ఈనాటి బంధం ఏనాటిదో - మీగడ.వీరభద్రస్వామి

Eennati bandham enaatido

ఒక తోట పక్కనే ఉన్న ఒక గుట్టమీద ఒక గ్రద్ద ఉండేది.ఆ గ్రద్ద దాని ఒక్కగానొక్క పిల్లని అల్లారుముద్దుగా పెంచుకునేది. పిల్ల సంతోషం గురుంచే నిత్యం ఆలోచించేదె ఆ గ్రద్ద.ప్రతినిత్యం తామున్న గుట్టపక్కనే ఉన్న తోటలోకి వెళ్లి ఒక పిట్టనో,పామునో, పిల్లినో,బల్లినో చంపి తెచ్చి తన బిడ్డకు కడుపు నిండా ఆహారం పెట్టేది గ్రద్ద.తల్లి ప్రేమ, ఆప్యాయతకు గ్రద్దపిల్ల కూడా మురిసిపోతుండేది. ఒక రోజు గ్రద్ద వేటకు వెళ్లి ఒక కుందేలు పిల్లను వేటాడి తెచ్చి తన పిల్లకు ఇవ్వడానికి చాలా ప్రయత్నం చేసింది. తల్లి కుందేలు గ్రద్ద దాడినుండి తన బిడ్డను కాపాడుకోడానికి చాలా ప్రయత్నం చేసింది,కానీ గ్రద్దను ఎదిరించలేక కుందేలు గ్రద్దతో పోరాటం మానేసి గ్రద్దను బ్రతిమిలాడి "నాకు కుటుంబం లేదు,నక్కల దాడిలో నా కుటుంబాన్ని కోల్పోయాను, నక్కల దాడినుండి జాగ్రత్తగా బిడ్డను కాపాడుకొని ఇక్కడ ఈ పొదల్లో తలదాచుకుంటున్నాను, నాకూ నా బిడ్డకూ ప్రాణభిక్ష పెట్టు ముక్కుపచ్చలారని నా బిడ్డ ఆలనాపాలనా చూడాలని ఆశగా ఉంది, నేను లేకపోతే బిడ్డ అనాది అయిపోయి, చీమలకో పాములకో ఆహారమైపోతుంది" అని గ్రద్ద కాళ్ల మీద పడింది కుందేలు," మేము మీ ధీన గాథలు విని వేట మానేస్తే మాకు ఆహారం ఎలా దొరుకుతుంది, మీరైతే ఆకులుఅలములు, గడ్డీ గాదర తిని బ్రతికేయగలరు, మాంసం ముక్కలేనిదే ముద్దదిగని మేము కన్నీళ్లకు కరిగిపోతే మా కడుపులు మాడి మేము చావ వలసి వస్తుంది, నేనైతే నాకు సులభంగా దొరికిపోయే మీ తల్లీ పిల్లల్ని ఇద్దరినీ ఎత్తుకుపోయి, నా పిల్లకు నీ పిల్లని, నాకు నిన్ను ఆహారంగా చేసుకోవాలని అనుకుంటున్నాను, నువ్వు అంతగా ప్రాధేయ పడుతున్నావు కాబట్టి ప్రస్తుతానికి నీ బిడ్డను తీసుకుపోయి నాపిల్లకు ఆహారంగా ఇస్తాను, ఆ తరువాత నీ సంగతి చూస్తాను, నువ్వు నా వేట నుండి తప్పించుకోలేవులే... కొన్ని రోజులు నిశ్చింతగా బ్రతుకు " అని వెటకారంగా నవ్వింది గ్రద్ద. "మీకు ఆహారం తప్పదు అనుకుంటే నన్ను చంపి తినేయండి, నా బిడ్డకు హాని చెయ్యవద్దు, దానికి చాలా భవిష్యత్ ఉంది" అని కుందేలు గ్రద్ద ముందు ప్రాధేయపడింది. గ్రద్ద కుందేలు విన్నపాన్ని పట్టించుకోకుండా కుందేలు పిల్లను ఎత్తుకొని పోడానికి సిద్ధమైపోయింది. ఆసమయంలో కుందేలు బిడ్డను కాపాడుకోలేక పడిన వేదన గ్రద్దను కూడా ఆలోచింపజేసింది కానీ తన పిల్లకు ఆహారం లేకపోతే పిల్లచనిపోతుందని తల్లికుందేలు గోడు వినిపించుకోకుండానే కుందేలు పిల్లను గుట్టమీదకు తీసుకొని వెళ్ళిపోయింది. అక్కడ గుట్టమీద రాతిగూటిలో ఉన్న గ్రద్దపిల్ల తల్లిని చూసి ఆనందంతో గెంతులు వేసింది.గ్రద్ద తన పిల్లని ముద్దాడి "నీ కోసం ఏమి తెచ్చానో చూడు,ఇది లేత కుందేలు పిల్ల దీని మాంసం నీకు తినడానికి బాగుంటుంది" అని తాను వేటాడి తీసుకొచ్చిన కుందేలు పిల్లని గ్రద్ద తన పిల్ల ముందు ఉంచింది, గ్రద్ద పిల్ల "నాకు ఈ కుందేలు పిల్లని తినాలని లేదు చూడ ముచ్చటగా ఉన్న ఈ కుందేలు పిల్లతో స్నేహంచేసి ఆడుకోవాలని ఉంది" అని అంది."ఏ ఆహారాన్ని తెచ్చినా ముందూ వెనుకా ఆలోచించకుండా ఆబగా తినేసే పిల్ల గ్రద్దకి ఇంత దాయాగుణం ఎక్కడి నుండి వచ్చిందా!"అని తల్లి గ్రద్ద ఆలోచిస్తుండగా... గ్రద్ద పిల్ల తల్లి ఒడిలో చేరి "అమ్మా ఈ రోజు ఒక వింత జరిగింది తెలుసా!"అని అంది, "చెప్పమ్మా ఏమి జరిగింది?" అని తల్లి అనగా "ఈ రోజు మన గుట్టమీదకి ఒక పెద్ద చిరుతపులి వచ్చింది, నేను దాన్ని చూసి భయంతో వణికిపోయాను,ఎప్పుడూ వేటకు చిక్కని గ్రద్ద పిల్ల ఈ రోజు నా పంటికి దొరికింది అంటూ నా మీదకు దూకబోయింది, నేను చిరుతకు దండం పెట్టి దయచేసి నన్ను వదిలిపెట్టు,నేను మాత్రమే మా అమ్మకు ఏకైక బంధువుని పైగా నేనంటే మా అమ్మకు ప్రాణం,నేను లేకపోతే అమ్మ బ్రతికి ఉండదు, దయచేసి చంపవద్దు, అని ప్రాధేయపడ్డాను,అయితే నిన్ను అడ్డం పెట్టుకొని మీ అమ్మను తింటాను అని చిరుత అంది.ఒకవేళ తమకు ఆహారమే కావాలనుకుంటే నన్ను మా అమ్మ రాకముందే ఇక్కడ నుండి తీసుకొని వెళ్లిపోండి, మా అమ్మ నేను మీ చెరలో ఉన్నానని తెలిస్తే తట్టుకోలేదు,నన్ను కాపాడుకోలేకపోయానని అమ్మ చనిపోతుంది అమ్మకు ఆ దుస్థితి చూసి నేను బ్రతకలేను అని నేను అనేసరికి క్రూర జంతువు చిరుత కూడా చిరునవ్వు నవ్వి నా భుజం తట్టి మీ తల్లీ పిల్లల బంధం బాగుంది, నిన్ను చూస్తుంటే అడవిలో వంటరిగా ఉన్న నా బిడ్డ చిరుత కూన గుర్తుకు వస్తుంది, అని నన్ను దీవించి ,తన కూన వద్దకు పరుగు పరుగున పారిపోయింది చిరుత"అని అంది గ్రద్దపిల్ల.గ్రద్ద తన పిల్లను మెచ్చుకొని పిల్ల ధైర్యానికి అభినందించింది."ఇందులో నా ధైర్యం కన్నా చిరుత మంచితనమే గొప్పది,చిరుత తొందర పడి నిన్నూ నన్నూ వేరు చేస్తే నేనులేక నువ్వు, నిన్ను విడిచినేను ప్రాణాలు కోల్పోయేవారం" అని తల్లితో అంటూ "ఎందుకోగాని నా వయసేవున్న ఈ కుందేలు పిల్లను చూస్తే నాకు జాలీ కలుగుతుంది,పాపం దీని తల్లి ఇప్పుడు ఎంత తల్లడిల్లి పోతుందో" అని కుందేలు పిల్లతో స్నేహంగా మాట్లాడి గడ్డిపరకలు తెంపి కుందేలు పిల్లకు పెట్టింది గ్రద్ద పిల్ల,తల్లికి దూరంగా ఉన్నందుకు కుందేలు పిల్ల బిక్కుబిక్కుమంటూ భయంభయంగా ఉంది. గ్రద్దకు జ్ఞానోదయం అయ్యింది. క్రూర మృగం చిరుత కూడా ఆహారం పేరిట హింస తగదని గ్రహించింది. తల్లీ బిడ్డల బంధాన్ని గుర్తించింది,ఆమాత్రం ఆలోచన నాకు లేకపోయింది అనుకుంటూ వెంటనే కుందేలు పిల్లను దగ్గరకు తీసుకొని,భయపడకు నిన్ను చంపను, నువ్వు నా పిల్లతో సమానం, నిన్ను నీ తల్లి దగ్గరకు చేర్చుతాను అని ధైర్యం చెప్పి దాన్ని తల్లి కుందేలు వద్దకు తీసుకొని వెళ్లి, క్షమించు మిత్రమా! నేనూ ఒక బిడ్డకి తల్లినైకూడా నీ మనోవేదన గుర్తించలేకపోయాను, నా పిల్ల చిరుత పంజాకి చిక్కినా చిరుతా ఒక తల్లి కాబట్టి నా పిల్ల అభ్యర్ధనను మన్నించి దాన్ని ప్రాణాలతో వదిలేసింది, నీకు అభ్యంతరం లేకపోతే నువ్వూ నీ బిడ్డను తీసుకొని మా గుట్టకురా మీకు క్రూర జంతువులు బెడద లేకుండా చూసుకుంటాను అని చెప్పింది గ్రద్ద కుందేలుకు. తన బిడ్డ గ్రద్దకు ఆహారం అయిపోయింది అని కుమిలిపోతున్న కుందేలు, కుందేలు పిల్లని సజీవంగా చూసి ఆనందంతో కన్నీరు పెట్టుకుంది, గ్రద్దపై నమ్మకం కుదిరి, గ్రద్దకు ధన్యవాదాలు తెలిపి, బిడ్డతో కలిసి గ్రద్దవున్న గుట్టమీదకు వెళ్ళడానికి నిర్ణయించుకుంది. కుందేలు పిల్ల తల్లి పొత్తిల్లులో ఒదిగివుండగా తల్లి కుందేలును జాగ్రత్తగా ఒడిసిపట్టి తన నివాసానికి తీసుకొని వెళ్ళింది గ్రద్ద ,అప్పుడు తల్లి కుందేలుకు తాను చిన్నప్పుడు అమ్మ పొత్తిళ్ళల్లో సురక్షితంగా ఉన్న రోజులు గుర్తుకొచ్చాయి. గ్రద్ద కుందేలు కుటుంబాన్ని గుట్టకు తేవడం చూసి గ్రద్ద పిల్ల మురిసిపోయింది, కుందేలుకూన, గ్రద్ద పిల్ల తక్కువ సమయంలోనే ప్రాణమిత్రులుగా మారిపోయాయి. కొన్నాళ్ళుకు గ్రద్ద పిల్లకు ప్రాణ భిక్ష పెట్టిన చిరుత కూడా గుట్టకు వచ్చి కుందేలు, గ్రద్ద కుటుంబాలకు స్నేహహస్తం అందించింది. కుందేలు, గ్రద్ద చిరుత కుటుంబాలు మద్య స్నేహాం కలకాలం నిలిచి సమస్త జీవరాశిచేత ప్రశంసలు అందుకుంది.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు