గుంటూరు నగరంలో రంగనాధ్ అనేవ్యాపారి మందుల (మెడికల్) అంగడి నడుపుతూ ఉండేవాడు.ఒకరోజు ఓ కాషాయ వస్త్రధారి నుదుట విభూదిరేఖలు,పెద్ద కుంకుమ బొట్టుధరించి రంగనాధ్ అంగడివద్దకు వచ్చి'నాయనా నీఅంగడికి నరదృష్టిఉంది.అది చాలా ప్రమాదకరమైనది. ఈరోజు పౌర్ణమి మంచిరోజు. పూజసామానులు అన్నికలుపుకుని మూడువందలు ఇప్పించండి వీధిలోనుండే అంగడికి పూజచేసి వెళతాను'అన్నాడు. 'సరే అలాగే కానివ్వండి స్వామి'అన్నాడు రంగనాధ్. తన చేతి సంచి లోనుండి నిమ్మకాయనుతీసి రెండుగా కోసి దానికి కుంకుమ అద్ది అంగడి గుమ్మానికి రెండువైపులా రెండు నిమ్మచక్కలు ఉంచి, మూడునిమ్మకాయలు పండుమిరపకాయలుకొన్ని,చిన్న వెంట్రుకల తాడు అన్నికలిపి అంగడిముందు వేళ్లాడదీసి,బూడిద గుమ్మడికాయకు రంధ్రంచేసి అందులో కుంకుమ,చిల్లరడబ్బులువేసి దానిపైన కర్పురం ఉంచి వెలిగించి రంగనాధ్ ని గుమ్మంవద్ద నిలబడమని చెప్పి అతనికి అంగడికి కలిపి బూడిద గుమ్మడి కాయు మూడుసార్లు కుడి-ఎడమలకు తిప్పి అంగడి ముందు నడిరోడ్డులో బలంగా విసిరి పగులకొట్టాడు ఆపూజచేసిన వ్యక్తి.గుడికాయలో కుంకుమ చేర్చడంవలన ఎర్రని వర్ణంలో తుంపులుగా రోడుపై చిందరవందరగా పడిపోయింది. ఆగుమ్మడికాయ ముక్కలకోసం రోడ్డుపై తిరిగె ఆవులు కుమ్ములాడుకో సాగాయి.సంతోషంగా అతనికి డబ్బు ఇచ్చి పంపాడు రంగనాథ్. కొద్దిసేపటికి సెల్ ఫోన్ మోగడం అందులో తనభార్యపేరు కనిపించడంతో ఫోన్ ఆన్ చేసి'ఏమిటి'అన్నాడు.అటునుండి అతని భార్య ఆందోళనగా'మనకోడలు బండి పైనుండి పడింది.ఈరోజు శుక్రవారం పైగా పౌర్ణమి అమ్మవారిగుడికి వెళుతుంటే,ఎవడో మూర్కుడు దిష్టితీసిన బూడిద గుమ్మడికాయ రోడ్డుపై పగులకొట్టాడట దానికోసం రోడ్డుపైన తిరిగే ఆవులు పోట్లాడుకుంటూ అదేరోడ్డుపై బండితో వెళుతున్న మనకోడలిని పడదోసాయి చిన్నపాటి గాయాలు అయ్యాయి 'అన్నది రంగనాధ్ భార్య. భార్య మాటలు వింటూ దిష్టి గుమ్మడికాయలు రోడ్డుమధ్యలో పగుల కొట్టడం ఎంత తప్పో ,మనఆనందం ఎదుటవారికి ఆపద కాకూడదు అని అనుభవ పూర్వకంగా రంగనాధ్ తెలుసుకున్నాడు.