మే నెల ఆఖరువారం , ఎండగాడ్పులు కొడుతోంది , పూనా నుంచి పొద్దున్న ఫ్లైట్లో ఢిల్లీ వచ్చి అక్కడనుండి సాయంత్రం జనశతాబ్దిలో హరిద్వార్ వెళ్లాలి . ఎప్పుడో మూడు నెలల ముందు రిజర్వేషను చేయించుకున్నా వైట్ లిస్ట్ ఒకటిరెండు లలో కూర్చుంది నాలుగు రోజులుగా , ఛార్ట్ ప్రిపేరయితేగాని టికెట్ కన్ఫర్మ్ అయినదీ లేనిదీ తెలీదు , ఒకవేళ కాకపోతే ఏం చెయ్యాలి అనేది కూడా ముందుగానే ఓ ప్లాను వేసుకున్నాం .
ఢిల్లీ లో పదిహేనేళ్లున్న అనుభవం ఏ బస్టాండునుంచి ఏ బస్సు వెళుతుందో అనే జ్ఞానాన్నిచ్చింది .
ఒంటిగంటకి నెట్ లో చూసుకుంటే మా టికెట్లు కన్ఫర్మ్ కానట్టు తెలిసింది.
మాకు రెండుగంటల ఉత్తరాఖండ్ వారి ఎసి బస్సు దొరికింది. సామాను సర్దుకొని మాసీట్లలో కూర్చొని పరిసరాలు పరికించసాగేను.
మొహం మీదవరకు ముసుగులాక్కొని వున్న మహిళ మా ఎదురుగా వున్న సీట్లో కూర్చొనివుంది , కింద కిటికీ దగ్గర ఆమె భర్త నిలబడివున్నాడు. ఆమె చాలా భయపడుతోంది, మొదటిసారి ఒక్కర్తీ వెళుతోందోయేమో, అతను ఆమెకు ధైర్యం చెబుతూ మావారి వంక చూసి అంకుల్ మా ఆవిడని కనిపెట్టుకునుంటారా?, ఆమె చాలా భయస్తురాలు, టాక్సీలో పంపేవాడినే, డ్రైవరు తెలిసిన వాడే, కాని తను చాలా భయస్తురాలు టాక్సీలో వెళ్లడానికి భయపడింది, అందుకే బస్సులో పంపాల్సి వస్తోంది. ప్లీజ్ మీరు ఆంటీ కాస్త చూసుకోండి.
మా వారికి ఆ భర్త చాటు భార్య చాలా నచ్చినట్లుంది. “మరేం ఫర్వాలేదు, మేం చూసుకుంటాం అమ్మాయిని” అని అభయమిచ్చేరు.
నాకైతే మా ఆయనని చూస్తే ముళ్లపూడివారి బుడుగు గుర్తొచ్చేడు.
బస్సుడ్రైవరు సీట్లో కూర్చున్నాడు, కండక్టరు టికెట్లు ఇస్తున్నాడు.
మన శశి ( కథ కోసం ముళ్లపూడివారి బుడుగులో శశి పేరే వాడుకుందాం ) భర్తతో చాలా మృదువుగా “రెండు టికెట్లు తీసుకోండి, నా పక్కన మరెవరూ వచ్చి కూర్చోరు, లేకపోతే ఏ మగవారో నా పక్కన కూర్చుంటారు, మీకు తెలుసుగా? మగవారు నా పక్కన కూర్చోవడం నాకు నచ్చదని” ముద్దుగా గోముగా అడిగింది.
ఎంత ముద్దుగా అంటే ప్రవరాఖ్యుడే ఫ్లాట్ అయేంత, మరి ఈ భర్త అనే బక్క మానవుడేపాటి.
మరో ఆలోచన లేకుండా రెండు టికెట్లుకొని భార్యచేతిలో పెట్టి, కండక్టరుతో “భయ్యా మరెవరినీ అక్కడ కూర్చోపెట్టకు” అన్నాడు.
నాకెక్కడో కొడ్తోంది, ఈ వినయం ఈ పాతివ్రత్యం కృత్రిమంగా కనిపిస్తున్నాయి, ఈ కాలంలో ఇలాంటివారు అదీ ఢిల్లీ లాంటి మహానగరాలలో ఉంటారా? ఉన్నారా? అదీ నా సందేహం. ఆడది ఇంట్లో మడి కట్టుకు కూర్చుంటే జరుగే రోజులా ఇవి?.
కాపరానికి వచ్చిన కొత్తలో భాషరాక తనుపడ్డ అగచాట్లు గుర్తుకు వచ్చేయి, ఉద్యోగ బాధ్యతలలో మునిగిపోయిన భర్తే బయటి పనులు చెయ్యాలని అనుకుంటే తను పిల్లలూ పస్తులుండాలని గుర్తించి వచ్చీరాని భాషతో బయటి పనులు చక్కపెట్టుకుంటూ ప్రాంతీయ భాషమీద పట్టు సంపాదించబట్టేకదా ఇవాళ మాతృభాషకాక మరో ఆరుభాషలు అవలీలగా మాట్లాడగలుగుతోంది.
మా వారికి మాత్రం ఆమె మీద వాత్సల్యం, అభిమానం పొంగుకొస్తున్నాయి, ఇన్నేళ్ల సాహవాసంలో మావారి ఆలోచనలు ఆపాటి కనిపెట్టలేనా?.
ఓ మారు హరను కొట్టి డ్రైవరు బస్సుని ముందుకి పరుగెత్తించేడు.
బస్సు శబ్దంలో మాటలు కలసిపోతున్నా మరో మారు శశిని మా కప్పగించి భార్యకి టాటా చెప్పి ప్లైయింగ్ కిస్సులు విసిరేడు.
“ఆడదంటే అలావుండాలి, చూడు భర్తచాటు భార్య, ఈకాలంలో కూడా ఇలాంటి పతివ్రతలుండబట్టే ప్రళయం రాకుండా భూమి ఇంకా నిలబడివుంది “.
అవునా?, నిజమా?, ప్రళయాలూ, భూకంపాలూ రావడానికి కూడా ఆడదే కారణమా?, అయినా నాలాంటి అమాయకపు భార్యలు ఇంటిపని బయటపని అనే తేడాలేకుండా చేస్తున్న వారిని చులకనగా మాట్లాడడం నాకు నచ్చలేదు.
ఇంతకు ముందయితే మావారి ఈ డైలాగుకి ఉక్రోషపడి నేనో నాలుగు మాటలు విసరడం మావారు పది అనడం, వాటికి సమాధానం చెప్తూ నేను కళ్లనీళ్లు పెట్టుకోడం జరిగేది. ఈ మధ్య నేను ఇలాంటి వాటికి రియాక్టవడం మానేసేను. దాంతో నా బీపీ కంట్రోలులో ఉంటోంది.
మూడేళ్లకోమారు చేస్తున్న ఉద్యోగాన్ని, ఉన్న ఊరిని మార్చేసే మొగుడికి ఇల్లాలి ఇక్కట్లెలా తెలుస్తాయి, పాతస్కూల్లో టీసీ తీసుకోడం నుంచి కొత్త స్కూల్లో పిల్లలని జాయిన్ చెయ్యడం వరకు ఆడదొక్కర్తీ చెయ్యాలంటే ఎంత మందితో మాట్లాడాలో, ఎంత మందితో పోట్లాడాలో పగలు ఆఫీసుకుపోయి, రాత్రి పదికో పదకొండుకో కొంపచేరే భర్తకెలా తెలుస్తుంది. ఆఖరుకి కౌన్సిలింగులో కాలేజీలని ఎంచుకొని వారిని జాయిన్ చెయ్యడం వరకు నాదే బాధ్యతయినప్పుడు ఇలా ముసుగులో భర్తచాటు భార్యలా వుండడం సాధ్యమేనా ?.
నిండా పదహారేళ్లు లేనప్పుడు మొదటిసారి ఢిల్లీనుంచి విశాఖపట్నం వరకు ఒంటరి ప్రయాణం చేసేను. ఈ శశిలాగా భయం అంటే ఎన్ని పనులు ఆగిపోయేవో?ఎందుకాగుతాయీ, అన్నీ జరుగుతాయి, ఈ జ్ఞానం ఆనాడు నాకు లేకపోయింది అన్నీ మీద వేసుకు చేసేను. ఓ పేరా? ఓప్రతిష్ఠా?.
ఎప్పటిలాగే కిటికీ సీట్లో చారబడి మా వారు నిద్రలోకి జారుకొన్నారు, కిటికీ సీట్లో కూర్చొని నిద్రపోయే వారిని చూస్తే నాలుగు లెంపకాయలు కొట్టాలనిపిస్తుంది నాకు. నాలాగ నిద్రరానివాళ్లకి కిటికీ సీటు ఇస్తే, పకృతిని ఆశ్వాదిస్తాంకదా? అర్దం చేసుకోరూ?.
బస్సు డైరెక్షను మారినట్లుంది,ఎండ మొహం మీద పడసాగింది. కర్టెను మూసి నేను కూడా కళ్లుమూసుకున్నాను.
ఢిల్లీ, గజియాబాదు దాటినట్లుంది, కుదుపులు మొదలయి తెలివొచ్చింది, మోదినగర్ వచ్చినట్లుంది, రోడ్డు వెడల్పు తగ్గడంతో రష్ పెరిగింది.
పక్క సీట్లో కిలకిలలు వినిపిస్తే పక్కకి చూసేను, ఇదేంటి ఈ సీట్లో శశి కదా ఉండాలి, సీటు మారిందా?, బస్సు దిగిపోయిందా?.
పక్కసీట్లోని ఆవిడని తేరిపార చూసేను, చూసిన మొహమే, శశేకదూ? పక్కన ఎవరో ఉన్నారే?, ఇప్పుడు స్పష్టంగా వారి మాటలు వినబడుతున్నాయి, ఒకరిమీద ఒకరు పడడం, వారి చేతుల సయ్యాటలు కూడా కనిపిస్తున్నాయి, కాని శశి మార్వాడీ చీరకట్టి మూరెడు ముసుగులో కదా వుండేదీ, ఈ జీను పేంటు టీ షర్టు మహిళే శశి అయితే బట్టలు ఎక్కడ మార్చినట్లు.
ఒక్కసారి నా తలలో బల్బులు వెలిగేయి, ఓహో చీరకిందన ఈ డ్రస్సు వేసిందన్నమాట, పై నున్న ముసుగు తియ్యడంతోనే సిగ్గు శిరాలకి తిలోదకాలిచ్చిందన్నమాట, సెహబాష్ మహిళా, వెనకబడివున్నావు అని నిన్నన్నదెవరు?.
వెంటనే మా ఆయనని లేపి శశిని చూపించాలని అనిపించింది. ఈ మధ్య పెద్దదాన్నయేనుగా?, అందుకే మాట్లాడకుండా కళ్లుమూసుకున్నాను.
ఢిల్లీ నుంచి హరిద్వార్ వెళ్లే వరకు వుండే దారంతా మామిడి తోటలు చెరకు పొలాలతో వుండేది, ఇప్పుడు అవన్నీ కాలేజీలుగా మారిపోయేయి.
“కధౌలీ” లో బస్సు ఆపుతాడేమో స్ట్రాంగుటీ తాగాలి, శశి ప్రవర్తనకో లేక బయటనున్న వేడికో తలనొప్పిగా వుంది.
టీ కోసం బస్సుని రోడ్డు మీంచి దింపి ఓ హోటల్ లో ఆపేడు డ్రైవరు. శశి స్ప్రింగులా సీట్లోంచి లేచి పక్కనే బక్కలా వున్న కుర్రాడిని నడుం దగ్గర ఎత్తుకున్నట్లుగా పట్టుకొని బస్సులోంచి దిగింది.
కిటికీ మీద తలవాల్చివున్న మావారిని టీ తాగుదామని లేపేను.
టీ ఆర్డర్ చేసి కూర్చొని చుట్టూ చూసేను, పక్క సీట్లో శశి, ప్లేట్లోవున్న పదార్ధాన్ని అతని నోట్లో పెట్టి తినిపిస్తూ మధ్యమధ్యలో చిన్న పిల్లాడికి మూతి తుడిచినట్లు తుడుస్తూ, ముద్దులిస్తోంది. దీనిని ప్రేమ అనాలో? వలపు అనాలో? వల్లకాడు అనాలోనాకైతే అర్దం కాలేదు, పదేపదే శశి ముగుడే గుర్తొచ్చేడు. నా పెళ్లాం ఎంత అమాయకురాలో అనుకుంటూ భార్య గురువుగారి ఉపదేశాలు వినడానికి వెళ్లిందని ఆనందపడుతున్నాడు, ‘నా పెళ్లాం పరాయిమొగాడిని తాకడానికి కూడా ఇష్టపడని పతివ్రత అనే అజ్ఞానంలో బతుకు గడిపెస్తాడ’, పెళ్లాం ఇల్లుదాటగానే మొహం మీది ముసుతో పాటు సిగ్గు శిరాలని వదిలేసి ఇలా బరితెగించి వీధిన పడిందని తెలిసిన రోజున ఆ భర్త పరిస్థితేంటి?, ఆమె చేసిన పనికి ఆమెని చంపి హంతకుడిగా మారతాడా?, లేక తానే ఆత్మహత్య చేసుకుంటాడా?, ఈ రెంటింటిలో ఏదోవొకటి మాత్రం తప్పకుండా చేసుకుంటాడు అది మాత్రం నిజం.
వేడివేడి టీ, చల్లని నీటి బాటిల్ తెస్తున్న మా ఆయనకి శశి నిజస్వరూపం తెలుస్తే, అతని రియాక్షన్ ఎలా ఉంటుందో?.
ముందు చల్లగా నీళ్లు కడుపులోకి పంపి వేడి టీని ఊదుకుంటూ “ఇటు చూసి గుర్తు పట్టండి ఆమె యెవరో ?“ అన్నాను.
“బస్సులోనే డ్రస్సు మార్చిన జాణ, అమాయకంగా మాట్లాడి మొగుణ్ణి బుట్టలో పెట్టి డ్రస్సుమార్చి ప్రియుణ్ణి బుట్టలో పెట్టగల నెరజాణ నీ మాటల్లో చెప్పాలంటే ముళ్లపూడివారి శశి”.
“ ఓహో మీరు జాణ నెరజాణగా మారడం కూడా చూసేరన్నమాట, ఇప్పుడు ఈమెకి శశి అనే పేరు నప్పదుగాని, నెరజాణే సరైన పేరు”.
“నువ్వు ఎదర కిటికీలోంచి ఎండలో అక్షరధామ్ అందాలు చూస్తూ మై మరచి వున్నప్పుడు జాణ నెరజాణగా అవతారం మార్చడం నాకళ్ల బడిందిలే “.
“మరి ఈ మన్మధుడు ఎక్కడెక్కేడూ?”,
“ఛీ వాడు మన్మధుడేమిటీ” అని ఆముదం తాగిన మొహం పెట్టేరు మా వారు.
“వారు పెడుతున్న భంగిమలు చూసేరా?, రతీమన్మధులను తల తన్నేట్టుగాలేవూ?, అందుకే ఆ పేరన్నమాట”.
“ఛి ఛీ దేవుళ్లపేర్లు ఈ దరిద్రులకి పెట్టకు, ప్రతీ దేవీదేవతల చేష్టలకి ఓ అర్దం పరమార్దమున్నాయి” మళ్లీ ఆ మొహమే పెట్టేరు.
“సరేలెండి మరెప్పుడూ ఇలాంటివారిని పౌరాణిక పాత్రలతో పోల్చనులెండి” లెంపలు వేసుకుంటూ అన్నాను, “ఇంతకీ వీడెక్కడెక్కేడు?”.
“ఎక్కడమేమిటీ, ముందునుంచే ఉన్నాడు, బస్సు కదలగానే ముందుకొచ్చి కూర్చున్నాడు”.
చాలా సేపటివరకు నాకు నోటమాటరాలేదు.
ఎందుకో నోరంతా చేదుగా అనిపించింది, నీతీ నియమాలకి తిలోదకాలేనా?, మంచీ చెడూ తెలీని చిన్నవయసుకాదు, జీవితంలో ఎత్తుపల్లాలు చూసిన మధ్య వయసులో ఇదేం పైత్యం.
“ఇంకా నెరజాణ గురించే ఆలోచిస్తున్నావా?, బుద్ది కర్మానసారిణి కదా?, వదిలెయ్”.
“పోర్న షో లైవులో చూడ్డానికి ఎంతపాపం చేసుకున్నానో”, ఒకమారు బస్సంతా చూసేను, అందరూ లైవ్ షోని ఎంజాయ్ చేస్తున్నారు.
నా బాధ చూడలేక మా ఆయన సీటు మారేరు.
కిటికీ లోంచి అస్తమిస్తున్న సూర్యుడి అందాలు చూస్తున్నా నా మనసు మాత్రం అలజడిగానే వుంది.
“పతివ్రత అనుకున్న వ్యక్తి పతిత అని తెలిసినప్పుడు మీకేమీ అనిపించలేదా?”
“అంచనా తప్పయింది అంతేగా?“
“అంతేనా?”
“అంతే”
అవును అంతేనేమో, సమస్య మనది కానపుడు, మనచేతులలో లేనపుడు అంతే అని మనసులోంచి పక్కకి నెట్టేసి మనని మనం ప్రశాంతంగా వుంచుకుంటే సరి.
ఎంత పక్కకి నెట్టేసినా కొన్నాళ్లు ఈ నెరజాణ నాకు నిద్రని దూరం చేస్తుందనేది మాత్రం నిజం.