చాకచక్యం - డి.కె.చదువులబాబు

Chakachakyam

రాజు,రవి అన్నదమ్ములు. ఇద్దరూ శ్రద్దగా చదివేవారు. ఇద్దరికీ కథలపుస్తకాలు చదవడం ఇష్టం. చిత్రలేఖనంలో మంచి ప్రతిభ కనపరిచేవారు. వారిది సంపన్నకుటుంబమయినా ఏమాత్రం గర్వం లేదు.పాఠశాల వారి ఇంటికి ఎక్కువ దూరంలో లేదు. కాబట్టి నడిచి వెళ్లేవారు. ఒకరోజు పాఠశాలనుండి వస్తున్న వారి దగ్గరకు ఓవ్యక్తి వేగంగా వచ్చాడు.రాజూ,రవీ మీ నాన్నకు యాక్సిడెంట్ జరిగింది.వి.సి.ఆర్. హాస్పిటల్ లో చేర్చాము. ఇంటికి తాళం వేసి మీ అమ్మ అక్కడే ఉంది. నేను మీనాన్న స్నేహితుడిని. మీఅమ్మ మిమ్మల్ని తీసుకురమ్మంది." అన్నాడు ఆందోళనగా. ఆమాటలకు పిల్లలిద్దరూ ఆందోళన చెందారు. తమను పేరుపెట్టి పిలవడం, నాన్న స్నేహితుడినని చెప్పడంతో నమ్మేశారు. వారికి ఆలోచించుకునే సమయం కూడా ఇవ్వలేదు.అప్పుడే అక్కడకొచ్చిన ఆటోను ఆపి వారితో కలిసి ఆటో ఎక్కాడు. హాస్పిటల్ అడ్రస్ చెప్పాడు. ఆటోలో అప్పటికే ఒక వ్యక్తి ఉన్నాడు. కొన్నిరోజులుగా వాళ్ళు వారిని గమనిస్తున్నారని, వారి పేర్లు, కుటుంబ వివరాలు తెలుసుకున్నారని పిల్లలకు తెలియదు. ఆటో పట్నం దాటడం గమనించిన రాజు "హాస్ఫిటల్కని ఎక్కడకు తీసుకెడుతున్నారూ?" అన్నాడు. వాళ్ళు పలకలేదు. రాజు మనసు కీడు శంకించింది. కేకలు వేశాడు. వెంటనే ఆవ్యక్తులు చిన్న కత్తులు బయటకు తీశారు. "నోర్మూయండి.అరిస్తే చంపేస్తాం." అంటూ చెరిఒకరిని పట్టుకున్నారు. భయంతో అరవటం ఆపేశారు. ఆక్సిడెంట్ జరగడం అబద్దమని ఆటోవాడితో కలిసి తమను కిడ్నాప్ చేశారని అర్థమయింది. వేగంగా వెడుతున్న ఆటోనుండి దూకడం ప్రమాదకరమైనపని.మరి ఎలా తప్పించుకోవాలనే ఆలోచనలో పడ్డారు. ఆటో ఆపట్నానికి వెలుపల ఒక పాడుబడిన ఇంటి ముందు ఆగింది. ఆటోవాడికి ఎక్కడా చెప్పవద్దని రెండు వేల రూపాయలిచ్చి పంపించారు. పిల్లలను గట్టిగా పట్టుకుని ఆఇంట్లోకి తీసుకెళ్ళారు."ఇక్కడ అన్ని వసతులున్నాయి. మీరు అల్లరిచేయకుండా, కేకలు వేయకుండా వుంటే, సమయానికి మంచి భోజనం, తినుబండారాలు అందుతాయి.మాపని పూర్తికాగానే రెండురోజుల్లో వదిలేస్తాం. మాట వినకుంటే చంపేస్తాం.!" కఠినంగాఅన్నారు. రాజు బుర్ర వేగంగా ఆలోచిస్తోంది. ధైర్యాన్ని కూడగట్టుకున్నాడు.'ఆపదల్లో అధైర్యపడితే మంచి ఆలోచనలు రావు. ఆందోళనపడితే సరియైన నిర్ణయాలు తీసుకోలేమని' తాను చదివిన కథల్లోని మాటలు గుర్తుకొస్తున్నాయి. ఒక ఆలోచన బుర్రలో మెరిసింది. "మీరు చెప్పినట్లు నిశ్శబ్ధంగా ఉంటాం. రెండురోజులతర్వాత వదిలేయాలి. మరి మాకు బిర్యాని అంటేచాలా ఇష్టం. రోజూ బిర్యాని పెట్టాలి" అన్నాడు రాజు. 'అలాగే'అని తలుపులు వేసి వెళ్ళిపోయారు. "ధనవంతులపిల్లలను ఎత్తుకెళ్లి దాచిపెట్టడం, ఇంటికి ఫోనుచేసి మీపిల్లలు క్షేమంగా ఇంటికి రావాలంటే అడిగినంత డబ్బుఇవ్వాలని, పోలీసువారికి చెబితే పిల్లలను చంపేస్తామని తల్లిదండ్రులను బెదిరించి డబ్బులు వసూలు చేయటం వీళ్ళపని. దానికోసమే మనల్ని ఇక్కడికి తెచ్చారు. నీవు భయపడవద్దు.నేను ఒక ఉపాయం ఆలోచించాను."మెల్లిగా తమ్ముడితో చెప్పాడు రాజు. రాత్రి ఏడుగంటలకు ఇద్దరిలో ఒకడు తలుపులు తీసుకుని లోపలికొచ్చాడు. రెండు బిర్యాని ప్యాకెట్లు వాళ్ళముందు ఉంచాడు.వాటిని విప్పి రెండు విస్తర్లలో సర్దాడు.బిర్యాని కమ్మని వాసనతో ఉంది. "మీరు ఇలాగే కేకలు వేయకుండా, ఏడ్వకుండాఉంటే కోరినవన్నీ తెచ్చి పెడతాను.మావాడు మీపనిమీదనే బయటకెళ్ళాడు. పనిపూర్తికాగానే మిమ్మల్ని పంపిస్తాం"అన్నాడు. 'అలాగే'అన్నారు. "బాటిల్లో నీళ్ళు అయిపోయాయి. నీళ్ళు లేకుండా మేము తినలేము."అన్నాడు రాజు బయట స్కూటరులో నీళ్ళ బాటిలు ఉంది తెచ్చిస్తా !" అని బయటకు నడిచాడు ఆమనిషి . అతను బాటిలు తీసుకుని వచ్చాడు. పిల్లలిద్దరూ ఒకే విస్తరి దగ్గర కూర్చుని తింటున్నారు."ఇద్దరికీ విడివిడిగా తెచ్చాకదా!"అన్నాడు ఆమనిషి. "అంకుల్!ఇంత అన్నం తినడానికి మేం మీలాగా పెద్దవాళ్ళమా?మాకుఇదిచాలు. ఆబిర్యాని మీరే తినండి "అన్నాడు రాజు. బిర్యానీ వాసనతో ముక్కుపుటాలు అదిరిపోతున్నాయి. ఆమనిషి రెండవ విస్తరలోని బిర్యాని ఆవురావురమని పూర్తిగా తినేశాడు. రాజు, రవి పకపక నవ్వారు. "మేము రెండు బల్లులను చంపి, మెత్తగానూరి దగ్గర ఉంచుకున్నాం. నీళ్ళ బాటిలు కోసం నువ్వు బయటికెళ్ళినప్పుడు నీవుతిన్న విస్తరలోని బిర్యానీలో కలిపాము. " అన్నారు. బల్లి విషజీవి. బల్లి పేరు వినగానే వాడి శరీరం భయంతో వణకసాగింది. కంపరంతో కడుపులో తిప్పినట్లయింది. భయంతో వాడి కంటికేమీ కనిపించలేదు.అలాంటి పరిస్థితి కోసమే ఎదురుచూస్తున్న రాజు, రవి ప్రాణభయంతో ఉన్నవాడు తమను ఏమీ చేయలేడని నిర్ణయించుకుని బయటకు పరుగెత్తడానికి సిద్దమయ్యారు. ఆలస్యం చేస్తే ప్రాణాలు పోతాయని వాడు గజగజ వణికిపోతూ, తలుపులు వేయడం కూడా మరిచిపోయి కన్నుమూసి తెరిచేలోగా బయటకు పరుగెత్తాడు. స్కూటరెక్కి హాస్పిటలు వైపు పరుగులు తీశాడు. రాజు,రవి అక్కడ నుండి బయటకొచ్చి రోడ్డు మీదకు చేరుకుని, ఆటో ఎక్కి ఇంటికి చేరుకున్నారు.కిడ్నాపర్లనుండి ఫోన్ వచ్చినట్లుంది. అమ్మా,నాన్న ఏంచేయాలో తోచక ఆందోళనతో కాలుగాలిన పిల్లుల్లా తిరుగుతున్నారు.అమ్మ కళ్ళవెంట కన్నీళ్ళు ధారలుగా కారిపోతున్నాయి. పిల్లలను చూడగానే ఒక్కక్షణం వాళ్ళనోట మాట రాలేదు.తర్వాత తేరుకుని గుండెలకద్దుకున్నారు..ఆటో వాడికి డబ్బులిచ్చి పంపించేశారు. జరిగిన విషయం తెలుసుకున్నారు. వెంటనే అమ్మా,నాన్నలతో కలిసి స్టేషనుకు వెళ్లి పోలీసులకు జరిగిన విషయాలు చెప్పారు. " మేము బిర్యానీలో బల్లులను చంపి కలిపామని అబద్దం చెప్పాము. వాడు భయపడిపోయి హాస్ఫిటలుకు పరుగెత్తాడుసార్!" చెప్పాడు రాజు. వెంటనే పట్టణంలోని అన్ని స్టేషన్లకు విషయం చేరింది. బల్లి కలిసిన ఆహారం తిన్నానని చికిత్స కోసం ఎవరెవరు ఏ హాస్ఫిటల్లో చేరారు అనే దిశగా పోలీసులు కదిలారు. "నాకు బొమ్మలు గీయడం బాగా వచ్చుసార్! కిడ్నాపరుల బొమ్మలు గీయగలను" అన్నాడు రాజు. అవసరమైన సామాగ్రి ఇంటినుండి తెచ్చుకుని తమను తీసుకెళ్ళిన వారి చిత్రాలను గీశాడు రాజు.పోలీసులు కిడ్నాపరులను గుర్తించి బంధించారు. పిల్లల ధైర్యాన్ని, రాజు ఉపాయాన్ని, చాకచక్యాన్ని,సాహసాన్ని,ప్రతిభాపాటవాలను అందరూ అభినందించారు. అన్ని స్కూల్లకూ ఈవిషయం తెలియజేశారు .కొత్తవారి మాటలు నమ్మటం వారిచ్చే తినుబండారాలు తీసుకోవడం చేయరాదని పిల్లలను హెచ్చరించారు. రాజు,రవి చేసిన సాహసం అన్ని పత్రికల్లో ప్రచురించారు.వారు చదివే వాణీనికేతన్ పాఠశాలలో అభినందన సభ ఏర్పాటుచేశారు.పిల్లలను ప్రశంసల వర్షంలో ముంచారు.రాజు ఆసభలో మాట్లాడుతూ"మేము చదివిన కథలు మాకు ఆపద సమయంలో ధైర్యంగా, ఆత్మస్థైర్యంతో, ఉపాయంతో సమస్యను ఎలాఎదుర్కోవాలో నేర్పాయి." అంటూ వివరించాడు రాజు. ప్రధానోపాధ్యాయుడు,ఉపాధ్యాయులు పిల్లలను కానుకలతో సత్కరించారు.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు