గార్దభ ప్రేమాభిషేకం - కందర్ప మూర్తి

Gardabha premabhishekam

అగ్రహారం చాకలిపేట లచ్చన్న ఆడగాడిద మంగీ సోములు మగ గాడిద రాముడు చిన్నప్పటి నుంచి ఒకేచోట పుట్టి పెరిగాయి. యవ్వనం లో కొచ్చి ప్రేమలో పడ్డాయి. మగ గాడిద రాముడు కాస్తంత నల్లగా భారీగా ఉన్నా లచ్చన్న ఆడ గాడిద మంగీ బూడిద రంగుతో అందంగా కనబడుతుంది. ఊరి బయటి పెద్ద చెరువు చాకిరేవు వద్ద లచ్చన్నకీ సోములుకి మద్య వచ్చిన తగవుల కారణంగా సోములు తన మకాం మాలపేటకు మార్చేడు. అప్పటి నుంచి మంగీ, రాముడు ఎడబాటయేరు.చాకిరేవు దగ్గర కూడా సోములు తను బట్టలుతికే బండరాయినీ, మురికి బట్టలు ఉడక పెట్టే కుండగూనను కూడా చెరువు అవతలి ఒడ్డుకి మార్చేసి నందున మంగీ - రాముడు కలుసుకునే అవకాశం లేకుండా కట్టడి చేసారు. అందువల్ల రెండు ప్రేమతో విరహవేదన అనుభవిస్తున్నాయి. అగ్రహారం గ్రామంలో ఈ సంవత్సరం వర్షాలు ఎండ గట్టేసాయి. చైత్ర వైశాఖ మాసాల పెళ్లిళ్ల సీజను పూర్తయి శ్రావణ మాసం వచ్చినా తొలకరి ఎడ్రసు లేదు. భాద్రపద మాసం పౌర్ణమి వెళ్లినప్పటికి నీటి మేఘాల జాడ లేదు. ముందు తొలకరిలో పడిన చిరుజల్లులకు దైర్యం చేసి ఆకులు పోసి వరి ఉడుపులు చేసిన రైతులకు ఆందోళన ఎక్కువైంది. పొలాల్లో తడి లేక వరి ఆకులు మాడు మొదలైంది. పెద్ద చెరువులో నీళ్లు తగ్గి చాకిరేవు వద్ద చాకళ్లకు ఇబ్బంది అవుతోంది. చాకళ్లందరు కప్పల పెళ్లి జరిపించినా ఫలితం కనిపించ లేదు. రైతులందరు ఊరి పురోహితుడు శంకరశాస్త్రి గార్ని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.ఆయన మరొకసారి పంచాంగం పరిశీలించి నా లెక్క ప్రకారం ఈ సంవత్సరం వర్షాలు సమృద్దిగా కురవాలి కానీ మానవ తప్పిదం కారణంగా ఊరి చుట్టూ ఉన్న మామిడి తోటలు సరుగుడు తోటలు జీడి తోటల భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్మడం తో వాటిని కొట్టేసి ప్లాట్లుగా చేసారు. గ్రామం చుట్టు పచ్చగా ఉండే భూములు వట్టిపోయి బీళ్లయాయి. వర్షించే నీటి మేఘాలు దూరంగా పోయి వర్షాలు ఎత్తి గట్టేసాయి. ఈ సమస్య కొక పరిష్కార మార్గం గోచరిస్తోంది. యవ్వన వయసున్న గార్దభాల పెళ్లి జరిపించి ఊరి చుట్టు ఊరేగిస్తే ప్రయోజనం ఉండవచ్చని శాస్త్రి గారు సూచన చేసారు. చాకలి పేటలో వాకబు చెయ్యగా లచ్చన్న ఆడగాడిద మంగి, మాలపేట సోములు మగ గాడిద రాముడు మాత్రమే యవ్వనంలో ఉన్నట్టు మిగతా గార్దభాలు ముసలి , సంతానవతులుగా తెల్సింది. లచ్చన్న సోముల మద్య తగాదాల కారణంగా మంగీ - రాముడి లగ్గానికి వారు ఒప్పుకోలేదు. ఊరి రైతులు మిగతా రజకుల అబ్యర్దన మేరకు ఊరి ప్రయోజనం కోసం రాజీ కొచ్చారు. లచ్చన్న ఆడగాడిద మంగి, సోములు మగగాడిద రాముడి పెళ్లి ఘనంగా జరిపి గ్రామం చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. వాతావరణం ప్రభావమో లేక యవ్వన గార్దభాల పెళ్లి ప్రభావమో వారం రోజుల వ్యవధిలో వర్షాలు మస్తుగా కురవడం మొదలయాయి. రైతుల మొహాల్లో సంతోషం కనబడింది. మంగి - రాముడి ప్రేమ ఫలించింది.లచ్చన్న సోములు వైషమ్యాలు విడిచిపెట్టి బంధువులయారు.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు