వాడిన కలువలు - Bhagyalakshmi Appikonda

Vadina kaluvalu

పల్లె మంచుపల్లకి లో నిదురిస్తున్నట్టుంది. చెరువంతా ఎర్రని కమలాలు దుప్పటి పరచినట్టు ఉంది.. ఆ ఎర్రని దుప్పటిపై చక్కగా పెట్టిన చుక్కల్లా అక్కడక్కడా తెల్ల కలువలతో అందంగా ఉంది. ఇంతలో సూరిగాడు సైకిల్ మీద వచ్చాడు. ఇంకా పూర్తిగా విచ్చుకోని కమలాలను, అందంగా విచ్చుకున్న కాలువలను అలవాటుగా గట్టిగా లాగి తన చేతిలోకి తీసుకుని తట్టలోకి వేసాడు. ఆ తట్టను సైకిల్ సీటుపై వెనక తాడుతో కట్టి, ఆ పూలు అమ్ముకోవడానికి పక్కనే ఉన్న నగరానికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ***** "ఇంకా ఎన్ని దినాలు పడతాది మావా!. కాళ్ళు లాగతాన్నాయి." అంది లచ్చి నీరసంగా.. "నాతో రావద్దు మొర్రో అని సెప్పినా ఇనలేదు. తిన్నగా నడు" అని విసుగ్గా అన్నాడు రంగడు. "కొత్త పెండ్లాన్ని వదల్లేక తీసుకొచ్చుకొని ఇప్పుడెందిరా అట్టా కసురుకుంటావు" అని రంగడి భుజం మీద చేయి వేసి మేలమాడాడు రంగడి మేనమామ సూరయ్య. "ఏవయ్యో!! తొరగా కదులు, పొట్లాలు అయిపోతాయి" అని సూరయ్య భుజాన్ని తట్టి పరుగు లంకించుకుంది మంగమ్మ. పొట్లాల బండి దగ్గరికి వెళ్ళాక ఎవరికి వారే, వాళ్ళలో వాళ్ళే దూరం జరిగారు. మంగమ్మ, లచ్చి చీర చెంగు అంచుల్ని మూతికి చుట్టుకున్నారు. రంగడు తుండుగుడ్డ మూతికి చుట్టుకున్నాడు. సూరయ్య సీసాలోని నీళ్ళు మొహం మీద చల్లుకొని తుండుగుడ్డతో తుడుచుకొని, కొత్త పెళ్ళికొడుకులా నవ్వుతూ అదే తుండు ముక్కూ మూతికి కలిపి చుట్టుకున్నాడు. ఎవరి పొట్లాలు వారి చేతికందాయి. సూరయ్య ఆశ నిరాశాయే అన్నట్టుగా నడుస్తున్నాడు. "ఏటి మావా! ఇందాక సినిమా ఈరోలా యేషం కట్టావు, ఇప్పుడేంది ఈసురోమని మొగం ఏలాడదీశావు." అన్నాడు రంగడు సూరయ్యని చూస్తూ. "మొన్న మీతో, నిన్న మంగమ్మతో కూడా ఫోటో దిగారు. ఇయ్యాల నాతో ఫోటో దిగుతారనుకున్నా., ఆడి బండ బడా.., ఎవడు ఫొటో దిగలే" అన్నాడు., నోటిలో ఒక పుల్ల పెట్టి తీసాడు బీడి తాగుతున్నట్టుగా. కొన్ని రోజులుగా బీడి తాగే‌ యావ అలా తీర్చుకుంటున్నాడు సూరయ్య. రంగాకు అప్పుడు అర్థం అయింది, మామ నీళ్ళు చల్లి మొహం ఎందుకు శుభ్రం చేసుకున్నాడో.. "సాల్లే మావ! పోటోలంట పోటోలు. సేతిలో ఓ పొట్లం పెట్టి, పేద్ద దరమ పెబువుల మల్లే పోటోలు దిగి, చాటింపు యేసుకుంటున్నారు ఈ డబ్బున్న నాయా....." అన్నాడు రంగడు ఈసడింపుగా. "అదేంట్రా అబ్బీ!! కడుపు నింపునోళ్ళని నోటికొచ్చినట్టంటావు..? మన ఆకలి తీరిసినోళ్ళతో నవ్వుతూ ఫోటో దిగితే తప్పేందిరా? ఇంత దూరం వొచ్చి మనకో ముద్ద పెట్టినోళ్ళు డబ్బున్నోళ్ళు కాదురా అల్లుడూ! మనసున్న మారాజులు." ఆనందంగా అన్నాడు సూరయ్య. "ఈ గుడి సక్కగుంది గదే లచ్చీ., మావా! ఈ రేతిరి ఈడనే" అని సూరయ్య చేయి పట్టి కిందికి లాగుతూ, తను గుడి ముందు చెట్టు దగ్గర చతికిలబడ్డాడు రంగడు. "ఒల్లంతా ఒకటే నెప్పులురా అల్లుడూ! నరాలు లాగెత్తున్నాయ్, నాలుక పీకేత్తుంది. ముద్ద కాదురా ఎవడైనా మందు పోత్తే ఆడు దేవుడురా" అన్నాడు సూరయ్య పుల్ల బీడి కాలుస్తూ. " మావా! నీలాటోడే మొదటి దానికి మొగుడు లేడు గానీ, కడదాని కొంగుకి ముడెట్టమన్నాట్ట. నీకు తిన్నేకి ఉన్నీకి నేదు గాని తాగేనికి కావాలి. మారు మాటాడక తిన్నగా తొంగొ" అని మగడితో వెటకారంగా మూతి తిప్పుతూ అంది మంగ. " ఓరై అల్లుడూ!! ఓపాలి ఆకాసం యేపు సూడు" అని తన మోచేతితో రంగడి నడుముని గుద్దాడు. "ఏటి మావా!" అని మొహం చిట్లించాడు రంగడు. "ఆ సుక్కలన్ని సారాసుక్కలు, సందమావ సికెన్ బిరియానీ అయితే, ఆకాశం బండబడా! భలే భలేగున్నురా" అన్నాడు సూరయ్య చంటి పిల్లాడిలా నవ్వుతూ. "ఏటి మావా! నీకేటి పట్టదా అలా నవ్వుతా ఉంటావు. ఆడెవడో పనని రైలు మింద తీసుకెళ్ళిండు, యెళ్ళాం.. ఏదో కరోనా అని రెండు దినాలు కూడెట్టి సేతి కూలిచ్చి తరిమేసిండు. ఇప్పుడు కాళ్ళీడ్సుకుంటా ఇంటి కెడుతున్నాం" అన్నాడు రంగడు ఉక్రోషంగా. "మా రావుగోపాలరావు గాడన్నట్టు 'మడిసన్న తరవాత కూసింత కలాపోసన ఉండాలా..' ఇందాక ఇన్నావా, సానా మంది సచ్చిపోతున్నారంట, మనకేం బతికేవున్నంగా., నవ్వితే పోయేదేముందిరా! ఏదో పోయినట్టు ఉండడమెందుకు" అన్నాడు సూరయ్య మళ్ళీ అలాగే నవ్వుతూ. "నీ ఎర్రి యేదాంతానికేం! నాకు నిదరస్తాంది" ఉక్రోషంగా అని మొహం తిప్పి పడుకున్నాడు రంగడు. చుక్కలని చూస్తూ నిద్రలోకి జారుకున్నాడు సూరయ్య. "పిన్ని! పిన్నీ!! కడుపు నొక్కుతాంది" పక్కనే ఉన్న మంగమ్మ భుజం తడుతూ అంది లచ్చి. ఇంతలో మంగమ్మ ఒంటికి ఏదో తడి తగిలినట్టుగా అనిపించి చేతులని నేలపై తడిమింది. చీకట్లో అదేమిటన్నది తెలీక ముక్కుతో వాసన చూసి, "అయ్యో తల్లీ! నెత్తురు పోతాందే!" అని గుండెలను బాదుకుంది మంగమ్మ. "కడుపునొప్పి! కల్లు తిరుగుతా ఉండయ్! పాణం పోతాంది" కళ్ళ వెంబడి నీళ్ళు కుక్కుకుంటుంది లచ్చి. గబగబా మంగమ్మ తన మూటలో ఉన్న ఒక నేతచీర తీసి రంగడికి ఇచ్చి, "అల్లుడూ! నువు లచ్చి కాడే ఉండు. ఈ నీల్లు పడతా ఉండు" అని ఒక నీళ్ళ సీసా కూడా ఇచ్చి, "ఇడనే వుండండి., మాము వత్తాం" అని మంగమ్మ, సూరయ్యా చుట్టుపక్కల చూసుకుంటూ, 'యెవరయినా ఉన్నారా? సాయం! సాయం!!" అని అరుచుకుంటూ వెళ్ళారు. పొద్దు పొడుస్తుంది. సూరీడు వెలుగు రేకలు చెట్ల ఆకుల చాటునుంచి లచ్చి మీద పడుతున్నాయి. "ఏందే లచ్చీ! అట్టా ఏడుత్తావ్" అని లచ్చి తలమీద నిమిరి, ప్రాణం అల్లాడి పోతున్నట్టుగా పొట్ట పట్టుకు పొర్లుతున్న లచ్చి కాళ్ళు చేతులు పట్టుకొని నొక్కుతూ, ఒత్తుతూ, "నువు గట్టిగా ఉండు నానుండగా నీకేటవుతాదే! తగ్గిపోద్ది" అని తను ధైర్యం కూడగట్టుకుంటూ లచ్చికి ధైర్యం చెబుతున్నాడు రంగడు. ఇంతలో మంగమ్మ, సూరయ్య ఒక ముసలవ్వను పట్టుకొని నడిపించుకుంటూ వచ్చారు. మగాళ్ళు పక్కకు పోగానే, అవ్వ లచ్చి నాడి పట్టుకు చూసి, చేయవలసిన సాయం చేసి, "తొలి సూలమ్మా! మూడు నెలలే. ఈ పిందె నీకు రాసి పెట్టిలేదు" అని చెప్పి, లచ్చి నోటిలో పసరు పోసింది. రంగని పిలిచి, "బాబూ! బాగా సూసుకో, గంటలో అంతా సద్దుకుంటాది. ఒక నెల్లాళ్ళు పథ్యం ఉండాలా. నువ్వు దూరంగా ఉండాలా. పిల్లా! ఈ నువ్వుండలు తిను, నడుంకి బలంగా ఉంటాది" అని చిన్న సంచిలో ఉన్న నువ్వుండలను లచ్చి చేతిలో పెట్టింది అవ్వ. "నీకియ్యనీకి మా కాడ ఏవి లేదవ్వా" అన్నాడు రంగడు కొంచెం మొహం చిన్నబుచ్చుకొని. "అడిగానటయ్యా? పిల్లాపాపలతో సల్లంగుండండి" అని దీవించి మంగమ్మ, సూరయ్య వైపు 'నన్ను నా ఇంటి కాడకి దిగబెట్టండి' అన్నట్టు చూసింది అవ్వ. మంగమ్మ, సూరయ్య అవ్వని తన ఇంటి దగ్గర దిగబెట్టి లచ్చి దగ్గరకు వచ్చి, "ఆ గొల్లోడెవడో గానీ, ఆడమ్మ కడుపు సల్లంగుండ! దేవుడిలా అగపడి ఆ అవ్వని సూపించాడు. లచ్చీ! ఇప్పుడెట్టా వుందే., ఈ రొట్టెముక్క ఎంగిలి పడు" అని లచ్చి నోటిలో రొట్టె ముక్క పెట్టింది సూరమ్మ. లచ్చి గుండెలవిసేలా ఏడుస్తుంది. "ఎహే! ఏడుపాపు! నేను సల్లగుండాలే గాని, బిడ్డలకి కొదవేటే" అజమాయిషీతో కూడిన అనురాగంతో అరిచాడు రంగడు. "ఏడున్నాడు మావా, దేవుడు!? కడుపుకి జరగక ఊరు వొదిలొత్తే పేణం మీదికి వచ్చినాది. ఏం పాపం సేసినాం మావా! రోడ్డు మీద దిక్కుమాలిన కుక్కల్లా అయిపోనాది బతుకు. ఈళ్ళకేగా మనం పనులు సేత్తున్నాం. మన బతుకులంటే లెక్కేనేదు నా......" అని ఆవేశం, ఆక్రందన మిళితమై రంగడి గొంతు గద్గదంగా గద్దించింది. "తగ్గు తగ్గు., ఏట్రా రంగా!! అట్టా ఊగిపోతన్నావు. కట్టం నీకొక్కనికేనా? అందరికి వచ్చినాది‌. మన బతుకులు లెక్కలోనివి గనకనే, ఈడ వరకు వచ్చినాం. దారెల్లా సేయందించినోళ్ళంతా దేవుళ్ళే. నువ్వెట్టా ఆలోసిత్తే అట్టా వుంటాది, నీ బతుకు కుక్కని తలిత్తే కుక్కవే. ఇయాల జనాలందరూ బిక్కు బిక్కు మంటూనే బతుకీడిత్తున్నారు. పేదోడి కోపం పెదవికే సేటు. ఆ గుడ్లురుమడం నీకే ముప్పు. తిన్నగా నడు" నీ మంచికే చెబుతున్నానన్నట్టుగా నచ్చచెప్పాడు సూరయ్య. "సాల్ సాల్లే మావా!! గొప్ప సెప్పొచ్చినావ్. ఆలకేం మావా! మేడల్లో సల్లంగా కూకునే మారాజులు" కినుకుగా అన్నాడు రంగడు. "అదేంనేదురా రంగా! ఈ రోగానికి అంతా ఒకటేనట. నీ బాసలోనే సెప్తా ఇను,. ఆలు పెంపుడు కుక్కలు, మనం ఈది కుక్కలం" రంగడి భుజం మీద చేయి వేసి పుల్ల బీడీ కాలుస్తూ చెప్పాడు సూరయ్య. "మావా!! రెండు దినాలయితాంది. కూకుంటే మనబోటోలకి జరుగుద్దా? నా ఒళ్ళు కుదురుగా వుంది. ఇక యెళ్దాం" అని చెప్పి, ఓపిక తెచ్చుకుని లేచి నిలబడింది లచ్చి. మళ్ళీ నడక మొదలైంది. మొదట్లో వీళ్ళ నడకవేగం చిరుతపులిలా ఉండేది. అది మజిలీ మజిలీకి నెమ్మదించి, నీరసించి, చివరాకరికి నడుం విరిగిన నత్తనడకలా మారింది. ఊరి పొలిమేర కనబడి అందరి మొహాల్లో చిన్న నవ్వు మెదిలింది, అమావాస్య రాత్రి మెరిసిన ఒకే ఒక్క నక్షత్రంలా. కొంచెం ముందుకు నడిచిన వారికి చెరువు నిండుగా విరిసిన కమలాలు, కనులకి పండుగగా తోచింది. ఊరిగాలి వారికి కొత్త ఊపిరినందించింది. ఇంకొక పది అడుగులు వేస్తే ఊరిలోకి అడుగుపెట్టొచ్చు అన్న ఆనందం వారి గుండెలనిండా ఉప్పొంగింది. దూరం నుంచి గ్రామస్థులు పెద్ద పెద్దగా కేకలు వేయడంతో ఆగారు, 'రాకండి! రాకండి!!' అన్నట్లుగా చేతులూపుతూ, సైగలు చేస్తూ, ఆ పొంగు మీద నీళ్ళు చల్లారు. ఇద్దరు మగవాళ్ళు, చిన్నపాప అక్కడ నుంచి అడుగులు ముందుకేసుకుంటూ వచ్చి, వీళ్ళకి ఆరడుగులు దూరంగా నిలుచున్నారు. "అయ్యా! ఓ పద్దినాలు ఈడనే‌, అదో ఆడున్న గుడిసెలో ఉండండి, నాను తిన్నీకన్ని పట్టుకొత్తాను" గుడ్డకట్టుకొని ఉన్న మూతితో చెప్పి క్షణమాగకుండా వెళ్ళిపోయాడు సూరయ్య కొడుకు. "తమ్ముడూ! నువ్వు, మరదలు కూడా ఈడనే ఉండండి. నాను అన్ని తీసుకొత్తాను" అని రంగడి అన్న వెళ్ళిపోబోతుంటే., కూతురు అతని చేయి విడిపించుకొని రంగడి దగ్గరగా వచ్చి, "బాబాయ్ బాగుండావా? మనూరి తీర్థంలో ఈ బొమ్మ కొన్నా., పిన్ని పొట్టలో పాపకియ్యనీకి" అని రంగడి చేతిలో పెట్టబోతుంటే రంగడు పాపకి దూరంగా జరిగాడు. పాపని వాళ్ళ నాన్న వెనక్కి లాగాడు. బొమ్మ కింద మట్టి మీద పడింది. ఇంతలో విసురుగా పెద్ద గాలి వీచింది . ఎండకు ఎండిన కాడలు ఎగిరి వారి మొహాల పైన పడ్డాయి. ఎక్కడివి అన్నట్టుగా చూసారంతా.. మట్టిరోడ్డు పైన ఎండిన కాడలు, ఆ పక్కనే తట్ట పడి ఉన్నాయి. "మన సూరిగాడి తట్టరా!! లాకుడవును గందా, ఏడా అమ్ముడు పోతానికి కూడా లేదు. కోపంలో ఆడు తట్ట కూడా పడిసేసి పోనాడు" అని చెప్పాడు రంగడి అన్న. ఇంకొంత సేపు అక్కడే ఉంటే, వాళ్ళకి రోగం కానీ ఉంటే అంటుకుంటుంది అనే కంగారుతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మట్టి మీద పడ్డ బొమ్మని తన చేతిలోకి తీసుకున్న రంగడి కళ్ళవెంట నీరు ఉబుకుతూ ఉంది. తన గుండె చెలమలో అడుగంటిన నీటిని ఎవరో చేదతో పైకి తోడినట్టుగా బావురుమన్నాడు. "నువ్వు సల్లగుండాలే గాని బిడ్డలకి కొదవేటి మావా!" అని రంగడి కళ్ళలోని నీరు తుడుస్తూ చెప్పింది పక్కనే ఉన్న లచ్చి. కన్నకొడుకుని కనీసం క్షణమైనా కళ్ళారా చూడడానికి, మాట్లాడడానికి వీలుపడలేదని బాధపడుతున్న మంగమ్మని ఆమె కళ్ళు కన్నీటితో ఓదారుస్తున్నాయి. "ఎహే!" అని పాదాలపైన పడిన ఎండిన కాడలని అసహనంగా విదిలించి తన్నేసాడు రంగడు. "మావా!! కట్టమో నట్టమో సూసుకుంటాడు అని ఎళ్ళిన మన్ని బరువై పోతన్నామని ఒగ్గేసినాడు కాంట్రాటరు. మొన్నటిదాకా కాడలు అమ్ముకుని బతికి, ఇపుడు ఆటవసరం నేదని తెలీగానే, ఇట్టా రోడ్డునేసినాడు సూరిగాడు. హుం..! రోడ్డునడ్డ ఈ ఎండిన కాడలకి, మనకీ ఏటి తేడా మావా!?" తట్టవంక తదేకంగా చూస్తూ అన్నాడు రంగడు నిస్సారంగా. "అట్టా అంటావేట్రా రంగా! మొన్నటిదాకా ఎండిన సెరువు, నాలుగు సుక్కలు కురిసినాక కళకళ లాడతాంది. నిన్నటి దాకా పచ్చంగున్న పూల కాడలు ఈరోజు ఎండిపోనాయి, బతుకు మీద ఆశతో నవ్వుతా ఎల్లినోల్లం ఏడుత్తా ఒచ్చినాం. పిల్లాపాపని, కోడి గూడులో దాసుకున్నట్టు పెజలంతా గడప దాటి బయటికి రానేదు. మనమేమి గొప్పా, రొప్పా ఆ భగమంతుడికి. ఎల్లకాలం ఒకేనాగా ఉండదు. రేపు బాగుంటాది అనుకుని బతికేయాలంతే" జీవిత సూత్రాన్ని అనునయంగా చెప్పి, నోట్లో బీడీ పుల్ల తిప్పుతూ, నడుం వాల్చడానికి పాకలోకి దూరాడు సూరయ్య. రేపనే ఆశని, పాలసంద్రంలో విరిసిన కాలకూటమే ఆపలేకపోయింది. ఇంక కరోనా ఎంత? రేపు కాకపోతే ఎల్లుండి ఉదయించే ఆశావహ లోకాన్ని ఉదయింప చేయడానికి, నాటికి సెలవు తీసుకుంటున్న సూర్యుడ్ని చూస్తూ, తడిసిన కళ్ళను తుడుచుకుంటూ పాకలోకి దూరాడు రంగడు. వెలుగు జిలుగులన్నీ పొద్దుపోతే చీకటి పడగలో మాసిపోయినట్టే రంగడి దుఃఖం కూడా చీకటిలో కలిసిపోయింది.

మరిన్ని కథలు

Telu kuttina dongaalu
తేలుకుట్టిన దొంగలు
- మద్దూరి నరసింహమూర్తి
Filter coffee
ఫిల్టర్ కాఫీ
- ఇందు చంద్రన్
Kshama lo dharitri
క్షమలో ధరిత్రి.
- Aduri.HYmavathisrinivasarao,
Marmam
మర్మం
- రాము కోలా దెందుకూరు
Korthi
కొర్తి
- బివిడి ప్రసాద రావు
Atrhata
అర్హత
- డి.కె.చదువుల బాబు
Antataa neeve
అంతటా నీవే
- షామీరు జానకీ దేవి