ఒకసారి రామేశం,భీమేశం అనే ఇద్దరు యువకులు బ్రతుకు తెరువుకోసం పల్లెటూరు నుండి నగరానికి వలస పోతూ మార్గమధ్యంలోని ఒక అడవిలో ఒక చెట్టుక్రింద విశ్రాంతి తీసుకోడానికి కూర్చొని నగరంలో వాళ్ళ భవిష్యత్ ఎలా ఉండాలో ఊహించుకొని మాట్లాడుకుంటున్నారు. "మనం నగరంలో కష్టపడి పనిచేసి వచ్చిన డబ్బులు పొదుపుగా ఖర్చు చేసి ఎక్కువ డబ్బులు మన కుటుంబాలకు పంపాలి" "అవును మన మీద కోటి ఆశలు పెట్టుకున్న మన తలుదండ్రుల నమ్మకాలను వమ్ము చెయ్యరాదు" "సెలవు రోజుల్లో కాలినడకనే నగరమంతా తిరిగి నగర వింతలూ వినోదాలు చూడాలి" "వీలైతే అనాథలకు,పేదసాదాలకు సాయం చెయ్యాలి" "మంచి ఆహారం తీసుకొని ఆరోగ్యంగా ఉండాలి" "మంచి బుద్ధులు పెంచుకొని మన పల్లెటూరుకు మంచి పేరు తేవాలి" ఇంతలో భయంకరమైన ఆకారంలో ఒక పెద్ద రాక్షషుడు ఆ చెట్టుమీద నుండి క్రిందకు దూకి ఇలా అన్నాడు "మీరు అవన్నీ చెయ్యాలంటే ముందు నా నుండి తప్పించుకొని బ్రతికి బట్టగట్టాలి కదా!" ఆ యువకులు ఏమాత్రమూ బెదరకుండా....ఇలా అన్నారు "మిత్రమా మిమ్మల్ని చూస్తుంటే మా అవ్వ చెప్పిన కథలోని బ్రహ్మరాక్షసుడు గుర్తుకొస్తున్నాడు" "నిజంగా నిజమే మీరు బ్రహ్మరాక్షసులే" ఆ రాక్షషుడు బిగ్గరగా నవ్వుతూ...ఇలా అన్నాడు "అవును నేను రక్షాసుడునే ఇప్పుడు మిమ్మల్ని తినేస్తాను నాకు బాగా ఆకలిగా వుంది" అందుకు ఆ యువకులు ఇద్దరూ ఇలా అన్నారు "మిత్రమా నేను అటుకుళ్లు,పరమాన్నం తెచ్చుకున్నాను" "మిత్రమా నేను పులిహోరా,పాయసం తెచ్చుకున్నాను" రాక్షషుడు నొసలు చిట్లించి..ఇలా అన్నాడు "అయితే ఏమంటారు!!!" యువకులు ఇలా సమాధానం చెప్పారు "మేము తెచ్చుకున్న ఆహారం తిన్న తరువాత మేము ఇంకా రుచికరంగా ఉంటాం" రాక్షసుడు ఒక్క క్షణం ఆలోచించి...ఇలా అన్నాడు "మీ పొట్టలోకి ఆ ఆహారం పోతే దాని రుచి పాడైపోతుందిగానీ ముందు ఆ ఆహారాన్ని నాకివ్వండి తినేస్తాను తరువాత మీ పని పడతాను" ఇద్దరు యువకులూ తాము తెచ్చుకున్న అటుకుళ్ళు,పరమాన్నం,పులిహోరా,పాయసం రాక్షసుడు ముందు ఉంచారు. రాక్షసుడు వాటిని తినేసి బ్రేవ్ మని త్రెంచి కూర్చున్నచోటే కూలబడి గుర్రుపెట్టి నిద్రపోయాడు ఇంతలో చెట్టు మీద నుండి ఇక చిలుక ఇలా అంది "ఓ పల్లెటూరు యువకులారా ఇంకా ఏమి ఆలోచిస్తున్నారు,రాక్షసుడు నిద్రపోతున్నాడు ఇక మీరు అడవి నుండి పారిపోండి" యువకులు ఒకరిమొహం ఒకరు చూసుకొని ఇలా అన్నారు. "చిలుక మిత్రమా!మీ సలహాకి ధన్యవాదాలు..కానీ ఇతడు మమ్మల్ని తినాలని ఎంతో ఆశతో వున్నాడు అతని ఆశను నిరాశ చేసి మేము పారిపోవడం అన్యాయం కదా! "అవును మేము తప్పకుండా ఇతనికి ఆహారమై ఇతని ఆకలి తీర్చుతాం,పరోపకారచర్యతో చనిపోవుటా ఉత్తమమేనని మా అవ్వ చెబుతుండేది" అంతలో రాక్షసుడు నిద్రనుండి లేచి,ఇంకా అక్కడే వున్న యువకుల్ని చూసి ఆశ్చర్యపోయి ఇలాఅన్నాడు "మిత్రులారా మీ నిజాయితీని మెచ్చాను,పైగా మంచి రుచికరమైన ఆహారాన్ని నాకు ఇచ్చారు,నా ఆకలి తీరింది,చాలా కాలం తరువాత మంచి నిద్రకూడా పట్టింది,మీకు స్వేచ్ఛనిచ్చాను,ఈ అడవి నాది మీకు నచ్చిన పండ్లు,కాయలు, ఆకులు అలములు తీసుకొని నగరానికి బయలుదేరండి మీకు అంతా శుభమే జరుగుతుంది" చిలుక రాక్షసుడ్ని మెచ్చుకొని...ఇలా అంది "తథాస్తు...!విజయీభవ యువుకులారా క్షేమంగా వెళ్లి లాభంతో రండి" యువకులు రాక్షసుడికి,చిలుకకి దండం పెట్టి, ధన్యవాదాలు తెల్పి నగరం వరకూ ప్రయాణ కాలానికి మాత్రమే తమకు అవసరమైన పండ్లుని అడవినుండి సేకరించుకొని ప్రయాణం కొనసాగించారు.