సేవాఫలం ఒక అడవిలో ఉరుము అనే కోతి ఉండేది. దానికి ఒకపిల్ల ఉంది. దాని పేరు మెరుపు. రోజూ అది తల్లి వెంట అడవిలో తిరిగేది. అవి ఉన్న చెట్టుపై నుండి చూస్తే దగ్గరలో ఉన్న పల్లె కనిపించేది. అక్కడ ఎవరుంటారని తల్లిని అడిగింది మెరుపు. ఆపల్లెలో మనుష్యులుంటారని చెప్పింది ఉరుము. "ఒకసారి పల్లెను చూపించవా?"అడిగింది మెరుపు. "ఈ అడవిలో మనకు బాగానే ఉంది కదా! ఆపల్లెలో మన శత్రువులున్నారు. నేను వీలుచూసుకుని ఒకసారి పల్లెకు తీసుకెళ్తాలే!"అంది తల్లి. మెరుపుకు మనసు ఆగలేదు. పల్లెను చూసిరావాలని మనసు లాగుతోంది. "అమ్మా!నువ్వు అడవిలో తిరిగి ఆహారం తెచ్చేలోగా నేను పల్లెను చూసివస్తా!" తల్లితో అంది మెరుపు. "ఒంటరిగా అక్కడికెళ్ళడం ప్రమాదం. నేను తోడు లేకుండా నీవు ఎక్కడికీ వెళ్లవద్దు. నీకు ఒంటరిగా తిరిగే వయస్సు, అనుభవం రాలేదు"అంది ఉరుము. "అలాగేఅమ్మా!"అంది మెరుపు. కానీ దానికి మాత్రం ఒంటరిగా పల్లెకెళ్ళి చూసిరావాలని ఉంది. ఒకరోజు మెరుపు ఒళ్ళునొప్పులుగా ఉంది. కాళ్ళులాగుతున్నాయని తల్లి వెంటరాలేనంది. విశ్రాంతి తీసుకుంటానంది. ఈఆకు నమిలి మ్రింగు. ఆరోగ్యం కుదుటపడుతుంది"అని చెప్పి ఒక ఆకు ఇచ్చి ఆహారంకోసం వెళ్లింది ఉరుము. తల్లి వెళ్ళగానే ఆకును విసిరేసి పల్లెవైపు బయలుదేరింది మెరుపు. తల్లి తిరిగి వచ్చేలోగా పల్లెను చూసి రావాలనుకుంది. * * * * * అడవిలో ఆహారం కోసం వెళ్లిన ఉరుము ఒక చెట్టుమీదున్న పండ్లను చూసింది. చెట్టు ఎక్కడానికెళ్లింది.ఆచెట్టు చాటున ఒకలేడి కూలబడిఉంది.దాని శరీరంలో ఒక బాణం దిగబడిఉంది.వెంటనే ఉరుము బాణాన్ని లాగివిసిరేసింది. తాను చెట్లపైన దుముకుతున్పప్పుడు తగిలే గాయాలకు వాడే ఆకులకోసం చుట్టుపక్కల వెదికింది. ఆకులు కనిపించగానే కోసితెచ్చింది. రాయిపై ఉంచి మరోరాతితో నూరింది. ఆలేపనాన్ని గాయంపై ఉంచింది. చుట్టుపక్కల వెదికి పచ్చగడ్డిని తెచ్చి లేడి ముందు ఉంచింది. ఆకలిగా ఉన్న లేడి పచ్చగడ్డి నమలసాగింది. వెంటనే ఉరుము ఒక పెద్ద ఆకును మడిచి, దోనెలా చేసి, దానితో నీటిని తీసుకుని వచ్చింది. లేడికి దాహం తీర్చింది. లేడి సేదతీరాక ఏం జరిగిందని అడిగింది ఉరుము. "నేను ఆహారం కోసం వచ్చాను. గడ్డిమేస్తూ దూరాన ఉన్న వేటగాడిని గమనించలేదు. వాడు బాణం వదిలాడు. బాణం శరీరంలో దిగగానే పరుగుపెట్టాను. ఈచెట్టు చాటుకు చేరుకుని పడిపోయాను. వేటగాడు నాకోసం వెదుకుతూ, నేను కనపడకపోవడంతో ఎటో వెళ్లిపోయాడు.నా అదృష్టం కొద్ది మంచి మనసున్న నీకంట పడ్డాను. నన్ను కాపాడావు.ఆకలి,దాహం తీర్చావు. నీ సేవాగుణానికి,సహాయానికి జీవితకాలం ఋణపడి ఉంటాను."అంది లేడి. "ఈ లోకంలో ఒకరికొకరు సాయం చేసుకోవడం ధర్మం కదా !ఆధర్మాన్ని పాటించాను.మరికొన్ని ఆకులు నూరి లేపనాన్ని దోనలో ఇస్తాను. ఆకులు కూడా ఇస్తాను.గాయం నయమయ్యేవరకూ మీ అమ్మతో పూయించుకో!"అని చెప్పిందిఉరుము. మరికొన్ని ఆకులను తెచ్చి, నూరి ఇచ్చింది. ఆకులను ఇచ్చింది. కోతికి ధన్యవాదాలు చెప్పింది లేడి. కోతి చెట్టు ఎక్కి కొన్ని పండ్లను తినింది.మెరుపు కోసమని మరికొన్ని పండ్లను కోసుకుంది. తన నివాసం దగ్గరకు చేరుకుంది. అక్కడ మెరుపు కోతి బాధతో మూల్గుతూ ఉంది. పిల్లకోతి తోక దగ్గర గాయం ఉంది. ఏం జరిగిందని అడిగింది ఉరుము. "నేను తప్పు చేసానమ్మా. నువ్వు ఒంటరిగా వెళ్లవద్దని చెప్పినా నీమాట చెవి కెక్కించుకోలేదు. ఆరోగ్యం బాగలేదని నీవెంట రాలేనని నీతో అబద్దమాడాను.నీవు వెళ్లగానే పల్లెకు వెళ్లాను. అక్కడ ఒక జంతువు భౌభౌమని నా వెంట పడింది. వెంటనే పరుగున ఒక గోడమీదకు ఎక్కాను. అది నా తోకను నోట పట్టేసింది. ఈలోగా ఆ ఇంటి యజమాని అరుస్తూ వచ్చి కర్రతో ఆజంతువును తరిమాడు. తర్వాత భయంభయంగా అలాంటి జంతువుల కంటపడకుండా అడవికి చేరుకున్నాను." చెప్పింది మెరుపు. "నీకు పెద్ద ప్రమాదం తప్పింది. ఆజంతువు పేరు కుక్క. దాని నోటికి చిక్కిఉంటే ఒళ్ళంతా గాయాలు చేసి చంపేది. అదృష్టం బాగుండి బతికావు"చెప్పింది ఉరుము. ఆకుపసరు తయారుచేసింది ఉరుము. "మనం కష్టాల్లో ఉన్న ఎవరికైనా సాయపడితే ఆ సేవాఫలం మనల్ని కాపాడుతుంది.నేను ఇక్కడ అడవిలో గాయపడిన లేడికి చేసిన సేవాఫలం నాబిడ్డను పల్లెలో కుక్క బారినుండి కాపాడింది.చేసిన సేవ ఎప్పుడూ వృధాకాదు."పసరు రాస్తూ అనుకుంది ఉరుము. "పెద్దలమాట వినాలి. అమ్మ మాట వినకుండా పెడచెవిన పెట్టినందుకు ప్రమాదంలో పడ్డాను. పెద్దలు ఎప్పుడూ పిల్లలమంచికోరి సలహాలిస్తారు. వాటిని ఆచరించాలి."అనుకుంది మెరుపు.