రుణ విముక్తుడు - కందర్ప మూర్తి

Runa vimukthudu

" మంగా , బాబును తీసుకో. నేను కొబ్బరి కాయ కొనుక్కవస్తాను." అని గోవిందు తన చేతిలోని కొడుకును భార్యకి అప్పగించి మెట్ల దగ్గిర కూర్చున్న కొబ్బరికాయల తాత దగ్గరికొచ్చాడు. " తాతా , కొబ్బరి కాయ ఎంత ? " " పది రూపాయలు బాబూ ! " అన్నాడు తాత . జేబు లోంచి పది రూపాయల నోటు చేతిలో పెడుతూ తాత చేతి మండ మీదున్న పెద్ద బొల్లిమచ్చ వెంటనే ఆయన నుదుట పెదవుల మీదున్న మచ్చలు చూసి ఆశ్చర్య చకితుడయాడు. ఆయనెవరో కాదు అరవింద్ వస్త్ర పరిశ్రమల యజమాని వెంకట్రామయ్య గారు. తెల్లని జుట్టు , గుబురుగా పెరిగిన గెడ్డం , చిరిగిన బనీను , మాసిన పంచతో నీర్సంగా ఉన్న ఆయన్ని అటువంటి దీనావస్తలో చూసి స్తబ్దుడయాడు గోవింద్. వచ్చే భక్తుల కోలాహలంతో గుడి సందడిగా ఉంది. ఆ సమయంలో ఆయన్ని వివరాలు అడిగి వ్యాపారానికి అడ్డు పడటం ఇష్టం లేక పది రూపాయల నోటు ఇచ్చి కొబ్బరి కాయ అందుకుని ముందుకు నడిచాడు. " ఏమయిందండీ , ఇంత ఆలశ్యమైంది ? " అడిగింది మంగ . తర్వాత చెబుతాలే , ముందు బాబా గారి దర్సనం చేసుకుందామని చెప్పి గర్భగుడి వైపు బయలుదేరాడు. గురువారమైనందున బాబా గారి మందిరం భక్తులతో కిటకిట లాడుతోంది. వరుసలో నిలబడి సాయిబాబా దర్శనం చేసుకుని మంగ పక్కన చేరి కొడుకును ఒళ్ళోకి తీసుకుని గుడి ప్రాంగణంలో కూర్చున్నాడు గోవిందు. " ఇందాక అడిగావుగా , కొబ్బరి కాయ తేవడానికి ఆలశ్యమెందు కైందని , ఇప్పుడు చెబుతా విను. అటుచూడు , మెట్ల దగ్గర కొబ్బరికాయలు అమ్ముతున్న తాతని .ఆయనెవరో కాదు, కోటీశ్వరుడు అరవింద్ స్పిన్నింగ్ మిల్సు యజమాని వెంకట రామయ్య గారు. ధర్మాత్ముడు . తన స్పిన్నింగు మిల్లులో పని చేసే కార్మికుల్ని కన్నబిడ్డల్లా చూసేవారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకునే వారు. కార్మికులు ఉండటానికి వసతి గృహాలు కట్టించారు. అలాగే మిల్లులో పని చేసే కార్మికులు కూడా మిల్లును తమ ఆస్థిగా భావించి కష్టపడి పని చేసి లాభాలు ఆర్జించి పెట్టేవారు. పండగలపుడు బోనస్ గా గృహోపకరణాలు సమకూర్చేవారు. వెంకట్రామయ్య గారి భార్య అన్నపూర్ణమ్మ గారు కూడా చాలా దయగల మనిషి. మిల్లులో పని చేసే కార్మికుల మహిళలు , వారి పిల్లల బాగోగులు చూసే వారు. వెంకట రామయ్య గారు ఉన్న ఇద్దరు కొడుకుల్నీ విదేశాలకు పంపి పెద్ద చదువులు చెప్పించారు.. వారికి సంపన్నుల అమ్మాయిలతో వివాహం జరిపించారు. కోడళ్లిద్దరూ బిజినెస్ మానేజ్ మెంటు చదివిన మోడరన్ సొసైటీలో పెరిగారు. నవనాగరిక వేష భాషలతో కోడళ్లిద్దరూ ఇంటి వాతావరణాన్నే మార్చేసారు. కట్టూ బొట్టూ ఆహార వ్యవహారాలన్నీ విదేశీ పద్దతికి మారిపోయాయి. కొడుకులిద్దరు విదేశీ వ్యసనాలతో భార్యల చేతుల్లో కీలుబొమ్మలుగా తయారయారు. సనాతన సంప్రదాయ పద్దతుల్లో ఉండే వెంకట్రామయ్య దంపతుల్ని చిన్న చూపు మొదలెట్టారు. విదేశాల్లో ఉన్నత సాంకేతిక విద్య చదివిన కొడుకులిద్దరు వస్త్ర వ్యాపారాన్ని తమ చేతుల్లోకి తెచ్చుకుని ఆధునిక సాంకేతిక పద్దతులతో విదేశాల నుంచి భారీ యంత్రాల్ని తెప్పించి దేశీయ నూలుకు బదులు టెర్లిన్ , నైలాన్ ,రేయన్ , సిఫాన్ వంటి సీంథటిక్ వస్త్రాలు తయారు చేస్తూ కార్మికుల కడుపులు కొట్టా‌రు. ఎప్పటినుంచో అరవింద్ మిల్సును నమ్ముకున్న కార్మికులు పనులు లేక రోడ్డున పడ్డారు. అచేతనుడైన వెంకట్రామయ్య గారు కార్మికుల ఆర్థిక బాధలు చూడటం తప్ప ఏమీ చేయలేక పోయారు. ఇంట్లో కోడళ్ల పెద్దరికం వచ్చి సరైన భోజన సదుపాయాలు లేక అన్నపూర్ణమ్మ గార్ని, బాబు గార్ని ఇంటి వెనక స్టోరు రూములో ఉంచారట. సకల వసతులతో ఎంతో దర్జాగా బతికిన వారిద్దరూ నౌకర్లు పెట్టే తిండి మీద ఆధారపడ వల్సి వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో వారిద్దరు మానసికంగా కుంగిపోయారు. వ్యాపార పనుల్లో వత్తిడిగా ఉండే కొడుకులు వీలున్నప్పుడు వచ్చి స్టోరు రూములో నివాశముంటున్న వెంకట్రామయ్య దంపతుల్ని పరామర్సించే వారట. అమ్మ గారు బతికున్నంత కాలం ఆయన కనీస అవసరాలు తీర్చేవారు. అకస్మాత్తుగా ఆవిడ కూడా కాలం చెయ్యడంతో పెదబాబు గారు వార్ధక్యంలో ఒంటరి పక్షిగా మిగిలి పోయారు. తర్వాతి కాలంలో కార్మికుల వసతి గృహాలు కూలగొట్టి గొడౌన్లుగా మారాయి. కంపెనీలో ఆటోట్రాలీల బదులు పెద్ద ట్రక్కులు నడుస్తున్నాయి. ఫ్యాక్టరీ చుట్టు కాంపౌండుగోడ కట్టి సెక్యూరిటీ పోస్టులు ఏర్పాటు చేసారు.ఆధునిక టెక్నాలజీతో పెద్ద యంత్రాలు వచ్చి కార్మికుల సంఖ్య తగ్గింది. అంతా ఆధునికత కనబడుతోంది. చదువుకున్న కొత్త కార్మికుల వేష భాషల్లో మార్పు వచ్చింది. పనివాళ్ల వసతులు వేతనాలు పెరిగాయి. పాత కార్మికులు పనులు లేక ఇతర వృత్తుల్లో జీవనోపాధి వెతుక్కున్నారు. పెద బాబు గారి దయ వల్ల నేను పోలిటెక్నిక్ డిప్లమో చేసిన తర్వాత మీ అన్నయ్య తోడు కలిసి మేమిద్దరం బ్యాంకు లోను మీద మిషన్లతో చిన్న వర్కుషాపు పెట్టి స్వయం ఉపాధి కార్యక్రమం మొదలెట్టాము. బాబా చల్లగా చూసారు. వర్కుషాపులో ఆర్డర్లు పెరిగి ఆర్థికంగా బలపడ్డాము. . అప్పట్లో పనులు లేక ఉపాధి కోసం నాన్న అమ్మను తీసుకుని మా స్వంత ఊరు వెళిపోయారు.. తర్వాత నాన్నకు క్షయ జబ్బు ముదిరి , వృద్ధాప్యం వల్ల గతించగా అమ్మని నా వద్దకు తీసుకు వచ్చాను. ఉన్నంతలో చక్కటి సదుపాయాలున్న మనం ఉంటున్న ఇంటిని కొనుగోలు చేసాను. మీ అన్నయ్యతో నా అనుబంధం నిన్ను పెళ్లి చేసుకుని బాంధవ్యంగా మారింది. తర్వాత మన ప్రేమానురాగాలకు గుర్తుగా బాబు పుట్టడం జరిగింది. ఈమధ్య మా నాయనతో కలిసి పని చేసినళ మా బంధువొకరు కలిసినప్పుడు మాటల సందర్భంగా అరవింద్ బట్టలమిల్లు యజమాని వెంకట్రామయ్య గారి దీనావస్తను, వృద్దాప్యం వల్ల ఆరోగ్యం క్షీణించినట్లు, మోడరన్ పద్దతుల్లో మసలే కోడళ్ల నిరాదరణ భరించలేక మతిభ్రమించి ఇల్లు వదిలి ఎటో వెళి పోయినట్టు చెప్పి నాడు. పది మందికి అన్నం పెట్టిన ధర్మదాత బికారిలా తిరుగుతున్నాడని తెలిసి అమ్మ , నేను ఎంతో బాధ పడ్డాము. నేను ఇంత ఉన్నత స్థితికి వచ్చి పది మందికి జీవనోపాధి కలిగించానంటే ఇదంతా ఆ పెద్దాయన చలవే. వారి రుణం తీర్చుకోవాలి. బికారిలా గుడిమెట్ల మీద బ్రతక నివ్వను. ఆయన్ని మన ఇంటికి తీసుకు వచ్చి చనిపోయిన నాన్నే తిరిగి వచ్చినట్లు వారి సేవ చేసుకుంటాను. " " అలాగే నండి , తప్పక మనింటికి తీసుకు వచ్చి మామయ్య గారిలా చూసుకుందాము " అంది మంగతాయారు. ఇంటికి వచ్చి గోవిందు తల్లికి మిల్లు యజమాని వెంకట్రామయ్య గారు కనిపించడం , ఆయన దుర్భర పరిస్థితి వివరించి తన మనసులోని మాట చెప్పగా ఆమె కూడా కొడుకు విశాల హృదయాన్ని మెచ్చుకుని అలాగే చేద్దాం అంది. బాబా గారి గుడి దగ్గర భక్తుల సందడి తగ్గగానే అమ్మగా మిగిలిన కొబ్బరికాయలు , అమ్మిన డబ్బులు పూజారి గార్కి అప్పగించడానికి వచ్చిన వెంకట్రామయ్య గార్ని చూసి గోవిందు మనసు చలించి పోయింది. అంతకు ముందే పూజారి గారి ద్వారా పెద్దాయన విషయం తెలుసుకున్నాడు. . పూజారి గారు చెప్పిన సంగతి ఏమిటంటే , ఒకరోజు బాబా గుడి అరుగు మీద ఆకలితో సొమ్మసిల్లిన వెంకట్రామయ్య గార్ని చూసిన సెక్యూరిటీ గార్డు పూజారి గార్కి చెప్పగా ఆయన చేసిన సపర్యల మూలంగా కోలుకున్న పెద్దాయనకు ప్రసాదం తినిపించి ఆయన దీనావస్థను చూసి గుడి యాజమాన్యంతో మాట్లాడి కొబ్బరికాయలు అమ్మించి వచ్చిన లాభంతో ఆయన తిండికి జరుగుబాటు అయేలా ఏర్పాటు చేసారు. అలా బాబా గుడి ప్రాంగణంలో ఆయన రోజులు గడుస్తున్నాయి. ఎంతో దర్జాగా బ్రతికిన వెంకట్రామయ్య గారి దుర్భర జీవిత గాధ గోవిందు ద్వారా తెలుసుకున్న పూజారి గారు ఎంతో బాధ పడ్డారు. పెద్దాయన్ని తమ ఇంటికి తీసుకెళ్లి ఆయన బాగోగులు చూసుకుఉటామని గివిందు చెప్పగా , పూజారి గారు బాబా మిమ్మల్ని చల్లగా చూడాలని ఆశీర్వదించారు. గోవిందు వెంకటరామయ్య గారి దగ్గరకెళ్లి తనని పరిచయం చేసుకుని తను వారి వస్త్ర పరిశ్రమ మిల్లు కార్మికుడు వీరయ్య కొడుకునని , వారి దయ వల్ల హైస్కుల్ తర్వాత సాంకేతిక విద్య నేర్చుకుని స్వయంగా చిన్న పరిశ్రమ నడుపుతు ఆర్థికంగా నిలదొక్కు కున్నానని , తన తండ్రి పోయి నందున పెద్ద దిక్కుగా ఉండాలని వేడుకున్నాడు. వెంకట్రామయ్య గారు ముందు నిరాకరించినా గోవిందు వినయం విధేయతలకు , గుడి పూజారి గారు నచ్చచెప్పడంతో ఒప్పుకున్నారు.సాదరంగా ఇంటికి తీసుకు వచ్చిన వెంకట్రామయ్య గార్ని చూసి గోవిందు తల్లి మురిసి పోయింది. గోవిందు , మంగతాయారు ఆయనకు సపర్యలు చేస్తూ ఎంతో ఆప్యాయంగా చూసుకుంటున్నారు. వారందరి ఆదరాభిమానాలకు వెంకట్రామయ్య గారు తన స్వంత కొడుకుల దగ్గర కెళ్లడానికి ఒప్పుకోలేదు. తన శేష జీవితం వారి తోనే గడపాలని నిశ్చయించు కున్నారు.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు