తలుపు తోసుకొని లోపలికి వచ్చిన రామారావు మాష్టరుగారిని హఠాత్తుగా చూసిన లాయర్ విశ్వనాథం ముందు ఆశ్చర్యపోయి, ఆ తర్వాత లేచి నిలబడి నమస్కారం చేసాడు. చాలారోజుల తర్వాత కలుసుకోవడంతో కుశల ప్రశ్నలడిగాడు. మాస్టరుగారు తను వచ్చిన కారణం వివరించారు. అది విన్న విశ్వనాధం నివ్వెరపోయాడు.
రామారావుగారు ప్రధానోపాధ్యుడిగా పనిచేసే స్కూల్లోనే విశ్వనాధం చదువుకున్నాడు. తన వద్ద చదువుకునే శిష్యులందరికీ ఆదర్శప్రాయంగా ఉండేవారాయన. ఆ స్కూల్లో చదువులకే కాక ఆటపాటలకీ చాలా ప్రాధ్యాన్యత ఇచ్చేవారు. స్కూలు వెనుకవైపు చాలాపెద్ద క్రీడా మైదానం ఉండటం క్రీడలకి బాగా పనికివచ్చింది. ఆ స్కూల్లో తనలాగే చదువుకున్న ఎంతోమంది నేడు ఉన్నత శిఖరాలు అందుకున్నారు. అలాగే ఆటల్లో ప్రవేశమున్నవాళ్ళూ రాష్ట్రస్థాయిలోనూ, జాతీయ స్థాయిలోనూ కీర్తి గడించారు. అయితే ఇప్పుడు రామారావు మాస్టరుగారికి ఓ సమస్య ఎదురైంది. అదేమిటంటే స్కూలుకి సంబంధించిన ఆ క్రీడా మైదానం ప్రస్తుతం కబ్జాకి గురైంది. అందుకే న్యాయవాద వృత్తిలో ఉన్న తనని కలసుకొని సహాయం అర్ధించడానికి మాస్టారు వచ్చారని గ్రహించాడు విశ్వనాధం.
తమ స్కూలు నుండి ఎంతోమంది ప్రముఖ క్రీడాకారులని తయారు చేసిన క్రీడా మైదానం కబ్జాకి గురైందన్న విషయం విన్న విశ్వనాధం ఉద్వేగానికి లోనయ్యాడు.
"మాస్టరుగారూ! మీరేం చింతించకండి. నా సర్వశక్తులు వినియోగించైనా స్కూలుకి సంబంధించిన క్రీడామైదానాన్ని కబ్జానుండి విముక్తి కలిగిస్తాను. నా స్నేహితుడు రాజేష్ ఇక్కడే పోలీసు ఆఫీసరుగా పనిచేస్తున్నాడు. అతని సహాయం కూడా తీసుకుందాం. ఇంతకీ కబ్జాదారులు ఎవరు మాస్టరుగారూ?" ఉద్వేగంగా అడిగాడు విశ్వనాధం.
"నువ్వనుకున్నట్లు ఏ రాజకీయవేత్తో లేక గుండానో ఈ కబ్జా చేయలేదు. సాక్షాత్తూ ఇంకో ప్రభుత్వ విభాగమే ఈ పని చేసింది. అందుకే ఏమి చేయాలో తోచక నీ వద్దకు వచ్చాను." అన్నారతను నిట్టూర్చుతూ.
అర్ధం కానట్లు విస్మయంగా చూసాడు విశ్వనాధం.
"మన స్కూలుకి కొద్దిదూరంలోనే కొత్తగా అర్టీఓ ఆఫీసు వచ్చింది కదా! వాళ్ళు డ్రైవింగ్ గ్రౌండ్‌గా మన స్కూలు మైదానం వాడుకుంటున్నారు. దీనికి జిల్లా అధికారి ఆమోద ముద్ర కూడా ఉంది. అందుకు ఉత్తర్వులు జారీ చేసారు కూడా! అందుకే ఏమీ చేయలేకపోతున్నాం." అన్నారాయన.
ఇలాంటి కబ్జా గురించి ఎన్నడూ వినలేదు విశ్వనాధం. ప్రభుత్వ స్కూలుయొక్క క్రీడా మైదానాన్ని ఇంకో ప్రభుత్వ సంస్థ కబ్జా చేయడాన్ని నమ్మలేకపోయాడు విశ్వనాధం. ఆ తర్వాత ఈ సమస్య ఎలా పరిష్కరించాలా అని తీవ్రంగా ఆలోచించసాగాడు.