మనం మారాలి - B.Rajyalakshmi

Manam marali

“అదేమిటయ్యా పండగ పూట దాన్ని పట్టుకుని ఆలా సాధిస్తావు !”అని గదిలోపలికి వెళ్లి జానకమ్మ వారించే లోపే మాలతి చెంప ఛెళ్ళుమనిపించి కేశవ సర సరా వీధిలోకి వెళ్లిపోయాడు! డ్రాయింగ్ రూమ్ లో కూర్చుని టీవీ చూస్తున్న నీలిమ ,నరేష్ ఒక్కసారిగా బిత్తరపోయారు . “ ఎరక్క పోయి చేసాం యీ సంబంధం ! పండగ పూట మా కళ్లముందే చెయ్యి చేసుకుంటాడా !!పెళ్లయిన తర్వాత బిడ్డ ఒక్కనాడైనా సుఖపడలేదు “అంటూ జానకమ్మ మాలతిని దగ్గర తీసుకుని ! చంక లోని పిల్లకు పాలిస్తూ “ఏం చేస్తామమ్మా !ఆయనకు ముక్కు మీద కోపం !తొందరపాటు స్వభావం !” కన్నీళ్లు తుడుచుకుంటూ నవ్వడానికి ప్రయత్నించింది మాలతి ! “నువ్వు చెప్పకపోయినా మాకన్నీ తెలుసమ్మా!వయసు దాటుతుందన్న భయం తో ఆ శనిగ్రహం మాట నమ్మి తొందర పడి నీ గొంతు కోసాం !”జానకమ్మ కన్నీళ్లు పెట్టుకుంది ! నరేష్ వుండబట్టలేక “అయినా పిన్నీ అన్నానని యేమనుకోకు!!! యెంతసేపూ జాతకాలూ చూడ్డం తప్ప అసలు యోగ్యుడా కాదా,కనీసం కొంతయినా అతనిని గురించి వాకబు చెయ్యలేదు !యీ సంబంధం తప్పితే మాలతక్కయ్యకు పెళ్ళికాదన్న తొందర లో భయపడ్డావు !చూడు యిప్పుడు ?”అన్నాడు . “అందుకే కదా యిప్పుడనిభవిస్తున్నాం! పెళ్ళికి తొందర పడ్డాం కానీ దాని జీవితాన్ని ఆలోచించలేదు !తప్పు మాది కానీ శిక్ష అనుభవిస్తున్నది నా పిచ్చి తల్లి !”జానకమ్మ ఆవేదన తో అన్నది . “కనీసం నీలిమ పెళ్లి అన్నీ కనుక్కుని చేయండి”అన్నాడు నరేష్ ! “మాకు బాగా బుద్ధి వచ్చింది !నీలిమ పెళ్లి తొందరపడం !బాగా చదివిస్తాను ,యోగ్యుడు దొరక్కపోయినా,దానికి యిష్టం లేకపోయినా పెళ్ళిచెయ్యం ! మళ్లీ మాట్టాడితే హాయిగా వుద్యోగం చేసుకుని దాని బతుకు అది బతుకుతుంది “జానకమ్మ అన్నది . నరేష్ పిన్ని నిర్ణయానికి చాలా సంతోషించాడు !ఆడపిల్లకు పెళ్లి విషయం స్వేచ్ఛ యివ్వాలి ,యెంత కట్నం అయినా యిచ్చి తొందరగా వివాహం చెయ్యాలన్న ఆలోచన గబగబా అత్తారింటికి పంపాలన్న ఆందోళన తగ్గినందుకు నరేష్ సంతోషించాడు జానకమ్మ భర్త రామయ్య గారికి ముగ్గురూ ఆడపిల్లలు !పెద్దమ్మాయి గౌరి కి తెలిసిన సంబంధం యిచ్చారు ! ఆ అమ్మాయి కాపురం బాగుంది !సమస్యలు లేవు ! రెండో అమ్మాయి మాలతి అబ్బాయి వుద్యోగం చూసి పెద్దగా వాకబు చెయ్యకుండా పెళ్ళిచేసారు ! కేశవ్ చాలా కోపిష్టి ! అతని దృష్టి లో ఆడది అణగి మణిగి వుండే ఒక బానిస !భార్య అంటే వంటలక్కో పనిమనిషో ! అంతే! మొదట్లో మాలతి ప్రశ్నించేది ! ఫలితం దెబ్బలు !! రాను రాను అలవాటు పడిపోయింది ! కారణం లేకుండా బిసుక్కోవడం కొట్టడం ! మాలతి మనసు విరిగిపోయింది !భర్త హింసలు భరిస్తూ కాపురం చేసుకుంటున్నది ! జానకమ్మ కంట తడిపెట్టని రోజు లేదు ! ఏం ప్రయోజనం ! ఆఖరి పిల్ల నీలిమ విషయం లో జాగ్రత్త పడాలనుకున్నారు! మూడు సంవత్సరాలు గడిచాయి ! నీలిమను పెద్దపిల్లలిద్దరిలాగా కాకుండా డిగ్రీ దాకా చదివించారు ! మళ్లీ అందరి ఆడపిల్లలాగా పెళ్ళిసంబంధాలు వెదకడం మొదలు పెట్టారు !నీలిమ మనసు మాత్రం కనుక్కోలేక పోయారు !!!!! నీలిమ తన చిన్న నాటి స్నేహితుడు రవి తో స్నేహం గా వుండేది! అతను అంతే !యవ్వనం హద్దులు దాటకుండా తిరిగేవారు ! ఎప్పుడైతే సంబంధాలు వెదకడం మొదలయ్యిందో అప్పటినించి నీలిమకు తన జీవితం అర్ధం అయ్యింది ! రవి కూడా నీలిమను యిష్టపడ్డాడు!! కానీ నీలిమ నరేష్ సాయం కోరాలనుకుంది! ఎవరికీ తెలియకుండా అతనిని ఇంటికి పిలిపించింది ! నరేష్ వచ్చేటప్పటికి నీలిమ పెళ్లి విషయాలు చర్చిచ్చుకుంటున్నారు ! “ఒరేయి రామయ్యా జాతకాలు బాగా కలిసాయి ! వెంటనే వాళ్లకు చెప్పేసెయ్యి !ముహుర్తాలు పెట్టుకుందాం “అంటూ బామ్మ కొడుకుని ఒత్తిడి చేస్తున్నది ! “బామ్మా అసలు నీలిమను అడిగారా దాని ఇష్టాయిష్టాలు? అది యిప్పుడు మాలతక్కయ్య కాదు “కొంచెం కోపం గా అన్నాడు నరేష్ ! అతనికి నీలిమ అంటే బాగా చనువు! పైగా నీలిమ మనసు తెలుసు కూడా ! “దాని మొహం దానికేం తెలుసు ! మేం యెవరిని చెప్తే వాడిని చేసుకుంటుంది !”జానకమ్మ తన అత్తగారి మాటను బలపరిచింది ! నరేష్ “నీలిమా నీ అభిప్రాయం చెప్పు ! యిది నీ జీవితం ,నీ భవిష్యత్తు ! “అన్నాడు ! నీలిమ కూడా ధైర్యం గా “నాకు రవి అంటే యిష్టం ! మీకు అందరికీ రవి తెలుసు ! ఒకే బళ్లో చదువుకున్నాం ఒకే కాలేజీలో చదివాం ! యిప్పుడు వుద్యోగం కూడా వస్తోంది ! మా యిద్దరి మనస్తత్వాలు ఒకరికొకరికి బాగా తెలుసు ! నన్ను చదివించారు మీరు ! నాకంటూ వ్యక్తిత్వం వుంది “అని నరేష్ వున్నాడన్న ధైర్యం తో ధీమా గా అన్నది ! జానకమ్మ “నీలూ నీకేమైనా మతి పోయిందా ? అతను అనాథ ! గాలికి ధూళికి పెరిగాడు ! మనకు కుదరదు ! నలుగురూ నవ్వుతారు ! బుద్ధిగా మేం చూసిన సంబంధం ఒప్పుకో ! అయినా రాజేష్ కి ఏం తక్కువ ?”కోపం గా కూతుర్ని చూసింది ! రామయ్య కూడా నీలిమ మాటలలో లోతు గ్రహిస్తున్నారు ! కాలం మారుతున్నది !ఆడపిల్లలు పెళ్లి విషయం లో తమ అభిప్రాయాలను చెప్తున్నారు ! వాళ్ల భవిష్యత్తు కదా ! ఆయనకు మొదటిసారి నీలిమ ను అడగకుండా ,మనసు తెలుసుకోకుండా సంబంధం ఖాయం చెయ్యడం సరి కాదు అనిపించింది ! అయన “బంగారూ నిన్ను నొప్పించి యీ పెళ్ళిచెయ్యం తల్లీ ! మాలతి విషయం. లో జరిగిన పొరపాటు నీకు జరగదమ్మా !రవిని రేపు మనింటికి రమ్మను ! అతని తో మాట్లాడుతాను !”అన్నారు ! అంతే! అక్కడ భయంకర నిశ్శబ్దం !”రాముడూ అదేదో తెలిసీ తెలియక మాట్లాడితే నువ్వు తందానా అంటావేమిటి ?దాన్ని ఖడించాల్సింది పోయి అనుకూలం గా మాట్లాడుతావేమిటి ?”అని బామ్మ విసుక్కుంది ! నరేష్ “బామ్మా !నిజం చెప్పు !నీకు పెళ్లయినప్పుడు యేమైనా తెలుసా !తాతయ్య యెలా వుండేవాడు నీతో !”అడిగాడు !

"అవన్నీ యిప్పడెందుకు ---- కట్నం తగ్గింది , వెండి కంచం బరువు తక్కువ వుందని యెంత సాధించే వాళ్లో !! అసలు నాకంటూ ఓక బతుకు వుంటే కదా "బామ్మకు యిన్నేళ్ల తర్వాత కూడా మనసు కలుక్కుమని కన్నీళ్లు వచ్చాయి ! "బామ్మా ఇప్పుడర్ధమయ్యిందా నీకు " అన్నాడు నరేష్ . --------------------------------------------------------
నీలిమ రవిని యింటికి రప్పించింది . ఇంటిల్లిపాది అతని దగ్గర వచ్చారు .
రామయ్యగారు "బాబూ రవీ నిన్నుపిలిపించిన కారణం నీలిమ చెప్పేవుంటుంది ,నీ మనసులో వున్న కోరికలు చెప్పు . తర్వాత మమ్మల్ని అనుకుంటే లాభం లేదు . "సూటిగా ప్రశ్నించారు . "మామయ్యా ,నాకు వున్న ఒకేఒక్క కోరిక నీలిమ నా భార్య కావాలి . నా చదువు నాకు బ్రతుకుతెరువు చూపిస్తుంది . మీరు గుళ్లో పెళ్లి జరిపించినా చాలు . నాకు ఒక్కరూపాయి కూడా అవసరం లేదు "రవి సూటిగా ధైర్యం గా తన అభిప్రాయం చెప్పాడు . రవి ఆత్మవిశ్వాసం ,మనోనిబ్బరత అందరికీ నచ్చాయి . నచ్చలేదు అనడానికి కారణాలు కనిపించలేదు .పెళ్లికి అందరు ఒప్పుకున్నారు . నీలిమా ,రవి కళ్లల్లో కాంతి !1
పెద్దల యిష్టప్రకారం పెళ్లి ఏర్పాట్లు మొదలయ్యాయి . తాను మనసుపడ్డ వ్యక్తి తో తన పెళ్లి !నీలిమ యెంతో తృప్తిగా వుంది . ఆడవాళ్లకు స్వేచ్ఛా ,స్వాతంత్రం కావాలి అనేవాళ్లే కానీ నిజం గా యెంతమంది తల్లితండ్రులు ఒప్పుకుంటారు ?తన వాళ్లు తనల్ని అర్ధం చేసుకున్నారు . వివాహం జరిగింది . నీలిమ ముఖం లో కాంతి కలకాలం నిలవాలని అందరూ ఆ దంపతులను దీవించారు .
ఆడపిల్లకు మనసున్న భర్త తన తోడుగా వుంటే అంతకన్నా ఏం కావాలి !బంగారు భవిష్యత్తును భర్తతో జీవనాన్ని నీలిమ పయనమయ్యింది . రామయ్య గారు ,జానకమ్మ బామ్మ మొదటిసారి తృప్తిగా నిండుమనసుతో తమ బాధ్యతను నెరవేర్చామనుకున్నారు . ఆనందభాష్పాలతో ఆశీర్వదించారు . నరేష్ నవ్వుతూ చెయ్యివుపాడు . మాలతి తనచెల్లిని మనసారా దీవించింది .

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు