మాట తప్పని గోవు - శింగరాజు శ్రీనివాసరావు

Maata tappani govu

రాఘవరావు కళ్ళు ఆమెనే నిశితంగా పరిశీలిస్తున్నాయి. గత నాలుగు సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాడు. మొదట మొదట పెద్దగా అనిపించకపోయినా ఈ మధ్య కాలంలో ఎందుకో ఆమె మీద ధ్యాస ఎక్కువ కాసాగింది. దాదాపు అరవైలో పడబోతున్నాడు. కానీ కోరికల కొలిమి మాత్రం ఆరటం లేదు. భార్య పూర్తిగా ఆధ్యాత్మిక జీవనానికి మారడం, అతనికి అశనిపాతంగా మారింది. తన బిడ్డలాగ ఇంట్లో మసలుతున్న పనిమనిషి రంగి అందం రాఘవరావు మనసును స్థిమితంగా ఉండనివ్వడం లేదు. పైకి మాత్రం పెద్దరికం చూపుతూ ప్రవర్తిస్తున్నా, లోలోపల మాత్రం అవకాశం కోసం చూస్తూనే ఉన్నాడు. రంగి భర్త రాముడు, పచ్చి తాగుబోతు. వారం రోజులు పనికివెళ్తే, వారం రోజులు తాగిపడి ఉంటాడు. ఇద్దరు పిల్లలలో పెద్దపిల్ల పదవ తరగతి, చిన్నపిల్ల ఏడవ తరగతి చదువుతున్నారు. రాఘవరావు భార్య అలివేణికి రంగి మీద ఎనలేని జాలి. తాగుబోతు భర్తతో కష్టపడుతున్నదని అడపదపా చూసి చూడకుండా అయిదు వందలో, వెయ్యో అదనంగా ఇస్తూనే ఉంటుంది. రంగి చేరిన కొత్తల్లో ఆమె మీద సానూభూతే తప్ప, వేరే ఆలోచన ఉండేది కాదు రాఘవరావుకు. కానీ ఈ మధ్యనే ఆమె చనువుగా మాట్లాడుతుండడం, కలివిడిగా తిరుగుతుండడంతో అతని ఆలోచనా విధానం మారింది. ప్రతిరోజూ భార్య చూడకుండా నెట్ లో చదివే బూతు కథల ప్రభావం కూడ దీనికి ఒక కారణం. ఏది ఏమైనా లేడి మీద మనసు పడిన పులిలా, అవకాశం కోసం చూస్తూ ఆమెతో ఇంకొంచెం చనువుగా మెలగసాగాడు. భార్యకు తెలియకుండా ఆమె అవసరానికి డబ్బులు కూడ సర్దడం మొదలుపెట్టాడు. ******** " ఏమండి మీరటు వెళ్ళగానే హారిక ఫోను చేసింది. పిల్లవాడి అల్లరి ఎక్కువయింది. క్షణం కాలు నిలపకుండా తిరుగుతూ అన్నీ దొర్లిస్తున్నాడట. మొన్న సోఫాలో నుంచి కిందపడ్డాడట. ఏమీ కాలేదులెండి. కొద్దిగా పెదవి చిట్లిందట. మనలను వచ్చి ఒక నెల రోజులయినా ఉండమంది. ఎలాగూ రిటైరవబోతున్నారు కదా. ఒక నెల సెలవు పెట్టండి వెళదాము" భర్త ఆఫీసు నుంచి రాగానే చెప్పింది అలివేణి. " ఆఫీసులో చాలా బిజీగా ఉంది. సెలవు దొరకడం కష్టమేమో, ఆలోచిద్దాం" అని లోపలికి వెళ్ళిపోయాడు రాఘవరావు. ఏదో ఆఫీసు వత్తిడిలో ఉన్నాడేమోలే, రాత్రికి మాట్లాడదామనుకుంది అలివేణి. ***** " రంగీ. నేను ఒక నెల రోజులు బెంగుళూరు అమ్మాయి దగ్గరకు వెళుతున్నా. మనవడి అల్లరి భరించలేకపోతున్నదట, రమ్మన్నది" ఇల్లు చిమ్ముతున్న రంగితో అన్నది అలివేణి. " అంటే నాకు నెల రోజులు సెలవులన్న మాట " రంగి అడిగింది ఆనందంగా. " అంతలేదు. అయ్యగారికి సెలవు దొరకలేదట. ఆయన ఇంట్లోనే ఉంటారు. నువ్వు ఆయన ఆఫీసుకు వెళ్ళేలోపు వచ్చి పనిచేసి వెళ్ళు" " అదేంటమ్మా మీరు ఒక్కరే ఎలుతున్నారా. అయ్యగారు లేకుండా మీరెల్లటం, ఇదే సూట్టం" " నాకు బోరేనే కానీ తప్పదుగా" " అట్టాగేనమ్మా. పొద్దుకాడే వచ్చి సేసి యెల్లిపోతా" అని తన పనిలో మునిగిపోయింది. ****** అప్పుడే భార్య వెళ్ళి పదిరోజులయింది. పథకం ప్రకారం భార్యను పంపినా, రంగితో సరసానికి ధైర్యం చాలటం లేదు. ఏదో భయం ఆ పిల్ల ఏమనుకుంటుందో, తనను అసహ్యించుకుంటుందేమో. ఇలాగే మీనమేషాలు లెక్కపెడుతుంటే పుణ్యకాలం కాస్తా పూర్తయిపోతుంది ఎలాగైనా రేపు సాహసించాలి. ఆలోచనలతో వున్న రాఘవరావు కాలింగ్ బెల్ పదేపదే మ్రోగడంతో వెళ్ళి తలుపుతీశాడు. ఎదురుగా రంగి వెక్కి వెక్కి ఏడుస్తున్నది. " ఏమిటే రంగి ఏడుస్తున్నావు. ఏమయింది " అంటూ అనునయంగా అడిగాడు రాఘవరావు. " అయ్యగారు మా మామ రాముడికి యాక్సిడెంటు అయిందయ్యా. బోలెడంత రక్తం పోయింది. తల దగ్గర పెద్ద దెబ్బ తగిలింది. ఆడికేమి తెలవటం లేదు. ఆసుపతిరికి ఎత్తుకెలితే, ఆడు బతకాలంటే తలకు ఆపరేసను సెయ్యాలట, రెండు లచ్చలు కట్టమన్నారయ్యా. సమయానికి అమ్మగోరు కూడ లేరు. మా అయ్య కాడ ఓ లచ్చ వుందంట, నా కాడ యాభైయేలు ఉన్నాయి. మీరొక యాభై యేలు యియ్యండయ్యా నెలకింతని ఇచ్చుకుంటా. కావాలంటే వడ్డీ కూడ ఎత్తుకోండి. మా మామను బతికించడయ్యా" అని కాళ్ళమీద పడింది. ఇదే మంచి అవకాశం అనిపించింది రాఘవరావు. బుజ్జగిస్తున్నట్టుగా భుజాలు పట్టి లేపాడు. మెల్లగా బుగ్గలు నిమురుతూ " ఏడవకే రంగి. అమ్మ లేకపోతే ఏమిటే. నీ మామ లాంటోడిని నేనున్నాగా. నువ్వు ఏడుస్తుంటే నాకేదోలాగుంది. అందాలరాశివి ఏడవచ్చా. నువ్వడిగినదాని కంటే ఎక్కువే ఇస్తా. రాముడిని కాపాడుతా. మరి దానికిగాను నువ్వు నాకేమిస్తావు" రంగిని దగ్గరకు లాక్కున్నాడు. అయోమయంగా అతని కళ్ళల్లోకి చూసింది. అతని ఆలోచన అర్థమయింది. అతడి నుండి విడివడింది. " అయ్యగారూ, మీరు కూడ అందరిలాంటోరేనా" " అవసరం నీది. అవకాశం నాది. వద్దనుకుంటే వెళ్ళు" ఏంచెయ్యాలో పాలుపోలేదు రంగికి. 'అవతల మొగుడు సావు బతుకులలో ఉన్నాడు. సెప్పినట్టు సేయాలంటున్నాడంటే, నా మానం మీద మక్కువెట్టుకున్నాడు. మానం అంటూ బెట్టు సేస్తే, ఆడి పేనం పోతది. యెధవ ఆడజనమ. పెతోడికి ఆడదాని శరీరం మీదే ఆశ. ఈడ కాదనుకుని పోయినా ఎవుడయినా ఇదేలాగుంటే. అప్పుడెలా? ఆడు బతకాల. పేదదాని మానమంటే డబ్బున్నోల్లకి అంగడి సరుకేనేమో.' మనసు గట్టి చేసుకుంది. " మీరెట్టా సెబితే అట్టా అయ్యగోరు. ముందు పైసలిత్తే మా వోడి పేనం నిలబెట్టుకుంటాను. ఆడికి ఆపద తప్పితే సాలు. నీకాడికొచ్చి నువ్వేది సెబితే అది సేత్తా. నా మాట నమ్మయ్యా" చేతులెత్తి నమస్కారం చేసింది. పిల్ల దారిలో కొచ్చిందని పొంగిపోయాడు రాఘవరావు. కానీ ఇదేమిటి ఇలా మెలికబెట్టింది. తీరా డబ్బు తీసుకుని, విషయం బయటకు చెబితే... అనుమానం వచ్చింది అతనికి. " నాటకాలు వేయకు. డబ్బు తీసుకుని వెళ్ళిపోయాక పని అయిపోయిందని తప్పించుకుంటావు. కుదరదు. ముందు నేను చెప్పినట్లు చెయ్యి. తరువాతే డబ్బు" గద్దించాడు. " అలాటిదాన్ని కాదయ్యా. ఆడి మీద ఆన. మీరు సెప్పినట్టు సేత్తా" అని కాళ్ళ మీద పడింది. " సరే " అని రంగికి డబ్బులిచ్చి పంపాడు రాఘవరావు, ఇదెక్కడికి పోతుందిలే అని మనసులో అనుకుని. ************ రెండు రోజులయినా రంగి జాడలేదు. ఈ రెండు రోజులలో ఎన్నో కలలు కన్నాడు. ఎన్నో రకాలుగా తర్జనభర్జనలు చేశాడు. ఒక స్టేటస్ లో ఉండే తను ఇలాంటి కోరిక కోరడమేమిటి? కొంపదీసి ఎక్కడైనా పొక్కితే, దానికేం దులుపుకుపోతుంది. ఇది నలుగురికి తెలిస్తే, భయం పట్టుకుంది రాఘవరావుకు. అయినా ఏదో తెగింపు. రంగి మీద వాంఛ ఒకవైపు, సమాజంలో పరువు ఒకవైపు, నలిగిపోతున్నాడు. దానికితోడు రంగి పత్తాలేకపోవడం. అతనిలో కసిని పెంచుతున్నది. ఇంతలో కాలింగ్ బెల్ మ్రోగింది. వెళ్ళి తలుపు తీశాడు. ఎదురుగా తలవంచుకుని రంగి. పక్కకు తొలిగాడు. లోపలికి వచ్చింది రంగి. జుట్టంతా రేగిపోయివుంది. నిద్రలేమి కళ్ళల్లో కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నది. అలాగే పడకగది వైపు నడిచింది. అనుసరించాడు రాఘవరావు. ఆమెను చూస్తుంటే అతనికి ఏదో అనుమానం కలిగింది. " ఏమైంది రంగి. అలా వున్నావు. రాముడికి ఆపరేషను జరిగిందా?" అడిగాడు. మాట్లాడలేదు రంగి. దీనంగా అతని వైపు చూసింది. ఆమె కళ్ళు ఏడ్చి ఏడ్చి అలిసిపోయినట్లుగా కనిపిస్తున్నాయి. " మాట్లాడవేం. ఏమయింది" దగ్గరికి వెళ్ళి ఆమె భుజాలను కుదుపుతూ అడిగాడు. "అంతా అయిపోయింది. మావ నిన్ననే పోయాడు. మీరిచ్చిన డబ్బూ పోయింది, మావా పోయాడు. మీకు నేనిచ్చిన మాటే మిగిలిపోయింది. సెప్పండి అయ్యగోరు. మీరు సెప్పినట్టే సేత్తాను. మీకేది కావాలో అది సేసుకోండి" నూతిలో నుంచి వస్తున్నాయి రంగి మాటలు. అవాక్కయ్యాడు రాఘవరావు. అతని చేతులు పట్టు సడిలాయి. వెనక్కు జరిగాడు. ఆమె నిజాయితీ అతనిలోని మానవత్వాన్ని లేపింది. తనమీద తనకే అసహ్యమేసింది. చిన్నతనంలో తను చదివిన పులి, ఆవు కథ గుర్తుకు వచ్చింది. ఇచ్చిన మాట కోసం బిడ్డకు పాలిచ్చి తిరిగి పులికి ఆహారం కావడం కోసం వచ్చిన గోమాతలా కనిపించింది రంగి అతనికి. తను ఎంత నీచంగా ప్రవర్తించాడో తెలిసివచ్చింది. సిగ్గుతో తలదించుకుని బయటకు నడిచాడు. అలాగే నిలుచుండి పోయింది రంగి. బయట తలుపుతీసి వచ్చి వెళ్ళమని రంగికి చెప్పాడు. " అయ్యగారు. మీకు నేనిచ్చిన మాట " " నీ నిజాయితీ ముందు ఓడిపోయింది. క్షమించమని కూడ అడిగే అర్హత కూడ లేదునాకు" అతని హృదయం పశ్చాత్తాపంతో రగిలిపోతున్నది. మరో మాట లేకుండా బయటకు నడిచింది రంగి. *********** అయిపోయింది **********

మరిన్ని కథలు

Amma
అమ్మ
- డి.కె.చదువుల బాబు
Telu kuttina dongaalu
తేలుకుట్టిన దొంగలు
- మద్దూరి నరసింహమూర్తి
Filter coffee
ఫిల్టర్ కాఫీ
- ఇందు చంద్రన్
Kshama lo dharitri
క్షమలో ధరిత్రి.
- Aduri.HYmavathisrinivasarao,
Marmam
మర్మం
- రాము కోలా దెందుకూరు
Korthi
కొర్తి
- బివిడి ప్రసాద రావు
Atrhata
అర్హత
- డి.కె.చదువుల బాబు