మార్పు - రాముకోలా.దెందుకూరు

Marpu

ఛాత్.. ఇలా అయితే చేతి వృత్తులు నమ్ముకున్న వారి పరిస్తితి ఏమిటి..? రోజు మొత్తం కష్టపడితే కనీసం రెండు మూడు వేలుకూడా గిట్టుబాటు కాకపోతే ఎలా! నన్ను నమ్ముకున్న కుటుంబం పరిస్థితి ఏంకాను. ఒకపక్కన ఇంటి అద్దెలు పెరిగిపోతుంటే.. దానికితోడు అపార్ట్మెంట్స్ విపరీతంగా పెరిగి పోతూ..నాలాంటి వాడికి రాత్రి పూట పనులు చేసుకోవడానికి వీలు లేకపోయే... ఏమయ్యో! మన పెళ్ళి రోజు దగ్గరపడుతోంది. ఈ సారైనా రవ్వల నెక్లెస్ కొనేది ఉందా లేదా! నిష్టూరంగా మా ఆవిడ అంటించిన మాటలు సెగ ఇంకా తగ్గలేదు ఉదయం నుండి. అయ్యో! నేను కాలేజిలో చేరగానే కొత్త బైక్ కొనిస్తానంటివి. ఇప్పటికే మూడూ నెలలు గడిచిపోయే. బస్సులో వెళ్లి రావాలంటే ఇబ్బందిగా ఉంది కాస్త దాని సంగతి కూడా గుర్తుపెట్టుకో.. పుత్రరత్నం మాటలు శూలంలా గుచ్చుకున్న సంగతి మరవకముందే. నాన్న మీ అల్లుడు ఫారిన్ వెళ్తడంట. కాస్త ఖర్చులకు సర్దమని రాత్రి ఫోన్ చేసిండు . ఏమని చెప్పను మరి. గుమ్మం దాటుతుంటే వినిపించిన కుమార్తే మాటలు. అందరి అవసరాల చిట్టా విప్పేవారే. ఇవతల సంపాదించేందు ఉన్న మార్గాలు మూసుకుపోతున్నాయి అని తెలుసుకోలేరు ఎందుకో. ఈ డిజిటల్ పేమోంట్స్ వచ్చిన దగ్గర నుండి చేతిపనికి గిరాకీ తగ్గింది. మునుపటిలా గిట్టుబాటు కావడం లేదు ఎం చేయను. ***** పగలంతా ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తూ ఎవ్వరి కనుసన్నల్లో పడకుండా ఎంతో నేర్పుతో సంపాదించింది ఇక లెక్కచూసుకుంటే సరి అనుకుంటూనే. ఈ రోజు నాచేతి వాటంకు చిక్కిన అదృష్టంను ముందేసుకు కూర్చున్నా! అన్నీ చిన్నచిన్న మొత్తాలే.ఒక్కదానిలో కూడాను పెద్దమొత్తం కనపడలేదు. ఈ రోజుకూడా సంపాదించింది తక్కువే అని ఇల్లాలికి లెక్క ఎలా చెప్పాలో అర్థం కాని పరిస్థితి లో చివరగా మిగిలిన సంచి ముందేసుకుని ఒక్కటోక్కటిగా బయటకు తీస్తున్నా. పల్లెటూరి ఆసామి దగ్గర కొట్టేసిన సంచి ముందేసుకుని లోపల చేతులు ఉంచి ఒక్కటొక్కటిగా తీస్తున్నా. మొత్తం ఇరవైనాలుగు వెలరూపాయల డబ్బులు. బంగారం తాకట్టు పెట్టిన రసీదు..పెళ్ళికి వ్రాసుకున్న లగ్గపత్రిక.కొనవలసిన కొత్తబట్టల లిస్ట్ కాయితం. నాన్నా అన్ని తక్కువ ఖరీదులోనే తీసుకో . ఎక్కువ ఖరీదు నాకు అవసరం లేదు.నీకు కూడా ఒక జత బట్టలు తీసుకో అలాగే అమ్మకు ఒక చీర కూడా. చివర్లో వ్రాసిన అక్షరాలు చదవడంతో ఒక్కసారిగా మనస్సులో ఎదో కెలికినట్లు అనిపించింది. బంగారం తాకట్టు పెట్టి పెళ్ళి కార్డులు ,పెళ్ళి బట్టలు తీసుకోవడానికి వచ్చిన పెద్దాయన దగ్గర తాను కొట్టేసిన సంచి ఇది. ఎంత పాపం .ఒక జీవితం నిలపడం కోసం ఒక తండ్రి శ్రమతో సంపాదించిన డబ్బును తాను దోచేసాడు. ఇలా ఎందరి జీవితాలలోని సంతోషాలను దూరం చేసానో కదా. నాకు నా పిల్లల సంతోషం ఎంత ముఖ్యమో వారి పిల్లలు సంతోషం ,వారి జీవితం వారికి ముఖ్యమే కదా. మరి వారి సంతోషాలను ఇలా దోచుకోవడం ఎంత వరకు సమంజసం. తప్పు కదా ఇది. ఎందరు నా వలన ఇలా నష్టపోయారో కదా.. లేదు ఇక ఇలా జరగకూడదు .తను ఇలా వారిని దోచుకోవడం .వారి ప్రాణాలతో చెలగాటం ఆడుకోవడం.అనిపించింది. నా అడుగులు బస్టాండ్ వైపు సాగిపోతున్నాయి. నా తప్పులను సరిదిద్దుకునే సమయం ఇదేనని తెలిసి.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు