అది రామచంద్రాపురం పాఠశాల. విశాలమైన స్థలం, రంగుల భవంతులు. రకరకాల పూలమొక్కలు, చెట్లు, ఆటస్థలం, ప్రహరీగోడతో,చల్లనిగాలితో ఆహ్లాదకరంగా ఉంటుది. అక్కడ పదవతరగతి గదిలో మోహనరావుగారు పాఠం చెబుతున్నారు. పదవతరగతి లక్ష్యంగా చేసుకొని పట్టుదలగా ఎలా చదవాలో చెబుతున్నారు. తిలక్ అనే అబ్బాయి లేచి "సార్! విజయం సాధించాలంటే ఏం చేయాలి?"అని ప్రశ్నించాడు. మోహనరావుగారు చిరునవ్వుతో "మీకు సోక్రటీస్ గురించి ఓ కథ చెబుతాను. వినండీ. విజయరహస్యం అర్థమవుతుంది" అని ఇలాచెప్పసాగాడు సోక్రటీస్ మహాజ్ఞాని. తత్వవేత్త. ఒకసారి ఆయన దగ్గరకు ఒక యువకుడు వచ్చాడు."స్వామీ!మనం అనుకున్న పనిని సాధించాలంటే ఏదైనా రహస్యముంటే, ఆ మార్గమేమిటో చెప్పండి"అని అడిగాడు. అందుకు సోక్రటీసు చిరునవ్వు నవ్వి "నాయనా! విజయరహస్యం తెలుసుకోవాలనుకుంటున్నావా?నావెంటరా!"అని ముందుకు నడిచాడు. ఆ యువకుడు సోక్రటీస్ వెంట నడిచాడు. ఆయన ఊరి చివరనున్న చెరువు వద్దకు చేరుకున్నాడు.చెరువులోకి నడుచుకుంటూ వెళ్ళాడు.ఆ యువకుడు ఆశ్చర్యంగా ఆయన వెంట వెళ్ళాడు. కొంత లోతుదాకా వెళ్ళాక సోక్రటీస్ గభాల్న యువకుడిని నీళ్ళలోకి త్రోసి, మెడపట్టుకుని తలపైకి లేవకుండా అదిమిపట్టాడు. ఉన్నట్లుండి అలా జరిగే సరికి ఆశ్చర్యంలో ఏంచేయాలో యువకుడికి అర్థంకాలేదు.కానీ సోక్రటీస్ అలాగే నొక్కిపట్టి ఉంచడంతో ఆ యువకుడికి ఊపిరాడటం లేదు. తలని పైకి లేపటానికి గిలగిల కొట్టుకోసాగాడు. తన శక్తినంతా ఉపయోగించి పైకి రావడానికి తీవ్రప్రయత్నం చేయసాగాడు. ఊపిరాడక గాలికోసం ఉక్కిరిబిక్కిరి కాసాగాడు. ఆ యువకుడు తీవ్రప్రయత్నం చేసి, పట్టునుండి తప్పించుకుని, నీళ్ళనుండి ఒక్క ఉదుటున తలను పైకిలేపి ఉక్కిరిబిక్కిరవుతూ, గుండెలనిండా గాలిని పీల్చుకోసాగాడు. అప్పుడుసోక్రటీస్ ఇలా అన్నాడు "బాబూ నీళ్ళలో నీవు దేనికోసం గిలగిలలాడిపోయావు?"అన్నాడు. "గాలికోసం"అన్నాడు వేగంగా గాలిని పీల్చుకుంటూ. "నీళ్ళలో గాలిని పీల్చుకోవడం కోసం నువ్వెంత తపన పడ్డావో, అలాంటి తపన నీ లక్ష్యసాధనలో విజయం కోసం పడినప్పుడు, అంతటి కోర్కెతో రగిలిపోయినప్పుడు ప్రపంచంలోని ఏ శక్తీ నీకు విజయం లభించకుండా అడ్డు తగల్లేదు. గాలిపీల్చుకోవడమనే లక్ష్యం తప్ప మరేదీ నీకు గుర్తులేదో అలా నీ లక్ష్యంపై ఏకాగ్రత నిల్పి తపనతో ప్రయత్నించు.అదే విజయరహస్యం "అని వివరించాడు. మోహన రావుగారు ఈ కథ చెప్పి "విజయరహస్యం అర్థమయింది కదా!"అన్నాడు. తిలక్ ఆనందంగా "చాలాచక్కనికథచెప్పారుసార్! అయితే నాకో సందేహముంది. ఎంతో ఏకాగ్రతతో తపనతో ప్రయత్నించినా ఓటమి ఎదురైతే ఏం చేయాలి?"అన్నాడు మోహను రావుగారు చిరునవ్వుతో "మీకు థామస్ఎడిసను కథ చెబుతా. వినండి.మీ సందేహం తీరుతుంది"అంటూ చెప్పసాగాడు. థామస్ ఎడిసన్ ప్రముఖ శాస్త్రవేత్తయని మీకు తెలుసుకదా!ఆయన ఎలక్ట్రికల్ బల్ప్ లోని కార్బన్ ఫిలమెంట్ ను తయారుచేసే ప్రయత్నంలో దాదాపు 12000 ప్రయోగాలు చేసి,అన్నింటిలోనూ అపజయాన్ని పొందుతూ చివరకు కనిపెట్టగలిగాడు. ఆయన దాదాపుగా 6000దాకా ప్రయోగాలుచేసి విఫలమై ఇంకా ప్రయోగాలు చేస్తుండగా ఓవిలేఖరి ఆయనతో "సార్! దాదాపు ఆరువేలసార్లు విఫలమై కూడా ఇంకా ప్రయత్నిస్తున్నారు.ఎందుకు?"అన్నాడట. అందుకు ఎడిసన్ ఇలాచెప్పాడు "నేను అపజయాన్ని పొందానని ఎందుకనుకుంటున్నావు?ఫిలమెంటును తయారుచేయడానికి అనువుగాని ఆరువేల పద్దతులను విజయవంతంగా గుర్తించగలిగాను.అంటే దాని అర్థం ఫిలమెంటును తయారుచేయడానికి నేను ఆరువేలపద్దతులకు దగ్గరగా చేరుకున్నానన్నమాట"అన్నారు. ఎడిసన్ దాదాపు 12000 ప్రయోగాలు చేసి చివరకు కార్భన్ ఫిలమెంటును కనుగొన్నాడు. మోహనరావుగారు ఈ కథ చెప్పి "అపజయమనేది మనం పోతున్న మార్గం సరైనది కాదు. దారి మార్చుకోమని చెబుతుంది.ఎడిసన్ లాగా సాధించాలనే కోరికతో రగిలిపోయేవారికి అపజయం తాత్కాలికమే! చివరకు లభించేది విజయమే! విజయం సాధించినవారు రాత్రికి రాత్రి ఆస్థాయికి చేరలేదు.కష్టపడి ప్రయత్నిస్తే సాధించలేనిది లేదు.బద్దకం మనిషికి బద్దశత్రువని గుర్తించండి.పనిపట్ల అంకితభావం, ఏకాగ్రత విజయాన్ని అందిస్తాయి. ధైర్యం నశించినప్పుడుసర్వం నశిస్తుంది. భయమనేది ఏ పనిలోనూ ముందుకెళ్ళకుండా ఆపుతుంది. ఆత్మవిశ్వాసం,పట్టుదల విజయాన్ని అందిస్తాయి. మిమ్మల్ని మీరు సమర్థులుగా భావిస్తే పోటీలో విజయం సాధిస్తారు. మీ గురించి మీరు ఎప్పుడూ తక్కువగా అంచనా వేసుకోవద్దు.శ్రమ,శ్రద్ద,పట్టుదల,ఆత్మవిశ్వాసం విజయానికి మూలస్థంభాలు. భయం,ఆందోళన,అనుమానం,విసుగు విజయానికి ఆటంకాలు. అపజయాలకు భయపడరాదు.అవి అప్పుడప్పుడూ ఎదురవుతుంటాయి.కాలం విలువను గుర్తిచిన వాడే విజేతగా నిలుస్తాడు. రేపు ఏంచేయాలో ఈ రోజే నిర్ణయించుకోండి. శ్రద్దగా కృషి చేయండి. విజయం మీదే" చెప్పారు మోహనరావుగారు.