రామ్మూర్తి పిసినారి. అన్నంచేత్తో కాకిని కూడా విదల్చడు.పార్టీ ఇవ్వమని కొలీగ్స్ ఆటపట్టిస్తుంటారు.ఆఫీసుకు నడిచి వస్తాడు. నడిచి వెళ్తాడు. నడిస్తే ఆరోగ్యమని సమర్థించుకుంటాడు. ఎప్పటిలాగే నడిచి వస్తున్న రామ్మూర్తికి దారిలో ఒక పర్సు కనపడింది. అటూ ఇటూ దిక్కులు చూశాడు. ఎవరూ గమనించడంలేదని నిర్ణయించుకుని ఠక్కున జేబులో వేసుకున్నాడు. ఎప్పుడూ లేనిది రామ్మూర్తి ఆటోలో రావడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.ఆటో దిగి కాలర్ సవరించుకుంటూ, భుజాలెగరేస్తూ వచ్చాడు రామ్మూర్తి. రాగానే ఓఫోజిచ్చి "చాలాకాలం నుండీ పార్టీ అంటున్నారుగా! ఈరోజు అద్భుతమైన పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను" అన్నాడు. ఆమాటలకు ఆఫీసులోని అందరికీ మూర్చవచ్చినంత పనయింది. నోరెళ్ళబెట్టి వింతగా చూశారు. ఆఫీసర్ అనుమతి తీసుకుని ఏర్పాట్లు చేశాడు.దొరికిన పర్సులోని డబ్బుకాక మరో ఐదువందలు రామ్మూర్తి డబ్బుకూడా ఖర్చయింది.అయితేనేం...ఆఫీసులో అందరూ రామ్మూర్తి ఇచ్చిన పార్టీకి అదిరిపోయారు. "అద్బుతంగురూ!బాగా ఖర్చుపెట్టావు"అన్నారు.ఆమాటలకు ఉబ్బితబ్బిబ్బయ్యాడు. 'ఏమయితేనేం!తనను ఇకమీదట పిసినారి అనరు'అనుకుంటూ ఆనందపడిపోయాడు. సాయంత్రం ఇల్లుచేరిన పిసినారి రామ్మూర్తికి ఊహించని సంఘటన ఎదురయ్యింది. "మన దరిద్రం కాకపోతే పోయిన డబ్బు దొరికినట్లే దొరికి, మళ్ళీ పోవాలా? అంతా ఖర్మ"అంటోంది రామ్మూర్తి భార్య. రామ్మూర్తి కూతురు రాజేశ్వరి బాగా ఏడ్చినట్లు చూడగానే అర్థమవుతోంది. "జరిగిందేదో జరిగిపోయింది. ఏడిస్తే పోయింది వస్తుందా?" అంటూ రాజేశ్వరిని స్నేహితురాలు సునీత సముదాయిస్తోంది. ఏంజరిగిందంటూ అడిగాడు రామ్మూర్తి. "ఏంలేదంకుల్ రాజేశ్వరికి ఫీజుకోసం మీరిచ్చిన రెండువేలరూపాయలనోటు పర్సులో పెట్టుకుని, కాలేజికి వెళ్తూంటే,పర్సు ఎక్కడో జారిపోయింది. అది నాకు దొరికింది.చూడగానే రాజేశ్వరిదని గుర్తుపట్టాను. కాలేజికి వెళ్ళగానే ఇవ్వాలని చేతిలో పట్టుకున్నాను.అదే చేతిలో కట్ చీప్ కూడా ఉంది. ఫ్రెండ్స్ తోమాటల్లో పడి పర్సుమీద మనసు పెట్టలేకపోయాను. నాచేతిలోని పర్సు ఎక్కడో జారిపోయింది. తర్వాత ఎంతవెదికినా దొరకలేదు" అంటూ వివరించింది సునీత. ఆమాటలకు రామ్మూర్తికి చెవుల్లో సీసం పోసినట్లయింది.తనకు పర్సు అదే దారిలో దొరికింది.అందులో రెండువేలరూపాయలనోటు ఉంది. అది తన కూతురు పర్సు అని తెలియక, ఎవరిదని విచారించే ప్రయత్నం చేయకుండా ఆటో ఎక్కి ఆఫీసుకు చేరాడు. దొరికిన సొమ్ముకదా అని ఆఫీసులో పార్టీకోసం ఖర్చు పెట్టేశాడు. ఆపిల్లకున్నపాటి నిజాయితీ తనకు లేనందుకు సిగ్గుతో చితికిపోయాడు రామ్మూర్తి.