మరో బాల్యం - Ramya vuddanti

Maro balyam

"ఏంటి? మీ అమ్మ వచ్చి మనింట్లో ఉంటుందా? ఆ మెడికల్ చెకప్ లు,హాస్పిటల్ మందుల వాసనలు ..అబ్బో..నా వల్ల కాదు ఆవిడని భరించడం" అని నిక్కచ్చిగా చెప్పింది నవ్య. "అదేంటి నవ్య అలా అంటావు అమ్మ ని హాస్పిటల్ కి నేనె తీసుకెళ్తున్నా కదా నీకొచ్చిన ఇబ్బందేంటి మా అమ్మ రావడం లో" అని అడిగాడు వినయ్. "ఇబ్బంది ఏంటా? ఆవిడేమన్నా నాకు వండి వార్చి సహాయం చేయడానికి వస్తుందా..ఎంత చాకిరి చెయ్యాలి..చేతులు వణుకు వల్ల సరిగా తిండి తినలేదు మంచి నీళ్లు కూడా తాగలేదు.. అన్ని కింద వొలిపేసుకుంటుంది..అవన్నీ క్లీన్ చెసుకోవాలి...ఒక్కోసారి టాయిలెట్ కి వెళ్లడం కూడా మర్చిపోయి అది కూడా ఇంట్లోనే చేసేస్తుంది..ఒకటా రెండా ఎన్నని చెప్పను ఇబ్బందులు" అని వినయ్ మీద గట్టి గట్టిగా అరిచింది. శాంత స్వభావి అయిన వినయ్ మాత్రం నవ్య కి చిన్నగా నచ్చచెప్పాలని చూస్తున్నాడు " నవ్యా నీ డెలివరీ అప్పుడు నువ్వెంత కంగారు పడ్డావో మర్చిపోయావా..మీ అమ్మ కి మోకాళ్ళ నొప్పులు కదలలేదు..డెలివరీ అప్పుడు ఎలా అని కంగారు పడుతుంటే మా అమ్మ ఎంత ధైర్యం చెప్పింది నీకు..పురుటికి పుట్టింటికి కూడా పంపించకుండా ఇక్కడే ఉంచుకొని సొంత తల్లి కంటే ఎక్కువగా నీకు సేవలు చేసింది కదా" అన్నాడు బాధగా. "ఆహా, నేనేమైన చేయమన్నాన.. ఆవిడకి ఇష్టమై ఆవిడే చేసుకుంది" అని నిష్టురంగా అంది నవ్య. "అది తన బాధ్యత అనుకుంది కాబట్టి కష్టమైనా కానీ ఇష్టం గా చేసింది. ఇపుడు మా నాన్న గారు కూడా లేరు..ఈ పరిస్థులలో ఒక్కగానొక్క కొడుకుని నేను కాక పోతే అమ్మ ని ఎవరు చూసుకుంటారు? నువ్వేన్నైనా చెప్పు ఏమైనా అనుకో నేను మాత్రం అమ్మని రేపు ఇక్కడికి తీసుకొస్తున్నా" అని దృడంగా చెప్పి ఇక వాదించడం ఇష్టం లేక అక్కడనుండి వెళ్ళిపోయాడు వినయ్. మరుసటి రోజు అత్తగారు శాంతమ్మ ఇంటికి వచ్చింది మొదలు నవ్య ఆవిడని ఏదొక సూటిపోటి మాటలు అంటూనే ఉంది..ఆవిడ ఏం చేసిన విసుక్కునేది..నిప్పుల కుంపటి మీద కూర్చున్నట్లు చిటపటలాడుతుండేది. మనవడు నానమ్మ తో ఆడుకోవాలి, కబుర్లు చెప్పాలి అని ఆవిడ దెగ్గరికి వెళ్తున్నా.. నవ్య మాత్రం వాడిని దూరం ఉంచేది..ఆ మందులు హాస్పిటల్ వాసనలు నీకెందుకురా అని. కొన్ని రోజులకు మందుల వల్ల శాంతమ్మ గారి ఆరోగ్యం కాస్త కుదుటపడినా..కోడలు అనే మాటలకు మానసికంగా కృంగిపోయింది..తల్లికి భార్య కి మధ్య నలిగిపోతున్న కొడుకుని చూసి..ఇక వారికి భారం అవ్వడం ఇష్టం లేక తనకు తానే ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ కి వెళ్లిపోయింది. వినయ్ ఎంత బ్రతిమాలిన శాంతమ్మ సున్నితంగా వారించింది. తల్లిని తిరిగి ఇంటికి తీసుకురావడానికి వెళ్లిన వినయ్ తో "నేను ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంటేనే అందరికి మంచిది నాన్న..మీరూ నేను ప్రశాంతంగా ఉండొచ్చు..నాకు ఇక్కడ ఏ ఇబ్బంది లేదు..నా ఈడు వాళ్ళు ఉన్నారు ఒకరికొకరం తోడుగా ఉంటాము, మంచి డాక్టర్స్ ఉన్నారు వాళ్లంతా నన్ను బాగా చూసుకుంటారు. నువ్వేమి కంగారు పడకు బాధపడకు" అని కొడుకుకి నచ్చచెప్పి ఇంటికి పంపించేసింది. భార్య కి అర్ధం అయ్యేలా ఎలా చెప్పాలో తెలియని వినయ్.. నవ్య వాళ్ల అమ్మ సులోచనకి ఫోన్ చేసి జరిగినదంతా చెప్పాడు. ఇదంతా విన్న సులోచన నవ్య ప్రవర్తనకి చాలా ఆశ్చర్యపోయింది. "నువ్వు బాధపడకు బాబు ఒక్క పది రోజులు ఓపిక పట్టు నవ్య కి అర్ధం అయ్యేలాగా నేను చెప్తాను.. వీలైనంత తొందరలో మీ అమ్మగారిని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేద్దాం అని వినయ్ కి భరోసా ఇచ్చింది". నాలుగు రోజుల తరువాత సులోచన నవ్య కి ఫోన్ చేసి " అమ్మా నవ్యా నాకు ఆరోగ్యం అసలు బాగుండడం లేదు మోకాళ్ళ నొప్పులు బాగా ఎక్కువైపోయాయి అడుగు తీసి అడుగు వేయిలేకపోతున్నాను దీనికి తోడు నరాల బలహీనత కూడా మొదలైంది , నేను పనిలో కొద్దో గొప్పో సహాయం చేసినన్ని రోజులు నన్ను బాగా చూసుకున్న మీ వదిన..ఇపుడు ఏ పని చేయలేక మూలపడ్డ నన్ను అనరాని మాటలంటుందమ్మ.. నా మనవలని కూడా నా దగ్గరకు రానివ్వడం లేదు..నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అని భోరున ఏడిచింది" తల్లి పడుతున్న కష్టాలు విన్న నవ్య.."ఇంత జరుగుతున్నా కానీ నాకెందుకు చెప్పలేదు? ఉండు వదిన సంగతి నేను చూసుకుంటాను" అని తన వదిన సౌమ్య ని చెడామడా తిట్టేయలని పుట్టింటికి బయలుదేరింది. కాని అక్కడికి వెళ్ళాక జరుగుతున్నది చూసి ఆశ్చర్యపోయింది. మంచం నుండి లెవలేక ఇబ్బంది పడుతున్న సులోచనని సౌమ్య కంటికి రెప్పలా చూసుకుంటుంది..ఆమె అసలు కాలు కిందపెట్టనివ్వకుండా.. బాత్రూం కి కూడా మంచం దెగ్గరే ఏర్పాటు చేసి చంటి పిల్లల్ని చూసుకున్నట్లు జాగ్రత్తగా ప్రేమ గా చూసుకుంటుంది. కొడలి సపర్యలతో మనవల ముచ్చట్లతో అంత అనారోగ్యం గా ఉన్నా కానీ సులోచన హాయిగా నవ్వుతూ చాలా ఆనందంగా ఉంది . తల్లి ఆనందం చూసిన నవ్య కి తన అత్తగారి మొహం లో కనిపించిన బాధ గుర్తొచ్చింది... "అమ్మ చెప్పిన మాటలకే బాధపడిపోయి వదినని తిట్టాలని వచ్చాను నేను.. కానీ నేనేం చేసాను..తల్లి లాగా అన్ని సేవలు చేసిన అత్తగారిని ఎన్ని మాటలన్నాను ఎంత క్షోభపెట్టను... ఛీ నా మీద నాకే అసహ్యం వేస్తుంది" అనుకొని తల్లి ఒళ్ళో వాలిపోయి భోరున ఎడవసాగింది. నవ్య ఏడుపు కి కారణం అర్ధమైన సులోచన నవ్య తల నిమురుతూ " చూడమ్మా నవ్య ముసలితనం అనేది మరో బాల్యం తో సమానం.చంటి పిల్లలు ఏం చేసినా తల్లి ఎంత సహనం తో ఓర్పుతో ప్రేమగా వాళ్ళని లాలిస్తుందో .. వయసుమీదపడి ఒంట్లో ఊపికలేక జీవితం చరమాంకం లో ఉన్న మమ్మల్ని కూడా మీరు అంతే ఓపికగా ప్రేమగా చూసుకోవాలి... రేపు నువ్వు పెద్దయ్యాక , మీ అత్తగారి కి నువ్వు చేసినట్లే నీ కోడలు నీకు చేస్తే నీకెలా ఉంటుందో ఆలోచించుకో.." అన్నది వింటున్న నవ్య మొహం లో ఒక్కసారిగా భయం బాధ పశ్చాత్తాపం కలగలిసి కనిపించాయి. "ఊహించడానికే భయం వేస్తుందమ్మా.. నేనెంత మూర్ఖంగా ప్రవర్తించానో నాకు అర్ధమైంది.. నేనన్ని మాటలన్నా తిరిగి నన్ను ఒక్క మాట కూడా అనకుండా మాకు ఇబ్బంది కలగకుండా దూరం గా వెళ్లిపోయిన అత్తగారి గొప్పతనం కూడా తెలిసొచ్చింది..వెంటనే వెళ్లి మా అత్తగారిని ఇంటికి తీసుకొచ్చి నా తప్పు సరిదిద్దుకుంటాను" అని పరుగు లాంటి నడక తో ఓల్డ్ ఏజ్ హోమ్ కి బయలుదేరింది నవ్య. తల్లిని గురించిన ఆలోచనలతో బాధగా ఇంటికి వచ్చిన వినయ్ కి ఇంట్లోకి రాగానే...నవ్య సంతోషంగా అత్తగారికి, కొడుకు కి అన్నం తినిపిస్తుంటే.. మనవడితో నవ్వుతూ కబుర్లు చెప్తున్న తల్లి కనిపించింది. ఇంటికి తిరిగొచ్చిన తల్లి కళ్ళలో ఆనందం చూసి ... నవ్య కి తన బాధ్యత అర్ధం అయ్యేలా చేసిన సులోచన కి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు వినయ్. చెమర్చిన కళ్ళ తో తల్లి కొడుకు తో కబుర్లు చెప్తూనే థాంక్యూ అన్నట్లు నవ్య వైపు చూసాడు.. తప్పు నాదే అని నీరు నిండిన కళ్ళతో క్షమాపణ అడిగింది నవ్య.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు