కలసి చదువుదాం రా! - సరికొండ శ్రీనివాసరాజు

Kalisi chaduvudam raa

రామవరం పాఠశాలలో వినత,‌ ఐశ్వర్య 9వ తరగతి చదువుతున్నారు. చిన్నప్పటి నుంచి పోటాపోటీగా చదివేవారు ఇద్దరూ. ఎప్పుడు ఎవరు మొదటి ర్యాంకు వస్తారో చెప్పడం కష్టం. ఐశ్వర్య మొదటి ర్యాంకు వస్తే వినత మనస్ఫూర్తిగా ఐశ్వర్యను అభినందించేది‌. వినత మొదటి ర్యాంకు వస్తే ఐశ్వర్య ఓర్వలేకపోయేది. ఎంతో బాధపడేది. ఇంటివద్ద తల్లిదండ్రులతో తన బాధ చెప్పుకుని కుమిలిపోయేది. "మంచిదేగా! ఎప్పుడూ ఒకరే మొదటి ర్యాంకు వస్తే చదువుపై అంతగా ఆసక్తి ఉండదు. మార్కులు మరింత మెరుగుపడవు. మనకు ఇంకొకరు పోటీకి వస్తేనే మనం వారిని ఓడించడానికి రెట్టింపు పట్టుదలతో చదువుతాము. అప్పుడు మన మార్కులు మరింతగా పెరుగుతాయి. బాధ పడకుండా మరింత పట్టుదలతో చదువు." అని తల్లిదండ్రులు హితబోధ చేశారు. ఈ హితబోధ ఐశ్వర్యకు రుచించలేదు. కానీ మరింత పట్టుదలతో చదువుతుంది.

ఒకరోజు వినత ఐశ్వర్య వద్దకు వచ్చి, "మనం ఇద్దరం కలిసి చదువుకుందామా? అలా చదువుకుంటే ఒకరి సందేహాలు మరొకరు నివృత్తి చేసుకోవచ్చు. మనకు మార్కులు పెరుగుతాయి." అంది. "నీతో కలిసి చదువుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. నువ్వు నా శత్రువులాంటి దానివి." అన్నది. ఈ మాటలు వినతను ఎంతో బాధపెట్టాయి. వల వలా ఏడ్చింది. ఐశ్వర్య మాటలు విన్న అలివేలు తరగతి ఉపాధ్యాయునికి ఫిర్యాదు చేసింది. ఆ ఉపాధ్యాయుడు ఐశ్వర్యను పిలిచి, "చూడమ్మా ఐశ్వర్యా! మనకు పోటీలో మాత్రమే శత్రుత్వం ఉండాలి. కానీ బయట మంచి స్నేహబంధం ఉండాలి. కలిసి చదువుకుంటే ఇద్దరికీ ఉపయోగం." అని చెప్పారు. ఆ మాటకు ఐశ్వర్య తల ఊపింది. కానీ ఆ మాటలు అస్సలు నచ్చలేదు.

వార్షిక పరీక్షల్లో మరోసారి వినత మొదటి ర్యాంకు వచ్చింది. ఐశ్వర్య మరింత బాధతో ఇంటివద్ద బోరు బోరున ఏడ్చింది. తనకు ఈ పాఠశాల నచ్చలేదని అదే ఊళ్ళో ఉన్న ప్రైవేటు పాఠశాలలో చేర్పించమని తల్లిదండ్రులను బతిమాలింది. "నీకేమైనా పిచ్చా? ఇంత మంచి పాఠశాల చుట్టుపక్కల ఎక్కడా లేదు. ఒక్కరు నచ్చలేదని ఏకంగా మంచి పాఠశాలనే వదిలేస్తావా? ముఖం బాగాలేక అద్దం పగులగొట్టినట్లు ఉంది నీ వాలకం." అని మందలించింది తల్లి. అయినా ససేమిరా అంది ఐశ్వర్య. చేసేది లేక ఐశ్వర్యను 10వ తరగతిలో ప్రైవేటు పాఠశాలలో చేర్పించారు. టి‌.సి. కోసం పాత పాఠశాలకు వచ్చిన ఐశ్వర్య వినతను పిలిచి ఇలా అంది. "నువ్వే ఫస్ట్ వస్తున్నానని విర్రవీగకు. మరో పాఠశాలలో చేరుతున్నా. పట్టుదలతో చదివి 10వ తరగతి వార్షిక పరీక్షల్లో నిన్ను చిత్తుగా ఓడించకపోతే నా పేరు ఐశ్వర్యే కాదు." అని. ఎంతో బాధపడింది వినత.

కాలం గడిచింది. రామవరం పాఠశాలలోనే 10వ తరగతి చదువుతున్న సంధ్య అనే అమ్మాయి తన పుట్టినరోజు సందర్భంగా తన స్నేహితులు అందరినీ ఇంటికి ఆహ్వానించింది. తన పాత స్నేహితురాలు ఐశ్వర్యను కూడా పిలిచింది. అందరికీ పళ్ళ రసాలను ఇచ్చింది. ఇంట్లోనే తయారు చేసిన పల్లీపట్టి, పిండి వంటలను పార్టీగా ఇచ్చింది. భోజనం కూడా పెట్టించింది. స్నేహితులు రకరకాల కథల పుస్తకాలను సంధ్యకు బహుమతిగా ఇచ్చారు. నీకు ప్రీ ఫైనల్లో ఎన్ని మార్కులు వచ్చాయమ్మా వినతా!" అని సంధ్య వాళ్ళ అమ్మ అడిగింది. 600 కు 590 అండీ." అని వినత జవాబు ఇచ్చింది. నాకు 585 అన్నది శివాని. నాకు 587 అన్నది సిరి. నాకు 584 అన్నది శారద. నాకు 578 అన్నది శ్రుతి. "వినత మమ్మల్ని మెసలనిస్తేనా? అందరం కలిసి బృందంగా చదువుదామని చంపుకు తిన్నది. దాని ఫలితమే మాకు ఇన్ని మంచి మార్కులు. నాకైతే 582 వచ్చాయి." అన్నది సుమతి. "మరి నీకెన్ని వచ్చాయి ఐశ్వర్య?" అని అడిగింది సంధ్య వాళ్ళ అమ్మ. "596 వచ్చాయి పిన్నిగారూ!" అన్నది ఐశ్వర్య. వెంటనే వినత ఐశ్వర్యను కౌగలించుకొని "అనుకున్నది సాధించావు స్నేహితురాలా! చాలా సంతోషం. మరి పార్టీ ఎక్కడ?" అంది. ఐశ్వర్య ఆశ్చర్యపోయింది. సిగ్గుతో తల దించుకుంది. వినతను దూరంగా తీసుకు వెళ్ళి ఇలా అంది. "నన్ను క్షమించు వినతా! నాకు 476 మార్కులే వచ్చాయి. నాకు ఆ పాఠశాలలో పోటీ ఎవరూ లేకపోవడంతో ఎంతో నిర్లక్ష్యంగా చదివాను. నువ్వు ఎంతోమందిని పోటీగా తయారు చేసుకొని విజయం సాధించాను. నేను నిన్ను దూరం చేసుకొని చాలా నష్టపోయాను. ఆల్ ది బెస్ట్. ఫైనల్లో ఇదే విధంగా మార్కులు సాధించాలి." అని. "ఇప్పటి నుంచి ఫైనల్ పరీక్షలు అయిపోయే వరకు ఇంటివద్ద కలిసి చదువుదామా?" అంది వినత. అలాగే అంది ఐశ్వర్య.

మరిన్ని కథలు

Amma
అమ్మ
- డి.కె.చదువుల బాబు
Telu kuttina dongaalu
తేలుకుట్టిన దొంగలు
- మద్దూరి నరసింహమూర్తి
Filter coffee
ఫిల్టర్ కాఫీ
- ఇందు చంద్రన్
Kshama lo dharitri
క్షమలో ధరిత్రి.
- Aduri.HYmavathisrinivasarao,
Marmam
మర్మం
- రాము కోలా దెందుకూరు
Korthi
కొర్తి
- బివిడి ప్రసాద రావు