దగ్గరగా....... దూరంగా…... ఇల కైవల్యం - VIJAYA VANI. JANNABHATLA

Daggaraga.. dooramga..ila kailyam

ఓం

దగ్గరగా......దూరంగా......

గోవిందా.... గోవిందా.......

“అమ్మా, అమ్మా..... ఎంతసేపట్నించి చేస్తున్నానో తెలుసా? ఎన్నిసార్లు చెప్పాలి? ఫోన్ వెంటనే తీయకపోతే నాకు టెన్షన్ వస్తుందని... అసలే ఒంటరిగా ఉన్నావు”. అటు వైపునుంచి గట్టిగా కూతురు అరుస్తూ ఉంటే, “కళ్యాణ౦ చూస్తున్నా, నాన్న, నాకు ఏమీ కాదులే, ఆ శ్రీనివాసుడు అంత తొందరగా తీసుకెళ్ళడు.. నువ్వు టెన్షన్ పడకు”, అని ప్రశాంతంగా జవాబిచ్చా నేను. “సర్లే, తిన్నావా?” అంది అటునుంచి కొన్ని వేల మైళ్ళ దూరంలో విదేశంలొ ఉన్న హరిణి. “లేదు నాన్నా”, వంట అయ్యింది, కుక్కర్ వెలిగిస్తే అన్నము కూడా రెడీ. పది నిమిషాల్లో తినెయ్యచ్చు. నువ్వు ఎక్కడ, ల్యాబ్ లో ఉన్నావా? మధ్యాహ్నం తిన్నావా? అని, వంటగదిలోకి వెళ్లి స్టవ్ వెలిగించి కుక్కర్ పెడుతూ ప్రశ్నించింది …..

“ఈ రోజు మా కాంటీన్లో సూపర్ ఫుడ్ తెలుసా? చైనీస్ నూడుల్స్ వెరైటీగా చేశారు, చాలా బాగున్నాయి...నేను ఇండియా వచ్చినప్పుడు నీకు చేసిపెడతాలే” అంటున్న కూతురిని మురిపెంగా వీడియో కాల్ లో చూసుకుంటూ ఇంకొన్ని కబుర్లు చెప్పించుకున్నా. “మాస్కు” వేసుకుంటున్నావా? ఎప్పుడు చూసినా నువ్వు వాళ్ళ రూంలో ఉంటున్నావు లేదా వాళ్ళు నీ రూంలో ఉంటున్నారు, జాగ్రత్త అమ్మలు, “కొరియాలో కూడా మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి” అని విన్నాను” అని చెప్పగానే “మళ్ళీ మొదలెట్టావా? నువ్వూ, నీ భయాలు వెళ్ళు, వెళ్లి ఎస్.వి.బి.సి లో కళ్యాణ౦ చూసుకో. నాకు పని ఉంది, మళ్ళీ చేస్తా”. ఓ.కే. బై., అని డిస్కనెక్ట్ చేసింది హరిణి.

ఏంటో,ఫోన్ వచ్చినప్పుడు ఉన్నసంతోషం అంతా, ఒకే, బై అనగానే అయిపోతుంది అనుకుంటూ బ్లాంక్ స్క్రీన్ ని కొంచెం సేపు అలాగే చూస్తూ ఉండిపోయా. హాలులోకి వచ్చి సోఫాలో కూర్చుని టీవీ చూస్తే కళ్యాణమాలని భూదేవి నుంచి స్వీకరిస్తూ చిరునవ్వుతో కనిపించాడు శ్రీనివాసుడు...

...ఆ చిరునవ్వు చూస్తూ అలా జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయాను.......

అప్పుడు తనకు ఏడు సంవత్సరాలు వయస్సు. రాజమండ్రి, దానవాయిపేట, క్రొవ్విడి లింగరాజు మామయ్య గారి ఇంట్లో ఉండేవాళ్ళం.. “నీకు తెలుసా? మనం అందరం కలిసి తిరుపతి వెళుతున్నాం, వచ్చే నెలలో”ఉత్సాహంగా చెప్పాడు, తనకంటే రెండు సంవత్సరాలు వాడయిన బుజ్జి అన్నయ్య. నిజంగానే? ఎందుకు? పెద్ద కళ్ళని ఆశ్చర్యంగా తిప్పుతూ అడిగింది... “ఎందుకెంటే పిచ్చి మోహమా! వెంకన్నని చూడటానికి”.. చెప్పాల్సింది చెప్పి, పొడుగ్గా ఉన్న రెండు జడలనీ లాగేసి తుర్రుమన్నాడు... ఈ “వెంకన్న”ఎవరబ్బా! అని ఆలోచిస్తే, అంతుపట్టలేదు... సర్లే, నాన్నకి స్నేహితుడో, దగ్గర బంధువో అయ్యివుంటారు ఈ “వెంకన్న మామ” అనుకొని... మళ్ళీ నాన్నకి ట్రాన్స్ఫర్ అయ్యిందేమో అనుకున్నా... అవ్వలేదన్నమాట. ఈ విషయం అర్జంటుగా మాధవికి చెప్పాలి అని పార్కు పక్క సందు లో ఉన్ననా క్లాసుమేట్ దగ్గరికి పరిగెత్తా ...ఏడేళ్ల నేను.

వారం రోజుల ముందు నుంచి మొదలయ్యింది హడావుడి. పక్క ఇంటి పిన్నిగారు వచ్చి “వదినగారు తిరుపతి వెళుతున్నారట”? పోనిలేండి, ఇన్నాళ్లకు మీ అక్కయ్య గారి ఇంటికి తీసుకువెళుతున్నారన్నమాట! మా అన్నగారు”అనగానే “ఎక్కడ వదినా? వాళ్ళు కిందే ఉంటారు; ఈయనగారు ఆగితే కదా; నేరుగా పైకి తీసుకెళ్లి కూలేస్తారు. నిజం చెప్పాలంటే ఈ పిల్లా పీచుతో వాళ్ళ ఇంటికి వెళ్లాలంటే కొంచెం మొహమాటం అనిపిస్తుంది వదిన గారు” అంది అమ్మ. “అదీ నిజమేలెండి, తొమ్మిది టిక్కెట్లు అయ్యాయి, ఇంక ఆగేదేమన్నా ఉందా? లేదా మళ్ళీ పురుడు పొయ్యాలా? మన ధనం డాక్టరమ్మ, ప్రేమతో కూడిన వెటకారమాడింది వసంతత్తయ్య, అని మేము అందరం పిలుచుకునే లింగరాజుగారి భార్య! సిగ్గుపడుతూ ఒక నవ్వు నవ్వింది తప్ప బదులు ఇవ్వలేదు అమ్మ.రెస్పాండ్ అవ్వటం, రియాక్ట్ అవ్వడం మధ్య ఉన్న ఆంతర్యాన్ని ఏ మేనేజిమెంట్ సెషన్స్ అటెండ్ అవ్వకుండానే తెలుసుకున్న తరం అది. “ఇంతకీ వచ్చిన పని మరచాను! ఈ ముడుపు కాస్త నా తరపున చెల్లించు వదినా! ఆ గోవిందుడికి” అని ఒక గుడ్డమూట చేతిలో పెట్టింది. అమ్మ వెంటనే దానిని తీసుకొని దేవుడి గూట్లో పెట్టింది. ఈ వసంతత్తయ్యకి, ప్రసాదం అత్తయ్య అని నిక్ నేమ్ పెట్టాం పిల్లలందరూ కల్సి, ఎప్పుడు మాకు ఏదో ఒక ప్రసాదాన్ని ఇస్తూనే ఉంటుంది పాపం. అలా, ఆ రోజు మొదలయ్యింది, ప్రతీ రోజు ఒకరో, ఇద్దరొ తిరుపతి వెళుతున్నారట అని పలకరింపు ఒక చిన్న గుడ్డమూటో, చిన్న సంచినో, చిన్న ఇనప రేకు డబ్బానో ఇలా ఏదో ఒకటి అమ్మకి ఇవ్వడం, అమ్మ దేవుడిగూట్లో పెట్టటం జరుగుతూనే ఉంది..ఈ వెంకన్న మామకి ఇంతమంది తెలుసా, ఇన్ని బహుమతులు ఇస్తున్నారు అనుకుంటూ ఊరు బయలుదేరే రోజు కోసం ఉత్సాహంగా ఎదురు చూడసాగాను, ఏడో ఏడాదికే నాలుగో క్లాస్ పుస్తకాలు చదివేస్తున్న నేను.

ఊరికి వెళ్లాలంటే బట్టలు ఎన్ని సర్దుకొవాలి, ఎన్ని రోజులు ఉంటాము, ఎక్కడ తింటాం? మన టవల్ ఉందా, షాంపూ ఉందా, సోప్ ఉందా? ఇవన్నీ మనకి ఎవరూ చెప్పరు, అడిగితే నాన్న కోప్పడతారు అని అడిగే దమ్ము మా ఎవరికి లేదు. అన్ని విషయాలు పెద్దవాళ్లు చూసుకుంటారనే నిశ్చింత. ప్రయాణం గురించి ఉత్సుకత. రవ్వలడ్లు, జంతికలు, వేరుశనగ బెల్లం పాకం ఉండలు, సన్న కారప్పూస అన్ని రెడి అయ్యాయి. ఒక్క ముక్క ముట్టుకొనిస్తేగా... అన్నీ తిరుపతి ప్రయాణం అని మా నోర్లు కట్టేసారు.

....

కాకినాడ పోర్ట్ నుంచి మద్రాసు పోర్ట్ వరకు నడిచే గవర్నమెంట్ రైల్వే వారి “సర్కార్” ఎక్స్ ప్రెస్ ప్లాట్ ఫారం మీదకి వస్తుండగా, పిల్లలూ అందరూ జాగ్రత్తగా ఎక్కండి అని అమ్మ, నాన్న హెచ్చరికలు. ముందుగా ఇచ్చిన ట్రైనింగ్ పుణ్యమా అని ఒకరి చేతులు, ఒకరు పట్టుకొని తోసుకుంటూ అందరం కలిసి బోగీలో ఎక్కాం. ఒకరు ట్రంక్ పెట్టె పైన, ఒకరు వెదురు బుట్ట పైన, ఇంకొకరు సూటుకేసు పైన, మరి ఒకరు బాగ్ పైన సర్దుకొని కూర్చున్నాం.... రైలు బయలుదేరగానే ఆ ఆనందం చూడాలి. టి.సి వచ్చి ఫుల్ టిక్కెట్లు, హాఫ్ టిక్కెట్లు లెక్క చూసుకుంటున్నారు... ఔటర్లో టి.సి లెక్క జరుగుతుంటే రైలు ఆగింది.. మళ్ళీ రైలు బయలుదేరడం ఆలస్యం, అమ్మా ఆకలి అంటూ పులిహోర, పెరుగన్నం, సన్న కారప్పూస లాగించేసాము. ఎక్కడ పడుకున్నాము, ఎప్పుడు పడుక్కుకున్నాం అన్నదే తెలీదు. నిడదవోలు స్టేషన్ మాత్రం బాగా జ్ఞాపకం. నాన్నగారు ఇంతకుముందు పని చేసేవారు. “నిడదవోలు” పలకమంటే” “నిదడవోలు” అని పలికినందుకు ఒక సారి వీపు మీద దెబ్బలు బాగా పడ్డాయి, 9 మంది పిల్లల్లో ఒకరికి.

తెల్లవారుజామున గూడూరు జంక్షన్ అనుకుంటా, అందరినీ నిద్ర కళ్ళతోనే దింపేసారు. లగేజీలెఖ్ఖ, పిల్లలలెఖ్ఖ ఒకసారి చూసుకొని ప్లాట్ఫారం మారి తిరుపతి పాసెంజర్ కోసం ఎదురుచూసాము. తిరుపతి రైల్వేస్టేషన్ చేరేటప్పటి ఎండ చురుక్కుమంటోంది. పది గంటలయ్యినట్లుంది. నాన్నగారు, ఇద్దరు పిల్లలు, కొండపైకి వెళ్లే బస్ టికెట్ల కోసం క్యూ లో నుంచున్నారు. అమ్మ, మిగతా పిల్లలు, లగేజీ ఒక చోట ...మళ్ళీ పిల్లలు అమ్మా ఆకలి, అని అమ్మ చుట్టూ చేరారు. పెద్ద కేరేజ్ మూత తెరిచి ఒక్కొకరికి ఒక రవ్వ లడ్డు, ఒక జంతిక ఇచ్చింది. ఇది చూడగానే బిచ్చగాళ్ళు వెంట పడ్డారు. అదృష్టం కొద్దీ నాన్న టిక్కెట్లు తీసుకొని వచ్చి వాళ్ళని అదిలించారు. ప్లాటుఫారం మీద ఎందుకు తీశావని అమ్మకి కూడా అక్షింతలు. పాపం బిడ్డల ఆకలి తల్లికే తెలుస్తుంది...

ఈ లోపు బస్ రానే వచ్చింది, పిల్లలందరం మళ్ళీ చేతులు పట్టుకొని తోసుకుని ఎక్కాము. ఈసారి ఎవరి సీట్ వారిదే; నా పక్కన నాకంటే ముందు పుట్టిన అన్నయ్య కానీ, నా తర్వాత పుట్టిన చెల్లి కానీ ఉంటారు. అదే రూల్, అదే ఆర్డర్ అందరూ పాటించాల్సిందే. బస్ ఘాట్ రోడ్ ఎక్కింది. అలిపిరి, మోకాలు పర్వతం అవన్నీ పిల్లలకి ఏమి తెలుస్తాయి? బస్ టర్నింగ్ తిరిగినప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుతున్నాము, సీటులో ఆ చివర నుంచి ఈ చివరికి జారిపోతూ ఒకటే ఇకయికలు, పకపకలు. అప్పటివరకు నోరు విప్పని నాన్న ఒక్కసారిగా అదిలించారు. అందరూ చెప్పండిరా “ఏడుకొండల వాడా, వెంకట రమణా, గోవిందా, గోవిందా” అని అరిచారు. దెబ్బకు పిల్లలు, బస్సులో ఉన్న పెద్దలు అందరూ “ఏడుకొండల వాడా, వెంకట రమణా, గోవిందా, గోవిందా”అని అరవటం మొదలు పెట్టారు. భక్తి అంటే ఏమిటో కూడా తెలియని మేము “ఏడు కొండలవాడా, వెంకట రమణా, గోవిందా, గోవిందా” అని సరదాగా అరవడం మొదలుపెట్టాం. నిజం చెప్పొద్దూ చాలా ఉత్సాహంగా అనిపించింది. ఇంక ఆపకుండా “ఏడుకొండలవాడా, వెంకట రమణా, గోవిందా, గోవిందా” అని అరుస్తూనే ఉన్నాం. పక్కన కిటికీ లోనుంచి చూస్తే పెద్ద పెద్ద చెట్లు, మా దానవాయిపేట పార్కులో కూడా ఎప్పుడూ చూడలేదు ఇంత పెద్ద చెట్లు... ఒళ్ళు ఝల్లు మంది; అంత చల్లగా మారుతుంది వాతావరణం. బస్ కొండ ఎక్కుతుంటే, ఎదురుగా బస్సులు వేగంగా వస్తున్నాయి. డ్రైవర్ చాలా చాకచక్యంగా నడుపుతున్నాడు, ఐనా ఎదురు బస్ మొహం మీదకి వచ్చి వెళ్లినట్లు అనిపిస్తోంది. కొండ ఎక్కడానికి, దిగటానికి ఒకటే ఘాట్ రోడ్ అప్పట్లో గోవిందుడికి...

బస్ దిగగానే మళ్ళీ క్యూ లైన్లు. ఈసారి ధర్మ సత్రంలో రూమ్ కోసం. టైం రెండయ్యింది, ఆకలి వేస్తున్నా అమ్మని అడిగే సాహసం లేదు, నాన్న పొద్దున ఇచ్చిన డోసుకి. పెద్ద పిల్లలు ఇద్దరినీ పెట్టుకొని క్యూలో రూమ్ కోసం నుంచున్న నాన్నని చూసే ధైర్యం కూడా లేదు నాకయితే.

నా జీవితం మొత్తంలో ఎప్పుడయినా జ్వరం వస్తే దగ్గరకు వచ్చి తల నిమిరేవారు నాన్న.అంతే తప్ప, ఆయనని నేరుగా చూసే ధైర్యం, మాట్లాడే చనువు ఎప్పుడూ ఉండేవి కావు నాకు...రూమ్ కి చేరగానే ఇక ఈ ఇంటి పురుషుడయిన శ్రీ జన్నాభట్ల. పురుషోత్తమ శర్మ గారి భాధ్యత తీరినట్లే.. ఇంక ఉఫ్, ఉఫ్ మని ఊదుతూ పొయ్యి వెలిగించి ఎసరు పడేసింది అమ్మ….ఆవకాయ, కంది పొడి, చింతకాయ పచ్చడి, వేడి అన్నం, నెయ్యి కంచాల్లో పడగానే ఆవురావురుమని అందరి ఆకళ్ళు పురి విప్పాయి. కటిక నేల మీద ఎప్పుడు పడుక్కున్నామో దుప్పట్లు ముసుగేసుకొని, శ్రీవారి ధర్మ సత్రంలో!!!

తెల్లవారుజామున చూస్తే నా పక్కనే పడుకున్న అన్న, చెల్లి ఇద్దరు కనిపించలేదు. ఎక్కడా అని చూస్తే పిల్లలు అందరూ ఒకొక్కళ్ళు గా అమ్మ చేత వొళ్ళు తోమించుకొని బయటపడుతున్నారు. ఓహో, నన్ను లేపకుండా నాకంటే ముందు స్నానం చేయించుకుందన్నమాట అనుకోని, అదే వరసలో ఇంకా నిద్ర పోతున్న నా చిట్టి చెల్లిని, గట్టిగా చరిచి లేపి కారిడార్ లోకి పరిగెత్తి లైన్లో నిలబడ్డా, ఒళ్లు తోమించుకోవడానికి. ఎదురుగా నున్నగా గుండు కొట్టించుకొని, నిండా బట్టలేకుండా చలికి వణుకుతున్న అన్న. “నువ్వాగవే, ఇటు రారా బుజ్జి” అని వాడిని దొరకబుచ్చుకొని బర, బరా వొళ్ళు రుద్ది వేడి నీళ్లు గుమ్మరించింది అమ్మ. అవును మరి, ఒంటి మీద పడ్డ వేడి నీళ్ళు కిందకు జారే లోపు చల్లగా అయిపోతున్నాయి, అంత చల్లగా ఉంది కొండ మీద.

నాన్నగారిది గవర్నమెంట్ ఉద్యోగం. ఇంస్టాల్మెంట్లో కట్టుకునేలా సూపర్ బజార్లో అందరికి చవక రకం కాటన్ క్లోత్ కొనేవారు. సందు చివర టైలర్ దగ్గర అమ్మ అందరికి ఒకే గౌన్లు కుట్టించేది. పక్క ఇంటి వసంతత్తయ్య మమ్మలిని “బ్యాండ్ మేళం” అని ఎగతాళి చేసేవారు. అమ్మ కూడా చాలా మంచి చీర కట్టుకుంది, పట్టు చీర కాబోలు.. అబ్బా, ఎంత అందంగా ఉంది అమ్మ అనుకుంది తన మనసులో.

సుదర్శనం.. ధర్మదర్శనం అని పెద్ద అక్షరాలు కూడబలుక్కొని చదివాను, అందరం కలిసి ఆ క్యూ లో దూరిపోయాము. పొద్దున్నే 6 గంటలు అయ్యినట్లుంది. “అమ్మా, తినడానికి ఏమయినా...” నసుగుతుంటే, “తప్పు నాన్నా; ఇంక తిండి అన్నీనూ(?) ఆ వెంకన్న దర్శనం అయ్యాకే”.

ఓహో అందరూచెప్పే ఈ “”వెంకన్న మామ” అంటే దేవుడన్నమాట. ఆ బుజ్జి బుర్ర కి అప్పుడర్ధమయ్యింది.

గేట్ తీసారు అని ఎవరో అరిచారు, “ఏడుకొండలవాడా, వెంకట రమణా,గోవిందా, గోవిందా “అని పరిగెట్టారు అందరూ, ఈ రొదలో..నా చేతిలో ఆడుకుంటున్న, ప్లాస్టిక్ గాజూ కిందపడిపోయింది.. ఈసారి హడావుడిలో ఆర్డర్ మారినట్లుంది బుజ్జి అన్న బదులుగా “చంటి అక్క” నా చేయి పట్టుకొని లాక్కెళ్లిపోతోంది బర, బరా.. మెట్లు వస్తున్నాయి జాగ్రత్త, హెచ్చరికలు... అది వినగానే, నన్ను అటు ఒకళ్ళు, ఇటు ఒకళ్ళు రెండు జబ్బలు పట్టుకొని గాల్లోకి లేపారు. ఒక్క మెట్టు తగల్లేదు నా కాళ్ళకి, మెట్లు దిగేసాను...మళ్ళీ అందరూ ఆగిపోయ్యారు, ముందర గేట్లు పడ్డట్టుగా.. నన్ను ఈడ్చుకొచ్చిన మా ఆక్కయ్య నా చేయి విడిచిపెట్టి ఊపిరి తీసుకుంటోంది.. మళ్ళీ ఒకసారి హెడ్ కౌంట్ చేస్తున్నారు. క్యూలో అందరికంటే ముందు పెద్దన్న, అందరికంటే చివర బుజ్జి అన్న...వాడి కళ్ళల్లో గర్వం, పిల్లలందరిని రక్షించే హోదా దక్కినందుకు.

పక్కనే చూస్తే చిన్న ఇత్తడి కటకటాలు.. చిన్న చిన్న గంటలలాగా ముట్టుకుంటే శబ్దం చేస్తున్నాయి.. భలే ఉన్నాయి, ఆడుకోవడం మొదలెట్టాను..అక్కడే చాలా సేపు నిలుచుండి పోయాము. పెద్దవాళ్లు చాలామటుకు కింద కూర్చున్నారు. అందరూ ఏవేవో కబుర్లలో పడ్డారు. మీది యే ఊరు అని ఒకరు, మీరు ఎన్ని గంటలకి క్యూలోకి వచ్చారు అని ఒకరు, రూములో వేడి నీళ్లు ఇవ్వటానికి ఎంత తీసుకున్నారని ఇంకొకరు...మధ్యలో ఎవరో వెనకాల నుంచి గట్టిగా అరిచారు “ఏడుకొండలవాడా, వెంకట రమణా, గోవిందా, గోవిందా” అని, గోలలో ఈ “గోవిందా” ఏమిటో అర్థం అవ్వకపోయినా నేను కూడా “ గోవిందా, గోవిందా” అని చాలా గట్టిగా అరిచాను.. ఉత్సాహంగా అనిపించి ఇంక ఆపకుండా “గోవిందా, గోవిందా” అని అరుస్తున్నాం పిల్లలందరం.. అలా ఊరకే అరవటం కాదు, చేతులు రెండూ తల పైన పెట్టుకొని గోవింద నామ స్మరణ చెయ్యాలి అని నా రెండు చేతులు తల పైకి లాగారు, ఆటోమేటిక్‌గా దండం వచ్చేసింది... గోవిందా అంటూనే ఉన్నాము, మళ్ళీ అందరూ పెద్దవాళ్లు లేచి నిలుచున్నారు..“ఏమండీ, ఇక్కడ ఇంకొక లైన్ వాళ్ళని కూడా కలుపుతున్నారు, కళ్యాణం వాళ్ళంటారా”? అడిగింది అమ్మ, బదులు పలకలేదు నాన్న, ఈ లోపు నన్ను ఎవరో భుజాల మీదకు ఎత్తుకున్నారు..“ఎందుకయ్యా అలా తోసుకుంటారు, చిన్న పిల్లలు కనిపించట్లేదా?” ఎవరో పెద్దాయన చెపుతున్నారు. మళ్ళీ నన్ను కిందకి దించేసారు. పైకి చూస్తే, అబ్బా ఎంత పెద్ద ద్వారమో అని ఆశ్చర్య పడటం నా వంతు అయింది, కిందకు చూస్తే అక్కడ వేసినటువంటి ఎర్రని తివాచి, ఆ గడప దగ్గరవున్న గొట్టం, దానికి వున్న చిన్న, చిన్న రంద్రాల ద్వారా వస్తున్న చల్లని నీరు చల్లగా తగిలాయి కాళ్ళ కింద, “రెండు కాళ్లు మడమలు తడవాలి, అందరూ కాళ్ళు కడుక్కోండి” ఆదేశాలతో నాన్న ఎప్పుడయినా సిద్ధంగా ఉంటారు, మరి కాలేజ్ ప్రిన్సిపాల్ ఉద్యోగం అయిపోయే..కొంతమందికి నీరు, పాదాల్ని తమంత తాము కడిగేస్తే, మరికొంతమంది వంగి, ఆ గడపను ముట్టుకొని, నమస్కారం చేసుకొని వెడుతూ వున్నారు.

ఇంతలో నాన్నగారు అదుగో ఆ కుడి చేయి వైపు పైన చూడండి అనటంతో అటువైపు చూస్తే, గుడి ఎంట్రన్స్‌లో మహద్వారానికి కుడివైపున కింద బుడిపెతో ఒక పెద్ద గునపం వేలాడుతూ వుంది. ఆనాడు అనంతాచార్యులు, వెంకటేశ్వరస్వామి వారిని కొట్టారు, అది గడ్డం మీద తగిలి స్వామి గడ్డంపై గాయమై రక్తమొచ్చింది, అప్పట్నుంచే స్వామివారి గడ్డానికి గంధం పూయడమనే సాంప్రదాయం మొదలైంది అని నాన్నగారు చెబుతున్నారు..

ఏమి జరుగుతోందో తెలిసేలోపు బర, బరా, నా రెక్క పట్టి లాక్కెళుతున్నారు.. ఈ సారి కాళ్ళ కింద చెక్కబల్ల తగులుతోంది. ఈసారి ఏటవాలుగా చిన్న జారుడు బల్లలా ఉంది. అందరూ పైకి ఎక్కుతున్నారు. నేను లాగబడుతున్నాను... మళ్ళీ ఒక తోపులాట. నాకు తెలియకుండానే నేను ఒక టర్నింగ్ తీసుకున్నాను.. "ఓం నమో వెంకటేశాయ" అని మంద్ర స్వరంతో వినిపిస్తూ వుంటే, ఇలా ఒక అడుగు లోపలి వేసి, తల పైకెత్తి చూస్తే, గాజుతో తయారు చేయబడినటువంటి తెల్ల మెట్టతామరాకులులాంటివి, గుత్తులు గుత్తులుగా ఉండి, దీపాలు వెలుగుతూ వుంటే, పెద్ద పెద్ద గోలీలుగా ఉన్నవి వ్రేలాడుతూ వుంటే, కొంచెం ముందుకు వెళ్లి కుడిప్రక్కకు చూస్తే, రెక్కలువిప్పినటువంటి గరుత్మంతుడు కనబడితే, ఆయనకి ఒక నమస్కారం చేసి, జనాల కాళ్ళ మధ్యనుంచి, చల్లటి గాలి వచ్చింది, గట్టిగా ఊపిరి పీల్చుకొని, ఆ గాలి ఎక్కడిదా అని చూస్తే, హమ్మాయ్యో! అంత పెద్ద ఫ్యాన్ నేను ఇప్పటివరకూ చూడలేదు. జి.ఎమ్ అని రాసుంది దాని పైన పెద్ద అక్షరాలతో...ఆలోచించేలోపే, మళ్ళీ ఎవరిదో భుజం ఎక్కాను...పక్కనే చూస్తే ఇంకొకళ్ల భుజం పైన నా చిట్టి తమ్ముడు. “దండం పెట్టుకో, దండం పెట్టుకో, కనిపిస్తోందా”? అరుస్తున్నారు నాన్న మొహం చూద్దామని ప్రయత్నించా, “నన్ను కాదు, ఎదురుగా చూడు” అని చెయ్యి చూపిస్తూ చెపుతున్నారు. భయం వేసి, కళ్ళు మూయబోయి ఎదురుగా చూసా.. రెండు వైపులా పెద్ద పెద్ద దీపాలు, వాటి మధ్య ఒక విగ్రహం అనుకుంటా, బాగా దగ్గరకి వచ్చినట్లున్నాం...

ధగ, థగా దేదీప్యమానంగా మెరుస్తున్న పెద్ద కిరీటం ఫస్ట్ కనిపించింది. ఇంకా ఏవో చాలా ఆభరణాలు ఉన్నాయి.. అన్ని ధగ ధగా మెరిసిపోతున్నాయ్... అవి ఏమిటో మరి నా చిన్ని బుర్రకి తెలియట్లేదు. పక్కనే అంత చీకట్లో చాలా వెలుగునిస్తున్నదివ్వెలు. పెద్దగా, పొడుగ్గా, తెల్లగా బొట్టు పెట్టుకొన్న ఒక నల్లటి మొహం, ఆ బొట్టు మొహం మొత్తాన్నీ, ముఖ్యంగా ఆ రెండు కళ్ళని కనపడకుండా చేస్తోంది. సరిగ్గా చూడబోతే, గడ్డం మీద తెల్లగా నామం లాగే కానీ గుండ్రం గా ఇంకో బొట్టు కనిపించింది, ఇది చాలా చిన్న సైజ్ లో ఉంది.

ధగధగలు, మెరుపులు, దీపం వెలుగులు, గర్భగుడిలోపల ఒక విగ్రహం, చాలా దగ్గరగా ఆభరణాల మధ్య, ఒక పెద్ద నామం పెట్టుకున్న మొహం, నా కళ్ళ ఎదురుగా, చెయ్యి పెడితే అందేటంత దగ్గరగా.. కళ్ళు గట్టిగా మూసుకున్నాను..

ఏమని వర్ణించను నా అదృష్టం, ఆ ఏడు ఏళ్ల వయసులో..దివ్య మంగళ విగ్రహం, ఏడుకొండల శ్రీనివాసుడు ఎంతో దగ్గరగా..భౌతికంగా దగ్గరగా..

భక్తి, శ్రద్ధ, పారవశ్యం ఇవి ఏమీ తెలియని మనసులో మాత్రం ఆ దివ్య మంగళ విగ్రహం, ఏడుకొండల శ్రీనివాసుడు.. దూరంగా...

.

“జరగండి, జరగండి” అన్న అరుపుల్లో, తోపులాటలో ఎప్పుడు బయటపడ్డాం అన్నది తెలీలేదు, పెద్ద రిలీఫ్ గా అనిపించింది. నేను అనే ఒక జీవిని మళ్ళీ భూమి మీద పెట్టబడ్డాను..లాగబడ్డాను..

పట్టుకో, పట్టుకో తీర్థం అనే లోపు చేతి వేళ్ళ మధ్య జారిపోయి కొన్ని చుక్కలు మాత్రం మిగిలాయి. గొంతులో పోసుకొని చిన్ని మెట్లు నాలుగు దిగేలోపు “అదిగో చూడండి గోపురం, అందరూ దండం పెట్టుకోండి” అని అమ్మ చెపుతోంది.

ఏదో పెద్ద యుద్ధం చేసి గెలిచినంత సంతోషం కనిపిస్తోంది ఇద్దరి మొహాలల్లో.. మరి ఇంతమంది పిల్లలతో అంత దూరం నుంచి ప్రయత్నం చేయటమే ఒక సాహసం.. దానికి బహుమతిగా వెంకన్న మంచి దర్శనం ఇచ్చాడు.. ఇంక కావల్సిందేముంది. అలా చుట్టూ తిరిగి వస్తుంటే, మళ్ళీ గాల్లోకి లేపబడ్డాను. “అదిగో, విమానం వేంకటేశ్వరుడు. దండం పెట్టుకో” అని చెపుతున్నారు. జనం హోరులో ఏమి అర్ధం అవ్వట్లేదు.. ఆకాశం కన్పిస్తోంది.. దండం పెట్టేసుకున్నా..

ఆనందనిలయ గోపురంమీద వాయవ్యమూలకు గూడులాంటి చిన్న మందిరం వెండితో అలంకరింపబడింది. ఆ మందిరంలో శ్రీవేంకటేశ్వరస్వామివారి మూలమూర్తిని పోలిన చిన్న విగ్రహం ఉంది. ఆయనకు ఇరువైపులా గరుత్మంతుడు, హనుమంతుడు ఉంటూ సేవిస్తూ ఉన్నారు. ఆనంద నిలయ విమానంపై వేంచేసి ఉన్నందువల్ల ఆయన "విమాన వేంకటేశ్వరుడుగా” పిలువబడుచున్నాడు అని అమ్మ చెప్పింది.

అప్పట్లో ఈ విమాన వేంకటేశ్వరస్వామివారిని తొండమాన్ చక్రవర్తి ఏర్పాటు చేశాడని, ఈ విమాన వేంకటేశ్వరస్వామి వారి దర్శనం గర్భాలయంలో స్వయంభూమూర్తిగా వేంచేసి ఉన్న శ్రీవేంకటేశ్వరస్వామి మూల విరాట్మ్మూర్తి దర్శనంతో సమానమని, ఒకవేళ ఆనందనిలయంలోని మూలమూర్తి దర్శనం కాకపోయినా ఈ విమాన వేంకటేశ్వరుని దర్శిస్తే చాలు, యాత్రా ఫలితం దక్కుతుంది అని చెబుతోంది అమ్మ.

ఇంక అందరం బయటకి వెళుతున్నామనుకుంటే, మళ్ళీ జనం. అబ్బా, ఎంత అద్భుతంగా ఉంది, పెద్ద తెల్ల పంచె, చిన్నప్పుడు రెండు కొయ్యలకి కలిపి కట్టిన చెల్లి ఉయ్యాల గుర్తు వచ్చింది. ఎంత పెద్దదో, అని తల పైకి ఎత్తి ఉయ్యాల చూద్దామని ప్రయత్నించింది కానీ తనవల్ల అవ్వలేదు. పిల్లలందరికీ చేతిలో నాణేలు పంచబడ్డాయి. మిలిటరీ సైన్యం లాగా డిసిప్లిన్ కి ఏమి తక్కువ లేదు, లైన్ లో బుజ్జి అన్నయ్య వెనక్కాలే నేను, నా వెనకాల నా చెల్లి. ఆ ఉయ్యాల దగ్గరకి వెళితే అక్కడే కాచుకుని ఉన్న నాన్న, ఒక్కొక్కరినీ రెండు చేతులతో లేపి భుజం యెక్కించుకుంటున్నారు. ఆ చిల్లర ఆ పెద్ద ఉయ్యాలలో వెయ్యమంటున్నారు. వేసేటప్పుడు గోవిందా, గోవిందా అని అరవమంటున్నారు. నాకయితే, నేను అందులో పడిపోతానేమో అని భయం కూడా వేసింది. ఆ పెద్ద ఊయలని “శ్రీవారి హుండీ” అంటారుట, అందులో వేసేవన్నీ ఆ వెంకన్నకి చేరుతాయిట, అమ్మ చెప్పింది, చెపుతూ అమ్మ కుడా డబ్బులతో పాటు చాలా మూటలు, చిన్న డబ్బాలు పడేసింది. అందులో పక్కింటి వసంతత్తయ్య ఇచ్చిన మూట కూడా ఉంది. ఇంక జనం తగ్గారనుకుంటే, మళ్ళీ ఒక చిన్న తోపులాట.

ఇంతలో నాన్న గారు అమ్మకి "ఏమే చిన్న పిల్లలిద్దరితో నువ్వు ఆ క్యూలో రా!! పెద్దన్నయ్యతో ఒరేయ్!! నువ్వు ఆ క్యూలో మిగతా వాళ్ళతో రా అనటం వినిపించింది.. మళ్ళీ కటకటాల క్యూ. చూస్తూ ఉండగానే ఏదో ఒక దొప్ప చేతిలో పడింది. ఇంతలో నాన్నగారు, మీకు ఏమి వచ్చింది ప్రసాదం, లడ్డునా, దద్ధోజనమా, చక్ర పొంగలియా, అనటం వినిపించింది.

ఏదో తీయ్యటి ప్రసాదం. అన్నంతో చేసిందనుకుంటా. సాయంత్రం అయ్యిందేమో. పొద్దుట్నుంచి ఏమి తినకపోవడం వల్ల అమృతంలా అనిపించింది. పిల్లలు ఎవరికయినా షేర్ చెయ్యాల్సి వస్తుందేమో అని చుట్టూ చూసా. అందరికీ ఇచ్చారు, మరి ఇంకేం. ఎవరయినా ఆడిగేలోపు తినేయడమే బెటర్ అనిపించి, గుటుక్కుమనిపించా. బహుశా శ్రీవారి చక్ర పొంగలి అనుకుంటా. నోటిలో లాలాజలం ఊరుతుంది ఇప్పటికీ, ఏడు ఏళ్ల వయసులో తిన్న ఆ ప్రసాదం తలుచుకుంటే..

.

బయటకు రాగానే ఎదురయ్యారు. అమ్మక్కయ్య, పెదనాన్న, పట్టు పరికిణీల్లో ఉన్న ఇద్దరు అక్కయ్యలు, బాబు అన్నయ్య. పెదనాన్న తిరుపతి లో పెద్ద వెటర్నరీ డాక్టర్. నాన్నగారు గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపాల్.. హోదా కి ఏమి తక్కువ లేకపోయినప్పటికీ, ఈ కాలంలో కూడా కుటుంబ నియంత్రణ పాటించని మా నాన్నగారంటే ఆయనకి కొంచెం చిన్న చూపు. పలకరింపులు అయ్యాక అమ్మ సంతోషంతో “పోని లేవే, ఈ ఏడుకొండలవాడే నిన్ను కనిపించేలా చేసాడు, క్యూలో ఎక్కడయినా కనిపిస్తారేమో అని చూసా” అని చెపుతోంది. ఈ లోపు బుట్టలు మోసుకుంటూ కొందరు ఆలయంకి సంబంధించిన వారు అనుకుంటా, పెదనాన్నని పిలిచారు, వెంటనే అమ్మక్కయ్య, పిల్లలు కూడా పెదనాన్న వెనక్కాలే పరిగెట్టారు. “ఎక్కడుంటున్నావే అరిచింది అమ్మ. “ఏ. టి. సి కాటేజ్”అమ్మక్కయ్య సమాధానం దూరం నుంచి వినిపించింది. “ఇద్దరం తాహసిల్దార్ బిడ్డలమే! దాని రాత అట్లా ఉంది, నారాత ఇట్లా చచ్చింది” గొణిగింది అమ్మ, గట్టిగా అంటే నాన్న బాధ పడతారనుకున్నదో, తిడతారని భయపడిందో..

“అమ్మా, అమ్మా ఆ బుట్టల నిండా ఏమిటమ్మా? “అడిగాను. “ప్రసాదాలురా!! పెద్ద, పెద్ద లడ్డులు, పెద్ద, పెద్ద వడలు, బుట్టల నిండా ఇస్తారు, పెద్ద పూజ చేయిస్తే, ఆ పెద్ద పూజకి చాలా ఖర్చు అవుతుంది. దాని పేరే “ శ్రీవారి కల్యాణం” అంది అమ్మ. అలాగా నేను “ పెద్ద” అయ్యాక “ పెద్ద “ పూజ చేయిస్తా అని తుర్రుమన్నా ..నేను

దర్శనం కంటే, ప్రసాదం కంటే ఆ వయసులో నన్ను బాగా ఆకట్టుకున్న విషయం, ధగధగా మెరిసిపోతున్న దుకాణాలు. ఏ దుకాణం లోపల చూసినా గుడిలో చూసిన వెంకన్న మామే.. కీ చైన్స్లో బుల్లి వేంకటేశ్వరుడు, టేబుల్ మీద పెట్టుకునేందుకు రంగు రంగు రాళ్లతో మెరుస్తూ చిన్న బాలాజీ (అంటారుట), పెద్ద క్యాలెండర్ బొమ్మలో వెంకన్న మామ నించుని ఉన్నారు, అటు పక్క ఇటు పక్క నుంచుని భార్యలనుకుంటా.. ఇద్దరు ఉన్నారేంటి అనుకుంది. అరే ఈ లైట్లు భలే ఉన్నాయి, గుండ్రంగా తిరుగుతున్నాయి మధ్యలో దేవుడు. ఎరుపు, ఆకుపచ్చ, పసుపు రంగులు బల్బులు.. చిన్నవి, పెద్దవి..ఒకటి నా జేబు రుమాలు సైజ్ లో ఉంటే, ఇంకొకటి నా పరీక్ష అట్ట సైజ్, అసలు ఇంకా పెద్దది గోడ సైజ్లో ఉంది అని ఆశ్చర్యంగా చూస్తోంది. “అర డజను, ఎంతకు ఇస్తావు చెప్పు” అని నాన్న గొంతు వినిపించింది. బేరాలడటంలో నాన్న ఎక్స్పర్ట్..అచ్చంగా బంగారు గొలుసు లాగానే ఉన్నాయి, ఎంత బాగున్నాయో అంది చెల్లి.. నా మనసంతా ఆ చైన్ కింద వేలాడుతున్న పులిగోరు మీదే ఉంది, ఎంత తెల్లగా బంగారం మధ్యలో మెరిసిపోతోందో, కొంటే బాగుండు, అని మా అందరికి ఆశ, బేరం కుదర్లేదు. మళ్ళీ ఆర్డర్ లో నడవటం మొదలు పెట్టాము.”

“పిల్లలని ఎత్తుకు పోయి, అమ్ముకునే వాళ్ళు ఉంటారు జాగ్రత” అని మమ్మల్ని ప్రయాణానికి ముందే హెచ్చరించి ఉంచారు.. కానీ ఆ గొలుసులు అమ్మే తాత వదలట్లేదు.. “సరే బాబయ్య, మీరు చెప్పిన ధరకే తీసుకోండి ..మరి ఇంకేం, అందరికీ ఆర్డర్లో గొలుసులు. పులిగోరు మగపిల్లలు వేసుకోవాలిట, అయినా నాకు అదే కావాలని పట్టు పట్టా. “ఇది ఒక మగరాయడు” అని మురిపెంగా విసుక్కుంటూ నాకు పులిగోరు చైన్ కొనిపెట్టారు. అవును పెద్దయ్యాక మొగరాయుడిలాగా ఉద్యోగం చేస్తానని కార్ నడుపుతానని అప్పుడు నాకు కానీ, అమ్మ, నాన్నకి కానీ తెలీదు. “స్నానం చేసేటప్పుడు తీసేయండి, లేకపోతే రంగులు పోతాయి” అని వెనుకనుంచి సలహా, ఎవరు విన్నారు కనుక..

..ఆ సంవత్సరమే కాదు, ప్రతీ సారి తిరుపతి వెళ్లినప్పుడాల్లా బంగారు రంగు గొలుసు, పులిగోరు లాకెట్, అన్ని గొలుసులు కలిపి పది రూపాయలకే కొన్నారు ఆ రోజుల్లో..ఇప్పుడు నిజం బంగారు గొలుసు, ఎన్ని వెరైటీ లాకెట్స్ ఉన్నా వేసుకోవే అంటే, “బోర్ మమ్మీ” అనే ముద్దుల కూతురు అదికూడా ఒక్కత్తే గారాలపట్టి...

రూముకి వచ్చినా, మనసంతా పెద్ద బుట్టలు, పెద్ద ప్రసాదాలు, పెద్ద వడలు, పెద్ద లడ్లు, అమ్మక్కయ్య చుట్టూనే తిరుగుతూ ఉంది. నా మనసులో మాట విన్నాడో ఏమో ఆ ఏడుకొండలవాడే పంపించినట్లు, 8 గంటలప్పుడు ఎవరో తలుపు కొట్టారు, ఒక బుట్టనిండా ప్రసాదాలు. ఇంకేం... పిల్లలందరం మూగాము.. బుట్ట క్షణాల్లో ఖాళీ..” ప్రసాదాలు వేస్ట్ అవుతాయని పంపించినట్లున్నారు, తినటానికి జనాలు ఉంటే కదా అక్కడ” వెటకారంగా అన్నారు, నాన్నగారు.” ఎమోనండి, అంతా ఏడుకొండలవాడి దయ” గాల్లో దండం పెడుతూ అంది అమ్మ..

ఒకటి చెపుతా విను భాస్కరం! (అది అమ్మ పేరు, మగపిల్లలు పుట్టలేదని చివరిగా పుట్టిన ఆడపిల్ల అమ్మకి ఆ పేరు పెట్టేసుకున్నారు తాతయ్య, నానమ్మ) “వీళ్ళు పెరిగి పెద్దవాళ్ళయాక మన పిల్లలకి ఏ బంధువులు అవసరం లేదు, వీళ్ళకి వీళ్ళే చాలు అన్ని శుభకార్యాలకి” నువ్వు దిగులు పడకు.. అన్నారు నాన్నగారు.” ఏమోనండీ, పెంచడం అంటేనే భయం వేస్తోంది, ఈ రావణ మూకని”అంది అమ్మ.. “రావణ మూక, రాక్షస మూక” అన్నవి మా అమ్మ మాకు పెట్టుకున్న ముద్దు పేర్లు. “నారు పోసినవాడు, నీరు పోస్తాడు లేవే” నాన్న ఊరడింపు... ఈసారి ఇద్దరి చేతులు ఏక కాలంలో గాల్లోకి లేచాయి. ఏక కాలంలో లయబద్దంగా వచ్చిన పదాలు “ఏడుకొండల వాడా, వెంకట రమణా, గోవిందా, గోవిందా” ఆ మాటలు వింటూ, నేను మాత్రం మనసులో ఫిక్సయిపోయ్యాను. నేను పెద్దదాన్ని అయ్యాక పెద్ద పూజ “శ్రీవారి కళ్యాణం”చేయించాలి అని ...పెద్ద లడ్డులు, పెద్ద వడలు..

తిరుమల తిరుపతి దేవస్థానం వారి ధర్మ సత్రం లో రాజమండ్రి నుంచి తెచ్చిన జంపఖానమీద చలికి ముడుచుకొని కొన్న నాకు కలలో కూడా దూరంగా పెద్ద కొండలు, ఆ కొండలు ఎక్కుతుంటే పెద్ద చెట్లు, పెద్ద విగ్రహం, దగ్గరగా కనిపించిన పెద్ద మొహం, పెద్ద నామం, పెద్ద లడ్డులు, పెద్ద వడలు...అలా బాగా గుర్తు ఉన్న ఆ మొట్ట మొదటి తిరుమల ప్రయాణం మది జ్ఞాపకాల్లోంచి బయటకి వచ్చింది.

..

కుక్కర్ విజిల్ రావటంతో ఆ శబ్దానికి జ్ఞాపకాల్లోంచి బయటపడి, స్టవ్ ఆఫ్ చేసి టేబుల్ మీద పొద్దున్న వండుకున్న కూర, పప్పు అన్ని అమర్చుకొని నెయ్యి వెచ్చబెట్టుకొని, కుక్కర్ దింపి టేబుల్ మీద పెట్టి కూర్చున్నా, కుక్కర్ మూత రావడానికి కొంచెం టైం పడుతుంది మరి. ఈ రోజు కూతురి ఫోన్ అయ్యింది, శ్రీవారి ఫోన్ ఇంకా రాలేదేమిటా, లంచ్ టైం అవుతోంది అనుకున్నా. ఎంత బిజీ గా ఉన్నా డైలీ ఇద్దరి దగ్గర నుంచి ఒక కాల్ తప్పనిసరిగా వస్తుంది....

అనుకునేలోపే, వీడియో కాల్ బదులుగా ఆడియో కాల్ వచ్చింది, భర్త “శ్రీనివాస్”నుంచి. పద్మాజా! నేను కొంచెం బిజీగా ఉన్నాను మార్నింగ్ నుంచి. నాలుగు మీటింగులు ఉన్నాయి. నైట్ కుదిరితే చేస్తా, లేకపోతే లేదు” అని బదులు కోసం ఎదురు చూడకుండా ఫోన్ క్లిక్ మనిపించాడు శ్రీనివాస్. ఏమిటో ఈ మనిషి, ఆదివారం రోజు మాములు కంటే బిజీ. విదేశాల్లో ఉన్న కూతురే నయ్యం, కొంచెం సేపయినా మాట్లాడింది ఈ రోజు. హైదరాబాద్ నుంచి ఈయన గారి ఫోన్ ఎదురు చూసినంతసేపు పట్టలేదు, అయిపోయింది అని నిట్టూర్చాను, బెంగళూరులో ఆఫీసర్ల క్వార్టర్స్లో ఒంటరిగా ఉద్యోగ రీత్యా నివసిస్తున్న, నేను..

“ఎట్టె కూడే పెండ్లి యోగమిద్దరికీ ఈ వేళ, పట్టే లక్ష్మీ నారాయణ యోగము, పట్టే... లక్ష్మీ..... నారాయణ.. యోగము” మనసులోనుంచి అన్నమయ్య పాడటం మొదలెట్టాడు..

మళ్ళీ జ్ఞాపకాల్లోకి జారి పొయ్యాను...

1990లో పురుషోత్తమశర్మ గారు, ఆ పురుషోత్తముడి దగ్గరకి చేరేటప్పటికే ఎం.ఎస్. సి లో గోల్డ్ మెడల్ సాధించింది తను, ఒక చిన్న మెచ్చుకోలు చూపు మాత్రమే దక్కింది నాన్న దగ్గర్నుంచి. అన్నయ్య మెడికల్ సీట్ సాధించినప్పుడు కూడా అంతే, పిల్లల గురించి గొప్పగా చెప్పుకోవడాలు, పార్టీ ఇవ్వటాలు ఇలాంటివి ఏమి ఉండేవి కాదు ఇంట్లో.

తండ్రి పోయిన సంవత్సరం లోపలే ఆడపిల్లకి పెళ్లి చేస్తే కన్యాదానం ఫలితం ఆ ఆత్మకి దక్కుతుందని ఇంటి పురోహితుడు చెప్పినా, అన్నయ్యలిద్దరు చిన్నవాళ్ళు అవటం, వేరే ఊళ్ళో ఉద్యోగాలు అవ్వటం వల్ల, అమ్మ బయటకి రాకపోవటం వల్ల 3 సంవత్సరాలు పట్టింది నా పెళ్ళికి,” కుర్రాడు ఎం.బి.ఏ చదివాడు, మద్రాసులో ఉద్యోగం; కట్నం వద్దన్నాడు; అమ్మాయి అదృష్టం” అన్న కామెంట్ల మధ్య గుంటూరులోని కొత్తమాసు శ్రీనివాస్ కళ్యాణ మండపంలో నా మెడలో మూడు ముళ్లు వేసాడు వరుడు శ్రీనివాస్, తెల్లవారు ఝాము లగ్నం లో..

చెల్లి పెళ్లి చేసిన సంతోషం, అలసట, బిల్లుల సెటిల్మెంట్ పనుల్లో అన్నయ్యలు, ఎక్కడున్నారో తెలీదు. చిట్టి తమ్ముడు కళ్యాణమండపంలో ఒక మూల నిద్రపొతూ కనిపించాడు పాపం వాడు “అక్కా, నువ్వు ఈ బావని నువ్వు పెళ్లి చేసుకోవద్దు”అని బాగా ఏడ్చాడు. వాడికి ఈ బావ నచ్చలేదు, అక్కని తీసుకెళ్లిపోతాడని. అప్పగింతలు అవసరం లేదని వియ్యాలవారు అనడంతో నివ్వెరపోయింది అమ్మ. తేరుకునేలోపే అసుర సంధ్య వేళలో అత్త వారి ఇంటికి అంబాసిడర్ కార్లో చేరా నేను, అమ్మ తోడు నుంచి విడివడి, ఒంటరిగా....

కాదు, కాదు...

శ్రీనివాస్ జంటగా..

గుమ్మం దగ్గర పేర్లు చెప్పించి, కాళ్ళు కడిగించి, పూజ రూములోకి తీసుకువెళ్లారు, మా అత్తగారు, ఆడపడుచులు, ముత్తయిదువలు.

ఎదురుగా ధనుర్ధారి అయి కాటుక కన్నులతో, బుగ్గన చుక్కతో నవ యవ్వనుడి రూపంలో రామయ్య, పక్కనే సిగ్గులొలుకుతున్న సీతమ్మ, కాపలాదారు లక్ష్మయ్య, కాళ్ళ దగ్గర అంజలి ఘటించి మారుతి.. అందరూ కల్సి అందంగా ఇమిడిన పెద్ద పటం.

“లోక కళ్యాణార్ధం, ఆజన్మాతం ఈ దంపతులు రామ కళ్యాణం జరిపించాలి “ ఆని శృంగేరి పీఠం ఆదేశంట. అదే శాసనంగా భావించి 18 సంవత్సరాలుగా చేస్తున్నారట శ్రీ సీతారామ కళ్యాణం. అత్తగారు పూజ గదిలో చెప్పిన విషయం..ఇప్పటి దాకా పక్కనే ఉన్న భర్త కోసం వెతికా నేను, చెల్లెలి పక్కన చేరి కబుర్లు చెపుతున్నాడు.

పెళ్ళి అయిన నాలుగో రోజే మద్రాస్ బయలుదేరిన శ్రీనివాసుని “హనీమూన్ కి తిరుపతి వెళదామండీ” అడిగా, “లేదు పద్మాజా, నాది ప్రైవేట్ ఉద్యోగం, లీవ్ దొరకదు, అసలు ఆశ లు పెట్టుకోకు” అన్నాడు.

శ్రీవారి కళ్యాణం, పెద్ద లడ్లు, పెద్ద వడలు కాదు కదా, ఆ వెంకన్న మామ దర్శనభాగ్యం కూడా లేదన్నమాట, అని మనసులో అనుకుని పూజ గదిలో సీతారాములకి దండం పెట్టుకొని సరిపెట్టుకున్నా.

1995లో కూతురు జననం. గుంటూరులో పురుడు పోసుకొని అత్తని, అమ్మని, వదినలని, ప్రాణ స్నేహితురాళ్లయిన వాణీ, హేమలతని, అందరినీ వదిలి “మద్రాస్ ఎక్స్ ప్రెస్” ఎక్కాను చంటి బిడ్డతో..

కొద్ధి నెలలు గడిచాయి. పాప ఆటపాటలు, శ్రీవారి ఆఫీస్ టూర్లు, తన ఉద్యోగం హడావుడి లో చెన్నై (అప్పట్లో మద్రాస్) వెస్ట్ మాంబళంలో రోజులు ఎలా గడిచాయో కూడా గుర్తించే స్థితిలో లేదు తాను.

“అదేమిటి? పిల్లకి అన్న ప్రాసన చేయించకపోతే ఎట్లా? గుంటూరు రావడం కుదరకపోతే ఏదయినా గుడిలో ప్రసాదం నాలుకకి తాకించండి, అయినా ఇవన్నీ మేనమామ చూడాలి, మీకేమో పనికి రాడయ్యిపోయే” నిష్టూరంగా ఫోన్లో అత్త గారు, మాకు కాదండీ, మీకు పనికి రాడు మా అన్నయ్య అన్న మాట గొంతులొనే ఉండిపోయింది నాకు. ఎందుకంటే అత్తగారు అంటే అంత గౌరవం. మద్రాస్ నుంచి అర్ధరాత్రి ట్రైన్ దిగి ఇంటికి వస్తే, మేలుకొని ఉండి అమ్మ లాగా కొసరి కొసరి తినిపిస్తారు…

మా పెళ్లికి ముందు నిశ్చితార్థంకి పీటల మీద కూర్చున్న అన్నయ్య, వదినలని చూసి అప్పుడు వద్దంటే బాగోదని, విడిగా అమ్మని పిలిచి చెప్పింది, పెళ్ళికి మాత్రం పీటల మీద వాళ్ళు కూర్చోకూడదని. అన్నయ్య కులాంతర వివాహం చేసుకున్నాడని ఆవిడ కినుక. అందుకే, మా పెళ్లి పీటల మీద అక్కా, బావ కూర్చున్నారు చంటి పిల్లాడితో ఇబ్బంది పడుతూ..

“ఏమి చేద్దామండి”? ప్రశ్న సంధించింది శ్రీనివాస్ కి. “ఒక పని చేద్దాం, మే నెలలో తిరుపతి వెళదాం. అక్కడ శ్రీవారి ప్రసాదంతో అన్నప్రాసన మనమే చేసేద్దాం, మీ అన్నయ్యని ఏమి కదిలించకు ఇప్పుడు” సూక్ష్మంలో మోక్షం చెప్పాడు, తల్లి చాటు తనయుడు, “మరి లీవ్”? మరో ప్రశ్న సంధించింది. సెలవు ఎందుకు?-తిరుపతి ఇక్కడ నుంచి 3 గంటలు లో వెళ్లిపోవచ్చు. కావాలంటే ఒక రోజు సెలవు తీసుకుంటా అన్న ఆయనని ఆశ్చర్యంగా చూసింది. పర్వాలేదు, భార్య కోసం, హానీమూన్ కోసం, ఈ 3 సంవత్సరాలలో దేనికీ సెలవు తీసుకోని ఈయన కూతురి అన్న ప్రాసన కోసం తల్లి ఆజ్ఞ మేరకు ఒక రోజు సెలవుకి సిద్ధం అయినందుకు. ఏడుకొండలవాడే ఈ లీలకి కారణం అయ్యి ఉంటాడని పసిబిడ్డకి ముద్దుపెట్టి “మనం మే నెలలో వెంకన్నని చూడటానికి వెళుతున్నాం, అక్కడే నీ అన్న ప్రాసన” అని చెప్పింది. ఏమి అర్ధం అయ్యిందో రెండు పాల పళ్లతో, బోసి నోటితో నవ్వింది, జూనియర్ పద్మజ, హరిణి.

మద్రాస్- తిరుపతి సప్తగిరి ఎక్స్ ప్రెస్ మధ్యాహ్నం రెండు గంటలకు ఎక్కి, కొండ పైకి తిరుమల తిరుపతి దేవస్థానం బస్ లో చేరుకున్నాం. మళ్ళీ మొదలు, రూమ్ కోసం క్యూలు, దర్శనము కోసం క్యూలు అనుకుంటూ పసిబిడ్డతో, లగేజీతో మెట్ల మీద కూర్చొన్నా!! నేను!! “సూపర్ పద్మాజా, మనకి రామ్-బగీచలో రూమ్ దొరికింది”సంతోషంగా, కార్యం సాధించిన, ఆంజనేయుడిలాగా వచ్చారు పతిదేవులు. రాంభగీచ అయితే మనకి గుడికి దగ్గర, వేడి నీళ్లు దొరుకుతాయి. పద, లగేజీ పడేసి మనం దర్శనం టిక్కెట్లు తీసుకోవాలి హడావుడి చేసేసాడు. రూములో లగేజీ పడేసి విజయాబాంక్ ముందు క్యూలో ఇద్దరం పాపతో నుంచున్నాం. “నాన్న గారు ధర్మ దర్శనంలో తీసుకువెళ్ళేవారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. “అబ్బో, అది మన వల్ల కాదు, పది పదిహేను గంటలు పడుతుంది, పసిపిల్లతో కష్టం” అనేశారు, పోనీ “కళ్యాణం సేవ టిక్కెట్లు తీసుకుందాము” అబ్బా,అది చాలా కష్టం, నా వల్ల కాదు” అని కొట్టిపారేసారు. కూతురికి కష్టం “ధర్మ దర్శనం, భర్తకి కష్టం “కళ్యాణo; వెరసి శ్రీనివాసుడు కల్పించిన అదృష్టం ఈ “స్పెషల్ దర్శనం”.

తెల్లవారుజామున 3 గంటలకల్లా నిద్ర లేచి, వరాహ నరసింహ స్వామిక్యూలో నుంచుంటే, గడ, గడా వణికించే చిన్నప్పటి చలి ఏమయిందో అర్ధం కాలేదు. కొండ మీద వాతావరణం మారింది.

మహాద్వారం లోనికి ప్రవేశించగానే అటు ఇటు ఉంచిన అరటి చెట్లు, శంఖనిధి, పద్మనిధిని, తల తిప్పితే కుడి చేతి వైపు వెంకటపతిరాయలు, అచ్యుతరాయలు వారు, ఆ ప్రక్కన వరదరాజ అమ్మణ్ణి చూసి, ఇలా తలతిప్పి చూస్తే, శ్రీకృష్ణ దేవరాయలు, తిరుమలదేవి, చిన్నాదేవి, ఇత్తడి బుట్ట కిరీటంలాంటి టోపీ, విగ్రహాలకు ఎదురుగా ఎడమ చేతి వైపు వున్నఅద్దాలమండపం, కుడి ప్రక్కకు చూస్తే, ఎదురుకుండా రంగనాయకుల మండపం, అక్కడే శ్రీవారితులాభారం.

ఈసారి దర్శనం దగ్గరగా జరిగినా, ఆ విరాట్పురుషుని పాదాలు గట్టిగా పట్టేసుకొని, ఆయన పాదాలమీద పడిపోదామని అనిపించి, పరవశించిపోయి, కిందనుంచి పైకి, పైనుంచి కిందకు, ఆ తేజోమూర్తిని చూసి విభ్రమముతో, చూస్తూ ఉండి, ఆయన అందాన్ని తనివితీర ఆస్వాదించి, ఆ తర్వాత మెల్లగా బయలుదేరి, మెల్లగా, వెళ్ళలేక, వెళ్ళలేక వెనక్కి తిరిగితే వెనక బాగం స్వామి చూపిస్తే బావుండదని, అలా ముందు వైపుతిరిగే స్వామిని చూస్తూ, వెనక్కి అడుగులు వేస్తూ, అలా వచ్చేస్తూ వుంటే, మళ్లీ స్వామిని ఎప్పుడు చూస్తానో అనుకుంటూ, గోవిందా, గోవిందా అని అడుగులు వెనక్కి వేస్తూ, ఆ సువర్ణ గడపదాటి , మళ్లీ ఒకసారి ఇలా తొంగి చూసి, మళ్లీ ఆ నల్లని ముఖం, ఆ పెద్ద పెద్ద ఊర్ధ్వ పుండ్రాలు, కుండలాలు, ఆ కిరీటం, ఆ తోమాలు గుండెలవరకు కనబడితే, తండ్రీ, తండ్రీ, మళ్లీ తొందరలో పునః దర్శనాన్ని ఇయ్యమని వేడుకొని ఆలయం వెలుపలికి వచ్చేసరికి మధ్యాహ్నం రెండు గంటలయ్యింది. చక్రపొంగలి, కట్టె పొంగలి, దద్దోజనము ఇలా ఏదో ఒక అన్న ప్రసాదం వస్తే “అన్న ప్రాసన” చేద్దామనుకుంటే, శ్రీనివాసుడు మాకు పరీక్ష పెడుతూ లడ్డు ప్రసాదం ఇప్పించాడు. అలా శ్రీవారి ఆలయం మెట్ల మీద కూర్చుని బుజ్జి పట్టు పరికిణీలో ఉన్న హరిణిని నేను ఒళ్ళో కూర్చోపెట్టుకుంటే, వాళ్ళ నాన్న కమ్ మా శ్రీవారు దాని నాలికకి శ్రీవారి లడ్డు ప్రసాదం తాకించారు, నచ్చింది అనుకుంటా, లొట్ట లేస్తోంది బుజ్జిది, మొత్తం మూడు సార్లు నాకించి అన్నప్రాశనం కార్యక్రమం “మమ” అనిపించాం.

1999 మే నెలలో శ్రీవారు ఆఫీసు పని మీద గుంటూరు వెళ్లి వాళ్ళ అమ్మ దగ్గర కూర్చొన్నారు, తమిళనాడు రాయ్ వెల్లూర్ నా పోస్టింగ్స్. అమ్మ నాకు సహాయానికి వచ్చింది. ఆ సంవత్సరం పసిబిడ్డని ఒక చంకను, మోకాలు నెప్పితొ బాధ పడుతున్న అమ్మని బస్సులో ఈడ్చుకుని తిరుమల వెళ్ళా. దర్శనంకి కానీ, రూముకికానీ, బుకింగ్‌ లేదు. ఎలాగబ్బా అనుకునే లోపే మళ్ళీ కరుణించాడు, వెంకన్న మామ, అమ్మ సీనియర్ సిటిజన్ అవ్వటం, నేను పసి బిడ్డతో ఉన్న తల్లి కావటం వల్ల, ఏదో స్పెషల్ కోటా కొత్తగా మొదలుపెట్టిన సీనియర్ సిటిజెన్ దర్శన్ స్కీం అట, మధ్యాహ్నం లోపలికి వెళ్లిన వాళ్ళం, సాయంకాలానికి దర్శనం అయిపోయింది, కింద తిరుపతికి దిగి బస్ ఎక్కి వెల్లూరులో బస్ దిగేటప్పటికి అర్ధరాత్రి 12 గంటలు. బస్ డ్రైవర్, కండక్టర్ కనికరించి నన్ను మా ఇంటి ముందు వరకు దింపారు. శ్రీవారు తోడు లేకుండా, పొద్దున్నే 5 గంటలకే బయలుదేరి, ఈ పసిబిడ్డని, ఆ వయసులో ఉన్న అమ్మని తీసుకొని బయలుదేరి రాత్రి 12 గంటలకి క్షేమంగా ఇంటికి చేరానంటే ఆ శ్రీనివాసుడి దయ కాక మరింకేముంటుంది. ఇంటికి చేరక కానీ అమ్మ గుండె దడ తగ్గలేదు, గాల్లో రెండు చేతులు తల పైకి ఎత్తి “ఎడుకొండలవాడా, వెంకటరమణా, గోవిందా, గోవిందా”అని అప్పుడు అంది. మూడు సంవత్సరాలు అక్కడే ఒంటరిగా ఉద్యోగం చెయ్యాల్సివస్తుంది అనుకుంటే పది నెలలకే నాకు, శ్రీవారికి ఒకే చోట ఉండేలా తిరుచిరాపల్లికి ట్రాన్సఫర్ ఇప్పించాడు ఆ గోవిందుడు. శ్రీరంగం రంగనాథుడు, రాక్ ఫోర్ట్ ఉచ్చిపిళ్ళయార్ ( వినాయకుడు) తిరువేరంబురు ఎరుంబీశ్వర్ (చీమలపుట్ట శివుడు) మాకు దోస్తులు అయ్యారు.

అన్నప్రాసనకి అత్తగారు పెట్టిన ముహూర్త బలం కాబోలు, ఇక ప్రతీ సంవత్సరం మే నెలలో తిరుపతి ప్రయాణం ఆనవాయితీ గా, మా జంట బుజ్జి దానితో సహా 4 ఇయర్స్ చెన్నై నుంచి, 6 ఇయర్స్ తిరుచిరాపల్లి నుంచి, మళ్ళీ 6 ఇయర్స్ చెన్నై నుంచి నిర్విఘ్నంగా సాగింది. మార్చినెల లోనే ఇద్దరం లీవ్ సాంక్షన్ చేయించుకొని రెడి అయిపొయ్యే వాళ్ళం. అప్పటినుంచీ నా పెద్ద పూజ, పెద్ద లడ్లు కలలో నుంచి ఇలలోకి వచ్చాయి, ఆ మలయప్ప కరుణించాడు శ్రీదేవి, భూదేవితో సహా!

మే 25వ తేదీ నా పుట్టినరోజు, ప్రతీ సంవత్సరం శ్రీవారి కళ్యాణం, సహస్ర దీపాలంకరణ రెండు సేవలు చేయించుకుని దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళం. కొన్ని సంవత్సరాలకు మాతో పాటు మా రెండవ అన్నయ్య, వదిన పెళ్లి రోజు కూడా అదే రోజు కావడం వల్ల శ్రీవారి కళ్యాణానికి వాళ్ళు కూడా కలవడం మొదలుపెట్టారు. రెండు జంటలు, నా కూతురు, నా ఇద్దరు మేనల్లుళ్లు, ఇదీ మా తిరుపతి గ్యాంగ్.

తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా మా సౌకర్యార్ధం అన్నట్లుగా ఆన్ లైన్లో ఆర్జితసేవ ల బుకింగ్‌ అందుబాటులోకి తెచ్చారు. అంతకుముందు టి. నగర్ బాలాజీ టెంపుల్ క్యూ లో ఫిబ్రవరి 25 నాలుగు గంటల కల్లా ఉండాల్సిందే. కౌంటర్ ఓపెన్ చేసిన 9 నిమిషాలలో మన వంతు రాకపోతే కళ్యాణం హుళ్లక్కే. అత్యంత ఉత్సాహవంతులయిన మా శ్రీవారు, బుజ్జిది 2 గంటలకే నిద్ర లేచి, నన్ను కూడా తెమిలించి 4 గంటల కల్లా క్యూ లో ఉండేలా చేసేవారు. ఆ తర్వాత కొన్నేళ్ళు ఆన్-లైన్లో బుకింగ్ కి అర్ధరాత్రి 12 గంటలకి కంప్యూటర్ ముందు కూర్చునేవారు, ఇక్కడ మావారు, అక్కడ మా వదిన.. నేను, మా అన్న గుర్రు పెట్టి నిద్ర పోతుంటే, ఈ అన్నా చెల్లెళ్లు మాకోసం మా పాస్ వర్డ్ కూడా వాళ్లే క్రియేట్ చేసుకొని కళ్యాణం బుకింగ్‌ చేసిపెట్టేవారు.

మనం ఏ రోజు సేవ అనుకుంటామో దానికంటే 90 రోజుల ముందర బుకింగ్ ఓపెన్ అవుతాయి. మే 25 అంటే ఫిబ్రవరి 25 రెడీగా ఉండాలి. అయిన 9 నుంచి 10 నిమిషాల్లోనే సేవా టికెట్లు అన్నీ అయిపోతాయి. ఆ తరువాత తిరుమల తిరుపతి దేవస్థానం వారు 60 రోజులకి అనుమతించడం మొదలు పెట్టారు. ఫిబ్రవరి 25 బదులుగా మార్చ్25 కూర్చోవడం మొదలు పెట్టాము. ఒకే ఐడెంటిటీతో మా దంపతులకు, హరిణికి, రెండు టిక్కెట్లు కంప్యూటర్ ఒప్పుకోవటం లేదని, కొలకత్తాలో ఆఫీసు పని మీద వెళ్లి నిద్ర పోతున్న నన్ను మా శ్రీవారు అర్ధరాత్రి ఒక ఫిబ్రవరి 25న లేపారు. అక్కడ మా వదిన పరిస్థితీ అదే, అన్న లేచాడు. చాలా ఏళ్లుగా నేను, మా శ్రీవారు ఒక జంట అయితే నేను, మా అమ్మాయి ఒక జంట..మా వదిన, అన్నయ్య ఒక జంట, వాళ్ళ పిల్లలిద్దరూ ఒక జంట. కొన్నాళ్లు అయ్యాక ఇద్దరు ఆడవాళ్ళుని జంటగా కంప్యూటర్ అనుమతించనంది. అక్కడ అదే పరిస్థితి. ఇద్దరు మేనల్లుళ్లను జంట గా ఒప్పుకోలేదు, జంటలు మార్చి ఏవేవో తిప్పలు పడి మొత్తానికి ప్రతీ సంవత్సరం విజయం సాధించే వాళ్ళం.

సంవత్సరం మొత్తం ఎంత చాకిరి చేసినా ఈ ఒక ట్రిప్ లో శ్రీనివాసుడు మా అలసట అంతా తీర్చేవాడు. ఎంత ఎమర్జెన్సీ పని ఆఫీసులో వచ్చినా ఈ ట్రిప్ మాత్రం క్యాన్సల్ చేసే వాళ్ళం కాదు. “తిరుమల శ్రీనివాసుని కళ్యాణం తర్వాతే ఏదయినా అనేవాళ్ళం”.

“ఇదేమిటి? ఇంత దూరంగా లాగేస్తున్నారు, మనం ఎక్కడో ఉన్నాం, దేవుడు ఎక్కడో ఉన్నాడు “అరిచింది ముందుగా గ్రహించిన నా ఫ్రెండ్ కమ్ వదిన”, “ లఘు దర్శనం” ఎవరో సమాధానం.. సాయంకాలం సహస్ర దీపాలంకరణ తర్వాత దర్శనానికి అదే పరిస్థితి..గోవిందుడు, వెంకట రమణుడు దూరమయ్యాడు అని బాధ మొదలయ్యింది..

“మహా లఘు దర్శనం”అట, అసలు వేంకటేశ్వరుడు ఎక్కడో, మనం ఎక్కడో.. బాగా దూరంగా, ఇంకా దూ.... రం..... గా లాగేస్తున్నారు..

కళ్యాణ వేంకటేశ్వరుడి విగ్రహాన్ని “మలయప్ప స్వామి” అంటారు. గర్భగుడిలో వేంకటేశ్వరుడిని దూరంగా, మలయప్ప ని దగ్గరగా చూసుకోవడం మొదలెట్టాము. దానికోసం 10 గంటలకి రిపోర్ట్ చెయ్యడం బదులుగా, 8 గంటలకే రిపోర్ట్ చెయ్యటం మొదలెట్టాము, ముందు వరసలో కూర్చోవచ్చుఅని..గర్భగుడిలో మూల విగ్రహం మాత్రం మీకు నేను దూరమే అంటున్నాడు.

ఇంకొక సంవత్సరం, నా చిన్ని మేనల్లుడు దేవుడిని చూడటానికి ఇబ్బంది పడుతున్నాడని నేను వాడిని నా భుజాల మీదకి ఎక్కించుకున్నా. ఆ అలమేలు మంగపతి చాలా దూరం లో ఉన్నాడు కదా అని చూసేలోపే, నేను వెడుతున్నానో, వెనకనుండి తోస్తున్నారో, తెలియని స్థితిలో ఇలా దగ్గరకు వెళితే, “జరగండి, జరగండి” అనటం, నన్ను తోసేయ్యటం, నేను నా మేనల్లుడిని కాపాడే ప్రయత్నంలో బొక్కబోర్లా పడటం అన్ని క్షణాల్లో జరిగిపోయాయి. మోచేయి మీద వాడి బరువు ఆపినందుకు నొప్పి, దోక్కుపోయింది. తోసేసారని కోపం, మా వాడి బరువు ఆపిన చెయ్యి నెప్పి రెండు కల్సి దుఃఖం తన్నుకొచ్చింది. ఏమి జరిగిందో తెలియక వెనక్కాలే వచ్చిన శ్రీవారు. జరిగినదంతా సి.సి.కెమెరాలో రికార్డ్ అవుతోంది. ఏమనుకున్నారో, ఏమో తిరుమల తిరుపతి దేవస్థానం వలంటీర్లు “సారి” చెప్పి మా ఇద్దరిని పక్కకి లాగి దేవుడి దగ్గరగా కొంచెం సేపు వదిలేశారు..నా మేనల్లుడిని కిందకు దింపి నించున్నాను, ఏమని వర్ణించను..

"నల్లని ముఖం, ఇంతింత ఊర్ధ్వపుండ్రాలు, కపోలాలు, గడ్డం క్రింద గంధపుచుక్క, అలా తలమీద వజ్ర కిరీటం, దాని నుంచి వ్రేలాడుతున్న తోమాలు, కుడిచేతిలో చక్రం, ఎడమ చేతిలో శంఖం, అక్కడి వరకు కనబడేటప్పటికి ఒళ్ళు మరచిపోయి, గోవిందా, గోవిందా, అని లోపలి వెడుతూ ఉంటే, ఆ తోమాలు ఇలా వ్రేలాడుతూ వుంటే, శ్రీవారి వక్షస్థలంలో, ఉభయనాంచారులు వారికి చుట్టి ఉంచిన పుష్పమాలలు, మహానుభావుడు మెడలో వేసిన, పెద్ద, పెద్ద సాలిగ్రామ మాలలు, ఆ పొట్ట, కొద్దిగా ఇలా వంగినటువంటి ఆ నడుము, దానికి పెట్టుకోన్నటువంటి వడ్డాణం, దానిమీద ఉన్న దశావతారాలు, అడ్డంగా పెట్టుకొన్నటువంటి నందకఖడ్గం, పాదములకు పెట్టుకొన్న ఆ మంజీరములు, ఇంతింత బంగారముతో, గజ్జెలతో చేయబదినటువంటి ఆ అందెలు, ఆ అందెలతో ఉన్నస్వామి, వెలిగిపోతూఉన్న, కుడిచేయి వజ్రకాంతులతో ఇలా చూపిస్తూవుంటే, ఆ మెరుస్తున్న మకరకుండలాలు చెవినికప్పివుంచుతే, ప్రకాశమయంగా స్వామి వెలిగి పోతూవుంటే, ఆ లలాటభాగం కనబడుతూవుంటే, మణులచేతపొదగబదినటువంటి ఆ చేతిని చూసి, "యిందరికి అభయములిచ్చు చేయి, కందువగొ మంచి బంగరు చేయి" ఆ చేయి వంక చూసి, అశ్రునయనాల మధ్య “ధగధగల దేదీప్యమూర్తి” శంఖ చక్రాల మధ్య తేజోమయ వదనం, సగం కప్పేసిన నేత్రాలు నామాల మధ్య నుంచి తొంగి చూస్తున్నాయి. సూర్య చంద్రులే నీ నేత్రాలు అంటారు అని తేరిపారా చూసే లోపు,

“బ్రహ్మ కడిగిన పాదమే అది, చూడండి” అని నాన్నగారు మా చిన్నప్పుడు అరిచిన అరుపు ఒక్కసారిగా చెవుల్లో వినిపించింది.. పరీక్షగా పాదాలు చూద్దామని ప్రయత్నించా. రెండు పాదాలు కనిపించకుండా బంగారు తొడుగులు, నిండుగా కప్పిన పువ్వులు, పైనుంచి కింద వరకు ఆభరణాలు మెరుపులు, పువ్వుల సొగసులు, దీపపు వెలుగుల్లో చిరునవ్వులతో ఆ వైకుంఠ వాసుడు ఇలలో, ఇలా నా కళ్ళముందు...నా రెండు చేతులు అప్రయత్నం గా గాల్లోకి లేచి నా తలమీదకి దండం “ఏడుకొండల వాడా, వెంకట రమణా, గోవిందా, గోవిందా” అన్న వేడుకోలు నోటి వెంట అప్రయత్నంగా వెలువడింది.. ఒకటా, రెండా ...పురుషోత్తమ శర్మ గారు కాలంలో గతించినా, ఈ పురుషోత్తముడు దగ్గర ఎలా నడుచుకోవాలో మాకు నేర్పిన పాఠాలు ఎక్కడికి పోతాయి..

బయటకు రాగానే జరిగిందంతా చెప్పాం. “అయితే నీ మేనల్లుడు సాష్టాంగం చేయించాడన్నమాట” అంది నవ్వుతూ వదిన. “ఏరా? అత్తని బొక్కబోర్లా పడేసావా?” అని అడుగుతోంది. పడేస్తే పడేసాడు కానీ ఎంత మంచి దర్శనం అయ్యిందో తెలుసా అని చెప్పబోయి, చెయ్యి నెప్పితో అశ్రువులు నిండాయి కళ్ళలో.. “సర్లే, ముందర ఆ చేయి ఇలా ఇవ్వు, ఎలా ఉందో చూద్దాం” అని చూస్తున్నాడు అన్నయ్య. చిన్నప్పుడు నాన్నగారు నేర్పించిన సంరక్షణ బాధ్యత ఇప్పుడు కళ్లలో కనిపిస్తోంది..

.

ఆ రోజులు, ఆ ప్రయాణం, ఆ ఆనందమే వేరు..ఒక పెద్ద పండగ, తిరుపతి ప్రయాణం అంటే...వెంకన్న మామ ని చూడబోతున్నామంటే..గౌన్లు నుంచి లంగా ఓణీ/ చుడిదార్ కి నా కూతురు, నిక్కర్లనుంచి పంచె/ ప్యాంట్లకి నా మేనల్లుళ్లు.. అందరూ పెద్ద వాళ్ళయ్యారు. మా జంటలు రెండూ 25 వసంతాలు పూర్తి చేసుకున్నాయి. అన్నీ మారిపోయాయి.

.

“ఒక్క శ్రీనివాసుడి చిరునవ్వు తప్ప”....పెరిగిన శాల్తీల సైజులు, రెండు కుటుంబాల 7 టిక్కెట్లు కార్లో పట్టటం మానేశాయని ఇన్నోవాకి అప్ గ్రేడ్ అయ్యాము. రాంభగీచలో రెండు రూములు చాలట్లేదని పెద్ద, పెద్ద వి. ఐ. పి కాటేజ్ ఎవరికి వారు పక్క, పక్కనే తీసుకోవటం మొదలెట్టాము.. నాన్ లు, వెజ్ కర్రీలు ఏ. సి హోటళ్లు, అవును మరి ఇప్పుడు కొండ మీద 30 డిగ్రీలపై మాటే. చిన్నప్పుడు 18 డిగ్రీలలో కుళాయి స్నానాలు ఎలా వణుక్కుంటూ చేసేవాళ్ళమో, ఈ పిల్లలకి (ఈ జనరేషన్) కి ఏమి తెలుసు మన కష్టాలు అని మా రెండు జంటలు సణుక్కునే వాళ్ళము. గట్టిగా అంటే పిల్లలు “హర్ట్”అవుతారు మరి !

సాయంకాలం... తిరుమల మెట్లు...ఒక పుస్తకం రాయచ్చు వర్ణించాలంటే..

ఫోటో తీస్తామంటూ వెంటబడే కెమెరా కుర్రాళ్ళు, మరమరాల మసాలా తెచ్చి ఇస్తామంటూ అమ్మే వాళ్ళు,బుడగలు, బూరలు చూపించి చిన్నపిల్లలని ఊరించి మా చేత కొనిపించే బేరగాళ్ళు, కుడి వైపు చూస్తే బేడీ ఆంజనేయ స్వామి ముందు వెలిగించిన హారతి కర్పూరాలు, గాల్లో దీపాలు, వాటినుంచి వచ్చే ఎర్రటి ఎరుపు వెలుగులు, నల్లటి పొగలు, కొట్టేసిన కొబ్బరి కాయ చిప్పలు, గుడి ముందే విడిచేసిన చెప్పులు, మెట్ల మీద మన లాగే కూర్చున్న జంటలు. కొత్తగా పెళ్లి అయ్యి వధూవరుల నుంచి దంపతులుగా మారిన జంటలు, చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు వెరసి కుటుంబాలు. కొన్ని ఈ రోజు గుండ్లు, రేపటి దర్శనం టిక్కెట్లు, ఇంకొన్ని నిన్నటి గుండ్లు, దర్శనానంతరం తిరుగు ప్రయాణం టిక్కెట్లు రేపటికి, అలా మెట్ల కింద చదునయిన ప్రదేశంలో తెచ్చుకున్న చేతి సంచి, సూట్ కేస్ తలగడగా పెట్టుకొని నిద్రించే కుటుంబాలు..ఎడమవైపు ఈ మధ్యనే కట్టిన నాద నీరాజనం మండపం, పాడుతున్న వాద్యకార్లు, ఆడుతున్న నృత్యకారులూ పెద్ద స్క్రీన్ మీద ఎస్.వి.బి.సి ఛానల్లో కనిపిస్తున్నారు. ఎదురుగా సెక్యూరిటీ చిన్న కోటలాగా గుడి ముఖద్వారంకి, అదే మహాద్వారానికి అడ్డంగా, ఇత్తడి కటకటాలు వెనక్కాల జన ప్రవాహం, అప్పుడే వెలుగుతున్న ఆ దీపాలు, తెల్లటి ఆ గోడ, గోపురం మీద నుంచి గోడ మీదకు అందంగా వెళ్ళాడుతూ మిణుకు, మిణుకు మంటున్న చిన్న సీరియల్ బల్బులు……ఆహా, ఇది కదా, ఇల వైకుంఠం, సజ్జనులకు మోక్షమిచ్చు పుణ్యధామం !!”

ఈ విధంగా ఏకధాటిగా 20 వసంతాలు, క్షమించాలి, గ్రీష్మ ఋతువు, మే నెల కదా, వదలకుండా ఆ శ్రీనివాసుడి సేవల్లో జన్మ ధన్యమైంది, ముఖ్యంగా శ్రీవారి కళ్యాణం.

రెండు కుటుంబాలు కింద శ్రీనివాసం కాంప్లెక్స్లో కలుసుకోవడం, విష్ణునివాసం లేదా మాధవం లో ఏ. సి రూములు, దొరక్కపోతే మన భీమాస్ ఉండనే ఉంది.. మనకోసం. కొత్తగా భీమాస్ డీలక్సు కూడా వచ్చిందే అని నేను, నా మేనల్లుళ్లు సంతోషించే వాళ్ళం. నా చిన్నప్పుడు మా అమ్మకి మాత్రం “లక్ష్మీనారాయణ భవన్”తప్ప ఏ హోటల్ కూడా నచ్చేది కాదు. అమ్మ అంటే గుర్తు వచ్చింది. నేను అమ్మని చివరిసారిగా కలిసింది కూడా శ్రీనివాసుడి సన్నిధి లొనే.

అక్కచెల్లెళ్లు, అన్న తమ్ముళ్లు అందరూ కుటుంబాలతో తిరుపతి వస్తున్నారు, మీరు కూడా రావాల్సిందే అని నా తమ్ముడు అని పట్టుబడితే, ఏ కళన ఉన్నారో, శ్రీవారు ఒకే అనేశారు. చిన్నప్పుడు “ఈ పెళ్ళికొడుకు నాకు నచ్చలేదు, నువ్వు చేసుకోవద్దు” అని కల్యాణ మండపంలో ఏడ్చిన చిట్టి తమ్ముడు వీడే. ఇప్పుడు బావ అంటే చాలా ఇష్టం, గౌరవం. “నీ పాత బ్లేజర్ ఇవ్వు బావా, ఈట్రిప్ లో పట్టుకెళతా. మీరు ఇచ్చిన షర్ట్ నాకు బాగా కలిసొచ్చింది”అని అడిగి మరీ పట్టుకెళతాడు, ఓ పెద్ద మల్టీనేషనల్ సాఫ్ట్ వేరు కంపెనీలో గ్లోబల్ లీడర్ అయ్యి ఉండి కూడా.

9వ తేదీ, ఆగస్టు, 2009 అమ్మని, పిల్లలని తీసుకొని కార్ లో తిరుమల చేరాను నేను. శ్రీవారు, హరిణి మిగతా గ్యాంగ్ తో చేరి కాలి నడక మార్గం లో సాయంకాలానికి రీచ్ అయ్యారు. అమ్మ, నేను, చెల్లి పిల్లలు, తమ్ముడు పిల్లలు చిన్నవాళ్లు కావడం వల్ల మాతో పాటు కార్ లో వచ్చారు కనుక ఒక కాటేజ్ లో కబుర్లు చెప్పుకుంటూ రిలాక్సు అయ్యాము. అప్పుడు చూసాను అమ్మ బాగా వయసు తెలుస్తోంది, 70 దాటింది అప్పటికే. అటాచ్డ్ బాత్రూం నుంచి బయటకు వచ్చి చీర కట్టుకునే ఓపిక లేక కుర్చీలో కూర్చుంది. “అమ్మా! పోనీ, నేను కట్టనా నీకు చీర?” అడిగాను జాలిగా. “ఏమీ వద్దమ్మా, ఎందుకో సడన్ గా బాగా చెమటలు పడుతున్నాయి, నీరసం అనిపిస్తోంది, ఈ మధ్య” అంది. 2 ఇయర్స్ అయ్యింది అమ్మ కి డయాబెటీస్‌ తప్ప ఏ ప్రాబ్లమ్ లేదు. ఈవెనింగ్ కల్లా కాలి నడక బ్యాచ్ పైకి రావటంతో నా కూతురు, మా ఆయన నా రూమ్ కి వచ్చేసారు. “థాంక్క్సు బావగారు. అమ్మ మాతో పాటు మా రూమ్ లో ఉంటుంది లెండి. ఒసేయ్ ప్రియా, నువ్వు నైనా తో పడుక్కో” అని తన కూతురు కమ్ నా ముద్దుల మేన కోడలిని మా రూమ్ లో ఉంచి మిగతా అడజస్ట్మెంట్ల కోసం వెళ్ళాడు. నైనా నా కూతురు ముద్దు పేరు. మర్నాడు పొద్దున్నే లేచి అందరం పొలోమంటూ దర్శనాలకి బయలుదేరాం. ఎవరి హడావుడి లో వాళ్ళు ఉన్నాము. ఈ లోపల మా వారు ఒక దర్శనం పూర్తి చేసుకొనిఅందరికంటే ముందుగా అమ్మ దగ్గరికి వెళ్లి శ్రీవారి ప్రసాదం అయిన లడ్డు చేతిలో పెట్టాడు. అమ్మ మొహం ఆనందంతో విప్పారింది. అందుకే శ్రీనివాస్ అంటే అమ్మకి బాగా ఇష్టం. అమ్మకి మాత్రమే కాదు, అందరికీ, ఎందుకంటే ఎవరు మా ఇంటికి వచ్చిన సరే, వాళ్ళు అడక్కుండానే, చెప్పకుండానే వాళ్ళ అవసరం గ్రహించి నాకంటే ముందే తీరుస్తాడు

మొత్తం 31 టిక్కెట్లు. పిల్లలు ఒక బ్యాచ్, ఆడవాళ్లు ఒక బ్యాచ్, మొగవాళ్ళు ఒక బ్యాచ్. జాగ్రత్తగా ముగించుకొని రూమ్ కి వచ్చాము.. మా కార్లో మేము చెన్నై కి తిరుగు ప్రయాణం. అమ్మ వాళ్లందరితో కల్సి రాత్రి నారాయణాద్రి అనుకుంటా...

18 ఆగస్టు నాన్నగారి తిధి. ఆ మాట నేరుగా అమ్మ పలకదు. శ్రావణ మాసం ఇంటికి వచ్చి వెళ్లమ్మా అని ఆడిగిందంటే అదే అర్ధం.” నాకు సెలవు దొరకదమ్మా” సమాధానం ఇచ్చి ఫోన్ పెట్టాను. అదే అమ్మ పిలిచే ఆఖరి పిలుపు అవుతుందని అప్పుడు నాకు తెలీదు. విజయవాడలో ఉన్న మా అక్కతో కల్సి దుర్గమ్మని చివరిసారి చూసుకొని 27 ఆగస్ట్ 2009 రాత్రి ఒంటి గంటకు అమ్మ ఆ ఏడుకొండలవాడి దగ్గరకు వెళ్ళిపోయింది. చెన్నైలో గాఢ నిద్ర లో ఉన్న నన్ను, మా వారిని మా అమ్మాయి మా బెడ్రూం తలుపు తట్టి లేపింది. “అమ్మా, అమ్మా.. నిద్రలే, అమ్మమ్మ వచ్చింది” అంది. అమ్మమ్మ రావటం ఏమిటి, నీ మొహం, మాతో పడుక్కుంటే ఈ కలలు రావుకదా“అని నేను లేచి, బుజ్జి దాన్ని పక్క లోకి లాక్కుని చూద్దును కదా హాల్లో ఉన్న మా ఇద్దరి సెల్ ఫోన్లు, ల్యాండ్ లైన్లు ఒకేసారి మోగుతున్నాయి..

పాపం పిచ్చి తల్లి, నిజంగానే వచ్చినట్లుంది, శాశ్వత నిద్రకి వెళుతున్న తాను, చివరిగా మనవరాలిని చూసుకొని మా మొద్దు నిద్ర లేపి మరీ వెళ్ళింది.

ఆ ఇయర్ నాన్న తద్దినానికి కూడా నేను వెళ్లలేదుగా, ప్రతీ సండే ఫోన్ చేసే నేను ఆ సండే ఫోన్ కూడా చేయలేదు అని తర్వాత కూడా చాలా బాధ పడ్డాను. ఎందుకో, అమ్మ లేకుండా ఆ కార్ లో తిరుమల వెళ్ళ బుద్ది కాలేదు. అందుకని ఆ ఇయర్ శాంత్రో కార్ అమ్మేసాము.

అమ్మ చివరి జ్ఞాపకాలు నాకు, మా శ్రీవారికి తిరుమల లొనే. రూమ్ లో కబుర్లు చెప్పుకున్న జ్ఞాపకం నాకు, లడ్డు ఇచ్చినప్పుడు అత్తగారు మెచ్చుకున్నారన్న జ్ఞాపకం మా వారికి ఆ శ్రీనివాసుడి పుణ్య ప్రసాదమే.

.

.

కాణిపాక్కం వరసిద్ధి వినాయకుడు, శ్రీ కాళహస్తి మొదటి రోజు. వరాహ నరసింహుడు, 2 సేవలు, 3 దర్శనాలు, వెంకటరమణుడు, తిరుమల రెండవ రోజు. అలిమేలు మంగ పురం గోవిందరాజస్వామి మూడవరోజు. వెరసి ఒక రోజు ట్రిప్ కాస్తా 3 రోజులకి పెంచుకుంటూ పొయ్యాము. అలిమేలు మంగ పురం లో “అత్తా నాకు మట్టి గాజులు ఇష్టం, కొనిపెట్టవా” అని అడిగి మరీ కొనిపించుకుంటుంది నా కూతురు. మురిసిపోతుంది అత్త. మేనల్లుళ్ళ గారాబం నా దగ్గర, మేన కోడలి గారాబం నా వదిన దగ్గర బాగా సాగుతాయి ఇప్పటకీ. టిక్కెట్లు, రూమ్ బుకింగ్ మా ఆయన పని. ఇన్నోవా లు, భోజనాలు మా అన్నయ్య పని. సంవత్సరం మొత్తం ఇంటి పని, వంట పని అని అలిసిపోయిన మేము ఇద్దరం బాగా రిలాక్స్ అయ్యేవాళ్ళం, ఆ తిరుమల లో శ్రీనివాసుడి కబుర్లు చెప్పుకుంటూ. అంత ప్రాణం మరి ఆ ఏడుకొండలవాడంటే..అలా అన్నీ పెంచుకుంటూ వెళ్లాం, సుఖాలు, భక్తి, వయసు, శరీరం అన్నీనూ…

.

.మే నెల 9వ తేదీ 2020…

జాపకల్లోంచి బయటకు వచ్చి, భోజనం చేసి సండే కదా అని నడుం వాల్చాను. కళ్యాణం టిక్కెట్లు బుక్ చేసుకున్నాం, కానీ వెళతామో, లేదో తెలియదు అనుకుంటూ ఉన్నాము, రెండు ఫ్యామిలిస్. మొబైల్ టింగుమని శబ్దం ఈ మెయిల్, దానితో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం వారి మెసేజ్..” శ్రీవారి కళ్యాణం రద్దు చేయటమై నది, ఎమౌంట్ మీ అకౌంట్ కు త్వరలోనే జమ చేయబడుతుంది.” అని సారాంశం. చెప్పలేనంత నిస్పృహ, నిస్సత్తువ ఆవహించింది. అప్పుడు గుర్తు వచ్చింది మా అత్తగారు ప్రతీ రోజు చేసే పని, శ్రీవారి కళ్యాణ హారతి కళ్లకద్దుకొని, మధ్యాన్నం భోజనానికి కూర్చోవటం ఆవిడ నిత్య జీవితంలో ఒక భాగం. అందులో మే నెల అయితే మేము టీవీలో కనిపిస్తే చాలు, సంబరపడిపోయి సాయంకాలం మేము రూముకి వచ్చాక ఫోన్ చేసి మరీ చెపుతారు, గుంటూరు నుంచి. ఇపుడు లాక్ డౌన్ పుణ్యమా అని నేను ఫాలో అయిపోవడం మొదలెట్టాను.

ఇన్ని సంవత్సరాలు చేయడం వల్ల ఎంతగా లీనం అయిపోయ్యానంటే ఇప్పుడు కళ్యాణ శ్రీనివాసుడు అయిన ఆ మలయప్ప స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు ఎక్కడో లేరు…ఆంజనేయస్వామికి సీతారాములువలె నా హృదయంలో నిండుగా తిష్ఠ వేసుకొని కూర్చున్నారు.

ఒకటా, రెండా…ప్రతీ అడుగు ఆ కళ్యాణ ఘట్టంలో స్వామి, అమ్మ వార్లు…మనసులో తలుచుకోగానే ఇలా ప్రత్యక్షమవుతారు…

మొదటి గా మన గోత్ర నామాలు సంకల్పం చెప్పుకోగానే..

1. పుణ్యవచనం మరియు అంకురార్పణ: ప్రధాన హోమం, లాజ హోమం (పేలాలు అగ్నిహోత్రునికి సమర్పించే కార్యక్రమం, ఈ లాజ హోమం). నవ ధాన్యాలని ఆ మృత్తికా పాలిక లలో, ఓషధి జలాలు నింపుతూ మంత్రాలు చదువుతూ ఉంటే వస్తాడు, ఆ కళ్యాణ శ్రీనివాసుడు. బంగారు శంఖు చక్రాలతో, జారీ తల పాగాతో, పైన మెరుస్తున్న కిరీటంతో , అన్నిటినీ మించిన సుందర వదనంతో, మెరుస్తున్న మందహాసంతో.. నిత్యం కళ్యాణం అయినప్పటికీ ప్రతీ రోజూ కొత్తగానే సిగ్గుపడతాడు ఈ కల్యాణ వేంకటేశ్వరస్వామి.. ఒక రోజు నీలం రంగు తలపాగా, ఇంకొరోజు ఎర్రగా కుంకుమ వర్ణంలో మెరుస్తున్న తల పాగా, మరోరోజు లేత కనకాంబరం రంగు, ఆ మర్నాడు పూర్తి మెరూన్…ఏ రోజుకి ఆ రోజు తలపాగా శ్రీనివాసుడికి వన్నె తెచ్చిందా లేక శ్రీనివాసుడే ఆ తలపాగాకి వన్నె తెచ్చాడా అని ఆశ్చర్య పోతూ తలపాగా వర్ణాలలో మెరిసిపోతూ చూస్తున్న కిరీటంలో రత్నాలు, కెంపులు, వజ్ర వైడ్డుర్యాలూ..ఇన్ని సంవత్సరాల కళ్యాణ కళ ఆ విగ్రహంలో, ఆ మొహంలో ఉట్టిపడుతూ ఉంటుంది. ఆ కళ్ళు చూస్తాయి, ఆ బుగ్గలు సిగ్గులు కురిపిస్తాయి, ఆ పెదాలు చిరు మందహాసంతో విచ్చుకుంటాయి. కొంచెం కిందకు రాగానే ముదురు నీలం వర్ణంలో పెద్దవి నాలుగు మణులు, చిన్న సైజులో నాలుగు కెంపు వర్ణంలో మణులు, వెరసి ఆ పతకాన్ని” కౌస్తుభం” అంటారుట. చిన్నప్పుడు మా మేనత్త “శేషత్త” చెప్పింది. పక్కనే ఇంకొక బంగారు పతకంలో లక్ష్మీ అమ్మవారు, ఇంకొక బంగారు గొలుసులో వెళ్ళాడుతూ మలయప్ప స్వామి మెడ నలంకరించి ఉంటుంది. బంగారు రంగులో వజ్రాల తాపడం మధ్య ఒక ఎరుపు రంగు పెద్ద రత్నం గర్వంగా శ్రీనివాసుని వరద హస్తం నుండి మనలోని గర్వాన్ని అణుచుకొమ్మని చెపుతున్నట్లుంది. “అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ” లోకాలయిన అధోలోకాలూ…..భూలోక, భువర్లోక, సువర్లోక, మహార్లోక, జనలోక, తపోలోక, సత్యలోకాలయిన ఊర్ధ్వ లోకాధిపతి నడుముకి ఠీవిగా అంటిపెట్టుకొని మనలోని మాలిన్యాన్నీ కడుక్కోమని హెచ్చరిస్తుంటుంది వామ హస్తము. ఇకపోతే కంఠ సీమ నుంచి పదాలవరకు ఒక దాని పైన ఒకటి పేర్చినట్లుగా నేను అతి పెద్ద దాన్ని, నేను పెద్దదాన్ని, నేను మధ్యమం, నేను చిన్న దాన్ని, నేను అతి చిన్నదాన్ని అని పోటీ పడుతూ, భూ గోళాకారం లో రంగు రంగుల రత్నాల పతకాలు. ఆ ఐదు మా ఐదుగురు అక్క చెల్లెల్లుని గుర్తు చేస్తాయి నాకు. ఆ పతకాలకి అడ్డంగా, పైనుంచి కిందవరకు వెళ్లాడుతున్న బంగారు యజ్ఞోపవీతం. వరద హస్తానికి, వక్షస్ధలానికి మధ్య ధర్భలు. బంగారు వర్ణంలో మెరుస్తున్న పాదాలు భక్తజనావళికి ఇంకా దగ్గరగా చూపించే ప్రయత్నం, ఆ కెమెరామెన్ యొక్క వృత్తినైపుణ్యం. మీ అందరి మనసులకంటే, ఈ బ్రహ్మ కడిగిన పాదాలకు మేమే దగ్గరగా ఉన్నాం సుమా అనే వివిధ వర్ణాలతొ అలరారే స్వచ్చమైన సుమాలు. ఒక పెద్ద గజమాల ఆపాదమస్తకం. ఇంతలోనే వచ్చారు, మన అన్నమయ్య గారు. “ తలమూచి ఎవరయినా తమ వారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా? అని ప్రశ్నిస్తూ…. మీ ఇద్దరి విభావాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి వింతసేయమయ్య…” అంటూ…

2. కంకణాలు: అంకురార్పణ అవుతున్న సమయంలో, మనం ఆ శ్రీనివాసుని ఠీవి ఆపాదమస్తకం చూస్తుండంగనే, పసుపు రంగు కంకాణాలు కళ్యాణ కార్యక్రమానికి వధూవరులుకు రక్షగా ఉండేందుకు శ్రీనివాసుని కుడి చేతికి, శ్రీదేవి, భూదేవి అమ్మ వార్ల ఎడమ చేతికి ధరింపచేసి, అర్చకస్వామి తన కుడి చేతికి కట్టుకున్నారు. “దీక్షా కంకణం ఎంత అవసరమో కళ్యాణ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలంటే” వివరిస్తున్నారు “సముద్రాల రంగనాథన్ గారు. ఈ మధ్యనే వారి నుంచి వర్ణనా దీక్ష తీసుకున్నట్లుగా గురువుని మించిన శిష్యులమంటూ వస్తున్నారు, రొంపిచర్ల యశ్వ౦త్ దీక్షితులు, సంపత్ శర్మ గార్లు.

ఇంతలో యజ్ఞ వాటికలో ఒక్కక్కరుగా అగ్ని, బ్రహ్మ, ఇంద్ర, వరుణ, ఆదిత్య, కుబేరాది దేవతలను, సప్త ఋషులును ఆహ్వానించడమయినది.. సాక్షాత్తు శ్రీనివాసుడే వరుడయిన వేళా, ఆ స్వామి వారు తినకుండా అతిధులు తినటం ఎలా అని ఆలోచిస్తున్నారట.. మండపo లో ఉన్న స్వామి అతిధులు తినకపోతే ఎలా అని మధన పడుతున్నాడుట. సప్త ఋషులు అందరూ కలసి లక్ష్మీ నరసింహ స్వామిని సాక్షాత్ శ్రీనివాసుని తండ్రి గా భావించి, అహోబిలం లో నివసిస్తున్న ఆ స్వామి వారికి ముందుగా నివేదించి, అతిధులందరిని పెండ్లి భోజనాలకి కూర్చోపెట్టారట. “వెంకటాచలం నుంచి అహోబిలం వరకు దేవతలు పంక్తి భోజనాలు కూర్చుని చేసారట…ఊహించుకుంటేనే ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఆ దృశ్యం మనలాంటి సామాన్య మానవులకి.

3. వరుడిని ఆపాదమస్తకం చూపించినా, వధువులిద్దరిని ఇంకా దాచిపెట్టారు, మా వ్యాఖ్యాతలు మరియు కెమెరామెన్. “ఇంకా ఎప్పటికి చూపిస్తారయ్యా, నా కోసం పుట్టిన నా కన్యకామణులను, పెండ్లి కూతుళ్ళను” అని ఆ కళ్యాణ శ్రీనివాసుని భావం అర్ధం అయ్యినట్లుంది…పక్కపక్కనే రెండు నక్షత్ర్రాలు పోటీ పడుతున్నట్లు, ప్రసన్న వదనాలతో, ముఖాన అలంకరించిన నామాలతో, తారాకాంతి తిరస్కార నాసాభరణ భాసురలై, పట్టు వస్త్రాల అలంకారంలో సిగ్గులోలకబోస్తూ వచ్చారు శ్రీదేవి, భూదేవి వధువులై….వన్నె తెస్తున్న కర్ణాభరణాలు, పగడాల గొలుసులు,కాశి కాయా గుండ్లు, బంగారు వడ్డాణాలు అందంగా చెక్కిన ఒక పద్మము ఆ వడ్డాణం లోంచి తొంగి చూస్తుంటే, నిజ పద్మాలన్ని ఆ వధువులిద్దరి ముఖ పద్మాలని చూసి ఆ అందం ముందు, తమ అందం ఏ పాటి అని సిగ్గుపడుతున్నాయి. సాక్షాత్ శ్రీ మహావిష్ణువునే పతకంగా బంధించి, వక్షస్ధలాన ధరించి గర్వంగా చూస్తున్నారు.. ఆ ఆభరణాలకు, అమ్మవార్లకు మరింత అందాన్ని, శోభని అందిస్తున్న పూలమాలలు ఆపాదమస్తకం. ఎన్నెన్నో జన్మల పుణ్యం ఆ తిరుమలగిరుల సుమాలు ఈ రోజున అమ్మవార్లను, అయ్యవారిని ఆ కళ్యాణ మండపంని అలంకరించిన భాగ్యం పొందాయి. “నిత్య యవ్వనవంతులయిన ఆ దేవేర్లు, ఆ స్వామి వారిని వర్ణించ మనతరమవునా!!”

4. నూతన వస్త్ర సమర్పణ: జరీ అంచు పట్టువస్త్రాన్ని భుజాలనలంకరించిన గజ మాల మీదుగా ఆ జగదేక సుందరునికి సమర్పించి, నమస్కారం చేసుకున్నారు అర్చకులు. ఎరుపు, ఆకుపచ్చ, పసుపు, నీలం, బచ్చలి పండు రంగు ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రంగు కంచి పట్టు చీరలు ఒక వైపు పెద్ద జరీ అంచుతో ఉన్న రెండు నూతన వస్త్రాలను, శ్రీనివాసునికి చూపించి, వధువులైన సాక్షాత్ జగన్మాతలకు సమర్పించి కాళ్లకు నమస్కారం చేసుకున్నారు. వధూవరులు సిద్ధమయ్యాము. ప్రవర మొదలెట్టండి అని శ్రీనివాసుడి ఆజ్ఞ అయ్యింది కాబోలు.

5. ప్రవర: మానవులకు కళ్యాణానికి ముందుగా వారి యొక్క ఋషి, శాఖ, గోత్ర, వంశ పూర్వీకుల నామాలు చెప్పుకోవడాన్ని “ప్రవర” అంటారు. జగన్నాటక సూత్రధారి అయినా మానవ జన్మ అవ్వటంతో కళ్యాణంలో ప్రవర, ఈ విధంగా చెపుతున్నారు.. “జంబు ద్వీపే, భరత వర్షే, భరత ఖండే, భూమధ్యరేఖే మధ్యప్రదేశే” అని మొదలుపెట్టి వరుడయిన శ్రీనివాసుడికి “అనేక లోక బ్రహ్మాండ నాయకస్య, కోటి సూర్యప్రకాశశ్యా, ఆనంద గుణగణ గాంభీరస్యా, దివ్య మంగళ విగ్రహస్యా, ఇమతో వైకుంఠ నాయకస్య, శ్రీమద్ వైశాఖ ఆగమోక్త ప్రకారేనా, ఆంగీరస భారద్వాజ ప్రవరాఖ్యా, భారద్వాజ స గోత్రోద్భవస్య, శ్రీ ఆదినారాయణ పుత్రస్య, శ్రీ మహావిష్ణో, పరబ్రహ్మణే, స్సప్త లోక పరిపాలకాయా, కిరీట కేయుర దివ్యాభరణ ఆలంకృతాయా, కౌస్తుభాలంకృతయా,శ్రీమద్ అఖిలాండ కోటి నాయకాయా, స్వర్ణ గరుడ వాహనారుడాయ, శ్రవణ నక్షత్ర, మకర రాసో జాతాయా, శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే “వరాయా”…

వధువు శ్రీదేవి అమ్మ వారి ప్రవర …. “సకల వేదాధ్యాయిని, సర్వాలంకారవతి, శ్రీ మహావిష్ణు వక్షస్థలస్థితాయా, రత్నాంగ, కేయూర పాదారవిందాయా, అత్యంత సౌందర్యవతీ, శ్యామలాంగి, అయోనిజే, భృగు సంకల్ప తనయా, ఉత్తర నక్షత్రే, కన్యా రాశస్య ఇమామ్ శ్రీదేవి నామ్య మాంగళ్యా”…..

వధువు భూదేవి అమ్మవారి ప్రవర… “సకల వేదాధ్యాయిని, సర్వాలంకారవతి, శ్రీ మహావిష్ణు వక్షస్థలస్థితాయా, రత్నాంగ, కేయూర పాదారవిందాయా, అత్యంత సౌందర్యవతీ, శ్యామలాంగి, అయోనిజే, కశ్యప ప్రజాపతి సంకల్ప తనయా, రేవతి నక్షత్రే, మీనా రాశస్య ఇమామ్ భూదేవి నామ్య మాంగళ్యా”…..

“కన్యాదానం కరిష్యే” అర్చకస్వామి చేస్తారు..

6. స్నపన తిరుమంజనం: అమ్మ వార్ల మంగళసూత్ర పూజను స్నపన తిరుమంజనం అంటారు. ముందుగా, మాంగళ్యాలను అయిదు వెండి పాత్రలలో నిండుగా ఉంచిన గంగా, కావేరి, పాపనాశం మొదలగు పవిత్ర జలాలతో అభిషేకించి, ఆ తరువాత బ్రహ్మ కడిగిన శ్రీవారి పాదాల వద్ద ఒక కొబ్బరికాయ పైన వాటిని ఉంచి, పసుపు అలది, కుంకుమ సమర్పించి, అక్షతలు అద్దటం చేస్తారు.

7. మాంగళ్యధారణ: గట్టి మేళం మధ్య అర్చకస్వామి ఆ శ్రీవారి పాదపద్మముల వద్ద స్నపన తిరుమంజనం చేసిన మంగళసూత్రాలను “మాంగళ్య౦ తంతునామేన “లోక రక్షణహేతునా” అని శ్రీదేవి అమ్మవారికి ధరింపచేస్తారు. పద్మిని, పద్మప్రియ, పద్మహస్తి, పద్మాలయ, పద్మదళాయతాక్షి అయిన అమ్మవారు లోకాలన్నీటిని రక్షిస్తుంది అని..

ఆ తరువాత శ్రీవారి పాదపద్మముల వద్ద స్నపన తిరుమంజనం చేసిన మంగళసూత్రాలను “మాంగళ్య౦తంతునామేన జీవ రక్షణహేతునా” అని భూదేవి అమ్మవారికి ధరింపచేస్తారు. ఈ తల్లి సకల జీవ రాసులను రక్షిస్తుంది అని.. విష్ణు ప్రియే, విష్ణు హృత్కమలవాసిని, తత్ పాదపద్మం మయి సన్నిధాత్వం.. అని మనసుని అమ్మ వారికి సమర్పించి మన అందరి తరపున పాద పద్మాలు గట్టిగా పట్టుకున్నారు అర్చకులు…

ఎన్ని తరాలు తరించాయో కదా, ఈ నిత్య స్వరూపుడయిన శ్రీవారి కళ్యాణం చూసి!

శ్వేతాశ్వతారో ఉపనిషద్ చెపుతుంది “మనిషి జన్మ ఎంత అంటే ఒక వెంట్రుకని వంద ముక్కలు చేస్తే ఆ వందవ వంతు మానవ జన్మ; అందులో బాల్యం, యవ్వనం, అహంకారం, గర్వం”అన్నీనూ..

అదే విధంగా శంకర భగవత్పాదులు వారు “మా కురు ధన జన యవ్వనగర్వం, హరతి నిమేషాత్కాలః సర్వం మాయామయమిద మఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా” అని మానవ జన్మ ఎంత చిన్నదో, అహంకారం ఎంత పెద్దదో, బ్రహ్మపదం ఎంత గొప్పదో తెలియపరచారు.

అలాగే, “కాదంబరి” కావ్యంలో బాణ భట్టుడు కూడా అంటారు “గర్భేషరత్వం, అభినవ యవ్వనత్వం, అప్రతిమ రూపత్వం, అమానుష శక్తిత్వంచే మహతీయం పలు అనర్ధ పరంపరాః అని…

ఆ పరమాత్మ ముందు సంపద, యవ్వనం, నన్నుఎవరూ ఏమీ చెయ్యలేరు అనే గర్వం ఇవన్నీ ఎందుకూ పనికి రావని…

“నిత్యాత్ముడైయుండి, నిత్యుడై వెలుగొందు, సత్యాత్ముడైయుండి, సత్యమై తానుండు, ప్రత్యక్షమై యుండి బ్రహ్మమై తానుండు, సంస్తుత్యుడీతిరు వెంకటాద్రి విభుఁడు” అని కీర్తించిన అన్నమయ్యది ఎంత వేదాంత సారమో, ఎన్ని జన్మల పుణ్యమో…ఓం నమో వెంకటేశాయ!

8. హారతి: సాక్షాత్ సూర్య చంద్రులే నేత్రాలుగా కలిగిన ఆ నూతన వధూవరులకు మంగళహారతులు అర్పించి మనకు చూపిస్తారు అర్చకులు..

“భావము లోనా బాహ్యము నందున” అంటూ “హరి అవతారములే అఖిల దేవతలు, హరి లోనివే బ్రహ్మాడంబులు, హరి నామములే అన్ని మంత్రములు.. హరిహరి, హరిహరి, హరియనవే మనసా; అంటూ మన మనసు లోని అజ్ఞానాన్ని పారద్రోలాలని చూస్తున్నాడు అన్నమయ్య.

9. తీపి అప్పాలు ఆరగింపు: లౌకికంగా శ్రీవారికి చూపించి పెద్ద, పెద్ద తీపి అప్పాలను, బెల్లం ముక్కను ఆవు నెయ్యితో కలిపి అగ్నికి ఆహుతి చేస్తారు, అదే “ఆరగింపు”... “కేశవం ప్రతిగచ్ఛతి”

10. పూర్ణాహుతి: ఆవుపాలు, ఆవు నెయ్యి, ఆవు మూత్రం, ఆవు పేడ, ఆవు పెరుగు కలిపి పంచగవ్యం అంటారు. యజ్ఞకర్తకి “పంచగవ్యం” ప్రధానం. ఏ దేవ దేహమున ఇన్నియు జన్మించెనో, ఏ దేవ దేహమున ఇన్నీయు లయమందునో, ఏ దేవుడీజీవుళ్ళిన్నింటిలో నుండెడో, ఏ దేవుడవ్యక్తుడైయుండునో, ఆ దేవాది దేవునికి లోకకల్యాణం కోసం చేసిన ఈ యజ్ఞానతరం పూర్ణాహుతి… ఎరుపు రంగు పట్టు వస్త్రం లో సుగంధ ద్రవ్యాలు, సమిధలు, అప్పాలు, ఆవు నెయ్యితో తడిపి అగ్నిదేవునికి అర్పించినప్పుడు “పూర్ణమిదం” అంటే యజ్ఞం పరి పూర్ణమయ్యిందని అర్ధం. సంతోషించిన అగ్ని దేవుడు ఒక్కసారిగా తన నాల్కలు చాచి అందుకొన్నాడా అనిపిస్తుంది. ఆ తర్వాత పైకి ఎగిసిన అగ్ని జ్వాలల్లో యజ్ఞ పురుషుని ఆకృతి, ఆ శ్రీనివాసుని ఆకృతి ఆ అగ్ని రూపంలో తత్వ చింతన కలిగిన ప్రతీ భక్తునికీ కనువిందు చేసి తీరుతుంది.

11. అగ్నిగాయత్రి: పూర్ణాహుతి అనంతరం హోమం చేసిన పురోహితులు చేసే కార్యక్రమం “అగ్నిగాయత్రి”. “సర్వం శ్రీనివాస పరబ్రహ్మార్పణమస్తు” అని ఆ పుణ్య కార్యక్రమ ఫలితాన్ని ఆ జగత్కారకునికి సమర్పిస్తారు.. అది చూస్తున్న మనం రెండు చేతులు గాల్లోకి లేపి తల పైకి చేర్చి “ఏడుకొండలవాడ, వెంకట రమణ, గోవిందా, గోవిందా”

12. వారణమాయిరం: ఒక వైపు తెల్ల పంచెలలో అన్నమాచార్య వంశస్థులు, ఇంకొక వైపు పసుపు పట్టు పంచెలలో తిరుమల తిరుపతి దేవస్థానం పురోహితులు కూర్చుని కొబ్బరికాయ ని ఆ చివరినుంచి, ఈ చివరి వరకు దొర్లిస్తూ ఆడుకుంటూ కల్యాణ సమయంలో గోదాదేవి గుర్తు చేసుకుంటారు. తిరు పాసురం “వారణ మాయరం శులవదించెద నారణంయే నడికిండ్ర నెన్ద్రిది, పూరణ పోర్కుడం, వైతుపురం నెంగం; తోరణం నాటగ, నా కండేన్ తోడినాన్” అంటే వేయి ఏనుగులతో తనను కళ్యాణమాడ వస్తున్న నారాయణుని చూశానని గోదాదేవి చెలికత్తెలతో చెపుతోంది అని అర్ధం. ఈ కళ్యాణ కార్యక్రమంలో విష్ణుచిత్తుని కుమార్తె శ్రీ గోదాదేవి శ్రీ మహావిష్ణువుని మానసికంగా పరిణయమాడిన రీతి స్మరించుకోవటం ఆనవాయితీ.

13. మాలా పరివర్తనం: తిరుమల లో పుష్పాలు బహు సుందరం, బహు విచిత్రం, బహు వర్ణాలు మరియు బహు సుకుమారాలు. వాటిలో అత్యంత శ్రేష్టమయినవి ఏర్చి,కూర్చి శ్రీనివాసుని అలంకరించిన గజమాల చేస్తారు. శ్రీవారి అనుమతి తో ఆయన సమర్పించినట్లుగా భావించి శ్రీదేవి తల్లికి ఆ మాలని అర్చకస్వామి సమర్పిస్తే, ఆ తల్లి చిరునవ్వుతో ఆ శ్రీనివాసునికే తిరిగి సమర్పించమని ఆదేశిస్తుంది. అలాగేనని శ్రీనివాసునికి సమర్పిస్తే, ఒక్క క్షణం అమ్మవారి మెడను తాకిన ఆ పూలమాల గుబాళింపు తాను ఆస్వాదించి, వెంటనే కినుకగా చూస్తున్న భూదేవికి ఆ మాల సమర్పించమని పురమాయింపు. సరేనని, భూదేవి అమ్మ వారికి సమర్పించగానే కినుకంతా పోయి చిరునవ్వుతో ఆ మాల శ్రీనివాసునికే చెందాలి, ఆయన కే సమర్పించమని ఆదేశిస్తుంది. అలా ఇద్దరు దేవేరుల గళాలనలంకరించి తిరిగి ఆ మాల శ్రీనివాసుని గళాన్ని అలంకరించడం అనే ప్రక్రియని “మాలాపరివర్తనం” అంటారు. ఆ సమయంలో ఆ నూతన దంపతుల ముఖాలలో “భావపరివర్తనం” మనసుని తాకిన భక్తుడు ఆధ్యాత్మికా లోకంలో ఒక మానసిక విహారం చేసి వస్తాడు.

వధూవరులు దంపతులైన వేళా, మనకి తెర పడుతుంది. “అయ్యవారి దగ్గరికి అమ్మవార్లు వస్తారా? లేక అమ్మవార్లు అయ్యవారి దగ్గరికి వస్తారా; తెర తీసేలోపు చెప్పాలి అని ప్రతి సంవత్సరం హరిణిని ప్రశ్నించి ఆటపట్టిస్తాను నేను .... హరిణి సమాధానం చెప్పే వరకు కూడా మేము విరహం తాళ లేము అని వామ హస్తము వైపు భూదేవి, దక్షిణ హస్తం వైపు శ్రీదేవి వచ్చి చేరారు. “అతడు లక్ష్మీకాంతుడు; అన్నియు నొసఁగుగా, ఇతరుల వేడుకొన్నను ఏమివ్వగలరు” అని అన్య దేవతలందరిని పరిహశిస్తు, శ్రీవేంకటేశ్వరుని ప్రస్తుతిస్తు వచ్చాడు మన అన్నమయ్య.

14. తలంబ్రాలు: దీనినే “అక్షతారోహణం”అంటారు.నెత్తిన దీక్షాపాగా చుట్టుకొని, వెండి గిన్నెలో పసుపు అక్షతలు దోసిలితో నూతన దంపతుల తలపై నుంచి పొయ్యడం అనే సాంప్రదాయం అర్చక స్వాములు నిర్వహించడమే సామాన్య భాషలో “తలంబ్రాలు”…మరి ఇంత మంచి సందర్భం వదులుకుంటానా? అని వచ్చారు అన్నమయ్య. “పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వింది పెళ్లికూతురు, పేరంటాళ్ల నడుమ పెండ్లికూతురు.. విభు పేరు పుచ్చ సిగ్గుపడే పెండ్లికూతురు”…పిడికిట…

“పిరిదూరినప్పుడే పెండ్లికూతురు, పతి పేరవేచేనిదుగో పెండ్లికూతురు”…అంటూ.. భావపారవశ్యంలో శ్రీనివాసునికి, శ్రీదేవికి, భూదేవికి నడుమ శృంగారాన్ని మనకి సంపూర్ణంగా అందించిన మహానుభావులు, శ్రీవారి నందకం కాక మరేమిటి?

15. మంగళ హారతి: నిత్యకళ్యాణం, పచ్చ తోరణంగా భాసిల్లే తిరుమలలో ఆ రోజు కళ్యాణ సేవ పూర్తి అయిన శుభసందర్భంలో మంగళకరమయిన శుభాకాంక్షలు పాట ద్వారా తెలుపుతూ కర్పూర నీరాజనాన్ని దంపతులకు చూపించి, ఆ తర్వాత మనకి కూడా చూపిస్తారు.. “ఇంక లేవండర్రా, వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు, ఏకాంతంగా ఆ నూతన దంపతులు” అని మంగళహారతి ద్వారా మనకి చెప్పినట్లే…

అందరూ మండపం వదలలేక వదిలి వెళ్లినా “వినరో భాగ్యము, విష్ణుకథా…వెనుబలమీదిగో, విష్ణు కధ…ఆది నుండి సంధ్యాది విధులలో వేదంబయినది విష్ణు కధ…..నాదించేనిదే నరదాదులచే వీధి వీధులను విష్ణుకధ…వినరో భాగ్యము…” అని అక్కడే ఉండిపోతాడు అన్నమయ్య మాత్రం. ఇంకా ఏమయినా అంటే “వదలక వేదవ్యాసులు నుడివిన విహిత పావనము, విష్ణుకధ.. సధనంబైనది, సంకీర్తనయై వెదకిన చోటనే విష్ణుకధ” అంటాడు. చిరునవ్వులతో శ్రీనివాసుడు దేవేరులిద్దరి అనుమతితో అన్నమయ్యని మాత్రం ప్రేమతో అక్కడే ఉంచేసుకొని, మనల్ని పంపించేస్తున్నట్లనిపిస్తుంది….వెనకాల నుంచి “ఇల్లిదే శ్రీవేంకటేశ్వరు నామము వెల్లి గొలిపె నీ విష్ణుకధ” అంటూ అన్నమయ్య వినిపిస్తుంటాడు…తన సాహిత్యాన్ని..

16. పురోహితుల దక్షిణ: కళ్యాణ క్రతువు నిర్వహించిన పురోహితులు దక్షిణ స్వీకరించేవేళ

తిరుమలలో అయితే మనం గోవిందుని దర్శనం కోసం క్యూలో పరిగెత్తే సమయం. అపరాహ్ణo ఎప్పుడయ్యిందో కూడా తెలీదు మనకి, కళ్యాణమండపంలో కళ్యాణోత్సవంలో లీనమయ్యి ఉండటంవల్ల.

అదే ఎస్. వి. బి.సి ఛానల్లో అయితే వెనకాల నుంచి “ప్రతీ జ్ఞానీ సజ్జనుడు కాకపోవచ్చు; కానీ ప్రతీ సజ్జనుడు తప్పక జ్ఞాని అవుతాడు” అని వ్యాఖ్యానం, బంగారు గోపురం, విమాన వెంకటేశ్వర స్వామి దర్శనంతో….

ఓం…నమో వెంకటేశాయ…

ఎన్నో వేల మైళ్ళు భౌతికంగా దూరంగా శ్రీనివాసుడి విగ్రహం.. వయసు పెరిగే కొద్దీ మానసికంగా దగ్గరగా మదిలోనే శ్రీనివాసుడు…

ఏడు ఏళ్ళు వయసులో “విగ్రహం” దగ్గరగా.. “దైవం” దూరంగా..యెభై రెండేళ్ళ వయసులో “దైవం”దగ్గరగా “విగ్రహం” దూరంగా…

ఈ జీవుని తో దేవుడు ఆడే దగ్గర, దూరాల ఆటలు గ్రహించేలోపే వస్తుంది ఆ సమయం..

ముక్తి-మోక్షం:

ఈ ప్రాపంచిక సంసార సాగరం నుంచి జీవునికి లభించేది ముక్తి. జీవాత్మ నుంచి ఆత్మగా మారటమే ముక్తి…

మోక్షం అనేది నాలుగవ పురుషార్థం. మనిషి చేసే సత్కర్మల ఆధారంగా నిర్దేశితమవుతుంది. యెన్నో జన్మల ముక్తి తర్వాత జనన మరణాల చక్రాల నుంచి విముక్తి పొందటమే మోక్షం. జీవాత్మ నుంచి పరమాత్మగా మారటమే “మోక్షము”

అద్వైత వేదాంతం ప్రకారం నాలుగు రకాల మోక్షాలు ఉన్నాయి.

1. సాలోక్య: ఆత్మ తనకి ఇష్టమయిన దేవుని నివాసానికి (విష్ణు నివాసాన్ని) చేరి నివసించడo..

2. సామీప్య: ఆత్మ తనకిష్టమైన దైవం పక్కనే నివసించడం

3. సారూప్య: ఆత్మ భగవంతుని అవతారంగా ఉండటం

4. సాయుజ్య: పాలలో నీళ్లు కలిసిపోయినట్లుగా ఆత్మ ఆ పరమాత్ముడైన భగవంతుడిలో కలిసి పోవడం.

ఉపసంహారం:

18 జులై 2020

“కాల్ మీ అర్జంట్” డాక్టర్ ప్రియ. అన్న మెసేజ్ చూసి ఏమయిందబ్బా అనుకుంది డాక్టర్ హరిణిగా మారబోతున్న హరిణి. అవును మరి ఇంకా రెండు వారాలే, తన పి. హెచ్. డి పూర్తి అవుతుంది. ఇప్పుడు రాత్రి 9.30 గంటలయ్యింది. అంటే, ఇండియాలో అర్ధరాత్రి 12.30 అయ్యుటుంది. సర్లే ఎందుకయినా మంచిదని కాల్ చేసింది. “ఖంగారు పడకుండా విను అత్త కి అసలు బాగాలేదు. డాడీ వాళ్ళ హాస్పిటల్లోనే ఉంది. శ్వాస తీసుకోవటంలో సమస్య వచ్చిందిట. నిన్న సాయంత్రం 5 గంటలప్పుడు మామయ్య తీసుకొచ్చి చేర్పించారు” అంది డాక్టర్ ప్రియ. “అవునా మరి, నాన్న ఏమీ చెప్పలేదు”. అమ్మతో మాట్లాడి మూడు రోజులయ్యింది. ఇప్పుడెలా ఉంది? అంత ఓకేనా? “- ఖంగారు పడుతూ అడిగింది హరిణి.” ఇదిగో, ఇందుకే నీకు చెప్పలేదు. ఆదుర్దాపడకు. పెద్దవాళ్లు చూసుకుంటారులే. నువ్వు భోంచేసావా, అని మాట మార్చింది ప్రియ. నేను మళ్ళీ మాట్లాడుతా అని కాల్ కట్ చేసి నాన్నకి ఫోన్ చేసింది. శ్రీనివాస్ మంచి నిద్ర లోంచి ఖంగారు పడుతూ తీసాడు. “ఏమి లేదు నాన్నా”, రేపు మార్నింగ్ కల్లా అంతా సర్దుకుంటుందిలే, నువ్వు పడుక్కో”అన్నాడు. “కోవిడ్ పాజిటివ్ అయినా బాగానే ఉందన్నావుగా, ఏమయ్యింది? “అడిగింది హరిణి.” ఈ వైరస్ రకరకాలుగా బిహేవ్ చేస్తోంది నాన్నా. ఇట్స్ అండర్ గోయింగ్ లాట్ ఆఫ్ మ్యుటేషన్స్”అమ్మకి సడన్ గా సీరియస్ అయ్యింది. అక్కడ, ఇక్కడ ఎందుకని మామయ్య ఆస్పత్రిలో చేర్పించాం. సొంత అన్నయ్య, వదినల కంటే ఎవరు బాగా చూసుకుంటారు చెప్పు. అంతా సరి అవుతుంది. నేను ఇప్పుడే పడుకున్నా. నువ్వు కూడా ఇంక పడుక్కో, అన్నాడు..

లోపల చల్లటి ఐ. సి.యూ. లో వెంటిలేటర్ మీద ఆ స్థితిలో కూడా చెక్కు చెదరని అందంతో హాస్పిటల్ డ్రెస్ లో తెల్లగా మెరిసిపోతున్న నేను, వీణ బాగా వాయించే నా చేతి వేళ్ళు కొంకర్లు పోతున్నాయి. కళ్ళు భూలోకాన్నీ దాటేస్తున్నాయి, మనసు భవ బంధాలను సులువుగా వదిలించుకుంటోంది. శరీరం చాలా తేలికగా అయిపోతోంది. చిన్న వయసులో తిరుమల కొండ పై దగ్గరగా కనిపించిన విగ్రహం, మనసులో ఉన్న కళ్యాణ శ్రీనివాసుడైన మలయప్ప విగ్రహం ఒక్కటిగా కన్పిస్తున్నాయి.. ఆ పక్కనే అత్యంత సౌందర్యవతీ, అత్యంత మనోహరి, శ్యామలాంగి అని మంత్రాల మధ్య ఎరుపు రంగు పట్టు చీర, స్వర్ణాభరణాలతో ఇంకెవరు సాక్షాత్ శ్రీదేవి, భూదేవి అమ్మ వార్లు, అదేమిటి నిత్యం జపించే లలితా అమ్మవారి లాగానే కన్పిస్తున్నాయి…ఆశ్చర్యంగా తన మనో నేత్రాలకి, తన ఏడేళ్ల వయసు లో జరిగిన మొదటి తిరుమల దర్శనం నుంచి ఈ యెభై రెండేళ్ల వయసు లో మానసిక శ్రీనివాస దర్శనం, స్మరణం, అమ్మవార్లు, తను అన్ని ఏకమవు తున్నాయి ….

దగ్గరగా, దూరంగా…

దూరంగా, దగ్గరగా….

అసలు దూరమే లేనంత దగ్గరగా… వెళ్లిపోతున్నా ......నేను …

ఆ దివ్య మూర్తి శ్రీనివాసునికి దగ్గరగా…ఇలలో భర్త శ్రీనివాస్ కి దూరంగా..

…..సాలోక్య, సామీప్య,సారూప్య, సాయుజ్యమవుతున్నా …..

..అంతర్ బహిశ్చ తత్సర్వమ్ వ్యాప్త నారాయణః స్థితః…

ఓం నమో వెంకటేశాయ….

ఓం శాంతి…శాంతి…శాంతిః…

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు