పెట్టుబడి దారు - శ్రీనివాస్ మంత్రిప్రగడ

Pettubadidaru

సాయంత్రం ఆరయ్యింది. ఊరికే కొద్దిగా నడిచి వద్దామని రోడ్డెక్కాడు వీర్రాజు...రెండు వీధులు దాటి మెయిన్ రోడ్ మీదకు వచ్చాడు... రోడ్డు మీద పెట్టిన పెద్ద పెద్ద విద్యుత్ దీపాల కాంతిలో మెరుస్తూ ...దుకాణాలకి అలంకారంగా పెట్టిన దీపాల కాంతిలో రంగులు నింపుతూ ఆ ప్రాంతమంతా ధగ ధగ లాడి పోతోంది...అవడానికి అదొక మాములు రోజైనా ఆ జిలుగు వెలుగుల వల్లనేమో ఎదో ప్రత్యేకమనిపిస్తోంది...

అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు హడావిడి గా ఉన్నారు...కూరలు కొనుక్కునే వాళ్ళు షాపుల దగ్గర గుమిగూడి లేత వస్తువులు ఏరుకుంటున్నారు, రకరకాల పాదరక్షల మీద మోజున్న వాళ్ళుచెప్పుల దుకాణాల్లో సైజులు చూసుకుంటూ మురిసి పోతున్నారు, బట్టలు కొనుక్కుందామని దుకాణాల్లో దూరిన వాళ్ళు రంగు రంగుల దీపాల కాంతిలో బట్టల అసలు రంగులు తెలియక తికమక పడుతున్నారు...సూపర్ మార్కెట్ లో బుట్టలు పట్టుకుని కళ్ళకు ఆకర్షణీయం గా కనిపిస్తున్న వస్తువులు తీసుకుంటూ తిరుగుతున్నారు కొందరు ...

ఇవేవి పట్టనట్టు వీర్రాజు తన ఆలోచనల్లో ములిగి పోయి ఒక పక్కగా నడుస్తూ వెళ్తున్నాడు...

ఆ రోడ్డు మీద కొంచం దూరం వెళ్తే పెద్ద ఖాళీ స్థలం...దానిలో ఒక పక్క ఎప్పుడో నిజాం కాలం నాటి ఒక పాత భవనం…ఈ మిరుమిట్ల ప్రపంచానికి పరాకు చెప్తున్నట్టుంది ...చుట్టూరా పేరుకుని ఉన్న నిశ్శబ్దం, ఆ భవన నిర్మాణ కళా...దాని మీద మీద రెపరెపలాడుతూ ఎగురుతూ వాలుతూ ఉండే పావురాలూ...ఒక వేరే ప్రపంచం లోకి తీసుకెళ్తాయి...

ఆ ప్రాంతం లో నడవడం, కొంచం సమయం గడపడం వీర్రాజుకెంతో ఇష్టం...

అక్కడకెళ్తే ఈ వెర్రి తలలు వేస్తున్న నాగరికతకు దూరంగా ఎంతో నియంత్రణ లో ఉన్న పాతకాలానికి వెళ్లినట్టుగా ఉంటుంది అతనికి…

ఆ రోజు కూడా అటే వెళ్ళాడు...ఒక మైలు పైగా నడిచినా తన పావురాళ్ళ భవనం రాలేదు...ఒక చిన్న మైదానం వచ్చింది..అది ఖాళీగా లేదు కాబట్టి మన పావురాళ్ళ భవనం కాదు అనుకున్నాడు వీర్రాజు...

దారి తప్పలేదు కదా అని చుట్టూ చూసాడు...కొంచం దూరంలో పాత నిజాం భవనం అలాగే ఉంది కాని దాని దగ్గర పావురాలు మాములుగా కంటే తక్కువ గా ఉన్నాయి...

అప్పుడు కనిపించింది ఆ చిన్న ఖాళీ స్థలం లో వెలిసిన ఒక పానీ పూరీ బండి ...దాని చుట్టూ గుమి గూడి ఉన్న మనుష్యులు...

ఒక చిన్న చెక్క బండిలో రకరకాల తినుబండారాలు పెట్టుకుని ఒక వ్యక్తి కూర్చున్నాడు ...ఒక పక్కగా ఒక పెద్ద ప్లాస్టిక్ గిన్నిలో నీళ్లు పెట్టుకుని అందరు తిని వెనక్కిస్తున్న ప్లేట్లు కడుగుతోంది ఒక ముసిలమ్మ, ఇద్దరు కుర్రాళ్ళు హడావిడి గా తిరుగుతూ ఆర్దర్లు తీసుకుంటున్నారు...నాలుగు సమోసా...రెండు మిర్చి అంటూ కేకలు వినిపిస్తున్నాయి ...

బండి లో ఒక పక్కన ఒక ఆడది నిలబడి చుట్టూ గుమిగూడిన జనం చేతుల్లో పట్టుకున్న విస్తరాకుల దొప్పల్లో పానీ పూరీలు మసాలా ముద్దా, ఆకుపచ్చని నీళ్లు నింపి ఒడుపుగా పెడుతోంది..

మొత్తం పానీ పూరీ మసాలా ముద్దా, నీళ్ళూ కిందపడకుండా ఒక చెయ్య నోటి కింద పెట్టి...తినేందుకు పెద్దగా తెరిచి నోట్లో కుక్కుకుంటున్నారు పానీ పూరీ అందిన వాళ్ళు

వేడి వేడి మిర్చి బజ్జిలు కొరికి నోరు చుర్రు మనడం తో విల విల్లాడుతూ...ఉఫ్ అంటూ ఊదుకుంటూ...ఆ వేడినీ రుచినీ ఆస్వాదిస్తున్నారు మరి కొందరు

సల సలా కాగుతున్న నూని, మసాలా, మిర్చి ఘాటు.. అంతా కలిపి విచిత్రమైన వాసన ఘుమ ఘుమ లాడుతోంది ...కొంచం దూరంగా ఉన్న చెత్త కుప్ప నుంచి కంపు ఆ ప్రాంతానికో విచిత్రమైన వెగటు కలిగిస్తోంది...

ఈ వాసనలన్నీ కలగా పులగమై ఒక విధమైన ఆకర్షణ కలిగిస్తున్నాయి ఆ ప్రాంతానికి

భోజనం చేసి అయిదారు గంటలయ్యిదేమో వీర్రాజు కి కొంచం ఆకలి గానే ఉంది...ఆ పరిస్థితుల్లో ఆ ఘుమ ఘుమలు అతని నోరు ఊరించేసాయి ...కడుపులో పేగులు కదిలాయి...ఆ రుచికరమైన వస్తువులు తినాలనే కోరిక బలంగా కలిగింది

మెల్లిగా వెళ్లి పానీ పూరీ దండులో దూరాడు...కంగారుగా చేతులు చాచి ఒక దొప్ప సంపాదించాడు ...

పానీ పూరీ అమ్మాయి ముందు వచ్చిన వాళ్ళకి ముందు వేస్తోంది...

తన చుట్టూరా అందరు పెద్దగా నోళ్లు తెరుచుకుని పానీ పూరీలు తింటుండడం చూస్తూ వీర్రాజు ఆగలేక పోతున్నాడు...

ఆలా పది మంది చాపిన దొప్పల్లో పానీ పూరీలు పెడుతూ...లెక్క మాత్రం తప్పకుండా అద్భుతమైన నైపుణ్యం చూపిస్తోంది ఆ అమ్మాయి...

తన అవకాశం వచ్చింది...గబా గబా తన వంతు పానీ పూరీలు తిని గల్లా పెట్టి దగ్గరకు వెళ్లి డబ్బులు ఇచ్చాడు వీర్రాజు...

ఈ మిర్చి బజ్జి కూడా చూడండి బాబు గారు అంటూ రెండు వేడి వేడి బజ్జిలు ఒక ఆకులో పెట్టి ఇచ్చాడు ఆ బండి యజమాని డబ్బులు తీసుకోకుండా ...

ఎంతో నయన మనోహరంగా ఉన్న ఆ బజ్జిల వల్ల కొద్దిగా కాలిన ఆకునుంచి మాంచి వాసన వస్తోంది...కాదనలేక పోయాడు వీర్రాజు

నోట్లో మధురమైన రుచీ..ముక్కు పుటలకు అంటుకు పోయిన అద్భుతమైన వాసనా వీర్రాజుని వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లాయి...

ఇక్కడకి రావడం రోజువారీ అలవాటుగా చేసుకోవచ్చు అనుకున్నాడు… కానీ స్వతహాగా కొంచెం ఏకాంతాన్ని ఇష్టపడే వీర్రాజుని అక్కడ రద్దీ కొంచం చిరాకు పెడుతోంది...

రెండో రోజున బండి యజమాని "బాబూ, రేపట్నుంచి కొంచం తొందరగా రండి..ఈ రద్దీ లేకుండా హాయిగా కావలసినవన్నీ తినొచ్చు" అన్నాడు అతని మోహంలో చిరాకు గమనించినట్టుగా

తరువాత రోజు ఐదున్నరకే ఆ దుకాణానికి వచ్చాడు వీర్రాజు ...అతని ఆలోచన మంచిదే అని తేలింది...షాప్ దగ్గర ఇంకా గుంపులు చేరలేదు...ఆబగా తినగలిగినన్ని పానీ పూరీలు నోట్లో కుక్కుకుని సంతోషించాడు...అద్భుతమైన రుచి...వీళ్ళ చేతుల్లో ఎదో మంత్రం ఉంది అనుకున్నాడు ...

ఆ షాప్ నడుపుతున్న వ్యక్తి ...కొంచం ఖాళీగా ఉండడంతో రాబోయే ప్రజా దాడి ని తట్టుకునేందుకు బలం కూడదీసుకున్నట్టుగా విశ్రాంతి గా కూర్చుని ఉన్నాడు

అతన్ని పలకరించాడు వీర్రాజు ...తాను చేస్తున్న ,చెయ్యగలిగే రకరకాల వంటల గురించి చెప్పాడు అయన...తన పేరు యాదయ్య అని తాను అక్కడ నుంచి రెండువందల మైళ్ళ దూరం లో ఉన్న ఒక పల్లెటూరినుంచి వచ్చానని చెప్పాడు

రెండేళ్ల క్రితం పంటలు పాడైపోవడం తో పొలం పాడు పెట్టి పట్నం బాట పట్టడం, తాను చేసినా రకరకాల పనులూ అన్నీ వివరించాడు...

“అయితే యాదయ్యా...ఈ తినుబండారాలు చెయ్యడం ఎప్పుడు నేర్చుకున్నావు" అనడిగాడు వీర్రాజు

"మా గురువు గారి దగ్గర నేర్చుకున్నాను సార్...అప్పుడు ఈ నగరానికి ఆవల వైపు...ఇక్కడినుంచి దాదాపు యాభై కిలోమీటర్లు ఉంటుంది అక్కడ ఉండే వాళ్ళం...ఆ రోజుల్లో పానీ పూరీ, సమోసా, బజ్జిలు లాంటివి చెయ్యడం, అమ్మడం లో కిటుకులు తెలుసుకోవడం జరిగింది" అంటూ అన్నీ వివరంగా చెప్పాడు…

ఆమాటలు చెపుతుంటే అతని లో ఏదో సంతోషం…తను సాధించిన ప్రగతి కి కొంచం గర్వం కూడా తొంగి చూస్తున్నాయి

ఆరోజు నుంచి రోజూ ఆ రోడ్డు మీద నడవడం యాదయ్య దుకాణానికి వెళ్లడం మాన కుండా చేస్తున్నాడు వీర్రాజు…రోజు రోజుకు అక్కడ ప్రజా సమూహాలు బెల్లం వాసన కనిపెట్టిన ఈగల్లా పెరగడం గమనిస్తూనే ఉన్నాడు

మెల్లిగా అది ఎంత ప్రాచుర్యం పొందిందంటే , వీర్రాజుని చూడడానికి వచ్చిన స్నేహితులు కూడా యాదయ్య దుకాణంలో పానీ పూరీ గురించి అడిగేవారు...

చుట్టుపక్కల ఉండే రకరకాల మనుషులు...గవెర్నమెంట్ ఉద్యోగస్తులు, సాఫ్ట్ వేర్ వాళ్ళు, ఆటలాడుకుని వెనక్కి వెళ్తున్న పిల్లలూ, రోజు కూలికి పనిచేసే భవన కార్మికులు, టీవీ లలో సినిమాలలో పనిచేసే కార్మికులు...సమస్త ప్రజానీకం యాదయ్యా పానీ పూరికి దాసులవ్వడం కనిపిస్తూనే ఉంది

కొంత మంది పెద్దింటి వాళ్ళు కార్లలో కూడా వచ్చి యాదయ్య పానీ పూరీ ఆస్వాదించడం మొదలయ్యింది...

యాదయ్య సాధిస్తున్న ప్రగతికి సంతోషించాడు వీర్రాజు ..

ఆఫీస్ పని మీద..విదేశాలకు వెళ్లి ఒక వారం తరువాత తిరిగొచ్చిన వీర్రాజుకి యాదయ్య దుకాణం కనిపించలేదు...అక్కడ మొత్తం భూమి చదును చేసి ఉంది...ఎదో కడతారు కాబోలు అనుకున్నాడు ...ఆ ప్రాంతమంతా గాలించాడు యాదయ్య కోసం ...కనిపించలేదు

అయ్యో పాపం...ఈ నాగరికత ఒక మంచి పని వాడి జీవితాన్ని కాలరాసేసింది అనుకున్నాడు... చిరాకుతో ఆ పక్కకు వెళ్లడం మానేసాడు...

రెండు వారాలు గడిచాయి..ఒకరోజు వీర్రాజుకి సూపర్ మార్కెట్ లో ఒక వ్యక్తి కనిపించి పలకరించాడు...మంచి జీన్స్ ప్యాంటు, ఎదో కంపెనీ లోగో ఉన్న సొగసైన టీ షీర్ట్ ,బూట్లు...చూడ్డానికి కార్పొరేట్ ఉద్యోగస్తుడిలా ఉన్నాడు...అకస్మాత్తుగా అర్దమైయింది ...అతను యాదయ్య

చాల సంతోషం వేసింది... “ఏం యాదయ్య..ఏమై పోయావు...బండెక్కడ పెడుతున్నావు” అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు

“ఇప్పుడు బండి పెట్టడం లేదు సారు...మీరు నాతొ రండి” అని పాత నిజాం భవనం వైపుకి తీసుకెళ్లాడు...

అక్కడ కొత్తగా వేసిన టవర్ లైట్ వెలుగులో ఆ ప్రాంతం ముందు కంటే ఎక్కువ దేదీప్యమానంగా ఉంది...ఆ నాగరికత వెలుగుల్లో ఆ పాత భవనం కాలానికి ప్రతినిధి లా దిగులు గా ఒంటరిగా కనిపించింది వీర్రాజుకి....అక్కడ కలకలం చేస్తూ తిరుగుతుండే పావురాలు కనబడటల్లేదు....

అయితే ఆ వెలుగుల్లో ఒక అద్భుతం కనిపించింది ...ఎక్కడైతే యాదయ్య బండి పెట్టి తన రుచులతో అందరిని అలరించేవాడో అక్కడ ఒక విశాలమైన షెడ్డు తయారైయింది...కళాకృతంగా కనిపిస్తున్న స్తంభాలూ. ఆకర్షణీయమైన పై రేకులూ, నిండా దీపాలతో మనోహరంగా ఉంది…

సొగసైన అద్దాల అరల్లో తినుబండారాలు నోట్లో నీళ్లు ఊరిస్తున్నాయి...

విశ్రాంతిగా అనిపించే కుర్చీలూ, ఆకర్షణీయమైన బల్లలూ వేశారు... అత్యంత అద్భుతం గానూ శోభాయమానంగానూ ఉంది ఆ ప్రాంతమంతా

“ఇదేమిటి యాదయ్య అనడిగాడు” సంభ్రమాశ్చర్యాలతో

“ఇప్పుడు ఇదే మన షాప్ సారూ...వై'స్ కిచెన్ అంటారు...చూడండి నా చొక్కామీద” అంటూ వై అని రాసున్న లోగో చూపించాడు...

షాపులో పనిచేసే వాళ్ళందరూ కూడా అలాంటి రంగుల బట్టలే వేసుకున్నారు...విదేశీ జంక్ ఫుడ్ దుకాణాలకు బాబు లా ఉంది ఇది అనుకున్నాడు...చాల ఉత్సాహంగా అనిపించింది...

యాదయ్యా నవ్వి "మన వార్డ్ కార్పొరేటర్ గారు ముడుపు పెడుతున్నారు ...ఈ భూమి కూడా ప్రభుత్వానిదేనట ...ఆయనే ఈ దుకాణం పెట్టుకోవడానికి అనుమతి ఇప్పించారు...దీనికి సంబందించిన ఏ సమస్య అయినా ఆయనే చూసుకుంటున్నారు...డబ్బు ఆయనది ..పలుకుబడి ఆయనది...వస్తువులన్నీ ఆయనవే...షాప్ కూడా అమ్మగారి పేరుమీదే ఉంటుంది...మనం కేవలం నడిపించడమే...ఇంతకు ముందు కన్నా మూడు రెట్లు ఎక్కువ డబ్బు ఇస్తున్నారు...అదే పని రాబడి ఎక్కువ...మహానుభావుడు" అన్నాడు చేతులు జోడించి

ఇప్పుడు రాజ్యం చేస్తున్న పెట్టుబడిదారీ వ్యస్థలో ఒక పేద వాడికి పెద్ద వాడయ్యే అవకాశం వచ్చినందుకు సంతోషం వేసింది వీర్రాజుకి...ఇంక యాదయ్య పిల్లలు పని చెయ్యక్కర లేదు ...చక్కగా స్కూల్ కి వెళ్తారు అనుకున్నాడు

అప్పడి నుంచి రెండు మూడు రోజులకొకసారి వై దగ్గరికి వెళ్లడం పరిపాటై పోయింది... ఎవరినన్నా స్నేహితులని కలవాలన్నా, భీమా ఏజెంట్లు, బ్యాంకు లోన్లు గురించి ఊదరగొట్టే సేల్స్ వాళ్ళూ...ఎవ్వరిని కలవాలన్నా యాదయ్య దుకాణమే వీర్రాజు చిరునామా

రెండు నెలల తరువాత ఒక రోజు వీర్రాజు వెళ్లే టప్పడికి యాదయ్య షాప్ తెరిచి లేదు...చాలామంది అక్కడకి వచ్చి తిరిగి పోతున్నారు....

ఏమయ్యిదో అర్ధం కాక వీర్రాజు చింతాక్రాంతుడయ్యాడు...దుకాణం చాల వృద్ధి లోకి వచ్చింది... ముందు కంటే చాల ఎక్కువగా ప్రజలు వస్తున్నారు...పార్టీలకీ, కొన్ని బార్ల కీ కూడా వస్తువులు ఇక్కడనుంచి సరఫరా జరుగుతోంది...

మామూలు పానీ పూరీ బండి కాస్తా డబ్బులు ప్రింట్ వేసే మింటు లా తయారైయింది ...మరిప్పుడు ఎందుకు ఆపేసారో... యాదయ్యకు ఏమి కాలేదు కదా ...వీర్రాజు మనసు మనసులో లేదు

మూడు రోజుల తరువాత ఆఫీసు కీ వెళ్తూ యాదయ్య దుకాణం వైపుకి చూసాడు వీర్రాజు...తెరిచి ఉంది ..అమ్మయ్య అనుకుని ఆఫీసు కి వెళ్ళాడు..మనసు ప్రశాంతం గా ఉంది

సాయంత్రం తొందరగా బయలు దేరాడు...ఇవాళ యాదయ్య పానీ పూరీ తినాల్సినదే అనుకున్నాడు

టాక్సీ దిగి వీర్రాజు గబా గబా దుకాణం లోకి వెళ్ళాడు...ఎప్పటిలాగే దుకాణం అంతా రద్దీగా ఉంది..కబుర్లు చెప్పుకుంటూ రక రకాల తినుబండారాలు తింటున్నారు జనం ...చుట్టూ చూసాడు...ఎక్కడ యాదయ్య కనిపించలేదు...అతని పానీ పూరీల అమ్మాయి కూడా కనిపించలేదు...కుర్రాళ్ళు మాత్రం ఉన్నారు ...

“ఏయ్ చోటూ” ..అని పిల్చాడు ఒకడ్ని ...

”నమస్తే సార్ బాగున్నారా” అంటూ వచ్చాడు చోటూ

“యాదయ్య ఏడి చోటూ?” అనడిగాడు వీర్రాజు

“మీకు తెలీదా...ఇప్పుడు యాదయ్యా లేడు...ఆయన్ని తీసేసారు మేడం గారు...ఇప్పుడు మాకు కొత్త సారొచ్చారు..ఈయన పేరు యాదగిరి...రెండు రోజుల క్రితమే యాదయ్య ఊరికి వెళ్లి పోయాడు" అన్నాడు చోటూ

“అదేమిటి...ఇది యాదయ్య దుకాణం కదా? అనడిగాడు వీర్రాజు ఆశ్చర్యంగా

"అది ముందు సార్ ...యాదయ్యా మీక్కూడా చెప్పాడు కదా...యాదయ్య బండి బాగా నడుస్తున్నప్పుడు అతనికి మదుపు అవసరమైంది...వచ్చే వాళ్లందరికీ తినుబండారాలు ఇవ్వలేక పోతున్నామని ఇబ్బంది పడే వాడు...అప్పుడు కార్పొరేటర్ గారు సాయం చేస్తానన్నారు...అయన వ్యాపారం తన పేరు మీద ఉంటుందని యాదయ్య ముందులాగే దాన్ని నడపొచ్చని అయన ప్రతిపాదించారు" అన్నాడు చోటూ

"అంటే ఇప్పుడు వ్యాపారం యాదయ్యది కాదన్న మాట...అవును ఇంతకు ముందు కూడా చెప్పాడు..కాని ఎందుకు ఒప్పుకున్నాడు...కొంచం తన భాగం ఉండేలా చేసుకోవాల్సింది" అన్నాడు వీర్రాజు విచారంగా

"ముందు యాదయ్య కూడా ఒప్పుకోలేదు సార్...ఈ స్థలం ప్రభుత్వానిది ట కదా ... కార్పొరేటర్ గారికి చాలా పలుకుబడి ఉంటుంది కదా... ప్రభుత్వం నుంఛి ఈ స్థలం ఖాళీ చెయ్య మని కాయితం ఇప్పించాడు...యాదయ్య లబో దిబో మని అయన దగ్గరకు పరుగెత్తి అయన ప్రతిపాదన అంగీకరించాడు" అన్నాడు చోటూ

"మొత్తం కార్పొరేటర్ గారిదేనా ఇంక" అనడిగాడు వీర్రాజు

" అవును సార్...ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని..తన ఖర్చుతో ఈ దుకాణం తెరిచేటట్టు....దీన్ని యాదయ్య నడిపేటట్టు ఒప్పందం చేసుకున్నారు ...యాదయ్య బండి నడిపే టప్పటి కంటే ఎక్కువ డబ్బులు ఇచ్చే ఏర్పాటు చేసారు...

కానీ రోజులు గడుస్తున్న గొద్దీ యాదయ్యకు ఆశ పెరిగిపోయింది సారూ...ఇప్పుడు రోజూ చాలా డబ్బులు వస్తున్నాయి కదా...నాక్కూడా రోజువారీ ఇచ్చే డబ్బు పెంచండి అని గౌడ్ గారి తో గొడవపెట్టుకున్నాడు…గౌడ్ గారి మంచితనం అర్ధం చేసుకోకుండా ఎందుకు యాదయ్య ఆశకు పోయాడో తెలియదు సార్

కార్పొరేటర్ గారు అతన్ని తీసేసి కొత్తాయనని పెట్టాడు ఇప్పుడు” అన్నాడు చోటూ

మరో పెట్టు బడిదారీ తిమింగలం స్వయంగా పెరిగిన ప్రతిభను మింగేసింది అనుకున్నాడు వీర్రాజు విచారంగా

యాదయ్యకు అవసరమైన పెట్టుబడి ప్రభుత్వం నుంచి వచ్చుంటే బాగుండేది...ఒక పెట్టుబడి దారు నుంచి రావడం వల్ల దాంట్లోని సంక్షేమం పూర్తిగా లాభాపేక్ష గా మారిపోయింది...అనుకున్నాడు

ఇప్పుడు వై'స్ కిచెన్ లో పానీ పూరీ బావుండదు...కానీ దానికి విస్తృతమైన ప్రచారం జరగడంతో దూరాల నుంచి కూడా వచ్చి తిని వెళ్తుంటారు...అక్కడకి వచ్చి పానీ పూరీ తినడం ఒక ముఖ్యమైన ఆటవిడుపు గా భావించే వాళ్ళు కూడా ఉన్నారు

మరిన్ని కథలు

Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు