ని, కేకు ను అపర్ట్మంట్ లో విడిచి , దేవుడికి ఒక దండం మూల్యం గా చెల్లించి, మేడ మీద కి వెళ్ళాడు ఆనంద రావు. నందిని కేకు ని ఫ్రిడ్జ్ లో పెట్టి , హాలు లో కి వచ్చి , ఒక మూల గా కాళీ చూసుకొని పుణ్యం పొందే కార్యం లో ధ్యానం తో నిమగ్నమయింది.
మూడు గంటల తర్వాత పూజ ముగిసింది, అందరూ మేడ మీదకి చేరారు. అక్కడ బఫ్ఫెట్ బోజనాలు. నించొని తినేవాళ్ళు అలానే నించొని తింటున్నారు. కూచ్చోడానికి వేసిన కుర్చీలు రెండు గ్రూప్ లు గా సెపరేటు అయ్యాయి. ఆడ కుర్చీలు మగ కుర్చీలు. కుర్చీల లో లింగ బేదం వుందని కాదు , భారతీయులు ఎక్కడ ఫంక్షన్ లో గుమిగూడినా పురుషులు , స్త్రీలు అలా వేరు వేరు సమూహాలు గా విడి పోయి చర్చ ల్లోకి వెళ్తారు. కొందరు బోజనం తినేసి, భుక్తాయాసం తో చర్చ లో పాల్గొంటే , కొందరు ప్లేటు లో నిండు గా వేసుకుని బోజనం ఆరగిస్తూ పాల్గొంటారు.
మగ సమూహం లో ఆనంద రావు కి గుబులు మొదలయ్యింది. ఇలాంటి గేదరింగ్స్ లో కేకు కట్టింగ్ తో పాటు, అతనికి నచ్చనివి ఇంకో రెండు అంశాలు. అవి బోజనాల గురించి, పూజ గురించి అనవసర అసంధర్భ ప్రలాపాలు, ప్రలోభాలు. నచ్చితే బోజనాలు బాగున్నాయి అని ఒక సారి అనుకోవటం ఒక ఎత్తు, కానీ అలా కాక కొంత మంది, బోజనాల్లో ప్రతి ఐటం ని గుచ్చి గుచ్చి విశ్లేషిస్తారు. దాన్లో కొత్తిమీర నూరి వెస్తే బాగుణ్ణు, దీన్లో పచ్చి కారము బదులు పచ్చిమిరపకాయలు నూరి వేస్తే బాగుణ్ణు, నిమ్మ పులిహార బదులు చింతపండు పులిహోర బాగుంటుంది, పులొహార లో జీడి పప్పు వెస్తే, ఇలా బోజనాలని గురించి చర్చ కి అంతు పొంతు వుండదు. ఆథిద్యం ఇచ్చినవాడు పలానా చోట బాగుంటుందనే కదా కాటెరింగ్ ఇస్తాడు, ఒకటో అరో అటు ఇటు గా వుంటె సర్దుకు పోవాలి గాని, దాని గురించి ఎందుకీ సంత మేళం అనేది అనంద రావు అభిమతం. అది అయిపొయ్యాక పూజ గురించి. పూజ చాలా బా జరిగిందనో, లేక మా పంతులు అయితే ఇంకా బాగా చెస్తాడనో. ' వినాయక పూజ, లక్ష్మి పూజ రెండూ చేసాకనే హోమము మొదలు పెట్టాలి ఈ పంతులు ఎంటి లక్ష్మి పూజ చెయ్యలేదు ' అనో ఇలా. ఆనంద రావు నాస్తికుడు కాదు గాని, దేవుడు అంటే ధ్యానము , అధ్యాతిక చింతన వుండాలి గాని, ఈ పూజలు పునస్కారాలు హొమాలు మీద అతనికి పెద్ద గా నమ్మకము లేదు.
ఏం మాట్లాడాలో తెలియక " బానే వుంది ఈ రోజు వాతావరణం, మరీ ఎండ గా లేదు" అన్నాడు మన ఆనంద రావు మగ కుర్చీల మద్యలోంచి
"చాల్లే వయ్యా నువ్వు అమెరికా లో లేవు, వెదర్ గురించి బాతాకానీ ఎందుకు" జోకు పేల్చాడు రమేష్ తన పక్కన వున్న సురేష్ కి ' హై ఫై ' ఇస్తూ. ఇద్దరూ పగల బడ్డారు.
"పోతే పోనీ , మన రాము గాడికి అన్ని ఇలా కలిసి వస్తాయి. పంతులు గారు చాలా బాగా దీక్ష గా వివరము గా చేసారు , ఇలాంటి పూజ లో కూర్చున్నా చాలు పుణ్యమే" అన్నాడు పక్క నుంచి సురేష్.
"దేనికయినా అద్రుష్టము వుండాలండి, పెట్టి పుట్టాలి. పూర్వ జన్మ సుక్రుతం" రెండు బుగ్గల్లో బుక్కేస్తూ, నొట్లో ముద్ద నొట్లో నే వుంచుకొని చెప్పాడు పరిచయం లేని పెద్ద మనిషి. అందరూ అవును అవును అన్నట్టు తలలూపారు.
"మీరు .... మీరు మాట్లాడేది పూజ గురించే గా" అన్నంద రావు క్లారిఫై చేసుకున్నాడు.
"అవునండి పూజకే , ఎదో పంతుళ్ళకి దక్షణ పడెస్తే అయిపొద్ది అనుకోకండి. ఇంత బాగా శాస్త్రోక్తం గా , ఇంత మంచి దివ్య ముహూర్తం లో జరగాలంటే , కచ్చితం గా..పూర్వ జన్మ పలితమే" అపరిచితుడు నొట్లో నే ముద్ద పెట్టుకొని మాట్లాడము వల్ల తుంపర్లు, మెతుకులు అటు ఇటు చుట్టు పక్కల పడుతున్నాయి. అలా ఒక బాగా నమిలిన మెతుకు వచ్చి మన ఆనంద రావు పెదాలకు అంటుకుంది. వాంతి వచినట్టు అయింది అతనికి.
అంతే మొదలయింది పూజ విశ్లేషణ. రమేషు, సురేషు తదితర మిత్రులంతా పూజ తో పాటు గా అసలు మన పూర్వీకులు పెట్టిన ఆచారాల్లో చాలా శాస్త్రీయ పరమయిన కారణాలు వున్నాయన్నిన్నూ, మన వాళ్ళు అన్ని ఆలోచించే పెట్టారనిన్నూ... అక్కడ నుంచి నందిని కూచున్న వైపు మెల్లగా జారుకున్నాడు ఆనంద రావు.
ఆడ కుర్చీల మేళం లో కూచున్న నందిని వైపు వెళ్ళాడు, పక్కనే వున్న పరిమళని పలకరిఉంచాడు.
"ఎం బావ గారు మీరు అమేరికా నుంచి వచ్చేదే ఎప్పుడో, రావచ్చు గా ఒక సారి ఇంటి కి. అక్కేమో తెలివిగా చుద్దాం లే అంటుంది"
"అలా ఎం లేదమ్మ. తెలుసు గా నీకు షార్ట్ ట్రిప్, అందుకే ఇలా ఈ పూజ లో అందరం కలిసాం గా. టైం వుంటే తప్ప కుండా వస్తాం"
"ఆ మీరు ఎప్పుడూ ఇలానే అంటారు. సరే గానీ, మీరు చెప్పండి ఈ పులిహోర లొ పల్లీ లు ఎక్కువయ్యాయి కదా ?"
"హ ..ఉ.. ఆ.. " అని నీళ్ళు నమిలాడు ఆనంద రావు.
ఇంతలో ఫంక్షన్ లో యువత ఒక టేబల్ తీసుకొచ్చి మేడ మీద ఒక వార గా వేసారు. " అటు వద్దు, ఇటు వైపు వెయ్యండి, లైటు ఇటు వుంది, సో ఫొటొస్ ఇటే బాగా వస్తాయి" అంది కొంచెం ఫొటొ జెనిక్ గా వున్న వనిత.
ఇక యువత అంతా ఆమె చెప్పినట్టు ఫాలో అయ్యారు, కలసి ఏర్పాట్లు చేసారు, ఒక టేబల్ క్లాత్, తదనంతరము కేకు పట్టుకొచ్చారు. మన ఆనంద రావు దంపతులు తెచ్చిన కేకే. రాము రమణి లతో అది కట్ చేయిస్తారు. అప్పటి దాకా పట్టు వస్త్రాలతో వున్న వారు కాస్తా మాములు ఆధునిక దుస్తులు లోకి మారిపొయ్యారు. ఇదే మన ఆనంద రావు కి తేళ్ళు జర్రులు పాకే సమయం. ఇప్పుడు ఫంక్షన్ కి వచ్చిన ప్రతి జంట రాము రమణి లతో కేకు పెడుతూనో తింటూనో కేకు ఫొటొ సెషన్ వుంటుంది. అంతే, ఇక వల్ల కాలేదు ఆనంద రావు కి. ఎదొ తన ఫోన్ మోగినట్టు నటించి.. "ఆ .. నేనే చెప్పండి " అన్నాడు ఆ ఫోన్ అవతల వున్న నకిలీ వ్యక్తీ తో. ఇటు వైపు తిరిగి "కొంచెం అర్జెంట్, ఎం అనుకోవద్దు" అని పరిమళ తో చెప్పి " నందూ నువ్వు వచ్చేసే, నేను కార్ లో వుంటా"
**************************
"హల్లో అంకల్ !! బావున్నారా !! ఎప్పుడు వచ్చారు" అంటూ ఇంట్లొ అడుగు పెట్టింది పదేళ్ళ పక్కింటి పాప ఒక ప్లేటు లొ ఎదో పట్టుకొని." అవును మీరు ఇంట్లొ ఎంత మంది ?" ప్రశ్నార్ధకం
హాలు లో కూచ్చొని పేపర్ తిరగేస్తున్న అనంద రావు పేపర్ దించి తల పైకెత్తి చూసాడు.
" ఎం పిల్లా నువ్వు జనాభా లెక్కల శాఖ లో పని చెస్తావా ఎంటి ? " నవ్వాడు ఆనంద రావు కుర్చీ లోంచే "అంటే .... " తల గోక్కుంది పిల్ల
ఇంతలో ఆనంద రావు గారి అత్తయ్యగారు వంట ఇంట్లొంచి హాలు లోకి వస్తూ " ఎరా గుర్తు పాట్టావా"
" ఊ .. నేను పట్టాగా , నందిని అక్క మొగుడు"
నవ్వటం ఆపేసాడు ఆనంద రావు.
"ఆంటి మీకు రెండు ముక్కలే ఇచ్చింది అమ్మ, నందిని అక్క వాళ్ళు వచ్చారని తెలియదు కదా" అంది పిల్ల విచారం గా మొహం పెట్టి
"ఎం పర్లేదు రా, ఇంతకీ ఏం తెచ్చావ్, ఎమి చేసినా మాకు పంపుతుంది రా మీ అమ్మ, దానికి ఎంత ఓపికో .. ఎం చేసిందేమిటి" అన్నారు అత్తగారు పిల్ల బుగ్గ గిల్లుతూ
"ఎం లేదు అంటీ, మేము కేకు కట్ చేసాం ఈ రోజు, మా పెరటి లో వున్న జామ చెట్టు, మొట్ట మొదటి గా కాయ కాసింది"
దెబ్బ కి ఉలిక్కి పడి, పేపర్ పక్క న పెట్టేసాడు ఆనంద రావు. " ఎంటమ్మా పాపా , నిజం గా నా , జామ చెట్టు జామ కాయ కాసిందని కేకు కట్ చేసారా"
" అవును అంకల్ మా ఇంట్లొ ఎం మంచి జరిగినా కేకు తోనే సెలెబ్రేట్ చేసుకుంటాం" ఆనందం గా పక్కింటి పిల్ల
"ఆ జామ కాయే కోసి తలో ముక్కా పంచి పెట్టొచ్చు కదా " అన్నాడు కొంచెం చిరగ్గా
"లేదు అంకల్ సగం ఉడుత, ఇంకో సగం కాకి కొరికేసాయి" అని ఊగుతూ " అయినా మొక్క పెరిగి పెద్ద చెట్టు గా అవ్వటం మంచి సకునమట, మా నాన్న చెప్పారు, సొ అదే స్పెషల్ రోజు, అందుకే కేకు"
"సర్లే రా . చాలా థాంక్స్ , రెండు ముక్కలు చాలు, మేము అసలే ముసలి వాళ్ళం ఎక్కువ స్వీట్ తినకూడదు, ప్లేటు నేను మళ్ళీ పంపిస్తాలే" అని అత్తగారు పక్కింటి పిల్ల ని సాగనంపారు.
"ఆ సరే ఆంటి, ఈ రొజు అసలే గురువారం, అందుకే ఎగ్గ్ లేకుండా చేయించారు కేకు" బయట కు పరుగెడుతూ అంది పాప
ఇంతలో మామ గారు వచ్చారు హాలు లోకి " ఆ వెల్దామా అనందు" . అప్పటికే సాయంత్రపు వాకింగు కి తయారయి కూచున్న అల్లుడు సరే అని తల ఊపుకుంటూ లేచాడు కుర్చి లోంచి
"పాల పేకట్ మర్చి పోకండి " అత్తయ్యగారు వంటింట్లొంచే అరిచారు " మీకు టీ పెట్టి మిక్స్చరు , కేకు పెడతా"
*****************
వాళ్ళ ఇంటి పక్కనే ఒక పార్కు వుంది, అక్కడే పది పచారీలు కొట్టారు మామా అల్లుళ్ళు. అక్కడే వున్న బెంచి మీద మామ గారు సేద తీర్చుకుంటుంటే , మన ఆనంద రావు ప్రపంచం లో తనకి తెలియకుండా ఎమేమి జరిగి పోతున్నాయో అని ఒక్క సారి తన సెల్ల్ ఫోన్ లో చెక్ చేసుకున్నాడు. తదనంతరము ఇద్దరూ ఇంటి దోవ పట్టారు. వచ్చిన తోవ లో కాకుండా ఇంకో రూటు, ఇది పాల పేకట్టు రూటు. ఈ రోడ్డు కొంచెం కోలా హాలం గా వుంది, ఒక ఇంటి ముందు ఎదో హడావిడి. షామియానా వేసారు. పెద్ద మైకు సెట్ అదీ పెట్టారు దాన్లోంచి గంటశాల వారు భగవత్ గీత దీనం గా పాడుతున్నారు.
"అయ్యో అనవసరం గా ఇటు వచ్చామే, మర్చి పొయ్యా, ఆ ఇంట్లొ పెద్దాయన , కాలం చేసారుట, నేటురల్ గానే లే, తొంబై పై పడి వుంటాయి " మెల్ల గా అల్లుడి తో చెప్పారు మామ గారు
"తిరిగి వెళ్ళిపోదామా మావయ్య ? " కొంచెం ఆగాడు ఆనంద రావు
"వొద్దు లే బాగోదు, అయినా వాళ్ళతో మనకి పెద్ద పరిచయం లేదు లే, పక్క నుంచి వెళ్ళిపోదాం మెల్లగా"
షామియానా రోడ్ అంతా ఆక్రమించడము తో వీళ్ళు ఇద్దరూ వార గా నడుస్తున్నారు.
" అంకుల్ " యుక్త వయసు లో వున్న పిల్లాడు పిలుపు వీళ్ళకి వినపడింది. మొదట వీళ్ళను కాదులే మనలని ఇక్కడ ఎవరు పులుస్తారు అనుకొని వేస్తున్న అడుగులని మళ్ళీ గొంతు పెంచిన " అంకుల్ " పిలుపు ఆపింది.
మామగారు అంకుల్ అన్న గొంతు వైపు తిరిగారు. ఆనంద రావు ఎటు తిరగాలో తెలియక గాల్లో దిక్కులు చూస్తున్నాడు.
అక్కడ పెద్ద టేబల్ వుంది, దాని మీద చిన్న ప్లాస్టిక్ ప్లేట్లు, ఒక్కొక్క ప్లేటు లో చిన్న కేకు ముక్క, ఒక ప్లాస్టిక్ స్పూన్. అలా ఒక పది పదిహేను దాకా పేర్చి వున్నాయి. " అంకుల్ తీసుకోండి " అని ఆ యుక్త వయసు కుర్రాడు మామా అల్లుళ్ళ కి తలా ఒక ప్లేటు అందించాడు. అసంకల్పితం గా ఇద్దరూ చెయ్యి చాచి కేకు ప్లేటు లు తీసుకున్నారు షాక్ లోనే. చూస్తుంటే ఆ టేబల్ కి ఈ కుర్రాడు ఇంచార్జ్ లా వున్నాడు. వచ్చి పొయ్యె వారికి కేకు లు అందేలా చూడటము అతని బాధ్యత.
కేకు చూడ గానే బుర్ర తొరిగింది, మూర్చ పోయినంత పని చేసాడు. సొమ్మ సిల్లి , షామియానాలోనే పక్క న వున్న కుర్చీ లో వాలిపొయ్యాడు ఆనంద రావు.
" వాటర్ తీసుకోండి . మీకు మా తాత గారు తెలుసా" బాటల్ అందించింది ఆ అంకల్ అన్న గొంతు
"మీ తాత గారు తెలియదు, కానీ నాకు ఈ కేకు బాగా తెలుసు" అనేసి ఆనంద రావు , తన కేకు ప్లేటు ని ఆ టేబల్ మీదకి గిరాటు వేసి , మామ గారిని కూడా పట్టించు కోకుండా ఇంటి వైపు పరుగు లంకించాడు.
*************************
బాగా అలసి పొయిన ఆనంద రావు ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వగానే నిద్ర లోకి జారుకున్నాడు. బేంగళూరు నుంచి విశాఖ పట్టణం ప్రయాణం అది. ఈసారి ఇండీయా ట్రిప్ లో తన బేంగళూరు ఆఫీసు లో రెండు వారాలు పని చేసే అవకాసం కొట్టేసాడు ఆనంద రావు. తను అమేరికా లో పని చేసే కంపనీ కే ఒక విభాగం బేంగళూరు లో వుంది. ఈ నెపం తో ఇండీయా లో కొన్నాళ్ళు ఎక్కువ వుండవచ్చు అని. ఫ్లైట్ లో ఎదో పెడ్డ శబ్ధం అయ్యే సరికి బాంబ్ అనుకొని ఉల్లిక్కి పడి లేచాడు. చాలా హడావిడి గా వుంది ఫ్లైట్ లో. అది ఒక బలూన్ పేలిన శబ్ధం అని తెలుసు కున్నాడు. ఎయిర్ హోస్టస్ పేలిన బలూన్ ని చేతిలో పట్టుకొని ' హాపీ బర్త డే టూ యు , హాపీ బర్త డే టూ యు , హప్పీ బర్త డే టూ యు లిట్టల్ శష్రూక్ ' అని పళ్ళు ఇకిలిస్తూ పాడింది. పక్కనే వున్న మరి ఇద్దరు ఎయిర్ హొస్టస్ లు కూడా గొంతు కలిపారు. దాని తో పాటు చుట్టు పక్కల వున్న వాళ్ళు అంతా ' హాపీ బర్త డే . హేయ్' అని అరిచి కేరింతలు కొట్టారు. ఇంత లో ఒక ఎయిర్ హొస్టస్ ఒక చిన్న కప్ కేకు తీసుకొచ్చి,
" ప్రిటెండ్ టు బ్లో ద కాండల్ ఆండ్ మేక్ అ విష్ "
"ఆ చో చ్వీట్ యా" అని ఎవరో వెనక సీట్ లోంచి సన్నని ఆడ గొంతుక
ఇంతలో మన శష్రూకుల వారు ' ఉఫ్ఫ్ ' మని ఆ కేకు మీద ఊది, కళ్ళు మూసుకొని, మనసులో ఎదో ధ్యానం చేసుకొని, తన ని ఎత్తుకున్న నాన్న కి ముద్దు పెట్టాడు. వెంటనే పక్కనే నిలబడి వున్న వాళ్ళ అమ్మ కి కూడా ముద్దు పెట్టాడు. ఇదంతా ఒక కామెరా లో ఒక ఎయిర్ హోస్టస్ ఫొటొలు, వీడియో ల రూపంలో తీస్తోంది.
"జన్మ దిన శుభాకాంక్షలు రా బంగారం" తల్లి తెలుగు లో దీవించింది. తలి దంద్రులు ఇద్దరూ పిల్లాడిని ఒకే సారి ముద్దు పెట్టుకున్నారు. ఎయిర్ హోస్టస్ కామెరా లో అది బందించి, తన చేతొలో వున్న కామెరా ని శష్రూక్ నాన్న కి అందించింది, అతను దన్యవాదాలు తెలిపి తన జోబి లో పెట్టుకున్నాడు.
తనని తాను గట్టి గా గిల్లు కున్నాడు మన ఆనంద రావు. కలయా నిజమా , వైష్ణవ మాయయా ?. ఫ్లైట్ బయట మబ్బుల్లో కి బిత్తర చూపులు చూసాడు నారదుల వారు ఏమన్న వుంటారేమో అని. ఇంతలో ఫ్లైట్ సిబ్బంది త్వరగా , ఈ బర్త్ డే సెలెబ్రేషన్ మోడ్ నుంచి మామూలు వాతావరణం నెలకొల్పదానికి ప్రయత్నించారు. పాస్సెంజెర్స్ అందరినీ వాళ్ళ వాళ్ళ సీట్ల లో కూచోమని చెత్తో నే సైగలు చేసారు. శష్రూకుల వారి పిత్రు వర్యులది మన ఆనందరావు పక్క సీటే. ఆయన వచ్చి కూచున్నారు. నవ్వుతో పలకరించు కున్నారు ఇద్దరూ.
శష్రూకు, వాళ్ళ అమ్మ ఒక రెండు వరసల ముందు సీట్ లో కూచున్నారు.
ఇంతలో ఫ్లైట్ పైలట్ ప్రకటన చేసాడు
' ఎవరి సీట్ల లో వారు కూచోండి, సీట్ బెల్ట్ లు వేసుకొండి, శష్రూక్ కి జన్మ దిన సుభా కాక్షలు తెలుపుతూ, సాదారణం గా ఇలాంటివి చెయ్యమని, కానీ వాళ్ళ నాన్న గారి స్పెషల్ రెక్వెస్ట్ మీద ఒప్పుకున్నామని. శష్రూక్ బర్త డే కేకు ముక్కలు ఇప్పుడు ఎయిర్ హోస్టస్ అందరికీ పంచి పెడతారని, అందరూ తిని ఆనందించమని ' అతను ఆంగ్లం లో చేసిన ప్రకటన కి తెలుగు పరమార్ధం
కోపం తెచ్చుకొనే ముందు ఆనంద రావు కి ఒక ఆలోచన కలిగింది. బహుసా మేక్ ఎ విష్ ఎమో , ఎదో సినేమా లో చూసాడు. కేన్సర్ తో చనిపో బోయే పసి వాళ్ళ ఆఖరి కోరిక తీర్చే సంస్థ అది. ఎమో ఈ పిల్లాడు ఫ్లైట్ లో బర్త డే చేసుకోవాలని అనుకున్నాడేమో. పాపం కదా.
" బాబు మీ బాబా , ఆఖరి విష్ ఆ" ఎం మాట్లాడాలో తెలియని ఆనంద రావు
ఎయిర్ హోస్టస్ తెచ్చి ఇచ్చిన కేకు తీసుకున్నారు ఆనంద రావు , శష్రూకు నాన్న , ఇద్దరూ. కేకు అంటేనే విసిగి పోయే మన ఆనంద రావు కూడ తినటం ఆరభించాడు. విషయం తలుచు కుంటేనే కళ్ళు చెమ్మ గిల్లాయి.
"తెలుగు ?" అన్నాడు శష్రూక్ నాన్న. ఆ అన్నట్టు తల ఊపాడు ఆనంద రావు. " ఆ మీరు ఎదో అంటున్నారు, అవునూ మా బాబే"
"బాబు కి ...కేన్సరు... " గొణిగాడు
"కేన్సరా ఎవరికి , ఎమ్మాట్లాడు తున్నావయ్య " శష్రూక్ నాన్న మండిపడ్డాడు.
"ఆ అంటే .. ఆ ఈ నెల లో పుడి తే, అదే... ఆ ఆస్ట్రాలజీ ప్రకారము .. అదే..ఆ కేన్సర్ కాప్రికోర్న్ అలా అన్నమాట" కవర్ చేసాడు ఆనంద రావు వెకిలి నవ్వు తో
"ఒహొ అదా అమ్మయ్య చంపేసారు" శష్రూక్ నాన్న
"నేను శష్రూక్ నాన్న, మరి మీరు" చేయి కలిపాడు అతను " ఆనంద రావు" చెయ్యి అందించాడు. కరచాలనాలు అయ్యాయి.
" మీకో రహస్యం చెప్పనా, అసలు వాడి పుట్టిన రోజు ఇవ్వాళే కాదు, నెక్స్ట్ మంత్ " పక్కున నవ్వాడు శష్రూక్ నాన్న.
"అదేంటి " ఆశ్చర్య పొయ్యాడు. అప్పటికే కేకు లో రెండు ముక్కలు తిన్న ఆనంద రావు, తినడం ఆపేసి.
"అసలు విషయం ఏంటంటే, తిదుల ప్రకారం ఇవ్వాళ, అది కూడా కచ్చితంగా ఇదే టైం కి ,మద్యాన్నం రెండు గంటలా ముప్పయి మూడు నిమషాలు"
"మరి సెకనులో... " గొణిగాడు ఆనంద రావు. అతనికి తిన్న రెండు ముక్కల కేకు కడుపులో తిప్పింది.
"నాకు ఈ ఎయిర్ లైన్ లో కొంచెం పలుకుబడి వుంది, హై లెవల్ వాళ్ళు తెలుసు నాకు, అందుకే ఇది సాద్యం అయింది"
శష్రూకు నాన్న ప్రగల్భాలు పొయ్యాడు. " మా బాబు కి ప్రతి ఏడాది రెండు బర్త డేయ్ లు చేస్తాము. ఒకటి తిదులు బట్టి, మరొకటి ఆంగ్ల డేటు బట్టి"
' తిదుల బట్టి చేసే దాంట్లో మరి ఆంగ్ల పద్దతిలో కేకు ఎందుకు రా ' మనసులోనే అనుకున్నాడు ఆనంద రావు
*******************
" ఏమండీ , మీరు చెప్తే ఆసలు రారు అంటారనే , చెప్పలేదు. ఇప్పుడు బయలు దేరాక , ఇక తప్పదు. ఒక్క అరగంట మీది కాదనుకోండి. నా చిన్ననాటి స్నేహితురాలు కదా, ఇలా వెళ్ళి అలా వచ్చేద్దాం" గోముగా బర్త ని బ్రతిమలాడింది.
దంపతులు ఇద్దరూ ఉబర్ కారు వెనక్ సీట్ లో కూచున్నారు.
" ఎం పర్లేదే , ఎన్ని సార్లు మా ఫ్రెండ్స్ ని కలిసి నప్పుడు నీకు బోర్ కొట్టలేదు. హోతా హై . నాతో వెల్తే త్వరగా వదిలించు కోవచ్చు అని కదా నీ , ఎదవ ప్లాన్ " జోవీల్ గా ఆనంద రావు
" ఒ.. యా కరెక్ట్ కరెక్ట్ ఆ .ఆ.. అంతే " అని కవర్ చేసింది
ఎక్కడకి తీసుకు వెళ్తోందో తెలియని ఆనంద రావు తన అతి తెలివికి కాలరు ఎగరెయ్యాలనుకున్నాడు, కాని చేతులు రెండు కాళీ గా లేక విరమించుకున్నాడు.
ఉబర్ కారు ఆగింది, ఇద్దరూ దిగారు. అప్పుడు గమనించాడు ఆనంద రావు . వాళ్ళు వెళ్తున్నది
' బేక్ అ కేక్ ' అనే బేకరీ కి
" నందూ ఇది నమ్మన ద్రోహమే" వాపోయాడు
" అబ్బ పోనిద్దురూ , క్లోస్ ఫ్రెండ్. కస్టపడి సొంత గా ఓపెన్ చేసుకుని పైకి వచ్చింది " భర్త ని చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళింది "ఇలా వెళ్ళి, అలా పలకరించి, విషెస్ చెప్పి వెళ్ళిపోదాం "
పాణి గ్రహణం లో ఎంత బెదురుతూ చెమటలు పట్టిన నందూ చెయ్యేనా ఇప్పుడు నను నడిపిస్తుంది, మనసులో అనుకున్నాడు.
ఆనందరావు షాక్ నుండి తేరుకునేంత లో వాళ్ళు బేకరీ లోకి వెళ్ళడము, వాళ్ళ గురంచి పక్కన రెసెర్వ్ గా పెట్టిన స్పెషల్ టేబల్ దగ్గర కూచ్చోవడము, టేబల్ మీద మూడు చిన్న కేకు పీస్ లు, మంచి నేళ్ళు, కాఫీ లు సిద్దం.
కుశల ప్రశ్నలు అయ్యాక, కాఫీ తాగాడు, చిన్ననాటి స్నేహితురాళ్ళు ఇద్దరూ చాలా రోజుల తర్వాత కలవటం వలన, వాళ్ళ కబుర్లలో మునిగి పొయ్యారు. ఇదే సమయం అని ఆనంద రావు బాతు రూం నెపం తో పక్కకు తప్పుకున్నాడు. బాతు రూం వెళ్ళే దారి లో గమనించాడు, ఆ ప్లేస్ చాలా బిసీ గా వుంది, చాలా రిచ్చ్ గా కూడా వుంది. రెండు నిమషాల పని కి పది నిమషాలు తీసుకొని , మెల్లగా వచ్చి కూచున్నాడు టేబల్ దగ్గర , భార్య మీద కోపాన్ని లోపల అణుచుకుంటూ, చిరు నవ్వుతో.
"అయ్యో మీరు నా కేక్ ట్రై చెయ్యనేలేదు. ప్లీజ్, ఇది మీ ఇద్దరి కోసం నేనే స్వయం గా చేసిన లవ్ కేక్ " అంది స్నేహితురాలు
"ఆ సారీ ఆయన కేక్ తినరే , కొంచెం అలెర్జీ వుంది, ఆ ఒక్కటి అడక్కు..." తన భర్త కేకు పీస్ కూడ తనే తీసుకొని తింటూ "అయినా మన క్లాస్ లో , ప్రమీల పెడుతుంది ఇలాంటి బిసినెస్స్ అనుకున్నా, ఎందుకంటే అదే కదా ఎదో ఒకటి బేక్ చేసి మన ప్రాణాలు తీసేది" అని టాపిక్ మార్చి భర్త కి సాయం చెయ్యబోయింది
"వాట్ , కేకు ఇష్టం వుండని వాళ్ళు వుంటారా.. వాట్" ఆశ్చర్య పోయింది బేకరీ ఫ్రెండ్ " నో నో ... నిజం గానా" వొదిలేలా లేదు
"అవునండి, సోరీ ఎం అనుకోవద్దు" ఇరకాటం లో పడ్డాడు ఆనంద రావు
"కాదు కాదు , మీకు కేకు అంటె ఇష్టం లేక కాదు, ఎదో అలెర్జీ అన్నారే, అది మీరు నారో డవున్ చేసుకోవాలి, కేకు లో ఏది మీకు పడటం లెదో మీరు ఎలిమినేటు చెయ్యాలి. అంత మాత్రాన కేకు మొత్తం మానేకూడదు, మీకు తెలుసా ఎం అలెర్ఝీ ఓ ? ఎగ్గ్ ఆ లేక అయిసింగ్ ఆ, పయిన క్రీం ఆ?" ఆరా తీయటం మొదలెట్టింది
"అబ్బ ప్లీస్ వొదిలెయ మన్ననా" నందు
ఇక ఇలా లాభం లేదనుకొని ఆనంద రావు రంగం లోకి దిగాదు. ముల్లు ని ముల్లు తోనే తీయాలి.
"మీరెమి అనుకోనంటే ఒక విషయం అడగొచ్చా"
"షూర్" అంది బేకరి
" మొదట గా మిమ్మల్ని అభినందిస్తున్నా, ఇలా ఒక బిసినెస్స్ సొంత గా పెట్టి నడపడం, హట్స్ ఆఫ్" చిరునవ్వు తో సాల్యూట్ చేసాడు "ఏ అకేషన్ కి కేకు ఆర్డర్ చెయ్యరు"
ఆమె కి ప్రశ్న అర్ధం కాలేదు. అది ఆమె మొహమే చెప్పింది.
"ఒకే పోనీ ఏ అకేషన్ కి కేకు ఆర్డర్ చేస్తారు మీ కస్టమర్స్"
ఆమె చిట్టా విప్పింది " బర్త డే, న్యూ ఈర్, పండగ, ప్రమోషన్, పెళ్ళి, ఇలా ఏదన్న హాప్పి అకేషన్స్ కి " అంది ఇది కూడ తెలియదా అనే వుద్దేస్యం తో
" ఆ కరెక్ట్ , కదా, అలా ఇప్పుడు , రివర్స్ లో అలోచించండి, ఏ అకేషన్ కి కేకు ఆర్డర్ చెయ్యరు" అన్నాడు ఆనంద రావు, ఎదో కోర్ట్ లో పెద్ద కేసు వాదిస్తున్న లాయరు తరహా లో
ఇక ఆలోచనలో పడింది బేకరీ. "ఆ ..ఊఉ.. ఆ "
" చుసారా మీరే కంగు తిన్నారు, అదే నా పాయింటు, ఈ మధ్య ప్రతీ దానికీ కేకు ఆర్డర్ చేస్తున్నారు అనిపించటము లేదా మీకు ? ఆఫ్ కోర్స్ మీ వ్యాపారానికి అది మంచిదే అనుకోండి"
"నో మీకు అస్సలు కేకు తత్వమే అర్ధం కాలేదు. కేకు ఈజ్ జోయ్ , బేకింగ్ ఈజ్ ఫన్. అసలు కేకు ఒక ఉత్సాహానికి ఉల్లసానికి చిహ్నం, అది ఒక తిండి లా చూడకండి , దాన్ని అవమానించొద్దు. కేకు ఈజ్ అ ఫీలింగ్, ఇట్ ఈజ్ ఎన్ ఎక్స్ప్రెషన్. అస్సలు ఆనందానికే కాదు , దుఖాని కి కూడ నేను కేకు బేక్ చెయ్యగలను. నవరసాల్లో అన్ని రసాలు పండించ గల ఏకైక ... ఏకైక.. పదార్ధము అని దాన్ని చిన్నబుచ్చటం నాకు ఇష్టం లేదు.. ఏకైక సోల్... యెస్స్, గాట్ ఇట్.. కేకు ఇస్ లైక్ ఎ సోల్ అనుకొండి"
ఆనంద రావు నోట మాట లేదు, ముఖం లో నెత్తురు చుక్క లేదు.
అప్పటి దాక మొహమాటం తో వీళ్ళ టేబల్ దగ్గరే తటపటాయించిన బేకరీ మానేజర్ వచ్చి "మేడం ఎక్స్క్యూజ్ మి, సారీ మీరు స్పెషల్ గెస్ట్ తో వున్నారు, దిస్టర్బ్ చెయ్యకూడదని తెలుసు, కాని తప్పలేదు"
"దట్స్ వాకే" అందీ బేకరీ
"ఒక కస్టమర్ కి ఒక స్పెషల్ కేకు కావాలట మేడం. వాళ్ళ ఫ్రెండ్ కి ఆక్సిడెంట్ అయింది"
టేబల్ మీద కూచున్న ముగ్గురూ కంగు తిన్నారు
"ఆ మరేం పర్లేదు, ప్రాణ భయం లేదుట. ఇప్పుడు హాస్పటల్ లో కోలుకుంటున్నాడు. సో ఆ కేకు లో దుఖం వుండాలి. బట్ అలా అని కేకు మొత్తం సారో ఫీల్ వొద్దట. కేకు పీస్ స్తార్ట్ టు ఫినిష్ సారో నుంచి హాపీ ఫీల్ తీసుకురావాలట, అలాంటి కేకు మీరు చెయ్యగలరా అని అడిగాడు మేడం, సో మీ దగ్గరకి రాక తప్పలేదు"
"చుసారా ఆనంద్, మీ ప్రశ్న కి జవాబు దొరికిందా" అని చాలా గర్వం గా చిరునవ్వు నవ్వి " యస్ మనేజర్ ఐ కెన్ బేక్ దట్ కేక్, అడ్వాన్స్ తీసుకోండి" అంది అతని పక్క తిరిగి
"ఇక మీరెం చెప్పక్కరలేదు" అంటూ రెండు చేతులూ ఎత్తి దణ్ణం పెట్టాడు అనందరావు
******************
ఆనంద రావు , నందిని మళ్ళి తిరిగి అమెరికా ప్రయాణమయ్యే రోజు రానేవచ్చింది. అది ఆనంద రావు అమ్మ, నాన్న వుండే అపార్ట్మంట్. వీళ్ళని సాగనంపే కార్యక్రమం . ప్రయాణము చేసేవాళ్ళకన్నా సాగనంపే వారి హడావిడి అథికం. అదే ఊర్లో వుంటున్న నందిని అమ్మ నాన్నలు , ఇంకొంత మంది దగ్గర బంధువులు , స్నేహితులు వచ్చారు. ఇదేం మొదటి సారి కాదు ఈ జంట అమేరికా వెళ్ళటం, అంచేత ఆనందరావు ఎవ్వరినీ ఎయిర్ పోర్ట్ కి రావద్దని ఒక కేబ్ బుక్ చేసుకున్నాడు. అతనికి ఒక్కరిద్దరిని దింపటానికి వంద మంది రయిల్ స్టేషన్ కి గాని , విమానాశ్రయానికి గానీ వెళ్ళటం అస్సలు నచ్చదు.
ప్రయాణం చేసే దంపతులు ఇద్దరూ అన్నీ చక్కగా సర్దు కొని నిమ్మళం గా కూచున్నారు. మిగతావాళ్ళు మాత్రం కంగారు పడి పోతున్నారు.
"ఆవకాయ బాగా పేక్ చేయించారా, ఆయిల్ కారకుండా"
"దేశి చవ్యనప్రాశ్ పెట్టుకున్నావా, అక్కడ మరీ ఖరీదన్నావ్"
"ఇండియన్ సోప్స్"
"స్వీట్స్, హాట్స్"
ఎవరికి తోచిన సలహా వాళ్ళు.
"కేబ్ వచ్చే టైం అయింది నందు మనం కింద వెయిట్ చేద్దాం" అన్నాడు ఆనంద రావు
" ఓ నో.. వుండండి మా పరిమళ వస్తానంది"
"అవును అన్నయ్యా కేక్ కట్ చెయ్యకుండా వెళ్తారా ఎంటి , సెండ్ ఆఫ్ కేకు. పరిమళ కేకు తెస్తుంది" ఒక కజిన్ బ్రో
అంతలో నే పరిమళ కేకు, దాని మీద ఒక వెలుగుతున్న కొవొత్తి తో ఇంట్లొ ప్రవేసించింది.
"హాపీ బాన్ వాయేజ్ టు యు ..హాపీ బాన్ వాయేజ్ టు యు టూ" పరిమళ పాట ని అందరూ అందుకున్నారు. ఆనంద రావు కి ఎలాంటి ఫీలింగ్ బయట పడటానికి సమయము ఇవ్వకుండా, ఆ దంపతులు ఇద్దరూ కేకు మీద కొవ్వొత్తి ఊదటం, కట్ చెయ్యడం, ముక్కలు కొయ్యటం, అందరూ తినటం అన్ని ఐదు నిమషాల్లొ సమాప్తం.
"పరీ, ఒక్క ప్రశ్న, సెండ్ ఆఫ్ కి కూడా కేకా ? " అడిగాడు దీనం గా కక్కలేక తన నొట్లొ కుక్కబడిన కేకు ముక్క తింటూ.
"అదేంటి బావగారూ, మీరు ఎయిర్ పోర్ట్ కి రావద్దని మరీ పట్టు బట్టారు , లేకపొతే నా.. అస్సలు మొన్న మా ఫ్రెండ్ కి అయితే ఎయిర్ పోర్ట్ బయట సెండ్ ఆఫ్ కేకు కట్ చేసాం తెలుసా, నందు అక్క వొద్దు అంది, అందుకే మీరు బతికి పొయ్యారు"
"ఆ ఎయిర్ పోర్ట్ బయటా " ఆశ్చర్య పొయ్యాడు కళ్ళు పెద్దవి చేసి.
"ఆ అవును, ఈ మద్య అదే ట్రెండింగు . ఇన్ స్టా లో , టిక్ టాకు ల్లో , యు ట్యూబ్ షార్ట్స్ లో. హేష్ టేగ్ ' లొకేషన్ కట్ ' అంటారు. డిఫరంట్ లొకేషన్ లో కేకు కట్ చేసి పోస్ట్ చెయ్యాలి. మేము మా ఫ్రెండ్స్ మొత్తం ఎ . పి. అంతా కవర్ చేసేసాం. చార్మినార్ , గొల్కొండ, వైజాగ్ బీచ్ , బీమిలి , అన్నీ. షేర్ చెయ్యనా మీరు చుస్తారా ఆ పిక్స్ ? ఆ.. సిమహా చలము, తిరుపతి, అంతర్వేది...." ఇంకా ఎదో చెప్పబోతుంటే ఆనంద రావు అడ్డుపడ్డాడు. " దేవాలయాలని కూడా వొదల లేదా"
"సరే సరే పదండి " అని నందు అడ్డుపడింది. ఇద్దరూ కింద కెళ్ళి ఎయిర్ పోర్ట్ కేబ్ లో ఎక్కారు.
దంపతులు ఫ్లైట్ లో ఎక్కి తమ హాండ్ బేగ్ సర్దుకొని కూచున్నారు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది. ఎంటర్టైన్మంట్ మెను చూసుకున్నాడు ఆనంద రావు అతనికి అంతరిక్షం కి సంబందించిన సై ఫై సినేమా లు ఇష్టం. అక్కడ ' అపోలొ ఎలెవన్ ' ' స్పేస్ ఓడిసి ' ' గ్రేవిటీ ' ఇలాంటి సినేమా లు చూసి మురిసి పొయ్యాడు. ఫ్లైట్ జర్నీ లో పెద్దగా నిద్ర పట్టదు అతనికి, సొ అన్నీ సినేమాలు కవర్ చెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు.
***************************
ఆనంద రావు తన స్లీపింగ్ కప్సూల్ నుంచి లేచాడు. అంతవరకూ చీకటి గా వున్న స్పేస్ షిప్ తన కళ్ళు తెరవటం గమనించి తనకి ' శుభోదయం ' పలికింది. ఆ రోజు విధులు , కార్యక్రమాలు వాటి జాబితా ఏ కాకుండా, ఏ పనులు ఎవరు చెయ్యలి, ఏ టైం కి చెయ్యలి, వాటికి నిర్దేసించిన సమయము, కావలసిన పరికరాలు అన్నీ కాల పట్టిక లాగ తన స్లీపింగ్ కాప్సూల్ అద్దము మీద అచ్చు వేసింది సూపర్ కంప్యూటర్. తనకి లేచి విధులకి తయారవ్వటానికి సరిగ్గా అరగంట వుంది. ఆ రోజు డ్యుటి లో ముగ్గురు, తను, పరిమళ, బేకరీ. లేచి కాప్సూల్ లోంచి బయటకు వచ్చి ఒళ్ళు విరుచుకున్నాడు. కాలక్రుత్యాలకి ఉపక్రమించాడు. టీం లోని మిగతా వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ చాంబర్స్ లో తయారయి, నిర్ణయించిన సమయానికి మీటింగ్ రూం లో కలిసారు.
ముగ్గురూ స్పేస్ సూట్స్ వేసుకొని మీటింగ్ చాంబర్ లో కలిసారు. ఒకరితో ఒకరు నేరుగా మాట్లాడు కునే అవకాసం లేదు. చెయ్యి ఎత్తి విష్ చేసుకున్నారు. హెల్మెట్ లో వున్న మైక్రో ఫోన్ లోనే మాటలు. సూపర్ కొంప్యూటర్ ముగ్గురినీ విష్ చేసింది, వాళ్ళ వాళ్ళ సీట్స్ లో కూచోమని ఆదేసించింది.
" హాపీ నేషనల్ స్పేస్ డే " అంది సూపర్ కంప్యూటర్.
పరిమళ, బేకరీ కళ్ళు మెరిసాయి. ఇద్దరూ ఎదో సైగలు చేసుకున్నారు. ఆనంద రావు కి కొంత ఆందోళన కలిగింది. కంప్యూటర్ ఆరోజు జరగాల్సిన పనులు మళ్ళీ చిట్టా విప్పి, ఒక్కోరికి నియోగించింది.
వాళ్ళ స్పేస్ క్రేఫ్ట్ నెక్స్ట్ డెస్టినేషన్ కి చేరటానికి కంప్యూటర్ పూర్వమే కోడ్ సిద్దం చేయబడి వుంది, కాని ఆ కోడ్ లో ఎవో తప్పులు దొర్లాయట, కొన్ని ఎర్రర్ లు వస్తున్నాయని, ఆ పనిలో ఆనంద రావు కి నైపుణ్యం వుండటం వల్ల అది అతనికి అప్పగించిది సూపర్ కంప్యూటర్. ఇక వారి స్పేస్ క్రేఫ్ట్ బయట లెవెర్స్ అన్ని ఒక సారి సరి చూసి సరిగ్గ వున్నాయో లేదో చుసే పని ని పరిమళ, బేకరీ లకు అప్పగించిది. సర్వీసింగ్ లా అన్నమాట. అది ఇద్దరు చెయ్యల్సిన పని. అలా ఒకసారి అన్ని చెప్పి ' గుడ్ లక్ ' అని చెప్పి సూపర్ కంప్యూటర్ స్లీప్ మోడ్ లోకి వెళ్ళింది.
ఆనంద రావు కి అది చాలా ఉత్సాహకరమయిన పని. చక్కగా తన సీట్ లో కూచ్చొని పనిలో నిమగ్న మయ్యాడు. పరిమళ, బేకరీ కలిసి పని ముట్లు తీసుకొని స్పేస్ క్రాఫ్ట్ బయట కి వెళ్ళారు. బయట వాళ్ళు చేసే పని ఇతని సీట్ లోంచి కనపడుతుంది. కానీ వాళ్ళకి ఇతను కనపడడు. మద్యలో కొంచెం వొళ్ళు విరుచుకుందామని ఒకసారి పైకి లేచాడు ఆనందు. ఒకసారి బయటకి చుసాడా, ఆశ్చర్యం , వాళ్ళు ఇద్దరూ ఎదొ చిన్న కప్ కేకు చేతిలో పట్టుకున్నారు. పైగా దాని మీద చిన్న కేండల్ కూడా. ఇంకో చేతిలో సెల్ ఫోన్. అతనికి మతి పోయింది. అసలు అలాంటివి స్పేస్ క్రేఫ్ట్ లోకి తీసుకు రాకూడదు. అతను తన ఇంటర్ కాం లో గట్టి గా అరిచాడు.
"ఎంటి మీరు చేస్తున్న పని, మతి లేదా, మైండ్ దొబ్బిందా"
బయట వున్న ఇద్దరూ ఒకేసారి " హప్పీ నేషనల్ స్పేస్ డే టు ఆల్" అని పళ్ళు ఇకిలించి నవ్వారు. పళ్ళు లోపల వున్న ఆనంద రావు కి కనపడ లేదు కానీ వినపడ్డాయి. చెప్పలేనంత కోపం వచ్చింది అతనికి. కాని ఎమీ చెయ్యలేడు.
పరిమళ అంది " హేష్ టేగ్ ' లొకేషన్ కట్ ఫ్రం స్పేస్ ' " అంటూ తన సెల్ ఫోన్ లో సెల్ఫీ తీస్తోంది.
ఇంతలో బేకరీ ఒక లైటర్ తీసి కేకు మీద కేండల్ ని వెలిగించ బోయింది.
అనంద రావు ఇంటర్ కాం లో గట్టి గా అరిచాడు " నో...నో...నో ... అది హై లీ ఇన్ ఫ్లేమబల్ నో"
అతను వారించే సమయం లేదక్కడ. స్పేస్ లోనే అతి పెద్ద అగ్ని ప్రమాదం. మొత్తం వాళ్ళ స్పేస్ క్రేఫ్ట్ అంతా పెద్ద విస్పోటనం, మంటల్లొ కాలి పేలిపోయింది.
***********************
అనంద రావు గట్టి గా అరుస్తున్నాడు " నో...నో...నో ... అది హై లీ ఇన్ ఫ్లేమబల్ నో"
ఫ్లైట్ లో తన పక్క సీట్ లో వున్న నందు. " ఎంటి కల గన్నారా, కలవరిస్తున్నారు" ఆనంద రావు ని తట్టి లేపింది
"కెవ్వు కేకు " అని అరిచాడు
తన కేక కి తన స్పేస్ సై ఫై కల చెదిరిపోయింది, దెబ్బకి అతని నిద్ర తీరిపోయింది. ఫ్లైట్ షికాగో లో లాండ్ అయిపోయింది.