తెల్లారింది...ఉదయ కిరణ కాంతులన్నీ వెలుగుని మింగి చిక్కని నారింజ రంగునుంచి లేత నారింజ రంగుకు మారుతున్నాయి. ఒక పక్కనుంచి స్వచ్ఛమైన నీలాకాశం తన ఉనికిని బయట పెట్టుకుంటూ నెమ్మదిగా ప్రస్ఫూటమౌతోంది.
మందంగా వీచే చల్ల గాలి తెమ్మెరలు మనుషుల మనసులోంచి సర్వ విధాలైన దౌర్బల్యాలను కడిగి పారేసి గంభీరమైన నెమ్మదితనం ఇస్తున్నాయి.
విశాలంగా అలుముకున్న సొగసైన లోయలన్నీ ఆక్రమించుకున్న పచ్చని చెట్లు ఆ కమ్మ తెమ్మెరల తాకిడికి నెమ్మదిగా తలలూపుతూ బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటున్నాయి. గాలి వాటితో నాట్యం చేయిస్తోందా లేక వాటి నాట్యానికి పరవశించి గాలే వీస్తూ హర్షద్వానాలు తెలియజేస్తోందా అన్నట్టుందా దృశ్యం.
కొన్ని కొండల మధ్యలో నల్లని రైలు పట్టాలు దర్పంగా సాగుతూ, అకస్మాత్తుగా కొండలో దొలిచిన సొరంగంలోకి అదృశ్యమై పోతూ, ఎంతో సంతులనం తో ఉన్న ఈ ప్రకృతి పై మానవుడు నియంత్రణ సాధించే ప్రయత్నాల్ని గుర్తు చేస్తున్నాయి.
ఇవేవి పట్టనట్టు ఎన్నో రంగుల్లో మెరిసి పోతున్న రకరకాల పక్షులు వాటి వాటి భాషల్లో పాడుకుంటూ ఆ ప్రాంతానికి ఎంతో శోభను సంతరిస్తున్నాయి.
ఒక పక్కగా రేఖామాత్రంగా నక్కి చూస్తున్న సినీవాలి చంద్రుడు నెమ్మదిగా ప్రకృతి తల్లి ఒడిలోకి జారుకుని నిద్రలో పెరిగే పసివాళ్ల లాగా కుహు పక్షానికి సిద్ధమౌతున్నాడు.
సృష్టి లోని సర్వ జీవులూ ఆ పారవశ్యంలో తమ తమ జీవితాల మాధుర్యాన్ని గ్రోలుతున్నాయి.
ఈ పారవశ్యాన్ని కారణం ఆ వనస్పతులు ప్రకృతి భాషలో నిష్ణాతులై ఉండడమేనా? అందుకే అవన్నీ ప్రకృతిలో లయించి పోతున్నాయా?
కొండ వాలుకు దగ్గరలో కొంచం చదునుగా ఉన్న కాస్త నేలమీద ఒక మహా వృక్షం చుట్టూ ముసురుకుంటున్న మబ్బుల పొగలను విదిలించుకుంటూ తనమీద జీవిస్తున్న పక్షిజాలాన్ని చుట్టూరా ఆటలాడుకుంటున్న జంతుజాలాన్ని మురిపెంగా చూస్తోంది.
ఊడలు దిగి గంభీరంగా ఒక పేరు తెలియని మహర్షిలా కనిపిస్తున్న ఆ చెట్టు మొదట్లో చదునుగా ఉన్న ఒక రాతిమీద పద్మాసనం వేసుకుని కూర్చున్న ఒక సన్యాసి ధ్యాన నిమగ్నుడై ఉన్నాడు.
ఆయనకు కొంచం దూరంలో ముగ్గురు శిష్యులు కూర్చుని గురువు గారిని శ్రద్ధగా గమనిస్తున్నారు.
వారిపక్కగా ఉన్న చదునైన నేల మీద పదిమంది వరకు గిరిజనులు కూర్చుని ఉన్నారు ...రకరకాల పూసలు, పక్షి ఈకలు, చెట్లనుంచి సేకరించిన రంగులద్దిన చర్మపు ఆభరణాలు ధరించి ఉన్న ఆ గిరిజనులంతా ఎంతో మనోహరంగా ఉన్నారు. అమాయకమైన వాళ్ళ మొహాల్లో గురువు గారి మీద అపారమైన భక్తి కనిపిస్తోంది.
అరగంట గడిచింది. గురువుగారు ధ్యానం ముగుంచుకుని కళ్ళు తెరిచారు. ఒక సారి ఆకాశం వైపుకి చూసి నమస్కారం చేసి వెనక్కు తిరిగి శిష్యులను, తన కోసం వేచి వున్న గిరిజనులను చూసి మందహాసం చేసారు.
ఆ గిరిజనుల లో తలపాగా, దాన్ని అలంకరించిన ఒక పెద్ద పక్షి ఈక, మెడలో రకరకాల పూసలతో చేసిన మాలలు ధరించి ఉన్న ఒకడు లేచి నిలబడి గురువుగారికి నమస్కారం చేసాడు. అతని మొహంలో కనిపిస్తున్న గాంభీర్యం, తెలియని ఆకర్షణ అతను వారి నాయకుడని చెప్పకనే చెప్తున్నాయి.
"ఏం నాయనా...మీ గూడెంలో అంతా క్షేమమేనా?"అనడిగారు గురువుగారు
"స్వామి దయ వలన అంతా క్షేమమే స్వామీ...వచ్చే గురువారం మా గూడెంలో ఇద్దరు పిల్లలకు పెళ్లి చేస్తున్నాం, తమరు వచ్చి ఆశీర్వదించాలని మా కోరిక" అన్నాడు వినయంగా. అవునన్నట్టు తలాడించారు మిగిలిన వాళ్ళందరూ
"మీ సమాజాభివృద్ధి కోసం చేసే ఒక దివ్యమైన క్రతువు అది. శుభం…నేను వస్తాను మీరు వెళ్లి రండి" అన్నారు గురువు గారు
ఆమాటలు విని ఆనందం తో గురువు గారికి శిరసు వంచి నమస్కరించాడు గూడెం నాయకుడు "మాకేమైనా నాలుగు మంచి మాటలు చెప్పండి స్వామీ "అని అర్ధించాడు
గురువు గారు మందహాసం చేసారు ”మీరు ప్రకృతి బిడ్డలు...మీ శరీరాలు ప్రకృతితో ప్రత్యక్షం గా అనుసంధానమై ఉంటాయి...మీకు తగిన ఆలోచనలు ఆ ప్రకృతి మాత అలవోక గా ప్రసాదిస్తుంది... మీ శక్తి మీద విశ్వాసం ఉంచండి...మీ జీవ శక్తులు పెరగడానికి ధ్యానం చేసుకోండి" అన్నారు గురువుగారు
అందరూ ఆ మాటల వలన కలిగిన సంతోషంతో గురువు గారికి సాష్టాంగ ప్రణామం చేసి కొంత సేపు కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకున్నారు. ఆ జానపదులకు ధ్యానం అంటే ప్రకృతి మాత చెప్తున్న మాటలు , పాడుతున్నపాటలు వినడం... ఒక్క మాటలో చెప్పాలంటే ప్రకృతితో లయించి పోవడం
వాటి నుంచి వాళ్ళ మనసులు ఉల్లాసం పొందడమే కాకుండా వారిని వేధించే చిక్కు ప్రశ్నలేమైనా ఉంటే వాటికి సమాధానాలు కూడా దొరుకుతాయి.
కొంత సమయం నిశ్శబ్ద సంగీతం విన్న ఆ జానపదులు గురుస్థానం ఉన్న కొండ మొదట్లోని తమ గూడెం వైపుకి బయల్దేరారు.
"మనం ధ్యానం కొనసాగిద్దాం నాయనా"అన్నారు గురువు గారు శిష్యులతో
శిష్యుల మొహాల్లో మాములుగా కనిపించే నిదానం, శ్రద్ధ స్థానే ఎదో తెలియని కంగారు గోచరించింది గురువుగారికి
"ఏం నాయనా, మన మానవ నిర్మాణ శాస్త్ర ఆచార్యులవారు వేంచేసారా?" అనడిగారు
అవునన్నట్టు తలాడించారు శిష్యులు. "మంచిది…వారికి అవసరమైన మర్యాదలు చేసి ఇక్కడకు తీసుకురండి"అన్నారు గురువుగారు
అయిదు నిముషాల తరువాత ఒక ఎత్తుగా ఉన్న ఒక స్ఫురద్రూపి వచ్చి గురువు గారికి నమస్కరించి కూర్చున్నారు. అయన ఈ గూడెం నుంచి మూడు వందల మైళ్ళ దూరం లో ఉన్న ఒక విశ్వ విద్యాలయంలో మానవ నిర్మాణ శాస్త్రం బోధించే ఆచార్యులు గా ఉంటున్నారు.
మధ్య మధ్యలో ఇలా ఈ ప్రాంతంలోని గిరిజనుల జీవితాలను గమనించి వాళ్ళను నాగరికత వైపుకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తుంటారు. ఆయనంటే అందరు గౌరవం చూపిస్తారు.
ఆయనకి ఈ గూడెం నాగరికత వైపుకి నడవకుండా తన స్వార్ధం కోసం గురువుగారే అడ్డు పడుతున్నారని భావన...అది అయన అందరు ముందు వ్యక్త పరుస్తుంటారు కూడా.
"ఆచార్యా, క్షేమమే కదా? ఈ ప్రాంతాల లో జీవించే గిరిజనుల సంస్కృతి మీద మీరు చేస్తున్న పరిశోధనలు బాగా సాగుతున్నాయా?" అనడిగారు గురువు గారు
"ఆహా, చాల బాగా సాగుతోంది...కానీ మీరు ఈ గ్రామస్తులకు చేస్తున్న ద్రోహం క్షమించరానిది" అన్నాడు ఆచార్యుల వారు
"అలాగా, ఏం చేస్తే వారికి మంచి జరుగుతుంది? ఈ ప్రపంచంలో జీవులన్నీ సంతోషంగా ఉండాలి, దానికోసం ఏమైనా చెయ్యగలిగితే మేము సిద్ధం" అన్నారు గురువు గారు చిరునవ్వుతో
"మీరు మీ స్వార్ధం కోసం వాళ్లను నాగరికతకు దూరం చేస్తున్నారు...వాళ్ళ జీవితాలు చుడండి...వర్షం వచ్చినా, ఎండ కాసినా వాళ్లకు సరైన ఇళ్ళు కూడా లేవు ...అనాగరికమైన తిళ్ళు తింటున్నారు...వాళ్ళు తాగే నీళ్లు తీసుకెళ్లి పట్నంలో పరిక్షించాం...అదంతా విష పూరితం...అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇన్నేళ్లు బతికి ఉండడమే గొప్ప...ఇప్పుడు మేము వారికి నాగరికత నేర్పే ప్రయత్నం చేస్తున్నాం…మీ మాటలు విని వాళ్ళు ముందుకు రావటం లేదు" అన్నాడు ఆచార్యుల వారు బాధ, కోపం మిళితమైన స్వరంతో
గురువుగారు చిన్నగా నవ్వారు "ఏ నాగరికత నేర్పుతారు వాళ్లకు? ఈ విశాలమైన భారత దేశమంతటా ఎన్నోరకాల నాగరికతలు ఒకదాని తో మరొకటి సమ్మిళితం అయి సహజీవనం చేస్తున్నాయి. వాటిలో ఏది మీరనే నాగరికత?" అనడిగారు గురువు గారు
"ఆధునిక జీవితం కొంత కలుషితమైన మాట నిజమే కానీ అది మనకు ఎన్నో విధాలైన మంచి మార్గాలు కూడా చూపించింది. ఈ గిరిజనులకు మేము స్వచ్ఛమైన తాగు నీరు ఇవ్వడానికి ఏర్పాట్లు చెయ్యాలని ప్రయత్నిస్తున్నాం...కానీ అందరూ ఆ విషపూరితమైన కుంట జలాలే తాగుతున్నారు. ఏమైనా అడిగితే మీ పేరు చెప్తున్నారు” అన్నాడు ఆచార్యుల వారు
"ప్రకృతిలో లయించి పోయిన ఈ జీవులు మీరు చేసేది తప్పా ఒప్పా అనే విషయాన్ని గురించి ఆలోచించరు...మా జీవితాలు ఎలాసాగాలో అలాగే సాగుతున్నాయి...వాటినలా ఉండనివ్వండి... దూరం నుంచి మమల్ని చూసి గౌరవించండి...మా సంస్కృతిని లాగేసుకుని దోపిడీ చెయ్యకండి అని మాత్రమే అడుగుతారు వాళ్ళు...మీ నాగరికత లేని రోజుల్లో కూడా బతికిన ఈ జీవులు ఇక ముందు కూడా అలాగే బతుకుతారు" అన్నారు గురువుగారు
"అదే అజ్ఞానం...మీకు అర్ధం కాదు అయినా మీరు వాళ్ళ గురువు...ఈ దేశంలో కాషాయం కట్టుకుని రెండు ముక్కలు దేవుళ్ళ గురించి మాట్లాడితే గురువైపోతారు...మీరు వాళ్లకు క్షమించ రాని ద్రోహం చేస్తున్నారు" అన్నాడు ఆచార్యుడు కోపంగా
కోపంతో రెండు అడుగులు ముందుకి వేసిన శిష్యులని వారించారు గురువుగారు "మనలాగే అతను కూడా ఈ అమాయక గిరిజనుల శ్రేయస్సే కోరుతున్నాడు...అతని పధ్ధతి వేరు అంతే"
అని ఆచార్యుడి వైపుకి తిరిగి "ఆచార్యా!!! మీ ప్రయత్నం మీరు చెయ్యండి...ఎవ్వరినీ బలవంతం చెయ్యవద్దు...మీ పద్ధతికి ఆకర్షితులై వారు మీ నాగరికతలో కలవాలనుకుంటే అటు తీసుకెళ్లండి..కాదంటే మాత్రం వాళ్ళని బలవంతం చెయ్యడం వాళ్ళ హక్కులను భంగ పరచడమే..ఆ పని చెయ్యొద్దు" అన్నారు
"మీరు వాళ్ళని వారించ కుండా ఉంటే నా ప్రయత్నం నేను చెయ్యగలను...వారు నాగరికత వైపుకి వెడితే మీ మీద గౌరవం తగ్గి మీకు తిండి పెట్టరేమో అని మీ భయం" అన్నాడు ఆచార్యుడు కొంచం కరకుగా
శిష్యులు పిడికిలి బిగించారు...వారిని వారించారు గురువుగారు. ఆచార్యుల వైపు తిరిగి నవ్వుతూ..."మీకలా అనిపిస్తే సరే...కానీ మాకు అవసరమైన వన్నీ ఈ ప్రకృతి ప్రసాదిస్తుంది...మా జీవితాలకేమి విలువ లేదు...కానీ ఆ గూడెం ఒక సమాజం. వాళ్ళకి ఒక ప్రత్యేకమైన సంస్కృతి ఉంది. ఆ సంస్కృతిని వాళ్ళు ఎన్నో తరాలుగా మౌఖికం గా అందించుకుంటూ పాటిస్తున్నారు...వారికొక భాష ఉంది..లిపి లేని ఆ భాషను వాళ్ళెంత భద్రం గా పరిరక్షించుకుంటున్నారో తెలిస్తే నాగరికులకే సిగ్గు కలుగుతుంది...వాళ్ళకొక మతం ఉంది...దేవుళ్ళు ఉన్నారు...వాళ్లకు సంబంధించిన పౌరాణిక కథలు ఉన్నాయి...అది వారి సాహిత్యం...వాళ్ళకొక ప్రత్యేకమైన వైద్య విధానం ఉంది…జాగ్రత్తగా పరికించి చుస్తే వాళ్ళదొక ప్రత్యేకమైన నాగరికత...వాళ్ళ జీవితాల్లో ప్రకృతి పట్ల, ప్రాణుల పట్ల ఉన్న ప్రేమని గుర్తిస్తే వాళ్ళ జీవన సంగీతం అర్ధమౌతుంది" అన్నారు గురువుగారు
"మీరన్నది నిజమే...మానవ నిర్మాణ శాస్త్ర పరిశోధనలో భాగంగా మేము అవన్నీ గుర్తించాం. వాటిలో కొన్ని రాతపూర్వకంగా... మరికొన్ని చలన చిత్రాలుగా కూడా భద్ర పరిచాం. ఇప్పటివరకు వాళ్ళ జీవితం సాగింది కదా అని ఇక ముందు కూడా అలాగే ఉండాలని వదిలేయడం మన అనాగరికతను సూచించటం లేదా?" అనడిగాడు ఆచార్యుల వారు
"లేదు నాయనా!!! ఈ ప్రకృతే వాళ్ళ కు గురువు దైవం అన్నీ, మనం వినలేని ప్రకృతి సంగీతం వాళ్ళు ప్రతి అణువులోను వింటారు...గడ్డి మొక్కలైనా, పెద్ద పెద్ద వృక్షాలైనా, ముళ్ళ పొదలయినా…అన్నీ ఒక గొప్ప సంతులనంలో ఉంది సంగీతాన్ని సృష్టిస్తాయి...ప్రకృతి శక్తుల తో లయించి పోయిన వాళ్లకు ఆ సంగీతం వినిపిస్తుంది...అదే వారికి పాఠాలు నేర్పుతుంది..జీవన గమనానికి తోడ్పడుతుంది" అన్నారు గురువుగారు
ఆచార్యుడికి కోపం అణచుకోవడం కష్టంగా ఉంది "స్వామీ, మీరు చెప్తున్న మాటలు అర్ధం అవుతున్నాయి...ఇప్పడి మానవుడు ఎంతో దూరం ప్రయాణించాడు...ఎన్నో విధాల అభివృద్ధి సంధించాడు...ప్రకృతి శక్తులని తన నియంత్రణలోకి తెచ్చుకున్నాడు...దాని వల్ల శుభ్రమైన జీవితాన్ని సాధించాడు...అవన్నీ వదిలేసి కొన్ని సమాజాలు ఇలా ఆటవిక జీవనాల్లో మగ్గుతుంటే చూస్తూ ఎలా వదిలేయడం...వాళ్ళకే విషజ్వరాలో వస్తే దగ్గరలో ఆసుపత్రి కూడా లేదు…ఈ జాతి ఇలాగే అంతరించిపోవాలా"అనడిగాడు
"మీరు ఈ గూడెం ప్రజలని ఎంతకాలంగా పరిశోధిస్తున్నారు"అనడిగారు గురువుగారు
ఆ ప్రశ్న ఎందుకు అడిగారో అర్ధంకాక కొంచం తికమక పడ్డాడు ఆచార్యుల వారు"మూడేళ్ళ గా మేము పరిశోధిస్తున్నాం"అన్నాడు
"ఈ కాలంలో ఈ గూడెం లో ఎవరైనా జబ్బు పడడం గాని, చనిపోవడం గాని జరిగిందా" అనడిగారు ఆచార్యుల వారు
"లేదు...కానీ అది కేవలం యాదృచ్చికం" అన్నాడు ఆచార్యులవారు
"పిల్లలెవరైనా జన్మించారా" అనడిగారు గురువు గారు
"నలుగురు పిల్లలు పుట్టారు"అన్నాడు ఆచార్యుడు
"ఆ పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళు ఇక్కడ వాళ్ళ పద్ధతుల్లో సహాయం చేసుకున్నారా లేక మీ పట్నం నుంచి ఆధునిక వైద్యుల దగ్గరకు పోయారా?" అనడిగాడు గురువు గారు
గురువు గారు ఎటు తీసుకెళ్తున్నారా అర్ధం అయింది ఆచార్యుడికి
"లేదు, బహుశా ఇప్పుడు ఇక్కడ విషయాలు బాగా తెలిసిన మంత్రసానులు ఉంది ఉంటారు...కొన్నాళ్ల తరువాత ఆ నైపుణ్యం ఉన్నవాళ్లు కరువవ్వొచ్చు అప్పుడేమౌతుంది" అనడిగాడు ఆచార్యుడు
"ఏమీ కాదు...వాళ్ళ జీవితాలు ఏ ప్రమాదంలోనూ లేవనీ...వారిని ప్రకృతే కాపాడుతుందని అనడానికి ఇంతకన్నా మీకు నిదర్శనమేమి కావాలి?" అనడిగారు గురువుగారు
"ఇపుడు మీరు చెప్పేది నిజం లాగా అనిపిస్తుంది. కానీ నిర్మాణ క్రమంలో మానవ సమాజాల్లో ఎన్నో మార్పులు జరుగుతాయి...మనం వాటిని ముందుగా పసిగట్టి ఎదుర్కోవడానికి ఏర్పాట్లు చేసుకోవాలి...ఆధునిక విధానాలు ఆ పనిని ఎంతో దూరదృష్టి తో చేస్తాయి" అన్నాడు ఆచార్యులవారు
"బాగా అలోచించి చెయ్యండి...ఆధునికత అంతా మంచే కాదు...ఆ విషయం మనం గుర్తెరిగి ఉండాలి" అన్నారు గురువు గారు
ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు ఆచార్యుడు, అంతలోనే తేరుకుని "మీరు మీ స్వార్ధం కోసం విపరీత తర్కం తీసుకొస్తున్నారు...ఇప్పుడు వైద్య శాస్త్రం సాధించిన ప్రగతి గురించి వింటే మీకు వీళ్ళ జీవితాలని మరింత మెరుగ్గా ఎలా చెయ్యొచో అర్ధం అవుతుంది" అంటూ లేచాడు. తన వాదన తేలిపోతుండడం అతనికేమాత్రము నచ్చలేదు
"మీరనే వైద్య విధానం క్షయకరణ పధ్ధతి...నేతి నేతి అనుకుంటూ రోగనిర్ధారణ చెయ్యాలి...శరీర ధర్మాలు, వారి పూర్వీకుల పద్ధతులు...వారు ఎదుర్కొంటున్న పర్యావరణము ఏవేవి మీ వైద్య్ విధానం గమనించడం లేదు...అయినా మీకు దాని వల్ల లాభం జరుగుతుందంటే మేము అడ్డు రాము" అన్నారు గురువు గారు
"సంతోషం…మాకు సెలవిప్పించండి" అంటూ బయలుదేరాడు ఆచార్యుడు
"శుభం...వెళ్లి రండి...మీ ప్రయత్నాలు మీరు చెయ్యండి...అయితే నేను ముందు చెప్పినట్టుగా ఎవరిని బలవంత పెట్టకండి...మా వైపునించి మేము వాళ్ళ జీవితాల్లో కలగజేసుకోము...వాళ్ళు అడిగిన విషయాలు మాత్రమే మాట్లాడుతాం"అన్నారు గురువుగారు
ఆచార్యుడు కోపంగా వెళ్ళిపోయాడు. గురువుగారు తన శిష్యుల తో కూడి ధ్యాన నిమగ్నుడయ్యాడు
గురువుగారి దగ్గర నుంచి బయలుదేరిన ఆచార్యుల వారి కోపం అద్భుతమైన ప్రకృతి సౌందర్యం, వీస్తున్న స్వచ్ఛమైన గాలి తెమ్మెరల వలన కొంచం నెమ్మదిస్తూ రెండు క్రోసుల దూరం లో ఉన్న గ్రామానికి చేరేటప్పడికి పూర్తిగా తగ్గింది..
గ్రామం మధ్యలో ఉన్న రచ్చ బండ వద్ద అలవాటు ప్రకారం కూచున్నాడు ఆచార్యుల వారు.
అక్కడే ఆడుకుంటున్న చిన్న పిల్లలు పరుగెత్తుకుని వెళ్లి ఆ గ్రామపెద్దకు ఆచార్యుల వారి రాకను గురించి తెలియజేసారు.
త్వరత్వరగా రచ్చబండ దగ్గరకు చేరుకున్నాడు గ్రామపెద్ద...అప్పడికే కొందరు గ్రామస్తులు అక్కడికి చేరుకొని ఆచార్యుల వారేమి చెప్తారో అని శ్రద్ధగా గమనిస్తున్నారు..
ఆచార్యుల వారికి నమస్కారం చేసి "ఆచార్యా, మీరు క్షేమంగా ఉన్నారా...మా జీవితాలు బాగు పడేందుకు మీరు చేస్తున్న కృషి ఎంతో అభినందనీయం...మేమందరము మీకెంతో రుణ పడి ఉంటాము" అన్నాడు
ఆ మాటలు విన్న ఆచార్యుల వారు "అయ్యా, నేను చెప్పిన మాటలు మీకు నచ్చినందుకు ఎంతో సంతోషం...మనం ఇంక మాటల నుంచి చేతల కు వెళ్ళాలి"అన్నాడు
"ఏమని సెలవు?"అనడిగాడు గ్రామపెద్ద
"మీరు తాగుతున్న కుంట నీళ్లు విషపూరితమైపోయాయి...నేను పట్టణంలో పరీక్ష చేయించాను...ఆ నీటిని శుభ్ర పరచి మీకిచ్చేందుకు ఒక చిన్న యంత్రాన్ని ఏర్పాటు చేస్తాను. దానికి మీ అనుమతి కావాలి"అన్నాడు ఆచార్యుల వారు
"ఆ కుంట లోని నీళ్లు మేము తరతరాలుగా తాగుతున్నాము...ఆ కుంట కింద ఉన్న రాళ్ళలో కొన్ని అద్భుతమైన పదార్దాలున్నాయని అందు వల్ల ఆ నీరు మాకు ఎంతో మంచిదని చెప్పేవారు మా పెద్దలు...ఇంతవరకు ఆ నీరు తాగడం వలన మేమేమి జబ్బు పడలేదు...ఇప్పుడు ఈ యంత్రం అవసరమా?"అనడిగాడు గ్రామపెద్ద నెమ్మదిగా
ఏమనాలో అర్ధం కాక ఆచార్యుల వారు "సరే, మీ ఇష్టం...ఇదేదీ వ్యాపారం కాదు...నాకు వచ్చే లాభం ఏమి లేదు...మీరు ఆలోచించుకోండి"అన్నాడు
"ఒకసారి గురువయ్యను అడిగి చేద్దాం ఆచార్యా" అన్నాడు గ్రామపెద్ద
ఆచార్యుల వారికి కోపం పొంగుకు వచ్చింది "నేను గురువు గారిని కలిసి ఈ విషయం ప్రస్తావించాను...అయన మీకిష్టమైతే అలాగే కానివ్వమన్నారు"అన్నాడు
అయితే సరే అన్నట్టు గా తలాడించాడు గ్రామపెద్ద…
తరువాత రెండు వారాలు రకరకాల మనుషులూ, పెద్ద పెద్ద వాహనాలూ వచ్చి ప్రకృతి వడిలో సంతోషంగా ముడుచుకుని నిద్రాణంగా ఉన్న ఆ గ్రామానికి అలజడి కలగ జేసాయి...
ఆచార్యుల వారి ప్రయత్నాల వల్ల గ్రామం లోకి విద్యుత్తు వచ్చింది...రచ్చ బండ దగ్గరా, గ్రామస్తులు పూజించే అమ్మవారి గుహ దగ్గరా,నీటి కుంట దగ్గరా పెద్ద పెద్ద విద్యుద్ దీపాలు అమర్చారు...వాటి వెలుగుజిలుగుల లో తన్మయులైన గ్రామస్తులు తమకెంతో అభివృద్ధి జరిగిందనుకోసాగారు.
యంత్రం ద్వారా శుభ్రపడిన స్వచ్ఛమైన తాగునీరు నిలువ చేసేందుకు ఒక కట్టడాన్ని ఎత్తుమీద తయారు చేసారు...దానిలోకి నీరు నింపేందుకు ఒక చిన్నరకం యంత్రాన్ని అమర్చారు.
మొదటి సారి కొళాయి చుసిన గ్రామస్తులు ఎంతో సంతోషించారు...దాని కింద కుండ పెట్టి తిప్పగానే తాము ఇంతక పూర్వం వాడుకునే రకంగా నీరుకావి రంగు నీళ్లు కాకుండా స్వచ్ఛమైన తెల్లని నీరు రావడం వాళ్ళను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది...
ఈ గ్రామస్తుల రక్షణకై ఒక ముఖ్యమైన పని జరిగినందుకు ఎంతో సంతోషించిన ఆచార్యుల వారు గురువు గారిని గ్రామానికి తీసుకు వచ్చి అవన్నీ చూపించారు.
గురువు గారు కూడా ఎంతో సంతోషించారు...కానీ నీటి విషయం లో చేసిన ఏర్పాట్లను ఆయన అంగీకరించ లేదు.."ఇక్కడ దొరికే ప్రకృతి సిద్ధమైన నీరు ఈ గ్రామస్తులకెంతో అవసరం...దాన్ని పాడు చెయ్యొద్దు"అన్నారు
"కలుషితం గా ఉన్న నీటిని మేము శుభ్రం చేసాము...దాని పైన మనిషి పోషణకు అవసరమైన ఖనిజ లవణాలు కలిపాము...దీని వలన ఈ గ్రామస్తుల ఆరోగ్యం బాగు పడడమే కాకుండా...వాళ్ళు రోగాల బారిన పడే అవకాశం తగ్గుతుంది"అన్నాడు ఆచార్యుల వారు
గురువుగారు కొద్దిగా ఆలోచించారు ”మీరు చెప్పే పద్ధతులు మీలాంటి నాగరికులకి...మాకు ఈ నీళ్ళే అమృతం...దీని ఆధారంగానే మేము ఎన్నో ఏళ్లగా ఈ గూడెంలో ఉంటున్నాం" అన్నారు
గ్రామపెద్ద వినయంగా ముందుకు వచ్చి నమస్కారం చేసాడు...అతన్ని చుసిన గురువు గారు "ఏం నాయనా, ఏమైనా చెప్పాలనుకుంటున్నావా?" అనడిగారు
"అవును స్వామి, ఈ కొత్త పద్ధతులు మా జీవితాలని ముందుకు తీసుకు పోతాయనే నమ్మకం మాకు కలుగుతోంది...మీ ఆజ్ఞ అయితే మేము ఈ శుభ్రపరచిన నీరు తాగడం ప్రారంభిస్తాం" అన్నాడు
గ్రామస్తుల మనస్తత్వం అర్ధం చేసుకున్నారు గురువు గారు "సరే, మీ ఇష్టమే మా ఇష్టం..కొంచం జాగర్త...ఈ నీరు వాడడం మొదలు పెట్టినప్పటినుంచి మీ శరీరాల్లో కలిగే మార్పులని గమనిస్తూ ఉండండి"అని తన ఆశ్రమానికి వెళ్లిపోయారు గురువు గారు
గూడెం లో ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు...రాత్రి కూడా పగటి లాంటి వెలుగులు చిమ్మే దీపాలు, కొళాయి తిప్పితే వచ్చే మంచి నీరూ, వంట పొయ్యలు వెలగడానికి విచిత్రమైన ఎర్రని బండలు వాటినుంచి వచ్చే రబ్బరు గొట్టాలు, ఇంట్లో వాడుకోవడానికి మకిలి పట్టిన మట్టి పాత్రల స్థానే వెండిలాగా మెరిసి పోతున్న లోహపు పాత్రలూ, పళ్ళాలు…ఇవన్నీ వాళ్ళ జీవితాలను మార్చేశాయి...
ఈ కొత్త వెలుగు జిలుగులు సమయంలో గ్రామం లో నిర్ణియించిన వివాహ వేడుకలు ఎంతో వైభవంగా జరిగాయి...గురువు గారు ఆ వేడుకకు వచ్చి వధూ వరులను ఆశీర్వదించారు. గ్రామస్తుల మొహాల్లో కనిపిస్తున్న ఉత్సాహం గురువు గారికి ఎంతో సంతోషాన్నిచ్చింది.
ఈ కొత్త జీవితం అందించినందుకు ఆచార్యుల వారిని అందరు దేముడి లా చూడసాగారు.
కొండ మీద ఉన్న స్వామి ఆశ్రమానికి వెళ్లడం తగ్గింది. ఒక నెల గడిచింది. గ్రామస్తులు ఈ జీవితానికి బాగానే అలవాటు పడుతున్నారు.
ఒక రోజు సాయంత్రం వేళ గ్రామపెద్ద కూతురు...ఎనిమిదేళ్ల పిల్ల అతడిని తట్టి "అయ్యా! ఒకసారి బాబాను చూడాలయ్య" అనడిగింది. బాబా అని ఆమె పిలిచేది కొండ మీద ఉన్న స్వామినే.
"అలాగే బిడ్డా...నేనుకూడా గురువయ్య స్వామిని చూడాలని రెండు రోజుల నుంచి అనుకుంటున్నాను" అన్నాడు గ్రామపెద్ద
ఆ మరుసటిరోజు పొద్దున్నే తండ్రీ, బిడ్డా, మరికొందరు అనుచర గణం తో కలిసి కొండ పైన ఉన్న ఆశ్రమానికి వచ్చారు...
ఒక నెల తరువాత వచ్చినందువల్ల గ్రామస్తులకు కొంచం సంకోచంగా ఉన్నా...ఆశ్రమం లో ఉన్నవాళ్లలో ఏ మార్పు లేదు...గ్రామస్తులని చూసి శిష్యులు మామూలుగానే మందహాసం చేసారు. "రండి రండి. అంతా సౌఖ్యమేనా?" అనడిగారు
"అంతా బాగానే ఉంది చిన్న సాములూ, గురువయ్యని చూడడానికి వచ్చాము"అన్నాడు గ్రామ పెద్ద
"గురువుగారు ధ్యానం లో ఉన్నారు...రండి మనం అయన ధ్యానం చేసుకునే చోటు దగ్గరకు వెళ్లి కూచుందాం"అంటూ గురువు గారు ధ్యానంలో కూర్చున్న చెట్టు దగ్గరకు దారి తీశారు.
ఒక అరగంట శిష్యులు, గ్రామస్తులు నిశ్శబ్దంగా కూచుని గురువుగారిని చూస్తున్నారు.
అరగంట తరువాత గురువుగారు నెమ్మదిగా కళ్ళు తెరిచి వెనక్కు తిరిగి శిష్యులను, గ్రామస్తులను చూసి మందహాసం చేసారు.
"నాయనలారా, ఆచార్యుల వారు చేసిన ఏర్పట్ల వల్ల మీ జీవితాలు బాగున్నాయా?" అనడిగారు
"చాల బాగుంది స్వామి...తమరు కూడా మా గూడేనికి వేంచేస్తే మీకో కుటీరం ఇచ్చి మంచి భోజనం పెట్టుకుంటాం"అన్నాడు గ్రామపెద్ద
చిన్నగా నవ్వి "చాలా సంతోషం. మీకు దొరికిన అదృష్టాన్ని అందరితోనూ పంచుకోవాలనే మీ తత్త్వం మెచ్చుకోదగినది. మా జీవితాలు ఇప్పుడు ఆనంద మయంగానే ఉన్నాయి. అవసరమైతే మేమే మీ దగ్గరకి వస్తాం"అన్నారు గురువు గారు. అవునన్నట్లు తలాడించారు శిష్యులు.
గ్రామ పెద్ద కూతురు ముందుకు వచ్చి గురువు గారికి సాష్టాంగ నమస్కారం చేసి "బాబా! మీరు కూడా మాతో బాటే ఉండండి. ఇప్పుడు మా గ్రామంలో రాత్రి కూడా వెలుగొస్తోంది. ఎంతో బాగుంది. ఇప్పుడు మాకు పట్నం వాళ్ళ చదువులు చెప్పడానికి ఒక టీచరమ్మ కూడా వస్తోంది" అంది సంతోషంతో
ఆమాటలకు ఎంతో మురిసిపోయాడు గ్రామపెద్ద. గురువు గారు కూడా నవ్వుతు ఆ బిడ్డ తల నిమిరి "అలాగే తల్లీ, మీరు సంతోషంగా ఉండడం కంటే మాకు కావల్సినది ఏమి లేదు. సరైన సమయం చూసుకుని మేమే మీ గూడేనికి వస్తాం" అన్నారు
గ్రామస్తులందరూ మరికొంత సేపు ధ్యానం లో కూర్చున్నారు...తరువాత లేచి గురువు గారికి సాష్టాంగ ప్రణామాలు చేసి కిందకు బయలుదేరారు...
ఒక వారం గడిచింది. గురువు గారు శిష్యుల తో "నా మనసేదో కీడు శంకిస్తోంది. గ్రామంలోని నా బిడ్డలకేదో ఆపద రాబోతోంది" అన్నారు కొంచం విచారంగా
"అలాంటిదేమైనా ఉంటే వాళ్ళు మీదగ్గరకే కదా స్వామి వచ్చేది. మీరు ఆదుర్దా పడకండి" అన్నారు శిష్యులు
"ఇప్పుడు వాళ్లకు కొత్త సౌకర్యాలు అమరాయి. వాళ్ళ ఆరోగ్యాలు జాగర్తగా చూసుకునేటందుకు పట్నం నుంచి కొందరు వైద్యులు కూడా వస్తారని తెలిసింది. ఎందుకైనా మంచిది, ప్రణవానందా, నీవు కిందకు పోయి విచారించిరా. వారికి ఈ మూలికా భస్మాన్ని కూడా ఇవ్వు. ఏదైనా అనారోగ్యం ఉంటె దీన్ని తేనెలో కలుపుకుని సేవించమని చెప్పు" అన్నారు ఒక శిష్యుడి తో
"అలాగే గురువర్యా. నేనుపోయి విషయం గమనించి వస్తాను" అంటూ బయలుదేరాడు ప్రాణవానందుడు
గూడెంలోకి వెళ్లిన ప్రాణవానందుడికి కొంతమంది గ్రామస్తులు అనారోగ్యంతో మంచాల్లో పడి ఉండడం కనిపించింది. గ్రామ పెద్ద కూతురు కూడా అనారోగ్యంతో పడుకుని ఉంది.
ఆచార్యుల వారూ, పట్నం నుంచి వచ్చిన వైద్యులూ ఇల్లిల్లు తిరిగి పరీక్షించి మందులు ఇస్తున్నారు.
గ్రామ పెద్ద ఇంటి దగ్గరకు వెళ్లి పిలిచాడు ప్రాణవానందుడు. అతని మాట విని బయటకు వచ్చిన గ్రామపెద్ద "చిన్న స్వామీ! ఇలా వచ్చారేమి? గురువయ్య గారు క్షేమమే కదా? ఇక్కడ గుండెమంతా విషజ్వరాలతో నలిగి పోతోంది. ఆచార్యుల వారూ, వైద్యులూ చాలా శ్రమ పడి మా ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు" అన్నాడు
"అయ్యో. గురువుగారు సౌఖ్యమే కానీ ఆయనకు మీకేదో అయ్యిందనే అనుమానం వచ్చి నన్ను పంపించారు. ఇదిగో ఈ మూటలో మూలికా భస్మం ఉంది. దాన్ని కొంచం తేనెలో రంగరించి నీ బిడ్డకు ఇవ్వు. ఆరోగ్యం తొందరలోనే కుదుట పడుతుంది" అన్నాడు ప్రాణవానందుడు
ఆ మూలికా భస్మం మూట అందుకున్నాడు గ్రామ పెద్ద. దాన్ని తెరవ కుండా తన పక్కనే పెట్టుకుని "ఒకసారి వైద్యులను సంప్రదించి ఈ మూలికా భస్మం తినిపిస్తాను స్వామీ"అన్నాడు
"సరే, వీలైనంత తొందరగా ఈ మందు వాడు. ఇది అద్భుతమైన మూలికలతో చేసినదే కాక గురువుగారి ఆశీస్సుల వలన ఎంతో మహిమ సంతరించుకుంది. దీన్నికొన్ని భాగాలు చేసి గ్రామస్తులకు కూడా ఇవ్వు"అంటూ బయలుదేరాడు ప్రాణవానందుడు
త్వరత్వరగా నడుస్తూ ఆశ్రమానికి చేరుకొని గురువు గారికి విషయమంతా వివరించాడు.
ఆమాటలు విని చింతాక్రాంతులయ్యారు గురువు గారు "ఆదిత్యానందా, నువ్వు గ్రామానికి వెళ్లి ఆచార్యుల వారిని తీసుకుని రా" అన్నారు మరొక శిష్యుడితో
"నేను భయపడినట్టే అయింది. అదృష్ట వశాత్తు మీరు గ్రామస్తులతో ఏమి మాట్లాడలేదు. వాళ్ళను సంరక్షించడానికి ఆధునిక వైద్యులు, మందులు అన్ని ఉన్నాయి. మీ మాటలు విని ఉంటె ఈపాటికి సగం గ్రామం ఖాళీ అయ్యుండేది"అంటూ వచ్చాడు ఆచార్యుల వారు
"ఇలాంటి ఆరోగ్య సమస్య రావడం వాళ్ళు ఇంతకు ముందు చూడలేదు. వారి జీవితాలు ప్రకృతిలో లయించి పోయినంత కాలం వారికి మృత్యు భయం లేదు. మీరు చేసిన ఈ మానవ నిర్మితమైన వస్తువుల వల్లనే ఇదంతా జరిగింది. ఇప్పడికైనా మీరు ఈ మూర్ఖన్ని వదిలి పెట్టండి" అన్నారు గురువు గారు అభ్యర్థిస్తున్నట్టు.
"స్వామి, మా పనులకు అడ్డు రాకండి. ఇప్పుడిప్పుడే గ్రామస్తులు మా వైద్యులని నమ్ముతున్నారు. నమ్మకం లేనిదే ఏ వైద్యమూ పనిచేయదు" అన్నాడు ఆచార్యుల వారు
"మాకు కూడా ఆచార్యుల వారి మాటలు నిజమే అనిపిస్తోంది గురుదేవా, మీరు ఎంతగానో ప్రేమించిన మీ గ్రామస్తుల బాగు కోసం మనం దూరంగా ఉండి ఆచార్యుల వారిని ముందుకు సాగనిద్దాం" అన్నాడు ప్రణవానందుడు
గట్టిగా నిట్టూర్చారు గురువుగారు"మీ అందరకు అదే శ్రేయస్కరమనిపిస్తే అలాగే చెయ్యండి. నాదొక్క విన్నపం, ఈ మొత్తం పనిలో గ్రామస్తులను ప్రకృతి నుంచి విడదీయకండి. అదే వారి తల్లి, తండ్రి, ఆచార్యుడు, దైవం అన్నీ. ఆ ప్రకృతి ప్రసాదించే నిశ్శబ్ద సంగీతంనుంచి ఆ బిడ్డలను వేరు చెయ్యకండి. ఈ ప్రకృతి అంతా ప్రేమ మయం. విశ్వాసమనే అవయవాలు మాత్రమే ఆ ప్రేమమయమైన సంగీతాన్ని గుర్తించగలుగుతాయి. ఆ ప్రకృతే వారి ఆరోగ్యాలను బాగుపరుస్తుంది" అన్నారు గురువుగారు
ఆచార్యుల వారు ఏమి మాట్లాడ కుండా వెనక్కు వెళ్లి పోయారు.
ఈ పరిస్థితి వల్ల అయన కూడా ఎంతో చింతాక్రాంతుడై ఉన్నాడు. ఎందుకిలా జరిగింది? వీళ్లకు మంచి చేద్దామని ఎంతో సమయం, ధనం వెచ్చించి, ఇందరు మంచి వాళ్ళను ఒక చోటకు చేర్చి నేను చేసిన ప్రయత్నం ఇలా భగ్నం ఎందుకు అవుతోంది? ఈ స్వామి తన మాట నెగ్గించుకోవడానికి వాళ్ళమీద ఏమైనా విష ప్రయోగం చేసారా? రకరకాల ఆలోచనలతో కొట్టు మిట్టాడుతూ గ్రామం చేరి తిరిగి అందరి ఇళ్లకు వెళ్లి వారి ఆరోగ్యాన్ని గురించి వాకబు చేయ్యసాగాడు
గ్రామ పెద్ద ఇంటికి చేరిన ఆచార్యుడికి అతడు అరుగుమీద కూర్చుని గురువు గారు పంపించిన మూలికా భస్మం తన కూతురికి పట్టేందుకు తేనెలో రంగరిస్తూ ప్రయత్నం చేస్తూ కనిపించాడు.
"అరెరే, అదెందుకు తయారు చేస్తున్నారు? బిడ్డ ఆరోగ్యం ఇంకా క్షీణిస్తుంది. మన వైద్యులు ఇచ్చిన బిళ్ళలు తినిపించండి" అన్నాడు ఆచార్యుడు కంగారుగా
"అయ్యో ఆచార్యా! గురువు గారు మా తల్లి తండ్రి దైవం అన్నీ. వారిచ్చిన భస్మంతో నా బిడ్డ ఆరోగ్యం బాగుపడుతుందని నమ్మకం నాకుంది. నాకన్నా ఎక్కువ నమ్మకం నా బిడ్డకు ఉంది" అన్నాడు గ్రామ పెద్ద
ఆచార్యులు ఒప్పుకో లేదు "ఆధునిక వైద్యాన్ని మించినది ఏది లేదు. దయచేసి ఈ మూలికా భస్మాన్ని సేవించ వద్దు. నేను మన వైద్యుడిని తీసుకు వస్తాను. గ్రామ పెద్దగా మీరు ఈ అభివృద్ధిని నమ్మక పొతే మీ గ్రామస్తులందరికి ద్రోహం చేసిన వారౌతారు" అంటూ బయలుదేరాడు.
చేసేది లేక ఆ భస్మాన్ని బిడ్డకు ఇచ్చే ప్రయత్నం విరమించుకున్నాడు గ్రామ పెద్ద. గ్రామస్తులందరూ తన బిడ్డల లాంటి వాళ్లే. ఈ ఆధునిక వైద్యం తో వాళ్ళ ఆరోగ్యాలు కుదుట పడితే అదే భాగ్యం అనుకున్నాడు.
అటు తాను దైవంగా భావించే గురువుగారి మాటలు. ఇటు తన బిడ్డల్లాంటి గ్రామస్తుల నమ్మకాలూ. రెండిటి మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు గ్రామపెద్ద.తనకో దారి చూపించమని మనసులోనే గురువుగారిని వేడుకున్నాడు.
అంతలో ఆచార్యుల వారు ఒక వైద్యుడిని తీసుకొచ్చారు. అతడు బిడ్డను పరీక్షించి "మందు కొంచం నెమ్మదిగా పనిచేస్తోంది, ఏమీ భయం లేదు. ఈ మందునే వాడండి " అన్నాడు
"చిట్టీ నీకేమైనా ఇబ్బందిగా ఉందా" అనడిగాడు బిడ్డను
"నాకు బాబాను చూడాలని ఉంది. దయచేసి నన్ను బాబా దగ్గరకు తీసుకెళ్లండి" అంది బిడ్డ.
ఆ మాటలకి గ్రామ పెద్ద, అతని భార్య కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నారు.
ఆచార్యుల వారికి కూడా ఒక్క క్షణం తాను చేస్తున్నది తప్పేమో అనే భయం కలిగింది. దాన్ని అణచుకుని గ్రామ పెద్ద వైపు చూసాడు.
గ్రామ పెద్ద "తప్పకుండా బిడ్డా, నువ్వు తొందరగా ఈ మందులు వేసుకుని బాగు పడగానే మనమందరము బాబా గారి దగ్గరకు వెడదాము"అన్నాడు.
"బాబా నాకోసం ఏమీ పంపించ లేదా? నాకు ఆరోగ్యం బాగులేదని తెలిస్తే అయన ఏదోకటి ఇస్తారు" అంది బిడ్డ
"ఈ వైద్యులు ఇచ్చిన మందులు మంచివని గురువు గారు ఇంకేమి పంపించలేదమ్మా" అన్నాడు గ్రామ పెద్ద. అతని జీవితంలో మొదటి సరిగా అబద్దం చెప్పడమేమో గొంతు వణుకుతోంది, గుండె బరువెక్కుతోంది.
కళ్ళు తుడుచుకుంటూ "బిడ్డా నువ్వు చింత పడకుండా విశ్రాంతి తీసుకో. నేను మనవాళ్లందరిని చూసొస్తాను" అంటూ బయటకు నడిచాడు గ్రామపెద్ద. అతని తో బాటుగా ఆచార్యుల వారు, వైద్యుడు కూడా బయలుదేరారు.
ముగ్గురూ గ్రామంలో అనారోగ్యం పాలైన అందరిని చూస్తూ ఇల్లిల్లు తిరగసాగారు.
అందరిదీ అదే ప్రశ్న. గురువు గారేమి పంపించలేదా అని. ఒకరిద్దరు ప్రణవానందుడు వచ్చాడు కదా అతనేమీ తీసుకు రాలేదా అని అడిగారు కూడా.
గురువు గారిచ్చిన మూలికా భస్మం గురించి లేదని అబద్దం చెప్పినప్పుడల్లా అతని గుండెల్లో గునపాలు దిగినట్టు అనిపించ సాగింది… తానూ మనస్ఫూర్తిగా నమ్మిన విషయాన్ని గ్రామ సంక్షేమం కోసం త్యాగం చెయ్యడం ఎంత కష్టమో గ్రామ పెద్దకు అర్ధం అయ్యింది.
స్వచ్ఛమైన సెలయేరు లాంటి ఆ జానపదుల జీవితాలు ఆధునికీకరణ వలన మురికితనం సంతరించుకొ సాగాయి.
ఎవరిని చుసిన గురువు గారి గురించే అడుగుతున్నారు. ఇక ఈ వత్తిడి తట్టుకోలేక గురువుగారిని కలవడానికి వెళ్ళాడు గ్రామపెద్ద.
"ఏం నాయనా! నీ బిడ్డ ఎలా ఉంది? మిగిలిన మన వారందరు క్షేమమేనా?" అనడిగారు గురువు గారు గ్రామపెద్దను చూస్తూనే.
గురువు గారిని చూస్తూనే తట్టుకోలేక కన్నీరు పెట్టుకున్నాడు గ్రామ పెద్ద.
"నువ్వేమి బాధపడకు నాయనా, ఈ సమస్యకు పరిష్కారం ఆ దైవమే చూపిస్తారు. ఇవాల్టినుంచి శరన్నవత్రులు ప్రారంభం. మన వారందరి సౌఖ్యం కోసం మేము ఈ తొమ్మిది రోజులు ఉపవాస దీక్ష చేస్తాము. మనవారందరికి ఈ విభూతి నా ఆశీర్వాదం గా ఇవ్వు" అంటూ ఒక చిన్న గుడ్డ సంచి అందించారు గురువు గారు.
గురువు గారు చెప్పిన మాటలు విని, ఆయన ఆశీర్వాదం తీసుకున్న గ్రామ పెద్దకు ఈ సమస్య సమసిపోతుందనే ధైర్యం కలిగింది. గురువు గారికి సాష్టాంగ ప్రణామం చేసి గ్రామానికి బయలు దేరాడు.
గ్రామపెద్ద గురువు గారిని చూడడానికి వెళ్లాడని తెలిసిన ఆచార్యుల వారు కంగారు పడి పోయారు. ఈ గ్రామస్తులు మళ్ళీ ఆ సన్యాసి భక్తిలో పడితే మనం చేసే చికిత్స మీద నమ్మకం పెరగదు. దాని వాల్ల వాళ్ళ కు నయం కాదు అనుకున్నాడు భయంగా.
విషయం తేల్చుకునేందుకు గ్రామం నుంచి ఆశ్రమానికి బయలు దేరాడు ఆచార్యుల వారు. గ్రామపెద్దా ఆచార్యుల వారూ మార్గ మధ్యంలో ఒకరికొకరు ఎదురు పడ్డారు.
"నమస్కారం ఆచార్యా. గురువు గారు ఈ సారి మందులేమీ ఇవ్వలేదు. కేవలం ఈ విభూతి ఇచ్చారు. ఇది నేను మావాళ్ళదారికి పెడతాను. వాళ్లకు మీరిచ్చే మందులు బాగా పనిచేస్తాయి" అన్నాడు గ్రామపెద్ద ఆచార్యుల వారిని చూస్తూనే.
"నా మాట వినండి. ఆ విభూతి విషయం ఎవ్వరికి చెప్పొద్దు. మేమిచ్ఛే మందులు పనిచేయాలంటే మీ వాళ్లందరికీ మా వైద్యం మీద నమ్మకం కలగాలి. ఇప్పుడు మీరు మళ్ళీ గురువు గారి విభూతి విషయం చెప్తే వాళ్లకు నమ్మకం అంతా గురువు గారి మీదకు పోతుంది. మన మందులు జాగర్త గా వాడరు. దయచేసి మీ ప్రజలకు మీరే హాని చెయ్యకండి" అన్నాడు ఆచార్యుల వారు కంగారుగా
గ్రామ పెద్ద కొంత సేపు ఆలోచించాడు. చివరకు ఆచార్యుల వారి సూచనను అంగీకరించాడు. గ్రామమంతా కొత్త అభివృద్ధి పదంలో చాలా ముందుకు వెళ్లి పోయింది. ఇప్పుడు వెనక్కు పాత జీవితానికి వెళ్లడం కుదరని పని. ఇంకేం జరిగినా గురువు గారూ ఆ దైవమూ కాపాడతారు అనుకుని ఆ విభూతిని ఊరి పొలిమేరలో నున్న అమ్మవారి గుహలో పెట్టి వెనక్కు వెళ్ళాడు.
కనిపించిన గ్రామస్తులకు, తన బిడ్డకు కూడా గురువు గారు ఆశీర్వదించారని. జాగర్త గా ఈ ఆధునిక మందులు వాడితే నయమైపోతుంది అని అయన చెప్పారని అబద్ధమాడాడు.
ప్రకృతితో లయించి పోయి బతికే ఈ జీవులకు స్వచ్ఛతే గాని అబద్దాల లాంటి మకిలి ఉండదు. ఆధునీకరణ పేరుతొ ఇప్పుడు గ్రామపెద్ద మకిలి పడడం ప్రారంభించాడు.
ఇది జరిగిన రెండురోజులకి గ్రామపెద్ద బిడ్ద ఆరోగ్యం ఇంకా క్షీణించింది. అందరూ ఆందోళన పడుతున్నారు. తాను చేస్తున్నది తప్పేమో అన్న భయం ఆచార్యుల వారిని ఆవహించ సాగింది.
తరువాతి రోజు ఉదయం గ్రామపెద్ద బిడ్ద, తల్లడిల్లుతున్న తల్లి తండ్రులను చూసి "మీరేమీ కంగారు పదవొద్దు. నిన్న రాత్రి బాబా నా కిటికీ పక్కకొచ్చి నన్ను పలకరించారు. నాకేమి కాదని కంగారు పడొద్దని చెప్పారు. మందులు జాగర్త గా వాడమన్నారు. నాలుగు రోజుల్లో అమ్మవారి పండగొస్తుందనీ ఆరోజున తన ఆశ్రమంలోని బండ మీద ఒక ఆకాశ దీపపు కాంతి కనిపిస్తుందని అప్పడినుంచి ఈ గ్రామంలో అనారోగ్యం గా ఉన్నవాళ్లందరి ఆరోగ్యాలు బాగుపడతాయని చెప్పారు" అంది
ఆ మాటకు గ్రామపెద్ద అతని భార్య ఎంతో సంతోషించారు. బిడ్డకు గురువు గారి ఆశీర్వాదం దొరకడం శుభసూచకం అనుకున్నారు.
ఈ మాట ఆనోటా ఆనోటా పడి ఊరంతా పాకిపోయింది. అందరూ కొంచం కుదుట పడి జాగర్తగా మందులు వాడుతూ గురువు గారిని తలచుకుంటూ ఉన్నారు.
గురువు గారు బిడ్డకు చెప్పినట్టే ఆరో రోజున. విజయదశమి నాడు సాయంత్రం వేళ కొండ మీద దీపపు వెలుగు కనిపించింది. పెద్దగా వెలుగుతున్న ఆ దీపం గ్రామస్తులందరి లోను ముఖ్యంగా గ్రామ పెద్ద బిడ్డలోను ఎంతో ధైర్యాన్ని నింపింది. రెండు రోజులయ్యేసరికి అందరి ఆరోగ్యాలు కుదుట పడ్డాయి.
గ్రామస్తుల కి మంచి చెయ్యాలనే తన ప్రయత్నాలు వారి జీవితాలను ముగించేస్తాయేమో అన్న భయం వల్ల ఆచార్యుల వారు ఎంతో మధన పడ్డాడు. ఇప్పుడు గ్రామస్తులకు నయమౌతోందన్న వార్త విని ఊపిరి పీల్చుకున్నాడు.
ఊరంతా ప్రమాదం నుంచి బయట పడ్డారని నిర్ధారణ చేసుకున్న తరువాత ఆచార్యుల వారు ఆశ్రమానికి వెళ్ళాడు. గురువు గారికి తాను సాధించిన విజయం గురించి చెప్పాలని. ఈ ప్రజలు గురువు గారి మాయలో ఇంక పడరని, అయన దారి ఆయన్ను చూసుకో మని చెప్పాలని అనుకున్నాడు.
గురువు గారు తన ధ్యాన వాటిక లో కనపడ లేదు. శిష్యులు మాత్రం అక్కడ ధ్యానం చేసుకుంటున్నారు.
ఆయన్ను చూసి ప్రణవానందుడు "రండి ఆచార్యా! మీ ప్రయత్నాల వల్ల గ్రామస్తుల ఆరోగ్యం బాగుపడిందా? గ్రామపెద్ద యొక్క బిడ్ద ఎలా ఉంది?" అనడిగాడు
"అందరూ బాగున్నారు స్వామీ. మేము అందించిన ఆధునిక వైద్యం మీద అందరికి నమ్మకం కుదిరింది. ఇంక గురువుగారు తమ మూలికా వైద్యం మానెయ్య వచ్చు" అన్నాడు ఆచార్యుల వారు
దానికి ప్రాణవానందుడు "గ్రామస్తుల గురించి మంచి విషయం చెప్పారు. కానీ వాళ్ల ఆరోగ్యాలు బాగుపడడానికి కారణం మీ మందుల మీద నమ్మకం కాదు. గురువు గారి మాటల మీద నమ్మకం. అయన గ్రామ పెద్ద యొక్క బిడ్ద ద్వారా అందరికి చెప్పినట్టు విజయ దశమి నాడు ఆకాశ దీపం కొండ మీద కనిపించింది, అదే ఆశీర్వాదం గా పనిచేసింది" అన్నాడు.
"అది నిజం చిన్న స్వామీ. నా బిడ్ద తో సహా అందరు ఆ ఆకాశ దీపం చూసారు. అప్పడి నుంచి వారి కి తమ ఆరోగ్యాలు బాగు పడతాయనే నమ్మకం కుదిరింది. ఈ మాటలు చెప్పి గురువు గారి ఆశీర్వాదం తీసుకోవాలి" అన్నాడు అప్పుడే అక్కడకు చేరుకున్న గ్రామపెద్ద.
"మీరు మారరా? గురువు గారు తన స్వార్ధం కోసం మీ అందరిని మభ్య పెడుతున్నారు. మీకు ముందు ఆ నమ్మకం నుంచి విముక్తి కావాలి. ఆయనను, శిష్యుల ను మీరింకా పోషించడం ఆపాలి" అన్నాడు ఆచార్యుల వారు కోపంగా
"గురువుగారూ, అయన చిన్నస్వాములూ మేమిచ్చే ఏ వస్తువు మీద ఆధార పడరు. ఈ అడవి తల్లి వాళ్లకు దుంపలు, పళ్ళు, కూరలు, తేనే లాంటి వెన్నో వస్తువులు ఇచ్చుకుంటుంది. మేము ఉన్నా లేక పొయినా వారి తపస్సుకి భంగమేమీ రాదు. మీరెందుకు అలాంటి మాటలు మాట్లాడుతున్నారో అర్ధం కావటల్లేదు. మీరు మా అందరి మంచి కోసం ఎంతో చేసారు. అయినా అటువంటి మాటలు చెప్పదలచుకుంటే మీరు మా జీవితాలని బాగుపరచే పని ఆపేసి మమ్మలను మా దారిన బతకనివ్వండి" అన్నాడు గ్రామ పెద్ద.
ప్రణవానందుడు కలగ జేసుకుని "మీరు వాదించుకోకండి. అందరి కోరిక గ్రామస్తులు సుఖంగా ఉండాలనే కదా. ఆచార్యా మీరు ఒక విషయం తెలుసుకోవాలి. ఈ ఆధునిక విధానాలు మానవ ప్రగతికి నిదర్శనాలు. అవి తప్పకుండా అందరికి అందవలసినదే. కానీ వాటి కోసం మానవుడు తన జీవితం మీద నియంత్రణ కోల్పోకూడదు.
మీరు రాక పూర్వం ఈ గ్రామస్తులందరకూ వాళ్ళ జీవితాల మీద పూర్తి నియంత్రణ ఉండేది. ఈ ఆధునికి కరణ పేరుతొ మీరు వీరికి అర్ధం కానీ విషయాలు ప్రవేశ పెట్టారు. వాటి గురించి చెప్పడానికి కొందరు నిపుణులు వచ్చారు. ఇవన్నీ గ్రామస్తులకు వాళ్ళ జీవితాల మీద నియంత్రణ కోల్పోయేలా చేసాయి. వాళ్ళు ఎన్నో తరాలుగా అలవాటు పడిన జీవితాన్ని మెల్ల మెల్లగా మార్చాల్సినది పోయి మీరు ఒక్కసారిగా మార్చేశారు.అది తట్టుకోలేక కొందరు అనారోగ్యం పాలయ్యారు. గురువు గారు చెప్పదలచుకున్నదదే. ఈ గ్రామస్తులు ఎంతో స్వచ్ఛమైన వారు. మీరు అందించే ప్రగతి ఆ స్వచ్ఛతను పాడు చెయ్యకూడదు. కానీ అదే జరిగింది. ఎప్పుడూ నిజం మాత్రమే చెప్పే ఈ గ్రామపెద్ద తన బిడ్ద తోనూ, గ్రామస్తుల తోనూ అబద్ధం చెప్పాడు. ఆ విషయాన్ని అందరి దగ్గర దాచ గలడు గాని సర్వజ్ఞులైన గురువు గారి దగ్గర కాదు, ఆయనకు ఆ విషయం తెలిసి పోయింది. దాని వల్ల గురువుగారు ఎంతో వేదనకు గురయ్యారు. ఈ గ్రామస్తుల జీవితాలకు జరగబోయే హాని ని తాను ఆపలేక పోయానని బాధతో గురువు గారు తమ తనువు చాలించారు. విజయదశమి నాడు మీరు చుసిన ఆకాశ దీపం గురువు గారి చితి" అన్నాడు బాధతో
మిగిలిన శిష్యులు కూడా బాధతో తలలు వంచుకున్నారు.
గురువు గారు తనువు చాలించారనీ, దానిక్కారణం తాను చేసిన తప్పే అని నేలమీద కూలబడి పోయాడు గ్రామపెద్ద. అతని కళ్ళవెంట ధారగా ప్రవహిస్తున్న కన్నీరు అతను చేసిన తప్పులను కడగలేక నేలలో ఇంకి పోతున్నాయి.
తాను ఈ ప్రకృతిని అర్ధం చేసుకోలేక పోవడం తో గ్రామస్తుల మీద దాని ప్రభావాన్ని గుర్తించలేక పోయానని, అందువల్ల స్వచ్ఛమైన గ్రామస్తులు కలుషితం అయ్యారని…దాన్ని నివారించ లేక పోయాననే వేదనతో ఒక గొప్ప గురువు ఈ ప్రపంచం నుంచి నిష్క్రమించారని అర్ధమైన ఆచార్యుల వారు మ్రాన్పడిపోయాడు.
ప్రకృతి మాత లోకానికి గురువైన తన బిడ్డ తనలో చేరినందుకు సంతోషింస్తున్నట్టు పెద్దగా వర్షించడం ప్రారంభించింది.