చక్రపురానికి రాజు విజయసేనుడు. ఆయన కళాపోషకుడు.సంగీతమంటేప్రాణం.కళాకారుల్ని ఘనంగా సత్కరిస్తాడు. కళాపోషణ ఉత్తమ లక్షణమన్నది ఆయన అభిప్రాయం. ఎందరో సంగీతవిద్వాంసులు రాజును దర్శించి,వారి ప్రతిభను ప్రదర్శిస్తూ ఉంటారు. ఎవరి ప్రతిభ వారిదే! వింటూ ఆయన మైమరచిపోతాడు. కానుకలిచ్చి సత్కరిస్తాడు. కేశవుడనే యువకుడు రాజదర్శనార్దం రాజధానికి వచ్చాడు. కానీ రాజును కలవడం అంత సులభంకాదని అర్థమయింది. లంచాలడిగిన రాజభటులకు లంచాలిచ్చి రాజదర్శనానికి అనుమతి సంపాదించాడు. రాజు ఎదుట కేశవుడి సంగీతప్రదర్శనకు ఏర్పాట్లు జరిగాయి. వాయిద్యపరికరాలతో కచేరీ ప్రారంభించాడు కేశవుడు. రాజు వెంటనే ఉలిక్కిపడ్డాడు. కారణం కేశవుడు విషాదరాగంతో ప్రారంభించాడు. సంగీతవాయిద్యాల స్వరాలన్నీ విషాదాన్ని పలికిస్తున్నాయి.ఆసంగీతం శవాల ఊరేగింపును గుర్తుకుతెస్తోంది. విజయసేనుడు వినలేక ఆపమని అరిచాడు. అక్కడంతా నిశ్శబ్ధం ఆవరించింది."రసానుభూతితో నింపి, నన్ను నేను మరిచిపోయేలా సంగీతస్నానం చేయిస్తావని ఆశించాను. నువ్వు చేస్తున్నదేమిటి?" కోపంగా అన్నాడు విజయసేనుడు. కేశవుడు వినయంగా "మహారాజా!మిమ్మల్ని పరవశింపజేసే అద్భుతమైన సంగీతాన్ని నామనసు, పరికరాలు అందించగలవు. కానీ ఈరోజు ఇవి విషాదంతో నిండి పోయాయి.ఆనందానుభూతిని కల్గించే సంగీతాన్ని పలకాలంటే అవి ఆనందంగా ఉండాలికదా!"అన్నాడు. కేశవుడిమాటల్లో ఏదో మర్మముందని రాజు గ్రహించాడు. "కేశవా!వాటికొచ్చిన కష్టమేమిటి? నీఅభిప్రాయమేమిటో సూటిగా, స్పష్టంగా చెప్పు."అన్నాడు రాజు. "మహారాజా!రాజ్యమంతటా లంచగొండితనం, అవినీతి పేరుకుపోయింది. చిన్న ఉద్యోగులనుంచి పెద్దఅధికారివరకూ అవినీతిలో మునిగి ఉన్నారు. మీదాకా విషయం రాకుండా జాగ్రత్తపడుతున్నారు. రాజసేవకులకు వ్యతిరేకంగా చెప్పే ధైర్యం సామాన్యులకెక్కడిది?మీకు, మంత్రివర్యులకూ విషయం చెబితే లంచగొండులనుండి ప్రమాదమని ప్రజలు భయపడుతున్నారు.మీదర్శనానికి నేను విరివిగా లంచం సమర్పించుకుని వచ్చాను. ప్రజలు అంతటి విషాదంలో ఉంటే నావాయిద్యాలు మధురమైన ఆనందరాగాలను ఎలా పలుకుతాయి?"అన్నాడు వినయంగా కేశవుడు. ఇదివింటూనే విజయసేనుడి ముఖం గంభీరంగా మారిపోయింది. ఆయన కేశవుడి వంక మెచ్చుకోలుగా చూసి "నాకు నిజంచెప్పటానికి నీవు ఎన్నుకున్న పద్దతి,నేర్పు,సమయస్పూర్తి,ధైర్యసాహసాలు అభినందనీయం. ఇకమీదట ఇలాంటివి జరగకుండా నా బాధ్యతగా భావిస్తాను. నేనది సాధించేవరకూ సంగీతం వినను. రాజ్యంలో అవినీతి, లంచగొండితనం మాసిపోయాయని నీవు భావించిననాడు నీసంగీతాన్ని వినిపించు. అంతవరకూ నేను సంగీతానికి దూరంగా ఉంటాను"అన్నాడు. ఆతర్వాత ఏడాది కేశవుడి సంగీతంలో విషాదరాగాలులేవు.రాజు ఆనందభరితుడయ్యాడు. కేశవుడిని అనేకకానుకలతో ఘనంగా సత్కరించాడు.