అందం - sitarama rao kodali

Andam

సుమిత్ర తనకొచ్చిన నాలుగు లైన్ల ఆ ఉత్తరాన్నిఎన్నిసార్లు చదువుకుందో లెఖ లేదు అది వచ్చిన నాలుగు గంటల్లో. అన్ని సార్లు చదవటానికి కారణం అందులో వున్న నాలుగు లైన్ల కన్నా వాటి వెనుక వున్న భావం,అసలు ఉత్తరానికి కారణమైన పదిరోజుల నాటి సంఘటనే.తన పేరున బేంకు చిరునామాకి వచ్చిందా వుత్తరం.

సుమిత్ర బేంకులో పనిచేస్తోంది.అమె భర్త ప్రభుత్వ ఉద్యోగి. వారికొక్కత్తే కూతురు. తన గురించి పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు . అలా పెళ్ళిచూపులకొచ్చిన పెళ్ళికొడుకు నించే ఆ ఉత్తరం. భర్తకి,కూతురుకి,వరుడు కి కూడా ఈ సంబంధం ఇష్టమే. తనే ఏ నిర్ణయం తీసుకోలేకపోతోంది. తమ అభిప్రాయాన్ని తెలియచేయకముందే అతనీ ఉత్తరం రాసాడు.అతనా ఉత్తరంలో రాసింది కూడా తను ఏ సంఘటన వల్ల నిర్ణయం తీసుకోలేకపోతోందో దాని గురించే. ఆ ఉత్తరంలో అతను రాసిన దాన్నిబట్టి అతని వ్యక్తిత్వాన్ని అంచనా వేయలని ప్రయత్నిస్తోంది. అందుక్కారణమైన ఆ నాటి సంఘటన ఆమె మర్చిపోలేకపోతోంది. ఆ రోజునించీ ఆమెని వెంటాడుతోంది.

నెలరోజుల క్రితం ఏం జరిగిందంటే…

###

తన తల్లికి బాగాలేదని విజయవాడ వెళ్ళింది సుమిత్ర. ఆమె తండ్రి చాలా కాలం క్రితమే చనిపోయాడు. తల్లికి ఆయన పెన్షన్ వస్తుంది.సొంత ఇల్లు,చుట్టుపక్కల అందరూ పరిచయం వుండటం, బంధువులు కూడా దగ్గిరలోనే వుండటంతో ఆవిడ విజయవాడ విడిచి రావటానికి ఇష్టపడలేదు. కూతురు,అల్లుడు ఎన్నో సార్లు చెప్పారు తమ దగ్గిరకి వచేయమని. ఆవిడ సున్నితంగా తిరస్కరించింది. ఆవిడ ద్రుష్టిలో ఓపిక వున్నంతకాలం ఇక్కడే వుండాలని. ఆవిడ వెళ్ళటానికి ఇష్టపడకపోటానికి ఆవిడ చెప్పే కారణం “మనింటికి వారాలు చేసుకునే పిల్లలకి ఇబ్బందౌతుం”దని.

ఆమె భర్త ఉన్న రోజులనించీ అలవాటు అలా కొంతమందికి వాళ్ళింట్లో భొజనం ఏర్పాటు చేయటం. చదువుకునే పేదవాళ్ళ పిల్లలకి వారంలో ఒకరోజు అలా ఏర్పటు చేసేవారు. గమ్మత్తేవిటంటే ప్రతిరోజు ఒకరు వుండేవారు. అలా చదువుకుని ఉద్యోగాలు చేసే చాలా మందిని వాళ్ళు కోరేది ఇలాగే వారుకూడా ఇతరులకి సహాయం చేయమనే.

రెండు రోజులుంటే చాలనుకుని వెళ్ళిన సుమిత్ర పదిహేను రోజులు ఉండిపోవల్సివచ్చింది.తల్లికి కొంత ఓపిక వచ్చాక బయల్దేరింది విశాఖపట్నం.

తన కూతురు రిజర్వ్ చేయించింది జన్మభూమిలో చైర్ కారులో. తనొక్కతే బయలుదేరితే సెకండ్ సిట్టింగ్ లో వెళ్ళాలనుకుంటుంది.ఏసి లో ప్రయాణం ఒంటరిగా వున్నట్టుంటుంది తనకి.కానీ కూతురు,భర్త అంటుంటారు సుఖంగా ప్రయాణం చేయాలని. ఆ రోజు తనకి చివరి వరుసలో సీట్లు వచ్చాయి.ఎదురుగా వున్న సీట్లో ఒక యువకుడు కూర్చున్నాడు.పాతికేళ్ళుంటాయి. చేతిలో పుస్తకం చదువుతున్నా అతని ద్రుష్తి ఎక్కువగా బైట ప్రక్రుతిని చూడటం లేదా తనని చూడటం గమనించిందామె.తనూ పుస్తాం చదువుతూ అప్పుడప్పుడూ తల పైకెత్తినప్పుడు తనవంకే చూస్తున్నట్టు గమనించిందామె. అలాంటి చూపులు తనకి అలవాటే చిన్నప్పటినుంచీ. అయితే ఇప్పుడు ఇబ్బందిగా అనిపించింది. కానీ అతని చూపులో చెడు లేదు.

తను అందంగా వుంటానని తనకి తెలుసు.అందువల్ల తనని కట్నం లేకుండా చేసుకున్నాడు తన భర్త అద్రుష్టవశాత్తూ తన భర్త కూడా బాగుంటాడు.ఈ రోజు దాకా తనని బాగా చూసుకుంటున్నాడు కూడా.

నిజానికి తన కూతురికి తన అందం రాలేదు కానీ బాగుంటుంది.ఇంజినీరింగ్ చదివింది.విశాఖపట్నంలోనే ఉద్యోగం వచ్చింది రేపు తన కూతురికి పెళ్ళి చూపులు. అందుకే ఈ రోజు బయల్దేరింది. పెళ్ళికొడుకు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ హైద్రాబాదులో.ఇతన్ని చూస్తే అతని లాగే వున్నాడు. ఇలాంటివాడికి తన కూతుర్ని ఇవ్వడమా అనే ఆలోచనలో పడింది. అయినా అతనూ ఇతనూ ఒకటి కాదేమోలే అని మనసుకి సర్దిచెప్పుకుంది.ప్రయాణం చేసినంత సేపూ అతను తనని గమనించటం చూస్తూనే వుంది.

@@

మరునాడు పెళ్ళిఛొపుల కొచ్చిన అతన్ని చూసి ఆశ్చర్యపోయింది .రైల్లో తన ఎదురుగా కూచున్నతనే! కూతురికి ఇష్టమైనా ఇతనితో పెళ్ళికి ఒప్పుకోకూడదు అనుకుంది. అతనితో పాటు అతని అక్క బావ వచ్చారు.వాళ్ళు ఈ వూళ్ళోనే వుంటారట. అమ్మాయి నచ్చిందన్న విషయం అక్కడే చెప్పేశారు వాళ్ళు.తమ నిర్ణయం అమ్మయిని సంప్రదించి చెప్తామని చెప్పారు.

అటు చూస్తే వాళ్ళ కుటుంబం మంచిది.పెళ్ళికొడుకు వంక పెట్ట వీల్లేనంత అందగాడు.అప్పటికే తన భర్త వాళ్ళ కుటుంబం గురించి తన స్నేహితుడి ద్వారా వివరాలు సేకరించాడు.ఏ వంక పెట్టడానికీ వీల్లేదు.కానీ రైల్లో తన అనుభవం అడుగు ముందుకు వేయనీయటం లేదు.తన వాళ్ళకి ఆ విషయం చెప్పలేకపోతోంది.

రైల్లో అతను తనని తదేకంగా చూస్తూవుండటం అతని వ్యక్తిత్వాన్ని తక్కువగా అనుకునేలా చేస్తోంది.భర్తకీ,కూతురికీ బాగా నచ్చిందా సంబంధం.తను ఏం మాట్లాడకపోవటంతో తనకి నచ్చలెదని కూతురు భావించింది. అందుకే ఈ వేళ ఉదయం చెప్పింది “ నీకు కూడా నచ్చితేనే పెళ్ళి చేసుకుంటానమ్మా. నువ్వు దాని గురించి మర్చిపోమ్మా.”

బేంకుకి రాంగానే ఈ వుత్తరం వచ్చింది.మరో సారి చదువుకుందా ఉత్తరం. అతని వ్యక్తిత్వం స్పష్టంగా అర్ధమయ్యిందామెకి.

“అత్తయ్యగారికి,నమస్తే,రైల్లో నా ప్రవర్తన మీకు అసహ్యం కలిగించి వుండవచ్చు. నన్ను మీరు అపార్ధం చేసుకునే ఆవకాశం ఎక్కువ వుంది. అందువల్లే నచ్చిందన్న మాట మీ నుంచీ వారం రోజులైనా రాకపోవటానికి కారణం అనుకుంటున్నాను. అందం ఎవరినైనా ఆకర్షిస్తుంది.పసివాళ్ళ బొసినవ్వు,సూర్యోదయాస్తమయాలు,నీలి ఆకాశం,మంచు బిందువులతో తడిసిన పూలు,ఆకులూ,మంచుకొండలూ- ఇవన్నీ ఎవరినైనా అకర్షిస్తాయి. కానీ సొంతం చేసుకోలేరెవరూ. చూసి ఆనందించాలంతే. అలాంటిదే మీ అందం! ఆ ద్రుష్టితోనే చూశాను తప్ప నాలో వేరే ఏ వుద్దేశ్యం లేదు.మీ అమ్మాయి నాకు నచ్చిందని చెప్పేసాము.ఇక మీ నిర్ణయమే వుంది. మీ ఇష్టం.”

సుమిత్ర ఒక నిర్ణయానికి వచ్చింది. అతనిలో నిజాయితీ వుందని.తన ఆలోచన తప్పు. తనకూతురు అతనితో సుఖంగా వుంటుంది.వెంటనే కూతురుకీ, భర్తకీ చెప్పేసింది తనకా సంబంధం ఇష్టమని.

ఆ ఉత్తరం చించేసింది.తన మనసు ప్రశాంతంగా వుందిప్పుడు.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు