మిష్టర్ కోడిపుంజు అండ్ కటిక సాయేబు! - అమ్జద్.AMJAD

Mister kodipunju and Katika sayebu

కోడి ఒక కోనలో .... పుంజు ఒక కోనలో.... పాతపాట పాత గ్రాంఫోన్ రికార్డులో నడుస్తూంది.

కటిక సాయేబు ఓ రెండు మూడు సార్లు పిలిచి ... అరిచాక కండ్లు తెరిచాడు ఓ సింహాసనం పై ధీటుగా ఆసీన్నమై ఉన్న కోడిపుంజు. భారీ శరీరంలో ఉన్న కోడిపుంజు సింహసనం లో ఇమడక తన కటిక భాగమ్ గద్దె చివరి అంచుకు ఆనించి సపోర్టు కోసమ్ కాళ్ళు బారగాచాచి నేల పై కుదించి పట్టుకున్నాడు.

ఇంకా పూర్తిగా నిద్రమత్తు వదలని కోడిపుంజు ఎవడ్రా వీడు... మంచి నిద్ర పాడు చేశాడను కొంటు తెరవలేక ఏ కన్ను తెరచి క్రీగంట చూశాడు సాయేబు వైపు.

సాయేబు చేతిలోని నిగనిగ....దగదగ.... మెరుస్తున్న చేతి కత్తిని చూడగానే కోడిపుంజుకు మత్తులో నిండిన నిద్ర పటాపంచాలైపోయింది.

" ఏందన్న ! గింత పెందరాళ్ళె వచ్చినావ్ ? కోడిపుంజు గద్దద స్వరంతో భయభ్రాంతులై చెప్పాడు.

" పెందరాళ్ళె ముంది ? నీ బొంద.... సూరజ్ (సూర్యుడు) తల పై డాన్స్ చేస్తూండు. రజియా నాశ్తెమె క్యా హై అంటాంది! (అంటుంది) అని సాయేబు ఎడం చేతిలో ఉన్న కత్తిని కుడి చేతిలోకి మారుస్తు చెప్పాడు.

కోడిపుంజు సింహసనం లో సంభాళించుకోని కూర్చొంటు, " కటకన్న.... మాపై కనికరం చూపాలన్న గింత పెందరాళ్ళె గా కత్తి పట్టుకొచ్చివార్నింగిలు ఇస్తే ఎట్లన్న! వదినమ్మకు నాశ్తలో నహారియో..... గొర్రె మాంసం వేపుడో.... కలేజా.. గుర్ధా లో బాగుంటాయి!” సూచించాడు కోడిపుంజు.

" అది కాదోయ్ ! కో.పు....మీ వాళ్ళు ఈ మధ్య బాగా బలసి పోయారు.... ?” కొంచెం కోపంగా చెప్పాడు కటిక సాయేబు.

" మీరలా తినిపిస్తూంటే గట్లనేగా అయ్యేది! " కోడిపుంజు తమాయించుకొని చెప్పాడు, మళ్ళీ ఇందులో మీకు ప్రాబ్లం ఏముందన్న ? మీకు పడ్తల్ బాగానే పడ్తాయిగా !"

" పడ్తల్...గిడ్తల్ సంగతులు జానేదో! జనాలోచ్చి మా ప్రాణాలు పీక్కుతింటున్నార్! " మండిపడుతు చెప్పాడు కటిక సాయేబు.

" అన్నన్న ! " కోడిపుంజు నొచ్చుకొంటు " గట్ల గిట్ల ( అలా...ఎలా) తింటారన్న.... మీ ప్రాణాలు మా ప్రాణాల కంటే బాగుంటాయి...?” అని చెప్పి గతుక్కుమన్నాడు. సాయేబు రీయాక్షన్ ఎలాగుంటుందోనని.

కటిక సాయేబు కండ్లు ఎర్రగా మారాయి. తన కుడి చేతిలోని కత్తి తిరసాగింది.

" అది కాదు అన్న ....... నీ బాంచెన్....! ఐ మీన్ (నీళ్ళు నములుతు)...... గా జనాలు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమేమిటో ? " నచ్చజెప్పుతున్న రీతిలో చెప్పాడు కోడిపుంజు. తన అదృష్టం ఈ రోజు ఎలా ఉంటుందోనని మరో వైపు భయపడుతు....

" ఏముంది ? వెరి సింపుల్. వోయిచ్ రోనా? (అదే ఏడుపు) రేట్లు పెరిగిపోతున్నాయ... కోళ్ళ ధరలు మేకల్ ధరలు పలుకుతున్నాయ? దూసరీ తరఫ్... కోళ్ళు అందుబాటులో లేవు..... షార్టేజ్ !!” కటిక సాయేబు ఏడుపు మెహంతో చెప్పాడు.

కోడి పుంజు మెహం ముద్దమందారం లా వెలిసింది గాడంగా ఓ గట్టి ఊపిరి పీల్చి, " అన్ననీకు కోపం రావద్దు ! ఉన్న మాట చెప్తున్న .... మా పిల్లల మీద ఒట్టేసి ! గా హిట్లర్ గాడు జనాల్ని కాల్చినట్లు మమ్మల్ని కోన్నాళ్ళ క్రితం మీరు కాల్చి చంపలేదా ! గందుకే మేం షార్టెయిజ్ అయిపోయాం ! !" అని అన్నాడు.

" మిమ్మలి కాల్చి చంపిన అసలు సంగతి తెలియదా కో.పు?" కోపంగా అడిగాడు కటిక సాయేబు.

గతుక్కుమని... ఇదే మంచి సమయమనుకొని.... కటిక సాయేబు చేతిలోని చురకత్తిని చూశాక ముక్కలు ముక్కలైపోయిన తన ధైర్యాన్ని ప్రోగుచేసుకొంటు చెప్పాడు కోడిపుంజు మృదువైన స్వరంతో, " అన్న ! కటికన్న!! నీకు కోపమ్ రాదంటే ఒక మాట అడుగుతా.... చెప్పుతా...” అరనిమిషం ఆగి కటిక సాయేబు నుంచి ఏలాంటి ఉలుకు పలుకు లేకపోవడంతో, మౌనం ... అంగీకారంగా విశ్వసించి తన మాటను కోనసాగించాడు కోడిపుంజు.

" భయంకర వ్యాధి అయిన ఎయిడ్స్ (Aids) తగిలిని మీ వాళ్ళను... కాల్చి చంపేసినట్లుగా నేనెక్కడ విన్లేదన్న !"

ఫ్రీడం లేని తన గుండె శరవేగంతో కొట్టుకోసాగింది కోడిపుంజుకు, కటిక సాయేబు తన మాట విన్నాక చేతిలో ఉన్న కత్తిని తిరిగి ఝళిపించి తన మెడ పై గరబిర మంటు ఎక్కడ.. ఎప్పుడు తిప్పుతాడొనని కండ్లు మూసుకొన్నాడు.

అర నిమిషం గడిచి పోయింది. మరో అర నిమిషం గడవ పోతుంటే ప్రాణ భయంతో మూసుకు పోయిన తన కండ్లను అర తెరచి చూశాడు కటిక సాయేబు వైపుకు. అతని మొహం ఆశ్చర్యజనకంగా తోచింది!? అతనేదో దీర్ఘాలోచనలో ఉన్నట్లున్నాడనుకొని వేడెక్క బోతున్న వాతారణాన్ని చల్ల బర్చడానికి కోడిపుంజు మృదు మధురమైన తన కంఠం తో చెప్పడం మొదలెట్టాడు. టాపిక్ మారుస్తు శృంగార పదాలతో మెదలెడితే కటిక సాయేబు బుర్రలో తను చెప్పే విషయం బోధపడుతుందిని,

" మీ సినిమాలలోని హీరోయినుల పిర్రల్లా ఉండాలనేమో... మా పిర్రల కండలు గులాబి రంగుల్లో ఉండాలని మాకు అర్సెనిక్ కలిపిన పదార్ధాలు డిన్నర్స్ లలో ఇస్తున్నారు. దీని వల్ల మాకండలలోని రుచి మీ నోళ్ళలలో నీళ్ళు ఊరుతుంటాయి... నీకు కోపం రాకూడదు సాయేబు కాని మీరు ఏ ఆడదాని గుబ్బ పిర్రలు చూసిన నీళ్ళు నములుతుంటారు.!

సాయేబు ఈ సారి కోడిపుంజు వైపు చిరునవ్వుతో చూశాడు. హమ్మయ్య అనుకోని సింహాసనంలో సరిగ్గా కూర్చోవడానికి ప్రయత్నిస్తూ.... చెప్పడం మొదలెట్టాడు .. " మరో విషయం గుర్తు పెట్టుకో సాయేబన్న ! మా వల్ల సోమ్ము చేసుకోవాలనే మీ పేరాశలో నిషేద్దించిన కెమికల్స్ మాలో ఎక్కించేస్తే.... అవి... మమ్మల్ని హారించుకుంటూన్నాయి... చస్తున్న మీ సంఖ్య మా ఫెదర మీల్ ( feather meal ) తినడం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ తో చచ్చేవాళ్ళ సంఖ్య మెరుగుగా(హెచ్చుగా) ఉంది!”

సాయేబు కోడిపుంజు రాబట్టిన విలువైన సమాచారాన్ని మెచ్చుకోంటు, ఇంతకు ఆ ఫెదర్ మీల్ ముండలో ఉన్న జిన్ (దయ్యం) ఏమిటో పుంజుదొర ! అని అడిగాడు, అండర్ గ్రాడ్యుయేట్ కటిక సాయేబు తన కత్తిని లుంగీ పై బంధించిని బెల్ట్ లో దోపుకోంటు.

కోడిపుంజు తన ప్రాణగండం తప్పిందని నిర్ధారించుకున్నాడు. కటిక సాయేబు తను ఇస్తున్న వివరణలు ఆసక్తిగా వింటున్నాడని అర్ధం చేసుకున్నాడు . అందుకే సరళమైన భాషలో ఇంకొన్ని యదార్ధాలు చెప్పి కటికసాయేబు చెరలో నుంచి బయటపడాలనుకున్నాడు.

‘కొ క్కరో...కో...’ అని నిర్భయంగా ఓ కూత వేసి " ఏం ఉంది....! బెనడ్త్రెల్ (Benadryl) కి సంబంధించిన ఆంటీహిస్టమైన్ (Antishistamicne). అలాగే టైలనాల్, అమెరికా లో ఉండే......చైనా లో కూడా తనేమి తక్కువ తినలేదని ప్రొజ్ క్ (Prozec ) అక్టివ్ ఇన్ గ్రేడియంట్ అయిన ఆంటీడిప్రిసెంట్ కనుగొన్నారు."

" ఎందుకో అలా...? “ కన్ ప్వూజ్ అయిన సాయేబు గొడుక్కొన్నాడు.

" ఎందుకేంటన్న ! మా కొంపలు ముంచడానికి ! ! మీ వాళ్లు కనుగొన్న కొత్త రిసెర్చి బైనడ్ర్టెల్ ! మీరిచ్చె వత్తిడి వల్ల మా మాంసం తిక్కలు (కండరాలు) టిఫ్ గా ఉండి పెరుగుదల శక్తి ఆలస్యం అవుతుందట. ఫలితంగా బలిసిన మా పిర్రలు... మీ నోట్లో నీళ్ళు......!” చిన్నగా నవ్వాడు కోడిపుంజు మొదటిసారిగా.

కటిక సాయేబు ఓ మెట్టెక్కెతు, ఉర్ధు కలిపిన తెలుగు మాట లోదిలేసి, తేనే కలిపిన మాటలతో " కొ.ఫు. దొరగారు..... మనలో మన మాట........!? మిమ్మల్ని రసాయన ద్రవ్యాల ద్వారనో లేక ఏ విటమిన్లో... మీరు చెప్పినట్లు మీకు అందిస్తున్న మరే మారక ద్రవ్యాలో గాని మీరు వాటిని తిని మా ప్రపంచ సుందరిలా తయారైన లేదా మా సినీ హీరోయినులా మాకు టెంటేషన్ ఇచ్చిన, మిమ్మల్ని తిన్నాక మా టెన్షన్ పెరుగుతునే ఉంది కదా... డాక్టర్ల చుట్టూ గిరగిర తిరుగుతూండే !” అని అన్నాడు.

దీని గురించి మీరే ఆలోచించుకోవాలి భాయ్! మేము కాలనీస్ ఆఫ్ పౌల్డ్ర్ ఫామ్ నుంచి రిలీజ్ అయ్యాక మీ కత్తుల క్రిందనే కదా ఉండేది. మా ప్రాణాల్ని మీరు మీ కోసం అనంతవాయువుల్లో కలిపాక.... మీరు కూడా మమ్మల్ని అనుసరించాల్సిందే కదా! కోడిపుంజు సంభాళించుకోని కూర్చొంటు అన్నాడు. “మీ జనాలు డాక్టర్ల చుట్టూ తిరగక, దయ్యాల చుట్టూ తిరుగుతారా!” బాణం లా వదిలాడు కోడిపుంజు.

కటిక సాయేబు కోపంకు బదులు చిన్నగా నవ్వాడు, మరో మెట్టు ఎక్కుతు.

వీడి దుంప తెగ ! కటికోడి నియ్యతు ఖరాబు అయితున్నట్లుందని కోడిపుంజుకు అర్ధం కాసాగింది.

" ఏందన్న ఫై పైకి లఘయించేస్తున్నావ్ ! నేను కోడిపుంజు దొరనని నీకు తెలియదా ? దొరలతో మాట్లాడేటప్పుడు జర దూరంగా ఉండి మాట్లాడాలనే సభ్యత ..తెలియదా?” కోపంగానే కాని బెదురుతు చెప్పాడు కోడిపుంజు.

" అది కాదు బావా ! నిన్నుజూస్తుంటే మా సాలె (బావమరిది) గాడు గుర్తుకొస్తుండు. వాడు కూడా నీలాగే సూటిగా మాట్లాడుతాడు. గా సియాసత్ గాండ్ల లా ఘుమ ఫీరాకే మాట్లాడడు. కుచ్ భి హా... నీ అమ్మ ... నీ నాలెడ్జు జబర్ దస్త్ ....! లాస్ట్మే

...... ఏక్ బాత్ బతావ్...? ఊళ్ళల్లో... మిమ్మలి పెంచుతున్న రైతులు సాయేబులు పట్టణాలలో మాలాంటి వాళ్ళ ఇండ్ల వెనుక భాగాలలో ఓ చిన్న గది లాంటిది కట్టి... అందులో మిమ్మల్ని పెట్టి...మిమ్మల్ని ఏదేదో...తరిగిన కూర గాయల నుంచి ఏరిపారేసిన మాంసపు ముక్కలు తినడానికి ఇస్తుంటాం కదా! దాని వల్ల కూడా మీ పైన ఏదైన ఎపెక్ట్ ఉంటుందా?" ఓ ప్రశ్న లాగాడు సాయేబు.

(మంచి తెలుగులో మాట్లాడం మొదలెట్టాడు కటిక సాయేబు. కోడి పుంజుకు ఎందుకో తన గురించి అనుమానం వచ్చిందని గ్రహించి మొదటి మెట్టుపై వచ్చాడు)

ఓ చిన్న కూనిరాగం దీస్తు.... "ఉ... పల్లెటూరులలో పర్లేదు గాని... పట్టణాల జాబితాలలో చేరుతున్న చిన్న చిన్న జిల్లాలలో కూడా మాకోసం మీ వాళ్లు అందిస్తున్న రెడీమెడ్ భోజనం లో ఏమ్ కలిపి ఉందో చూశావా ?

" భడభడా మా లివింగ్ రూంలో పారేస్తూంటే గత్యంతరం లేక గబగబా.. ఆదరబాదరగా తినడమే మా పని గదా ! అలా తిన్న మమ్మల్ని మీ ప్లేటులో పెట్టుకొని, నీళ్ళు నములుతు, మా పై మసాలాలు రుద్ది తింటున్న మా మాంసం ముద్దలతో ఇంకేముందో ఆలోచించరా... ఎప్పుడైనా... మీరు కూడా మాలాగానే లాగేస్తుంటారు... తిండి విషయంలో !.

" మీరు మీ పెళ్ళం పిల్లలతో భలే బాగుంది చికెన్ అని సంభ్రపడి తింటున్నారే తప్ప... అసలు తింటుంది ఏమిటని పునరాలోచించారా!

" పుట్ట గోడుగుల్లా వస్తూన్న సూపర్ మార్కెట్లలలో తక్కువ ధరలో దొరుకుతున్న మమ్మల్ని (మాంసం) కొని, తిని డాక్టర్ల జేబులు నింపుతున్నారే తప్ప.... మాకు కావల్సిన సరైన తిండి ఇచ్చి మమ్మల్ని తిని మీ శరీరారోగ్యాలు కాపాడుకొని ఓ నాలుగు రోజులు చల్లగా బ్రతకండని చెప్పుతున్న....! ఇంక ఆ పై మీ ఇష్టం.......... ! ?" కోడి పుంజు చెప్పుతుంటే ఒళ్ళంతా చెవులు చేసుకోని విన్నాడు కటిక సాయేబు.

"భార్య పిల్లలంటే గుర్తుకొచ్చింది కో.పు అన్న! నీ వదినమ్మ .... రజియా... నిన్ను చూస్తే బాగా మురిసి పోద్ది! జర..చల్తె క్యా..? అంటు ఒకేసారి చివరి పైమెట్టు పైకి వచ్చాడు కటిక సాయేబు.

" ఓరీ ! వెధవ సన్నాసీ ! ! నువ్వు నాకేమన్న కోతి మొసలి కధ చెప్పుతున్నావా !!! " అంటూ రెప్పపాటులో తన సింహాసనం లో నుంచి ఎగురుతూ కిటికి గుండా రాకెట్ లా క్రిందికి దుకాడు కోడిపుంజు... మిష్టర్ కోడిపుంజు. తన ప్రాణాల్ని దక్కించుకోవడానికి.

***

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు